*ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విశ్లేషకులు డా. జి. చెన్నకేశవరెడ్డి గారితో ‘మయూఖ’ ముఖాముఖి -ధూళిపాళ అరుణ*
********************************************
నిరంతరాన్వేషణతో అనేక పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా సాహిత్యలోకానికి సుపరిచితులైన డా. జి. చెన్నకేశవరెడ్డి గారి జీవన యాత్రను, వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్! మీ వ్యక్తిత్వ, సాహిత్య జీవన విశేషాలను మా పాఠకులకు తెలియజేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది…మొదటగా….
1ప్ర. అత్యంత సాహిత్యాభిలాష కలిగిన మీరు జన్మించిన
ప్రాంతం ఏది? బాల్య జీవితాన్ని ఏ విధంగా గడిపారు? ఆ విశేషాలను చెప్తారా?
జ: నమస్కారం! నేను విద్వద్గద్వాలగా ప్రసిద్ధి చెందిన గద్వాలలో 1945 ఏప్రిల్ 7వ తేదీన జన్మించాను. మా అమ్మ రంగనాయకమ్మ, నాన్న తిమ్మారెడ్డి. చిన్నతనం నుండీ గద్వాల సాహిత్య వాతావరణంలో పెరిగాను. నేను అయిదవ తరగతి చదివేటప్పుడు డా. సి. నారాయణరెడ్డి గారు హైస్కూలుకు వచ్చారు. అప్పుడాయన తన నోట్ బుక్ లో రాసుకున్న ‘నాగార్జునసాగరం’ కవితాగానం చేశారు. అది నన్ను ఆ వయస్సులోనే ఎంతో ప్రభావితుని చేసింది. మా ఊరి లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ చదివాను. మొదట మా అక్కయ్య కొరకు తెచ్చే డిటెక్టివ్ నవలలను నేనూ చదివేవాడిని (గట్టిగా నవ్వుతూ). మా నాన్న తరతరాల వారసత్వంలో మాలీపటేల్ గిరీ చేసేవాడు. గద్వాల ఊరే కాక చుట్టుపక్కల ఏడు ఊళ్ళల్లో కూడా మా పూర్వీకులు పటేల్ గిరీ చేశారు. మా నాన్న పంచాయతీ తీర్పులు బాగా ఇస్తాడని ప్రసిద్ధి ఉండేది. అందువల్ల బండ్లు కట్టుకొని పక్కన ఊళ్ళల్లో నుండి కూడా సమస్యల తీర్పు కోసం మా నాన్న దగ్గరికి వచ్చేవారు. ఆయన చదువుకున్నది 7వ తరగతి వరకే అయినా ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు ఆయనకు బాగా వచ్చు. మేము ఏడుగురం సంతానం. అందులో అయిదవ వాడిని కావడం వలన నాకు అన్నలు, అక్క, తమ్ముడు, చెల్లెలు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను. తదనంతర కాలంలో సినారె గారు నామీద అభిమానంతో ‘కర్పూర వసంత రాయలు’ కావ్యగానానికి అంగీకరించి గద్వాలకు రావడం జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది.
2ప్ర. ప్రాథమిక విద్య నుండి మొదలుకొని వివిధ దశల్లో జరిగిన మీ పూర్తి విద్యార్జనను గురించి చెప్పండి.
జ: మా ఇద్దరన్నలు హెచ్.ఎస్.సి స్కూల్ ఫైనల్ వరకు చదివారు. మా మూడో అన్న ఎఫ్.ఏ వరకు రెడ్డి హాస్టల్ లో ఉండి నిజాం కాలేజీలో చదివారు. ఆ కాలంలో ఆ చదువుకు ఉద్యోగాలు కూడా వచ్చేవి. మాకు రెండువందల ఎకరాల భూమి ఉండేది. పెద్ద వ్యవసాయ కుటుంబం. అందువల్ల ఒకరి కింద పని చేయడానికి ఒప్పుకునేవారు కారు. “ఉత్తం ఖేతి, మధ్యం బేపారే, కనిష్టం చాకిరీ” అంటారు కదా!(నవ్వుతూ) అందుకే మా అన్నయ్యలు ఇండిపెండెంట్ లైఫ్ కోరుకున్నారు. అంత చదువుకున్న మూడవ అన్నయ్య కూడా వ్యవసాయం వైపే మొగ్గు చూపాడు. దానివల్ల మా నాన్నకు నన్ను బాగా చదివించాలనే కోరిక పెరిగింది. చదువులో ముందే ఉన్నప్పటికీ గేరి(వాడ)లో పిల్లలతో ఎక్కువగా ఆటలు ఆడుతుండేవాడిని. ఓసారి మా నాన్న నేను పనికిరాకుండా పోతాననే భయంతో ‘కోదండం’ కూడా వేయించాడు. అంతేకాదు. నన్ను హైదరాబాద్ లో చదివించాలని నిర్ణయం చేసుకున్నాడు. అక్కడ గ్రామర్ హైస్కూల్లో 6వతరగతిలో చేర్పించాలనుకున్నాడు కానీ ఉపాధ్యాయుల ఉచ్చారణ నాకు అర్థం కాకపోయేది. ఆల్ సెయింట్స్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఆ బిల్డింగ్, అక్కడి ‘నన్స్’ వేషధారణను చూసి భయపడ్డాను. అందుకే అక్కడ చదవలేదు. అకడమిక్ ఇయర్ మధ్యలో కాబట్టి గద్వాలలో చేర్చుకోలేదు. ఆరు నెలలు గద్వాల పక్కనే ఉన్న ఆత్మకూరులో మేనమామ గారింట్లో చదువుకొని తరువాత గద్వాల చేరి పియుసి వరకు అక్కడే చదివాను. రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్ చదివి నేను కూడా మా నాన్న కోరికను నెరవేర్చక నిరాశ పరిచాను (విచారంగా). ఇప్పటికీ తలచుకుంటే బాధగా ఉంటుంది. తెలుగు చదవాలని, నారాయణరెడ్డి గారి దగ్గర శిష్యరికం చేయాలని , ఆయనంతటి వాడిని కావాలని నా కోరిక. యూనివర్సిటీలో నాకంటే సీనియర్ పి. నర్సింహారెడ్డి అని ఉండేవాడు. ఆయన సినారె గారి క్లాసులు ఉండే సమయాన్ని నాకు చెప్పేవాడు. నా ఇంజినీరింగ్ క్లాసులు వదిలేసి ఆ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. ఆయనకు ప్రత్యక్ష శిష్యుడిని కావాలని బిఏ తెలుగులో చేరాను. అమ్మంగి వేణుగోపాల్, వేలూరు సాయిబాబా, వీరితో పాటు మరో ఇద్దరు నాకు స్నేహితులుగా ఉండేవారు. సినారె గారితో పాటు చలమచర్ల రంగాచార్యులు గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, పాటిబండ మాధవశర్మ గారు, బిరుదురాజు రామరాజు గారు ఇట్లా హేమాహేమీలందరూ గురువులయ్యారు. తరువాత ఎమ్ ఏ లో చేరాను. నాతో పాటు నా మిత్రులలో అమ్మంగి వేణుగోపాల్ ఒక్కడే చేరాడు. దివాకర్ల వెంకటావధాని గారి కూతుళ్లు గాయత్రి, రాజేశ్వరి కూడా మాకు క్లాస్ మేట్స్.

3ప్ర. సాహిత్యరంగంలో మీ మొదటి అడుగు పడిన చోటు ఎక్కడో వివరిస్తూ, మీలో సాహితీ కాంక్షను ప్రేరేపించిన విధానం ఏమిటో తెలపండి.
జ: మా అమ్మ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేది. నా చెవిలో ఆ శ్లోకాలు వినబడుతుండేవి. వాటివల్ల దేవాలయంలో జరిగిన భగవద్గీత పోటీలో ప్రైజ్ వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అయిదవ తరగతిలో సినారె గారి కవితాగానం నన్ను అబ్బురపరచి కవిత్వం అంటే ఇట్లా ఉండాలి అన్న భావన దృఢమైంది. 8వ తరగతిలో హిందీ కవిత ‘పథిక్’ను ‘పథికుడు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. హిందీ టీచర్ ఎంతో మెచ్చుకుని మిగతా టీచర్లకు కూడా చూపించి, అప్పటినుండి ‘బాలకవి’ అని పిలవడం మొదలుపెట్టాడు. తెలుగు టీచరు లక్ష్మణాచారి గారు పండితుడు. ఆయన మంచి కంఠంతో రాగయుక్తంగా వసుచరిత్ర పద్యాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఒకసారి స్కూల్లో అవధానం పెట్టించారు. అది కూడా నన్ను బాగా ప్రభావితం చేసింది. పియుసి లో ఫస్ట్ బ్యాచ్ మాది. అందులో మొదటి రూల్ నెంబర్ నాదే. అందుకే మొదటి విద్యార్థిని కూడా నేనే(నవ్వుతూ). మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. రెండవ సంవత్సరం మళ్లీ పరీక్షకు కట్టి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. భాషా నిలయంలో గానీ, ఎక్కడ కవిసమ్మేళనాలు జరిగినా గానీ హాజరయ్యేవాడిని. ఉత్పల సత్యనారాయణాచార్య గారు, దివాకర్ల వారు మొదలగు పండితులు వచ్చేవారు. మల్లాది సూర్యనారాయణ మూర్తిగారు హంపీ ఎక్స్ కర్షన్ తీసుకెళ్లారు. కృష్ణదేవరాయల సాహితీ వైభవంతో విలసిల్లిన ప్రాంతం కాబట్టి అది కూడా నాకు ప్రేరణ కలిగించింది..ఇట్లా నా జీవితంలోని అనేక సంఘటనలు నాలో సాహిత్య కాంక్షను పెంచుతూ వచ్చాయి. నేను బిఏ చదువుతున్నప్పుడు కేశవపంతుల నర్సింహశాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు రేడియో ప్రోగ్రాం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ మీద పాశం చెన్నకేశవరెడ్డి అని రాశాను. అది చూసి ‘మీది ఏ ఊరు?’ అని అడిగారు. నేను గద్వాల అని చెప్పాను. “మీ ఊరు వాడేనయ్యా కొత్వాల్ (రాజా బహదూర్) వెంకటరామారెడ్డి. మీ వంశం వాడు కూడా” అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ విషయం మా ఊరికి పోయినప్పుడు మా నాన్నగారిని అడిగాను. ఆయన మా ఇంటి ఎదుట ఉన్న ఇల్లు చూపించి ఇదే ఆయన ఇల్లు అని చెప్పారు. అంతటి గొప్పవాడు మా వంశీయుడు కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కొత్వాల్ వెంకట రామారెడ్డి శతజయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో నన్ను సత్కరిస్తూ సినారె గారు ‘పాశం ఇంటి వారి మొలక’ అని పేర్కొనడం ఎప్పటికీ మరిచిపోలేను. అదే నా మొదటి సత్కారం. బి ఏ సెకండియర్ లో ఉన్నప్పుడు తెలుగు శాఖకు సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. సాహిత్య సప్తాహం పేరుతో ఏడు రోజులు కార్యక్రమాలు నిర్వహించాను. ఫైనల్ ఇయర్ లో కూడా నన్నే నియమించారు. గద్వాల కాలేజీ వాళ్ళు కూడా పిలిచేవారు. భాస్కరభట్ల కృష్ణారావు, యశోదారెడ్డి మొదలైన సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉండేది.
నంద్యాల అనంత రాఘవాచారి గారని జమ్మిచేడు. జమీందారు దగ్గర ఆస్థాన పండితుడు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడే ఆయన దగ్గరకు వెళ్లి రఘువంశం, కుమార సంభవ కావ్యాలు, శబ్దమంజరి నేర్చుకున్నాను. అమరకోశం చదివాను కానీ నాకు రాలేదు. “అమరం నా నోటికమరలేదు”(బిగ్గరగా నవ్వుతూ). లక్ష్మణాచారి గారి వల్ల చిత్తూరు వారి సంస్కృత పరీక్షలు పరిచయ, అభిజ్ఞ, కోవిద పాసయ్యాను. ఆయన చెప్పని పేపరును కూడా బాగా రాయడంతో విద్యార్థులకు ఆ పేపరు చదివి వినిపించారు. అట్లా సంస్కృతం కూడా నేర్చుకోవడం జరిగింది.
4ప్ర. మీ వచన కవిత మొట్టమొదటగా ‘జ్యోతిర్మయి’ పత్రికలో ప్రచురించబడిందని విన్నాం. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ ఆ పత్రికతో మీ అనుబంధాన్ని వివరించండి.
జ: ఎస్వీ రామారావు గారు పి హెచ్ డి చేస్తున్నప్పుడు హాస్టల్ లో ఉండేవారు. మహబూబ్ నగర్ జిల్లాలో ‘జ్యోతిర్మయి’ అనే సాహిత్య సంస్థను స్థాపించారు. గద్వాలకు నన్ను ప్రతినిధిగా నియమించారు. గద్వాలలోని పెద్ద పెద్ద వర్తకులంతా మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆ సంస్థ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. ‘జ్యోతిర్మయి’ పత్రిక ద్వారా మొదటగా జిల్లా కవితా సంకలనం ప్రచురించబడింది. అందులో ‘కాంతిచక్రం’ అనే నా కవిత అచ్చయింది. ఆ సంకలనానికి సినారె గారు ముందు మాట రాశారు. ‘జ్యోతిర్మయి’ ద్వితీయ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ మా గద్వాలలో జరగడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
5ప్ర. మాత్రా ఛందస్సు, గేయ ఛందస్సుల మీద పరిశోధన చేయడానికి ప్రోత్సాహం ఎవరినుండి లభించింది?
జ: మొదట నేను మార్క్సిజమ్ మీద పరిశోధన చేయాలనుకున్నాను. సినారె గారు నన్ను మాత్రాఛందస్సు మీద చేయమన్నారు. నేను వారి రచనల మీద చేస్తానన్నాను. అట్లా కాదని గేయ కవిత్వం మీద చేయమని సలహా ఇచ్చారు. గేయ కవిత్వం ప్రధానంగా గతి ప్రధానమైనది. అక్షర ఛందస్సు, మాత్రాగణ ఛందస్సు, మాత్రా ఛందస్సు అని ఛందస్సు మూడువిధాలు. మాత్రా ఛందస్సులో త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులుగా ఉంటుంది. తొమ్మిది మాత్రలతో కూడా ఉంటుంది కానీ దాన్ని ఎవరూ రాయరు.
6. ‘ఆధునికాంధ్ర గేయకవిత్వం’పై మీరు చేసిన పరిశోధన గురించి వివరించండి.
జ: సినారె గారు సూచించిన ప్రకారం నేను గేయ కవిత్వం మీద పరిశోధన చేయడానికి పూనుకున్నాను. గేయం గాన ప్రధానమైనది. లయబద్ధంగా భావం పూర్తవడమే గేయ ప్రధాన లక్షణం. నా పరిశోధన గ్రంథంలో గేయలక్షణం, గేయ వికాసం, ఆధునిక యుగారంభం- గేయావతరణం, భావకవిత్వ యుగం- గేయరచనలు, అభ్యుదయ కవిత్వ యుగం- గేయ రచనల గురించి వివరించాను. గేయ కవుల గేయ ఛందస్సుల విశిష్టతలను వివరించాను. ఆధునికాంధ్ర గేయ కవిత్వాన్ని మొత్తం ఇందులో వివరణాత్మకంగా తెలిపాను. ఉస్మానియాలో ఈ ప్రక్రియ మీద పరిశోధన చేసిన తొలి పరిశోధకుడిగా గౌరవం పొందాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో గేయం ఎంత ప్రాధాన్యత పోషించిందో దానికి సంబంధించిన విశ్లేషణ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా వస్తువు, ఛందస్సు ఈ రెండింటిని ప్రధానంగా చేసుకొని పరిశోధన చేశాను.
7ప్ర. అప్పటికీ, ఇప్పటికీ గేయ సాహిత్యంలో వచ్చిన, వస్తున్న మార్పులెటువంటివి?
జ: నిజానికి గేయ మూలాలు ప్రాకృత గాథా సప్తశతి కాలానికి సంబంధించినవి. పరిశోధన గ్రంథంలో కూడా నేను దీన్ని ప్రతిపాదించాను. ఎందుకంటే వీటిలో తెలుగు మాటలు కనిపిస్తాయి. శాసనాల్లో కూడా గేయ ప్రస్తావనలు మనం గమనించవచ్చు. సీస పద్యం కూడా గేయ ఛందస్సు నుండి పుట్టినదే. గేయ రూపమైన మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యం కంటే చాలా గొప్పది. మొదటి గేయకావ్యం ‘పలనాటి వీరచరిత్ర’ అయితే ఆధునిక కాలంలో గురజాడ ప్రథమ గేయకవిగా చెప్పవచ్చు. శ్రీశ్రీ లో గురజాడ ప్రభావం కనిపిస్తుంది. తరువాత కవులు దీనిని అనుసరించారు. నారాయణ రెడ్డి గారు గేయ కావ్యాలను రాశారు. అభ్యుదయ విప్లవ కవిత్వాలలో కూడా కవులు గేయ రచనలు చేశారు. తరువాత వచ్చిన వచన కవితా ప్రక్రియ, ఛందస్సును వదిలివేసే దిశగా సాగుతూ వచ్చింది. అయినా ఆధునిక కాలంలో కూడా గేయ సాహిత్యం పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. సినిమా పాటలన్నీ మాత్రా ఛందస్సులే కదా! గేయం ధ్వని ప్రధానంగా సాగుతూ విషయం సూటిగా హృదయాన్ని తాకుతుంది.

8ప్ర. “జయమిత్ర” అనే పేరు తో సాహిత్య సాంస్కృతిక వేదికను స్థాపించడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ ద్వారా మీరు నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?
జ: అది చాలా విచిత్రంగా జరిగింది. నేను, నా స్నేహితుడు అమ్మంగి వేణుగోపాల్ మా సిద్ధాంత వ్యాస గ్రంథాలకు ఏ పబ్లికేషన్ పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వేణుగోపాల్ భార్య పేరు విజయలక్ష్మి, నా భార్య పేరు సుమిత్ర. వారి పేర్లలోని ముందు అక్షరం తీసేసి ‘జయమిత్ర పబ్లికేషన్’ అని పెట్టాను. నా తొలి పుస్తకావిష్కరణ (సిద్ధాంత గ్రంథం) జయమిత్ర వేదిక మీద జరిగింది. అదే సమయంలో నా మిత్రుడు వేణుగోపాల్ తన సిద్ధాంత గ్రంథాన్ని నాకు అంకితమిచ్చాడు. ఒకే వేదిక మీద పుస్తకావిష్కరణ, అంకితం తీసుకోవడం నా అదృష్టం. అదే రోజున రాత్రి జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అనే పేరుతో సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మిత్రులు సూచించారు. స్థానికంగా ఉండేవాడిని కాబట్టి నా అధ్యక్షతన సంస్థ ఏర్పడింది. ఉపాధ్యక్షునిగా నోముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వేణు సంకోజ్ నియమితులయ్యారు. దీని తరఫున వందలాది సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. అనేక పుస్తకాలను, అనువాదాలను ప్రచురించాం. సాహితీ ప్రముఖులను ఆహ్వానించి సాహిత్యోపన్యాసాలు ఇప్పించాం. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు బి.రామకృష్ణారెడ్డి గారు, కూరెళ్ల విఠలాచార్య గారు, శ్రీమతి ఉమా మహేశ్వరి గారు నారా కొండప్ప గారలను గౌరవ పూర్వకంగా సత్కరించాం. నా పుట్టినరోజు సందర్భంగా నా పేరు మీద ఈ సంస్థ ద్వారానే అవార్డు ఇస్తున్నాం. రాజకీయ నాయకులు లేకుండా ఉన్నతమైన కార్యక్రమాలు జరుపుతున్న సంస్థగా పేరు గడించడం మాకు గర్వకారణం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నేను నా సిద్ధాంతగ్రంథం ప్రూఫులు చూస్తున్న సమయంలో అమెరికాలో ఉన్న నా డాక్టర్ మిత్రుడు ఉత్తరం రాస్తూ ఇప్పుడేం చేస్తున్నావని అడిగారు. ప్రూఫుల విషయం చెప్పాను. వెంటనే 15 వేల రూపాయలు విలువచేసే డాలర్లు పంపించాడు. నేను ఆశించింది కాదు. నా స్థితిగతులకు కొదువలేదు. ఇదేదో నా గొప్ప తెలియజేయడం కోసం చెప్తున్నది కాదు. ప్రేమ, స్నేహం ఎట్లా ఉంటాయో చెప్తున్నా. ఈ కాలంలో అవి కొరవడ్డాయి. వేణుగోపాల్ , నేను ఇంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉన్నాం. కారణం ఆ ఆత్మీయతే. అమ్మంగి వేణుగోపాల్ మొదటి పద్యకవి. నేనాయను వచనకవిత్వం వైపు తిప్పాను. మా స్నేహానికి గుర్తుగా తన సిద్ధాంత గ్రంథం ‘నవలా రచయిత గోపీచంద్’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. అమ్మంగి వేణుగోపాల్ తో అర్థశతాబ్ది స్నేహానికి గుర్తుగా నా విమర్శన వ్యాసాల సంపుటి ‘అక్షరన్యాసం ‘అంకిత మిచ్చాను. ఈ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు విమర్శనరంగంలో సాహిత్య పురస్కారం ఇచ్చారు.
9ప్ర. ఉత్పల సత్యనారాయణ గారితో మీ అనుబంధాన్ని చెప్పండి.
జ: ఉత్పల సత్యనారాయణ కూడా నాకు సన్మిత్రుడు. ఆయన రచించిన “ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు” కావ్యానికి తొలి శ్రోతనైన భాగ్యవశాన నా చేత పీఠిక రాయించుకోవడం గొప్ప విషయం. ఇద్దరు ఆస్థాన కవులు విశ్వనాథ, దాశరథి రాసినప్పటికీ నా చేత పీఠిక రాయించుకొన్నందువల్ల నేనాయన హృదయాస్దాన కవినయ్యాను. తర్వాత కూడా తన యుగళ గీతం గ్రంథానికి పీఠిక రాయించుకొన్నాడు. 2005 రసమయి సంస్థ అధ్యక్షుడు ఎన్. కె రాము గారు తలపెట్టిన నా షష్టిపూర్తి కార్యక్రమాన్ని మా గురువు నారాయణరెడ్డి గారు తాను అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణా సారస్వత పరిషత్తులో ఎంతో ప్రేమతో తన ఆధ్వర్యంలో జరిపించారు. అది ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన. ఈ సందర్భంలోనే సత్కవి, సహృదయుడు ఉత్పల సత్యనారాయణ చార్య గారు తన పద్య కృతి ‘శైవలినీ రాగాలు ఉత్పలినీ పరాగాలు ‘అంకితమిచ్చాడు. అది నా అదృష్టం.
10ప్ర. తెలుగు అకాడెమీలోను, తెలుగు విశ్వ విద్యాలయంలో మీరు నిర్వహించిన పదవుల అనుభవాలు ఎటువంటివి?
జ: ఎమ్ ఏ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. మహబూబ్ నగర్ ఎమ్.వి.ఎస్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. మూడు వారాలు తిరగక ముందే తెలుగు అకాడమీలో ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ వచ్చింది. కనీసం నేను అప్లై కూడా చేయలేదు. సినారె గారిని కలిసి ఈ విషయం చెప్పాను. అకాడెమీలో చేరవద్దని ఆయన నాకు మంచి సలహా ఇచ్చారు. అప్పటికి మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా, మా నాన్న కోరిక దృష్ట్యా చేరిపోయాను. కానీ పని ఒత్తిడి వల్ల సృజనాత్మకతను కోల్పోయాను. జె.ఎల్ గా వెళ్ళడానికి వేరే అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది ప్రోద్బలంతో వెళ్లలేకపోయాను. ప్రమోషన్లను కూడా చాలా ఆలస్యంగా అందుకున్నాను. నాకు ప్రొఫెసర్ ను కావాలని బాగా కోరిక ఉండేది. తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞాన సర్వస్వ కేంద్రంలో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసి అప్లై చేశాను. అది ‘ప్రొఫెసర్- కం- డైరెక్టర్’ పోస్టు కావడం వలన తెలుగు విశ్వవిద్యాలయంలో సంచాలకుడిని అయ్యాను. జ్యోతిష్యం శాఖలో పి జి కోర్సు పెట్టించాను. పది విజ్ఞాన సర్వస్వాలకు రూపకల్పన చేశాను. ఈ విధంగా తెలుగు అకాడెమీలో ఇరవై ఐదేళ్లు, తెలుగు విశ్వవిద్యాలయంలో పది సంవత్సరాలకు పైగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.
11ప్ర. ‘వాణిజ్య పదకోశం’ ప్రధాన సంకలన కర్తగా మీరు చేసిన కృషి ఎటువంటిది?
జ: తెలుగు అకాడెమీ 1985 లో వాణిజ్య పదకోశాన్ని రూపొందించడానికి నిర్ణయించినప్పుడు నేను దానికి ప్రధాన సంకలన కర్తగా వ్యవహరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 28 వాణిజ్య కేంద్రాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని దీన్ని రూపొందించాం. సామాన్య ప్రజానీకం నిత్య జీవితంలో వ్యాపార లావాదేవీలలో ఉపయోగించే పదాలకు ప్రాధాన్యతనిచ్చాం. భాషకు సంబంధం లేని వర్తకులకు మాత్రమే అర్ధమయ్యే కోడ్ పదాలను కూడా చేర్చడం జరిగింది. అట్లాగే వ్యాపార సంబంధ సామెతలను, జాతీయాలను, అన్యదేశ్యాలను కూడా జోడించాం.
12ప్ర. విశ్వనాథ సత్యనారాయణ గారితో మీకు ఏర్పడిన పరిచయ నేపథ్యాన్ని తెలపండి.
జ: మల్లాది సూర్యనారాయణ మూర్తి గారు తాము రాసిన ‘శివభక్తుల చరిత్ర’ను శ్రీశైల మల్లికార్జుని సన్నిధిలో సమర్పించడానికి శ్రీశైలం వెళ్తూ నన్ను వెంబడి తీసుకెళ్ళారు. అప్పుడు నేను పియుసి సెకండియర్ లో ఉన్నాను. అక్కడినుండి విజయవాడకు వెళ్లాం. అక్కడ మల్లాది గారి తమ్ముడు ఇరిగేషన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఇంట్లో మూడు రోజులు ఉన్నాం. అప్పుడే మల్లాది గారు నన్ను విశ్వనాథ వారింటికి తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ‘పురాణ వైర గ్రంథమాల’ ను డిక్టేట్ చేస్తున్నారు. అరగంట సేపు కూర్చొని వింటూ ఆనందించాం. తర్వాత మల్లాది వారు “ఇతను నా శిష్యుడు. కవిత్వం రాస్తాడు. మీరంటే చాలా అభిమానం” అంటూ ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆ తరువాత నా మీద అభిమానంతో సాహిత్య పరిషత్తు సమావేశాలకు కూడా వచ్చారు. అంతటి సహృదయులు విశ్వనాథ వారు.
13ప్ర. మీరు రచించిన, వెలువరించిన పుస్తకాలను గురించి చెప్పండి.
జ: నా రచనలు ఇప్పటివరకు కవితా సంకలనాలు, వ్యాససంపుటాలు, మోనోగ్రాఫులు, పి. వి నరసింహారావు గారి జీవితచరిత్ర ఇట్లా పదిహేను వరకు వచ్చాయి. సంపాదకత్వం వహించినవి మరో పదిహేను వరకు ఉంటాయి. నా వరకు నేను రాసినంతవరకు సంతృప్తికరంగానే ఉన్నాను.
14ప్ర. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడడంలో మీరు ముఖ్య పాత్ర వహించారు కదా! అందులో మీ కృషి ఎటువంటిది?
జ: నాకు చిన్నప్పటి నుండి నేను పుట్టిన ఊరు గద్వాల అంటే చాలా ఇష్టం. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి కరపత్రాలు పంచేవాడిని. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గద్వాల, ఆలంపూర్ లను కలిపి వనపర్తి జిల్లాలో కలపాలనుకున్న ముఖ్యమంత్రి ప్రతిపాదన నాకు బాధను కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంలో కార్యకర్తనయ్యాను. మాజీ మంత్రి డి కె అరుణ పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు గద్వాల జములమ్మ గుడి నుండి ఆలంపూర్ జోగులాంబ గుడి వరకు చేస్తే బాగుంటుందని ఆమెకు సూచించి అమలు చేయించాను. సాహితీ ఘన చరిత్ర కలిగిన గద్వాలను చిన్న సంస్థానమైన వనపర్తిలో చేర్చడం ఆత్మ గౌరవానికి భంగమని, తెలంగాణాలో ఉన్న ఒకే ఒక శక్తిపీఠం కలిగిన ప్రాంతంగా దానికి ప్రాధాన్యత నివ్వాలని తెలుపుతూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను. ఆయన దృష్టికి వచ్చేలాగా కరపత్రాలు ప్రచురించి పంపాను. ఉద్యమ తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి గారు జోగులాంబ గద్వాల జిల్లాను ప్రకటించారు. ఒకసారి రసమయి సంస్థ తరఫున నారాయణరెడ్డి గారి పేరు మీద అవార్డు అందుకొంటున్న సందర్భంలో సభకు డి కె అరుణ గారు వచ్చారు. “జోగులాంబ గద్వాల జిల్లా పేరును ప్రతిపాదించింది చెన్నకేశవ రెడ్డి అని, ఆయన సెంటిమెంటు ప్రజల్లోనూ, ముఖ్యమంత్రిలో కూడా బాగా పనిచేసిందని, జిల్లా ఏర్పాటులో చెన్నకేశవ రెడ్డి పాత్ర చాలా కీలకమైంద”ని ఆమె సభాముఖంగా ప్రశంసించారు.
15ప్ర. మీరు అమెరికాలో నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?
జ: నేను మొట్టమొదట 1998 లో ఆటా ఆహ్వానం మీద అమెరికా వెళ్లాను. ఆ వేదిక మీద వక్త గాను కవిగాను అవధాన పృచ్ఛకుడిగాను పాల్గొన్నాను. తర్వాత మా పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందువల్ల రెండు సందర్భాలలో తానా సభలోను , ఆటా సభలోను వక్తగా, కవిగా పాల్గొన్నాను. కాలిఫోర్నియా రాష్ట్రం బే ఏరియాలో మా అబ్బాయి ఉండటం వల్ల ఆరు నెలలకోసారి వెళ్ళినప్పుడల్లా అక్కడ వీక్షణం సంస్థ నెలనెలా జరుపుతున్న సాహిత్య సమావేశాలలో ప్రతినెలా వెళ్లి నా కవిత్వాన్ని వినిపించేవాణ్ణి.
16ప్ర. మీ దృష్టిలో వర్తమాన కవుల, రచయితల దృష్టి కోణం సమర్థనీయమేనా? ఎట్లా?
జ: ఒక్కో రచయితకు ఒక్కో దృక్పథం ఉంటుంది. నేను అందరి రచనలు చదువుతాను. అన్నిటినీ అధ్యయనం చేస్తాను. అయితే ఏ రచన అయినా, ఏ ప్రక్రియ అయినా ఆ రచయిత దృక్పథంతోనే చూడాలి అని నా భావన. సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి. ఏదో ఊహాలోకంలో విహరించినట్లు కాకుండా వాస్తవానికి దగ్గరగా, సమకాలీన అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలతో రాస్తే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రాంతీయ భాషలో యశోదారెడ్డి గారు రాసినట్లు రాస్తే ప్రజలకు ఇంకా చేరువవుతుంది.
17ప్ర. సాహిత్య ప్రక్రియలు వివిధరీతులుగా శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్న వర్తమాన సమాజంలో భాషాభివృద్ధి జరుగుతున్నట్లు మీరు భావిస్తున్నారా?
ఏ విధమైన రచనల ద్వారా సమాజాన్ని పరిణామ దిశగా, బలోపేతం చేయవచ్చో తగు సూచనలు ఇవ్వండి.
జ: భాషాభివృద్ధి జరుగుతున్నదనే నేను భావిస్తాను. ఎందుకంటే వివిధ పంథాలో, వివిధ దృక్కోణంలో అనేక అంశాలతో రచనలు వస్తున్నాయి. అటువంటప్పుడు అభివృద్ధి లేదని ఎట్లా అంటాం? పోరంకి దక్షిణామూర్తి ఆయన ఎమ్ ఏ చేస్తున్నప్పుడే తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’ రాశాడు. మా అందరికీ చదివి వినిపించేవాడు. ఇదేకాక ‘వెలుగు వెన్నెల గోదారి’ అని కోస్తా మాండలికంలో, ‘రంగవల్లి’ అనే దానిని రాయలసీమ మాండలికంలో రాశాడు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. పోరంకి దక్షిణామూర్తి ఏర్పరచుకున్న తన సొంత గ్రంథాలయాన్ని ఆయన మరణం తర్వాత ఆయన కుమారులు మా స్నేహాన్ని గుర్తించి ఉచితంగా ఆ పుస్తకాలన్నీ నాకు ఇచ్చారు. ప్రాంతీయ భాషల్లో రచనలు భాషను అభివృద్ధి పరుస్తాయి. అందరికీ సులువుగా అర్థమవుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ భాషైనా సమాజానికి స్ఫూర్తి దాయకంగా ఉండే రచనలు చేయాలి. ముందుగా రచయితలు తమను తాము ఎడ్యుకేట్ చేసుకోవాలి. దానికోసం ఎక్కువగా పుస్తకాలను చదవాలి. వారి భావనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. ఏ అంశాన్ని వారు చెప్తున్నారో, దేని గురించి రాస్తున్నారో దాని పట్ల నిజాయితీ ఉండాలి. వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది.
నమస్కారం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వెచ్చించి, మీ జీవన, సాహిత్య విశేష విషయాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు సెలవు.


























