నవీన్ పగటి నిద్ర తీస్తున్నాడు. స్నేహితుడు లేపటంవల్ల నిద్రాభంగమైంది.
”ఈ సమయాన వచ్చా వెందుకు”
”ఏమీ తోచడం లేదు”
”నీకు తోచకుంటే నా నిద్ర చెడగొడతావా”
”కోపానికి రాకురా, నీ దయను”
”ఎందుకంత బాధగా ఉన్నావు”
”బాధ కనిపిస్తుందా”
”అవును నీకేం తక్కువ. వాస్తవంగా నీ బాధ్యతలన్నీ తీరాయి. లోకం బాధ నీకెందుకు. ఎవరెక్కడ పోతేంది. మందిని బాగుచేయడం నీ శక్తికి మించిన పని. ప్రపంచంలో అందరూ సమర్థులే. ఒకరు చెబితే విని బాగుపడే స్థితిలో ఎవరూ లేరు. అందరికి అన్నీ తెలుసు. అందరికంటే నాకే తక్కువ తెలుసు అనుకోవాలి. అప్పుడే బి.పి., షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవు. ఆరోగ్యం, తృప్తి సమకూరుతాయి.”
”అనేక మార్పులు అనివార్యాలై పరాయితనం వైపు మనుషుల్ని తీసుకెళ్తుంటే ఎట్లా ఆలోచించకుండా ఉండగలం!”
”ఉదాహరణకు ఏదో ఒకటి చెప్పు చూద్దాం!”
నా చిన్నప్పుడు మా గురువు గారికి రెండు చేతులా దండం పెట్టేవాణ్ణి. నడుస్తున్నవాడల్లా ఆగి మంచీ చెడు మాట్లాడేవాడు. నేను టీచర్‌ను అయ్యాక బడికి సైకిల్ పై వెళ్ళాను. మా విద్యార్థులు దండం పెడితే ఒక చేత సైకిల్ హ్యాండిల్ పట్టుకొని, మరోచేత్తో నమస్కారం పెట్టి, ఆగి పలకరించేవాణ్ణి. మా అబ్బాయి టీచర్ అయ్యాడు. బైక్ పై బడికి వెళ్తున్నాడు. వాడి విద్యార్థులు సైకిల్‌పై వస్తున్నారు. విద్యార్థులు ఒక చేత ”హాయ్ సార్” అంటే మా వాడు బైక్ వదిలే వీలు లేక తల పంకించి ”హాయ్” అంటున్నాడు. పలకరించడం ఆగిపోయింది. నా మనమడు విద్యాశాఖాధికారి. కార్లో నుండే ఇతరులకు చేయి ఊపుతూ వెళతాడు. అలవాట్లలో మార్పు వచ్చిందా, లేదా? నమస్కారం లోని మానవీయత ఉందా? ఊడిందా?
”ఊడింది వాస్తవమే. ప్రగతి కూడా వాస్తవమే.
”మానవీయత లేని అభివృద్దే మిగిలిందని బాధ”
”అభివృద్దిలోని ఆనందాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. నీకు, మాత్రం ప్రతిదాంట్లో ఏదో ఒక తప్పు కనపడుతుంది. పాజిటివ్‌గా ఆలోచించు.”
”ప్రగతితో పాటు ప్రశాంతత ఉంటే సుఖమయ జీవితం సాధ్యం. మనుషుల మధ్య మానవీయత అవసరం. అది పోతుందనే బాధ. ఆత్మగల ఆలోచన, అవసరం మేరకు ఆలోచన, ఈ రెంటి మధ్యగల తేడా నీకు అర్థం కావడం లేదు.”
”నాకు, నీవు ఎప్పుడూ అర్థం కావు”.
పవన్‌కు ఊపిరాడడం లేదు. నవీన్ లాంటి వాడికి మానవీయతలోని మాధుర్యం ఎట్లా రుచి చూపించాలో పాలుపోవడం లేదు. జాలి, కరుణతో కూడిన సంస్కారం ఎలా ఉంటుందో అర్థం చేయించాలి. అందుకు ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచించాడు. కళ్ళుమూసుకొని అరగంట సేపు నిశ్చలంగా ఉన్నాడు. సెల్ మోగింది. దాని గొంతు పిసికాడు. మెసేజ్‌లతో పాటు ఆడియో మెసేజ్‌లు డిలిట్ అయ్యాయి. ఆ క్షణంలో తళుక్కున మెరిసిందో ఆలోచన. ఆడియో రికార్డర్ ద్వారా కథ చదివి నవీన్‌కు పంపిస్తే బాగుంటుందనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. మౌత్ మైక్ పెట్టు కొని ఆడియో రికార్డర్ ఆన్ చేసాడు. చదవడం మొదలు పెట్టాడు.
* * *
అప్పుడే పుట్టిందో జింకపిల్ల. అది చూసి చెట్టు ఫక్కున నవ్వింది. పూలు, పండ్లు రాలాయి. కళ్ళు తెరిచింది పిల్ల. నన్నెవరు తెచ్చారీ భూమిపైకి. వెతికింది. వెతుకుతూ, వెతుకుతూ ముందుకు సాగింది. పచ్చిక, గాలి ఎంత చల్లగున్నాయో, అనుకుంది. అమ్మకోసం ఆరాటపడింది. అప్పుడే భూమి పైకి వచ్చిన పిల్లను చూసి సమస్త సృష్టి పరవశించింది. భానుడు భగభగమనడం తగ్గించాడు. జింకపిల్ల అడుగులకు మడుగులొత్తింది పృథ్వి. గాలి వాయులీనం వినిపించింది. అమ్మ ప్రేమకోసం జింకపిల్ల తహతహలాడింది. అది తెలిసిన ఆకాశం ఆనందనాట్యం చేసింది. అమ్మకోసం వెతుకుతూ మరింత ముందుకు నడిచింది. నీరు దారిచ్చింది. నిప్పు చెమ్మగిల్లింది.
బయటకు వెళ్ళిన తల్లి తిరిగివచ్చింది. పిల్ల కనపడలేదు. ఇంత తొందరగా ఎటు వెళ్ళింది దుఃఖపడింది. వాడేడి! వాడికి పట్టింపులేదు. ఎటు వెళ్ళినట్లు ? ”నేను సైతం మేతకు వెళ్ళిన” అంటాడు. ”చెప్పిపోవాలి కదా.” ”నేను మాత్రం చెప్పివెళ్ళానా”, ”పడుకొని ఉంటే ఎలా లేపడం” అలా అంతర్మథనం సాగింది.
పంచభూతాలకు పాలుపోవడం లేదు. తల్లి, పిల్ల వేరు వేరయినవని కలవరపడ్డాయి. ఆకాశం తెల్లబోయింది. వాయువు హోరుమంది. నీరు సుళ్ళు తిరిగింది. అగ్నిని నివురు అలుముకొంది. భూమి పట్టన పగిలింది. పిల్ల-తల్లి పయనం సాగుతుంది. రెంటి దిక్కులు వేరయ్యాయి. తిరిగివచ్చిన తండ్రి జింక ఒళ్ళు విరిచింది. ఇల్లంతా కలియదిరిగింది. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరయింది. స్త్రీ పురుష ఫలం అందకుండా పోయిందనే బెంగ పట్టుకుంది. రాత్రంతా మెలకువగా ఉండడం వల్ల బిడ్డను చూసాను. దాహం తీర్చుకుని వచ్చేసరికి బిడ్డ మాయమైంది. బాధ్యత నాదా? చింత పడింది.
* * *
తప్పటడుగులు వేస్తూ ఆలోచిస్తుంది పిల్ల. ఇంతకూ అమ్మ ఎలా ఉంటుంది? కళ్ళు తెరవక ముందే ఎటో వెళ్ళింది. అమ్మ తిరిగి వచ్చేదే నా వద్దకు. నేనే తొందరపడి బయల్దేరాను. అమ్మ నాకు ఎదురుగా వస్తది. అమ్మ ఎలా ఉంటుంది ? అమ్మ ప్రేమకు మారు రూపం నేనే కదా! అమ్మ నాలాగే ఉంటుంది. నేనెలా ఉంటాను ? సందేహాలకు లోనౌతూ అడుగులు వేస్తుంది. నాలుగడుగులు వేసిందో లేదో. ‘అమ్మా ఆకలి అంది” నీరసంతో కూలబడింది. కళ్ళు తిరిగినవి. ప్రపంచం మసక బారింది. ఆ స్థితిలో కాస్తంత దూరంలో అమ్మలాగా కనిపించింది. లేని ఓపిక తెచ్చుకుంది. మెల్లమెల్లగా అటువైపు అడుగులేసింది.
* * *
అమ్మ పిచ్చిదైంది. పిల్లకోసం పిచ్చిగా తిరిగింది. ఎత్తుపల్లాలు, శిఖరాలు – లోయలు గాలించింది. చిన్నప్పుడు నేను అమ్మ చెప్పినట్లు వినేది. ఈ కాలపు పిల్లలు పుట్టుకతోనే స్వతంత్రులవుతున్నారు. స్వేచ్ఛ మంచిదే. ఉరిబిగించేదిగా ఉంటే ఎట్లా? ఈ కడుపు కోత దేనికి? అది వెళ్ళినందుకా? ప్రసవ ఫలితమా? బొడ్డుతాడు బంధమా? తల్లి ప్రేమ అంటే ఇదేనా? ఏమో తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. వాడి పరిస్థితి ఏమిటి? వాడి మొహం వాడికింత పట్టింపా? ఏమో? తనలో తానే నవ్వుకుంది. యాతన పడింది. వెతుకుతుంది. ఎక్కడని వెతకాలి. వెతకకుండా ఉండగలనా? పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి.
* * *
వెతకాలి… వెతకాలి…. ఎక్కడికని పోవాలి? ఎటువైపని వెళ్ళాలి? కూచుంటే ఇక్కడికే వస్తుందా? రాదుగాక రాదు. అది దారి తప్పిన పిల్ల. వెతకాలి… పట్టుకోవాలి…. ఈవిడ ఇంకా రాలేదు. అడుగు ముందుకేసాడు. భార్యాబిడ్డలు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. పరిపరి విధాల మనసుపోతుంది. పిల్లది తప్పే. ఉన్నచోట ఉండక ఎందుకు బయల్దేరినట్లు? ప్రేమ ఒక చోట ఉండనిస్తదా! ఎన్ని దివారాత్రాలు తిరిగిన. దీని తల్లిని ఒప్పించటానికి. మనసు, తనువుల ప్రతిఫలనం నా బిడ్డ. ఎక్కడుందో. మృగారణ్యం మొగారణ్యం అంతా అడవి, భయంపాకింది. ఈ పిల్లకు ఓపిక లేదు. ఈ తరమే అంత. ఒప్పుకోళ్ళ స్థానంలో బలవంతాలు వచ్చి చేరినయి. ఆలోచనలన్నీ పుకార్లలా విహరిస్తున్నవి. కళ్ళు-కాళ్ళు వెతుకుతున్నవి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది పరిస్థితి.
* * *
తల్లి, పిల్ల, తండ్రి, అడవిన పడ్డారు. తల్లి ప్రేమకోసం పిల్ల తహతహలాడింది. దగ్గరలో ఉన్న జంతువు తల్లే అనుకొని మరింత చేరువైంది. దాని మెడవరకు వెళ్ళింది. పిల్ల ఒళ్ళు పులకరించింది. తల్లిని ముద్దాడింది. ”భూమిపైకి నన్ను తెచ్చింది. నీవేకదా” అడిగింది. పిల్ల ప్రవర్తన వల్ల ఎదుటి జంతువులోని మాతృహృదయం పాలుగారింది. పిల్లను అక్కున చేర్చుకుంది. దాని విశాలమైన ఉదరం పిల్ల ఆటస్థలమైంది. బండలాంటి దాని తల నీడలో విశ్రమించింది. కళ్ళు విప్పార్చి తదేకంగా తల్లిని చూస్తూ పాలకోసం ప్రయత్నించింది.
* * *
తల్లిజింక, కొండా-కోన గాలించింది. డస్సింది. గుట్ట-గుండె తడిమింది. దహించుక పోయింది. అడుగులు తడబడ్డాయి. నీటి కోసం అలమటించి కూలబడింది. చావు వచ్చేలా ఉంది. ఆకాశం వైపు మెడసాచింది. కన్నీరుకార్చింది. లేని ఓపిక తెచ్చుకుంది. నీటి జాడకు బయల్దేరింది. సుడిగాలి పయనం చేసింది తండ్రి జింక. ”ఎక్కడున్నవు బిడ్డా” అని నోరారా అరిచింది. అడవంతా ప్రతిధ్వనించింది. నీరై దుమికింది. రాయి-రప్ప ఒరుసుకపోయింది. సుడిగాలై గాలించింది. కాయ-కంప గీరుకపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అడవిని అడిగింది. నిశ్ళబ్దం కనిపించింది. నీరసం కమ్మింది. నాలుక పిడచకట్టింది. లేని ఓపిక తెచ్చుకొని నీటికోసం బయల్దేరింది.
* * *
ఆకసాన్నంటినట్లున్న పొడవైన చెట్లు. వాటి ఆకులు రాలుతున్నవి. విశాలమైన నది ఒడ్డుకు ఇరువైపులా చెట్లు. అవి నదికి గొడుగు పడుతున్నట్లున్నవి. నది శబ్దిస్తుంది. ఆ శబ్దం దాహార్తులను పిలుస్తున్నట్లున్నది. తీరం పొడవునా జంతుజాలం సేదతీరుతుంది. రాలిన ఆకు, నీటితో తడిసి మెత్తటి పరుపులా విస్తరించింది. దానిపై సేదతీరిన జంతువు కదిలినా, నిద్రాభంగం కాకూడదని ఆకు శబ్దించడం లేదు. ప్రకృతి ఒడి మెత్తన. నిద్రించిన ప్రాణికి సాంత్వన. మెలకువ కలిగిన మెదడుకు ఆలంబన.
* * *
నదీ తీరంలో చెట్లతో పాటు దట్టమైన పొదలున్నవి. పొదల మాటున దాక్కుని జంతువులు ఉన్నాయి. వేటగాళ్ళు ఉన్నారు. దాడి చేయాలనుకున్నవారు మాటు వేయడం పరిపాటి. ఆ రోజు వేటకోసం భార్యతో సహా వచ్చాడు వేటగాడు. మాటు వేసాడు. అక్కడ ఆదమరిచి పడిపోయిన తల్లి జింక పై భార్యభర్తల చూపు పడింది. పడి ఉన్న దాని వైనం చూసి దంపతులు సంబరపడ్డారు. బాణం ఎక్కుపెట్టి నారి సారించాడు. వదలడమే ఆలస్యం. భార్య వారించింది.
”ఎందుకు అడ్డుకున్నావు” అన్నాడు
”నిద్రపోతున్న దాన్ని చంపడం పాపం”
”ఆకలిని చంపడం కూడా పాపమే”
”బాలింతలా ఉంది పాపం”
”నా ధర్మాన్ని విస్మరించడం పాపం”
”మనిషి పుటుక పుట్టినపుడు నెనరు ఉండాలె”
”అందుకే నిన్ను, నాతో రావద్దంట”
”అటు చూడు” అంది
మొహం వేళ్ళాడేసుకొని, తడబడుతున్న కాళ్ళతో వచ్చింది తండ్రి జింక. కడుపునిండా నీళ్ళు తాగింది. తాగిన చోటే సాగిలపడింది. కళ్ళు మూసింది. గతం కదలాడింది. కళ్ళు తెరిచింది. భారంగా నిశ్వసించింది. మళ్ళీ కళ్ళు మూసింది. దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళు తెరిచింది. ఓపిక లేకున్నా లేచి నిలబడింది. ఎదురుగా దగ్గర్లోనే పడి ఉన్న తల్లి జింక కనిపించింది. ఉత్సాహంగా ముందుకురికింది. అచేతనంగా పడి ఉన్నదాన్ని చూసి కంటనీరు పెట్టింది. నాలుకతో నిమిరింది. తలతో తట్టింది. భయంతో దిగ్గున లేచింది తల్లి జింక. ఎదురుగా తండ్రి జింక. భయం స్థానంలో కోపం చేరింది.
”ఎక్కడ తిరగబోయినవురా” కోపగించింది.
…………………………………………
”బిడ్డను పోగొట్టుకున్న రా” నిస్సహాయంగా అరిచింది.
…………………………………………
”ఇదంత నీ వల్లనే జరిగింది. నాశనమయిపోతవు” శపించింది.
”జరిగిందానికి ఇద్దరం బాధ్యులమే” నిశ్చలంగా అంది తండ్రి జింక
ఆ మాటతో కూలబడింది. సోయి తప్పింది. దాని పక్కనే కూర్చొని సపర్యలు చేసింది తండ్రి జింక. ఇదే అదనుగా మరోసారి దాడికి సిద్దమయ్యాడు వేటగాడు. మళ్ళీవారించింది భార్య.
”నా పాలిటి దరిద్రదేవతవు నీవు” అన్నాడు
”బిడ్డను పోగొట్టుకొని ఉన్నారు వాళ్ళు”
”అయితే నాకేంటి?”
”వన్య ప్రాణులను చంపితే జైల్ల పెడుతారట”
”నీతులు చెప్పకు. ఇవ్వాళ పూటగడవడం ఎట్ల?”
”ఒక్కరోజు ఉపాసం ఉందాం”
”రేపటికి ఎట్ల?”
”రేపటి సంగతి దేవుడెరుగు”
వేటగాడు విల్లు కింద పెట్టాడు. సపర్యల తరువాత తల్లిజింక తెలివికొచ్చింది. రెండు జింకలు కలిసి కనిపించిన దారిలో పయనించాయి. వాటిని వేటదంపతులు వెంబడించారు.
* * *
జింక పిల్ల పాలకోసం ప్రయత్నించింది. తనది కాని వాసనేదో వేసింది. వెగటు పుట్టింది. ముద్దాడిన మూతికి రక్త రుచి తెలిసింది. తొందరలోనే అది తన తల్లి కాదని గ్రహించింది. జింక పిల్ల రక్తంలో భయం చొరబడింది. అక్కడి నుండి పరుగెత్తింది. పరుగును చూడగానే జంతువులో వేటాడే లక్షణం మేల్కొంది. వెంటాడింది. క్షణంలో పంజా విప్పింది. విసిరింది. జింకపిల్ల తప్పించుకుంది. జంతువు గాండ్రించింది. ముందుకు దూకింది. మెడ పట్టింది. కొరికింది. పులినోట్లో పడి జింకపిల్ల చచ్చింది. కాసేపు స్థంబించిన ప్రకృతి మరల యధావిధిగా మారింది.
* * *
రెండు జంటలు ఒక దాని వెనుక ఒకటి పరుగునడక పెడుతున్నవి. అలా వెళుతున్న వాటికి చావు వాసన సోకింది. తల్లి జింక ఠక్కున ఆగింది. వాసన వైపు మళ్ళింది. తండ్రి జింక వెంబడించింది. అవి దారి మళ్ళడం చూసి వేటదంపతులు ఆశ్చర్యపోయారు. వాటి వెనకే వెళ్ళారు. ఆ దారి జింకపిల్ల చచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళింది. పిల్ల అవశేషాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్న బిడ్డను తలచుకుంటూ జింక జంట దుఃఖిస్తున్నది.
”అయ్యో బిడ్డా ఎంత పనైపాయె” అంది వేటకత్తె
”చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత” అన్నాడు వేటగాడు.
”ఈ మాత్రం దానికే ఎంత తతంగం. దేవునింట్ల మన్నువడ. చోద్యం చేస్తడు”
”జింకను పంపినోడే, పులిని పంపిండు”
”అంటే!! నీ ఉద్దేశం ఏంది”
”పులికి ఆహారంగా జింకను పంపిండు”
”చంపి తినుడేనా పులి పని”
”పిల్లను చంపలేకపోతే, పులి పరువేం కావాలె”
”బలవంతుడు, బలహీనుణ్ణి చంపుడేనా! కనీస పాపభీతి ఉండక్కర్లేదా?”
”నా బంగారం కదూ! ఇంటికి పోదాం పదా”
”ఏమోనయ్యా! అంత ఎటమటం అనిపిస్తుంది”
”జింకపిల్ల, నువ్వు ఇద్దరూ అమాయక ప్రాణులే”
”మనం ఆకలికి ఓర్చుకోగలం. బిడ్డ ఆకలి తీర్చడం ఎలా?
”జింకను చంపుతానంటే అడ్డుపడ్డావు. ఆకలి తీరే మార్గం నీవే చెప్పాలి.”
”పులి చంపిన జింక పిల్లను తీసికెళ్దాం”
”సరే పదా!
* * *
నవీన్, కథ విన్నావు కదా వేటగత్తె మానవీయ ఆలోచనల వల్ల పెద్ద జింకలు బతికి బయట పడ్డాయి. వేటాడే మనస్తత్వంవల్ల పిల్ల జింక చచ్చిఊర్కొంది. వేటాడే మనస్తత్వం మనుషుల్లో పెరగడంవల్ల పిల్ల జింకల్లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా!
కథలు
ఆడిటోరియంలో ‘‘కాలేజీ వార్షికోత్సవ సభ’’ దేదీప్య కళాకాంతులతో ప్రారంభం అయ్యింది. కాలేజీ సెక్రటరీ పోడియం మైక్‌లో ఒక్కొక్క విద్యార్థినీ పరిచయంచేసి, వారిని వేదికపైకి ఆహ్వానిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సెక్రటరీ పద్మావతి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఆమెకు ఆమే సాటి.
కవిత్వం, నాటకం, సంగీతం ఇంకా వివిధ రంగాల విద్యార్థులు వేదికపైకి వచ్చి ముఖ్యఅతిథి, ప్రిన్స్‌పల్ చేతుల మీదుగా తమ బహుమతులను జ్ఞాపికలతోపాటు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్రకళలో మన కాలేజీకి గర్వకారణమైన ఇంద్రవర్మను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం! విజయ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది.
కానీ ఇంద్రవర్మ మాత్రం ఎందుకో నిదానంగా వస్తున్నాడు. అతడు ప్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ తన చిత్రకళను ప్రోత్సహించింది. తను వేసిన ప్రతి చిత్రానికీ రంగులు, మెరుగులు దిద్దించిన తోటి సహ విద్యార్థిని ప్రియను కూడా వేదికపైకి పిలవమని సెక్రటరీకి చెప్పాడు.
కానీ ప్రియ రాకపోవటంతో, పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి, జ్ఞాపికనూ అందుకున్నాడు ఇంద్రవర్మ.
అదే సమయంలో ఇంద్రవర్మ స్నేహితులు అందంగా ప్యాక్చేసిన ఒక పెద్ద ఫోట్ పోట్రైట్ను వేదికపైకి తీసుకొచ్చారు. ముఖ్యఅతిథి, ప్రిన్స్‌పల్ సంయుక్తంగా ఆ పోట్రైట్ను ఆవిష్కరించారు.
అది ఒక స్త్రీ మూర్తి కళాఖండం. ఆమెలో ఒక అమ్మ ఉంది. ఆ చిత్రంలో ఓ చిన్నారి, అక్క, చెల్లెలు, వదిన, భార్య అందరూ కన్పిస్తున్నారు. ఆమెలో ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సృష్టి అంతా స్త్రీ మూర్తిలోనే అంతర్లీనంగా ఉందన్న ఇంద్రవర్మ నిర్వచనం రసజ్ఞులను ఆకట్టుకొంది.
ఈ పెయింటింగు నేను నా తోటి విద్యార్థిని ప్రియతో కలసి చిత్రించాను. అందుకే ఈ బహుమతి మా ఇద్దరికీ చెందుతుందని ప్రియను కూడా వేదికపైకి ఆహ్వానించాను. నాకు రంగులు వేయటం నేర్పిన మన కళాశాలకి గుర్తుగా, దీనిని ‘‘ప్రియజ్ఞాపిక’’గా సమర్పిస్తున్నాను అని ఇంద్రవర్మ ఆనంద భాష్పాలతో కూడిన ఉద్వేగ చిరుప్రసంగంతో మళ్ళీ ఆహుతులంతా కరతాళ ధ్వనులతో, స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు.
చూస్తూ చూస్తూండగానే కాలేజీ జీవితం తెలియకుండా హాయిగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, చదువుల తల్లి దేవాలయ ప్రాంగణంలో నేర్పుతుంది.
మీరు కూడా స్వయంగా పెన్సిల్ గీతలతో బొమ్మలు వేయాలి. బాపుని గుర్తు చేసుకోండి. బొమ్మలు వేయగలరు. వేసిన బొమ్మలకు వాటర్ కలర్స్ వేయండి. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వేసిన చిత్రాలు మీకు నచ్చాయి అంటే మీరు కళాకారులే! వాటిని చూచిన స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు ఇచ్చే కాంప్లిమెంట్లు ఎన్నో ఉంటాయి సుమా! అవి ఆనాడు పాఠాలు చెప్పిన గురువుగారి మాటలు, ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి ఇంద్రవర్మకు.
కాలేజీలో విద్యార్థులందరూ…. నువు ఇంద్రవర్మవు కావు ` రవివర్మవే అనే వాళ్ళు. ‘‘ఏనాటికైనా మన ఇంద్రవర్మ ప్రపంచ ప్రఖ్యాత పికాసో వంటి గొప్ప చిత్రకారుడు అవుతాడని’’ ప్రసంసించాడు ప్రిన్సిపల్.
అసలు ఈ అభినందల, ప్రసంశల వెల్లువకు సూత్రధారి ప్రియ. ఇవన్నీ అందుకోవటానికి ఆమెకే అర్హత ఉందని ఆవేదన చెందాడు. ప్రియను చూడటానికి అతని హృదయం పరితపిస్తోంది. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలని తనకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియ.
ప్రియ స్ఫూర్తితోనే డిగ్రీలో ర్యాంకు సాధించాడు. ఆమె చెప్పకపోతే నిజంగానే తన చదువు అటకెక్కి కూర్చునేది అని తెలుసుకున్నాడు.
డిగ్రీ రెండో సంవత్సరంలో కూడా ఇంద్రవర్మకు అత్తీసరు మార్కులే వచ్చాయి. దాన్ని అలుసుగా తీసుకొన్నాడు హరిప్రసాద్. ఇంద్రవర్మను అవమానించాడు. ఒరేయ్! నీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకు. హాయిగా రోడ్డు పక్కన దేవుడు బొమ్మలు గీసుకున్నావనకో! ఏకంగా కాసుల వర్షమే కురుస్తుందన్నాడు. బాబు రవివర్మ! నీకు చదువెందుకు? మాకు లాగా మార్కులతో పనేంటి? అసలు రంగులు లేకపోయినా, బొగ్గులతో కూడా బొమ్మలేసి డబ్బు సంపాదిస్తావ్! అని కించపర్చాడు ఉదయ్‌కుమార్. వీరిద్దరికీ ప్రవీణ్, శేఖర్లు తోడై అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. వాళ్ళు మారరు! ర్యాగింగ్ చేసి చేసి నెగిటీవ్‌గా తయారైపోయారు.
ఇంద్రవర్మకు ఉద్యోగం వచ్చింది. అయినా అంత సంతోషంగా లేదు. ప్రతీ క్షణం ప్రియా ఆలోచనలే. అసలు ప్రియ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మనసు బాగోపోయినా, మనశ్శాంతి కోసం పెయింటింగ్ వేస్తున్నాడు. అది గ్రహించిన కంపెనీలోని సహ ఉద్యోగులు ‘‘ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ’’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఇంద్రవర్మ వేసిన పోట్రైట్లకు ఇతర దేశాలలో గిరాకీ పెరిగింది. ఇంద్రవర్మ భారతదేశంలో ప్రముఖ చిత్రకారునిగా అవార్డును అందుకున్నాడు. గౌతమబుద్ధుడు చెప్పినట్లు ‘‘నీవు ఏది ఆలోచిస్తే, అదే అవుతావు’’ ఔను! నేను ఇప్పుడు గొప్ప కళాకారుణ్ణి అయ్యాను అని గౌతమబుద్ధుని బొమ్మకు నమస్కరించాడు.
కానీ ఇంద్రవర్మ మనసులో మాత్రం ఏదో వెలితి, అశాంతి గూడుకట్టుకున్నాయి. హాలులో కూర్చుని టి.వి. చూస్తుండగా కొరియర్ వచ్చింది. ఆతృతతో కవర్ తెరిచాడు. అందులో ప్రియ వ్రాసిన ఉత్తరం, అంతే! వెంటనే ఒక్కసారిగా ఎగిరి గంతేసి…. యా! హూ… అంటూ గట్టిగా కేకవేశాడు.
కొడుకు వేసిన కేకకి వంటింట్లోంచి వచ్చిన తల్లి ‘‘అదేమిటిరా అంత గట్టిగా అరిచావ్! అని అడిగింది. అసలు తల్లిని పట్టించుకుంటేగా!
హలో ఇంద్రవర్మ! నేను అమెరికాలో నువ్వు వేసిన అపూర్వ కళాఖండాలు చూసి ఎంతో ఆనందించాను. నా సంతోషాన్ని వెంటనే ఫోన్ చేసి నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ‘‘నేను ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను. నా స్నేహితులకూ, బంధువులకూ ఉత్తరాలే వ్రాస్తుంటాను.’’ ` కరీనాకపూర్.
మనకున్న ప్రేమ, బాధ, ఆనందాలను ఉత్తరాల ద్వారా అయితే బాగా వివరంగా తెలియజేస్తాం. అలాంటి అమూల్యమైన ఉత్తరాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడూ చదువుకుంటాం కూడా. అందుకే నేను స్వీటు తిన్న తరువాత హాట్ తినను. ఎందుకంటే మనసారా మాధుర్యాన్ని ఆస్వాదించాలి కాబట్టి.
ఇంద్రవర్మ! నువ్వు నేను కలలు కన్నట్టు గొప్ప పెయింటర్ అయినందుకు నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్ ఇంద్రా.
‘‘ఇంద్రవర్మ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.’’ మన ప్రేమను జీవితాంతం అనుభవించాలంటే మనం పెళ్ళి చేసుకోకూడదు. ఈ విషయంలో నన్ను క్షమించు. శ్రీ కృష్ణుడు ఆరువేల భామలకు మధుర ప్రేమికుడు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మన ప్రేమ కూడా జీవితాంతం మధురతరంగిణిలా ప్రవహించాలి. రెండు రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. మిగిలిన అన్ని విషయాలు అక్కడ నెమరేసుకుందాం!
` నీ ప్రియ స్నేహితురాలు
ఉత్తరం చదివిన ఇంద్రవర్మ దృష్టి టి.వి. చానల్లో కన్పిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌పై పడిరది, ‘‘బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోయింది” చూపిస్తున్న ఫోటోలలో ప్రియ ఫోటో, పేరునూ స్పష్టంగా చదివి సోఫాలో కూలబడిపోయాడు ఇంద్రవర్మ.
అలారం మోగింది . నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది . మొహం మీద నీళ్ళు జల్లుకొని పుస్తకం తెరవబోతుంటే పావని వచ్చింది. గుడ్ లేచావా! ఓ గంట సేపు చదువుకో. ఆరుగంటల కల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. . కిందకెళ్ళు , అటు తరువాత ..అని పావని ఇంకా ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి …అంతేగా! అమ్మా! విసుగ్గా అంది.
కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు .అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి . నేనొచ్చి తీసుకొస్తాను తరువాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని చదువు కుందువుగాని అంటూ, ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది పావని
నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో,
అమ్మా!…
ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి. పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితు లందరూ తరగతి లో మంచి పర్సెంటేజ్ రావాలని కొచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. .అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే
అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము . అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారుకదా ! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ క్లాసులకు వెళ్ళే టైములో ఏ యోగా క్లాస్ కో వెళ్ళావనుకో , ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది పావని.
చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక . లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రై వింగ్ నేర్చుకోడా నికి వెళ్తున్నావా? కొచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో , నీకేం , తెలివైన దానివి.. .వాళ్ళు అలా అంటుండ గానే
లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్‌లో ఉండే స్త్రీలు కొంతమంది కూచుని మాట్లాడుతూ ఉన్నారు . వాళ్ళు నేత్రికను చూడగానే, పావని తో
మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు.
తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ. మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ, మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు,అంటుంటే, . మీరు నేర్పించిన తెలుగు “అచార్” ను మాఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్.
అది సరేకాని రేపు హోళీ పండుగ కదా! మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేసాంకదా! ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం! సాయంత్రం అందరం కలసి కమ్యునిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది, అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలగూ సెలవేకదా,! వాళ్ళ తో కలసి రోజంతా హాయిగా గడుపుదాం అంది పావని.
హోలీ గురించిన కథలను పిల్లలకు నేను చెప్తాను అంది, పురాణ కథలను చదివిన కస్తూరి.
అదే ప్రహ్లాదుడు ఆతని సోదరి హోలిక, శివుని తపో భంగాని కొచ్చిన కాముని దహనం ..ఈకథలేనా? మంచిది …..సంక్షిప్తంగా చెప్పు అంది పావని.
హోలీ పున్నమ స్వచ్ఛతను ప్రసరించే పండుగ. ఈ పండుగ రోజున, వెన్నెల వెలుగు లోని వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణం లో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని పొందుతుంది. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ వ్యాధులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధాలుగా పనిచేస్తాయి. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు,బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్య విధానం లో, తయారు చేస్తారు.
తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పాలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగు లోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. కొన్నిసార్లు బట్టి పట్టి ముఖ్యమైన పానీయాన్ని తండై లేదా భంగు ను తయారుచేస్తారు …తనకు తెలిసిన విషయాలను చెప్పింది జ్ఞాన ప్రభ.
నొ ,నొ, పిల్లలను సమయం వేస్ట్ చేయ నీయరు. మాఅయన ఒప్పుకోరు. పరీక్షల రోజులు కదా! చదువుకోవాలంటారు… అంది కనక మహాలక్ష్మి
ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, అందరితో కలిసిమె లిసి ఉండటం అలవాటు చెయ్యాలి….అంది పావని.
అందరూ రేపటి సన్నా హా లను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.
రాత్రి 11 పదకొండు గం టలయింది నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో .మళ్ళీ రేపు చదువు కోవాలంటూ పొద్దున్నే లేస్తావు, అంటూ గదిలో కొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయ టికెళ్తూ . …
పావని భర్త ఈశ్వర్ “పావని ధోరణి తనకలవాటే కనుక “ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకొమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు ,”అన్నాడు అర్థం కానట్టు.
అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందే మీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే . చదువు జీవితానికి వెలుగు ,కాని ఆవెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆరంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి .ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, రక రకాల రంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి . అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ కదా!
ఆమనీ సుమడోలగా, రాసలీలగా, వసంతోత్సవ హేలగా, అలలారే ‘హోలీ’ మానవాళిలో సమైక్యతనీ, సంఘటిత శక్తినీ, సమాజ చైతన్య స్పృహనీ కలిగిస్తుంది. అందరిలో కొత్త ఉత్సాహం నింపడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా విశ్వకవి రవీంధ్రనాధ్ టాగూర్‌కి వసంతాగమన సమయానికి సుస్వాగతం పలికే హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం.శాంతి నికేతన్ లో చదువు కున్నారు. “ఒరె భాయి ఫగూన్ లగచె బొనె బోనె …దాలె దాలె ఫులె ఫులె, పతే, పతే రె,
ఆరలె ఆరలె కొనె కొనె” అని పాడే వారు కదా… రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.
అప్పటివరకు కుమ్ముల బెట్టినట్టున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. నీలాకాశం అంతా నల్లమబ్బులను కమ్ముకున్నది. హఠాత్తుగా చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. పశువుల కొట్టంలో గుంజకు కట్టేసిన ఆవు ఆందోళనగా ‘అంబా’ అని అరిచి తన లేగదూడ తలను నాలుకతో ప్రేమగా తడిమింది.
హాల్లో టీవి చూస్తున్న రామచంద్ర గబుక్కున లేచి కొట్టంవైపు నడిచాడు. అక్కడే గోలెం దగ్గర కుడిది కలుపుతున్న పాలేరు వెంకన్నతో “వెంకన్నా… వర్షం ఎక్కువయ్యేట్టుంది. ఈ లేగదూడను, ఆవును లోపల సాయబానుల గుంజకు కట్టేసి వెళ్ళు…” వెంకన్నను పురమాయించాడు. ” ఆ.. అట్లనే బాబు… అమ్మ సర్వపిండి చేస్తాన్నరు. పోయిల కట్టెలు గావాల్నాట. అమ్మ కిచ్చొచ్చి ఆవును గట్టేస్త బాబు..” అని అన్నాడు వెంకన్న.
“ఓ.. తప్యాల చెక్క చేస్తున్నదా అమ్మ” చిత్రంగా కళ్ళు ఎగరేస్తూ వంటింట్లోకి తొంగి చూసాడు రామచంద్ర. తల్లి కట్టెల పొయ్యి ముందాు కూర్చుని తప్యాల చెక్క చేస్తొంది. కమ్మటి నువ్వులతో కూడిన తప్యాల చెక్క వాసన ఆ వాతావరణంలో ఒక్కసారిగా గుప్పుమంటూ కమ్ముకొని నోరూరించింది. “అమ్మా… చాతగాక ఇప్పుడెందుకు ఈ పని పెట్టుకున్నట్టు? పైగా ఆ కట్టెల పొయ్యి పొగతో సతమతమవుతూ…! గ్యాస్ స్టవ్ వాడుకోవచ్చు కదా “వాతావరణం ఇట్లుంటే నీకు తప్యాల చెక్క ఇష్టం కదా చంద్రా…. ఇవ్వాళా అక్కకు నాకు గూడా ఉపవాసం. అందరికీ పనికొస్తుంది గదా అని చేస్తున్నా…. అయినా ఈ తప్యాల చెక్క కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద చేస్తేనే రుచిరా నాన్నా…” కొడుకు మాటలకు సమాధానమిస్తూ, మళ్ళీ “ఇదిగో… ఇది తీసుకో…” ఓ పళ్లెంలో వేడి వేడి తప్యాల చెక్కను బెట్టి కొడుకు చేతికిచ్చింది అనసూయమ్మ.
పళ్లెం అందుకొని ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్న రామచంద్ర ‘అబ్బా… అమృతమమ్మా… నీ చేతి తప్యాల చెక్క, ‘కళ్ళెగరేస్తూ ప్రశంసాపూర్వకంగా తల్లివైపు చూశాడు రామచంద్ర. “ఊ. చాల్లే పొగడ్తలు, మురిపెంగా నవ్వుకూ అంటున్నా అనసూయమ్మ మొహంలో కించిత్ గర్వం తొణికిసలాడింది. “అందుకే అమ్మా నువ్వు చేసే ఈ తప్యాల చెక్కంటే మీనాకు ప్రాణం అనుకో….. తనెఁత బాగా చేసినా ఈ రుచి రాదు అంటుంది. పైగా అత్తయ్య చేతిలో ఏదో మంత్రదండముందండీ అంటుంది” తనను పొగడుతూనే భార్య గూర్చి మురిపెంగా చెబుతున్న కొడుకు మాటలు రుచించలేదు అనసూయమ్మకు. అప్పటివరకూ గల గలా మాట్లాడిన తల్లి మీనా ప్రస్తావన రాగానే ముభావంగా మారటం రామచంద్రను బాధించింది. “మామయ్య అత్త పిలుస్తోంది నిన్ను” అక్క కొడుకు పదేళ్ళ టీంకూ వచ్చి చెప్పగానే సగం తిన్న పళ్ళెం అక్కడే వదిలేసి వెళ్తున్న కొడుకుతో ‘అదేంటి చంద్రా… పూర్తిగా తిని వెళ్ళు” అంటున్న తల్లితో ‘చాలమ్మా’ అంటూ ముస్తసరిగా సమాధానమిచ్చి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు రామచంద్ర.
* * *
మీనా పట్ల అమ్మ కోపానికి కారణం వుంది. కట్న కానుకలేమీ ఇవ్వలేని దూరపు బంధువు రాజు మామయ్య కూతురుపై తను మనసు పారేసుకోవటం, ఆ అమ్మయానే పెళ్ళి చేసుకుంటాననటం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు. చివరకు, తను మీనానే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టడంతో, అన్నయ్యల బలవంతం కూడా తోడై తప్పనిసరై ఒప్పుకుంది అమ్మ పెళ్ళికి. అయితే, మీనాను మాత్రం మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించలేకపోతుంది ఇప్పటికీ. అమ్మ కోపం, అయిష్టం తాత్కాలికమేనని తరువాత పరిస్థితులు వాటంతటవే చక్కబడతాయని ఆశించాడు తను. అట్లని అమ్మ పట్టుదల తనకు తెలియంది కాదు. అమ్మ పట్టుదల ముందు నాన్నగారే తలవంచేవారు. అయితే, ఆయనకు అమ్మమీద వున్న ప్రేమ, అనురాగం కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. నాన్నగారు అమ్మను ఎత్తెత్తు మాణిక్యంలా చూసుకునేవారు. ఆయన సాహచర్యంలో హాయిగా సాగిపోతున్న అమ్మ జీవితం నాన్నగారి హఠాతం మరణంతో నడిసంద్రంలో నావలా అయింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామలుచ ేసిన పెళ్ళితో పన్నెండేళ్ళకే నాన్న చెయ్యి పట్టుకుని వచ్చిన అమ్మ, ఆయనే తన సర్వస్వంగా పిల్లలే తన లోకంగా మలుచుకుంది జీవితాన్ని. ఇదిలా వుంటే “ఉరువు ఉరిమి మంగళం మీద పడ్డట్టు” నాన్నగారు పోయిన సంవత్సరానికే అక్క పంకజం భర్తను పోగొట్టుకొని పిల్లాడితో పుట్టిల్లు చేరడం అమ్మను మానసికంగా కృంగదీసింది. నాన్నగారున్నప్పుడే తెల్సిన సంబంధం అంటూ హడావిడిగా పెళ్ళి చేసిన చెల్లెలు మంజు అత్తింటి వారితో సరిపడక మాట మాటికి అలిగి పుట్టింటికి రావడం, వచ్చినప్పుడల్లా నెలలకొద్ది ఇక్కడే వుండిపోవడం కూడా అమ్మ అశాంతికి మరో కారణం. కొడుకులు చదువుల పేరిట దూరంగా వుండడం వల్లనేమో, పెద్దగా చదువులబ్బని కూతుళ్ళు ఇంటి పట్టునే వుండడంవల్ల వాళ్లను కంటికి రెప్పలా గారాబంగా సాదుకుంది అమ్మ. కానీ ఇద్దరి కూతుళ్ళ జీవితాలు ఇలా సవ్యంగా లేకపోవడంతో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది అమ్మ జీవితం. అట్లని వాళ్ళను తను ఏమీ అనలేని స్థితి. తానే తన రెక్కల కింద వాళ్ళని సురక్షితంగా పొదుపు కోవలసిన పరిస్థితి రా చంద్రా అంటుంది కన్నీళ్ళతో అమ్మ. సమస్యంతా ఇక్కడే మొదలైంది. వీళ్ళిద్దరి ఆడపిల్లల రాకతో ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మునుపటి ప్రశాంత వాతావరణం మచ్చుకైనా లేదు. ఇంట్లో అన్ని విషయాల్లో పంకజం అక్క, మంజుల పెత్తనం వదినెలకు వాళ్ళకు మధ్య మనస్పర్థలకు, గొడవలకు దారితీసిఁది. తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ మంచి చెప్పాల్సిన ఇంట్లో పెద్ద దిక్కు కూతుళ్ళను గుడ్డిగా వెనకేసుకురావడం వదినెలనే కాదు అన్నయ్యలనూ బాధించింది. అట్లని అన్నయ్య అమ్మను గట్టిగా ఏమీ అనలేని అసహాయత, అశక్తత, అనునిత్యం ఇట్లాంటి యుద్ధపూరిత వాతావరణంలో ఇమడలేక వదినెలను, పిల్లల్ని తీసుకుని బదిలీ పేరుతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయారు, ఇద్దరన్నయ్యలూ, పీజి చదివి అప్పటికింకా పెళ్ళికాని తను కూడా ఏ ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుని వెళ్ళిపోయే అవకాశమున్నప్పటికీ అమ్మను, కుటుంబాన్ని వీధిన పడవేయలేని సంస్కారం కుటుంబ బాధ్యత నెత్తిన వేసుకొని ఉన్న ఊళ్ళోనే వ్యవసాయం చెయ్యడానికి పురికొల్పింది. సహజంగానే ఇంట్లో చిన్నకొడుకుగా అమ్మ ఆప్యాయత, ప్రేమ కుటుంబ సభ్యులందరి గారాబంతో పెరిగాడు తను. అమ్మ, తోబుట్టువుల బాధ్యత చేపట్టి కుటుంబాన్ని నిలబెట్టి బంధువుల్లో తలెత్తుకునేలా చేసిన తనంటే అమ్మకు, అక్క, చెల్లెలికి ఎంతో ప్రేమ. అయితే, తన పట్ల వాళ్ళు కన్పరచే ఈ ప్రేమ తన భార్య పట్ల కూడా చూపుతారని ఆశించాడు తను. కానీ మీనా వీళ్ళ ప్రేమరాహిత్యానికి, అకారణ ద్వేషానికి అడుగడుగునా బాధపడ్తూనే వుంది అనే విషయం తెలిసినప్పుడు హతాశుడయ్యాడు. ముఖ్యంగా అక్క పంకజం, చెల్లెలు మంజు అహర్నిశలూ చిన్న చిన్న విషయాలను కూడా సూటీపోటీ మాటలతో అమ్మను కూడా మాటలనేట్టు రెచ్చగొడ్తూ మీనాను ఏడిపిస్తున్నారని టింకూ ద్వారా తెల్సినప్పుడు మనసు బాధతో పిండేసినట్టయింది. ఎవరి కోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టాడో వారే తన బాగోగుల గూర్చి ఆలోచించక, తన ఆనందాన్ని హరించాలని చూడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆలోచిస్తున్న రామచంద్ర మనసు మనసులో లేదు.
* * *
ఒక్క ఉదుటున గదిలో కొచ్చి దబాల్న తలుపేసుకుని విసురుగా మంచం మీద వాలిపోయింది మీనా. బలవంతంగా కన్నీళ్ళు ఆపుకోవడం వల్లనేమో ఆమె కళ్ళు ఎర్రటి జీరలు పులుముకున్నాయి. ఇంక ఆమెవల్ల కాలేదు. దిండులో తలదాచుకొని బావురుమన్నది ఒక్కసారిగా! ఆమె కళ్ళు ఉధృతంగా ఎగిసిపడ్తున్న జలపాతాలయ్యాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. కాస్సేపటికి లేచి మొహం కడుక్కుని వచ్చింది. ఏంటీ మనుషులు? ఎందుకు తనని ఏదో ఒక వంకతో అనరాని మాటలతో చిత్రవధ చేస్తారు? అసలిప్పుడు తను చేసిందాంట్లో తప్పేముంది? ఇంటెనక సాయబాను దగ్గర గచ్చు అంతా ఊడ్చి తను శుభ్రం చెయ్యాలనుకోవడమే నేరమా? తను చీపురు పట్టుకుని ఊడుస్తుంటనే పంకజం వదిన ‘అమ్మా….ఈ మహాతల్లి నీ మడిచీర అంట్లుచేసిందే’ అంటూ అరిచింది. తనకేం అర్థం కాలేదు. తనెక్కడో ఊడుస్తోంది. అత్తయ్య మడిచీర అల్లంత దూరాన గుమ్ములర్రకు వేళ్ళాడుతూ వుంది. తను దాన్ని తాకే అవకాశమే లేదు. ఇంతలో అత్తయ్య రానే వచ్చింది ఆదరాబాదరగా. తనవైపు ఈసడింపుగా చూస్తూ నీ శుభ్రం తగలేసినట్టే వుంది. నీకెన్నిసార్లు చెప్పాలి ఇటువైపు రావద్దని. నీకిక్కడేం పని…. వద్దని చెప్పినా పదే పదే మొండిగా ప్రవర్తిస్తావెందుకు. “మనిషికో మాట గొడ్డుకోదెబ్బ” అని వూరికే అనలేదు పెద్దలు. ఇంతలో అక్కడికొచ్చన మంజు అందుకుంది. “అసలావిడ గారికి ఈ పెత్తనాలెందుకు? తన గదిలో తను పడుండి వేళకి నువ్వింత పెడితే తిని వుండలేక….” తను మంజు మాటల్ని పట్టించుకోదల్చుకోలేదు. “ఇప్పుడు నేనేం చెయ్యకూడని పనిచేశానత్తయ్యా. మీ మడిచీర నేను తగలనే లేదు. నేనక్కడికి రాను కూడా లేదు… “తను సంజాయిషీ ఇచ్చుకోబోయింది.” అంటే నువ్వు తగలందే నా కూతురు అబద్ధం చెప్పిందంటావా? అబద్ధాలాడటం మీ ఇంటా వంటా వున్నాయేమో… నా పిల్లలకయితే లేవు. అయినా మీ తల్లిగారింట్లో మీకు మడి, దడి, ఆచారం పద్ధతులు తెల్సి ఏడిస్తే గద… అయినా నా బంగారం మంచిది గాక అవుసలిని అనడం దేనికిలే… నా కొడుకుకు చిలకకు చెప్పినట్లు చెప్పి… ఓ ఆచారం వ్యవహారంలేని కుటుంబంలా వుంది… వద్దురా… అని… వాడు వింటే గదా… నువ్వేమో చిన్న నా పొట్టకు శ్రీ రామరక్ష అని చాటుకు మాటుకు ఏ చిరుతుండో తింటావు పొద్దున్నే. నేను మళ్ళీ మడిబట్ట పిండుకునేదెప్పుడు… అందరికీ వండి నేను తినేదెప్పుడు… ఛీ…. ఛీ… ఇదంతా నా ఖర్మ….” గుమ్ములర్రకు వేలాడుతున్న చీరను లాగి విసురుగా నల్లాకింద పడేస్తూ అంటున్న అత్తయ్య మాటలకు ఏడుపొస్తున్నా బలవంతంగా ఆపుకుంది మీనా. ఇంక అక్కడ వుండలేక తన గదిలోకి పరిగెత్తుకొచ్చింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి? ఆలోచిస్తే ఎంతకూ అంతుపట్టదు తనకు. అత్తయ్యకు కూతుళ్ళంటే ఆరోప్రాణం. వాళ్ళెన్ని తప్పులు చేసినా సరే వాళ్ళమీద ఈగ కూడా వాలనివ్వదు. కానీ నిస్వార్థంగా తన సుఖం చూసుకోకుండా వీళ్ళ బాగోగులు పట్టించుకుంటున్న బావ పట్ల, బావ ఇల్లాలి పట్ల వీళ్లు ప్రవర్తించాల్సిన తీరేనా ఇది? తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ఇంత విద్వేషం విరజిమ్ముతారా ఎవరైనా? అసలేంటి వీళ్ళ స్వభావం? వీళ్ళ స్వేచ్ఛకూ, సామ్రాజ్యానికి తనను ఓ అడ్డంకిగా భావించడమే తన పట్ల వీళ్ళకున్న కోపానికి, విద్వేషానికి కారణమా?
పెళ్ళయిన మొదటిరోజు నుండి తను అత్తయ్య మనసు గెల్చుకోవడాన్కి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఆమె చూపులతోనే అల్లంత దూరాన నిలువరిస్తుంది తనను. దానికి తోడు తనకు అత్తయ్యకు మధ్య పంకజం వదిన, మంజుల ప్రమేయం కొరకరాని కొయ్యలా మారింది. తన పట్ల ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూ అత్తయ్యను ప్రభావితం చేస్తున్నారిద్దరూ. అత్తయ్యకు కూతుళ్ళ మాట వేదవాక్కు కావటం, పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతుండడం మీనాను కలవరపరుస్తున్న అంశం. చరిత్ర చెప్పినట్లుగా ధర్మరాజు జూద వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ర్టుడి మితిమీరిన పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణుడి కాముకత, కీచకుడి మూర్ఖత్వం విశ్వామిత్రుడి ద్వేషం, అశ్వత్థామ పగ, కుమార్తె దేవయానిపై శుక్రాచార్యుడి వల్లమాలిన మమకారం… ఇలా మనిషిలోని ఎన్నో స్వభావాలు మానవత్వ పతనానికి కారణమవుతున్నాయి. మానవ జీవన ఔన్నత్యాన్ని చివరికి మానవ మనుగడనే ప్రశ్నించే స్థితికి తీసుకెళ్ళాయి. ఈ స్వభావాల్లో ఏది మితిమీరినా అది మానవ సంబంధాలను, బాంధవ్యాలనూ విధ్వంసం చేస్తుంది. అత్తయ్యకు కూతుళ్లపట్ల వున్న అలవికాని ప్రేమ కూడా అట్లాంటిదేనా? ఆలోచిస్తున్న మీనా ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే వుంది. పెళ్ళికి ముందు ఎంతో చలాకీగా, ఉత్సాహంగా, ఉరుకుల పరుగుల నదిలా వున్న తను పెళ్లితో ఓ కల్లోల సముద్రంలా మారిపోయింది. మనిషిలోని ఇదివరకటి కళ లేదు. కళ్ల క్రింద నల్లని చారలు వయసును అమాంతం ఓ పదేళ్ళు పెంచేసాయి. పెళ్ళికి ముందు పాలరాతి బొమ్మలా వున్న తను ఇప్పుడు జీవనం కోల్పోయిన నల్లరాతి బొమ్మలా మారింది. రోజు రోజుకు ఏ పరిస్థితులలో మార్పు లేకపోగా, మానసికంగా తను చాలా చిత్రవధ ననుభవిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తను నిరాశావాదంలో కూరుకుపోయి బ్రతుకుమీదే విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు… లేదు… లేదు… అలా జరగడాన్కి వీల్లేదు. ఇంటి పరిస్థితులను తను చక్కదిద్దలేకపోతే, పరిస్థితుల నుండి తప్పుకొని అయినా తనను తాను కాపాడుకోవాలి. ఇప్పుడు తన ముందున్న సవాల్ అదే! ఇక లాభం లేదు పరిస్థితి బావకు చెప్పాలి. ఇంతకాలం చెప్పకపోవడమూ తాను చేసిన తప్పేనేమో… వీళ్ళ మీద పితూరీలు చెప్పినట్టవుతుందేమో అని, బావ మనసు విరుగుతుందో ఏమో అన్న సందిగ్ధంతో తనలో తనే మధనపడుతూ ఇంత కాలం నటించింది. చాలు… ఇక చాలు… ఈ రోజు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆలోచిస్తూ పడుకున్న మీనాకు కడుపులో వికారంగా అన్పించింది. నీరసంగా కూడ అన్పించింది. నాల్రోజులుగా ఎందుకో నలతగా ఉంటోంది ఒంట్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూనే అలాగే నిద్రలోకి జారుకుంది మీనా.
* * *
రాజ్యం పిన్నిని తీసుకుని ఊళ్ళో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు చేసి ‘మీరు తల్లికాబోతున్నారు’ డాక్టర్ చెప్పిన విషయం. ప్రతి స్త్రీ జీవితంలో అత్యంత మధురమైన, ముఖ్యమైన ఈ విషయం తనకెందుకో సంతోషాన్ని పంచలేదు సరికదా మరింత ఆందోళనకు గురిచేసింది. నిన్నటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది.
అత్తయ్య ధిక్కార స్వరం, ఈసడింపు చూపు, కూతుళ్లతో కలిసి ఆమె సూటీ పోటీ మాటలు… మనసును మెలిపెడ్తున్నాయి. మనుషుల్లో ఈర్ష్యాసుయాలు, క్రోధ విద్వేషాలు సహజాతాలు అని తెలుసు. కానీ, అవసరానుగతంగా ఏర్పరచుకున్న ప్రవర్తనారీతులు మనిషి స్వార్థపరత్వాన్నీ, ప్రేమరాహిత్యాన్ని ప్రతిబింబిస్తూ మనిషి అసలు నైజాన్ని బట్టబయలు చేస్తున్నాయా? ముఖ్యంగా సాంకేతికత, యాంత్రికతతో నిండిపోయిన ఆధునిక జీవన విధానం సాక్షిగా మానవ సహజ లక్షణాలయిన ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, స్నేహం లాంటి మధురిమలను సమాధి చేస్తూ కుటుంబ బంధాలు కూడా ఈ ‘ప్రేమ రాహిత్య మనే వరదలో కొట్టుకు పోతున్నాయా? తన కల్లోల హృదయ స్పందనలు తెలియని రాజ్యం పిన్ని ప్రేమగా హత్తుకుని అభినందించి, ఇప్పటి నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ గల గల మాట్లాడుతూనే వుంది ఇల్లొచ్చేదాకా.
* * *
తను తండ్రి కాబోతున్నానన్న శుభవార్త విని సంతోషంతో తబ్బిబ్బయాడు రామచంద్ర. ”ఈ దెబ్బతో అమ్మ నిన్ను నెత్తిలో పెట్టుకుంటుంది మీనా” అంటూ మీనాను ప్రేమలో ముంచెత్తాడు. కానీ, అతని మాటలు నమ్మాలన్పించలేదు మీనాకు. ఇంట్లో జరిగే విషయాల తీవ్రత అతనికి తెలియదు. తను నిన్న చెప్పాలనుకుంది కానీ ఇంతలో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మూలాన కుదర్లేదు. ”మీనా ఈ సమయంలో ఏవేవో తినాలని కోరికలుంటాయట గదా…. నీకేదైనా తినాలన్పిస్తే నాకు చెప్పు” భర్త మాటలకు నవ్వింది మీనా. మీనా మొహంలో ఆనందం లేకపోవడం రామచంద్ర దృష్టిని దాటి పోలేదు. అయితే అది నీరసం వల్లేమో అనుకున్నాడు.
* * *
స్వాతి మెటర్నిటీ హాస్పిటల్ వెయింటింగ్ హాల్లో అసహనంగా కూర్చున్న రామచంద్ర ఆపాదమస్తకం కంపిస్తోంది. లోపలకు తీసికెళ్ళిన మీనాకు ఎలా వుందో? ఆలోచనలతో నరాలు తెగిపడ్తాయన్న టెన్షన్‌కు గురవుతున్నాడు. అసలు తప్పంతా తనదే! మీనాకు అమ్మ చేతి తప్యాల చెక్క ఇష్టం కదా అని మీనాకు తెలియకుండా అమ్మతో చేయించాలనుకున్నాడు. పాపం అమ్మ కూడా చాత గాకున్నా, మీనా కోసం రెండు మూకుళ్ళు పెట్టి బాక్స్‌లో పెట్టి ఇచ్చింది. మీనాకు ఎప్పుడు తినాలన్పిస్తే అప్పుడు తినొచ్చని. ఏమైందో ఏమో తెలియదు కానీ అది తినగానే మీనా అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో పరిస్థితి తీవ్రమై ఇదిలో ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సి వచ్చింది. ‘ఫుడ్‌పాయిజనింగ్’ అన్నారు డాక్టరు ఎందుకిలా జరిగిందో తనకంతు పట్టడం లేదు. ‘రామచంద్ర మీరేనా?’ అన్న మాటకు తలతిప్పి చూశాడు. నర్స్! తలుపాడు అవునన్నట్టు. ”పేషంట్‌కి ఈ బ్లడ్ గ్రూప్ రక్తం అర్జంటుగా అవసరం. హాస్పిటల్లో ఈ బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో లేదు” ఒక్కసారిగా ఆమె ఏం చెప్తుందో తనేం వింటున్నాడో అర్థం కాలేదతనికి. అదే అడిగాడు.
”అవును ఫుడ్ పాయిజనింగ్ వల్ల బ్లడ్ వామిటింగ్స్తో చాలా రక్తం పోయింది. పెషెంట్ అనిమిక్ అయింది.
వెంటనే బ్లడ్ ఎక్కించాలి” ఆ మాటలు వింటూనే స్థాణువుగా మారాడు ఒక్క క్షణం. కానీ వెంటనే తేరుకొని, బైక్ తీశాడు, ఫ్రెండ్స్ అందరినీ ఫోన్లో అలర్ట్ చేస్తూ విషయం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టమని చెప్పాడు రామచంద్ర.
‘బి’ నెగెటివ్ చాలా అరుదైన బ్లడ్ గ్రూప్! ఎంత ప్రయత్నించినా రామచంద్రకు ఈ గ్రూప్ బ్లడ్ కానీ, డోనర్స్ కానీ దొరకలేదు. ఊసూరుమంటూ హాస్పిటల్ చేరుకున్నాడు. ఎదురుగా వస్తున్న రాజ్యం పిన్నితో ‘పిన్నీ…’ బేలగా మారాడు రామచంద్ర. ”రక్తం ఎక్కించారు. కోలుకుంటోంది. ఇంకో గంట తర్వాత చూడొచ్చన్నారు రా చంద్రా… అంతా ఆ భగవంతుడి దయ… కాకపోతే అబార్షన్ అయిందట…. పెద్ద ప్రాణం బాగుంది చాలురా… అంటున్న రాజ్యం పిన్నితో ”ఎంత వెదకినా రక్తం దాతలుదొరకలేదు పిన్నీ… అయితే వీళ్ళే అరేంజ్ చేశారన్నమాట… నా మీనా బావుంటే చాలు పిన్నీ… మనసులోనే భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రామచంద్ర.
* * *
హాస్పిటల్ నుండి రామచంద్ర ఇంటికొచ్చే వరకు అనసూయమ్మ పెద్ద గొంతుతో ఆవేశంగా మాట్లాడడం విన్పించి ఏం జరిగిందోనని ఆందోళన చెందాడు. రాజ్యం పిన్నితో అంటోంది అమ్మ ”వాళ్ళింక ఈ ఇంట్లో ఒక్క క్షణం వుండటానికి వీల్లేదు రాజ్యం… నా మీదనే అనుమానపడ్డక ఇక ఈ ఇంట్లో నా కొడుకైనా సరే… వుండటానికి వీల్లేదు వెళ్ళిపొమ్మను. ఈ క్షణమే పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టుకొమ్మను. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళయినా ముట్టను ఆఁ…అంతే… ఈ అనసూయమ్మ మాటకు తిరుగులేదని చెప్పు…” రాజ్యం పిన్ని అమ్మను సముదాయిస్తోంది. ఊరుకో అక్కయ్య… సర్లే … బాధపడకు. అలాగే వెళ్తాడులే… వాడి ప్రాణాలన్నీ నీ మీదే. నిన్నొదిలి వెళ్లటం అంటే వాడెంత బాధపడ్తడో ఆలోచించు. బావగారు పోయినప్పటి నుండి నిన్నూ, కుటుంబాన్ని పట్టించుకుని మీరే లోకంగా బతుకుతున్నాడు… ఉన్న ఫళంగా వెళ్ళిపోమంటే…” ”అందుకే వెళ్ళి పోమంటున్నా.. మా బాగోగులు మేం చూసుకోగలం.. అయినా పట్నమెంత దూరమని. ఎప్పుడు రావాలన్పించినా వచ్చి పోవచ్చు. పొలం వ్యవహారాలు చూసుకోవచ్చు. కానీ ఈ ఇంట్లో వుండడనికి మాత్రం వీల్లేదు. అంతే….” తనకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది అమ్మ మాటలకు. తనకు… అమ్మ మీద అనుమానమా? ఛ… అమ్మ తనను అపార్థం చేసుకుంది. అమ్మను అనుమానిస్తే తనను తను అనుమానించుకున్నట్టే…! తను అమ్మతో మాట్లాడ్డనికన్నట్టు నాలుగడుగులేశాడో లేదో రాజ్యం పిన్ని వచ్చి తనను పక్కకు తీసుకెళ్ళింది. అమ్మ మనసేం బాగా లేదని, బాగా కోపంగా వుందని, కోపం చల్లారాక వచ్చి కలవచ్చనీ సర్ది చెప్పి పట్నంలో వాళ్ళ తమ్ముడి అపార్ట్మెంట్ ఖాళీగా వుందని అందులో వుండోచ్చాని చెప్పింది. అమ్మ మాటకు ఎదురుచెప్పకు అంది. ఇంకా ఏమోమో అంది పిన్ని. తన బుర్ర పనిచేయడం మానేసింది. ఏం జరుగుతుందో, ఎందుకో అనేది తెలియలేదు.
ట్రాలీ ఆటో రావడం, గ్యాస్ స్టవ్, బియ్యం, పప్పులు, సామాన్లన్నీ అందులో సర్దేయించటం, మరో ఆటోలో ఇల్లు సర్ది పెట్టి వస్తానంటూ రాజ్యం పిన్ని తనతో రావడం ఒక పీడకలలా చక-చకా జరిగిపోయాయి. అమ్మ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుందో ఎందుకంత నిషౖసరంగా మాట్లాడిందో ఎంత ఆలోచించినా రామచంద్రకర్థం కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను పంటి బిగువున ఆపడం సాధ్యం కాలేదతనికి. ఆటో కదుల్తుంటే, ఆశగా తల బయటపెట్టి తొంగి చూసిన తనకు కన్నీళ్ళ మసకలో పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలో నిలబడి చూస్తున్న అమ్మరూపం అస్పష్టంగా కన్పించింది.
* * *
అప్పుడే పదిహేను రోజులైంది.పట్నంలో మకాం పెట్టి. మీనా కోలుకుంటోంది నెమ్మదిగా. ఆ రోజు వచ్చి ఇల్లు సర్దిపోయిన రాజ్యం పిన్ని మీనాను చూసి పోదామని వచ్చింది మళ్ళీ. చదువు కోసం హాస్టల్లో వున్నప్పుడు తప్ప, పుట్టి బుద్దెరిగినప్పటి నుండు అమ్మను చూడక, మాట్లాడక పదిహేను రోజులుండటం తనకిదే మొదటిసారి. బాధగా అన్పించింది. అసలేం జరిగిందో తెలియక అయోమయానికి గురవుతుంది మీనా.
కానీ, ఈ రోజు రాజ్యం పిన్ని చెప్పిన విషయం విన్నప్పట్నించీ మనసు అమ్మ మీదికే వెళ్తోంది పదే…
పదే! అమ్మ ఇదంతా రాజ్యం పిన్నితో కల్సి తన సుఖం కోసమే తన సంతోషం కోసమే చేసిందని… ఇంట్లో వున్న అసహన పరిస్థితుల నుండి తాను, మీనా దూరంగా వెళ్ళి ఆనందంగా జీవించాలని తాపత్రయ పడిందనీ, ఊరికే తనను పట్నం వెళ్ళి వేరు కాపురం పెట్టమంటే తనొప్పుకోడనీ, ఆమె కోపంతో వెళ్ళిపొమ్మన్నట్లు నాటకమాడిందనీ తెలిసినప్పటి నుండు హృదయం బరువెక్కింది. తనకు తెలిసిన మరో కొత్త విషయం మీనాకు రక్తం అమ్మనే ఇచ్చిందని! ఈవిషయం ఎవరికీ తెలియనీయవద్దని డక్టర్లను కోరిందట.’అమ్మా…’ రామచంద్ర మనసు తల్లి పట్ల కృతజ్ఞతతో నిండిపోయి, మూగగా రోదించింది.
‘నేను మీనా సుఖంగా వుండటం కోసం ఇదంతా చేశావా అమ్మా…. నేను లేకుండ నువ్వెలా ఉండగలుగుతున్నావమ్మా… ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడ చెయ్యలేదు రామచంద్ర. చాలా సేపటికి తేరుకొని ‘మీనా లేచి తయారవు…అమ్మను చూసొద్దాం’ మీనాకు చెప్పి ఫోన్ తీశాడు క్యాబ్ బుక్ చేయ్యడానికి.
* * *
సాయబానులో పట్టెమంచంపై నీరసంగా పడుకొని వుంది అనసూయమ్మ. కళ్ళు మూసినా, తెరచినా కొడుకు చంద్ర బేల చూపులే కదలాడుతున్నాయి కళ్ళముందు. తాను తీసుకున్న ఈ అతి పెద్ద నిర్ణయం వెనక ఆమెకు, పంకజంకు తప్ప ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటుంది. కోడలుకు తప్యాల చెక్క చెయ్యమని కొడుకు అడిగినప్పుడు తనకు చాత కాక, పంకజం సహాయం తీసుకున్న అనసూయమ్మ, పంకజం మీనా పట్ల కోపంతో, ద్వేషంతో లోగడ ఫలహారాలు చేసి వాడి పక్కకు పెట్టిన ముతక నూనెతో తప్యాల చెక్క చేసిచ్చిందని, దానివల్లే ఇంత ఉపద్రవం జరిగిందనీ తెలుసుకున్న అనసూయమ్మ హతాశురాలైంది. అయితే, తాను చేసిన పనివల్ల పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందని తాను అనుకోలేదని బావురమంది పంకజం తనను క్షమించమని తల్లిని వేడుకుంది. ధారాపాతంగా ప్రవహిస్తున్న పంకజం కన్నీళ్లలో మీనా పట్ల కోపం కొట్టుకుపోయింది. ఆమె కళ్లలో పశ్చాతాపం కనిపించింది. మీనా పట్ల కూతుళ్ళ అసహనం రోజు రోజుకూ హద్దులు దాటుతోందని గ్రహించిన అనసూయమ్మ బాధ్యతలు గుర్తెరిగిన బంగారు మనసున్న రామచంద్ర కాపురం సుఖంగా సంతోషంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంది. అంతులేని ఆవేదన ఆవహించినా, కొడుకును, కోడలును, ఆ పరిస్థితుల నుండి దూరంగా పంపడనికే నిశ్చయించుకుంది. తన నిర్ణయం వల్ల కొడుకు సంసారం సాఫీగా సాగుతుందని తలచి, వాళ్ళు ఆనందంగా పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుకుంది. తన మనసు ఇప్పుడు తృప్తిగా వుంది. మూసుకున్న ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జల జలా రాలాయి. ఇంతలో అమ్మా అంటూ పిలుపు! సందేహం లేదు… అది తన చంద్రదే…
గబుక్కున లేచి కూర్చుంది మంచంలో. అనసూయమ్మ మనసు ఆనందంతో పురివిప్పింది.
(సమాప్తం)
*” ఏమో ఏమో ఎంక ఎండుక పోతున్నావు
గాసం లేక నువ్వు గుంజుక పోతున్నావు
రోటిలో సజ్జా కంకి దంచితే మెదుగా దెందుకు..
తీటది తిర్లా గిరి
పడిదెల పసునురు
ఏతుల ఎంకటం పెటా
మాటల మల్లాపెల్లి …|| ఏమీరా.. || అంటూ తున్నగా రాగం తీసిండు
” దేహె వుకో తాతా నీ ఇనాం పెల్లి కి నా వారేదు ఊ అంటే సందులురు లో పడతావు ఎతుల బొచ్చు ఏడు గంపలు కింది బొచ్చు మూడు గంపలట గాని జరుపు పులిని జరుపు” పులి జూదం లో పులి కాయ వైపు చూస్తూ అన్నడు
” మనువడా నీ మేక సచ్చింది” అంటూ మేక కాయ రాయి చేత తీసుకుండు
” అబ్బా పులి జూదం ల నన్ను మెసుల నియ్యవే నీ ఎటూగాల”… అన్నడు విరేషా
” తాతా ఓ తాతగారు రాతిరి మా బావగారు కూతురు మీ అత్త గారు కూటికి పిలిచిందోయి అన్నదట ఎట్లనో చెప్పవైతివి మనువడ ” అన్నడు తాత
” ఓ తాత ఏం సాత్రం ఏస్తివే నీ దెబ్బ గాల ” నవ్వుతూ పక్కన నిలబడి పులి జూదం ఆట చూస్తున్న దమయంతి కొడుకు పరశురాముడు పక పక నవ్వసాగిండు
” రారా తమ్ముడ పెండ్లాం కొడకా సక్కగ రారా సన్నిస్తా అన్నదట యట్లనో చెప్పవైతివి ” మళ్ళీ నవ్వు పక పక నవ్వు నవ్వుతూ ” ఓ తాతా ఒక బీడీ ముక్క ఇయ్యవయితివి ” అనె వైరేశ
” దేష వూకోవు లజ్జ కాదోయ్ నన్ను అడుగ అడివిలో తిరిగే వానికి ఆకు కరువా ఊరిలో తిరిగే వానికి బీడీ కరువా ”
” అబ్బా మాటకు మాటేస్తవే ఓ సాత్రమన్న చెప్పు”
” ఓయి ఇంగో అతడు వేసిన కుందేలు యి య్యాల్ల యాట అయ్యింది సచ్చిన మొగడు సండ్ల మీద మని వున్న మొగడు మంచం మీద పడుకున్నారు ఎట్లానో చెప్పవైతీవి ”
” నువ్వే చెప్పు నేర్చుకుంట కానీ గింత పోవాకు అన్న పెట్టు ”
” సుట్ట గుతీ సుక్క గుతి వొకటే నషా ఇంగ పటు” అంటూ పొవాకు పెట్టిండు.
” అబ్బా ఎంత ఘాటు గుంది ఉచ్చుబ్బులకు సుట్ట తాగితే నోరంతా గత్తు వాసన కొడ్తుంది ..”
” అరే గొర్రెకు మండ తినవెట్టు నేను కుడితి తాపుత గాని”
ఇంటిముందు గొరెపిల్ల చెంగు చెంగున గంతులు వేస్తూ ఎగురులాడుతుంది అన్నది దమయంతి నీళ్లు తేస్తు
దాని మెడలో గజ్జె గల్లు గల్లున చప్పుడు చేస్తుంటే ఆమే కొడుకు ఆటాడసాగిండు
” అవునా మనువడ అట దిక్కులు జుస్తవు ఆడవు ”
” దెహి వుకొ తాతా , నువ్వు గింత
మేస్లనిస్తలేవు, నేను నీతోని గెన్నుతన ”
” ఆడవోయి జరంత వొడుపు తోని ఆడితే సరి ”
“ఇదిగో పెద్దమనిషి ఇది ఎంకట లచ్చమ్మ బండే కదా” కొత్త మనిషి అడిగిండు
” అవును ఏవురు మీది కొత్తగ చూస్తున్నా”
” మాది పాటిమీది గూడెం గాని జర గీ పత్త చెపుతావు”
” అరే గి చిట్టి జూడు ఎవరి పేరో ”
” ఏది ఇక్కడ తే ” అంటూ చేతులకు తీసుకుంటూ ” ఇదా ఇది అగ్గో దమయంతి అక్కది , ” తల గికుతూ అయింటి వైపు చూస్తూ వేలెత్తి చూపి ” దమయంతక్కో ఓ దామయంతక్కో” అని కుతేసిండు.
” ఎంద్రా విరేశా ఏంది అట్లా తొవ్వ తప్పిన దూడ లెక్కా అరుస్తున్నవు ” వారివైపు చూస్తూ అడిగింది
వచ్చిన అతను అమాయకథను నటిస్తూ తెలగండ్లేసి ఆమే వైపు చూస్తూ వుండు
ఆమె దగ్గరికి సమీపించి ” ఎవరు నువ్వు ” అంటూ పైకి కిందకీ ఎగాదిగా చూసి అడిగిందీ.
” మాది మాది. ” అంటూ నీళ్లు నమిలి మింగుతూ తటపటాయించి పాటిమిదిగూడెం నుంచి వస్తున్న కాకి ఎర్రయ్య పంపిండు.” అని అన్నడు
” ఎంపని మీద వచ్చినవు ” అడిగింది.
” ఇయ్యాల పనికి వస్తా అన్నవట గదా కాకి ఎర్రయ్య బాయి కాడికి నిన్ను పిల్చుక రమ్మని పంపిండు ” తమాయించుకుని పలికిండు.
” ఇయ్యాల నాకు తీరదు ఆదివారం మా వోడు ఇంటిపట్టున వుంటడు ఒక్కడే గద్దగాడు రేపు వాడు బడికి పోతడు రేపోస్త ” అంటూ అతనివైపు తీక్షణంగా చూస్తూ పలికింది
” అరే అయన మీ పెనిమిటి ఒక్క సోపతీ అటగదా మీ పెనిమిటి పట్నం ల వుండట కదా గా ముచ్చట సగా తెచ్చిండు ఆయిన అక్కడనే ఉండు ఊరికి ఈ మధ్యనే వచ్చె. నువ్వేమో పనికి రేపు మాపు అనుకుంట వొస్తలేవు అందుకే నన్ను తోలిండు కలుపు అట్ట నే వుంది నెల సంది వెంట బడ్డ కరువు పనిలో పడి కూలీ జనం దోర్కుత లేరు ఆయిన బాయి కాడికి నువ్వు నాట్లకు వచ్చినవు ఒక్క తీరుగ రమ్మన్నడు నీకు దంటగ మా యామె, ఆయన భార్య సగ వున్నరు” ఉరడిస్తు పలికిండు
” సరే వొస్తగాని నువ్వు పో నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది”
అయితేమాయే నువ్వు తయారు గా నువ్వు ఇంట్ల పని ముగించుకొని వొచ్చిందాక ఇక్కడ ఆట చూసుకుంట కుసుంట ” అన్నడు
ఒరే పరశరామ నేను పనికి పోతున్న గొర్రెకు మండ వుంది పగటిలి నీకు ఉట్టిమిద సద్ది పెడుతున్నా తిను ఇగో బుంగల బిందెల సాగరు నీళ్లు వున్నయి తాగు వుల్గ పోయకు అట్లనే గొర్రెకూ నీళ్లు దాపు విరేశోల్ల దొడ్డిలో ఆళ్ళ మేకల మండ వుంది కొంచెం ఎయ్యి. ” అని చెప్పింది దమయంతి.
” నీయమ్మ నేనోస్తనే ” అంటూ అమాయకంగా చూస్తూ అమ్మతో పలికిండు కొడుకు పరశరాముడు.
” వొద్దురా నేను వరి సేల కలుపు తీసే పనిల వుంట నా యెంట తిరిగితే కుదురదు ”
” తీసుక రావమ్మా అక్కడ ఆడుకుంటడు మేము వున్నము కదా” అని పలికిండు వొచ్చిన అతను.
ఆమె చేసేది లేక కొడుకువైపు చూస్తు సంచి సర్దింది
ఇంటిముందు గొర్రె ఆమెనే చూస్తూ ఆమెను రాసుకుంటూ పూసుకుంటూ తిరగసాగింది
ఆమె కొడుకు మురిసిపోతూ తల్లివైపు చూసిండు
” అరె మొక్కుర వెంకట లచ్చమ్మ బండ చేతులెత్తి మొక్కురా మీ అయ్య యాడున్నడో గని మన ఆకలి దూప యాల్ల మాల్ల తీర్చే సల్లనితల్లి ” అనగానే కొడుకు పరశరామ ఎంకటలచ్చమ్మ బండ కు మొక్కిండు
ఆమె తన పక్కింటి వారికి ఇల్లు చూడమని చెప్పి తన కొడుకును గొర్రె ను తోలుకొని పనివైపు కదిలింది ఆమెను చూస్తూ గొర్రె నడుస్తుంది. దానిని అదిలిస్తు కొడుకు నడుస్తుండు వారిని అనుసరిస్తూ వచ్చిన అతను నడవ సాగిండు…
” అరే నువ్వు బాయి మోటార పెట్టు నేను మండువా మలుపుత ఇదిగో దమయింతి వరి మడికట్ల నీకు తోడుగా మా ఆడోళ్లు వున్నరు వారిని కలుపుకొని కలుపు తియ్యి ”
” సరేఅన్నా “అంటూ అటువైపు కదల పోయింది
” మీ పెనిమిటి తోనీ మాట్లాడుతవా ” అని ఎర్రయ్య అనగానే “అమ్మో నేను మాట్లాడుతనే నాయిన తొని ” అనె కొడుకు
” అరే షిడం ఆగురా మీ నాయిన ఎటేట్టా వుండో ఆరునెలలు అయితుండే పొయ్యి ఇగవస్తి అగవస్తి అనుడే గాని ఇంత వరకు రాకపాయే అప్పుడప్పుడు సుక్కలెక్క మెరిసి నేనున్నా అంటడు కుదార్థంగా కూసొని మనసు తీరా మాటాడింది లేదు ఎట్టుండో, గాని కలిసిందా అన్నా పోను ఎది ఇటియ్యి” అని అడగగానే అతను పోను చేతికి అందిస్తే పోను తీసుకోని
” అలో… అలో , ఎందిది సడి సప్పుడు లేదు ఎట్టరా మాట్లాడేది” … చిత్రంగా పోను చూస్తూ అన్నది మళ్లీ
” అలో.. అలో ” అని అన్నది అవతల ఎత్తిన గొంతు ” అలో..
అలో ఎవరూ” అని పలికింది
” నేను దమయంతమ్మ ను మా రాజయ్య నేనా మాట్లాడేది”
” అలో రాజు పనిలో వుండు”
” కష ఇయ్యి మా రాజుకు” తడబడుతూ అన్నది
” ఇప్పుడు కుద్రదు లంచ్ టైముకు పోను చెయ్యి ” అంటూ పోను కట్ చేసిండు దూరంగా ఆమె వాలకం గమనించ సాగింది ఎర్రయ్య భార్య ముసిగా నవ్వుతూ పక్కకు తల తిప్పి చూడసాగిండు ఎమెరుగనట్టు ఆమె అమాయకంగా కొడుకు వైపు చూస్తూ
” ఓషే పనిమీద వుండట రా పరుషా మీ నాయిన. పగటీలి బువ్వ తింటప్పుడు మాట్లాడుదాం తియ్యి.”
“ఆర్నియమ్మ నాయినతోని మాట్లాడాలి అనుకుంటే పనిమీద వున్నాడు వుంటెంది పోను వచ్చిందని పిలువాలే”
” ఏదో పనిలో బిజగా వున్నట్టుంది
సరే గాని మధ్యాహ్నం చేద్దాము తియ్యి ” అంటూ తను పనిలో మునిగింది
కొడుకు గెట్టున కుసుండు బిట్ల గొర్రె ను తోలి కావాలి గాసుకుంట ఆమె వరి మడి కట్ల కలుపు తీసే పనిలో మునిగి వుంది ……
…
” అన్న రాజు గాడు మీ చెల్లిని తీసుక పోయిండని అనుమానం తో వానెంట పడితిమి వాడు చిక్కపాయే ఎన్ని రోజులు గాలం వేసి చూసినా దొరక లేదు గాని అతని భార్య ను ఇబ్బందుల పెడితె లెక్క ఓకేనా ”
” అరె వాడు యాడున్నా ఏ బొర్రెలో ఎంత కాలం దాసుకున్నా వానికి తప్పదు కానీ వాని పెండ్లాం పిల్లల ఇరుకు ఇబ్బందుల పెట్టాలి వానికి చుక్కలు చూపించాలి, వాడు శంకర గిరి మాన్యాలు పట్టాలి . ఎంతతోడు అంతనే వుండక మన ఇంటికి కన్నం బెడతడా కొడుకు గివ్వన్ని వానికి తెలుస్తయి తెలువాలే , మనమెంది మన కాందాన్ ఏంది తెలియదా ”
” అవుననుకో మనకు అనుమానమే కానీ కాని ఏంది కండ్ల చూస్తే ఏది లేదుకదా మన పిల్లకు తప్పులో పాలుంది కాదా”
” అరె మనం ఏమయినా చేస్తం వాడు బండమీద బతికే వాడు కుర్సిల కుకుంటాడు
మన పిల్లకు తప్పులో పాలుంది కాదాని వుకుంటమా
కుక్క ను సముద్రం దగ్గరికి తీసుకెళ్లినా గతుకుడే గాని మనలెక్క తాగుతదా ”
” నిజమే ననుకో మనకు ఏమన్నా ఇబ్బందులు వస్తయ”
” ఎందుకట్ల భయపడతవు మన మీద ఈగ వాలకుంట చేసినా టౌన్ లో ఎస్సై, సి ఐ, డిఎస్పీ అంతా మనోళ్లే వాడు చిక్కెనా ఏకీలు కా కీలు విరిచి పెడతరు నువ్వేం పరేషాన్ చెయ్యకు”
” నాకు ఇల్లు పొల్లు వుండే నాకేమన్నా వస్తదేమొనని నీ మాట విని నేను గింత పాపం మూట కట్టుకుంటి, నీకేంది బాగానే ఉంటవ్ ఎన్నిమాటలయిన చెబుతవు. నాకేం చుట్టుకుంటదొ పిల్లల గల్లోన్ని ” లోలోన అనుకుంటూ నీళ్లు నమిలి మింగసాగిండు దమయంతి వారివైపు చూస్తూ ” ఏమయివుంటది అబ్బా వాళ్లు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు” అని లోలోన అనుకుంటూ తిన్నగా లేసి వాల్చిన నడుము ఎత్తి కొట్టంలో కి కాడి మోకు కోసం వెళ్ళింది. అదే అదునుగా ఎర్రయ్య ఆమె వెనుకాల నాసి పెట్టుకోనీ అగంతకునిలా కొట్టంలోకి జొరబడి ఊపిరి ఆడకుండా ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు అతని చేతి లో ఆమె ఉక్కిరి బిక్కిరయ్యింది ఆ క్షణం జీవితం లో మొదటిసారి ఆమె నరకం అనుభవించింది అనుకొని హఠాత్ పరిణామానికి ఆమెకు ఏం చేయాలి తోచలేదు ఎవరికి చెప్పాలో తెలియదు గుండెల్లో ఒకటే దడ మొదలైంది ఉలికి పడిపోయింది ఒళ్లంతా చెమటలు పట్టింది గుండె వేగం పెరిగినకొద్దీ లోలోన ఆందోళన పడుతూనే వుంది రెప్పపాటులో అంతా జరిగిపోయింది కలా నిజమా తేల్చుకోలేని అయోమయం లో ఆమె ఎందుకు ఇలా జరిగింది బుర్రను తొలిచి వేస్తున్న ప్రశ్న అతను ఇలా చేయడం ఏమిటి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదొ తెలియకుండా వుంది ఏమిటి ఈ విపత్కర పరిస్థితి. తలిస్తే కంపరం పుడుతోంది. వాడిని అక్కడికక్కడే ఉప్పు పాతర వేయాలన్నంత కసి…. కాని మౌనం పాటించి మిన్నకుండి పోయింది అంతా కర్మ పళ్లు పటపట కొరుకుతూ నిష్చేస్తురాలైంది తనకు తెలియకుండానే పళ్ళతో కిందిపెదవిని అదిమి పెట్టింది పేదుం చిట్లి ధారలుగా రగుతం కారింది తిన్నగా దుల్పాయించుకొని బయటికి వచ్చి అటిటు చూసింది కొడుకు ఏటో పరుగు తిస్తుండు గొర్రె కనిపిస్తలేదు అంతా అయోమయం. …దిగులుతో చడి చప్పుడు చేయకుండా ఇల్లు చేరింది. కొడుకు గొర్రె కోసం తిరిగి తిరిగి అలసిపోయిండు. ఎనకాల తిన్నగా ఇల్లు చేరిండు కండ్లు కంతలకు పొయినయి మొకం పిర్చుక పోయింది గొర్రె జాడ లేదు. వుత్త చేతులు పిసుకుతూ అటుగా చూసాడు సాయమాను గుంజ చిన్నబోయింది అమ్మ మంచం లో నిద్ర పోయినట్టు వోరిగింది. ఏమీ తెలియని పరశురామ అమ్మ పక్కేంట మంచం మీద కూర్చుండు.
…
” అమ్మా అమ్మో మన గొర్రె ఎక్కడ పోయిందే నేను దాని పక్కనే ఉన్న చిత్రంగా మాయమైంది” ఆమె గునుస్తు తిన్నగా కళ్లు తెరచి ” ఎవరో దొంగలు ఎత్తుక పోయినట్టుంది లేకుంటే ఎవరి దొడ్డిలోకన్న పోయిందేమో పొద్దుగాల లచ్చమ్మ బండకు మొక్కి చూద్దాము రా” తిన్నగా అన్నది
” అమ్మా మన దేవునికి మొక్కితే దొరుకుతదా ” ఆమె వైపు అమాయకంగా చూస్తూ అన్నడు
” మన సొమ్ము మనకు రుడముంటే తప్ప క తిరిగొస్తది, మనది కాకుంటే మంది పాలు అయితది అంతా దేవుడు చూస్తడు తియ్యి రా ఎందుకు విసిగిస్తవు ” పాలిపోయిన మొముతో అన్నది
దారెంట వెళ్తున్న తాత వారి మాటలు విని ” ఏంది దమాయమ్మ పిలగాడు సతాయిస్తుండా ” అడిగిండు
” గోరెపిల్ల కాటు వడ్డది మామ ” తిన్నగా అన్నది
” అరే అట్లనా ఎర్కలి బువ్వమ్మ తానికిపొయ్యి సాట సకినం చుపియి యాడవుందో ఆనవాలు చెప్తది ” తీక్షణంగా చూస్తూ పలికిండు
” దోర్కేన మామా దొంగలు దోస్క పోయినట్టుంది” బేలగా చూస్తూ పలికింది
” ఇగ్గో ఆమె చెప్పినట్టు చెయ్యి ముందు పసుపు బియ్యం లో పావుల నేములు వేసి దేవునికి మొక్కి ముడుపు కట్టు ” అన్నడు
” మర్సే పొయిన వుండే సారయ్య మావ కాళ్ళు చేతులు కడుక్కొని ముడుపన్న కడుత కానీ నీకు ఎరుకేనాయే సాట సకినమ్ సుడరాదే ” లేచి నెత్తి జడ ముడివేసి మొకాన నీళ్లు చల్లుకుంది.
” అది నాకే పెడుతున్నావు ఏది గిన్ని బియ్యం సాట్ల పోసుకొని తీసుక రా ” అని అన్నడు తాత. ఆమె పైట కొంగుతో మొకం తుడుస్తూ సోలతో బియ్యం తీసింది.
అతను దోసెడు బియ్యం సాటలో పోసి సాట ను బొటన వేలు చూపుడు వేలితో మధ్యలో పట్టుకొని
సాటను తిన్నగా ఊపసాగిండు కనురెప్పలు ఆడిస్తూ గుడ్లు మిటకరించి సాట వైపు చూస్తూ
” సొమ్ము ఎక్కడ ఉంది తొవ్వ చూపు, వొస్తదా, వొస్తదా , రాదా రాదా, తూరుపా, ఉత్తరాన, వోయిములా పడమరా, డచ్చినాదా ఎక్కడా ఎక్కడా పెడమర్ల చూపు చూపు ” అంటూ సరాయిస్తు శకునం చూడ సాగిండు ఆమె ఆమె కొడుకు ఇద్దరూ గుడ్లప్పగించి అతడిని చూడ సాగిండ్రు.
అతడు సాట చేతితో పట్టుకొని దానిని పరిచ్చగా చూస్తూ ” ఇవురెనా. ఇరుగపొరుగు లో వుందా ఎటుపక్క ? దొరుకుతదా.. దొరకదా.. చిక్కదా.. అంతేనా.. ” సరాయిస్తు ఆవలిస్తూ డేపులు తీస్తూ దమయంతి వైపు చూస్తూ “వొమ్మా దొరకదు రా ఆశ వదులుకో పెద్ద గద్ద చూపు పడ్డది రా మనది కాదనుకో బిడ్డా ” ఆశ వదులుకో అన్నట్టుగా చేత సైగ చేసాడు.
అతను తిన్నగా అక్కడి నుంచి లేచి బైటికి వచ్చి అటిటు చూసి ” భద్రం రా ” అంటూ ముందుకు కదిలిండు అతని మాట అమెకు బోద పడలె
” అమ్మా మన గొర్రె దొరుకాదా ”
” ఇంకెక్కడి గొర్రె రా ఎవని కన్నో మన ఇంటిమీద పడ్డది మనమూ ఈ ఊరు విడిచి పోవాలె ”
” ఎందుకమ్మా మనది ఈ ఊరు కాదా ” కండ్లు నలుస్తు అన్నడు
” నీకు ఎట్లా చెప్పరా మీ అయ్య జాడల పట్నం పోదాం పండుకో కోడి కుయంగలేచి బాట పడుదాం ” అని కొడుకుకు చెప్పింది కాని రెప్ప మూయలేక కన్నీరు కారుస్తూ కొడుకు పక్కన వొరిగింది. ఆ రాత్రి వారికి కాల రాత్రి
” మన ఇంటి సూట్టు కొలిమి దెయ్యాలు పడ్డయి
బట్ట కాల్చి మిదేసి బదనాం చేస్తరు పొద్దు పొడువక ముందె పోదాం గాని పండుకో రా ” అని తీన్నగా గొనిగింది.
కొడుకు నిద్రలోకి జారుకుండు
ఆమె పరి పరి గా ఆలోచిస్తూ వుంది నడి రాతిరి తలుపు టకటకా చప్పుడు ఉలికి పడి లేచింది ” దమయమ్మో ఓ దమయమ్మా ” పిలిచినట్టు వినపడింది చిన్నగా లేచి గొళ్ళెం తీసింది ఎదురుగా పక్కింటి అతను ఆమెని చూస్తు పిందారా” చేస్తున్నారు రావమ్మా అని పిలిచిండు అలాగే అన్నట్టు తల వూపి తలుపు గడియ పెట్టి నిద్రలోకి జారుకుంది
మునిమాపుజామునలేచి సాటసకినం చూసిన, మిత్తి దీసిన పసుపు కలిపిన బియ్యం పైసలు ఉతికిన గుడ్డలో మూట కట్టి దేవుని పటము దగ్గర వుంచింది
” అమ్మా ఎంకట లచ్చమ్మ నీ బండకు మొక్కుత్తున్న నేనా ఒంటి దాన్ని నేను ఏ పాపం ఎరుగ అన్నెం పున్నెం నీ కెరుకా తప్పు చేసిన వాడు ఏం ఇగురు పెట్టడు , గాని సప్పుడ చేయకుండా నిన్ను తలుస్తున్నా నీదే భారం. తప్పు చేశామన్న వాడు చెంపలు వేసుకొని ముక్కు పట్టుకొని నేల రాయాలే వానికి క్షమాపణ లేదు నేను నిన్ను మల్ల చుస్తనా ఇదే ఆకరా నీదే మాయ ఎలేడు పిలగాని తోడుకొని ఊరు విడిచి ఊరు కానీ ఊరుకు పయనం అయితున్న సెలవు తల్లి ” అంటూ మనసులో దీనంగా కుమిలి కుమిలి విలపిస్తూ ముందుకు బాట సాగబోయి ఆగి అటు ఇటూ చూసింది అక్కడ అందరూ తిరుగుతున్నారు కొందరు వారివారి పనులకోసం పోతున్నారు ఇంటిలో దీపం వెలిగించి బయటికి తొంగి చూసింది దూరంగా దీపపు వెలుగు లో తల తల మెరిసింది ఏమిటది మెరుస్తుంది అని అటుగా నడిచింది తాకి చూసింది గల్లుమని చప్పుడు వినిపించింది దానిని చేతికి తీసుకోని చూసింది అది ఆమె గొర్రె మేడలో తాను ప్రేమగా కట్టిన గజ్జె ఇక్కడకి ఎలా వచ్చింది. ఆమెకు లక్ష చిక్కు ముడుల చిక్కు ప్రశ్న ఆమె పుర్రెను తోలిచింది సమాధానం దొరకని ఆమె అలా తన కొడుకును వెంట తీసుకోని ముందుకు కదిలింది…
రేఖ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో పేరున్న కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాగానే సంపాదిస్తుంది. రేఖ తండ్రి సూర్య ప్రకాశ్ సిండికేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కాగా తల్లి సరిత గృహిణి. రేఖ ఇద్దరు తమ్ములు కాలేజి చదువు కొనసాగిస్తున్నారు. సూర్య ప్రకాశ్, సరితలు ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిర నివాసం. ముగ్గురు పిల్లల చదువు హైదరాబాదులోనే జరిగింది. గత రెండు సంవత్సరాలుగా సూర్య ప్రకాశ్, సరితలు రేఖ వివాహ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు మాట్రిమొనీలో కూడా రేఖ వివరాలు పొందు పరిచారు. కాకపోతే రెండు నెలలుగా సూర్య ప్రకాశ్ తల్లి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ప్రయత్నాలకు కొంత విరామం ఏర్పడింది. వృద్ధాప్యరీత్యా వచ్చిన జబ్బుల మూలంగా సూర్య ప్రకాశ్ తల్లిని ఆసుపత్రిలో చేర్పించ వలసి వచ్చింది. ఆవిడ వయస్సు తొంభై కి దగ్గరగా ఉంది. పదిహేను రోజుల పాటు వైద్యం చేసి, దాదాపు రెండు లక్షల రూపాయలు పిండుకొని తమతో కాదని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటు ఆసుపత్రి వారు సలహా ఇచ్చారు. ఒకటి రెండు రోజులు మించి బ్రతకడం కష్టమేనంటూ డాక్టర్లు వెల్లడించి ఇప్పటికీ నెల పదిహేను రోజులైంది. ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కోమా నుండి తేరుకోలేదు. తల్లి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి సూర్యప్రకాశ్ బాగా కుంగిపోయాడు. తండ్రి చిన్నప్పుడే చని పోవటంతో అన్నీ తానై సూర్య ప్రకాశ్ ను తల్లి బాగా చదివించింది.
********
భరణి నాలుగేళ్లుగా కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఉద్యోగిగా ఐదంకెల జీతం సంపాదిస్తున్నాడు. హెచ్ వన్ బి వీసా ఉంది. అతడి చెల్లెలు స్మిత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఇంగ్లాండులో స్థిర పడింది. తండ్రి కృపాకర్ పోలీసు శాఖలో గెజిటెడ్ హోదా ఉద్యోగం, తల్లి రవళి హైదరాబాదు రేడియో కేంద్రంలో మంచి పదవిలో ఉంది. తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి అమెరికా నుండి వారం రోజుల క్రితం హైదరాబాదు వచ్చాడు భరణి.
*******
మాట్రిమొనీలో రేఖ వివరాలు తెలుసుకొని సూర్యప్రకాశ్ కు ఫోను చేశాడు కృపాకర్. తనను తాను పరిచయం చేసుకొని భరణి వివరాలు, తమ కుటుంబ నేపథ్యం వివరించి, “అమ్మాయికి, అబ్బాయికి జాతక రీత్యా తగినన్ని పాయింట్లు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పారు , అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేయగలరా” అంటూ కృపాకర్ అడిగాడు. సూర్య ప్రకాశ్ కి ఏమి చెప్పాలో తోచక కాసేపు సందిగ్ధంలో పడ్డాడు. తన తల్లి కోమాలో ఉండి కొన ఊపిరితో ఉందనే విషయం, తాము కొంత కాలం పాటు అమ్మాయి వివాహం వాయిదా వేసుకున్నట్టు చెప్పకుండా “ప్రస్తుతానికి మేము ఊళ్ళో లేమండి, రావటానికి వారం రోజులు పడుతుంది” అని దాట వేశాడు.
“వారం రోజుల తర్వాత మళ్లీ కాల్ చేస్తానండి” అంటూ ఫోను కట్ చేశాడు కృపాకర్. ఇదే విషయం కృపాకర్ తన భార్య రవళికి చెప్పాడు.
“నెల రోజుల్లో పెళ్లి చేసుకొని భరణి అమెరికాకు వెళ్లాలి కాబట్టి మనకు ఉండే తొందర వారికెందుకు ఉంటుంది” అంటూ నిట్టూర్చింది రవళి.
******
వారం రోజుల పిదప కృపాకర్ సూర్య ప్రకాశ్ కి ఫోను చేశాడు. “నేను కృపాకర్ ను మాట్లాడు తున్నాను. పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేయగలరా” అని అడిగాడు. మరో సారి అబద్దం చెప్పలేక ఏమైతే అయిందిలే అనే ధీమాతో “మంచిరోజు చూసి పెళ్లి చూపుల కార్య క్రమం ఏర్పాటు చేస్తాను” అంటూ అయిష్టంగానే సంసిద్ధత తెలిపాడు సూర్య ప్రకాశ్.
“ఆ విషయంలో మీకు శ్రమ అక్కర్లేదు. నేను సిద్ధాంతి గారిని విచారించాను. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది, వర్జ్యం కూడా లేదు . అదే రోజు ఖాయం చేయండి. ఎందుకంటే మా వాడికి ఎక్కువ సమయం కూడా లేదండి” బ్రతిమిలాడే ధోరణి లో అంటూ సూర్య ప్రకాశ్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెళ్లి చూపుల తేదీ నిర్ణయం చేశాడు కృపాకర్. పెళ్ళి చూపుల కార్య క్రమం యదావిధిగా అనుకున్న సమయానికి సూర్య ప్రకాశ్ ఇంట్లో జరిగింది. రెండో రోజు కల్లా అమ్మాయి, అబ్బాయి తమ అంగీకారం పెద్దలకు తెలియ జేశారు. ఇక మిగిలింది పెళ్ళి ముహూర్తం నిర్ణయించటమే. ఓ ప్రక్క సూర్య ప్రకాశ్ తల్లి చావు బతుకుల్లో ఉంది. మరో వైపు భరణి పెళ్లి చేసుకొని కొద్ది రోజుల్లో కాలిఫోర్నియా వెళ్లాల్సి ఉంది. కృపాకర్ సిద్ధాంతి గారిని సంప్రదించి వివాహ ముహూర్తం తేదీ నిర్ణయించి సూర్య ప్రకాశ్ కు ఫోను చేశాడు. ” సూర్య ప్రకాశ్ గారూ, అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. వచ్చే ఆదివారం ఉదయం 10.32 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నట్టు సిద్ధాంతి గారు చెప్పారు. ఆ ముహూర్తానికి పెళ్లి కానిద్దామా” ప్రశ్నించాడు కృపాకర్.
“సుముహూర్తానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో ఈ మహా నగరంలో కన్వెన్షన్ హాలు, ఇతర పెళ్లి ఏర్పాట్లు అసాధ్యమేమో” సందేహం వెలిబుచ్చాడు సూర్య ప్రకాశ్.
“మీకు నచ్చిన కన్వెన్షన్ హాలు చూడండి. నేనున్నాను కదా బావ గారూ. అవసరమనిపిస్తే నిర్మొహమాటంగా నా సహాయం తీసుకోండి” ధైర్యం చెప్తున్నట్లుగా సమాధాన మిచ్చాడు కృపాకర్.
వీటన్నిటి కంటే ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషమించి మరణిస్తే పెళ్లి ఆగి పోతుందేమో అనే శంక సూర్య ప్రకాశ్ కి ఎక్కువగా ఉంది. భార్య సరిత, కూతురు రేఖను సంప్రదించి పెళ్లి సింహాచల క్షేత్రంలో జరపాలని నిర్ణయించుకున్నాడు. మంచానికే పరిమితమైన తల్లిని హైదరాబాదులోనే పని మనుషుల సంరక్షణలో ఉంచి మిగతా బంధువులతో సింహాచలం వెళ్తే ఎటువంటి టెన్షన్ ఉండదని తన ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు పెట్టాలను కున్నాడు. కృపాకర్ కు ఫోను కలిపాడు .
“బావ గారూ, మీకో విషయం చెప్పడం మరిచాను. మా ఆవిడ గుర్తు చేసేంత దాకా నాకు ఆలోచన రాలేదు. మా అమ్మాయి సంబంధం నిశ్చయమైతే వివాహం సింహాచల క్షేత్రంలో చేయాలని ఎప్పుడో మొక్కు కున్నాం. మరి ఈ ప్రతిపాదన మీకు సమ్మతమేనా నిదానంగా ఆలోచించి తెలపండి” అంటూ ఫోను పెట్టేశాడు సూర్య ప్రకాశ్.
భరణికి ఈ ప్రతిపాదన నచ్చలేదు. కృపాకర్, రవళి కూడ ఈ విషయంలో ఆసక్తి కనపరచలేదు. అయినా సరే దేవుడి సన్నిధిలో లగ్నం అనేటప్పటికి వ్యతిరేకించ లేని పరిస్థితి వారిది. కేవలం దేవుడి సన్నిధిలో పెళ్లి చేస్తారనే నెపం చేత ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం సుతరామూ వారికి ఇష్టం లేదు. పైగా భరణి మరో పదిహేను రోజుల పాటు మాత్రమే ఇండియాలో ఉండేది, ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మరో రెండేళ్ల దాకా తను ఇండియా వచ్చే అవకాశం లేదు. పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా వేసే ప్రసక్తి లేదు. సూర్య ప్రకాశ్ ప్రతిపాదనకు కృపాకర్ కుటుంబ సభ్యులు కాదనలేక పోయారు. “బావ గారూ మీరు దేవుడి సన్నిధిలో పెళ్లి చేయాలని తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే. త్వరగా ఏర్పాట్లు చేయండి” చెప్పాడు కృపాకర్.
*****
సింహాచలం లోని తన బంధువుకు ముహూర్తం తేదీ తెలియజేసి కావలసిన ఏర్పాట్లు చేయించుకున్నాడు సూర్య ప్రకాశ్. ముహూర్తం తేదీకి మూడు రోజులు ముందుగానే బంధు మిత్ర బృందంతో బయలు దేరడానికి ప్రైవేటు టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నాడు. ముహూర్తం సమయానికి చేరుకునే విధంగా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు మరో టూరిస్ట్ బస్సును అద్దెకు మాట్లాడి ఆ వివరాలు కృపాకర్ కు అంద జేశాడు. రెండు కుటుంబాల వారు వాయువేగంతో అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ తల్లిని తన ఇంట్లో కొన్నేళ్ల నుండి నమ్మకంగా పని చేస్తున్న శాంతమ్మ, ఆమె భర్త రాగయ్య సంరక్షణలో ఉండే విధంగా శాంతమ్మకు అన్ని జాగ్రత్తలు తెలిపారు. తల్లి ఆరోగ్యం విషమించి కన్ను మూస్తే ఆ విషయం తొందరపడి ఎవరికీ తెలియజేయ వద్దని, కేవలం సూర్య ప్రకాశ్ కు మాత్రమే ఫోను ద్వారా చెప్పాలని శాంతమ్మకు హితవు పలికారు. తమ ఫ్యామిలీ డాక్టరుకు కూడా ముందు జాగ్రత్త గా తల్లిని తన ఇంట్లోనే ఉంచి తాము సింహాచలం వెళ్తున్నట్లు తెలిపాడు. “ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకో సారి ఆవిడ ఆరోగ్యం చూసుకుంటాను. మీరు అధైర్య పడవద్దు. నిశ్చింతగా మీ పనులు పూర్తి చేసుకోండి” అంటూ హామీ ఇచ్చాడు డాక్టరు.
తల్లికి చెప్పకుండా ఎన్నడూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు సూర్య ప్రకాశ్. ఇప్పుడు తల్లి కోమాలో ఉంది. అనుకోని పరిస్థితుల్లో తల్లికి తెలియకుండానే రేఖ వివాహ ముహూర్తం నిర్ణయమైంది. బయలుదేరే ముందు బరువెక్కిన గుండెతో తల్లి కాళ్ళకు మొక్కిన సూర్య ప్రకాశ్ కుటుంబ సభ్యులను, బంధువులను హడావిడి చేసి ముహూర్తానికి మూడు రోజుల ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు సింహాచల క్షేత్రానికి టూరిస్ట్ బస్సులో బయలుదేర దీశాడు.
*****
సూర్య ప్రకాశ్ తల్లిని తన పర్యవేక్షణలో ఉంచడంతో శాంతమ్మది ఎటూ కదలలేని పరిస్థితి. శాంతమ్మ, రాగయ్యలు మొదటి నుండి సూర్య ప్రకాశ్ కుటుంబానికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్నారు.
“మేము తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉండి వంట చేసుకొని తినండి ” వెళ్ళే ముందు సరిత తన ఇంటిని శాంతమ్మకు అప్పజెప్తూ సలహా ఇచ్చింది.
అదేమిటో గాని గత రెండు నెలలుగా నోటి మాట లేని సూర్య ప్రకాశ్ తల్లిలో పెళ్లివారి బృందం బయలు దేరిన మరుసటి రోజే కదలిక వచ్చింది. “ఒసేయ్ శాంతా ” అంటూ పిలిచింది. అదే గదిలో అమర్చిన టీవీ చూస్తున్న శాంతమ్మ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. “ఎవరబ్బా నన్ను పిలిచింది” అని స్వగతం లోనే అనుకుంటూ కూర్చున్నదల్లా లేచి బయటికొచ్చి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గదిలోకి తిరిగి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది.
“ఏమే శాంతా, నేనేనే నిన్ను పిలిచింది” అంది మరోసారి సూర్య ప్రకాశ్ తల్లి. టీవీ లోకం నుండి బయట పడిన శాంతమ్మ మంచం దగ్గరికి వెళ్ళి సూర్య ప్రకాశ్ తల్లిని నివ్వెరపోయి చూస్తూ నిలుచుంది.
“అమ్మా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు మాట్లాడే శక్తి వచ్చిందమ్మా మీకు” అంది శాంతమ్మ.
“అబ్బాయి ప్రకాశాన్ని పిలువు” అంటూ హుకుం జారీ చేసింది సూర్య ప్రకాశ్ తల్లి.
“అయ్యగారు వాళ్లు సింహాచలం ఎళ్లారమ్మా, మన రేఖమ్మది లగ్నం ఆడే చేస్తున్నారు, ఇంకో మూడు దినాలే ఉందమ్మా” జవాబిచ్చింది శాంతమ్మ.
“అదేమిటి ప్రకాశం నాకు ఈ విషయం చెప్పలేదే. ఒక సారి ప్రకాశానికి ఫోను కలుపు నేను మాట్లాడతా” అంటూ మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నం చేసింది. సూర్య ప్రకాశ్ తల్లి శాంతమ్మ సహాయంతో లేచి కూర్చుంది. శాంతమ్మ సూర్య ప్రకాశ్ కి ఫోను కలిపింది.
“అయ్యా, పెద్దమ్మ మాట్లాడుతున్నారు, లేచి కూర్సున్నారు. మీతో మాట్లాడుతరంట” అంటూ ఫోను సూర్య ప్రకాశ్ తల్లికి ఇచ్చింది.
సూర్య ప్రకాశ్ తన తల్లి మాట్లాడు తుందన్న విషయం తెలియగానే కొద్ది క్షణాలు నివ్వెర పోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. “హలో” అన్నాడు.
“అరేయ్ ప్రకాశం, నాకు చెప్పకుండానే మనవరాలి కళ్యాణం చేస్తున్నావా, నాకు దాని కళ్యాణం చూసే యోగం లేదా” అంటూ ప్రశ్నించింది.
“అమ్మా, సింహాద్రి అప్పన్న చలవ వల్ల కోలుకున్నావు. చాలా సంతోషం. ఇన్నాళ్లు నీవు కోమాలో ఉండటం మూలాన రేఖ పెళ్లి విషయం నీకు చెప్పలేక పోయాను. అంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది. ఎక్కువగా మాట్లాడకు నీరసించి పోతావు, అన్ని విషయాలు మేము తిరిగి వచ్చినాక మాట్లాడుకుందాం. నీ ఆరోగ్యం జాగ్రత్త” అంటూ ఫోను కట్ చేశాడు. అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే కరుణించి చావుకు దగ్గరగా వెళ్లిన తల్లికి ఎవరూ ఊహించని విధంగా మాట్లాడే శక్తి నిచ్చాడని సూర్య ప్రకాశ్, సరితలు తమ సంతోషాన్ని తమతో పాటు ఉన్న బంధువర్గంతో పంచుకున్నారు.
*****
కృపాకర్ దంపతులు కుటుంబ సభ్యుల సహితంగా ముహూర్తం రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా చేరుకునే విధంగా హైదరాబాదు నుండి సూర్య ప్రకాశ్ నియమించిన టూరిస్ట్ బస్సులో బయలు దేరారు. పెళ్లికొడుకు తరపు వారికి బస్సు సరిపోనందున అప్పటి కప్పుడు ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. కారులో కృపాకర్ ఇద్దరు బాబాయిలు, మేనమామ టూరిస్ట్ బస్సు వెనకాలే బయలుదేరారు. కృపాకర్ తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితమే కాలం చేశారు.
“బావ గారూ, ఇక్కడ అన్ని పనులు పూర్తయినాయి. ముహూర్తానికి అన్ని సిద్ధం చేశాము” అంటూ సింహాచలం నుండి సూర్యప్రకాశ్ కృపాకర్ కు ఫోను ద్వారా తెలియ జేశాడు. “థాంక్యూ బావ గారూ, ముహూర్త సమయానికి రెండు మూడు గంటలు ముందుగానే మేము అక్కడికి చేరుకుంటాము” అంటూ కృపాకర్ బదులిచ్చాడు.
పెళ్లికొడుకు బృందం బస్సు కేరింతలతో, అంత్యాక్షరి ఆటలతో సాగుతుంది. టూరిస్ట్ వెనకాల కారు భారంగా వెళ్తుంది. విజయవాడ కు పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉండగా బహుశా నిద్ర లేనందువల్ల నేమో అలసిపోయిన కారు డ్రైవర్ కళ్ళు ఒక్క క్షణం మూసుకోవటంతో కారు గతి తప్పి రోడ్డు డివైడర్ కు గుద్దుకుని ఎగిరి రోడ్డుకు మరో వైపు బోల్తా పడింది. కొద్ది దూరంలో వెళ్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ వ్యూ మిర్రర్ లో ఘటన చూసి బస్సును రోడ్డు ప్రక్కన ఆపాడు. డ్రైవరు, కొంత మంది పెళ్ళి వారు పరిగెత్తు కుంటూ ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో చూడగా అప్పటికే వెనుక సీట్లో కూర్చున్న కృపాకర్ ఇద్దరు బాబాయిలు తీవ్ర రక్త గాయాలతో మరణించారు. సీటు బెల్టులు ధరించిన కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న కృపాకర్ మేన మామ ఎయిర్ బలూన్లు విచ్చుకోవటంతో రక్త గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బృందంలోని ఒక సభ్యుడు 108 కి డయల్ చేసి ఘటన విషయం తెలియజేశాడు. పోలీసు వారు కొద్ది సేపట్లో అక్కడకు చేరుకొని వారు చేయ వలసిన విధులను నిర్వర్తించారు. ఘటనాస్థలి పెళ్లి వారి ఏడుపులతో నిండిపోయింది.
కృపాకర్ కాసేపటికి తేరుకొని సూర్య ప్రకాశ్ కు ఫోను కలిపాడు. “బావ గారూ అనుకోని దురదృష్ట కర మైన సంఘటన జరిగింది. మా బస్సు వెనకాలే వస్తున్న కారు ఆక్సిడెంట్ కు గురైంది. అందులో కూర్చున్న మా ఇద్దరు బాబాయిలు మరణించారు. కారు డ్రైవరు, ముందు సీట్లో కూర్చున్న మా మేన మామ గాయాలతో బయట పడ్డారు. ఈ పరిస్థితుల్లో మనం పెళ్లి కార్య క్రమం పెట్టుకోలేము కదా. పైగా మాకు సూతకం ఉంటుంది. సూతకం తర్వాత మిగతా విషయాలు మాట్లాడు కుందాం” అంటూ ఫోను కట్ చేశాడు.
పోలీసు శాఖలో అధికారి కావటం మూలాన కృపాకర్ తన పరపతిని ఉపయోగించి మరణించిన వారి మృత దేహాలు, గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశాడు.
సూర్య ప్రకాశ్ ప్రక్కనే ఉన్న సరిత భర్త ఆందోళన గమనించి “ఏం జరిగింది” అని అడిగింది. విషయం చెప్పిన సూర్య ప్రకాశ్ “సరితా, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆందోళనలో ఉంటే ఇప్పుడేమో ఇలా జరిగింది”.
*****
కర్మ కాండలు సంజీవరెడ్డి నగర్ లోని కృపాకర్ ఇంట్లో జరిగాయి. బాబాయిలకు వారసులు లేనందున తానే ముందుండి వారి కర్మ కాండలు జరిపించాడు. మాశికం కార్య క్రమంతో కృపాకర్ కుటుంబానికి మైల తొలగిపోయింది. ద్వాదశ దిన కర్మ రోజు బంధుమిత్రులు బాగానే తరలి వచ్చారు. బంధుత్వం కలిసింది కాబట్టి సూర్య ప్రకాశ్, సరితలు కూడా హాజరయ్యారు. అనుకోని సంఘటన వల్ల భరణి తన అమెరికా ప్రయాణాన్ని మరో నెల రోజుల పాటు వాయిదా వేసు కున్నాడు. సాయంత్రానికి దూరపు బంధువులంతా వెళ్ళిపోయారు. సూర్య ప్రకాశ్ అవకాశం కల్పించు కొని పెళ్లి విషయం కృపాకర్ తో ప్రస్తావించాడు. అయితే ఒకే ఇంటి పేరు గల వారు మరణించారు కాబట్టి సంవత్సరం లోపు భరణి పెళ్లి చేయవచ్చునా అనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అదే విషయం అక్కడే ఉన్న సిద్ధాంతి గారిని అడిగాడు కృపాకర్.
“అయ్యా, మన సందేహాలు తీర్చటానికేమో సమయానికి ధర్మ సందేహాలు కార్య క్రమం టివి లో ప్రసార మవుతుంది. సర్వదమనశాస్త్రి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. మీ సందేహానికి కూడా సమాధానం దొరక వచ్చు. వినండి.” అన్నాడు సిద్ధాంతి గారు.
“శాస్త్రి గారూ, నల్గొండ నుండి సురేష్ అనే శ్రోత ఈ విధంగా అడిగాడు, తాత చనిపోతే మనవడికి సూతకం ఎంత కాలం ఉంటుంది, వివాహం ఎంత కాలం దాకా చేసుకోగూడదు” ప్రశ్న సంధించింది సంధాన కర్త .
“ఇంటి పేరు గల వారు మరణిస్తే సూతకం లేదా మైల 12 రోజులు, 13 రోజులు,15 రోజులు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో వారి వారి ఆచారం ప్రకారం ఒక్కో రకంగా ఉంటుంది. తండ్రి మరణిస్తే సంవత్సరం పాటు, తల్లి మరణిస్తే ఆరు నెలల పాటు కుమారుడు వివాహం చేసుకోగూడదు. నిత్య పూజలు మాత్రం సూతకం అయిపోయిన తర్వాత నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. కాకపోతే వ్రతాలు, పండుగలు ఏడాది పాటు ఉండవు. అయితే తాత లేదా ఒకే ఇంటి పేరు గల వారు చనిపోతే సూతకం ముగిసిన అనంతరం మనవడి పెళ్లికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు” అంటూ సమాధాన మిచ్చాడు శాస్త్రి గారు.
“కృపాకర్ గారూ, సర్వదమన శాస్త్రి గారు అంత పెద్ద వారు చెప్పింది విన్నారు కదా, ఇంక మీరు నిరభ్యంతరంగా ప్రొసీడ్ అవ్వండి” అంటూ శలవిచ్చాడు పంతులుగారు.
సూర్య ప్రకాశ్, కృపాకర్ లు తమ రెండు కుటుంబాల సంబంధం బలపరచుకోవడానికి సిద్ధాంతి గారు నిర్ణయించిన పెళ్లి సుముహుర్తానికి ఓకే చెప్పారు.
******
తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి,
F306 HNo 13-10-95,
Vaishnavi Dvivedi Apartments,
Gaddiannaram,
Hyderabad-500060
Ph.9848545970.
సుమన శుభలేఖ ఇచ్చిన మరునాటి నుండే వీడియో మెసేజ్ పదే పదే పెళ్ళికి రమ్మంటూ
ఆహ్వానం పలుకుతుంది.శుభలేకే వాళ్ళ ఆర్థిక హోదాను కొంత మోసుకొచ్చింది.ఇక వీడియో మెసేజ్ సంగతి చెప్పఖ్ఖర్లేదు.కాని సుమనలో ఆ ఆర్థిక డాంబికత్వం కనపడినే లేదు.”మనసుకు
తగ్గ పేరే ఆ అమ్మాయిది.” అనుకుంది వైశాలి.
కాలం నిరంతర వాహిని.ఏ అవరోధాలు దానిని ఆపలేవు.ఆ కాల గమనంలో ఎన్నో సంఘటనలు.మరెన్నో మార్పులు. అవి రాజకీయమో..సామాజికమో..భౌగోళికమో..మంచో చెడో ఆపత్తో..విపత్తో… వేటితో కాలానికి సంబంధం లేదు.దాని మానాన అది తన ప్రయాణాన్ని కొన సాగిస్తుంది తన కొలీగ్ సౌమ్య పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశం నుండి ఇంటికి చేరుకునే సరికే ఆరు కావచ్చింది.ఆ రాత్రే వినోద్ కాంప్ ప్రయాణం.రోజువారి పనులతో పాటు ప్రతి ప్రయాణ సన్నాహం తన చేతులమీదుగా జరగాల్సిందే.”ఎంత మొత్తుకున్నా మానవుడిలో మార్పు లేదు. ఏమంటే ఆఫీసు పని ఒత్తిడి పోజు…తనేమొ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండ ఇంటి పట్టునే ఉన్నట్టు.” తనలో తానే ఉడుక్కుంది వైశాలి. ఉడుక్కుని మాత్రం ఏం చేయగలదు పాపం ..మనసుకీ చేతలకూ సంఘర్షణ తప్ప.ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడ వాళ్ళ ఇంటి చాకిరీకి విముక్తి లేదు.మగ వాళ్ళ ప్రయాణసన్నాహాలు భార్యామణుల చేతిమీదుగా జరిగి తీర్చాల్సిందే .తప్పదు సరే. మరి భార్యామణి కాలు బయట పెట్టాలంటే తన ప్రయాణ సన్నాహం తోపాటు ఇంట్లో పిల్లలకే కాదు పతిదేవుడికి అన్నీ అందుబాటులో ఉంచి కాలు కదుపాలి.”ఏవేవో రకరకాలుగా ఆలోచిస్తూ పెద్దగా నిట్టూర్చింది వైశాలి.ఏ నిట్టూర్పులు..సంఘర్షణలు..అలసటలు వినోద్ ప్రయాణాన్ని అడ్డుకోలేదు.టంచనుగా రాత్రి పదకొండు గంటలకు ముంబాయి ట్రేన్ కాచ్ చేసాడు.పనులకు ముక్తాయింపు పలికే సరికి గడియారంలో డేటు వారం మారిపోయినై.బెడ్ రూంలోకి నడచుకుంటూ పోతుండగా గోడమీది కాలెండరు పలకరించింది ఓ తేదీ దగ్గర రైట్ మార్క తో.దాన్ని చూస్తేగాని సుమన పెళ్ళి మరునాడే అని గుర్తు రాలేదు వైశాలికి.ఆ అమ్మాయి కోసం పెళ్ళికి అటెండెన్స్ వేసుకోక తప్పదు. ఇంకా ఏవేవో ఆలోచిస్తూనే బెడ్ పై వాలిపోయింది. ఆలోచనలను ఏవైనా వాటిని అలసట డామినేటు చేయడంతో నిద్రాదేవత ఆమెను ఆవహిం చింది.
****************
అదే పనిగా మోగుతూ నిద్రాభంగం కల్గించిన గడియారం నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది వైశాలి ఓ అర గంట తర్వాత లేద్దామని.ఈ సారి ఆమెను పాల బ్బాయి కాలింగ్ బెల్ లేపింది .దానర్థం ఏడైందని.నాలిక్కరుచుకుంటూ లేచింది .వారం రోజులుగా పని మనిషి కూడా రావడం లేదు.అంతా భిన్నత్వంలో ఏకత్వమే.ఆమె పాచిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఈదుకొస్తుంది.భర్త మాత్రం పున్నమ అమాసకన్నట్లు కూలికి పోయి తాగి తందనా లాడుతూ కుటుంబానికి భారంగానే మిగిలిపోయాడు.పైగా వారం రోజుల కింద తాగిన మైకంలో ఓ మోరీలో పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. “మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం.మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం.కానీ మద్యానిది మాత్రం ప్రభుత్వ ఆదాయం వైపే మొగ్గు .ఈ విషయాలన్నీ ఆమె ను ప్రతి రోజూ కలత పెడుతున్నవే. పెళ్ళి 8.45కే అని ఉంది. ఊడ్వడాలు తుడువడాలు పనికి నడుం బిగించి యమ స్పీడుగా పూర్తి చేసి స్నానం వగైరాలు ముగించి గోడ వైపు చూస్తే పది హేను నిమిషాలే ఉంది పెళ్ళి టైం సుమా అన్నట్లు గడియారం హెచ్చరించింది.కాఫీ తో తృప్తి పడ మని ఆత్మారాముడికి నచ్చ చెప్పి ఇంటి నుండి బయట పడింది వైశాలి.వెతుకుతున్న కళ్ళకు ఒక్క ఆటో కనపడి చావలేదు .మరో నాలుగడుగులు ముందుకు వేసింది.ఐనా ఆటోలు కనపడలేదు. కన పడ్డా రద్దీతో.చౌరస్తాలో దొరకవచ్చన్న ఆశతో కాళ్లకు పని చెప్పింది.సడెన్ గా పక్కనే ఓ కారు ఆగ డమే కాదు డోరూ తెరుచు కుంది .
“వైశాలీ ఎచటికోయి నీ పయనం” అంటూ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ వైశాలీ స్నేహితురాలు సరళ పలకరింపు.
“ఓ పాత విద్యార్థిని పెళ్ళికి” కొంచెం ఆరాటంగానే సమాధానమిచ్చింది వైశాలి.
“పెళ్ళెక్కడ?”
“లక్ష్మీ గార్డెన్స్. ఒక్క ఆటో దొరికి చాపడం లేదు.”అంది ఆతృతగా.
“నేనూ అటే. అమ్మ వాళ్ళింటికి.కారెక్కేసెయ్.”సరళ. బతుకు జీవుడా అనుకుంటూ కారెక్కింది వైశాలి
“మాఇంటి దారే మరిచిపోయినట్లున్నవ్?”వైశాలి
“మరిచిపోవడమా పాడా? టైం దొరికితే కదా! డిసెంబరంతా తేజస్వితోనే సరిపోయిం దనుకో. తునున్నన్ని రోజులూ చుట్టపక్కాలు ..తన స్నేహితులు….వంటా వార్పులు..షాపింగులు.. ఒకటా రెండా…సమస్తం నామీద దాడి చేసాయనుకో.ఫ్లైటెక్కే వరకు ఊపిరాడలేదనుకో.” సమా ధానం చెప్పింది సరళ.
“అదీ నిజమే. నాకు తెలియందేముంది. తరుణ్ వచ్చినప్పుడు నా కథ కూడా అంతే. ఏమరికానో ఏమో?పిల్లలు వచ్చే వరకు నిరీక్షణ. వచ్చింతర్వాత అదో ఒత్తిడి.తిరుగుముఖం పట్టిం
తర్వాత అదో రంది.”అంటూ వివరణ ఇచ్చింది వైశాలి
“ఆటో దొరకకపోవడం ఒకందుకు మంచిదే ఐంది కదూ!”అన్నది సరళ
“అదీ నిజమే..కాని ఎందుకు దొరకలేదంటవ్?” తన సందేహాన్ని వెలిబుచ్చ్ంది వైశాలి
” తర్వాత మూడాలు వస్తున్నాయట .రెండునెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవట. అందుకే మంచి రోజంటూ ఇవాళ్ళ్టి ముహూర్తంపై అందరి దాడి.” సరళ
“ఏం ముహూర్తాలో ? ఏం మూడాలో? ఏం జాతకాలో? అన్నీ చూసి చేసినా ఎన్నో దురదృష్టాలు.” వైశాలి
“వాటికిచ్చే విలువను మనుషుల వ్యక్తిత్వాలకివ్వడం లేదు. ప్రపంచమంతా డబ్బు మయం ఐపోయింది.” సరళ
“అది సరేగాని మీ అమ్మదగ్గరినుండి వచ్చేప్పుడు మా యింటికి రాకూడదూ? మా ఆయన కూడా ఇంట్లో లేరు “అడిగింది వైశాలి .
” ఐతే మరీ మంచిది. కొంచెం ఫ్రీగా గడపొచ్చు.కానీ నేనొచ్చేవరకు నాలుగవుతుందేమో?” అంది సరళ
“ఐతే ఏంటట? బహుషా ఒంటిగంటకల్లా నేనింట్లో ఉంటాననుకుంట.”వైశాలి
“ఓకే డన్”అంటూ సరళ చెయ్యి కలిపింది.
వాళ్ళ మాటల్లోనే లక్ష్మీ గార్డెన్ వచ్చేసింది .బైబై చెప్తూ కారు దిగిన వైశాలి కాళ్ళు హాలు వైపుగా సరళ కారు వాళ్ళమ్మ ఉండే కృష్ణ కాలనీ దిశగా కదిలినై.వైశాలి లక్ష్మీగార్డెన్స్ ముఖద్వారం చేరుకుంది.పార్కింగ్ ఏరియా రకరకాల కార్లతో నిండిపోయిఉంది ఓ కార్ల ఎగ్స్ బిషన్ లా. ముహూ ర్తం దగ్గర పడుతుండటంతో కొంచెం ఆరాటంగానే అడుగులు వేసింది.ముఖద్వారానికి ఒకవైపు
వధూవరుల ఫొటోలు..మరో వైపు అమ్మాయి తల్లిదండ్రుల ఫొటోలు ఆహ్వానితులుగా. .అన్నిటినీ మించి పౌరాణిక సినిమాల్లో లాగా ఇద్దరు ద్వారపాలకులు అందమైన కట్టెలను ఇంటూ ఆకారంగా పట్టుకొని .ఇదేదో రాచ మర్యాదలా ఉందనుకొని మరో అడుగు ముందుకు వేసింది.కాని ఆ ఇంటూ ఆకారం భీష్మించుకుంది.పోవడానికి వీల్లేదంది.అది వి ఐ పి లద్వారమని తేల్చి చెప్తూ ఓ ద్వార పాలకుని చెయ్యి రెండో గేటుని సామాన్యుల దారిగా చూపిం చింది.వైశాలికి ఆ తీరు అసౌకర్యం గానే కాదు కొంత అవమానంగా కూడా ఫీలైంది. చేసేదేంలేక లోపలికి నడిచింది. పూలవాసనల గుబాళింపు నాసికారంధ్రాలను అదరగొడ్తుంది.తోరణాలు.. డేరాలు..నడిచే దారంతా ఎప్పటి తివాసీలు.. కళ్ళు జిగేల్మంటున్నైడెకరేషన్ అదిరి పోయింది.అది పోస్ట్ హోదాను అద్దం పడు తుంది.హాలంతా అతిథులతో నిండిపోయింది. సీటు ఖాళీగా ఉన్న దాఖలా కనపడలేదు.వైశాలి తన కళ్ళకు పని చెప్పింది సీటు వెతుకమని. ఈ లోగా ఆపద్బంధవిలా సుమన స్నేహితురాలు
మానస ” నమస్కారం” అంటూ పలకరించి ఓ సీటు చూపించింది. “బ్రతుకు జీవి ” అనుకుంటూ వైశాలి ఆ సీటుకు పాత్రత్వం కల్పించింది.
స్టేజ్ వైపు తిరిగిన వైశాలికి వధూవరుల జిలకర బెల్లం కార్యక్రమం కనిపించింది. సమయానికి చేరుకున్నందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది.అదేదో తను చేరకపోయుంటే ఆ కార్యక్రమానికి సార్థకత ఉండేది కాదేమో అన్నంత ఫీలింగ్ తో.ఆ ఆలోచన రాగానే తనలో తానే నవ్వుకుంది.ఒకసారి హాలంతా కలియ చూసింది.సీతాకోకచిలుకలు వచ్చి వాలాయేమో అన్నంతగా మహిళామణుల చీరా జాకెట్లు..గాగ్రాలు..లంగాలకంత ఓణీలు..ఒక దానిని మించి
మరోకటి.ఒళ్ళంతా తాపడం చేసుకున్నారేమో అనే బ్రమను కల్పించే కళ్ళకు మిరుమిట్లుగొలిపే
నగలు .ఒయ్యారాలు ఒలుకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ యువతరంగిణులు.”ఆ అలంకరణలో
అందం చందం సరే.కాని ఈ ఎండల్లో శరీరం వాటిని ఎట్లా తట్టుకుంటుందో పాపం.”వైశాలి తనలో తానే ప్రశ్నించుకుంది వైశాలి తనలో తాను.ఐనా పీత కష్టాలు పీతవి.కందకు లేని దురద
కత్తికెందుకట అని సమాధానమూ తానే చెప్పుకుంది.
మరోసారి వేదిక వైపు దృష్టిని సారించింది. దానికి దగ్గరగా క్రేన్ వంటిదేదో పైకి ..కిందికి…కుడి…ఎడమలుగా కదులుతూ కనిపించింది.కొంచెం గమనిస్తే అది ఫొటోలు తీస్తుందని అర్థమైంది. వేదిక మీదకు చేరి కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళ ఇబ్బంది కొంత తొలగిపోతుందని తృప్తి పడింది.
తెలిసిన తలకాయలేమైనా కనపడుతాయేమోనని హాలంతా కలియచూసింది.ప్చ్..లాభం లేకపోయింది.కాని ఆ కళ్ళకు హాల్లో ఐదారు చోట్ల ప్రొజెక్టర్లు కనిపించాయి.వాటిలో పెళ్ళి తంతును స్పష్టంగా చూడొచ్చన్నమాట.. “అంటే ఏంటన్నట్లు ” తనకు తానే ఓ ప్రశ్న వేసుకుంది.
“పెళ్ళికంటూ వచ్చి ఆ పెళ్లిని స్పష్టంగా చూడలేక ప్రొజెక్టర్ లో పెళ్ళి చూడట మన్నమాట. ”
అనుకుంటుండగానే ఆ ప్రొజెక్టర్ లలో పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు విభిన్న భంగి మలలో దిగిన రకరకాల ఫొటోలు కనపడుతున్నాయి.బహుషా దాన్నే ఫొటో షూటింగ్ అంటారేమొ . ఈ మధ్య పిల్లలు మాట్లాడుకుంటుంటె విన్నాను.కొత్త నాగరికతలు.. సరికొత్త సంప్రదాయాలు. ఎవరి ఆనందం వాళ్ళది.కాని ఈ డబ్బులున్న వాళ్ళు ఎన్ని తతంగాలైనా చేయొచ్చు. కాని పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు సాధారణ జనం సంగతేంటి?”లక్ష ఆలోచనలు వైశాలి మనస్సులో.
“.వైశాలి ఆలోచనలను భంగం చేస్తూ ధన్ ధన్ మంటూ బాండ్ మోత.ఆ గర్జనకు సమాంతరంగా పెళ్ళి కొడుకు సుమన మెడలో తాళి కడుతున్న దృశ్యం మెరుపులా.కాని వేదిక మెట్ల దగ్గర నల్ల సఫారీలతో బలిష్టమైన కండరాలతో కొందరి ఉనికి దాదాల్లా.
.”ఓహో! వీళ్ళనే బౌన్సర్లు అంటార”ని గుర్తుకొచ్చింది వైశాలికి.
“పెళ్లిలో రౌడీలు లేరే..మరి గొడవ చేసే వాళ్ళెవరు.అంతా అతిథులే కదా!”మళ్ళీ తనలో తనే ప్రశ్నించుకుంది వైశాలి.అమ్మాయి మెడలో మంగళసూత్రం పడిందో లేదో…కనీసం వధూవరులకు వేదిక మీద కుర్చీలను వేయనే లేదు. హాల్లో జనమంతా లేచి బిలబిలమంటూ వేదిక వైపు దండెత్తినంత పని చేసారు.వెంటనే బౌన్సర్లు రంగంలోకి దిగారు.కేవలం పదిమంది చొప్పున మాత్రమే వదలడం మొదలు పెట్టారు. కాని ఆ తతంగం ఓ పదినిమిషాలు కూడా సాగ లేదు. ఆ జన వాహినికి బదులుగా రాజకీయ వాహిని కనపడింది.వచ్చిన రాజకీయ ప్రముఖుడు
యం. యల్. ఏ అని అర్థమైంది. కాని వెనుక ఉన్న జనం..నాయకుల హోదాను చూపించడానికి వచ్చే జనమని జగమెరిగిన సత్యమే. “ఆ నాయకుల వెంట ఉన్నప్పుడు సంఖ్య పక్కన సున్నాలు. వాళ్ళే లేకపోతె కేవలం జీరోలు” తనలో తాను నవ్వుకుంది వైశాలి. బహుషా వాళ్ళు వస్తున్నట్టు సుమన తండ్రికి ముందే సమాచారముందేమొ…వేదిక దిగి వాళ్ళను ఎదుర్కొని వచ్చాడు. మందస్మిత ముఖారవిందాలతో అక్షతాశిస్సులు..కరచాలనాలు..ఆత్మీయ ఆలింగనాలు..ఫొటో దిగటాలు..అన్నీ కళ్ళు మూసి తెరిసే లోపె.ఆ వాహిని సుమ వాళ్ళన్నయ్య అసిస్టెన్స్ లో డైనింగ్
హాలు దిశగా సాగింది.మళ్ళీ జనవాహిని మంద్రంగా…బౌన్సర్ల అదుపాజ్ఞల్లో.
వైశాలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి.బ్రేక్ ఫాస్ట్ చేయనందుకు తనను తానే తిట్టుకుంది.లేచి ఆ లైన్లో కలుద్దామనే అనుకుంది . కానీ చీమ కూడా దూరడానికి వీలు లేదన్నట్లు
ఆ లైను కదులుతుంది.” ఇంటి దారి పడితే…” మరో ఆలోచన.”ఉడికే దాక ఉన్న ఓపిక ఉమ్మొగిలే
దాక ఉండాలి కదా! పైగా సుమన ఫీలౌతుంది. లాభం లేదు. ఉండి తీర్చాల్సిందే . ఓపిక పట్టా ల్సిందే” నిర్ణయానికి వచ్చింది.ఆకలిని జయించడానికా అన్నట్లు తన చూపులను వేదిక వైపు తిప్పింది.దానికి కుడి వైపుగా యువతుల గుంపు దాండియా ఆడుతూ..నవ్వుతూ ..తుళ్ళుతూ..
ఆనంద డోలికల్లో. “సరదాకు అవకాశం కల్పంచిన పెళ్ళి సందడి.” అనుకుంది వైశాలి.ఆమె చూపులు వధూవరులను వెతికాయి.కాని ఆ చూపులకు భంగపాటు ఎదురైంది.ఎందుకిలా జరి గిందనుకుంటూ ఎడమ వైపుగా కదిలిన ఆ చూపులకు చప్పుళ్ళతో ఓపెన్ స్పేస్ వైపు పూజారితో సహా పోతున్నట్లు తెలిసింది.” పగలే వెన్నెలలో అబ్బాయి అమ్మాయికి అరుంధతీ (లేని)నక్షత్ర దర్శనం చేయిస్తాడేమొ.తప్పదు మరి ఈ అమ్మాయీ అరుంధంత పవిత్రంగా.. పతి వ్రతగా ఉంటేనే ఆ వరుడి జన్మ సార్థకం. !”గొణుక్కుంది తనలో తను. ఎంతకీ లైనుకు ముక్తాయింపు
కనపడక పోవడంతో కొందరు క్యూ ను క్విట్ చేసి భోజనాల దారి పట్టారు.దాంతో లైను కొంచెం పలుచ పడ్డది. ఒంటిగంటకా వస్తుంది. ఆకలి ఆగలేనంటుంది. వైశాలి లేచింది.లైన్లో కి చొచ్చుక పోయింది.ఆమె వెనుక మరికొందరాడవాళ్ళు.ఆ తర్వాత చాలామంది అచ్చంగా పరీక్ష హాల్లో విద్యార్థుల్లా. మొత్తానికి వైశాలి ఆడవాళ్ళకో దారి చూపించినామె ఐంది.వెనకాల ఉన్న మగ
మహారాజులు మొదట కొంత బిత్తర పోయినా ఆ తర్వాత తమ ఓపికను పరీక్షించే సత్తా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తూ తమ చేతుల్లో ఉన్న అక్షతలను నిలబడిన చోటినుండే (ఉద్యమ కారులు బస్సులపై రాళ్ళు విసిరినంత స్పీడులో )వధూవరులపైకి విసిరి డైనింగ్ హాల్ దారి పట్టారు.
” పెళ్ళి కి వెళ్ళి రావడాన్ని మొత్తంగా ఐదు అధ్యాయాలుగా విభజించ వచ్చేమొ.వెళ్ళడం
మొదటి అధ్యాయం కాగా..పెళ్ళి తతంగం పూర్తయ్యే వరకు నిరీక్షించి వేదిక చేరుకొని వధూవరు లను కలవడాలు రెండు మూడు అధ్యాయాలు కాగా భోజన కార్యక్రమం నాలుగు తిరిగి వాహనం దొరికి ఇంటికి చేరుకోవడం ఏదో అధ్యాయం.దానితో పెళ్ళి తతంగం సమాప్తమన్న మాట.”అని తీర్మా నించుకున్న వైశాలి ఆరాటంతో కదిలి అక్షతలతో ఆశీర్వదించి సుమన చేతిలో తను తెచ్చిన
గంగు నవల ను కానుకగా ఇచ్చింది .తనను చూసిన సుమన సంతోషానికి అవధులు లేవు.ఉబ్బి తబ్బిబైపోయింది .ఉన్నఫళంగా పాదాభి వందనం చేసింది.ఆ అమ్మాయి ఆనందం చూడగానే అంతసేపు వైశాలి పడ్డ యాతన మటు మాయమైంది. పెళ్ళి కొడుకుతో పాటు తన తల్లితండ్రులకు తన టీచర్ ను సుమన పరిచయం చేసినా అవి మొక్కుబడి పలకరింపులే అయ్యాయి. భోజనం తప్పకుండా చేయమని ఆ అమ్మాయి అభ్యర్థన.తప్పదన్నట్లు వైశాలి డైనింగ్ హాలు వైపు దారి తీసింది.
****************
డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతున్న వైశాలికి అక్కడే ఏదో పార్టీషియన్ కనిపించింది.దానిముందూ ధవళ వస్త్రముల వేత్రహస్తులు …వేత్రములను ఇంటూ ఆకారంగా పట్టుకొని.అటువైపు వెళ్లిన వాళ్ళందరిని ఓ ఖద్దరు శాల్తీ జనరల్ డైనింగ్ కు వెళ్ళాల్సిందిగా సూచిస .ఆ సూచన ఓ వృధ్ధదంపతులకూ చేరింది.హాలంతా దోస..పానీ పూరి.. సమోసా చాట్ ..ఐస్ క్రీం..స్వీట్స్ ..ఫ్రూట్స్ వంటి తిను బండారాలతో ముస్తాబై ఉంది .అన్నం..పప్పు ..కూరలు..వంటి కూరలు షరా మామూలే. వైశాలి మనసు భోజనం వైపే మొగ్గు చూపింది .అన్ని చోట్ల ఉన్నట్లు అక్కడా అంతే రద్ది.ఐనా తప్పదు.ఇంట్లో తిండి ఎట్లగూ సిద్ధంగా లేదు.ఇక్కడే
ఇంత ఎంగిలి పడుదామని ముందుకు కదిలింది.ప్లేట్ లో రెండు నాన్ ముక్కలు..ఓ కూర.. పప్పు ..కొంచెం అన్నం పెట్టుకొని పక్కకు జరిగి తినడానికి ఉపక్రమించింది .నాన్ నుండి ఓ చిన్న ముక్క
తీసుకుందామని ప్రయత్నం చేసింది. కాని దాని నుండి ముక్క భీష్మించుకుని చినగను గాక చినగనంది.మొత్తానికి వైశాలి విశ్వప్రయత్నంతో చేతిలోకి ఓ ముక్క చేరింది.కూరను చేర్చి నోట్లో పె
ట్టుకుంది.నోరంతా నూనె మాయమవటమే కాదు ఆ నాన్ ను పళ్ళు నమలలేమని తేల్చి చెప్పు తున్నాయి.తినడానికి మరి కొంత ప్రయత్నం చేసింది . అన్నమైనా తిందామనుకుంటే సరిగా ఉడుకనే లేదు.ఇక లాభం లేదనుకొని ప్లేటును టబ్ లో చేర్చింది.ఆ టబ్ ను చూసి వైశాలి మనసు జాలితో నిండి పోయింది.పాపం దాని నిండా తినకుండా మిగిలిన ఆహార పదార్థాలూ నిండి పోవ
డంతో మా దీనావస్థను చూడండని వేడుకుంటుంటున్నాయి.
చేతులు కడుక్కొని వస్తున్న వైశాలికి ఇందాక కనిపించిన పెద్దవాళ్ళు ప్లేట్ల భారంతో నిలబడక..తినలేక.” డబ్బు దర్పం ఉన్న వాళ్ళకేమొ టేబుల్ ముందు కూర్చొని తినే సౌకర్యవంత మైన ఏర్పాట్లా?ముసలి ముతుక..పిల్లా జెల్లా నానా అగచాట్లు పడాలా? “ఎవరినీ ప్రశ్నించలేక
తనలోతానే గొణుక్కుంది.ఇక ఇంటి దారికై ఎక్సిట్ వైపు పోతుండగా ఆ పెద్దాయన జారి పడబోగా
ఎవరో ఒకాయన గబుక్కున ఆసరా ఇచ్చాడు. లేదంటే పాపం ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుని హాస్పిటల్ కు ఆదాయం పెంచేవాడు.అక్కడంతా నీళ్ళ రొచ్చుందని వైశాలి కళ్ళు గమనించాయి.
“పాపం ముసలాయనచస్తుండే . జర అసొంటిదెవతొ పొయ్యి చేతులు కడుగొచ్చు కదా”
ఓ గొంతు ప్రశ్న.
” సగం తాగిన గిలాసలు సుత ఏడంటె ఆణ్ణే పెట్టవట్టరి.మల్లంత సదివిన మారాజులే.”ఓ పనామె
“కూరనారలు సుత నిలబడ్డకాన్నే ఎయ్యవట్ట్రి. బగ్గ నగలు దిగేసుకొని షోకు షోకు బట్టలేసుకోంగనే సరిపోతాది?”ఇంకో పనామె
వాస్తవాలైన వాళ్ళ మాటలను వింటూ “చదువు వల్ల వివేకం కలిగే రోజులకు కాలం చెల్లి
పోయిందని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడినుంచి నిష్క్రమించింది వైశాలి.
****************
వైశాలి ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుందో లేదో మంచానికి తన శరీరాన్ని అప్పచెప్పింది. పెళ్ళి వాతావరణం కారణంగా ఆమె పై ఆకలి ..అలసట…అశాంతి ముప్పేటలా దాడి చేసాయి. కాని ఆ మూడింటిని నిద్రాదేవత జయించింది.నాలుగింటి వరకు ఆమెకు తోడుగా నిలిచి కాలింగ్ బెల్ చప్పుడు తో బై బై చెప్పి వెళ్ళిపోయింది. తలపు తీసిన వైశాలికి సరళ కనపడటంతో నాల్క కరచుకుంది.
“మంచి నిద్రలో ఉన్నట్టున్నవ్? డిస్టర్బ్ చేసానేమొ?”అంది సరళ
“అదేం లేదు.రెండు గంటలు మాంచి నిద్ర పోయాననుకో రా! రా! .”అంటూ డైరెక్ట్ గా వంటింట్లోకి దారి తీసింది.
“కాసేపు ఇక్కడే కూర్చొని ముచ్చట్లాడుదాం. ఎట్లాగూ మీ ఆయన కూడా లేరు కదా! ఇవాళైనా ఆ వంటింటి గొడవను మరిచిపోదాం. పైగా నువ్వేమొ పెళ్ళి భోజనం …నేనేమొ అమ్మ చేతి వంట.” సరళ.
“పెళ్ళి భోజనమా? మరేమన్నానా? “అంటూ తన ఆకలి ఘోషకు కారణాలన్నిటినీ పెళ్ళి
తతంగాలతో పాటు సరళ ముందు కుమ్మరించింది వైశాలి.
“నిజమే వైశాలీ ! ఈ మధ్య కాలంలో పెళ్ళి పిలుపులకు..కల్పించే సౌకర్యాలకు.. ఏమా త్రం పొంతన ఉండటం లేదు..హోదా ప్రదర్శనలకిచ్చే ఇంపార్టెన్స్ ఆతిథ్యానికి లేదు.”
“ఔననుకో. కాని చిన్న సవరణ. రాజకీయ నాయకులకు …డబ్బును మారాజులకు మంచి ఆతిథ్యమే ఇస్తారు.”సరళ
“అదే కదా! నేననేది.వాళ్ళకేమొ ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా …టేబుళ్ళు.. కుర్చీలు.. వడ్డనలు…మర్యాదలు…సమస్తం.మిగిలిన వాళ్ళేమొ ప్లేట్లను అడుక్కునే చిప్పల్లాగ పట్టుకొని
అన్నం పప్పు ..కూరా ..చారంటూ లైన్లో.”బాధతో అంది వైశాలి.
“ఆ లైనైనా సరిగా ఏడ్చి చస్తుందా అంటే అదీ లేదు.నేను వడ్డించుకుని వెనక్కి తిరుగు తున్నానో లేదో ఓ వీర వనిత నా నెత్తి మీదుగా ప్లేటు పెట్టి కూర వేయించుకోవడంలో నా బ్లౌజు ను కూడా పావనం చేసింది.ఆ బ్లౌజిప్పుడు డ్రై క్లీనింగ్ దర్శనం చేసుకోక తప్పదు.”మళ్ళీ చెప్పుకొచ్చింది వైశాలి .
“జనాన్ని పిలిచి అవమానించడమంటే ఇదేనేమొ.”సరళ
“ఈ పెళ్ళిలో అతిథి దేవో భవ..గురు దేవో భవ..రెండు అభాసుపాలైనై. అఫ్ కోర్స్.. ఇందులో సుమన ప్రమేయం లేదనుకో.” సుమనకు మాట రాకూడదన్నట్లు మాట్లాడింది వైశాలి.
“శిష్యురాలంటే ఎంతభిమానమో..నాకూ ఈ అనుభవాలు చాలానే ఉన్నాయి.”నవ్వింది సరళ.
“అందరి అనుభవాలూ అవేనమ్మా! మార్గాన్వేషణ చేస్తే బాగుండు.”వైశాలి
” ఎవరో ఎందుకు .పిల్లి మెడలో గంట కట్టడంలా.మనింటి పెళ్ళిల్లే నాంది .”
” ఓకే డన్ “అంటూ ఇద్దరు చేతులు కలుపుకున్నారు.మాట్లాడుతూనే వైశాలి వెజిటేబుల్ కమ్ టమాటా బాత్ ను ఆరగించి టీ సేవించారు.ఆపై ఎన్నో సామాజికాంశాలూ వాళ్ళ చర్చలలో వచ్చాయి.గోడ గడియారం ఏడైందని హెచ్చరించడంతో “ఇక నాకు సెలవియ్యి తల్లీ”అనుకుంటూ ఉన్నఫళంగా లేచింది సరళ.
“ఇంకాసేపుడ్డొచ్చు కదా!”బతిమాలింపు ధోరణిలో.
“మా మానవుణ్ణి ఎంత సేపు నిరీక్షణలో పెట్టమంటావు.?”
“మనలాగా నిరీక్షణలు తట్టుకునే శక్తి వాళ్ళకెక్కడిదిలే. “అంటూ సరళను సాగనంపింది
వైశాలి.
****************
ఓ సంవత్సర కాలం గడిచింది.యాదృఛ్ఛికమో …ప్రణాళికో…డిసెంబరు నెలలో తరుణ్
తేజస్వి ఇండియాకు వచ్చేసారు.తామిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామంటూ పెళ్ళి ప్రపోజల్ ను తల్లి కతండ్రుల ముందుంచారు.ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కే కారణాలు కన్పించలేదు. ఒప్పేసు కున్నారు కూడా.రెండు కుటుంబాలు కూచుని రిజిస్టర్ మారేజ్ కమ్ రిసెప్షన్ అరేంజ్ చేసు కున్నా రు. అంటే రిసెప్షన్ హాల్లో నే రిజిస్టేషన్ జరిగేట్టు.మొత్తంగా ఆహ్వానితులను రెండు వందలకు పరిమితం చేసుకున్నారు. వేదికకు ఒకవైపు సుమధురగాన లహరిని ఏర్పాటు చేసారు. అతిథు లంతా హాయిగా టేబుళ్ళ ముందు కూచుని హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించగల్గిన వాతావరణం
కల్పించారు.హాలులో “అతిథి దేవో భవ”. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” “భోజనం న పరిత్యక్త
వంటి బానర్లను ఏర్పాటు చేసారు.వచ్చిన వాళ్ళందరిని పేరు పేరునా పలకరించారు.పసందైన విందునిచ్చి వీడ్కోలునిచ్చారు.ఈ బాట పదుగురికి ఆదర్షం మరేమున్నది.
కాలింగ్ బెల్ మోతతో తలుపు తీశాడు కార్తీక్. ఎదురుగా మూతికి మాస్క్‌తో, శానిటైజింగ్ చేతులతో, పక్కనే వుంచిన ఓ రెండు బ్యాగులతో కనిపించాడు కార్తీక్ మిత్రుడు రాఘవ.
“రారా రాఘవా చాన్నాళ్లకు బుద్ధి పుట్టింది నీకు!”
మిత్రుణ్ని ఆహ్వానించాడు.
రాఘవ పళ్ళు తీసుకొచ్చే సమయానికి కార్తిక్ భార్య , వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకుకు తల పై తడిబట్ట వేస్తూ వాడిని బుజ్జగిస్తున్నది .
ఏమైందిరా ? అని రాఘవ అడుగుతుంటే , ఉదయం నుండి బాగా జ్వరంగా ఉన్నదిరా అన్నాడు బాధగా కార్తిక్.
“మొన్న ఊరెళ్లాను కార్తీ…. తోటలో బత్తాయిలు, సంత్రాలు తెంపించాడన్నయ్య. నీకు కొన్ని తెచ్చాను.”
“ఈ కరోనా టైమ్ లో ఇమ్యునిటీ ఫ్రూట్స్…. చాలా థ్యాంక్స్ రా!” అంటూ ఆ పళ్ళ బ్యాగులందుకున్నాడు కార్తీక్.
“అమ్మ కనిపించటం లేదురా కార్తీ?” అటూ ఇటూ కలయ చూస్తూ అడిగాడు రాఘవ.
టి.వి.లో కరోనా న్యూస్ వింటూ “ఈ సెకండ్ వేవ్ ముసలోళ్ళ కన్నా వయసు వాళ్లపైనే దాడి చేయడం బాధాకరం రా!” అన్నాడు కార్తీక్.
“అంటే కార్తీక్… ముసలివాళ్ల ప్రాణాలు విలువైనవి కావంటావా?”
“ఎంతైనా కాటికి కాళ్లు చాచుకున్న ముసలోళ్లకన్నా, బాధ్యత, భవిష్యత్తూ వున్న యువత ప్రాణాలు విలువైనవి కద రాఘవా?”
“కాదనటం లేదు…. కానీ పిల్లలను కనిపెంచి పెద్దచేసి, యువతకు దిశా నిర్దేశం చేయగల జ్ఞానసిద్ధులు వృద్ధులు! వారు మమతల కోవెలలు…. గత వైభవాల జ్ఞాపకాలు కదరా పెద్దలంటే!” అన్నాడు స్పందనా స్వరంతో రాఘవ.
“సర్లేరా…. పద భోం చేద్దాం” అంటూ మిత్రుడి చేయందుకున్నాడు కార్తీక్.
“అమ్మ అగుపించడం లేదురా… నేనొస్తే తను బయటికి రాకుండా వుంటుందా? ఒంట్లోగాని బాగా లేదా?”
అంటూ హాల్ కెదురుగానున్న గదిలోకి వెళ్ళి చూశావా రాఘవ.
“కార్తీ…. అమ్మేదిరా ఏమైందిరా?” ఆదుర్దాగా అడిగాడు మళ్లీ.
“ఏం కాలేదుగానీ…. పద భోం చేద్దాం. వడ్డించు పద్మా!” అంటూ భార్యకు చెబుతూ, మిత్రుడి భుజం తట్టాడు కార్తీక్.
“నో… అమ్మను చూడందే… అమ్మను పలకరించందే అన్నం తినను!” సోఫాలో కూర్చుంటూ పట్టుదలగా అన్నాడు రాఘవ.
ఏం మాట్లాడలదు కార్తీక్.
“చెప్పరా అమ్మెక్కడ?” రెట్టించాడు రాఘవ.
“నాన్నమ్మను నాన్న ఓల్టేజ్ హోమ్ కి పంపించాడు!”
కార్తీక్ కూతురు నాలుగేళ్ళ పాప చెప్పింది. ఉలికిపాటుగా చూశాడు రాఘవ.
“కారణం?” కలవరపాటుగా అడిగాడు కార్తీకు నుద్దేశించి.
“అమ్మ తల తిరుగుడే కారణం!”
“అదేంట్రా? ఎంత మంచిది అమ్మ! అంత తల తిరుగుడు పనులేం చేసిందని?”
“పనులు కావురా… రోగం… తల అటూ ఇటూ ఊగుతూ…. అలా…. ఆర్నెల్లయింది!” అదోలా అన్నాడు కార్తీక్.
“అయితే… అంత మాత్రాన…” బాధ రాఘవ గొంతులో.
“ఒరే రాఘవా… అలా ఎప్పుడూ ఆమె తల అడ్డంగా అటూ ఇటూ ఊగుతూ వుంటే, కాదు… కాదు… అంటున్నట్టుగా నాకు నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటే…. భరించలేకపోయేవాడిని!” అసహనంగా అన్నాడు కార్తీక్.
“ఒరే కార్తీక్…. అమ్మ శారీరక వ్యాధి కూడా నీకు…. భరించలేని మానసిక బాధేనా? ఆమె అనారోగ్యాన్ని, బాధనూ కూడా అర్థం చేసుకోలేక వృద్ధాశ్రమం బాట పట్టించిన ఘనుడవు కదరా…..” బాధగా మిత్రుడివైపు చూశాడు.
“ఒరే కార్తీక్…. నీకో సంగతి చెప్పనా?”
“చెప్పరా!” చిన్నగా అన్నాడు కార్తీక్.
“లేక లేక పుట్టిన నిన్ను, మీ నాన్న చేసిన అతిగారాబం నిన్ను మొండివాడిగా మార్చింది! ఏది చెప్పినా ఔనంటే కాదు… కాదంటే ఔనంటూ ప్రతిదానికి తల అడ్డంగా ఆడించేవాడిని గుర్తుందా? నీ చిన్ననాడే మీ నాన్న పోయాక, నీ నెగెటివ్ సమాధానాల భారమంతా అమ్మపైనే పడిందిరా! అమ్మ ఏం చెప్పినా మొండిగా తలటూ ఇటూ ఆడించి సతాయించే నీతో వేగలేకపోయేది. అయినా అన్నీ భరించింది. అప్పట్లో ఒకే ఊళ్ళో, ఒకే స్కూళ్ళో నీతోపాటు చదువుచున్న, అమ్మలేని నన్నెంతో ఆదరించిన ఈ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడేది. నీ స్నేహాన్ని వీడవద్దని వేడుకునేది!”
“రాఘవా!” చిత్రంగా చూశాడు కార్తీక్.
“ఔనా…. అన్నింటికి అడ్డంగా తలాడించే నీ నెగెటివ్ తత్త్వాన్ని ఒంటరిదైన అమ్మెలా సహించిందో…. నిన్ను చదివించి ఇంతవాణ్నెలా చేసిందో…. అమ్మ మాటకు అడుగడుగునా తల అడ్డంగా ఆడించే నీ నెగెటివ్ థాట్స్ ను తన తల్లి తనపు పాజిటివ్ రెక్కలతో నిన్నెలా కాపాడుకున్నదో….. తన ప్రేమతో నిన్నెలా ఓ మనిషిని చేసిందో…. ఆ మాతృమమతనెలా మరచిపోయావురా?”
“ నీ కొడుకు కు జ్వరం వచ్చినట్లే నీకెన్నిసార్లు వచ్చుంటుందో జ్వరం నీ చిన్నప్పుడు “
కంటి చెమరింతతో రాఘవ కంఠం వణికింది.
“రాఘవా!” కార్తీక్ కళ్ళలో పశ్చత్తాపంతో కూడిన తడి కదలాడింది.
“చెప్పరా కార్తీ…. చిన్న నాటి నుండి నీ మనసుకున్న ఇగోతో, నీ నెగెటివ్ తత్త్వంతో…. ఎన్ని వేలసార్లు తల అడ్డంగా ఆడించేవాడివో…. అయినా ఆ తల్లి ఒడి నీకు ఓ బడిగా, గుడిగా ఎలా మారిందో…. ఎన్నడైనా ఆలోచించావా? అదే…. అదేరా అమ్మతనమంటే!” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవ.
ఆలోచనతో కూడిన ఆవేదనతో తలొంచుకున్నాడు కార్తీక్.
“కార్తీ…. ఆఖరుగా ఒక్క మాటరా…. రోగ్రగస్థురాలైన అమ్మ తల ప్రకంపనలనే భరించలేనివాడివి…. నీకు జన్మనిచ్చిన్నాడు అమ్మ ప్రసవ వేదనలో ఎన్ని వందల కాదు కాదు వేనవేల బాధా ప్రకంపనల బరువును ఆ తల్లి ఎలా భరించి వుంటుందో ఒక్కసారైనా ఊహించలేవా?”
“అమ్మా!” అంటూ అప్రయత్నంగా ఒక ఆర్థ్రతా పూరితమైన బాధా ప్రకంపనలతో కూడిన ఓ పిలుపు వెలువడింది కార్తీక్ నోటి వెంట.
“అమ్మతనమంటే ఏంటో అర్థమైందిరా! ధన్యవాదాలు రాఘవా…. పద… అమ్మను ఆశ్రమం నుండి తీసుకొద్దాం!” ఆగని కన్నీళ్ళతో అన్నాడు కార్తీక్.
- కె.వీణారెడ్డి
“నాన్నా రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారట,చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది. అందరమూ కలిసి రేపొస్తం” అంది కవిత చాలా రోజుల తర్వాత తల్లితండ్రుల్ని చూస్తున్నాననే సంతోషంతో. “రండ్రి బిడ్డా రండ్రి! ఒక్కూర్లే ఉన్నట్టే కానీ,ఎన్ని రోజులాయె మిమ్మల్ని సూడక! ఈ మాయదారి కరోనా వచ్చి అందరినీ ఆగమాగం చెయ్యవట్టె” విచారంగా కొంత వేదాంత ధోరణిలో అన్నాడు నారాయణ.
కరోనా మహమ్మారి తన ప్రతాపంతో ప్రపంచాన్ని వణికిస్తుంది. పిట్టల్లా జనాలు నేల కొరుగుతున్నారు. ప్రపంచం అంతా లాక్-డౌన్ లో ఉంది. ఒక సేల్స్ ఆఫీసులో అకౌంటెంట్ గా పని చేస్తున్న కవిత కూడా ఇంటికే పరిమితం అయ్యింది. కవిత చెల్లి సవిత, ఒక ఎం.ఎన్ .సి లో వైట్ కాలర్ ఉద్యోగం. అందరూ హైదరాబాద్ లోనే ఉన్నా కేవలం స్కైప్, జూమ్, వాట్సాప్ లలో చూసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకోక చాలా రోజులు అయ్యింది.
ఇంటికొచ్చిన బిడ్డలిద్దరినీ చూడగానే, యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చిన సైనికుల్ని చూసినట్లు సంతోషంతో ముఖం వెలిగిపోయింది తల్లితండ్రులిద్దరికీ. అందరూ ఒకరికొకరు కౌగలించుకుని కళ్ళు చెమర్చారు కొద్దిసేపు. తెలిసిన వాళ్ళు కరోనా భూతానికి బలైపోయిన విషయాలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
నారాయణకు ఐదేండ్ల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుండీ ఆరోగ్యం రోజు రోజుకీ కొంత దెబ్బతింటుంది., మీడియా అత్యుత్సాహంతో భయపెట్టే కరోనా వార్తలు, చూసీ చూసీ నారాయణ మానసికంగా, శారీరకంగా ఇంకా క్రుంగి పోయాడు! బక్క చిక్కి పోయిన తండ్రిని చూడగానే బాగా జాలేసింది బిడ్డలిద్దరికీ. వెళ్తూ వెళ్తూ తండ్రికి ఇష్టమయిన మద్యం ఒక చిన్న బాటిల్ తీసుకుపోయింది కవిత. బాగా బతికిన రోజుల్లో, వారంలో ఒకటి రెండు సార్లు మద్యం తీసుకునే వాడు. ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాగా తగ్గించేసాడు. “ఎందుకు బిడ్డా గివన్నీ! వద్దని చెప్పినాను కదా!!” అన్నాడు కొంచెం నిష్టూరం కలిసిన ప్రేమతో తీసుకుంటూ! తల్లి కూడా వారించింది బిడ్డని ఎందుకివన్నీ అని.
వెంటనే వెళ్లి ఒక గ్లాసు తెచ్చుకొని కొద్దిగా మందు ఒంపుకుని బిడ్డలను పక్కన కూర్చుండ బెట్టుకొని ఒక సిప్పు తీసుకున్నాడు నారాయణ. తల్లి చేసిన పకోడీలతో తండ్రికి కంపెనీ ఇస్తూ కూర్చుని మాట్లాడుతున్నారు అందరూ.
“బిడ్డా.. నీకు చాలా రాజుల రోజుల నుండి ఒక ముచ్చట చెపుదాము అనుకుంటున్నాను! ఇగో అందరున్నారు కదా ఇనుండ్రి” అని ఒక సుక్క మందు నోటితో జుర్రుకొని మొదలు పెట్టాడు. కవితకి అర్థం అయ్యింది ఏదో అతి ముఖ్యమైన విషయంచెప్పబోతున్నాడని. ‘మందు పడ్డప్పుడే ఏవేవో మాట్లాడతాడు’ అని అనుకోవాలని తండ్రి ప్రయంత్నం, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికే మందు తాగుతాడు అని, మందు లేకపోతె మాట్లాడలేడు అనే విషయం ఎప్పుడో అర్థమయ్యింది ఇంట్లో అందరికీ.
“బిడ్డా, ఇగ నేనా ఇంకెక్కువ రోజులు బతకను. నీకు తెల్వంది కాదు, వయసు డెబ్బయి దాటిపోయి మూడేండ్లయిపాయె. రోజు రోజుకూ ఏవో కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. మూణ్ణెల్ల కింద దమ్ము తీసుకోవడంలో ఇబ్బంది అయితే మీరు దవాఖానకు తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టిచ్చుట్ల మళ్ళా మంచిగయితిని. దమ్మొచ్చిన్నప్పుడన్న మీరు దగ్గరుండి దవాఖానలకు తింపుతుండ్రు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కాకపొతే రేపో, ఎల్లుండో, ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే! ఇంక నేనా సాధించేది ఏదీ లేదు, కానీ ఒక్క మాట!” అని మరొక్క సిప్పు జుర్రుకుని మళ్ళీ మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వింటున్నారు తల్లీ కూతుళ్లు.
“నాకా కొడుకులు లేరు, ఉన్నది మీరిద్దరే! మిమ్మల్ని కూడా కొడుకుల్లేక్కనే పెంచిన, సదివిపిచ్చిన కద! రేపు నేను పొతే మాత్రం,నాకు తలకొరివి నువ్వే పెట్టాలె!” అని ఒక పకోడీ ముక్క తీసుకున్నాడు.
“ఎక్కడయినా పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి అంతిమ సంస్కారాలు చేస్తారు. మీరు అదే పాటించుండ్రి. ఇదొక్కటి చేస్తానని మాటివ్వు!” అని కవిత చేయి తీసుకుని చేయి చాపాడు నారాయణ. తండ్రికి పెద్ద కూతురు అంటే తాను, తల్లికి తన చెల్లి సవిత అంతిమ సంస్కారాలు చేయాలని, తల్లి నొచ్చుకోకుండా చెప్పడం గ్రహించింది కవిత.
అనుకోకుండా ఇలాంటి కోరిక కోరడంతో కొంత ఉద్వేగానికి గురయ్యారు తల్లి కూతుళ్ళు. “నాన్నా.. ఇప్పుడవన్నీ ఎందుకు? నీకేమి కాదు. నేను చూసుకుంటాలే, నేనున్నాను కదా!” వేడెక్కిన వాతావరణాన్ని కొంత తేలిక చేయాలని ప్రయత్నించింది కవిత. సవిత కూడా జత కలిపింది అక్కతో. తల్లి కొంత బాధగా లేచి అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది.
“అవునమ్మా, నేను అదే చెపుతున్నాము, నువ్వున్నావనే నా ధైర్యం. నాకు తెలుసు, ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు. మిమ్మల్ని సదివించాలంటేనే, నేను ఎందరికో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆడోల్లకు సదువెందుకు, సక్కగ పెద్ద మనిషి కాగానే పెళ్లి చేస్తే సరిపాయె’ అని అందరూ అనేటోళ్లే. వాళ్ళు అట్ల అన్నందుకన్నా, జిద్దు తోటి మీ ఇద్దరినీ చదివించిన బిడ్డా. నేనా సదువుకోక పోతి, ఏదో కంపెనీల రోజుకూలి కింద పని జేస్తి. మీకు నా అసుంటి కష్టం రావద్దని చదివిస్తి. నాకు మాత్రం కొడుకులయినా బిడ్డలయినా మీరే కద!” కొంత ఉద్వేగానికి గురయ్యాడు నారాయణ.
మాట్లాడడానికి, వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, నాన్న కోరుతున్నది చాలా న్యాయమైన కోరికే అని అర్థం అయ్యింది కవితకి. ఆడపిల్లల్ని చదివించడం కూడా ఒక విప్లవాత్మక మార్పు నారాయణ కుంటుంబంలో. ఆడపిల్లై ఉండి మొట్టమొదట స్కూల్ కి వెళ్ళింది కవితనే వాళ్ళ కుటుంబంలో. కవితకి ఈ విషయం తండ్రి చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. తండ్రి అడిగిన కోరికకి కవిత సమాధానం చెప్పే వరకు ఊరుకోలేదు నారాయణ. సరే అని చేతిలో చెయ్యి వేసింది కవిత, అప్పటికి గానీ శాంతించలేదు నారాయణ.
ఆ తర్వాత కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడి భోంచేసి బయలు దేరారు కవిత,సవిత. తండ్రి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేసింది కవితకి. తన స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్లుతుంటే జ్ఞాపకాలు తన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్లాయి.
*** *** ***
“ఇద్దరూ అమ్మాయిలే, ఒక బాబు ఉంటే బాగుండు” అని చిన్నప్పుడు తల్లి సరోజ చాలా సార్లు అనేది తండ్రి తో.
“కొడుకైతేనేమీ, కూతరయితే నేమి,మళ్ళీ పిల్లగాడే పుడతాడని గ్యారంటీ ఏమిటి?” అని గట్టిగా వాదించేవాడు తండ్రి తల్లితో.
మరోసారి అడగడానికి అవకాశం లేకుండా తానే వెళ్లి, పిల్లలు పుట్టకుండా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్ళీ అమ్మాయే పుట్టిందని ఎందరో తండ్రులు, పురిట్లోనే పసిపిల్లల్ని అంత మొందించండం లాంటి ఎన్నో వార్తలని చూసింది కవిత. కానీ తన తండ్రి ఇద్దర్నీ ప్రేమగా పెంచడం, తండ్రి పట్ల చాలా గౌరవం పెరిగింది. ఇద్దరూ అమ్మాయిలే అని, ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. సరిపోయీ, సరిపోనీ జీతంతో తాను, తిన్నా తినకున్నా కూడా ఇద్దరినీ గ్రాడ్యుయేషన్ వరకూ చదివించాడు.
నారాయణకు ఒక అన్న ఉండేవాడు, కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒకరోజు ఇంటికి వచ్చిన ఆయన “అరేయ్ నారాయణా, నీకు ఎట్లాగూ మగపిల్లలు లేరు కదా! నా ఇద్దరి పిల్లల్లో ఎవర్నో ఒకర్ని దత్తత తీసుకుంటే వాడు మీ ఆలుమగలిద్దరినీ ‘పున్నామ నరకం’ నుండి రక్షిస్తాడు” అన్నాడు. అప్పుడు నారాయణ వినీ విననట్టే ఆవిషయాన్ని దాటేసాడు. ఆయన వెళ్లిన తర్వాత “ఆ కనపడని పున్నామనరకం ఉందో లేదో కానీ, వాళ్ళు మన ఇంటికి వస్తే మాత్రం ప్రత్యక్ష నరకమే! నా పిల్లలు నాకు చాలు, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తే అంతకంటే స్వర్గం ఏముంటుంది?“ అని ఆరోజు నారాయణ తన ఇద్దరు బిడ్డల్నీ పొగడుతూ కొంత వేదాంత ధోరణిలో భార్యతో చెప్పడం ఇప్పటికీ మరచిపోలేదు కవిత.
ఇద్దరు కూతుళ్ళని కొడుకుల్లాగే పెంచాడు, కానీ కొడుకు అవసరం ఏంటో ఆ రోజుల్లో అమ్మ అంతగా ఎందుకు కోరిందో ఇప్పుడర్థమయ్యింది కవితకి. కొడుకు మాత్రమే నిర్వహించే ఒక బాధ్యత మిగిలి ఉంది అని ఈరోజే తెలిసింది కవితకి. కానీ తండ్రి మాత్రం, ఆ భాధ్యతను కూడా కూతుళ్లే నిర్వహించాలని ఈ రోజు మాట వేయించుకోవడం చూస్తే, ఆడ పిల్లల్ని ఇంతగా ప్రేమించే తండ్రి అంటే మరో మారు గౌరవం పెరిగింది కవితకి.
ఈ మధ్య లాక్ డౌన్ సమయంలో తండ్రికి శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయితే ఎవరికీ ఫోన్ చెయ్యొద్దు అని తల్లితో ఒట్టు వేయించుకుని బాధనంతా తండ్రి కడుపులోనే తెగ మింగుకున్నట్టు అమ్మ చెప్పింది ఏడుస్తూ. కరోనా మొదలవ్వని రోజుల్లో, ఇంటికి దగ్గరి లోని నర్సింగ్ హోమ్ కి తీసుకు వెళ్తే కొన్ని గంటలు ఆక్సిజన్ పెట్టితే, మళ్లీ మామూలు స్థాయికి వచ్చే వాడు. ఇప్పుడు ఆ నర్సింగ్ హోమ్ లో ఎవరికో కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మూసివేశారట. బయటకి పోయే పరిస్థితి లేనందువల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలిగించొద్దు అన్నాడట. ఆ విషయం విన్నప్పటి నుండీ మనసు మనసులో లేదు కవితకి, తండ్రి పరిస్థితి గుర్తొచ్చి రెండు కళ్లూ నీటితో నిండిపోయాయి. తండ్రి ఆలోచనలు వెంటాడుతుండగా ఇంటికి చేరుకుంది కవిత.
*** *** ***
ఎప్పటి నుండో బిడ్డలతో చెప్పాలనుకున్న మాటలు చెప్పేయడంతో మనసు చాలా తెలీకయ్యింది నారాయణకి. చాలా సంతోషంగా కూడా ఉంది. నారాయణకి కవిత అంటే చాలా ప్రేమ, నమ్మకం. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతున్నాయి.
కొడుకులా పెంచినందుకు తన కుంటుంబాన్ని కూడా మగవాడి లాగే దగ్గరుండి నడిపిస్తుంది, చాలా ధైర్యవంతురాలు. క్వారీలో పనిచేస్తున్న భర్తకు దుమ్ము, ధూళితో ఆస్తమా వచ్చి, జీతం కన్నా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతుంటే, ఉద్యోగం మానేపించి ఏదైనా వ్యాపారం చెయ్యమని చెప్పింది. భర్త రియల్ ఎస్టేట్ అని ఎచ్చులకు పోయి అప్పుల్లో కూరుకు పోతే, కవిత ఉద్యోగం చేస్తూ తనే కుటుంబాన్ని పోషిస్తుంది ఇప్పుడు. అంతే కాకుండా ఈ మధ్యనే బ్యాంకు నుండి లోను తీసుకుని, తన వంటిమీద ఉన్న బంగారం కూడా అమ్మేసి, ఒక ఇంటికి యజమాని కూడా అయ్యింది. ఆడవాళ్లు తమ కిష్టమయిన బంగారాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడరు, కానీ కుటుంబం కోసం సంతోషంగా బంగారాన్ని అమ్మేసింది కవిత. ఈరోజుల్లో భార్య మెడలో ఉన్న బంగారం కోసం హింసించి తీసుకెళ్లే భర్తలున్నారు. ఇప్పుడు భర్త కూడా బంగారం అమ్మొద్దని చెప్పినా రేపటి రోజుల గురించి ఆలోచించడం కవిత దూర దృష్టికి, కుటుంబం పట్ల వహిస్తున్న బాధ్యతలని చూస్తే చాలా గర్వంగా ఉంది తండ్రికి. కానీ ‘లోను’ తీర్చడానికి, సంసారాన్ని నడిపించడానికి కవిత పడుతున్న కష్టాన్ని, ఆమె బోసి పోయిన మెడను చూస్తూ తట్టుకోలేక పోయేవాడు నారాయణ. ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతుంటే, ఒక భారం దిగిపోయిన తృప్తితో హాయిగా నిదురపోయాడు నారాయణ.
*** *** ***
కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు, కరోనాతో కలసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది అని, ప్రభుత్వం అన్ని వ్యాపారాలు, ఆఫీసులు ప్రారంభించుకోవచ్చు అని ప్రకటన చేయడంతో మెల్లమెల్లగా వ్యాపారాలు తెరచుకుంటున్నాయి.
ఆఫీసుకుకి రమ్మని, మేనేజరు నుండి ఫోన్ రావడంతో మాస్క్ ధరించి, భయం భయంగా ఆఫీసుకి వెళ్ళింది కవిత. లాక్-డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా బయట పడుతున్నాయి. కనిపించని శత్రువుతో అందరిలో గుబులు మొదలయ్యింది . కవిత గత అయిదు సంవత్సరాలుగా వెళ్తున్నది అదే ఆఫీసు, అదే వీధి, అదే మనుషులు – కానీ ఇప్పుడు అంతా కొత్తగా, శత్రువులు లేని యుద్ధభూమిని తలపిస్తుంది. కనిపించిన ప్రతి ఒక్కరూ, ఒకరికి-ఒకరు శత్రువులాగే కనిపిస్తున్నారు. రోజూ పక్క పక్కనే కూర్చుని గంటలకొద్దీ మాట్లాడుతూ పనిచేసిన కొల్లీగ్స్ తో కూడా ఇప్పుడు పక్కన కూర్చోవాలి అన్నా, మాట్లాడాలన్నా భయం. మాస్కులు ధరించడం వల్ల తెలిసిన వాళ్ళని కూడా కొన్ని సార్లు కొత్త గా పరిచయం చేసుకోవాల్సిరావడం వింతగా ఉంది. పక్క ఆఫీసుల్లో పని చేసే ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు అని తెలిసి ఆఫీసు బయటకి వెళ్ళడానికి చాలా భయపడింది కవిత.
అప్పటికి ఒక వారం గడిచింది. మెల్లి మెల్లిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నారు ప్రజలందరూ. రోజులాగే ఆరోజు కూడా ఆఫీసుకి వెళ్ళింది. వీలయినప్పుడన్నా తల్లి తండ్రులతో మాట్లాడుతుంది. తండ్రికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు అన్న విషయం తెలిసినప్పటి నుండి రోజూ రెండు మూడు సార్లు ఫోన్ చేసి పరిస్థితి కనుక్కుంటుంది కవిత. ఆఫీసుకి వెళ్లే ముందు ఫోన్ చేసి మాట్లాడింది తండ్రితో.
“నాకేమయింది బిడ్డ , నేను మంచిగున్న. ఏం ఫికర్ చేయకు” అన్నాడు నారాయణ. ఆ తర్వాత ఆఫీసుకి వెళ్లిన కవిత పనిలో బిజీ అయిపొయింది, అంతలో అనుకోకుండా అమ్మ నుండి ఫోన్ వచ్చింది “నాన్నకి శ్వాస తీసుకోవడం లో చాలా ఇబ్బంది అవుతుంది” అని.
ఇంకేమాత్రం ఆలస్యం చేయక వెంటనే ఇంట్లో ఉన్న భర్తకి ఫోన్ చేసి, తండ్రిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పింది కవిత. ముందు ఫోన్ చెయ్యమంది హాస్పిటల్ కి. కరోనా మహమ్మారి వల్ల చాలా వరకు హాస్పిటల్స్ మూసివేయ బడ్డాయి, కొన్ని హాస్పిటల్స్ కేవలం కోవిడ్ కేసుల కోసమే తెరిచారు. కోవిడ్ భయంతో చాలా వరకు హాస్పిటల్స్ సాధారణ పేషంట్స్ ని చూడడం లేదు. కవిత భర్త దగ్గరలోని రెండు హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తే నిరాశే ఎదురయ్యింది.
సమయం చూస్తే మధ్యాహ్నం మూడు గంటలు. విషయం తెలిసిన కవిత, సహాయం చేస్తారనుకున్న మిత్రులు కొందరికి ఫోన్ చేసింది. కావాల్సింది తాత్కాలిక ఆక్షిజన్ ఏర్పాటు, కానీ ఏ హాస్పిటల్ వాళ్ళు సిద్ధంగా లేరు ఆక్షిజన్ మాస్క్ అమర్చడానికి. కోవిడ్ కేసు కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో ఎవరూ లేరు.
ఆక్సిజన్ పెట్టడం ఎలా అని ఆలోచించింది. విషయం కనుక్కున్న కొల్లీగ్, తనకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ నంబర్,ఇంటి అడ్రస్ ఇచ్చాడు. అతడు ఆక్షిజన్ సిలండర్ తో పేషంట్ ఇంటికే వచ్చి అమర్చుతాడు అన్నాడు. ఇదేదో మంచి సదుపాయం అని వెంటనే ఫోన్ చేసింది ఆనంబర్ కి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లేపడం లేదు. భర్తకు కూడా ఆ వివరాలు ఇచ్చి, ఫోన్ లేపక పొతే ఒకసారి వెళ్లి చూసిరమ్మంది. కవిత భర్త వెళ్లి చూస్తే అది ఒక మెడికల్ షాప్, బందు చేసి ఉంది. లోపల ఎవరూ లేరు.
నారాయణ కి ఆయాసం ఎక్కువ అవుతుంది, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది, పరిస్థితి విషమిస్తుంది . చెల్లికి కూడా ఫోన్ చేసింది కవిత. వెంటనే సవిత తన భర్తకు ఫోన్ చేసి రమ్మంది. వాళ్లకు స్వంత కారు ఉంది, వచ్చే వరకు ఉండమని తల్లికి చెప్పింది. కొద్దీ సేపు ఎదురు చూసారు, కానీ నారాయణకి ఇబ్బంది కావడంతో ఆటో మాట్లాడుకొని దగ్గరలోని హాస్పిటల్ కి వెళ్లారు అత్త, అల్లుడు . ఆ హాస్పిటల్ వాళ్ళు పేషంట్స్ ని తీసుకోవడం లేదు అని తెలిసినా, బ్రతిమిలాడితే పని అవుతుందేమో అన్న ఆశతో అక్కడి వరకూ వెళ్లారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లామన్నారు గేటు బయటే. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ బెడ్స్ లేవు అని ప్రచారం జరుగుతుంది. చేసేదేమీ లేక ఇంకొంత దూరంలో ఉన్న మరొక హాస్పిటల్ కి వెళ్లారు, అక్కడా అదే పరిస్థితి. ఈ లోపుల కవిత కొన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తూనే ఉంది.
ఆటోలో అచేతనంగా భార్య భుజాలపై ఒరిగిన నారాయణకు ప్రాణాలు అవిసిపోతున్నాయి శ్వాస ఆడక. ఊపిరి బిగపట్టుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు.
ఎక్కడన్నా, ఏ హాస్పిటల్ వాళ్ళు అయినా కరుణించి వైద్యం చేస్తారేమో అని ఆశతో గత మూడు గంటల నుండీ దవాఖానా కోసం ఆటోలో తిరుగుతూనే ఉన్నారు. చివరకు సికిందరాబాద్ లో ఒక నర్సింగ్ హోమ్ వాళ్ళు తీసుకు రమ్మన్నారు. వెంటనే అడ్రస్ వాట్సప్ లో పంపింది భర్తకి కవిత. తండ్రిని తీసుకు రమ్మని చెప్పి తానూ బయలు దేరింది హాస్పిటల్ కి. చెల్లి కూడా ఎక్కడికి రావాలో తెలియక కంగారుపడుతుంటే హాస్పిటల్ అడ్రస్ చెప్పింది.
కవిత హాస్పిటల్ కి చేరుకొని, తండ్రి కోసం ఎదురు చూస్తుంది. భరించరాని నొప్పి, చిన్న పిల్లాడిలా విల విల లాడుతున్నాడు. మధ్య మధ్యలో పెద్దగా ఒక శ్వాస తీసుకుంటున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పైనే పడుతుంది హాస్పిటల్ చేరుకోవడానికి నారాయణ దంపతులకి. చుట్టూ హాస్పిటల్సే, కానీ ఏమీ చేయలేక, తన అస్సహాయతకు బాధపడుతూ ఓదార్చుతుంది భర్తని సరోజ. కవిత ఫోన్ చేస్తూనే ఉంది, కానీ తండ్రి మాట్లాడే పరిస్థితిలో లేడు, తల్లితో మాట్లాడుతుంది. హాస్పిటాల్ చేరుకోవడానికి ఇంకో పది నిమిషాలు ఉంది అనగా, ఒక దీర్ఘ శ్వాస తీసాడు నారాయణ. అదే చివరి శ్వాస అని ఊహించలేదు ఎవ్వరూ!
కవిత తల్లి తో మాట్లాడుతూ, హాస్పిటల్ సిబ్బందిని సిద్ధం చేసింది. ఈ లోపుల హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆటో రాగానే కంగారు పడుతూ పరుగెత్తింది కవిత. తండ్రి ఉలుకూ పలుకూ లేక ఉండటం మనసు కీడుని శంకించింది. ఆ భయాన్ని తనలోనే దాచుకుంది. అంతలోనే ముందు కరోనా కోసం టెంపరేచర్ చెక్ చేయడానికి నర్సు వచ్చింది, కానీ శరీరంలో ఎలాంటి స్పందన లేక పోవడం వల్ల వెళ్లి డాక్టర్ కి చెప్పింది. డాక్టర్ వచ్చి పల్స్ చూసి, చాలాసేపటి క్రితమే శ్వాస ఆగిపోయింది, ఇంకేం లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు.
విషయం తెలిసి ఘొల్లుమని ఏడ్చారు తల్లీ బిడ్డలు. అంత కష్ట పడి అన్ని హాస్పిటల్స్ తిరిగి వస్తే తండ్రితో చివరి మాటలకి కూడా నోచుకోలేదు అని కవిత కన్నీరు మున్నీరు అయ్యింది. ప్రతి పేషంట్ ని కరోనా రోగి లానే అనుమానించడం చాలా బాధేసింది కవితకి. ఏదో ఒక హాస్పిటల్ లో కొంత సేపు ఆక్సిజన్ పెట్టితే బ్రతికేవాడు. చుట్టూ హాస్పిటల్లే అయినా ఒక్క హాస్పిటల్ కూడా వైద్యం అందిచండానికి ముందుకు రాలేదు. “ఇది ముమ్మాటికీ హాస్పిటల్ యజమాన్యం చేసిన హత్యనే “ గట్టిగా అరవాలనిపించింది, కానీ మాటలు గొంతు పెగల్లేదు.
చాలా కోపం, దుఃఖం వస్తుంది, కానీ తాను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగాల్సిన పనులు ఎవరూ చేయరు అని దుఃఖాన్ని కడుపులోనే మింగుకుంది. తల్లిని ఓదార్చడం తమ వల్ల కాలేదు కవితకి. అంతవరకూ స్వంతంగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో నిర్జీవం అయిపోవడం నమ్మలేకుండా ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోక ముందే సెక్యూరిటీ గార్డ్ వచ్చి, అక్కడినుండి వెళ్లిపోవాలని పురమాయిస్తున్నాడు. ఆటోవాడు నారాయణ పార్థివ శరీరాన్ని అక్కడే దించేస్తాను, తీసుకుపోను అంటాడు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా, సహాయం చేసేది బదులు ఇలా ఇబ్బందులకి గురిచేయడం చూస్తుంటే చాలా కోపం, అసహ్యం కలిగింది కవితకి.
ఒకపక్క చెల్లి కొద్ది సేపట్లో వస్తుంది అని చెప్పింది. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా అనుమతించడం లేదు. అంతవరకూ మనిషిగానే ప్రవర్తించిన ఆటోవాలా సాటి మనిషి మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, గత మూడు గంటల నుండీ తన ఆటోలో ఎక్కించుకొని తిరిగిన వారి మనోభావాలను కనీసం పట్టించుకోకుండా, ఆపదలో ఉన్న వారి నుండి ఆర్థిక ప్రయోజనాలకోసం వెంపర్లాడటం చూస్తే ఏమనాలో తెలియలేదు కవితకి. మొత్తానికి కవిత భర్త ఏదో బేరం కుదుర్చుకుంటే సరే అని ఇంటికి తీసుకెళ్లాడు ఆటోవాలా.
తండ్రిని బ్రతికించుకోవాలని ఎంతో ఆరాటంతో కనపడ్డ ప్రతి హాస్పిటల్ తలుపు తడుతూ , చివరికి ఇక్కడికి చేరుకుంటే హాస్పిటల్ సిబ్బంది తమ పరిస్థిని అర్థం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపొమ్మని తరిమి వేయడం చూస్తుంటే మానవత్వం అనేది డబ్బు పొరలతో కప్పివేయబడిందా అనిపించింది కవితకి. ఎవ్వరికీ ఇతరుల కష్టాలతో కానీ, వారున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా, కేవలం తమ అవసరాన్ని ఆర్ధిక ప్రయోజనంలా మార్చుకోవడము చూస్తుంటే ఏమనాలో తెలియలేదు కవితకి.
ఆటోలో వెళ్తూ చెల్లికి ఫోన్ చేసింది, ఇద్దరూ ఫోన్లో నే ఏడుస్తూ, దగ్గరి చుట్టాలందరికీ కవిత ఫోన్ చేసి చెప్పింది. తల్లి తండ్రుల రక్త సంబంధీకులు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి తెలిసిన కొన్ని గంటల్లోనే వచ్చారు. కరోనా కట్టడి సమయం కాబట్టి కొద్ది మంది పెద్దవాళ్ళు రాలేము అన్నారు. జరగాల్సిన పనులు ఇద్దరు అల్లుళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
సరోజ చెల్లెలికి ఇద్దరు కొడుకులు భాస్కర్, రమేష్. కవిత – సవిత లతో బాగా కలసి ఉంటారు, నెలకొక సారి అయినా రెండు ఫ్యామిలీలు కలుస్తుంటారు. విషయం తెలియగానే అందరూ వచ్చారు. ఇద్దరు బావలతో కల్సి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కవిత కజిన్స్ భాస్కర్, రమేష్. వారు రాగానే చాలా ధైర్యం వచ్చింది కవితకి, పట్టుకుని ఏడ్చింది చాలా సేపు. అందరూ కవితకి, వాళ్ళ నాన్నకి ఉన్న అనుబంధాన్ని పొగుడుతూ చెపుతుంటే దుఃఖం రెట్టింపు అయ్యింది కవితకి.
పెదనాన్న కొడుకులు, పెద్దమ్మ, కవిత – అత్తా,మామ,మరుదులు అంటే తన భర్త తమ్ముళ్లు, సవిత – అత్తా మామలు,ఆడబిడ్డ అందరూ వచ్చారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడల్లా ఏడ్పులు మిన్నంటుతున్నాయి. అప్పటికే దగ్గరి బంధువులందరూ వచ్చారు, చీకటి కాబోతుంది.
“అందరొచ్చినట్టే కదా, ఇంకా ఎవరి కోసం ఎదురు చూసేది లేదు తంతు మొదలు పెట్టండి, అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తున్నారు ” అన్నాడు కార్యక్రమాలు నిర్వహించే కులపెద్ద.
తండ్రి కోరిక ప్రకారం, పెద్ద కూతురు కవిత తలకొరివి పెడుతుంది అని తల్లి చెప్పింది అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కులం పెద్ద మనిషికి. అసలే తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితకి ఆ విషయం అప్పటిదాకా గుర్తుకు రాలేదు. నాన్నకి ప్రామిస్ చేసిన విషయం ఎప్పుడో మర్చిపోయింది ఈ హడావిడిలో. తల్లి చెప్పగానే కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధురాలు అయ్యింది కవిత.
‘పెద్ద బిడ్డ తలకొరివి పెడతదట’ అన్న మాట విన్న కులపెద్ద, వెంటనే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు కోపంతో. “నా జిందగీల చూడలేదు ఆడోల్లు తలకొరివి పెట్టంగ. చిన్నాయిన, పెద్దనాయిన కొడుకులు ఎవ్వరూ లేరా? అసలు మొగోల్లే లేరా వంశంల అగ్గి పెట్టడానికి? గీ ఆడోల్లు చేసుడేంది?” రెచ్చి పోతున్నాడు మద్యం మత్తులో ఉన్న ఆ పెద్ద మనిషి. భాదిత కుటుంబాల దుఃఖంతో అసలే పనిలేదు, కానీ వారికి మాత్రం మద్యం అందించాల్సిందే అడిగినప్పుడన్నా. ఆయన తృప్తిగా ఉంటే చనిపోయిన వారికి ఆత్మ శాంతిస్తుందని చెప్పుకుంటారు. అందుకే ఆయనకు కోపం రాకుండా చూసుకుంటారు ఇలాంటి సందర్భాలలో.
ఈ వార్త కొన్ని సెకండ్లలో అక్కడ ఉన్న అందరికీ చేరి పోయింది. కొద్దిమంది గుసగుసగా చెవులు కొరుక్కుంటున్నారు ‘ఆడపిల్ల తలకొరివి పెడుతుందట అని.
“అమ్మాయి, మన వంశం వాళ్ళు ఇంకో వంశం వారికి తలకొరివి పెట్టకూడదు. అందులో ఆడ పిల్లలు అసలే పెట్టకూడదు” అన్నాడు కవిత మామ అంటే తన భర్త తండ్రి. సాధారణంగా ఆయన చాలా సౌమ్యుడు,కోడలన్నా మంచి గౌరవం. ఎప్పుడూ తను చేసే అన్ని పనులనూ సమర్థించే మామయ్య కూడా ఈ రోజు ఏదో తప్పు చేసినట్టు వద్దని వారించడం, విషయం అంత సీరియస్ గా ఉంటుందని అనుకోలేదు కవిత.
“మన వంశంలో ఇద్దరు కొడుకులు ఉండగా, వేరే ఇంటికి ఇచ్చిన పిల్లతోటి ఎట్ల తలకొరివి పెట్టిస్తరు? మేమేమన్నా ఆస్తులు , పాస్తులు పంచివ్వమన్నామా తలకొరివి పెట్టినందుకు?“ కొడుకులను చూపిస్తూ అంది పెద్దమ్మ అంటే తన తండ్రి అన్న భార్య.
“పెద్ద బిడ్డ తలకొరివి పెడుతుందట, విడ్డూరం కాకపొతే ఎక్కడన్నా విన్నారా? ఇంకో ఇంటికిచ్చిన ఆడిపిల్లలు తలకొరివి పెడతారా? అల్లుళ్ళ కు తెలివి లేదా? ఎట్లా ఒప్పుకుంటారు పెళ్ళాం తలకొరివి పెడుతుంటే? ” పెదనాన్న వాళ్లకు సంబంధించిన ఎవరో దూరపు బంధువు అంది అందరికీ వినబడేట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు.
పనిలో పనిగా అప్పటికే బయటకి వెళ్లిన ఇద్దరు అల్లుళ్ళు కొంత మద్యం సేవించి వచ్చారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆ ముసలమ్మ మాటలు ఇద్దరు అల్లుళ్ళూ విన్నారు. పెద్ద అల్లుడు అంటే కవిత భర్త ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు, భార్య ని సమర్థిస్తాడు ప్రతీ విషయంలో. అసలే మందు మీదున్న చిన్న అల్లుడు రాజు కి రోషం పొంగుకు వచ్చింది ముసలమ్మ అన్న మాటలు విన్నాక.
“మేము ఇంటి అల్లుళ్ళము, మాకు అన్ని హక్కులు ఉంటాయి. కొడుకుల తర్వాత మేమే కొడుకుల్లాంటి వాళ్ళం. తలకొరివి పెట్టేది మగవాళ్ళు మాత్రమే! మేము, ఆడవాళ్లు పెడితే ఒప్పుకోము. వదినా.. నువ్వే తలకొరివి పెట్టాలనుకుంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో! “ కవిత భర్త తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు, అరిచాడు రాజు. సవిత వారిస్తున్నా వినడంలేదు రాజు, ఇంత వ్యతిరేకత తమ ఇంటి నుండే మొదలు అవుతుందని ఊహించలేదు కవిత.
అంత వరకూ తనూ ఇంటి వాడే అన్నట్టు అని పనులు పురమాయిస్తున్న తన చెల్లెలు భర్త ఆవేశాన్ని ఆపుకోలేక అలా అరవడం, ఊహించక తట్టుకోలేక పోయింది కవిత. ఆపత్కాలంలో అందరూ ఆదుకుంటారని అనుకున్న కవితకి, సమస్య ఇంత జటిలంగా ఉంటుందని ఊహించలేక పోయింది. ఆ రోజు తండ్రి చేతిలో చేయి వేసి మాట ఖచ్చితంగా ఎందుకు వేయించుకున్నాడో, ఆ విషయం తీవ్రత ఎంత ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమయింది కవితకి.
అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితని ఓదార్చడం అటుంచి, తాగి వచ్చి ఈ రోజు తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తిరగబడడం తట్టుకోలేక పోయింది. ఎవరో బయటి వారు అంటే తిరిగి జవాబు ఇవ్వాలని అనుకుంది, కానీ తన స్వంత మరిది, పెద్దమ్మ, మామగారు ఇలా అందరూ తన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే ఈ రోజు ఎదురు తిరగడం తట్టుకోలేక పోయింది కవిత. సవితకి భర్తని అనేంత స్వతంత్రం లేదు, కనీసం ఆపడానికి కూడా ధైర్యం లేక పోయింది అలా మాట్లాడుతుంటే. తండ్రికిచ్చిన మాట కోసం ఎట్టి పరిస్థితిలో వెనుకడుకు వేసేది లేదని నిర్ణయించుకుంది కవిత.
“నేను చేస్తున్న పని నా కోసం చెయ్యట్లేదు, నా తండ్రి చివరి కోరిక! నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను” అని గట్టిగా అరిచింది, కానీ ఏడ్చి ఏడ్చి నోరు ఎండి పోయింది, గొంతు కూర్చిండి పోయింది. మాటలు నోరు దాటి రాలేకపోయాయి.
“ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు” ఆ రోజు తండ్రి అన్న మాటలు గురుకు వచ్చాయి. తన ముందు ఏ మార్గం కనపడటం లేదు, కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్ద చాలా కోపంగా ఉన్నాడు. బాగా ఆలోచిస్తుంది ఎలా మొదలు పెట్టాలా అని. ఎవరో మంచి నీళ్లు తెస్తే తాగి గొంతు తడుపుకుంది. కులపెద్దని ఏమన్నా అంటే పరిస్థితి ఎక్కడికో పోతుంది, ఆయన ఈగో హార్ట్ కాకుండా పరిస్థితి అర్థం చేయాలి అనుకుంది కవిత. ఆయన కనుక అలిగి పొతే అరిష్టం అంటారు, ఇక అందరితో మాటలు పడాలి. బాగా ఆలోచించింది, పుట్టెడు దుఃఖంలో కూడా తన బాధ్యతని మరచి పోలేదు.
కవిత ఏమీ మాట్లాడక పోవడం చూస్తుంటే భాస్కర్ కి చాలా కోపం వచ్చింది. భాస్కర్ తమ్ముడు రమేష్ కూడా పరిస్థితి గమనిస్తున్నాడు. కానీ కవిత అంత తొందరగా దేన్నీ వదులుకోదు అని తెలుసు వాళ్ళిద్దరికీ. కవిత భర్త కూడా చూస్తూ ఉన్నాడు కానీ ఎవరినీ ఏమంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం కాక మౌనంగా చూస్తున్నాడు. తన భార్య అంతిమ సంస్కారాలు చేయడం అతనికేమీ అభ్యంతరం లేదు, తనకు తండ్రి అంటే ఎంత ప్రేమనో తెలుసు. కవిత తల్లి కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది, కూతురు పరిస్థితికి లోపల చాలా చింతిస్తుంది. తన భర్త చివరికోరిక దక్కక్కుండా పోతుందేమో అని అంత దుఖంలోనూ భయపడుతుంది.
కవిత తన మౌనాన్ని అంగీకారం అనుకున్నాడు మరిది. తన ఆలోచనలని తీవ్రం చేసింది. ఈ రెండు మూడు నిమిషాల్లో తాను మాట్లాడక పొతే, మరెప్పటికీ సరిదిద్దు కోలేని ఒక పెద్ద తప్పు, తన తండ్రి చివరికోరిక ను తీర్చలేని అసమర్ధురాలి గానే జీవితమంతా మిగిలి పోవాలి” అనుకుంది.
“తండ్రి తమ కోసం ఎంతో చేసాడు, కష్టపడి చదివిస్తే ఆయనకు చివరి రోజుల్లో ఒక మంచి జీవితం అందించలేక పోయాను, చివరికి ఒక కృత్రిమ ఆక్సిజన్ పెట్టించలేక పోయాను” అని కరోనా భూతాన్ని తిట్టు కుంటూ, కుమిలి పోయింది మనసులో. తండ్రి శవం పై పడి బోరున విలపిస్తుంటే అక్కడ ఉన్న వారి అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు తల్లిని పట్టుకుని కడుపులో గూడుకట్టుకున్న దుఃఖమంతా పోయేవరకు ఏడ్చింది. “నాకేమి కాదమ్మా ఫికర్ చేయకు” అని అన్న తండ్రి కొన్ని గంటల్లో తమకు దక్కకుండా పోవడం, హాస్పిటల్ వాళ్లు ఎవరన్నా సమయానికి ఆక్సిజన్ పెడితే ఈ రోజు తమ తండ్రి తమతో ఉండేవారు అని అక్కాచెల్లెళ్ళిద్దరూ విలపిస్తుంటే ఆ దృశ్యం అక్కడున్న వారి గుండెలను పిండేసింది. ఆ బాధ లోంచి, తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ, బలాన్ని ధైర్యాన్ని చేకూర్చుకొని, తన తండ్రి అంతిమ సంస్కారానికి మానసికంగా సిద్ధం అయ్యింది కవిత.
“తన తండ్రి అంతిమ సంస్కారం కోసం ఇంకొకరిని అడిగేదేముంది? ఒక్కసారి కూడా తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించని వారి కోసం తన నిర్ణయాన్ని మార్చుకోవాలా?” ఆలోచనలు పదునెక్కుతున్నాయి కవితకి.
పెద్దమ్మ వాళ్ళను, ఇంకో పెద్దమనిషిని పెద్దగా పట్టించుకోదలచుకోలేదు, వారికి జవాబు ఇవ్వడం కూడా వ్యర్థం అనుకుంది, కానీ సమస్య అంతా కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్దని ఒప్పించడం పెద్ద సవాల్ గా మారింది. రాజు తండ్రి అంటే తన చెల్లి మామయ్య, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ అధికారి. ఎక్కడ అయినా చాలా హుందాగా ప్రవర్తిస్తాడు, మొత్తం ఫ్యామిలీ లో బాగా చదువుకున్న వాడు అని పేరు. ఇంతకు ముందే వచ్చి కూర్చున్నాడు, కవితని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజు తన తండ్రి పక్కనే కూర్చున్నాడు, ఆయన పక్కనే కులపెద్ద కార్యక్రమ నిర్వాహకుడు కూర్చొని గుర్రుగా చూస్తున్నాడు కవితని.
మరిది దగ్గరకి వెళ్లి “రాజూ .. నీవు చెప్పింది అంతా విన్నాను. ఇప్పుడు నాకు, నా తండ్రి చివరి కోరికను తీర్చడం కన్నా వేరే మార్గం లేదు. కొడుకు తర్వాత కొడుకులం అన్నావ్, నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటే నా తండ్రి చివరి కోరిక ఏదో, దాని విలువెంతో తెలుసుకో! కాదు కూడదూ అంటే నీ ఇష్టం. ఇది నా తండ్రి చివరి కోరిక, ఖచ్చితంగా ఆయన అంతిమ సంస్కారం నేనే చేసి తీరుతాను . అయినా, ప్రపంచమంతా స్త్రీలకు, పురుషలకు ఒకటే రూలు అని, చివరకి సుప్రీం కోర్టు కూడా తరతరాలుగా ప్రవేశం లేని గుళ్ళకి స్త్రీలను అనుమతిస్తుంటే, కన్న తండ్రి చివరి కోరిక ప్రకారం, స్వంత బిడ్డ తండ్రి అంతిమ సంస్కారాలకు పనికి రాదా? ఎవరన్నా అడ్డొస్తే కోర్టుకు పోయయినా అనుమతి తీసుకొస్తా! ఎవరన్నా ఇష్టం ఉంటె ఉండొచ్చు, నేను తలకొరివి పెట్టడం చూడటం ఇష్టలేక పొతే వెళ్లిపోవచ్చు” చివరి రెండు మాటలు కులం పెద్దవైపు చూస్తూ గట్టిగా వార్నింగ్ లా అంది.
అంతకు ముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి అప్పుడే వచ్చిన సవిత మామయ్య భాస్కర్ ని విషయం అడిగి తెలుసుకున్నాడు. కవిత అంటే చాలా గౌరవం ఆయనకి, నారాయణ చాలా విషయాలు చెప్పేవాడు కవిత గురించి. వాళ్ళ కొడుకు ప్రతీ దగ్గర ఏదో ఒక సమస్య సృష్టిస్తాడని బాగా తెలుసు. అసలే తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళకు తన కొడుకు ద్వారా, అక్కడ జరుగుతున్న పనులకు అడ్డంకులు జరగడం చూసి సహించలేక పోయాడు, కొంత ఇబ్బందికి గురయ్యాడు.
“అమ్మాయి కవితా, మీ తండ్రి మిమ్మల్ని ఎలా పెంచాడో, చాలీ చాలని జీతంతో మిమ్మల్ని ఎలా చదివించాడో అన్నీ తెలుసు. స్త్రీ, పురుష బేధం లేకుండా మనిషి చంద్ర మండలానికి వెళ్తుంటే, ఈ పనులు స్త్రీలే చేయాలి, పురుషులే చేయాలి అని నిబంధనలు పెట్టుకోవడం తప్పు. ఇంకా ఈ కాలంలో కూడా అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి అని వాదించుకోవడం అనవసరం. తండ్రికి, కొడుకు అయినా, బిడ్డ అయినా ఒక్కటే. మీ తండ్రి కోరిక ఎలా ఉందో అలాగే కానివ్వు” అందరూ వినేట్టు గట్టిగానే అన్నాడు మామయ్య.
అంత వరకూ నిశ్శబ్దంగా చూస్తున్న భాస్కర్ కి కూడా అవకాశం దొరికినట్లయింది. “హంతకులను ఉరితీసేప్పుడు కూడా వారి చివర కోరిక అడిగి నెరవేర్చంగా లేంది, తండ్రి చివరికోరికను స్వంత కూతురు తీర్చడం ఎలా తప్పు అవుతుంది అంకుల్ ? ఇప్పుడు చేసే పనికి, లింగ భేదాన్ని అన్వయిస్తే అది చట్ట రీత్యా నేరం, ఏ పని అయినా ఎవ్వరయినా చెయ్యొచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయం” ఆవేశంగా అన్నాడు భాస్కర్.
ఇప్పుడు కవిత కి మామయ్య, అన్నయ్య సప్పోర్ట్ తో ఇంకా ధైర్యం తెచ్చుకుంది. “కొడుకులు లేకుంటే ‘పున్నామ నరకానికి’ పోతారు అని భయపెట్టించినా, ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. ఆడ పిల్లలకి చదువెందుకని మొత్తుకున్నా ఆయన మమ్మల్ని చదివించకుండా ఉండలేదు. చివరికి తలకొరివి నన్నే పెట్టమని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. మా నాన్న కోరిక నేను తీర్చడంలో మిగతా వాళ్ళకి ఏం ఇబ్బందో తెలియదు. ఆడ వాళ్ళు ఉద్యోగం చేయవచ్చు, ఆడవాళ్లు సంపాయించ వచ్చు, మగవాళ్ళు ఆడ వాళ్ళ సంపాదన మీద పడి తిని బ్రతకొచ్చు, కానీ ఆడవాళ్లు మాత్రం తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి పనికిరారు! ఇది ఎక్కడ రాసి ఉంది?” ఆవేశంగా అంది కవిత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ.
ప్రేమగా పెంచిన తండ్రి చివరికోరిక తీర్చడంలో తప్పేంటి అని అందరూ కవితకు మద్దతుగా నిలిచారు. కవితకు మద్దతుగా మాట్లాడిన మాటలు అందరినీ తీవ్రంగా ఆలోచింపచేశాయి. ప్రభుత్వం, చట్టాలు, కోర్టులు అన్న మాటలు బాగా వినిపించాయి ఆ కులపెద్దకి. దానికి తోడు, కవిత మామయ్య, బాగా చదువుకున్న వాడు, సంఘంలో మంచి పేరున్న ఆయన కూడా మద్దతు ఇవ్వడంతో కొంత భయపడి, పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే నలుగురితో నారాయణ అనడమే మంచిదని “మీరందరూ సరే అంటే నాకేమి ఇబ్బంది? మీరన్నట్టే కానీ, చలో నడువమ్మా , ఇప్పటికే పొద్దుపోయింది బాగా” అని లేచాడు కులపెద్ద. కులపెద్ద ఏమాత్రం ఎదురు చెప్పక, ఒప్పుకోవడంతో కవిత మనసులో తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
“బాగా చెప్పినవమ్మా , ఇప్పటికయినా కొద్ది మందికి బుద్ది వస్తే అదే మంచిది. నీవు వెళ్లి పని చూసుకో, మిగతాది నేను చూసుకుంటా” అని భార్య సంపాదన మీద పడి బతుకుతున్న తన కొడుకుకు ఇప్పటికన్నా బుద్ది రావాలని గట్టిగానే అన్నాడు సవిత మామయ్య. అంత వరకూ ఎగిరెగిరి దూకిన కవిత మరిది, సిగ్గుతో తలదించుకున్నాడు, తాగిన మత్తు కూడా పూర్తిగా దిగింది.
“బాగా ఆలోచిస్తే, కన్న తండ్రి చివరి కోరిక తీర్చడం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనిపిస్తుంది. ఈ వంశాలు, గోత్రాలు అన్ని మనకి మనం సృష్టించుకున్నాయి. మనిషి పుట్టాకే ఈ పద్ధతులు పుట్టాయి, ఒక పని చేయడానికి మంచి మనసు ఉండాలి. నీవే కరెక్టు, అలాగే కానియ్” అన్నాడు కవిత మామయ్య అంటే తన భర్త తండ్రి. అంత వరకూ వద్దూ అన్న తన స్వంత మామయ్య కూడా సమర్దించడం వల్ల కవితకి ఇప్పుడు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఏలోకంలో ఉన్నాడో తెలియని తన తండ్రి, తప్పక ఈ మాటలు వినిసంతోషిస్తాడని అనుకుంది. అంతవరకూ అటు భర్త పోయిన దుఃఖంతో, ఇటు భర్త చివరి కోరిక తీర్చలేమేమో అని బాధపడుతున్న సరోజ మనసు కొంచెం కుదుట పడింది.
స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగిన నారాయణ పార్థివ శరీరాన్ని అలంకరించి పాడె పై పడుకోబెట్టారు. పాడె పై ఉన్న తండ్రిని చూసి, తల్లీ కూతుళ్లు ఒకరినొకరు పట్టుకుని బోరుమని విలపించారు. తిరిగిరాని లోకాలని శాశ్వతంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న తండ్రిని చూస్తే, ఫ్యాన్టు- షర్టు వేసుకొని ‘ఫ్యాక్టరీ కి పోయొస్తా బిడ్డా’ అని చెప్పుతున్నట్టు అనిపించింది కవితకి.
“నాన్న వెళుతున్నాడు, మరెన్నడూ రాడూ” అంటూ తల్లినీ, చెల్లినీ పట్టుకుని బోరుమని కవిత ఏడుస్తుంటే, అందరి హృదయాలు బరువెక్కాయి. ఆ దృశ్యం చూసి, ఒక్కసారి ఘొల్లుమని ఏడుపు అందుకున్నారు అక్కడున్న అందరు చుట్టాలు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తల్లీకూతుళ్లు విలపిస్తున్న తీరు చూసిన వారి కళ్ళు చెమ్మగిల్లాయి. “బిడ్డా, నువ్వు గెలిచావ్!“ అని తండ్రి దీవించినట్టు అనిపించింది కవితకి తండ్రిని చూస్తుంటే. తృప్తిగా కళ్ళు మూసుకుంది కొన్ని క్షణాలు.
“నాన్నా , నువ్వే గెలిచావ్! నీవు మాపై పెట్టుకున్న నమ్మకానికి ,ఇప్పుడు నీ నమ్మకమే గెలిచింది, అని లోపలి నుంచి దుఃఖంతోపాటు తన్నుకొచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ తండ్రి కి మొక్కింది కవిత. తన కర్తవ్యం గుర్తుకు వచ్చి మిగిలిన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధం అయ్యింది.
కుండలో మండుతున్న బొగ్గులని వేసి, దాన్ని చేతితో పట్టుకోవడానికి వీలుగా తాడుతో కట్టి సిద్ధంగా ఉంచాడు భాస్కర్. తన భర్త తోడు రాగా, అంతిమ సంస్కారాల్లో అతి ముఖ్యమైన ఆ పొగలు కక్కుతున్న కుండని, కండలు తిరిగిన మహారాజులకే సాధ్యం కాని శివధనుస్సు ను సీతమ్మ తల్లి సునాయాసంగా లేపినట్టు, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో వంగి, తన చేతులోకి తీసుకుంది కవిత. గోవిందా, గోవిందా అని నిదానాలు చేస్తూ, నారాయణ పార్థివ శరీరానికి తన ఇంటి నుండి అంతిమ వీడ్కోలు పలుకుతూ బయలు దేరారు బంధుజనమంతా. గుండెనిండా పుట్టెడు దుఃఖంతో, చేతిలో పొగలుకక్కుతున్న కుండతో పాడె ముందు గంభీరంగా నడుస్తున్న కవితని చూస్తుంటే, అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పట్టుకుని, అనాదిగా మగవాడి చేతిలో అణచబడుతున్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపుతూ నడుస్తున్న ఆదిశక్తిలా కనిపించింది అందరి కళ్ళకి కవిత.
ఈ కథ మీద సమీక్షవ్యాసాలలో చూడగలరు.
సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటున్నది. తల్లి ఏదైనా వంటకము చేసి పెట్టి రుచి ఎలా వున్నది ? అని అడిగితే “ యమహా “ గా వున్నది … అనేది- తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడూ!బాగున్నాయా? అనడిగితే నాన్న గారూ! “ యమహా “గా వున్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ? ఎలా వుంది ? అని అంటే “ యమహా “ గా ఉన్నదంటుంది.
సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకుని … హలో !!! హైదరాబాద్ !!!గుడ్ మార్నింగ్ !! ఎలా వున్నారు? నేనైతే యమాహా గా వున్నాను.మీశ్రోతలందరికీ యమా యమాగా మీరు కోరుకున్న పాటలు విని పిస్తాను.ట్రింగ్ …ట్రింగ్ …హలో !! ముందుగా కాల్ చేస్తున్నారు యమాహాగా! M.ధర్మరాజు గారూ ! ఈ రోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు.
హలో ! హలో ! సావిత్రి గారూ ! మీ వాయిస్ బాగుంటుంది .. అది వినాలనే చాలా సార్లు కాల్ చేసాను అదృష్ట వశాత్తూ ఈ రోజు కలిసింది. థాంక్సండీ మీకు ఏ పాట కావాలి ? అవతలి వైపునుండి .. ”యమహో ..యమా యమా అందం “ అనే పాట కావాలి.శ్రీదేవి గారు లేరు కదా ! మరొక్క సారి గుర్తు చేసుకుందామని …
ఓ ! సరే సరే యమ్ ధర్మరాజు గారూ వినిపిస్తాను …వినండి వినండి ఉల్లాసంగా ..ఉత్సాహంగా !!అలా తన డ్యూటీ ముగించుకుని సావిత్రి తన “యమహా “మోటారు సైకిల్ మీద యమా స్పీడుగ భర్త ఆఫీస్ కు వెళ్ళి, ఆయనను పికప్ చేసుకుని , వస్తుంటే… తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమ ధర్మ రాజులా కనపడి( ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషము వేసుకుని … హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి) హెల్మెట్ లేదనిసఅడ్డగిస్తే …సర్ది చెప్పి బయట పడేసరికి ఆలస్యమయింది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకుని పోదామని అటు చూసేసరికి…స్వర్గలోక్ రెస్టారెంటు కనపడింది. హోటల్ ముందు బోర్డ్ మీద రుచి గా చేసేందుకు ఐదు నక్షత్రాలహోటల్ చెఫ్ యమ్ ( అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు .పేరు పెద్దగా వున్నదని అలా యమ్ అని రాసుకుంటాడు.) చాలా రుచిగా శుచిగ చేస్తాడని, అతనికి సహాయకులుగా నల్,భీమ్ లున్నారని రాసి వున్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంప దీసివీడి హోటల్ లో పుఱ్ఱెలలో వడ్డిస్తారేమో అపిటైజర్ కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా! అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
భోజనమైన తరువాత వాళ్ళకు ఒక అలవాటు ఎప్పుడైన సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలాన నంబరు గల టేబిల్ పై సర్వ్ చేసిన ,భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? అని అడిగితే మాస్టర్ యమ్ (యామినేని మార్కండేయులు) వచ్చి నేనే చేసాను . మీకు నచ్చలేదా ? అనగానే , కాదు కాదు యమహా గా వున్నదని అభినందించి, అక్కడి విజిటర్స్ బుక్ లో రాసి వచ్చినారు.
ఇద్దరూ కూర్చుని మాట్లాడు కుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి… ఎన్ని రోజులు ఈ నరకంలో వుంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేసినారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికీ కామెడీ ప్రోగ్రామ్ లు చాలా నచ్చుతాయి.ఇంతలో స్క్రీన్ మీద “ యమధర్మ రాజు” మీద తీసిన
సినిమా క్లిప్పింగ్ లు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త, నాకు యమగోల అంటే ఇష్టము …ఏ సినిమా లో నైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని. సత్యనారాయణ అయినా , ఈ మథ్య నటించిన మోహన్ బాబు యమహా గా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు.
తెల్లవారు ఝామున సావిత్రికి మెలుకువ వచ్చింది.ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి సావిత్రీ !!! నీకు భూలోకంలో నివసించే సమయము అయిపోయింది రా!! యమలోకం వెళ్ళాలి… అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా! … కల వచ్చిందని… పడుకునేముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము ..తను నేను.
ఓహ్! కలనా అని పైకే అన్నది సావిత్రి.కాదు కాదు నువ్వు కల కన లేదు… నిజంగానే నీకుమరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు.
“అయ్యో ! అలానా ? అయినా నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా ! సరే వస్తాను !! కాని నేను నాభర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా … వాళ్ళిద్దరి పుట్టిన రోజు ఒకేరోజ వస్తాయి.
నాకు కొంచెము సేపు టైమ్ ఇవ్వు… ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోష పెట్టి వస్తాను “అని బతిమిలాడింది. అంటే సరే నేను ఇలా ఎవరికీû టైమ్ ఇవ్వను.వారి మరణమా
సన్నమవగానే …పాశం వేసి , ప్రాణాలు తీస్తాను…ఇలా మాట్లాడుతూ సమయము గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము”యమహా! యమహా “ అని తలుచు కుంటావు కాబట్టి… అందునా మానవ లోకంలో నన్ను స్తోత్రము చేసే వాళ్ళే లేరు. అందరూభయపడి మనసు లో కూడా యమ అనరు అటువంటిది అలా ప్రతి పని లో నన్ను మనస్పూర్తిగా తలుచుకుంటూంటావు …. కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూంలో కూర్చుంటాను త్వరగా పని ముగించుకొని రా…అన్నాడు యముడు.
ఇక నడుము కు కొంగు చెక్కుకుంది… ఏ పని తో మొదలు పెట్టాలా అను కుంటూ.. గబగబబాయిలర్ లో నీళ్ళు పోసి, చెక్క పేళ్ళతో అంటించి, నీళ్ళు వెచ్చ పడగానే… భర్తకు, కొడుకుకు తలంటుపోయాలి అనుకుంటూ .. వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసు లో పోసి ముందు రూంలో వున్న యముడికిచ్చింది అహా ! సావిత్రీ నాకు ఇలా ద్రవ పదార్ధాలు తాగే అలవాటు లేదంటే …కాదు ఒక్క గుక్క తాగండి” యమహా “ గా ఉంటుందని చప్పున నాలుక కరుచుకుంది.
యముధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహా గా వున్నదన్నాడు. మీరే కాదు స్వామీ! “నా భర్త స్నేహితులు, చుట్టాలు అందరూ అదే మాటంటారు.
సరే సరే వెళుదాం పద ! నాకు ఇవ్వాళ “ టర్కీ “ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలా మంది ప్రాణాలు తీయాల్సివుంది” అన్నాడు.
సావిత్రి పనిలో పడింది. బ్రేక్ ఫాస్ట్ మంచిగా చేయాలి. రేపటి నుండి నేనుండను కదా!అని వడ అందరికీ ఇష్టమని వడా , చట్నీ, సాంబార్ చేస్తూ ..మధ్య మధ్య భర్తను , పిల్లలను నిద్ర లేపుతున్నది.అటునుండి , ఇటుతిరిగి పండుకుంటున్నారు.సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్ లో పప్పు , అన్నం పెట్టి , కూరలు కట్ చేసి మరొక్కసారి అందరిని నిద్ర లేపి , ఇంతలో మునిసిపాలిటీ పంపు రావడంతో …బిందెల తో నీళ్ళు పట్టి , ఫిల్టర్ నింపింది.లంచ్ బాక్స్ లు సిధ్ధం చేసి, భర్త షర్ట్ ఇస్త్రీ చేసి , పిల్లల స్కూల్ బ్యాగ్ లు సర్ది, వాటర్ బాటిల్స్ నింపి , బూట్లు పాలిష్ చేసి , సాక్స్ , యూనిఫాం రెడీగా పెట్టి , దువ్వెన రిబ్బన లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూం లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్ రూంలోకి ఈడుస్తూ, బ్రష్ మీద పేస్ట్
పెట్టు తుండగానే యముడి పిలుపు “సావిత్రీ ! త్వరగా రా !” అని గంభీరంగా పలికాడు.
“స్వామీ ! మధ్య తరగతి మహిళలకు పొద్దున్నే యమ పని వుంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా … చావ తీరుతులేదు … ఈ పని తో అని మీరే చూస్తున్నారు కదా ! అసలే ఈ రోజు కూరగాయల సంత – అక్కడ యమ రష్ గా వుంటుంది.నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ … అంతేనా? కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు చెల్లించడానికి ఈ సేవా సెంటర్ కు వెళితే అక్కడా యమ రష్. అక్కడి నుండి స్కూల్ లో పిల్లల ఫీజు పే చేసి పేరంట్స్ మీటింగు లో వాళ్ళడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్ కుయమక్రేజీ..వాళ్ళడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు.
సరే కుటుంబం బాగుండాలని ప్రార్ధిద్దామని కోవెలకు వెళ్ళి …రాముడిని దర్శనము చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి , నెట్టేస్తుంటే యమా ! నీవే గుర్తుకు వస్తావు. అంతేనా రేషన్ షాప్ కు వెళితే అదొక యమలోకం.అక్కడ సరుకులిచ్చే వాడు అచ్చంగా నీ వలె (యముడు) కూర్చొని , తూకంలో మాత్రం నీ ధర్మం , నీ న్యాయం పాటించడు సుమా
అన్నీ తప్పుడు కొలతలే …చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగి పోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి, అంటించి నీ( యమ ) లోకం పంపాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయపోరాటాల మోతలతో యమ లోకం కనపడుతుంది….”అంటూండగానే…
ఈ రోజు మొత్తము నీ ఇంటిముందు పడిగాపులు పడ్డా …నీవు నా వెంట వచ్చేటట్ట లేవు , అంటే …అయ్యో! యమా ! ఇంకెక్కడ పని తీరింది…ఈ వంట పాత్రలు శుభ్రం చేసి, ఇల్లంత సర్ది , బట్టలుతికి , నేను ఆఫీసుకు పోయే సరికి , లేటయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్ !ఇక ఆయన తిట్ల దండకము అందుకుంటే ఇంతకన్నా తానే నయమని… యమధర్మరాజా! నన్ను నీ లోకం తీసుకెళ్ల వయ్యా! అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి … యముడు స్పృహ తప్పి పడి, పక్కకు ఒరిగి పోయి వున్నాడు. ఎలా యముడిని లేపడం ? అనుకుంటూ – నాకు నా భర్తా , పిల్లలను లేపడమే యమ కష్ఠం … ఇవాళ యమహా గా యముడిని లేపడం… ఒక సమస్య తరువాత ఒకటి
నేను భరించ లేనయ్యా ! యముడా ! నన్ను తీసుకొన పోవయ్యా ! అని నాలుక కరుచుకొని , చూస్తుండగానే కళ్ళు తెరచి, సావిత్రీ ! వస్తావా లేదా ? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నము చేయకుండానే… యమ లోకం పంపేటట్టున్నాయి. అనగానే…
“అయ్యో ! యమా ! నిన్ను హాలులో కూర్చుండ బెడిత బాగుండును…ఈ డ్రాయింగ రూంలో యమ దోమలు అవి కుట్టాయంటే …యమ మంట పుడుతుంది”
అనగానే ఆ ఒక్క పని తక్క మరొకటి చేయ వీలులేదు పోదాం పద !అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామీ మిగిలిన పని చేసి వస్తానని …ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి యముడు తన చేతిలో పాశం చూస్తూ… భూలోకంలో సగటు మధ్య తరగతి మహిళలకు యమ పాశం అక్కరే లేదు …వాళ్ళ బంధనాలే పాశం , ఇలా పొద్దటి నుండి …సాయంత్రం దాకా పని చేసి చేసి …యమ నీరస పడి పోతారు. ఇక పూర్వ జన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్ష లేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి … వాళ్ళ చిట్టాలు జమా- ఖర్చు సమానమవుతాయి ఎందుకులే ఈ అబల సావిత్రిని కీసుకొని వెళ్లడము అనుకొని …చెప్పా పెట్ట కుండా వెళ్ళిపోయాడు యమాగా “ సమవర్తి “.
*******************