అదొక అడవి . ఆ అడవికి రాజులేడు. అప్పుడు మరొక అడవి నుండి ఒక చిరుత పులి అక్కడికి వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ చిరుతపులి బాధలు భరించలేక అవి కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి.
కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను. ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్ కాంజి” అని అంది. వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి. మీరు దేనిని కోరుకుంటారో చెప్పండి. ఆ జంతువు ఇక్కడ మీ ముందు వెంటనే ప్రత్యక్షమవుతుంది. చూడండి . మీకు ఇంకా ఏ జంతువు కావాలి “అని అడిగింది . అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది. వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ” ” అని అంది. వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్ న్నదువిడఅ ” అని అంది .వెంటనే అక్కడ అడవిదున్న ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే ప్రత్యక్షమైనాయి. చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
అప్పుడు కుందేలు “చిరుతపులి రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది. ఇది పనిచేయాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఒక నెల రోజుల వరకు మీరు ఏ జంతువును చంపకూడదు. అలా చేస్తేనే మీకు ఈ మంత్రం పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి సరేనంది .
ఇలా నెల రోజులు గడిచాయి. తర్వాత ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది. కానీ ఒక్క జంతువు దాని ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది. వెంటనే అది కోపంతో కుందేలు కోసం ఎంత వెదికినా అది కనబడలేదు. అదే కాదు. ఆ అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి . వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది. ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది. చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి అక్కడ ఒక్క జంతువు కూడా లేకపోవడంతో చేసేది లేక అది అక్కడనుండి మరొక కొత్త అడవిని వెతుక్కుంటూ బయలుదేరింది .
ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
ఆ తర్వాత అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి రాజుగా ఉండమని కోరాయి . అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది. కుందేలు తెలివి వల్ల చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి సాయాన్ని కోరాలి.
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,
సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ఇంటి నెంబర్ 11-52, గోదావరి రోడ్ , ధర్మపురి - 505 425 ,జగిత్యాల జిల్లా, తెలంగాణ . మొబైల్: 9908554535 9392248587. సంగనభట్ల చిన్న రామకిష్టయ్య గారు 1959 వ సంవత్సరంలో తెలంగాణ లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో జన్మించారు. వీరు ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి 2017 లో పదవీ విరమణను పొందారు. వీరు గత 20 సంవత్సరాలుగా బాల సాహిత్యాన్ని వ్రాస్తున్నారు. వీరి రచనలు అనేక పత్రికలలో ప్రచురితమైనాయి. వీరు ఇంతవరకు 450 పైన పిల్లల కథలు వ్రాశారు. వాటిలో చాలావరకు కథలు ప్రచురింప బడ్డాయి. ఇంకా ప్రచురింపబడుతూనే ఉన్నాయి. వీరికి బాలసాహిత్యంలో ఇప్పటివరకు రెండు అవార్డులు కూడా వచ్చాయి. అవి రంగినేని ట్రస్ట్ సిరిసిల్ల వారి ప్రతిభా పురస్కారం- 2019 మరియు శ్రీ వాణి సాహిత్య పరిషత్ ,సిద్దిపేట వారి పెందోట బాల సాహిత్య పురస్కారం - 2019. వీరు ఇంతవరకు 2 శతకాలు, 3 బాలల కథా పుస్తకాలను ప్రచురించారు. ఇంకా రెండు పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి.
అడవిలో రెండు కోతి పిల్లలు బయటకు వచ్చి అడవంతా తిరుగసాగాయి. అవి దారితప్పి తమ నివాసం ఎక్కడ ఉందో తెలియక కంగారు పడ్డాయి. ఇంతలో వాటికి ఒక పెద్దపులి ఎదురయింది .వెంటనే అవి భయపడి అక్కడే దగ్గర లోనే ఉన్న ఒక చెట్టును ఎక్కాయి. కానీ ఆ చెట్టు పైన ఇదివరకే ఒక పెద్ద చిరుత పులి ఉంది. దానిని చూసి అవి గజగజ వణకసాగాయి. తమకు ఎలాగూ చావు తప్పదని అవి నిర్ణయించుకున్నాయి .వాటి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. “క్రిందికి దిగితే పెద్దపులి పొట్టన పెట్టుకుంటుంది. ఇక్కడ ఉంటే చిరుత పులి చేతిలో చావు తప్పదు ” అని అవి అనుకున్నాయి . చివరకు అవి ఆ చెట్టు పైననే ఉండాలని నిర్ణయించుకున్నాయి.
ఇంతలో భయపడుతున్న ఆ కోతి పిల్లలను చూసి చిరుతపులి” పిల్లల్లారా!భయపడకండి .నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఉండగా మిమ్మల్ని ఏ జంతువు చంపలేదు. ఆ పులికి మీరు భయపడవద్దు” అని వాటికి ధైర్యం చెప్పింది. నేలపైన ఉన్న ఆ పెద్దపులి చెట్టు పైన ఉన్న చిరుతపులిని చూసింది. అది కొద్దిసేపు ఆ కోతిపిల్లలు క్రిందికి దిగుతాయేమోనని వాటి కొరకు ఎదురుచూసింది. చివరకు అవి దిగకపోవడంతో ఆ పెద్దపులి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయింది.
చెట్టు పైన ఉన్న చిరుత పులి మొదట ఆకలిచే ఈ కోతి పిల్లలకు హాని చేయాలని అనుకొంది. కానీ ఆ పులి వెళ్ళిన తర్వాత ఆ కోతి పిల్లలు ఆ చిరుతను తమను కాపాడిన దేవతగా, అమ్మగా స్తుతించాయి. భయంతో వణుకుతున్న ఆ కోతి పిల్లలను చూడగానే దానికి తన పిల్లలు గుర్తుకు వచ్చి దానిలోని మాతృ హృదయం పెల్లుబికింది. వాటి మాటలు విన్న ఆ చిరుత పులికి ఆ పిల్లల పై జాలి కలిగి తన మనసును మార్చుకుంది .
ఆ కోతి పిల్లలు తర్వాత చెట్టును దిగి చిరుత తమకు తోడు రాగా అవి తమ నివాసానికి ఎట్టకేలకు చేరాయి .అవి తమ తల్లిని కలుసుకొని ఈ చిరుత పులి తమకు ప్రాణదానం చేసిందని తమను పెద్దపులి నుండి కూడా కాపాడిందని చెప్పాయి. ఆ తల్లి కోతి ఎంతో సంతోషించి చిరుతపులికి తన ధన్యవాదాలను తెలిపింది.
చిరుతపులి వెళ్లి పోయిన తర్వాత అది ఈ విషయాన్ని తోటి జంతువులన్నింటికీ చెప్పింది .మరొకసారి తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లవద్దని అది తన పిల్లలను హెచ్చరించింది. అవి అలాగేనన్నాయి.ఈ వార్త సింహానికి చేరింది. అది చిరుతపులిని పిలిపించి దానిని ఘనంగా సత్కరించింది.
తాను చేసిన మంచి పనికి ఆ చిరుత పులి ఎంతగానో సంతోషించి ఇక ముందు పిల్లల పట్ల క్రూర స్వభావాన్ని విడనాడి ఇదే మంచితనాన్ని కొనసాగించాలని అనుకుంది. ఆనాటి నుండి అది పిల్లల జోలికి వెళ్లవద్దని నక్క ,తోడేలు వంటి జంతువులను కూడా హెచ్చరించింది.
1. దొంగ – బాలుడు
రహదారిపై ఒక దొంగ ఒక మహిళ చేతిలోని పర్సును దొంగిలించి పరిగెడుతున్నాడు. అది గమనించిన ఒక బాలుడు ఆ దొంగ వెంట పడ్డాడు. ఆ దొంగ పరిగెత్తి పరిగెత్తి చీకట్లో మాయమయ్యాడు. ఆ బాలుడు ఒక చెట్టు చాటు వరకు వెళ్లి ఆగిపోయాడు. ఆ దొంగ కొద్దిసేపు చీకట్లో దాక్కొని దప్పికతో తిరిగి అక్కడ ఉన్న కుళాయిలో నీరు త్రాగుదామని ఆ బాలుడు ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. ఆ బాలుడు చెట్టుచాటునుండి ఆ దొంగను చూశాడు. ఆ దొంగ తాను దొంగిలించిన పర్సును చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్దారించుకొని అక్కడ దానిని నేలపై దూరంగా పెట్టి నీటిని త్రాగసాగాడు. వెంటనే ఆ బాలుడు ఆ పర్సును తీసుకొని పరిగెత్తసాగాడు .అప్పుడు అది గమనించిన ఆ దొంగ ఉపాయంతో ఆ బాలుని వెంటపడి ‘ దొంగ దొంగ ‘అని గట్టిగా అరవసాగాడు .అక్కడ ఉన్న జనం ఆ దొంగ మాటలు నిజమని నమ్మి ఆ బాలుని పట్టుకున్నారు. ఆ దొంగ సంతోషించి ఆ బాలుడు తన పర్సును దొంగిలించాడని బాలుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నవారు వారి ఇద్దరినీ పట్టుకుని గ్రామాధికారి వద్దకు తీసుకుని వెళ్లారు.
ఆ దొంగ తన పర్సును ఈ బాలుడు దొంగతనం చేశాడని ఆరోపించాడు. అప్పుడు గ్రామాధికారి ఆ బాలునితో “ఏం బాబూ! ఇతరుల పర్సును దొంగిలించడం తప్పు కదా!” అని అన్నాడు. ఆ బాలుడు నవ్వి ” అయ్యా! ఇది అతని పర్సు అయితే ఇందులో ఏమున్నదో చెప్పుకోమనండి” అని అన్నాడు. ఆ దొంగ నీళ్ళు నమిలాడు. అప్పుడు ఆ గ్రామాధికారి “మరి నీవైనా చెప్పు” అని ఆ బాలుని అడిగాడు .”మా అమ్మా, నాన్న ఫోటోలండీ. ఇతడు దొంగిలించింది మా అమ్మ పర్సే. కావాలంటే చూడండి “అని ఆ గ్రామాధికారికి దానిని తీసి చూపించాడు .వెంటనే అక్కడ నుంచి పారిపోతున్న ఆ దొంగను గ్రామ ప్రజలు వెంటనే పట్టుకున్నారు.
ఇంతలో అక్కడికి ఆ బాలుని తల్లి ఏడ్చుకుంటూ ఆ గ్రామాధికారి వద్దకు వచ్చి ఆ బాలునితో “బాబూ! మన పర్సు పోతేపోయింది. వెధవ పర్సు. దొంగ వల్ల నీకు ఏమీ ముప్పు అవలేదు కదా “అని అంది .అప్పుడు ఆ గ్రామాధికారి ఆ బాలుని మెచ్చుకొని “నీ కొడుకు ఈ గజదొంగని పట్టించాడమ్మా! మాకు ఈ దొంగ పీడ లేకుండా చేశాడు! మా గ్రామంలో ఎన్నో రోజులుగా దొంగతనం చేసిన ఈ దొంగను ఈ బాలుడు పట్టుకోవడం నిజంగా చాలా ధైర్యంతో కూడిన పని. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ బాలుని నేను అభినందిస్తున్నాను” అని ఆ బాలునికి మంచి కానుకను ఇచ్చి సత్కరించాడు.వారి మాటలు విని ఆ తల్లి ఎంతో మురిసిపోయింది.
గోపి చాలా ధనవంతుడు. అతని పుట్టినరోజు వేడుకకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆ వేడుకకు అతని మిత్రులంతా వేల రూపాయల విలువైన బహుమతులతో వారి ఇంటికి వచ్చారు. రాము మిక్కిలి పేదవాడు. అతడు కూడా ఒక బహుమతిని చాలా తక్కువ ధరకు కొని దానిని కాగితాలతో చుట్టి పెద్దగా చేసి తెచ్చాడు.
ఆ వేడుక బ్రహ్మాండంగా జరిగింది .అందరూ తాము తెచ్చిన వేల రూపాయల గొప్ప బహుమతులను గోపీకి ఇచ్చారు. అందరితోపాటు రాము కూడా తాను తెచ్చిన బహుమతిని అతనికి ఇచ్చాడు. బంధువులు, పెద్దలు గోపీని దీవించి అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన మిఠాయిలను తీసుకుని వెళ్లిపోయారు. కేవలం గోపి,అతని మిత్రులు మాత్రమే మిగిలారు.అప్పుడు ఆ మిత్రులలో ఒకడు గోపితో “ఒరేయ్! వీడు చాలా పెద్ద బహుమతిని తెచ్చినట్టున్నాడు.అది ఏమిటో ఆ కాగితాలు తీసిచూడరా” అని అన్నాడు .అందరు మిత్రులు గోపితో అది చూడాలని పట్టుపట్టారు. సహచరుల ప్రోద్బలంతో గోపి దానికి చుట్టి ఉన్న చాలా కాగితాలను తీసి చూశాడు. తీరా చూస్తే అది ఒక చిన్న చేతి గడియారం. అది చూసి అందరూ నవ్వారు. అప్పుడు గోపి” ఒరేయ్! ఎందుకురా అలా నవ్వుతారు? నా మీద ప్రేమతో తెచ్చి ఇచ్చిన ప్రతి బహుమతి గొప్పదే .చివరికి రాము బహుమతి కూడా “అని అన్నాడు. అప్పుడు అందులో ఒకరు “ఈ చిన్న చేతిగడియారం ఒక గొప్ప బహుమతియేనా!” అని వేళాకోళంగా అన్నాడు. గోపి అప్పుడు ఏమీ మాట్లాడలేదు .రాము కళ్లలో నీళ్లు నిండాయి.
ఇంతలో అతని మేనమామ వచ్చి ” గోపీ! నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్లాలి .సమయం ఎంత అయింది. నా గడియారం చెడిపోయింది.నేను సమయానికి వెళ్లకపోతే నాకు విమానం అందదు. కాస్తా తొందరగా చెప్పు “అని అన్నాడు. అప్పుడు గోపి రాము తనకు బహుమతిగా ఇచ్చిన చేతి గడియారం లో సమయం చూసి ఎనమిది గంటలైందని చెప్పాడు. మేడ పైకి వెళ్లిన మామయ్య తాను ఢిల్లీకి పట్టుకుని పోయే చాలా వస్తువులను తన సంచీలో పెట్టుకోవడం ప్రారంభించాడు.
ఆ తర్వాత గోపి” చూశారా! ఆ చేతి గడియారం ఇప్పుడు ఎంత అవసరమైనదో! ఇప్పుడు అవసరానికి ఉపయోగపడిన అది గొప్పబహుమతి కాదా! మీరే చెప్పండి! అంతేగాకుండా సమయం చాలా విలువైనది.అది మన కొరకు ఆగదు.ముఖ్యంగా విద్యార్థులకు సమయం గడచిపోతే మళ్లీ రాదు.సమయ పాలన జీవితంలో చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో మనం ఎన్ని జవాబులు వ్రాయాలో సమయాన్ని బట్టే నిర్ణయం తీసుకొంటాం. లేకపోతే మనం ఎక్కువ మార్కులను సాధించలేం.అతడు పేదవాడని మీరు గేలిచేసినప్పటికినీ రాము చాలా ఆలోచించి మీ అందరి కన్నా గొప్ప బహుమతిని తెచ్చాడు.ఇది చూడటానికి చిన్నగా ఉన్నా,ధర తక్కువైనా చాలా గొప్పది. అంతేకాదు. ఇది నాకు ఇష్టమైనది కూడా” అని అన్నాడు.
ఇంతలో అతని మిత్రుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పాఠశాలలో మన తరగతిలో మొదటి రెండు స్థానాలు రాము, గోపివేనట. ఇప్పుడే పరీక్షా ఫలితాలు వచ్చాయనీ నా మిత్రుడు చెప్పగా విన్నాను” అని అన్నాడు. అప్పుడు గోపి ” నేను చెప్పలేదా!రాము నాకు చదువులో చక్కని సలహాలు ఇచ్చి సమయ పాలన పాటించమని చెప్పాడు. అంతేకాకుండా నాకు ఈ చేతి గడియారాన్ని ఎప్పుడు తాను గుర్తుండేలాగా మంచి బహుమతిగా ఇచ్చిన నా ప్రియ మిత్రుడు రాముకు ధన్యవాదాలు మరియు అభినందనలు ” అని అన్నాడు. అతని మాటలకు తోటి మిత్రులంతా రాము బహుమతిని గేలి చేసినందుకు తాము సిగ్గుపడి కరతాళధ్వనులను చేశారు.తర్వాత వారు రాముకు క్షమాపణలు చెప్పి తాము కూడా ఇకనుంచి సమయ పాలనను పాటిస్తామనీ,ఇకముందు ఎవ్వరినీ గేలి చేయమని అన్నారు. రామును, గోపిని వారు అభినందించారు.వారిలో తాము ఆశించిన మార్పు వచ్చినందుకు రాము, గోపి ఎంతో సంతోషించారు.
గోపి చిన్న పిల్లాడు. అతడు తన పూల తోట లోనికి వెళ్ళాడు. అక్కడ చాలా పూల మొక్కలు అందంగా రకరకాల రంగులతో ఉన్నాయి.ఇంతలో ఒక పూలమొక్క గాలికి అడ్డంగా అటూ,ఇటూ ఊగుతోంది.
గోపీకి ఒక సందేహం వచ్చింది.
ఇంతలో అక్కడకు అతని తాతయ్య వచ్చాడు. అప్పుడు గోపి తాతయ్య తో” చూడు తాతయ్యా! ఈ మొక్క గాలికి అడ్డంగా అటూ, ఇటూ ఊగుతుంది. దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాడు?
అప్పుడు తాతయ్య” ఇది నీకు భయపడి తనను తొలగిస్తావనుకొని తొలగించవద్దని అడ్డంగా ఊగుతోంది రా! . అంతే గాకుండా నేను చాలా మంచి మొక్కను. మీకు పూలు ఇస్తాను .నన్ను తొలగించవద్దని ప్రార్థిస్థున్నది ” అని అన్నాడు.
అప్పుడు గోపి “ఓహో! ఈ మొక్క ఇలా అడ్డంగా ఊగితే అర్థం ఇది అన్న మాట “అని బిగ్గరగా అన్నాడు. ఆ తర్వాత ” అయితే తాతయ్యా! దీనిని మనం తొలగించడం లేదు .అంతేకాదు. ఇలాంటి మొక్కలు ఇంకా కొన్ని కూడా తెచ్చి నాటుదాం” అని
అన్నాడు.గోపి అలా అనడమే కాకుండా మరి కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఆ తెల్లవారి నాటాడు.గోపి చేసిన పనికి తాతయ్య ఎంతో సంతోషించాడు.
మరొక రోజు గోపి తోట లోకి వెళ్లి తాతయ్యను పిలిచి ” తాతయ్యా! ఈ మొక్క అడ్డంగా కాకుండా నిలువుగా ఊగుతుంది . మరి దీని అర్థం ఏమిటి” అని ప్రశ్నించాడు? అందుకు తాతయ్య” గోపీ! నిన్ను ఆ మొక్క తన దగ్గరకు రమ్మని పిలుస్తోంది రా! తనను ఇక్కడనుండి తొలగించమని అది ప్రాధేయ పడుతోంది! “అని అన్నాడు. అప్పుడు గోపి “తాతయ్యా ! మొక్కలను తొలగించవద్దని మీరే చెప్పారుగా” అని అన్నాడు. ” అవును గోపీ! నీవన్నది నిజమే! కానీ ఇది కలుపు మొక్క. ఇతర మంచి మొక్కలకు నీరు ,ఎరువు అందకుండా ఇది చెరుపు చేసేది. ఇది మంచిమొక్కలను ఎదగనీయదు.అందుకే తనను తీసేయమని ఇది నీకు భయపడి నిన్ను ముందే వేడుకొంటోంది .ఇలాంటి వాటిని మనం తీసేయాలి రా!” అని అన్నాడు. ” అయితే దీనిని తొలగిద్దాం తాతయ్యా! ” అని అన్నాడు గోపి.” అవును !ఇలాంటి వాటిని తొలగిస్తే మంచి మొక్కలు ఎదిగి మన తోటలో చక్కని పూలు పూస్తాయి” అన్నాడు తాతయ్య.
మళ్లీ గోపి “మరి పూవులను మొక్కలనుండి తెంప కూడదా తాతయ్యా! ” అని ప్రశ్నించాడు ? “వద్దు. తెంపకూడదు. మనకు అత్యవసరమైనపుడు మాత్రమే ఒకటో, రెండో తెంపుకోవాలి.ఆ రంగు రంగుల పూలు మన కళ్ళకు ఎంతో అందంగా కనబడతాయి . వీటిని మనం మొక్కల నుండి వేరు చేయకూడదు. అవి మనకు కమ్మని సువాసనను, మంచి గాలిని ఇస్తాయి. మనం స్వార్ధం తో వీటి అన్నింటినీ ఒకేసారి తెంపకూడదు “అని అన్నాడు తాతయ్య. గోపి” సరే తాతయ్యా! నా సందేహాలు నివృత్తి అయినాయి. మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్లే నేను చేస్తాను ” అని అన్నాడు.
పిల్లలూ! అందుకే పూల మొక్కలను నాటి ప్రకృతి అందాలను కాపాడి పర్యావరణానికి తోడ్పడాలి.
అడవిలోని పక్షులన్నీ సమావేశమై తమ తమ శారీరక అందాన్ని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఒక తెల్లని కొంగ “నేను తెల్లగా చాలా అందంగా ఉంటాను. మీరు ఎవరూ కూడా నా అందానికి సాటి రారు .మల్లె పూవులా ఉన్న నా శరీరం చూడండి ” అని అంది.ఆ తర్వాత రామచిలుక “నేనూ అందమైన దానినే. నా ఎర్రని ముక్కు, ఆకుపచ్చని శరీరం అంటే అందరూ ఇష్టపడతారు!” అని అంది . “నేను కూడా అందమైన దానినే “అంది మైనా.ఇలా అన్నీ పక్షులు తమ తమ శారీరక అందాన్ని పొగడుకున్నాయి. కానీ కాకి ,కోయిల మొదలైనవి మాత్రం “అయ్యో! మనం నల్లగా అందవికారంగా ఉన్నాము కదా ” అని తమ మనసులోనే బాధపడ్డాయి.
ఇంతలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులలో ఒకడు ఈ పక్షులను అన్నింటినీ చూసి ” ఆహా! ఈ కోకిల ఎంత మధురంగా పాడుతుంది ” అని అన్నాడు. మరొకడు ” అవును. ఈ నెమలి ఎంత అద్భుతంగా నాట్యం చేస్తుంది” అని అన్నాడు.ఇంకొకడు ” ఈ కాకులు కూడా గుంపులు గుంపులుగా ఎంత మంచిగా కలసి ఉంటాయిరా!” అని అన్నాడు.
అవి అన్నీ విన్న కొలనులోని హంస మిగతా పక్షులతో” చూశారా!మీరు మీ అందాన్ని చూసి తెగ మురిసి పోతున్నారు.మీరు వారిచే కీర్తింపబడినారా! ఈ మనుష్యులచే కోయిల,నెమలి, కాకి ప్రశంసించబడినాయి. అవి వాటి గొప్పతనం వలననే కీర్తింపబడ్డాయి తప్ప శారీరక అందంతో కాదు. మనం ఇతరులకు చేసే మంచి పనుల వలననే మన అసలైన అందం పెరుగుతుంది!” అని అంది
ఇంతలో అక్కడకు ఒక కొంగ వచ్చి “అయ్యో! అనుకోకుండా తెల్లగా ఉన్న నాపై ఒక గోడపై నున్న నల్లరంగు పడి నేను నల్లగా అందవికారంగా మారిపోయాను. ఈ రంగు పోయేలా లేదు.నా అందం అశాశ్వతం అని తేలిపోయింది “అని బావురుమంది.అది విన్న హంస “చూశారా పక్షులారా! ఒక్క క్షణంలోనే దీని అందం మాయమైంది. ఇకనైనా మంచి పనులు చేసి మీరు అసలైన అందాన్ని పెంచుకోండి. ఆ అందం చెరిగిపోనిది “అని అంది.
ఏనుగు- చీమ స్నేహం
ఒక చీమ వెళ్లి ఏనుగుతో స్నేహం చేస్తానంది. అప్పుడు ఏనుగు నవ్వి” నీవెక్కడా! నేనెక్కడా! మన ఇద్దరికీ స్నేహం ఎలా కుదురుతుంది చీమా” అని అంది. ఇంతలోనే ఏనుగుకు ఒక పాము చుట్టుకుంది. వెంటనే ఏనుగు అరచింది. చీమ వెంటనే తన దండునంతా పిలిచింది .ఆ చీమలన్నీ ఒక్కసారిగా పామును చుట్టుకున్నాయి. పాము ఆ చీమల దాడికి ఏనుగు కాలు విడచి కిందకి వెళ్ళింది .అయినా దానిని చీమలు కుట్టాయి. పాము చీమల దండు నుండి తప్పించుకొని ఎట్టకేలకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏనుగు ఆ చీమ తనకు చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించింది. అంతేకాదు. ఏనుగు ఆ చీమతో స్నేహానికి సంతోషంగా ఒప్పుకుంది .
అప్పటినుండి ఏనుగు చీమ సంతోషంగా కలిసి ఉన్నాయి. ఒకసారి చీమ ఒక ప్రవహించే వాగు పైభాగాన ఒడ్డున ఉన్న చెట్టు పైకి పాకి పొరపాటున జారి ఆ వాగు నీటిలో పడి కొట్టుకొని పోసాగింది. అది
” రక్షించండి !రక్షించండి” అని అరవ సాగింది. ఆ వాగు క్రింది భాగాన ఉన్న ఏనుగు ఇది గమనించి ఒక చెట్టు కొమ్మను తన తొండంతో విరిచి చీమ కొట్టుకుపోతూ తన దగ్గరకు రాగానే దానిని ఆ నీటిలో పడవేసింది. చీమ ఆ చెట్టు కొమ్మను అందుకొని ఒడ్డు పైకి వచ్చి ఏనుగుకు కృతజ్ఞతలు తెలిపింది .
ఆ తర్వాత మరొక సారి ఏనుగు పొరపాటుగా ఒక పెద్ద గుంతలో పడి పోయింది. అది తనను కాపాడమని బిగ్గరగా అరిచింది . దానికి దగ్గర్లోనే ఉన్న చీమ పరుగుపరుగున వచ్చి ఏనుగుకు ధైర్యం చెప్పి అలాగే ఉండమని తన స్నేహితుడైన గాడిదను కలసి కలప దుంగలను దాని వీపుపై మోయమని వేడుకుంది. అందుకు గాడిద ఒప్పుకొని వాటిని తన మీద ఎత్తి ఎవరైనా వేయడానికి పిలుచుకొని రమ్మని చెప్పింది. అప్పుడు చీమ పరుగెత్తి తన మిత్రులైన ఎలుగుబంటి, కోతులను పిలుచుకొని వచ్చింది. వాటి సాయంతో ఆ దుంగలను గాడిద పైన వేసి ఏనుగు ఉన్న గుంత వద్దకు అవి వెళ్లాయి. ఆ గుంతలో ఏనుగును ప్రక్కకు జరగమని చెప్పి ఆ కలప దుంగలను అందులో వేశాయి.అంతే కాకుండా అవి కొంత మట్టి ,ఇసుక కూడా ఆ గుంతలో పోశాయి. ఏనుగు మెల్లగా ఆ దుంగలపై నున్న ఇసుక పైకి ఎక్కి మీదకు వచ్చి చీమను సంతోషంగా కౌగలించుకుంది .చీమ తన మిత్రులైన గాడిద, ఎలుగు ,కోతులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఆ తర్వాత మరొక సారి ఏనుగు వేటగాడు పన్నిన వలలో చిక్కుబడిపోయింది .చీమ దాని దగ్గరకు వచ్చి ఏనుగుకు ధైర్యం చెప్పింది .ఆ సమయంలో వేటగాడు లేడు. చీమ వెంటనే తన మిత్రురాలైన ఒక ఎలుకను తీసుకొని వచ్చింది . ఆ ఎలుక ఏనుగు యొక్క వలత్రాళ్లను కొరికింది . ఏనుగు బయటకు వచ్చి ఎలుకకు ,చీమకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత అవి అక్కడనుండి దూరంగా వెళ్లాయి. తర్వాత వచ్చిన వేటగాడు వలంతా కొరికి ఉండడం చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ వేటగాడు వెళ్లి పోవడం చూసి ఎలుక ఆ చీమ, ఏనుగుల స్నేహాన్ని చూసి చాలా అభినందించింది . ఎలుక అప్పటి నుండి ఏనుగుకు కూడా మిత్రురాలైంది. అలాగే చీమ మిత్రులైన గాడిద, కోతి, ఎలుగు కూడా ఏనుగుకు మిత్రులైనాయి. అప్పటి నుండి అవి అన్ని కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండ సాగాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా అవి కలిసి ఉపాయంతో తప్పించుకో సాగాయి.
ఇలా ఉండగా ఒకసారి చీమ ఒక మట్టిగుంటలో పడింది .దానికి పైకి ఎక్క రావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా జారుతూ పైకి ఎక్కలేక పోయింది .తిరిగి ఆ గుంటలోనే పడిపోతున్నది. అప్పుడు ఇది చూసిన ఏనుగు చీమకు ధైర్యం చెప్పి ఒక కర్రను తెచ్చి ఆ గుంటలో నిలువుగా వేసింది. దానిని పట్టుకున్న చీమ పైకి ఎక్కి సునాయాసంగా మీదకు వచ్చింది. అది సంతోషంతో ఏనుగుపైకి ఎక్కి నృత్యం చేయసాగింది. అదే కాకుండా దానితోటి చీమలను కూడా ఏనుగు పైకి ఎక్కమని పిలచింది. అవి అన్నీ ఏనుగు పైకెక్కి నృత్యం చేయసాగాయి. ఏనుగు కూడా సంతోషంతో తొండాన్ని ఊపి అదికూడా నృత్యం చేసింది .
అప్పటినుండి మిగతా చిన్న ప్రాణులు చీమకు ఏనుగు అండ ఉన్నదని గ్రహించి దాని జోలికి పోవడం మానేశాయి. ఏనుగు, చీమల మైత్రి చిరకాలం వర్ధిల్లింది. తమ స్నేహానికి ఆకారాలు అడ్డురావని, చిన్న పెద్ద తేడా లేదని అవి రెండూ నిరూపించాయి. అంతేకాకుండా ఆపద సమయంలో అవి ఒకదానికొకటి చేదోడువాదోడుగా నిలిచి మిగతావాటికి ఆదర్శంగా నిలిచాయి.
రచన: సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.
మొబైల్: 9908554535.
——————————
చింటూ చిన్న పిల్లవాడు. అతడు ఆడుకోవడానికి వాళ్ళమ్మ చాలా బొమ్మలు తెచ్చి యిచ్చింది. వాటితో కొద్దిసేపు ఆడుకున్న చింటూకు చిరాకు కలిగింది. అవి అన్ని తీసి బయట పడవేశాడు. వాళ్ళ అమ్మ అప్పుడు వంట ఇంట్లో ఉంది.
చింటూ ఇంటి ముందుకు వచ్చి పూల చెట్ల వద్దకు వెళ్ళాడు. అక్కడ చెట్లకు పూసిన పూలు చాలా అందంగా ఉన్నాయి. అక్కడ ఒక తూనీగ ఎగురుతున్నది .వెంటనే దాని రెక్కలను అందుకొని భూమి పైన ఉన్న ఒక చిన్న రాయి పైన దానిని ఉంచాడు. అది ఆ చిన్న రాయిని అమాంతంగా తన కాళ్లతో పట్టుకుంది. చింటూ దాన్ని పైకి లేపి ఆనందంతో కేక వేశాడు. ఇంతలోకే పక్కింటి పిన్ని అది చూసి” బాబూ! అలా తూనీగ రెక్కలు పట్టుకోకూడదు. వదిలిపెట్టు “అని అంది. ఆమెకు భయపడిన చింటూ దానిని వదిలి పెట్టాడు .అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత మరొక రోజు చింటూ వారి పెరట్లోకి వెళ్ళాడు .అది వర్షాకాలం. ఆ పెరట్లో అతనికి ఎర్రగా ఆరుద్ర పురుగు కనిపించింది. ఆ పురుగును చేతితో ముట్టాడు .అది తన కాళ్లను ముడుచుకుంది. మెత్తగా ఉన్న దానిపైన చేతితో నిమిరి ఒక ఖాళీ అగ్గిపెట్టెలో దాన్ని బంధించాడు. ఆ తర్వాత మరి నాలుగు ఆరుద్ర పురుగులను అలాగే అగ్గిపెట్టెలో వేసి బంధించి పక్కింటి పిన్నిగారికి చూపించాడు. ఆమె చింటూను కోప్పడి
” బాబూ! అలా వాటిని అగ్గిపెట్టెలో బంధించ కూడదు. వదిలిపెట్టు !”అని అంది .చింటూ తన అగ్గిపెట్టెలోని ఆ ఆరుద్ర పురుగులను కూడా వదిలి పెట్టాడు .
ఆ తర్వాత కొన్ని రోజులకు చింటూ ఒక సీతాకోక చిలుక రెక్కలను పట్టుకున్నాడు .అతడు దాని రెక్కల అందం చూసి” అమ్మా! ఈ సీతాకోకచిలుక అందంగా ఎంత బాగుందో” అని తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె” అలా చేయకూడదురా! దాన్ని వదిలిపెట్టు. అది దాని అమ్మ దగ్గరకు ఎగిరి వెళ్ళిపోతుంది” అని అంది .చింటూ అమ్మ యొక్క మాటను వినలేదు .ఇంటి బయటకు వచ్చాడు. అప్పుడు పక్కింటి పిన్ని” చింటూ! దాన్ని వదిలి పెడతావా! లేదా!”అని గద్దించింది. వెంటనే చింటూ ఆ సీతాకోక చిలుకను కూడా వదలిపెట్టాడు.
మరొక రోజు చింటూ ఈగను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది దొరకకుండా తప్పించుకొని పోయింది. చింటూ వెంటనే అక్కడ పాకుతున్న ఒక ఎర్ర చీమను పట్టుకున్నాడు. అది చింటూను కుట్టింది. ” అమ్మా! చీమ కుట్టింది “అని ఏడుపు లంకించుకుంటూ తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె “అయ్యో !మా బాబే ! ఎక్కడ కుట్టింది?” అని అంటూ అది కుట్టిన వ్రేలును బాగా మర్దన చేసింది. కొద్దిసేపటికి ఏడుపును ఆపిన చింటూతో వాళ్ళ అమ్మ ” చీమను పట్టుకోకూడదురా! చూసావా!అది నిన్ను కుట్టింది “అని అంది. “ఇకముందు దాని జోలికి పోనులే” అన్నాడు చింటూ. “అమ్మా! నాకు ఆటలు ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. పక్కింటి పిన్నిగారు ,నీవు ఆ కీటకాలతో ఆడుకోవద్దని అన్నారు.మరి నేను వేటితో ఆడుకోవాలి?”అని ప్రశ్నించాడు?
ఇంతలోకే వారి ఇంటికి ఎదురుగా కొత్తగా వచ్చిన చిన్న పాప వారి ఇంటికి వచ్చింది.చింటూ ఆ పాపను గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. ఆ పాప ఏడుపు లంకించుకుంది. వెంటనే చింటూ అమ్మ “ఆ పాపను వదలు బాబూ!” అని అంది .కానీ చింటూ ఆ పాపను అలాగే పట్టుకున్నాడు. వెంటనే పక్కింటి పిన్ని వచ్చి చింటూ చేతిలో నుండి ఆ పాపను విడదీసింది .ఆ పాపకు చింటూ అమ్మ ఒక బొమ్మను తెచ్చి ఇచ్చింది .ఆ పాప వెంటనే ఏడుపును ఆపి నవ్వసాగింది. చింటూ” అది నా బొమ్మ ” అని అన్నాడు. అప్పుడు చింటూ అమ్మ
” ఇది నీ బొమ్మనే !ఈ చెల్లి నీ కన్నా చిన్నది కదూ!ఆడుకోనీ!” అని అంది .
ఇంతలోనే ఆ పాప అక్కడ మండుతున్న నిప్పు వద్దకు వెళ్ళబోయింది. అది గమనించిన చింటూ యొక్క అమ్మ ఆ పాపను గట్టిగా కదలకుండా పట్టుకుంది. ఆ పాప గట్టిగా ఏడవసాగింది. అది చూసిన చింటూ “అమ్మా! నేను ఆ పాపను పట్టుకుంటే వద్దని అన్నావు .మరి నీవు కూడా ఆ పాపను ఎటూ వెళ్లకుండా పట్టుకున్నావుగా! “అని అడిగాడు.” ఆ పాపకు ఈ నిప్పు కాలుతుందని తెలియదురా! అందుకే పట్టుకున్నాను” అని అంది.
వెంటనే అక్కడకు వచ్చిన పక్కింటి పిన్ని గారు ఈ మాటలను విని ” ఒరేయ్ !ఈ పాపనూ, చిన్న ప్రాణులైన తూనీగ, ఆరుద్ర పురుగులు, సీతాకోకచిలుక, ఈగ ,చీమలను పట్టుకోగూడదురా!తెలిసిందా! ఎందుకంటే వాటి స్వేచ్ఛను మనం అరి కట్టరాదు. ఈ పాపకు నోరు ఉంది కాబట్టి అది ఏడ్చింది. కానీ అవి మూగజీవులు. అందుకే వాటి ఏడుపు నీకు వినిపించలేదు. వాటిని చూసి ఆనందించాలి తప్ప పట్టుకోకూడదు! అర్థమైందా!” అని అంది. చింటూకు అప్పుడు అర్థమైంది. “అయితే వాటిని ముట్టుకోకుండా ఆడుకోవచ్చు కదా !”అని అడిగాడు.”ఓ! భేషుగ్గా ఆడుకో” అని అంది చింటూ అమ్మ .వెంటనే చింటూకు తనను నిన్న తన మిత్రుడు గోపి వదలకుండా, ఎక్కడికీ పోకుండా గట్టిగా పట్టుకున్నందుకు తాను కూడా బాధపడి ఏడ్చిన అనుభవం సంగతి జ్ఞాపకం వచ్చింది.
” అవును పిన్ని గారూ! నన్ను కూడా గోపి నిన్న గట్టిగా పట్టుకుంటే నేను కూడా ఏడ్చాను” అని అన్నాడు.వాడి మాటలు విని చింటూ అమ్మ ,పక్కింటి పిన్ని నవ్వుకున్నారు.
