తేది:23-02-2025 ఆదివారం.
సమయం:ఉదయం 6:00 గంటలు,రంగంపేట.
ఉదయం ఆరవుతున్నా బయట ఇంకా మసక చీకటిగానే ఉంది.చలి కూడా ఉంది. బద్ధకపు సూర్యుడు త్వరగా లేస్తే కొంత చలైనా తగ్గును అనుకుంటూనే కార్లో కూర్చున్నాను. ప్రయాణం మొదలైంది.డ్రైవింగ్ మా పెద్ద సార్ (ఉపేందర్ రెడ్డిగారు) చేస్తున్నారు. పక్కనే వారి తమ్ముడు అమరేందర్ రెడ్డి గారు కూర్చున్నారు. వెనుక సీట్ లో నేను కూర్చున్నాను. కారు బయలుదేరింది చీకటిని చీల్చుకుంటూ చలిని చీల్చుకుంటూ……
సార్ 50 లో ఉన్నాడు, కార్ 70 లో ఉంది.క్షణాల్లోనే సంగాయిపేట దాటేశాం కొద్ది నిమిషాల్లోనే కారు చిన్న ఘనపూర్ దాటి పోతంశెట్టిపల్లి చేరి మెదక్ మెయిన్ రోడ్డెక్కింది. అక్కడికి వెళ్ళిందంటే కారుకు కుదుపు ఉండదు. జర్నీ సాఫీగా సాగుతుంది.ఉషోదయపు కిరణాలు మమ్మల్ని సుతిమెత్తమెత్తగా తాకుతున్నాయి. రోడ్డంతా ఖాళీగా ఉండడంతో కారు వేగం కాస్త పెరిగింది. చూస్తుండగానే మెదక్,రామాయంపేట్,దాటింది. సిద్దిపేట కాస్త దూరంగా ఉందనగా డ్రైవింగ్ అమరేందర్ సార్ తీసుకున్నాడు. కొద్ది సేపట్లోనే సిద్దిపేటకు చేరుకున్నాం.అక్కడే అంబేద్కర్ సర్కిల్ లో గరం గరం చాయ్ తాగి బైపాస్ నుంచి వరంగల్ బయలుదేరాం.ఈరోజు మా హెడ్మాస్టర్ సార్ వాళ్ళ బంధువుల పెళ్లిళ్లు వరంగల్, జనగాం, ఆలేరులలో ఉన్నాయి. కూడా రమ్మంటే వెళ్ళాను.
వరంగల్ అనగానే నాకు మొదటగా గుర్తొచ్చేది వేయిస్తంభాల గుడి. వీలుంటే చూద్దాం అనుకున్నాము కానీ వీలు లేకపోయింది. 10 గంటల వరకు వరంగల్ చేరుకున్నాము. సార్ వాళ్ళు పెళ్ళిలో గంట సేపు ఉంటామని అనడంతో నేను నా మిత్రుడి ఇంటికి వెళ్లాను. 11:30 ప్రాంతంలో అక్కడినుండి జనగాం వెళ్లాము.పెళ్లి కన్వెన్షన్ లో. ఇది జనగాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.కన్వన్షన్ చాలా పెద్దగా ఉంది. పెళ్లికి దాదాపు 3,000 మంది హాజరయ్యారు.అందరూ ఖద్దరుదారులే.MP, జిల్లా జడ్జి లాంటి ప్రముఖులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొంచెం వాకబు చేస్తే తేలింది ఏమంటే పెళ్లి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళని. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనశాలకు వెళ్ళాము. విపరీతమైన రద్దీ ఉంది అయినప్పటికీ ఏదోలా చోటు దొరికించుకొని భోజనం చేశాము. పన్నీర్ బాగుంది . అదేమిటబ్బా ! నాన్ వెజ్ సెక్షన్ కంటే వెజ్ సెక్షన్ లోనే జనాలు ఎక్కువగా ఉన్నారేమిటి? అనుకున్నాను .కొంచెం నాన్ వెజ్ వైపు చూస్తే అర్థమైంది అక్కడ చిన్న పాటి యుద్ధమే జరుగుతోందని. దానికి భయపడి జనం ఇటు వైపు వచ్చారు. భోజనం ముగించుకొని కాసేపు కూర్చొని అక్కడినుండి ఆలేరు బయలుదేరాం .ఇది సార్ విలేజ్(మర్పెడ) వాళ్ళ పెళ్లి.ఇక్కడికొచ్చేసరికి పెళ్లి అయిపోయింది. చాలా వరకు జనాలు కూడా ఖాళీ చేశారు. మేము వెళ్లి వధూవరులను కలిసాము. పెళ్లి వాళ్ళు మమ్మల్ని భోజనశాలకు తీసుకెళ్ళారు. జనగాంలోనే గట్టిగా తినడం వల్ల ఇక్కడ ఫార్మాలిటీగా ఐస్ క్రీమ్ తిని అక్కడినుండి 4:00 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాము.
అబ్బురపరిచే కొలనుపాక జైనాలయం:
పెళ్లి మండపం నుండి సరాసరి ఆలేరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక లోని జైనాలయానికి వెళ్ళాం. అది 2000 సంవత్సరాల నాటిది. తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద జైనాలయం ఇది. ఆలయాన్ని చూడగానే నాకు క్రీ.పూ 6 వ శతాబ్దం నాటి చరిత్ర గుర్తొచ్చింది .అప్పటి సాంఘిక ,ఆర్థిక, మత రాజకీయ పరిస్థితులు గుర్తొచ్చాయి.
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అప్పటికి వైదిక మతమే విస్తృతంగా వ్యాప్తిలో ఉంది.మోక్షం పొందాలంటే యజ్ఞ యాగాలు, కర్మకాండలు చేయాలి .అవి ఖర్చుతో కూడుకున్నవి. మంత్రాలు కూడా సంస్కృత భాషలో ఉండేవి అందువల్ల అవి సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కావు. ఇవే జైన మతం ఆవిర్భవించడానికి కారణమని చెప్పాలి.
జైనమతాన్ని స్థాపించింది వర్దమాన మహావీరుడు. కానీ దానికంటే ముందే 23 మంది తీర్థంకర్లు ఉన్నారని జైనమత గ్రంథాలు పేర్కొంటున్నాయి. వారిలో మొదటి వారు ఋషభనాథుడు తర్వాత అజిత నాథుడు, సంభవనాథుడు, అభినందన, సుమతి నాథ, పద్మ ప్రభువు, సుపార్శ్వనాథ, చంద్ర ప్రభు, పుష్పదంత, శీతలనాథ, వాసు పూజ్య, విమలనాథ,అనంతనాథ, ధర్మనాథ, శాంతి నాథ, కుంతనాథ ,అరనాథ ,మల్లనాథ, మునిసువీరనాథ, నేమినాథ, అరిష్టనేమి, పార్శ్వనాథ లాంటి 23 మంది తీర్థంకరుల తర్వాత వచ్చిన వాడే 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. ఋషభనాథుడు మొదటి తీర్థంకరుడు అయినప్పటికీ జైనమతంలో ఈయన కొన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రచారం చేసి విస్తృత పరిచాడు కాబట్టి వర్ధమాన మహావీరుడిని జైన మత స్థాపకుడు అన్నారు.

వర్ధమాన మహావీరుడు తన 30 ఏళ్ల వయసులో గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించాడు. 13 సంవత్సరాల కఠోర దీక్ష చేసిన అనంతరం అతనికి జ్ఞానోదయమయింది. మరో 30 సంవత్సరాలు మగధ, అంగ,కోసల ప్రాంతాల్లో జైనమత తత్వాన్ని ప్రచారం చేస్తూ 72 సంవత్సరాల వయసులో పావాపురి వద్ద తనువు చాలించాడు.
జైనమతం ప్రతిదాంట్లో ఆత్మ ఉంటుందంటుంది, నిరాడంబరతకు ప్రాముఖ్యతనిస్తుంది.మానవ జీవన సాఫల్యానికి వర్ధమాన మహావీరుడు మూడు ముఖ్యాంశాలను సూచించాడు అవి1. సరైన విశ్వాసం 2.సరైన జ్ఞానం 3.సరైన నడవడి.ఇతను జైన మతంలో చెప్పిన పంచ సూత్రాలకు అంటే పార్శ్వనాథుడు చెప్పిన సత్యం,అహింస,అపరిగ్రహం అస్తేయం లకు బ్రహ్మచర్యం జోడించి వీటిని పాటించాలని చెప్పాడు.వీటిని “పంచ కళ్యాణాలు” అంటారు. ఏ విధంగా సులభ మార్గంలో మోక్షం పొందాలో ప్రజల భాషలో చెప్పాడు మహావీరుడు .దాంతో జైన మతం భారతదేశమంతా వ్యాపించి, కొంతకాలం ఆదరణకు కూడా నోచుకుంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో చిన్న స్పర్థల వల్ల జైన మతం శ్వేతాంబర, దిగంబర శాఖలుగా విడిపోయింది. దక్షిణ భారతదేశంలో స్థూల భద్రుని నాయకత్వాన శ్వేతంబర శాఖ, ఉత్తర భారత దేశంలో భద్రబాహుని నాయకత్వంలో దిగంబర శాఖ ప్రచారం నిర్వహించుకున్నాయి.ఇందులో ఉండే కఠిన నియమాల వల్ల కాలక్రమమేనా జైన మతం క్షీణించి బౌద్ధమతం ఆవిర్భవించింది.ఏ శాఖ వారైనా తీర్థంకరులను గౌరవించారు.
జైనమత వ్యాప్తిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించారు. ఇదిగో ఈ కొలనుపాక జైనాలయం కూడా అందులో భాగంగానే నిర్మించబడింది. ఆలయాన్ని చూడగానే ఉత్సాహమేసింది. ఫోన్లో ఆలయాన్ని బందిద్దామనుకున్నాను కానీలోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు. ఫోన్లన్నీ కారులో పెట్టి లోనికి ప్రవేశించాము.గుడి బయటి భాగానికి పెయింట్ వేస్తున్నారు.గుడి చాలా ప్రశాంతంగా ఉంది. గుడి లోపల ఇంకా ప్రశాంతంగా ఉంది.గుడి ద్వారం కోటను తలపిస్తుంది. ద్వారంవైపు అటు ఇటుగా ఉన్న నల్ల రాతితో చెక్కిన ఏనుగులు మనకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటాయి.గుడి మొత్తం చలువరాయితో నిర్మించబడింది.గుడి లోపలి భాగం మాటల్లో వర్ణింపనలవిగాకుండా వుంది. అద్భుతమైన శిల్పకళాకౌశలంతో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నాట్యకత్తెలు,తప్పెట వాయిస్తున్న స్త్రీ శిల్పాలు,పువ్వులు, తీగలు ఎంత అద్భుతంగా చెక్కబడ్డాయో! అణువణువునా పొదిగియున్న ఇక్కడి శిల్ప సౌందర్యం ఎవరిరైనా కట్టిపడేస్తుంది. పాలరాతిపై అంత అద్భుతమైన శిల్ప సంపదను ఆవిష్కరించినందుకు ఆ శిల్పకారులకు నమస్కరించాలనిపించింది. ఎంత ఓపిక,ఎంత ఏకాగ్రత ఉంటే అలా చెక్కగలరు. అబ్బబ్బా …. చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. బహుశా ఇలాంటి శిల్ప సంపదను మనం కేవలం మన దేశంలోని ఆలయాల్లోనే చూడగలమనిపించింది. కొంచెం టైం వెచ్చించాలి గాని మనదేశాన్ని పూర్తిగా సందర్శిస్తే ప్రపంచంలోని సగభాగాన్ని చూసినట్టే. గుడి లోపలి భాగంలో చుట్టూ జైనతీర్థంకరులు ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ నల్లరాయితో మలచబడ్డాయి. ఆలయంలో ప్రధాన ఆకర్షణ వర్ధమాన మహావీరుడు, ఋషభనాథుడు,నేమినాథుడి విగ్రహాలే.
ఇక్కడి మూలవిరాట్టు ఋషభనాథుడు. మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం, అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడవుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది.విజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు.
ఋషభనాథుని విగ్రహం38.5 అంగుళాల వెడల్పు 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహం ఆహార్యము బహుగొప్పగా మలచబడింది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు,అరచేతి మీద శంఖం, చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం. వాటి కింద హిందీలో వారి పేర్లు కూడా ఉన్నాయి.
ఋషభనాథునికి ఎడమవైపు నేమి నాథుని విగ్రహముంది.ఇది కూడా పద్మాసనంలోనే,గొప్ప అలంకారభూయిష్టంగా ఉంది. ఆ ముగ్గురిని తనివితీరా చూసి,నమస్కరించి ముందుకు కదిలాము. ఆలయపు దక్షిణపు గోడపై జైనమహా సభలు జరిగిన వివరాలు పొదగబడిన చిత్రము ఒకటి కనిపించింది. దాన్ని చూసి ముందుకు కదిలాము. గుడిలో మమ్మల్ని ఆశ్చర్యపరచినవాటిలో గుడి డోం ఒకటి.దాన్ని చూస్తే నాకు OU ఆర్ట్స్ కాలేజీడోం గుర్తుకొచ్చింది. దానికంటే ఇది ఇంకా బాగుంది. డోంచుట్టూ అద్భుమైన శిల్ప సంపద మమ్మల్ని కన్నార్పకుండా చేసింది. డోంని ఎలా నిర్మించారని చాలాసేపు ఆలోచించాను……నిజంగా అద్భుతమది.
అలా గుడి లోపలిభాగంలో ఉన్న జైననతీర్థంకరుల విగ్రహాలను మొత్తం చూశాము.గుడి మధ్య భాగంలో కొంతమంది భక్తులు ఉన్నారు.వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళ ముఖంలో లవలేశమైనా ఆతృత గానీ కోపం గానీ లేవు.ఏ భావం లేకుండ ఉండడం చాలా కష్టం,కానీ అసాధ్యం కాదు. అక్కడంతా మౌనం తాండవించింది.మేము కూడా మౌనంగా ప్రధానాలయం దాటాము.
ప్రధానాలయానికి కుడివైపున చిన్న ఆలయం ఉంది.అదికూడా చాలా బాగుంది.ప్రధానాలయానికి ఉత్తర భాగంలో ఉన్న మరో ఆలయానికి వెళ్ళాము. ఆలయం చిన్నగానే ఉంది లోపల పాలరాతితో చెక్కబడిన శాంతి నాథుని(తీర్థంరుల్లో ఒకరు) విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది ధ్యానముద్రలో శాంతి నాథుడు అద్భుతంగా దర్శనమిచ్చాడు.
మళ్లీ ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో రావాలనుకుని మెల్లిగా బయటకు వచ్చాము. ఫోన్ గనక అనుమతిస్తే నేను ఎన్నో ఫోటోలు వీడియోలు తీసేవాడిని. అయినా అది చూస్తే తప్ప లేని చెప్పలేని అనుభూతి. గుడి బయట కొన్ని ఫొటోలు దిగి గుడికి వీడ్కోలు చెప్పి మెల్లిగా చేర్యాల కు బయలుదేరాం అక్కడ మా బుడ్డోడితో ఒక 15 నిమిషాలు గడిపి సిద్దిపేటకు బయలుదేరాం.

అలా అలా…రంగనాయక సాగర్ జలాశయపు ఒడిలో…
సిద్దిపేటలో సందర్శించదగ్గ వాటిలో రంగనాయక సాగర్ జలాశయం ఒకటి.ఇది సిద్దిపేటకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంది. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 2300 ఎకరాల్లోదీన్ని నిర్మించారు. దీనికి కెపాసిటీ మూడు టీఎంసీలు. దీనిని 2020లో హరీష్ రావు ,కె.టి.ఆర్ గార్లు ప్రారంభించారు. ఇది సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 114,000 ఎకరాలకు నీరందిస్తుంది. ఎండాకాలంలో కూడా సిద్దిపేట పరిసర ప్రాంతంలో చెరువులు నిండుగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ జలాశయమే.
రంగనాయక సాగర్ జలాశయం పై వరకు కార్లో వెళ్లొచ్చు. దాని చుట్టూతా హారమున్నట్టు తారు రోడ్డు ఉంది. జలాశయం,చుట్టుప్రాంతం చాలా శుభ్రంగా ఉంది. నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. దీవి మధ్యలో దేశం ఉన్నట్టు రంగనాయక సాగర్ మధ్యలో గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి వరకు మనం కారులో వెళ్లొచ్చు .సందర్శకులతో ఎప్పుడు కూడా ఇది కళకళలాడుతుంది. మేము గెస్ట్ హౌస్ కు దగ్గరదాకా వెళ్లి చుట్టూ చూసాం. ఎటు చూసినా జలమే. కళ్ళకు ఎంతో హాయి కలిగించేదృశ్యమది. అక్కడ వివిధ భంగిమల్లో కొన్ని ఫోటోలు దిగాము. తర్వాత ఇంకొంత దూరం వెళ్లి ఎక్కడ నుండి నీళ్లు ఇందులోకి వస్తాయో ఆ పంపుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ సాగర్ లోపలికి వెళ్లడానికి కట్టబడిన బాల్కనీ కట్టడం ఉంది. అక్కడి నుంచి చూస్తే రంగనాయక సాగర్ మహా అద్భుతంగా కనిపించింది. అక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము. అప్పుడే సూర్యుడు మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుతున్నాడు.మేము తిరుగు ప్రయాణమయ్యాం.ప్రస్తుతం బోటింగ్ అవకాశం లేదుగానీ ఉంటే వెళ్లే వాళ్ళమేమో……
విజయ్ సార్ ఇంట్లో వేడివేడి పూరీ……
రంగనాయక సాగర్ నుండి తిరుగు ప్రయాణమై సరాసరి సిద్దిపేటలోని విజయ సార్ ఇంటికి వెళ్ళాం. సమయం సాయంత్రం 7:00 అయింది. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యాం. మేము వస్తున్నామన్న వార్త ముందే తెలియడంతో కావచ్చు మాకోసం సార్ స్పెషల్ గా పూరి చేయించారు.తిని చాలాసేపే అయింది కాబట్టి మాకు కూడా ఆకలైంది. పూరీలను చూడగానే ఇంకా ఆకలె క్కువైందనొచ్చు. లేత గోధుమ రంగులో పొంగిన పూరీలు, వాటి పక్కన కాబూలీ శనగలతో చేసిన కర్రీ….. కాంబినేషన్ అదిరింది. విజయ్ సర్ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆసాతం మేమాస్వాదిస్తూ తిన్నాం. అనంతరం అందమైన వైన్ గ్లాసులలో ఆపిల్ జ్యూస్ తాగడం చాలా బాగా అనిపించింది.సోంపు వేసుకొని కాసేపు సార్ వాళ్ళ స్కూల్ విషయాలు కాసేపు మా స్కూల్ విషయాలు ఇంకాసేపు విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడుకొని ఎనిమిది గంటలకి విజయ్ సర్ నుండి సెలవు తీసుకొని రంగంపేటకు బయలుదేరాం.
కారు సాధారణ వేగంతోనే ముందుకు వెళుతోంది. ఎండాకాలం ఆరంభమైంది కదా…. కారు అద్దాలు తీస్తుంటే చల్లటి గాలి మాకు సుతిమిత్తగా తగులుతోంది. వెనకసీట్లో కూర్చున్న నేను ఎప్పటికప్పుడు క్రికెట్ స్కోర్ చూస్తున్నాను. ఈరోజు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్థాన్ చేసింది. రెండో ఇన్నింగ్స్ మొదలైంది. స్కోర్ పెద్ద గా లేకపోవడంతో పెద్ద ఒత్తిడి కూడా ఏం లేదు. అందునా చేజింగ్ కింగ్ కోహ్లీ ఉన్నాడు కదా….భయమేల అనుకున్నాను. మ్యాచ్ మొదలైంది. ఇండియా బాగానే బ్యాటింగ్ చేస్తుంది అమరేందర్ సార్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అదేమిటో చల్లగాలి తగిలినాకొద్ది నాకు నిద్ర ముంచుకొస్తుంది ఓవైపు మ్యాచ్ ,మరో వైపు నిద్ర…ఎలా…. అనుకుంటుండగానే గంటలో మెదక్ చేరుకున్నాము.అక్కడ ఆగి ఛాయ్ తాగడంతో నిద్ర కాస్త పారిపోయింది. ఇక మెదక్ నుండి బయలుదేరి సరాసరి రంగంపేటకు వచ్చేసరికి సమయం 9:45 అయ్యింది.
అక్కడక్కడా ఆగుతూ, ఆతిథ్యం స్వీకరిస్తూ వచ్చినందుకేమో! 450 కిలోమీటర్లు ప్రయాణించినా మాకు అలసట కలగలేదు. చూస్తుండగానే ఇండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఇంకేం…..ఖేల్ ఖతం దుకాణం బంద్.
వీలైనప్పుడు మీరు కూడా కొలనుపాక జైనాలయాన్ని, రంగనాయక సాగారాన్ని తప్పకుండా సందర్శించండి.