మహాభారతం..
దాయాదుల నడుమ పోరు చరితం
ధర్మ బద్ధుల జూద క్రీడలో
పాచికల ప్రహసనం
వ్యసన బలహీనతకు బలియైన
పరాక్రమ సింగాల పరిహాసం
‘అన్న’ మాటకు కట్టుబడి
అరణ్యవాసం.. అజ్ఞాతవాసం
అంతా శకుని తలపోసిన
భారతం!
శ్రీమద్రామాయణం..
కైకేయి వర చరితం కాదా!
ఒకవేళ..
రాముడు మందర గురించి
ముందే ఆలోచించి ఉంటే
రావణ వధ అయ్యేదా?
శూర్పణఖ ముక్కు చెవులు
కోసి ఉండక పోతే
ప్రాణమున్న బంగారు జింక
ఉండదని తెలిస్తే
సీతాపహరణం జరిగేదా?
హనుమ తోకకు నిప్పంటించకుంటే
లంకాదహనం జరిగేదా?
మాటకు కట్టుబడితే..
జరిగే పరిణామాలు
రామాయణ మహాభారతాలే!
పురాణాలైనా, ఇతిహాసాలైనా
గుర్తుండి పోయేలా ఘోషించినవి
యుద్ధాలేనా?
శత్రువును ఛేదించడానికి పన్నిన
వ్యూహ ప్రతివ్యూహాలేనా?
సబలలను అబలలుగా చిత్రించడమా?
అంతిమ ఫలితం..
దుష్ట శిక్షణ శిష్ట రక్షణా?
మరుభూమిగా మారిన పిదప
సత్యం జయిస్తే ఒరిగే లాభమేమీ?
పాలకుల కుటుంబాల నడుమ
చెలరేగిన కక్ష్యలు, కార్పణ్యాలు
పాలితులకు శాపంగా మారాలా?
దేనికి ఏది అవసరం
ఏది ముందు ఏది వెనక?
శాసనంతో అనుశాసనమా
అనుశాసనానికి శాసనమా?
నడిచిన దారులు
కాలం విడిచిన కుబుసాలు
ఎవరో శాసించింది కాదు
దానికదే జరిగితే చరిత్ర.
అలాంటప్పుడు
కాలాన్ని వెనక్కి మళ్లించాలా?
చరిత్రను తిప్పి రాయాలా?
– ఆచార్య కడారు వీరారెడ్డి; 9392447007