ఎల్బీనగర్ లోని ఓ మొబైల్ షాప్ నడుపుకుంటున్న, చంద్రపురి కాలనీ అపార్ట్ మెంట్ లో వుంటున్న మహేశ్ మనసు మంటలై మండిపోతున్నది.. అంతకంతకూ అవమానభారంతో అతడి ఆంతర్యం ఉడికిపోతున్నది. తన ఫ్లాట్ కెదురుగా వున్న ఆ ఇంటి ఓనర్, గవర్నమెంట్ టీచర్ అయిన రామచంద్ర పైన ఆ కోపం ఉప్పెనలా పొంగిపొర్లుతున్నది. రెండు నెలలుగా తరచూ రాత్రిపూట తాను ఫ్రండ్స్ తో కూడి సరదాగా తన ఫ్లాట్ లో పేకాడుతున్న సంగతి తెలిసి అతడు అభ్యంతరం తెలిపినా తాను వినక ఆట కొనసాగించేసరికి, ఆయన సోమ్మేదో పోయినట్టు పోలీసులకు సమాచారమిచ్చి తమనరెస్టుచేయించి అందరిలో అవమానంపాలు చేశాడు. కొంత పెనాలిటీతో మరికొంత రాజకీయ ప్రాబల్యంతో బయట పడగలిగాడు కానీ.. కాలనీలో మాత్రం అప్పట్నుండీ చుట్టుపక్కలందరూ, తెలిసినవాళ్లింకొందరు తననదోలా చూడడం, అవహేళన చేయడం భరించలేకపోతున్నాడు. ‘మొగుడు కొట్టినప్పుడు లేని బాధ తోడికోడలు నవ్వినందుకు కలిగింది’ అన్నట్టుగా, మునుపు తాను పేకాడుతాడని వీళ్లకు తెలిసినా ఎవరూ పట్టించుకోలేదుగానీ.. పోలీసులరెస్టుచేయడంతో అందరికీ అలుసైపోయాడు తాను. చట్టాలు శాసనాలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఊదరగొట్టే ఆ రామచంద్రగాడివల్లనే ఇదంతా జరిగింది. ఏదో చేసి వాడిని కూడా జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేయాలి. వాడి కూతుర్నెత్తుకెళ్లి చంపిపారెయ్యాలి.
అంతకుమించి మరో శిక్ష లేదు వాడికి.. అనుకొంటూ
కసిగా పిడికిళ్లు బిగించాడు.
పదేళ్ల ఆ పిల్ల శ్రధ్ద తనకు బాగానే పరిచయం. తోటి పిల్లలతో కలిసి అంకుల్ అంకుల్ అంటూ తనతో కేరమ్స్, ఛెస్ ఆడడానికొచ్చేది. ఆన్ లైన్ క్లాసులప్పుడు ఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెట్ రైట్ చేయించుకొని, థ్యాంక్స్ చెబుతూ “మంచి అంకుల్ మీరు” అంటూ వెళ్లేది. తానంటే ఆపిల్లకెంతో అభిమానం. ఏదో చెప్పి తనవెంట ఎక్కడికి రమ్మన్నా వస్తుంది. ఆ నిర్మానుష్య ప్రాంతానికి దాన్ని తీసుకెళ్లి, ఆపిల్ల గొంతునులిమి ఆ బ్రిడ్జ్ కింద పడేస్తే సరి.. అని.. ఆ ప్లేస్ కూడా నిర్ణయించుకొని, అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఆ ఇంటివైపే ఓ కన్నేసి వుంచాడు మహేశ్ . ఆ వారంలోనే ఆ సమయం రానే వచ్చింది. తల్లీ తండ్రీ ఏదో ఫంక్షన్ కు వెళ్లడం, స్కూల్ కి సెలవు కావడంతో ఆ అమ్మాయి శ్రధ్ధ ఒక్కతే ఇంట్లో వుండిపోవడం గమనించి, ఏవో మాయమాటలతో శ్రధ్దను తనవెంట తీసుకెళ్లడానికి వెంటనే ఆ ఇంటికి బయల్దేరాడు ప్రతీకారేచ్చతో మహేశ్ .
ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికడుగు పెట్టబోయాడు మహేశ్ . అంతలోనే హటాత్తుగా, ఊహించని రీతిగా ”భౌ” అన్న పెద్ద శబ్దంతో మీదికి దూకబోయినట్టనిపించిన కుక్కను చూసి అదిరిపడి , గేటు చివరిమెట్టు తట్టుకొని బోక్కబోర్లా పడిపోవడం, చీరుకుపోయివున్న కుక్కగిన్నె అంచు బలంగా నుదుటికి తగిలి గాయమవడం క్షణంలో జరిగిపోయింది.
ఆ శబ్దానికి మెరుపులా బయటికి పరుగెత్తుకొచ్చిన శ్రధ్ద “అయ్యో అంకుల్ ” అంటూ వెంటనే అతడిని సమీపించించింది.
“అరెరె.. మీకు దెబ్బ తగిలింది.. రక్తం వస్తోంది” అంటూ తన అరచేత్తో ఆ రక్తాన్ని అదిమిపట్టి వుంచింది కాసేపు.
“ఇలా జరిగినందుకు సారీ అంకుల్ .. లోపలికి రండి” అంటూ అతడు లేవడానికి తన శాయశక్తులా సాయంచేసింది. అతడి చేతిని పట్టుకొంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చుండబెట్టింది.
వెట్ వైబ్ తో గాయాన్ని తుడిచి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గాయానికి బాండేజ్ వేసింది. “అంకుల్.. ఇలాంటి అవసరాల కోసమే నాన్న ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నింట్లో వుంచుతాడు!” అని చెబుతూ, మంచినీళ్లందించింది. పాలు వేడిచేసి పసుపువేసి తీసుకొచ్చింది.”పసుపుపాలు మంచిదంట.. ఇన్ ఫెక్షన్ కానివ్వదంట..తాగండి!” అంటూ అతడి నోటికందించడంతో, నోట మాట రాక శిలాప్రతిమలా మారిపోయాడు మహేశ్ . మరుక్షణం ఒక అనిర్వచనీయభావంతో ఆ చిన్నారి వైపు చూశాడు.
“అంకుల్ .. కాంపౌండ్ లో కుక్క వుందని మీకు తెలీదు కదూ? మా ఫ్రెండ్ వాళ్లు ఊరెళ్లిపోతూ, మాకు బాగా అలవాటుందని రెండ్రోజులకోసం మా ఇంట్లోనే ఒదిలి వెళ్లారు. సో సారీ అంకుల్ ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మి” అంటూ అపాలజీగా తన చేతులు పట్టుకొన్న శ్రధ్దను చూస్తూ చలించిపోయిన మహేశ్ కళ్లలో నీళ్లు ధారకట్టాయి.
“దెబ్బ బాగా నొప్పిగా వుందా? రేపటికల్లా తగ్గిపోతుంది లెండి.. ఏడవకండి అంకుల్ !” అంటూ పువ్వంటి తన చేతి స్పర్శతో ఆ గాయాన్ని సున్నితంగా తడిమింది శ్రధ్ద.
అమాయకమైన ఆ బాలిక స్వఛ్చమైన ప్రేమకు పూర్తిగా కదిలిపోయిందతడి హృదయం.
అమ్మలా ఆరిందాలా ఆప్యాయత పంచుతూ, తన చిన్న చిన్న చేతులతో ఓడాక్టర్ లా ఓ నర్స్ లా తనకు సేవలందించిన ఆ బాలిక శ్రధ్దకు ముగ్ధుడైపోయిన మహేశ్ అణువణువునా పశ్చాత్తాపం చోటుచేసుకొంది.
కాటేయవచ్చిన పాముకే పాలుపోసి ఆదరించిన ఆ పసితత్వంముందు పశుత్వం తలవంచింది.
‘ఇంత చిన్న అమ్మాయితనంలో సైతం అధ్బుతమైన అమ్మతనాన్ని ఆస్వాదించగలిగాను. పగ ప్రతీకారాలతో అమ్మాయినే కాదు అమ్మాయిలోని అమ్మనే అంతం చేయబోయిన దుర్మార్గుణ్ణి తల్లీ నేను! నీ పసితనపు అమాయకత్వంతో, ఆ అమాయకపు అమృతత్వంతో నాలోని విషపు భావాలను హరించివేశావమ్మా.. నాకే కాదు నాలాంటి ఎందరికో నీ అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూపించి కల్మషాలెన్నో కడిగేయడానికై నిండు నూరేళ్లు జీవించు చిన్నారితల్లీ!’ అని మనసులోనే దీవిస్తూ, శ్రధ్ద తలనిమిరాడు. ఆపై “నన్ను మన్నించు తల్లీ” అన్న మనో భావనతో ఆ పదేళ్ల అమ్మాయి పాదాలపై తన శిరసునుంచి మౌనంగా క్షమాభిక్ష వేడుకున్నాడు.
“అయ్యో అంకుల్ మీరు నాకన్నా పెద్దవారు. అలా చేయకూడదు” అంటూ తనను వాటేసుకున్న శ్రధ్దను పదిలంగా, పవిత్రంగా, ప్రాణంగా పట్టుకొని ఆ చిన్నారితల్లిని గుండెలకు హత్తుకొని కన్నీటితో అభిషేకించాడు.
‘పదేళ్ల పాపలో కూడా వందేళ్ల సంస్కారాన్ని నింపి మరీ పెంచిన మీ మహోన్నత వ్యక్తిత్వానికి వేనవేల జోహార్లు రామచంద్రగారూ!’ అనుకొంటూ అతడికి అజ్ఞాత వందనాలర్పిస్తూ ఆ ఇంటి నుండి వెనుదిరిగాడు మహేశ్ .
*
కె.వీణారెడ్డి.
కె. వీణారెడ్డి,
కె. వీణారెడ్డి,
కె.వీణారెడ్డి,
రచయిత్రి - కవయిత్రి
కథా సంపుటులు: కథావిపంచి-1, జీవన్మణులు,
కథావిపంచి-2, నిశాంత కాంతులు!
బిరుదులు: సాహితీ సామాజిక వేత్త,
మహిళా సేవారత్న!
+91-7337058025
ఆకాశంలో ఉరుములు మెరుపులు… భూమిపైన జోరుగా వర్షపు చినుకులు… చెవులకు సోకుతున్న హోరుగాలి… ఆ చల్లని వాతావరణంలో టకటక వినిపిస్తున్న ఒక శబ్దం!
హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి, తన బావమరుదులతో కూడి డాక్టర్ రాజారాం చేసుకుంటున్న మందు పార్టీలో అది రెండో రౌండ్. ‘ఛీర్స్… ఛీర్స్’ గ్లాసుల గలగల శబ్దానికి పోటీపడుతున్నట్టుగా టకటకమంటూ మళ్లీ అదే శబ్దం!
చిరాకుగా వెళ్ళి వీధి తలుపు తీసి చూశాడు రాజారాం. తెరుచుకున్న ఆ తలుపుల ముందు… తడిసిన తల కొప్పెరతో, బురదనిండిన చెప్పుల్లేని కాళ్లతో, సన్నగా వణుకుతూ నిల్చున్నాడో పదేళ్ల పిల్లాడు.
‘అరె…. వీడా? ఏడాదినాడే కాలం చేసిన, కాలనీ చివరింటి జానయ్య కొడుకు శీనయ్యగాడా!” అనుకుంటూ అదోలా చూశాడు రాజారాం.
ఆ రాత్రి వేళ తనను డిస్టర్బ్ చేసిన వాడి రాకకు, తడిసి నేలను తడుపుతున్న వాడి తీరుకు అసహనం కలిగింది డా. రాజారాంకు.
“ఏంట్రా శీనూ?” విసుగ్గా అడిగాడు.
“డాక్టర్ సార్… నిన్నట్నుండి మా యమ్మకు జెరం. రాత్రికి రాత్రే ఎక్కువైంది. కరోనా వచ్చిందేమోనని భయమైతుంది. ఓసారి మీరొచ్చి సూడండి సార్… ఏదైనా గవర్నమెంట్ దవకాన్ల సేర్పించి పరీచ్చలు సేయించండి. కరోనా అయితేగాన దయచేసి మందులిప్పించండి!” అంటూ డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్ళతో శీనుగాడు.
మజాగా నడుస్తున్న మంది పార్టీ నుండి వైద్యుడిగా బయటకు రానివ్వలేదు రాజారాం మనసు.
“ఒరేయ్ శీనుగా… కష్టం జేసుకునేటోళ్లకు కరోనా రాదు లేరా! శక్తికి మించి పనిచేసిందేమో….. సుస్తీ చేసుంటది. మీయమ్మకేమీ కాదులే… రేపటికల్లా తగ్గిపోతుంది గానీ వెళ్లువెళ్లు!”
అంటూ… వాడిని బలవంతంగా బయటికి పంపించేసి, తలుపులు మూసేసి, గదిలోకొచ్చి మరో బాటిల్ ఓపెన్ చేశాడు డాక్టర్ రాజారాం.
* * *
ఓ వారం అనంతరం….
ఇంట్లోనే ఓ మూల గదిలో… బెడ్ పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ చిన్నగా మూలుగుతున్నాడు రాజారాం.
‘వైద్యుడుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తను కూడా కరోనా బారిన పడక తప్పలేదు. హోం క్వారంటైన్ పద్నాలుగు రోజులు పడకేసే తిప్పలు పడక తప్పడం లేదు! బాధగా, భయంగా, ఒంటరిగా… ఏదోలా గడుపుతున్నాడు తను. కొవిడ్ భయంతో బంధు మిత్రులెవరూ రావడం లేదు. కుటుంబీకులు మాత్రం అన్న పానాదులను గది బయటే పెట్టి తలుపు కొట్టి వెళుతున్నారు. అంతటి వైద్యుణ్ణి తనను తాకడానికే భయపడుతూ…. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. తననో అంటరానివాణ్ణి చేసిన కరోనా కాలమెంతటి భయంకరమైనది!’
ఆయాసంతో కూడిన ఆవేదనతో అనుకున్నాడు ఆరో రోజున డా.రాజారాం.
* * *
మందుల ప్రభావంతో, మగతగా పడుకున్న రాజారాం నుదుటిపై ఓ సున్నితమైన చల్లని స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.
ఏదో జ్ఞాపకం… మంద్రపవనంలా అతడి మనసులో కదలాడింది!
‘పక్షం రోజుల క్రితం…. ఆనాటి వర్షపు రాత్రిలో…. నిర్ధాక్షిణ్యంగా వీణ్ణి తను వెళ్ళగొట్టినా ఈనాడు తనకు కరోనా వున్నా, తనను ముట్టుకని తన నుదుట బొట్టుపెట్టిన ఈ శీనుగాడి సింధూరం చేతులు అప్పుడే విచ్చిన మందారాల్లా అన్పిస్తున్నాయి తనకు!’ అనుకొంటూ “శీనూ ఏంట్రా ఇది?” సంచలనంతో కూడిన ఆశ్చర్యంతో అడిగాడు!
‘’దండాలు డాక్టర్ గారూ… నిజంగా మీరు దేవుడే! ఆ రాత్రి మీరు సెప్పిన…. కాదు కాదు మీరు దీవించిన మాటతో మయమ్మకు జెరం తగ్గింది. కరోనా కూడా రాలేదు. అయ్య లేని నాకు అమ్మ తోడైనా నిలబెట్టిండ్రు మీరు!”
కృతజ్ఞతతో నమస్కారం పెడుతూ అన్నాడు శీనుగాడు.
“నిజమా శీనూ” నమ్మలేనట్టుగా అడిగాడు రాజారాం.
“అవును సార్! మందులేకుండానే మీ నోటి మాటతోనే మాయమ్మ రోగాన్ని తగ్గించిన మనిసి దేవుడు మీరు! అట్లాంటి మీకు కరోనా వచ్చిందని తెలిసి బాగా బాధపడిన. మనిసిదేవుడికి గుళ్ళోని ఆ పెద్ద దేవుడే కదా తగ్గించాలె! అందుకే మన కాలనీలున్న ఆంజనేయస్వామి గుడికెల్లి మీకు తగ్గించమని రోజూ మొక్కేటోణ్ని. ఇయాల గుళ్లో ఏదో పండుగుంట! టెంకాయ కొట్టి దండం పెట్టి సిందూరం తెచ్చిన…. ఎవరు సూడకుండ మీ ఇంటి లోపలికొచ్చిన…. ఆ దేవుని బొట్టు మీకు పెట్టిన, మీకు తప్పక తగ్గిపోతది సార్!
అంటున్న శీనుగాడి కళ్లల్లో అంతులేని విశ్వాసం అగుపించింది.
అబ్బురంగా వాడివైపు చూశాడు రాజారాం!
‘ప్రాణాంతకమైన కరోనా భయంతో తన వాళ్ళెవరూ తనను తాకనైనా తాకలేని దుర్భరమైన స్థితిలో… తననే దేవుడనుకున్న అమాయకమైన నమ్మకంతో… భయంలేని బాల రుద్రుడిలా తనను తాకిన వీడి హస్తముద్ర తనకెంతో సాంత్వన కలిగించిన మాట నిజం!’
అనుకొంటూ అపురూపంగా చూశాడా పిల్లాడివైపు.
‘ఆనాడు… మందు మత్తులో వాళ్ళమ్మకు మందివ్వని మా గొప్ప వైద్యుడు తను! తండ్రిలేని పిల్లాడు, తల్లినైనా బ్రతికించుకుందామని… ఎంతో ఆత్రంగా ఆ జోరువానాలో తన దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ… తను… విసుగును దాచుకున్న నటనతో చెప్పిన తన మాయమాటలు నమ్మి, ఆ నమ్మకంతోనే తన తల్లియందు ఆరోగ్య దేవతను దర్శించుకున్న అదృష్టవంతుడు!
ఆర్ద్రతా హృదయంతో అనుకున్నాడు డా. రాజారాం.
అంతలోనే….
“రాజా…. మొన్నటి శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ నుండి నా మొబైల్ కు ఫార్ వర్డ్ చేశారు. నీకు కరోనా నెగెటివ్ వచ్చింది కంగ్రాట్స్ రా!”
సాటి డాక్టర్ మిత్రుడి మాటలతో…. అణువణువునా ఆనంద స్పందన కలిగింది రాజారాంలో, ఆప్యాయంగా శీనుగాడివైపు చూశాడు.
“నీ విశ్వాసంతో, నీ స్పర్శతో నన్ను స్వస్తుణ్ని చేసిన బాల ధన్వంతరివి నీవు శీనూ…. నా వృత్తి ధర్మంలోని పరమార్థాన్నెరిగించిన బాల గురుడవు కూడా నీవే! నీకు నా జోహార్లు శ్రీనివాసా!”
అంటూ పశ్చాత్తాపంతో కూడిన బాధానందాశ్రువులతో వాడి సింధూరం చేతుల్ని పూజా పుష్పల్లా కళ్ళకద్దుకున్నాడు డాక్టర్ రాజారాం.
నింగి అంచులదాకా అంచెలంచెలుగా…
ఆకాశపు చేలాంచలాన్నే అందుకోవాలని,
ముద్దు ముద్దుగా తన పాదముద్రలనే..
సముద్రపులోతుల్లోన ముద్రించాలని,
తనకన్నా ముందేవున్న అవనీతలాన్నంతా..
తన కబంద హస్తాల్లో బంధించాలని,
గగనచర, భూచర, వనచర,జలచరాలన్నీ..
తన అదుపాజ్ఞల్లో చరించాలని,
సృష్టిలోని పంచభూతాలన్నీ..
తన దృష్టిని దాటి పోకూడదని,
విశ్వమందలి అణురేణువునంతా..
మేథో మంత్రంతో, ధనతంత్రంతో…
తన వశవర్తిగా చేసుకోవాలని,
తన దురాశాదురాక్రమణలనెరవేసి…
స్వార్ధపు గాలంతో సాంకేతిక వల విసిరి,
తన వలలోనే పడాలి విశ్వవలయమంతా..
అనుకొంటూ, గొప్ప కలగంటున్నాడు..
కనిపించేది మాత్రమే సత్యమని,
కనిపించనిదంతా అసత్యమని
భావించిన నరుడు.. అతి తెలివిపరుడు..
అన్నీ తెలుసనుకొంటున్న నేటి మానవుడు!
కాలక్రమేణా.. తన ఊహకందని విధివిధానా..
తను పరచిన వలయే తన చుట్టూ వలయమై,
తను వేసిన గాలమే కాలమై తనను లాగినపుడు..
లాగి లెంపకాయ వేసి బోర్లా పడేసినపుడు,
అపుడుగానీ అర్థంకాదీ మేథావికి..
అనంత ప్రకృతిముందు తానెంత?
మృత్యువు కబళించగల తన బ్రతుకెంత?
మహా సముద్రంలో ఓ నీటి బొట్టంతైనా,
ఇసుక రాశిలో ఓ చిన్న రేణువంతైనా,
ప్రళయ ప్రభంజనంలో గడ్డిపోచంతైనా,
కానివాడనని.. అస్వతంత్రుడనని…
ఏ అజ్ఞాతశక్తి చేతిలోనో ఇమిడివున్న వాడనని..
అర్థమయ్యేనాటికే.. అంతా మించిపోయేనని..
మనిషిలోని అజ్ఞానం.. అహంకారం,
మేథోమదం.. ఐశ్వర్యగర్వం,
అధికార దర్పం.. అవినీతి బలం,
కీర్తి కాంక్షలు.. పొగడ్తల వాంఛలు
తనలోని తప్పులన్నీ తననే కాలమై కాటేశాయని,
కాలాతీతమైపోయిందన్న కలవరంతో…
ఆ మనిషి ఆఖరి శ్వాస ఇలా అంటున్నది…
మంచీ మానవత, నీతి నిజాయితి, శాంతీ సహనం,
ప్రేమా త్యాగం వంటి మానవీయ గుణాలే..
అశాశ్వతమైన మానవ జీవితానికవే
శాశ్వతమైన వెలుగునిచ్చే కాంతిమణులని!
నిజమేనంటూ నిష్క్రమించింది మనిషి నిశ్వాస.
కాలింగ్ బెల్ మోతతో తలుపు తీశాడు కార్తీక్. ఎదురుగా మూతికి మాస్క్‌తో, శానిటైజింగ్ చేతులతో, పక్కనే వుంచిన ఓ రెండు బ్యాగులతో కనిపించాడు కార్తీక్ మిత్రుడు రాఘవ.
“రారా రాఘవా చాన్నాళ్లకు బుద్ధి పుట్టింది నీకు!”
మిత్రుణ్ని ఆహ్వానించాడు.
రాఘవ పళ్ళు తీసుకొచ్చే సమయానికి కార్తిక్ భార్య , వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకుకు తల పై తడిబట్ట వేస్తూ వాడిని బుజ్జగిస్తున్నది .
ఏమైందిరా ? అని రాఘవ అడుగుతుంటే , ఉదయం నుండి బాగా జ్వరంగా ఉన్నదిరా అన్నాడు బాధగా కార్తిక్.
“మొన్న ఊరెళ్లాను కార్తీ…. తోటలో బత్తాయిలు, సంత్రాలు తెంపించాడన్నయ్య. నీకు కొన్ని తెచ్చాను.”
“ఈ కరోనా టైమ్ లో ఇమ్యునిటీ ఫ్రూట్స్…. చాలా థ్యాంక్స్ రా!” అంటూ ఆ పళ్ళ బ్యాగులందుకున్నాడు కార్తీక్.
“అమ్మ కనిపించటం లేదురా కార్తీ?” అటూ ఇటూ కలయ చూస్తూ అడిగాడు రాఘవ.
టి.వి.లో కరోనా న్యూస్ వింటూ “ఈ సెకండ్ వేవ్ ముసలోళ్ళ కన్నా వయసు వాళ్లపైనే దాడి చేయడం బాధాకరం రా!” అన్నాడు కార్తీక్.
“అంటే కార్తీక్… ముసలివాళ్ల ప్రాణాలు విలువైనవి కావంటావా?”
“ఎంతైనా కాటికి కాళ్లు చాచుకున్న ముసలోళ్లకన్నా, బాధ్యత, భవిష్యత్తూ వున్న యువత ప్రాణాలు విలువైనవి కద రాఘవా?”
“కాదనటం లేదు…. కానీ పిల్లలను కనిపెంచి పెద్దచేసి, యువతకు దిశా నిర్దేశం చేయగల జ్ఞానసిద్ధులు వృద్ధులు! వారు మమతల కోవెలలు…. గత వైభవాల జ్ఞాపకాలు కదరా పెద్దలంటే!” అన్నాడు స్పందనా స్వరంతో రాఘవ.
“సర్లేరా…. పద భోం చేద్దాం” అంటూ మిత్రుడి చేయందుకున్నాడు కార్తీక్.
“అమ్మ అగుపించడం లేదురా… నేనొస్తే తను బయటికి రాకుండా వుంటుందా? ఒంట్లోగాని బాగా లేదా?”
అంటూ హాల్ కెదురుగానున్న గదిలోకి వెళ్ళి చూశావా రాఘవ.
“కార్తీ…. అమ్మేదిరా ఏమైందిరా?” ఆదుర్దాగా అడిగాడు మళ్లీ.
“ఏం కాలేదుగానీ…. పద భోం చేద్దాం. వడ్డించు పద్మా!” అంటూ భార్యకు చెబుతూ, మిత్రుడి భుజం తట్టాడు కార్తీక్.
“నో… అమ్మను చూడందే… అమ్మను పలకరించందే అన్నం తినను!” సోఫాలో కూర్చుంటూ పట్టుదలగా అన్నాడు రాఘవ.
ఏం మాట్లాడలదు కార్తీక్.
“చెప్పరా అమ్మెక్కడ?” రెట్టించాడు రాఘవ.
“నాన్నమ్మను నాన్న ఓల్టేజ్ హోమ్ కి పంపించాడు!”
కార్తీక్ కూతురు నాలుగేళ్ళ పాప చెప్పింది. ఉలికిపాటుగా చూశాడు రాఘవ.
“కారణం?” కలవరపాటుగా అడిగాడు కార్తీకు నుద్దేశించి.
“అమ్మ తల తిరుగుడే కారణం!”
“అదేంట్రా? ఎంత మంచిది అమ్మ! అంత తల తిరుగుడు పనులేం చేసిందని?”
“పనులు కావురా… రోగం… తల అటూ ఇటూ ఊగుతూ…. అలా…. ఆర్నెల్లయింది!” అదోలా అన్నాడు కార్తీక్.
“అయితే… అంత మాత్రాన…” బాధ రాఘవ గొంతులో.
“ఒరే రాఘవా… అలా ఎప్పుడూ ఆమె తల అడ్డంగా అటూ ఇటూ ఊగుతూ వుంటే, కాదు… కాదు… అంటున్నట్టుగా నాకు నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటే…. భరించలేకపోయేవాడిని!” అసహనంగా అన్నాడు కార్తీక్.
“ఒరే కార్తీక్…. అమ్మ శారీరక వ్యాధి కూడా నీకు…. భరించలేని మానసిక బాధేనా? ఆమె అనారోగ్యాన్ని, బాధనూ కూడా అర్థం చేసుకోలేక వృద్ధాశ్రమం బాట పట్టించిన ఘనుడవు కదరా…..” బాధగా మిత్రుడివైపు చూశాడు.
“ఒరే కార్తీక్…. నీకో సంగతి చెప్పనా?”
“చెప్పరా!” చిన్నగా అన్నాడు కార్తీక్.
“లేక లేక పుట్టిన నిన్ను, మీ నాన్న చేసిన అతిగారాబం నిన్ను మొండివాడిగా మార్చింది! ఏది చెప్పినా ఔనంటే కాదు… కాదంటే ఔనంటూ ప్రతిదానికి తల అడ్డంగా ఆడించేవాడిని గుర్తుందా? నీ చిన్ననాడే మీ నాన్న పోయాక, నీ నెగెటివ్ సమాధానాల భారమంతా అమ్మపైనే పడిందిరా! అమ్మ ఏం చెప్పినా మొండిగా తలటూ ఇటూ ఆడించి సతాయించే నీతో వేగలేకపోయేది. అయినా అన్నీ భరించింది. అప్పట్లో ఒకే ఊళ్ళో, ఒకే స్కూళ్ళో నీతోపాటు చదువుచున్న, అమ్మలేని నన్నెంతో ఆదరించిన ఈ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడేది. నీ స్నేహాన్ని వీడవద్దని వేడుకునేది!”
“రాఘవా!” చిత్రంగా చూశాడు కార్తీక్.
“ఔనా…. అన్నింటికి అడ్డంగా తలాడించే నీ నెగెటివ్ తత్త్వాన్ని ఒంటరిదైన అమ్మెలా సహించిందో…. నిన్ను చదివించి ఇంతవాణ్నెలా చేసిందో…. అమ్మ మాటకు అడుగడుగునా తల అడ్డంగా ఆడించే నీ నెగెటివ్ థాట్స్ ను తన తల్లి తనపు పాజిటివ్ రెక్కలతో నిన్నెలా కాపాడుకున్నదో….. తన ప్రేమతో నిన్నెలా ఓ మనిషిని చేసిందో…. ఆ మాతృమమతనెలా మరచిపోయావురా?”
“ నీ కొడుకు కు జ్వరం వచ్చినట్లే నీకెన్నిసార్లు వచ్చుంటుందో జ్వరం నీ చిన్నప్పుడు “
కంటి చెమరింతతో రాఘవ కంఠం వణికింది.
“రాఘవా!” కార్తీక్ కళ్ళలో పశ్చత్తాపంతో కూడిన తడి కదలాడింది.
“చెప్పరా కార్తీ…. చిన్న నాటి నుండి నీ మనసుకున్న ఇగోతో, నీ నెగెటివ్ తత్త్వంతో…. ఎన్ని వేలసార్లు తల అడ్డంగా ఆడించేవాడివో…. అయినా ఆ తల్లి ఒడి నీకు ఓ బడిగా, గుడిగా ఎలా మారిందో…. ఎన్నడైనా ఆలోచించావా? అదే…. అదేరా అమ్మతనమంటే!” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవ.
ఆలోచనతో కూడిన ఆవేదనతో తలొంచుకున్నాడు కార్తీక్.
“కార్తీ…. ఆఖరుగా ఒక్క మాటరా…. రోగ్రగస్థురాలైన అమ్మ తల ప్రకంపనలనే భరించలేనివాడివి…. నీకు జన్మనిచ్చిన్నాడు అమ్మ ప్రసవ వేదనలో ఎన్ని వందల కాదు కాదు వేనవేల బాధా ప్రకంపనల బరువును ఆ తల్లి ఎలా భరించి వుంటుందో ఒక్కసారైనా ఊహించలేవా?”
“అమ్మా!” అంటూ అప్రయత్నంగా ఒక ఆర్థ్రతా పూరితమైన బాధా ప్రకంపనలతో కూడిన ఓ పిలుపు వెలువడింది కార్తీక్ నోటి వెంట.
“అమ్మతనమంటే ఏంటో అర్థమైందిరా! ధన్యవాదాలు రాఘవా…. పద… అమ్మను ఆశ్రమం నుండి తీసుకొద్దాం!” ఆగని కన్నీళ్ళతో అన్నాడు కార్తీక్.
- కె.వీణారెడ్డి
‘‘మొన్న రాత్రి మనం ఫంక్షన్ నుండొచ్చిన తర్వాత ఈ టేబుల్ సొరుగులో పెట్టిన నీ చేతి బ్రాస్లెట్ కనిపించడం లేదు ఏమైంది నాన్నా?’’
పలుకలేదు వరుణ్.
‘‘లాకర్లో పెడదామని చూస్తే లేదు. ఎంత వెతికినా దొరకలేదు.. ఒక్క రోజులోనే ఇంత మటుమాయమా?’’
‘‘ఇంకెక్కడో పెట్టి మర్చిపోయుంటావ్…. మళ్ళీ జాగ్రత్తగా వెతుకు సంధ్యా’’ అన్నాడు భార్యతో… ఎప్పుడూ బిజినెస్‌తో బిజీగా
వుండే కోటీశ్వరుడు, నగరంలో పేరైన వ్యాపారవేత్త ప్రకాశరావు.
‘‘లేదండీ… ఈ ర్యాక్‌లోనే ఉంచాను’’ నిర్ధారణగా అంది సంధ్య.
‘‘మరోసారి సరిగా వెతుకు’’ అంటూ హాల్లో కెళ్ళాడాయన.
మేడమీది నుండి ఆయన దృష్టి వీధి గేటువైపు మళ్ళింది.
ఎదురింటి రాజయ్య తన కొడుకుతోపాటు గేటుముందు నిలుచుండడం గమనించి లోపలికి పిలిచాడు.
‘‘ఏం రాజయ్యా ఇలా వచ్చావ్?’’ అంటూ పకరించాడు.
‘‘ఆయ్యగారూ…’’ మెరుపులా ప్రకాశరావు కాళ్ళమీద పడి భోరున విపించాడు రాజయ్య.
‘‘ఏంటిది రాజయ్యా…’’ కంగారుగా వెనక్కి జరుగుతూ అన్నాడు ప్రకాశరావు.
‘‘మమ్మల్ని మన్నించండయ్యా’’ అంటూ ఓ కవర్ తీసి ఆయన చేతిలో వుంచాడు రాజయ్య.
ఆదుర్దాగా అది తీసి చూశాడు ప్రకాశరావు.
అది… అది… గదిలో తన భార్య వెతుకుతున్న రెండు తులాల బంగారు బ్రాస్లెట్!’’
‘‘ఇది…. ఇది… నీకెలా దొరికింది రాజయ్యా?’’
అదోలా అడిగాడు ప్రకాశరావు.
అందుకు సమాధానంగా, తన కొడుకును ప్రకాశరావు పాదాలమీద పడేశాడు.
‘‘అయ్యగార్ని క్షమించమని అడగరా దౌర్భాగ్యుడా!’’ అన్నాడు బాధగా రాజయ్య.
‘‘నా తప్పు కాయండయ్యగారూ…’’ ఏడుస్తూ అంటున్న శంకర్‌ను లేవనెత్తాడు ప్రకాశరావు.
‘‘ఇంతకూ సంగతేంటి రాజయ్యా?’’
తలొంచుకున్న రాజయ్య పలుకలేదు.
‘‘రాజయ్యా… వరుణ్ కోసం మా ఇంటికొచ్చిన వీడు దీన్ని దొంగిలించాడా?’’
కాస్త కఠినంగానే అన్నాడు ప్రకాశరావు. ఉలిక్కిపడ్డాడు రాజయ్య.
‘‘లేదయ్యా… లేదు… అంతమాటనకండి… కూటికి పేదలమైనా గుణానికి మాత్రం కాదయ్యా…. జరిగిందంతా చెప్తాను!’’
అంటూ అంతా పూసగుచ్చినట్టుగా వివరించసాగాడు రాజయ్య.
*****************************************
‘‘ఒరే శంకర్… ఏమైందిరా? ఎందుకలా వున్నావ్?’’
తోటకూర కాడలా వాడిపోయిన వాడి వదనం, కన్నీటి చారలతో కూడిన శంకర్ చెంపలు చూస్తుంటే వరుణ్‌కు చెప్పలేని బాధ కలిగింది.
‘‘చెప్పరా… ఏం జరిగిందిరా?’’
వాళ్ళ చిన్న డాబా ఇంటిముందున్న వేపచెట్టు మొదట్లో దీనంగా కూర్చున్న తన మిత్రుడు శంకర్ పక్కనే తాను
కూర్చుంటూ అడిగాడు ఆ ఎదురింటి మేడిoటి అబ్బాయి, శంకర్ మిత్రుడు వరుణ్.
‘‘మా గౌరిని మా నాన్న అమ్మేస్తడంటరా వరుణ్!’’
‘‘ఆ!’’ ఊలికిపాటుగా చూశాడు వరుణ్!’’
అవున్రా! ఏడాది నుండి అంటనే వున్నడు మా నాన్న, ఈ కరోనా కరువు కాలం మన బతుకే మనకు బరువైతుంటే ఈ ఆవు
గౌరమ్మనెలా సాకేదిటరా? అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నడురా!’’
అంటు మిత్రుడి భుజంపై తలవాల్చి బావురుమన్నాడు శంకర్.
‘‘ప్లీజ్‌రా ఏడవకు!’’ మిత్రుడి కన్నీళ్ళు తుడిచాడు వరుణ్.
‘‘వరుణ్….గౌరి నాకు ప్రాణంరా! నేను తింటేనే అది తినేది. నిన్న పేరంటం అమ్మ తెచ్చిన అరటిపండు పెడితే…
ఆకలితోటున్నాగాని అది తిన్లేదు. నేను సగం పండు తిన్నంకనే గౌరి తిన్నదిరా!’’
అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు శంకర్.
‘‘ప్లీజ్ శంకూ ఏడ్వద్దు! ఎప్పుడూ జోక్లేస్తూ నవ్వించే నువ్వలా వుంటే నేను చూడలేనురా!’’
అంటూ ప్రేమ నిండిన బాధతో పదేళ్ల వరుణ్, తొమ్మిదేళ్ళ శంకర్‌ను కౌగిలించుకున్నాడు…. తోచిన రీతిలో ఓదార్చాడు. ఆపై,
అంతులేని ఆలోచనతో అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు వరుణ్.
‘అవును… గౌరి గంగిగోవులాంటిదంట! శంకర్‌కు అది ప్రాణం వంటిది. అది లేకుంటే వాడుండగలడా? చదవగలడా? తనతో ఆడగలడా?’
అనుకుంటూ ఎంతగానో ఆలోచించాడు… తెల్లారగానే ఓ నిర్ణయానికొచ్చి స్థిమితపడ్డాడు వరుణ్.
‘‘శంకూ, ఒరే శంకర్’’ అని పిుస్తూ, శంకర్ వాళ్ళ ఇంటి గేటు తెరుచుకొని లోపలికొచ్చాడు వరుణ్.
స్టూల్ పైన నిల్చొని, ఆవు గౌరి వీపును బ్రష్‌తో రుద్దుతున్న శంకర్ దగ్గరకు చేరాడు.
‘‘ఒరే వరుణ్… గౌరి వెళ్ళిపోవడం తప్పదంట కదరా!’’
ఏడుపు నడుమనే గౌరి గంగడోలును ముద్దాడుతూ వణికే కంఠంతో అన్నాడు శంకర్.
‘‘నో… నో… శంకర్… నిన్నొదిలి గౌరి వెళ్ళిపోకూడదు… నువ్వు హాపీగా వుండి నాతో ఆడుకోవాలంటే, గౌరి నీతోనే వుండాలి!’’
‘‘అదెట్లా?’’
‘‘అది… అది… ఇట్లా… ఇదిగో ఇది మీ నాన్నకివ్వు! గౌరినమ్మకుండా దీన్నమ్మితే, గౌరి తిండికి సరిపడా డబ్బులొస్తాయి!’’
అంటూ ఉత్సాహంగా ఓ కవరు తీసి శంకర్ షర్ట్ జేబులో వుంచాడు వరుణ్! సంకోచంగా చూశాడు శంకర్.
‘‘ఇది నాదేలేరా!’’ అంటూ శంకర్ భుజం తట్టాడు వరుణ్.
‘‘అయితే వరుణ్…. దీంతో నా గౌరమ్మ తల్లి నాతోనే వుంటదా? నాతోనే తింటదా? నాకు జరమొచ్చి పడుకుంటే ప్రేమగా నా ఒళ్ళంతా నాకుతదా?
సంభ్రమంతో కూడిన అపురూప భావంతో, ఆ కవర్‌ను జేబుపై నుండే గుండెకు హత్తుకున్నాడు…. ఆనందంగా గౌరినీ
వరుణ్నీ కలిపి కౌగిలించుకొని కోటి సుద్దుతో కూడిన ముద్దులెన్నో పెట్టుకున్నాడు శంకర్.
*****************************************రాజయ్య చెప్పిందంతా కళ్ళతో కన్నట్టుగానే చెవులతో విన్నాడు ప్రకాశరావు.
‘‘వరుణ్’’ అంటూ కొడుకును కేకేశాడు.
అందరూ భయపడ్డారు కొడుకునేం చేస్తాడోనని! భయం భయంగా తండ్రి దగ్గరకొచ్చాడు వరుణ్.
‘‘సారీ నాన్నా!’’ ఏడుస్తూ తండ్రి కాళ్ళకు చుట్టుకు పోయాడు.
‘‘లే…. నాన్నా…లే!’’ అంటూ కొడుకును లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు.
ఆపై అదే సందిటికి శంకర్‌ను కూడా చేరబిలిచాడు ప్రకాశరావు.
‘‘రాజయ్యా… సృష్టిలో తీయనిది స్నేహమని అంటారు. అది నిజమేనని… ఎల్లలులేని తన స్నేహ ధర్మాన్ని నిరూపించాడు
మా పిల్లవాడు! గోమాతను తల్లిలా భావించి, దానికి దూరం కాలేక తల్లడిల్లిపోయిన మీపిల్లవాడెంత జంతు ప్రేమికుడో నా
కళ్లక్కట్టింది రాజయ్యా… దయకు మించిన ధర్మం లేదని మీవాడు, స్నేహానికి మించిన సిరిసంపదల్లేవని మా వాడు…
తమ తమ ధర్మాల మర్మాు విప్పి చెప్పారు!’’
అంటూ చెమరించిన కళ్ళద్దుకున్నాడు ప్రకాశరావు.
‘‘అయ్యగారూ….’’ ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య.
‘‘రాజయ్యా… మన సంస్కృతిలో గోవుకున్న విలువను ఈ చిన్న పిల్లలు తెలియజేశారు. గోమాత అణువణువు
అమృతప్రాయమని, గోసంబంధిత ప్రతి అంశం అమూల్యమైనదని… శాస్త్రవేత్తలు సైతం నిరూపించిన నిజం. ఎన్ని అనారోగ్యాల
పాలౌతున్నా కూడా జనం ఆ నిజం గుర్తించడం లేదు.
ఇంతెందుకు… పురిట్లోనే తల్లిపోయిన నేను చిన్న నాటి నుండి… మా పల్లెలోనే గోవు తల్లి పాలతోనే పెరిగానన్న సంగతి
ఇప్పుడీ బాలజ్ఞానుల వల్లనే గ్రహించగలిగాను!’’
సన్నగా కంపించింది ప్రకాశరావు స్వరం.
‘‘అయ్యా…!’’ అయోమయంగా చూశాడు రాజయ్య.
‘‘ఎందుకంటే ప్రస్తుతానికి పదీ పాతిక దాకా దేశవాళీ గోవుల్ని కొందాం ఓ గోశాలను నడిపిద్దాం!’’
‘’అయ్యగారూ…’’ రాజయ్య కళ్ళ నుండి ఆనందబిందువులు రాలిపడ్డాయి.
‘‘అంతేకాదు రాజయ్యా… గోవుల్ని కబేళాకు తరలించే పాపపు పనినాపివేసే పనిలో పాల్గొందాం! కడదాకా కాడీకవ్వాలనాడిoపజేసే మన పాలతల్లిని…. జాతి సౌభాగ్యవల్లిని… మన గోమాతను కాపాడుకుందాం! సేంద్రియ ఎరువు పంటతో దేశ
ఆరోగ్య సంపదను సంరక్షించుకుందాం!’’
దృఢచిత్తంతో అంటూ… గోడుకున్న గోవిందుడి చెంతనున్న గోమాత పటానికి దండం పెట్టాడు ప్రకాశరావు!
అదంతా గమనించిన వరుణ్, శంకర్ ఆనందంతో కేరింతలు కొట్టగా…. ఆ శబ్దం విన్న గోవు గౌరి… అందుకు జవాబుగా
‘‘అంబా’’
అని అరవటంతో, ఆవు ఆశీర్వాదం పలికినట్టనిపించింది అక్కడున్న అందరికీ!
-కె.వీణారెడ్డి,
రచయిత్రి – కవయిత్రి
కథా సంపుటులు: కథావిపంచి-1, జీవన్మణులు,
కథావిపంచి-2, నిశాంత కాంతులు!
బిరుదులు: సాహితీ సామాజిక వేత్త,
మహిళా సేవారత్న!
+91-7337058025