నిరంతర పరిశోధకుడు
నిత్య సాహిత్య సాధకుడు
స్నేహశీలి బాలన్న
అర్థాంతరంగా
అంతర్ధానమయ్యాడు
వ్యక్తిత్వం , వక్తవ్యంతో
సముజ్వలంగా ప్రకాశించిన
ఉత్తమ అధ్యాపకుడు
సాహిత్య సారాలను శోధించి
వెలికితీసిన బహుగ్రంథకర్త
ఆత్మాభిమానధనుడు
ఆ కృషి మహోన్నతం
ఆయన మార్గం అనుసరణీయం
( ప్రొఫెసర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి స్మృతిలో..
తిరునగరి శ్రీనివాస్
తిరునగరి శ్రీనివాస్
తిరునగరి శ్రీనివాస్... ----- జర్నలిస్టు, కవి, అధ్యాపకులు, వ్యాఖ్యాత, ఎంఏ (తెలుగు), ఎంసిజె, ఎం.ఇడి, పిజిడిడబ్ల్యూఎంఎంటి, బి.పి.ఆర్, యూజీసి - నెట్. పుస్తకాలు... --- వెలుతురు ప్రవాహం (కవితా సంపుటి - 2001), జానపదం (జానపద కళల పరిశోధనావ్యాసాలు - 2001), జ్ఞానవీచిక (వ్యాస సంపుటి 2021), కవితావిశ్వంభరుడు (సంకలనం - సంపాదకత్వం - 2021), పాటల తోటమాలి (సంకలనం - సంపాదకత్వం - 2021), కవనభేరి (సంకలనం - సంపాదకత్వం - 2021).
( ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంస్మరణలో…)
బహుముఖ కృషితో ప్రామాణికమైన రచనలను తెలుగు సాహిత్యానికి అందించిన విద్వన్మణి ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి. సాహితీవేత్తగా, పరిశోధకునిగా, పత్రికా సంపాదకునిగా నిత్యకృషితో ఉజ్వలంగా ప్రకాశించిన ప్రజ్ఞామూర్తి. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వేలాది రచనలను పత్రికలలో ప్రచురించి ప్రామాణిక పత్రికా రచనకు అర్థం చెప్పిన జ్ఞానశీలి.
గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 5 సెప్టెంబరు 1966న మెదక్ జిల్లా పోతారెడ్డిపేటలో లక్ష్మీనరసింహశర్మ, పద్మావతి దంపతులకు జన్మించారు. శ్రీనివాసమూర్తి తండ్రి లక్ష్మీనరసింహశర్మ కవి, అవధానిగా ప్రఖ్యాతి పొందారు. చిన్ననాడే ఇంటి నుండే బాల శ్రీనివాసమూర్తికి సాహిత్యంపై యెనలేని మక్కువ ఏర్పడింది. పాఠశాల, కళాశాల స్థాయి విద్యాభ్యాసానంతరం హైద్రాబాదులో విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యను అభ్యసించి పరిశోధన చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు. జర్నలిస్టుగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం వివిధ పత్రికలకు విభిన్నమైన రచనలు అందించి తెలుగు పాఠకులకు సుపరిచితులయ్యారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత అక్కడ బోధకులుగా చేరి క్రమంగా అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. పరిపాలనాపరమైన వివిధ పదవులను కూడా ఆయన నిర్వహించారు. పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని అనేక పరిశోధనాపత్రాలు సమర్పించారు. వివిధ కార్యక్రమాలలో సాహిత్య ప్రసంగాలెన్నో చేశారు. సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలపై పది వరకు ప్రామాణికమైన పుస్తకాలను వెలువరించారు. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ, సమకాలీన వాదాలు – సాహిత్య విమర్శ, తెలంగాణం – తెలుగు మాగాణం, తుషార సమీరం, తెలంగాణ పత్రికలు, వెలుతురు కొలను, మా ప్రసిద్ధపేట, విలక్షణ – పి.వి నరసింహారావు జీవిత చరిత్ర, దేవులపల్లి రామానుజరావు (మోనోగ్రాఫ్), జీవనహిందోళం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ గారి జీవితం – అవధానం), తెలంగాణ వైతాళికులు సంపాదకత్వం (మూడు సంపుటాలు.. జననేతలు, అక్షర మూర్తులు, ప్రతిభామూర్తులు), సాహితీ సుధ, తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం, తెలంగాణ సాహిత్య చరిత్ర మొదలైన ఆయన రచనలు ఎంతో పేరొందాయి. 56 సంవత్సరాల వయస్సులోనే వెలకట్టలేని సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, సామాజిక అంశాలను శోధించి, పరిశోధించి సాహిత్యలోకానికి అందించారు.
పండిత కవి, అవధాని లక్ష్మీనరసింహశర్మ కుమారుడైన బాల శ్రీనివాసమూర్తి తన అద్వితీయ రచనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడిగా సాహిత్యరంగంలో ఎంతో పేరొందారు. తెలంగాణ, తెలుగు మాగాణం, వెలుతురు కొలను, తుషార సమీరం అన్నవి శ్రీనివాసమూర్తి విమర్శా ప్రతిభను చాటిచెప్పడమే కాక ఎందరో ప్రసిద్ధ విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అన్న రచనలో మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలోని కథలు పోషించిన కీలక పాత్రను రాజకీయ నిబద్ధతతో అత్యంత జాగ్రత్తగా శ్రీనివాసమూర్తి రచించారు. ఆధ్యాత్మిక రచనా విశిష్టతను తెలుపుతూ రచించిన తెలుగులో ఆధ్యాత్మిక వచన కావ్యాలు అన్న పరిశోధనాత్మక గ్రంథం ఎంతో మంది పండితుల ప్రశంసలందుకుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం – పత్రికల పాత్ర అన్న పరిశోధనతో 1920 – 56 మధ్య కాలంలో తెలంగాణలో పత్రికల చైతన్య భూమికను, సామాజిక చారిత్రక ఘట్టాలను వివరించారు. విలక్షణ అన్న పేరుతో పీవీ శత జయంతి మోనోగ్రాఫ్ను నీల్కమల్ పుస్తక సంస్థ కోసం ఎంతో అద్భుతంగా శ్రీనివాసమూర్తి రాశారు. పీవీ బహుముఖ ప్రజ్ఞకు ఈ గ్రంథం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ గురించి మూడు ప్రత్యేక సాహిత్య వ్యాస సంపుటాలకు సంపాదకత్వం వహించి ఎందరో సాహితీవేత్తలను ప్రోత్సహిస్తూ విలువైన వ్యాసాలను రాయించారు. ఎంతో గొప్ప సాహిత్య కృషిని ఈ సంపుటాల ద్వారా బాలశ్రీనివాసమూర్తి అందించారు. సులభ వచన రచనాశైలిలో ఏ స్థాయి పాఠకుడినైనా వెంటనే ఆకట్టుకునేలా రచన చేయడం బాలశ్రీనివాసమూర్తి ప్రత్యేకత. చిన్న వాక్యాలు, సులభమైన పదాలతో అర్థవంతంగా అమూల్య గ్రంథాలను అందించిన ఆయన సాటిలేని మహోన్నత సాహితీమూర్తి. వినమ్రతతో, విజ్ఞానంతో అందరికీ ఆత్మీయునిగా ఆయన తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగించారు.
తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన బాలశ్రీనివాసమూర్తి 24 ఏప్రిల్ 2023న హైద్రాబాదు సుచిత్రలోని తమ ఇంటిలో గుండెపోటుకు గురై మరణించారు. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే విశిష్ట కృషి చేసిన పరిశోధకమూర్తి, అరుదైన సాహితీవేత్త బాలశ్రీనివాసమూర్తికి కన్నీటి నివాళి.
మౌన సంభాషణలెన్నో
మనసు పొరల్లో…
ప్రవహించే గీత నదులెన్నో
అంతరాంతరాళాల్లో…
ఊపిరాడని అవస్థల్లోనూ
మైదానమంత కవిత్వం పుడుతుంది
మూసిన కిటికీలపై
మనసు భాషను అది చిలకరిస్తుంది
చుక్కల జెండాలను పట్టుకుని
చిగురు చిరునామాగా ఊతమౌతుంది
బువ్వలోని మట్టి పరిమళమౌతుంది
జీవితాన్ని వడగట్టిన కన్నీరవుతుంది
అర్థం చెప్పి ఆచరణవుతుంది
గాలికి ఆయువు పోసి
ఆకుపచ్చని పాటవుతుంది
వాస్తవమై గుండెల్లో స్థాపితమౌతుంది
జరామరణాలు జయించి
అజరామరమవుతుంది
నదీ హృదయమవుతుంది
అనుభవాల అగాధలపై
ఆలోచనాలోచనమవుతుంది
జీవన చైతన్యదాయినిగా వికసిస్తుంది
సృష్టికి అదిమూలం
మథనమైతే
సునిశిత దృష్టికి ఆలవాలం
మననం
ఆద్యంతాలు లేని శూన్య మథనం వల్లనే సమస్త సృష్టి ఆవిర్భవించిందని మళ్లీ మళ్లీ మథనం అన్న కవితలో అన్నారు డా, సి. నారాయణరెడ్డి. తిరుగు లేని పురోగమన శీలానికి సజీవ ప్రతీకలుగా నిలిచే కవితలను ఆయన లేఖిని వెలువరించింది.
చినుకును రమ్మని చిటికేశాను
అది జల్లై వచ్చి కురిసిపోయింది
చిగురును చేత్తో నిమిరి చూశాను
అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది
తారను ధగధగ వెలిగిపో అన్నాను
అది మధ్యాహ్న సూర్యబింబంలా
ఉజ్వలించింది
అని సముచిత సమయంలో వ్యాప్తి పొందినప్పుడే వాటి అస్తిత్వం ప్రస్ఫుటిస్తుందని చెప్పారు. విశ్వవ్యాప్తంగా జరిగే అద్భుత పరిణామాల మూలాలు చిన్నవే అని చెప్పారు. మానవుల మెదళ్ల మొదళ్ల స్తబ్ధత పేరుకుపోకూడదని అన్నారు. చూపులతో కొలవలేని ఎత్తుకు ఎదిగిన మనిషి సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనంగా మారుతాడని అంటారు. ఏకాంతానికి, సామూహిక జీవితానికి తీరాలను గమనించి పరిస్థితులను బట్టి కుదించుకొని, విస్తరించుకొని పోవాలని సూచిస్తారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ సాగిపోతే శ్వాసలు అలలెత్తినట్టు, అడుగులకు రెక్కలొచ్చినట్టు ఉంటుందని తెలిపారు. మనసు మీద పేరుకున్న నిరాశ తాత్కాలికమని అది ఉత్తేజంగా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. గతం ఇంకిపోయిన బావి వంటిదని అన్నారు. పూలు అదృశ్యం అవ్వడం ఫలాలై అంతరించడానికేనని చెప్పారు.
జీవిస్తున్నాను
మృత్యువుకు జోల పాడడానికి
పోగొట్టుకుంటున్నాను
నన్ను నేను పొందడానికి
అని ఎదుట పూలదారి ఎదురు చూడదని తెలిసి భవిష్యత్తును పట్టితేవడానికి ముళ్లమీద నడిచిపోతున్నానని తెలిపారు. నిరీక్షించడమంటే అక్షక్తత కాదు అది ఆరిపోని ఆశల కొలమానమై మనుగడలు సంతృప్తితో ఊపిరిలు పీల్చుకోవాలని చెప్పారు. కాల కల్లోలానికి ఎదురీదుతూ కడ ఊపిరి వరకు పోరాడాలని సూచించారు. ఉదయించిన సత్యమే ఆశయంగా మారాలని అన్నారు. జాగృత చైతన్యంతో విజయం అందివస్తుందని అన్నారు. ఆకు మీద రాలిన మంచు బిందువు తలతల మెరిసి పోవాలని ఆరాటపడుతుందని తెలిపారు. నేలమీదే సరిగ్గా నిలబడలేని మనిషి కన్న ఎగిరే పక్షి నయమనిపిస్తుందని తెలిపారు. ప్రయోగ శీలం పదను తగ్గితే ప్రసంగమవుతుందని, ప్రవాహ పాదం సడలిపోతే పడియలోకి దూరిపోతుందని హెచ్చరించారు. సూర్యకాంతిలో మౌళిక చింతన తెలుస్తుందని అన్నారు. సహజత్వం సమస్యలను మనిషి దరిచేరనీవవని అంటారు. ఎంతవేగంగా ఈదుతూ పోతే అంతే త్వరగా తీరం ఎదుట నిలుస్తుందని, వెనుదిరగని సంకల్పానికి అది సజీవ ఉదాహరణ అని అన్నారు. ఆత్మీయ సంభాషణంతో స్ఫూర్తిని పొందవచ్చని చెప్పారు.
అవ్యక్తత లోకి
వ్యక్తత చొరబడి
వ్యక్తావ్యక్త స్థితిలో
నా మసనును
వేలాడదీస్తున్నది
అన్న నారాయణరెడ్డి నిశ్చల స్థితిలో కలిగే అనుభూతిని మనసుతో నిర్వచించమన్నారు. వక్రగతి సమాజాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. అక్షరావనిలో సృజన యాత్ర నిరంతరంగా విక్రమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నైరాశ్యాన్ని కొనగోటితో చిమ్మేసి జీవితం పట్ల సరికొత్త ఆశలను అంకురింపజేసుకోవాలని చెప్పారు. సరికొత్త జీవధాతువులతో చైతన్యమాధ్యమంగా జీవితం పరిణామశీలతను అందుకోవాలని నారాయణరెడ్డి ఆకాంక్షించారు.