అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అబ్దుల్ సత్తార్, బీబీఅమినా అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరిది మంచి జోడి అని ఊరు ఊరంతా ప్రశంసించేవారు. ఎందుకంటే అతను, ఆమె ఇద్దరూ అందమైన వారు. ఇద్దరూ భారీ మనుషులే. అయినప్పటికీ బీబీ ఆమినా ఇంకా అందంగా ఉండేది. పెద్ద తలకాయ, తలలో దట్టమైన నల్లని పొడగాటి వెంట్రుకలు, వెడల్పాటి నుదురు, రెండు కలిసి ఉన్న నల్లని కనుబొమ్మలు, గుండ్రటి నల్లని కళ్ళు, కళ్ళల్లో పెట్టుకున్న కాటుక వల్ల ఆమె ముఖం ఇంకా కళకళలాడుతూ, వెలిగిపోతూఉండేది. ఆమె ప్రశాంతమైన ముఖవర్చస్సును చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి సలాం చేయాలనిపిస్తుంది.
అంతకు తగ్గట్టుగా ఆమె ఎంతో సంస్కారవంతురాలు. మంచి తెలివితేటలు గలది. మర్యాద, అణకువ, వివేకత, నైతికత అన్ని ఆమెలో ఉట్టిపడుతూ ఉండేవి. గ్రామంలో అందరూ వాళ్ళిద్దర్నీ ఎంతో గౌరవంగా చూసేవారు. వాళ్ల అదృష్టమేమో గాని ముగ్గురు అమ్మాయిలే వారి సంతానం, మగ పిల్లలు కలగలేదు.
తన భర్తకు ఒక ఎకరం పొలం ఉన్నప్పటికీ బీబీ ఆమినాకు తండ్రి తరఫున ఆస్తి నుండి అల్లాహ్ నిర్దేశించిన వాటా ప్రకారం ఒక ఎకరం పొలం వచ్చింది. ఆ విధంగా వారికి జీవితం సాఫీగా సాగుతోంది.
గౌరవ మర్యాదలగల ఇల్లు కాబట్టి ఎవరు కూడా వారి ముగ్గురు అమ్మాయిలను మరో విధంగా చూసేవారు కాదు. అలా ముగ్గురు అమ్మాయిలు ఎదుగుతూ చదువుతూ మానమర్యాదలతో ఉంటున్నారు.
ముగ్గురు అమ్మాయిలు మంచి అందమైన వారు. కాలేజీ చదువులు పూర్తి చేశారు. హైదరాబాదుకు చెందిన దగ్గరి బంధువులలోని మంచి సంబంధాలను చూసి ఒకరి తరువాత మరొకరికి (నికాహ్) వివాహం చేసి వేశారు.
చూస్తుండగానే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంది. అమ్మాయిల వివాహమైన నాలుగైదు సంవత్సరాలకు భర్త అబ్దుల్ సత్తార్ మామూలు జ్వరంతో కొద్ది రోజుల్లోనే పరలోక యజమానిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు.
చావుకు వచ్చినవాళ్లు నాలుగు ఐదు రోజులలో అందరూ వెళ్లిపోయిన తర్వాత బీబీఆమినా ఒంటరిదైపోయింది. తన జీవితం గురించి దీర్ఘాలోచనలో పడింది. మగసంతానం లేదాయే ఇప్పుడు ఇంత చేసి ఆడపిల్లల వద్ద బతకవలసిన పరిస్థితులు వచ్చాయా? ఒకవేళ అలాంటి పరిస్థితిలేవస్తే ఎవరి వద్ద ఉండాలి? ఎవరు బాగా చూసుకుంటారు అని ఆలోచిస్తుంది. అందరూ బాగానే చూసుకుంటారు కానీ పెద్ద కూతురు పెద్దల్లుడు ఇంకా బాగా చూసుకుంటారని నిర్ణయానికి వచ్చింది. అంతలోనే పెద్ద కూతురు సల్మా ఫోన్ వచ్చింది. బీబీ ఆమినా ఫోన్ ఎత్తింది; అటు నుండి సల్మా: అస్సలాము అలైకుమ్ అమ్మీ జాన్ (మీపై శాంతి కురియు గాక) అనగానే వ అలైకుమ్ అస్సలాం బేటా ( మీపై కూడా శాంతి కురియు గాక) అంటూ మహా సంతోషంతో జవాబు ఇస్తూ సల్మా ముందు నువ్వు చెవి పట్టుకో! ఎందుకమ్మా అంది సల్మా. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా నీ ఫోన్ వచ్చింది అందుకే అంటూ బిగ్గరగా నవ్వింది బీబీ ఆమినా. సరేనమ్మా నా మనసులో ఒక మాట ఒకటి చెప్పాలని ఫోన్ చేశాను. ఒక్కదానివే ఊర్లో అంత పెద్ద ఇంట్లో ఉండడం కంటే మా దగ్గరికి వచ్చేయ్ అమ్మిజాన్. నిన్ననే మీ అల్లుడుగారు నేను నీ గురించి మాట్లాడుకున్నాము. అమ్మీజాన్ న్ని ఇక్కడికి పిలుచుకుందామని చెప్పుకున్నాము. ఆయన కూడా సరేనన్నారు. అందువల్ల నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్ అమ్మీ అంది సల్మ ప్రేమగా.
సల్మా! నిజానికి నేను ఈ విషయమే ఆలోచిస్తుండగా నీ ఫోన్ వచ్చింది నిజంగా ఇది అల్లాహ్ తరఫునుండి అని నేను అనుకుంటున్నాను అంటూ సరేనమ్మా రెండు మూడు రోజులలో బయలుదేరుతాను అంది తల్లి బీబీ ఆమినా.ఖుదాహాఫీజ్ (అంటే నిన్ను అల్లాహ్ పరం చేశాను అని అర్థం) అంటూ సల్మా ఫోన్ పెట్టేసింది.
బీబీ అమీనా, తమ వీధిలోని లలితమ్మను అనసూయమ్మను సుశీలమ్మను ఫాతిమాబీ లతో పాటు ఊరు వారందరి గడపగడపకు వెళ్లి తను హైదరాబాదు వెళుతున్న విషయం చెప్పింది. అందరూ ఎంతో ఆత్మీయత కనబరుస్తూ ఆమె వెళ్లిపోవడం తమకు వెలితిగా ఉంటుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కానీ తప్పదుగా. ఆధునిక పేరుతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. దుమ్ము ధూళి గలదారులు నున్నటి రోడ్లుగా మారిపోయాయి అదేవిధంగా ఉదయాన్నే సానుపు జల్లి అందంగా ముగ్గులు వేసే వాకిళ్లు కూడా రోడ్ల పుణ్యమా అని రోడ్లుగా మారి పోయాయి. బీబీ ఆమిన ఇంటికి కొద్ది దూరంలోనే బస్ స్టాప్ ఉంది. బీబీ ఆమినాతోపాటు ఊరిలో చాలామంది బస్ స్టాప్ వద్ద ఆమెకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉన్నారు. ఆ గుంపును చూసి డ్రైవరు కండక్టరు ఈరోజు ప్రయాణికుల సందడి బాగానే ఉండేటట్టు ఉందిగా అనుకున్నారు. కానీ ఆమినాతోపాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఎక్కారు అంతమంది బీబీ ఆమె నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారని విని, సందడిని చూసి డ్రైవర్ కండక్టర్ మతసామరస్యమంటే ఇదే, సౌభ్రాతృత్వం అంటే ఇదే, ప్రేమ అభిమానం అంటే ఇదే అంటూ ఎంతో శ్లాగించారు. వారి మాటలు విన్న జనాలు అవును మా ఊరిలో మతసామరస్యం ఉట్టిపడుతుంటుంది. మేమంతా అన్న తమ్ముళ్ల వలె అక్కచెల్లెళ్ల వలె కలిసి మెలసిఉంటాము అని అన్నారు.
బస్సు కదిలింది. దాదాపు మూడు గంటల తర్వాత జూ పార్క్ వద్దగల తాడ్ బన్ స్టేజిపై ఆగింది. అప్పటికే ఆమె పెద్ద కూతురు సల్మా మనవడు మునవ్వర్, మనవరాలు నజ్మ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె దిగగానే కూతురు ఆలింగనం చేసుకుంది. అమ్మమ్మగా ఆ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమతో బీబీ ఆమినా రెండు చేతులతో వారిని అదుముకుంది.
ఇల్లు దగ్గరే అయినా ఆటో మాట్లాడుకుని వెళ్లారు. తల్లి వచ్చిన విషయం మిగతా ఇద్దరు కూతుళ్లకు అల్లుళ్లకు మనవళ్ళకు మనవరాళ్లకు తెలిసిందే గనుక మర్నాడు వాళ్లంతా ఇక్కడికి వచ్చేసారు. అందరూ ఒకరినొకరు సలాములు చేసుకొన్నారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా ఎంతో వినయంతో కొద్దిగా ముందుకు వంగి కుడి అరచేతిని తమ వైపు తిప్పుకొని అస్సలాము అలైకుమ్ మామి జాన్ (అత్తగారు) అంటూ సలాం చేశారు. అందరూ పొద్దంతా సంతోషంతో గడిపి సాయంత్రానికి వెళ్లిపోయారు.
బీబీఆమీనా జీవితం సాఫీగానే, సంతోషంగానే గడిచిపోతోంది. తన అత్తవారి ఎకరం పొలం, తన తండ్రి ఆస్తి నుండి సంక్రమించిన ఎకరం పొలం కౌలుకు ఇచ్చింది గనుక వాటి ద్వారా వచ్చే సొమ్ము వల్ల ఆమెకు ఎలాంటి చీకు చింత లేకుండా పోయింది.
కాలం ఆగదు తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఆ కాలంలో పుట్టే వారెవరో, గిట్టే వారెవరో ఇంకా సజీవంగా ఉండేవారెవరో అది పట్టించుకోదు.
ఎందుకో బీబీ ఆమినాకు కాస్త నలతగా ఉంది. హాస్పిటల్కు తీసుకు వెళితే డాక్టర్ గారు మందులు రాసి మామూలు జ్వరమే ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఈ మందులు వాడండి నయమైపోతుంది అన్నాడు.
ఆ తర్వాత నాలుగైదు రోజులకు మస్జిద్ నుండి ఉదయపు నమాజు అజాఁ ఇస్తుండగా ఆమె ప్రశాంతంగా తన యజమాని అయిన అల్లాహ్ ను కలుసుకోవడానికి పరలోకం వెళ్ళిపోయింది.
హైదరాబాదులోని అల్కాపూర్ లో ఉన్న అబ్దుల్ రహీం వ్యాకులతకు గురవుతున్నాడు, అతని మనసు నిలకడగా ఉండలేక పోతుంది ఎందుకో కాళ్లు చేతులు వణికినట్టుగా అనిపిస్తుంది ఏమిటి విచిత్రం ఎందుకు నాకిలా అవుతుంది అని తనను తానే అబ్దుల్ రహీం ప్రశ్నించుకుంటున్నాడు, పరేషాన్ అవుతున్నాడు.
మరోవైపు ఇంటి ముందు టెంట్ వేయబడింది. కుర్చీలు బల్లలు వేయబడ్డాయి. చుట్టాలు పక్కాలు అందరికీ ఫోన్లు చేయబడ్డాయి అలాంటి ఫోను ఒకటి అల్కాపూర్ లోని అబ్దుల్ రహీం గారికి వచ్చింది. వరుసకు మామ అవుతాడు. మాము! అమ్మీకా ఇంత ఖాల్ హో గయా అమ్మ మరణించింది అని అనగానే ఇన్నాలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ ప్రతి ప్రాణి మరణం రుచి చూడ వలసిందే అంటూ తన విచారాన్ని వెలిబుచ్చుతూ ఫోన్ పెట్టి వేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది తను ఎందుకు ఆందోళన చెందాడో, ఎందుకు శరీరం వణికిందో,మనసు ఎందుకు నిలకడగా ఉండలేకపోయిందో.
ఎందుకంటే బీబీ ఆమినా చాలా కాలం ముందే కొంత డబ్బు అబ్దుల్ రహీం గారికి ఇస్తూ, నేను చనిపోతే నా డబ్బులతోనే నా చావు ఖర్చులు మీరు చెల్లించాలి. మా అల్లుళ్లకు నా చావు ఖర్చు పెట్టకుండా ఆపాలి. అని చెప్పింది. బీబీఆమీనా మరణ వార్త విన్నాక అతని మనసు కుదుటపడింది. మరోవైపు బీబీ అమీనా ఊరిలో ఉన్న అఫ్జల్ గారి స్థితి కూడా అబ్దుల్ రహీం గారి స్థితిగానే అయింది. అదే ఆందోళన చెందడం, అదే శరీరం వణకడం, అదే మనసు నిలకడగా ఉండకపోవడం స్థితిలో మునిగిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? అంటూ తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే మొయిన్ అనే యువకుడు అఫ్జల్ గారి వద్దకు వచ్చి బీబీ ఆమినా మరణించిన విషయం చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది నా స్థితి ఇలా కావడానికి కారణం ఆమె చావు డబ్బులు నా దగ్గర పెట్టి ఉండడం ఆ డబ్బులు ఆమె చావు ఖర్చులకోసం నేను అందించడం జరగాలి ఎందుకంటే తమ అల్లుళ్లు తను చావు ఖర్చులు భరించకూడదని .అందుకే ఇలా జరిగిందని భావించి అతను వెంటనే బీబీఆమీన పెద్దకూతురు ఇంటికి వచ్చి డబ్బులు సల్మాకు ఇచ్చి వేశాడు. ఈ ఇద్దరు వ్యక్తులకు బీబీ ఆమిన ఆత్మఘోష ఒకే స్థితికి లోను చేసింది. ఆమె ఇద్దరికీ డబ్బులు ఎందుకు ఇచ్చిందంటే ఒకరు కాకపోయినా ఒకరైన తన డబ్బులతో చావు ఖర్చులు చేస్తారని.వాళ్లు ఇద్దరూ చేరుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఆత్మ ఘోష శుభాత్మగా మారిపోయింది.
కథలు
“మనసెరిగి మసలు కునే వాళ్ళేమన వాళ్ళు.” అప్పటికి లక్షా తొంభై సార్లు… కాదు కాదు కోటీ థొంభై షార్లు… ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు అనుకున్నాడు రంగారావు. కళ్ళల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తామూ అని మారాము చేస్తున్నాయి. గొంతు గురఘురా అంటోంది. చీ… తన బతుకెంత అధ్వానం అయిపోయింది? తనేమన్నా చిన్నా చితకా వాడా? ఆకుపచ్చ సంతకాలు చేసిన గెజిటెడ్ ఆఫీసర్! హిప్పుడు చప్రాసీ అయిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? గత కొన్ని నెలలు గా జరిగిన దానికన్నా ఈరోజు జరిగింది గుండెను మండిస్తోంది. రిటైర్ అవుతే జీవితం ఇంతలా మారిపోతుందా? ఆ రోజు…
తన రిటైర్మెంట్ రోజున, తననూ, కాంతం నూ కూర్చోబెట్టి ఘనసన్మానం చేసారు. సహోద్యోగులందరూ తన గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. పెద్దపెద్ద దండలు వేసారు. శాలువా కప్పారు. హబ్బో ఆ ఫంక్షన్ తెలుచుకుంటేనే వళ్ళు ఉప్పొంగుతుంది. తనకు ఇష్టమైన వాటితో మంచి విందు ఇచ్చారు. ఇంటికొచ్చాక ఎవరికీ జరగనంత గొప్పగా తన రిటైర్మెంట్ పార్టీ జరిగిందని తలుచుకొని మురిసిపోతుంటే “ఆ… అమ్మయ్య మనకు వీడి బాధ తప్పింది, అని అంత పార్టీ ఇచ్చారేమోలే” అని తీసిపారేసింది కాంతం. చుప్పనాతి శూర్ఫణక పోనీలే అని ఊరుకున్నాడు.
మరునాడు రోజులాగే పొద్దున్నే మెలుకువ వచ్చింది. ఆ అప్పుడే లేచి చేసేదేముంది అని కాసేపు అలాగే మంచం మీద అటూఇటూ దొర్లి, ఇక దొర్లలేక లేచాడు. కాంతం ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడే వచ్చిన పేపర్ చదివాడు. స్నానం అయ్యాక దండం పెట్టుకోవటమే కానీ రోజూ వారీ జపాలు, పూజ ఎప్పుడూ అలవాటు లేదు. కాసేపు వరండాలో అటూ ఇటూ అచార్లు, పచార్లు చేసి టిఫిన్ తిన్నాక ఇంకేం చేయాలబ్బా అని చించీ…చించీ కేబుల్ వాడికి అప్పనంగా కి బోలెడంత డబ్బుపోస్తున్నాము, ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు ఇక చూద్దాం అని టీ.వీ పెట్టాడు. ఎన్ని ఛానల్సో! ఎన్ని ప్రోగ్రాం లో! రోజంతా, రోజంతా ఏమిటీ రాత్రి దాకా ఛానల్స్ తిప్పీతిప్పి అర్ణబ్ వార్తలు, టీ.వీ వార్తలూ, అత్తకోడళ్ళ సీరియల్లూ హబ్బో అన్నీ చూసీసీ… అలవాటు లేని పని కావటం తో కళ్ళూ, వేళ్ళూ నొప్పులు పుట్టాక టీ.వీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అరే ఇదేదో బాగుందే! అందుకే అందరూ టీ.వీ కి అతుక్కుపోతారు అని ఆ ప్రోగ్రాం కే ఫిక్సైపోయాడు. తినటం, టీ.వీ చూడటం, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్, స్నాక్స్ తో సహా టీ.వీ ముందే సెటిల్డ్! ఇలా కొన్ని నెలలు గడిచాయి…
సడన్ గా కాంతం కు ఏమయిందో “ఊరికే మిడిగుడ్లేసుకొని టీ.వీ ముందు కూర్చోకపోతే మార్కెట్ దాకా వెళ్ళి కూరలు తేవచ్చుగా” అని సంచీ విసురుగా వళ్ళో వేసింది. కాంతం సణుగుడు భరించలేక కూరలు తెచ్చి ఇచ్చాడు. సాయంకాలం రామం ఏవో స్వీట్స్ పాకెట్స్ తెస్తే, అవేమిటీ నాకిటివ్వరా అని కొడుకును అడుగుతున్నా వినిపించుకోకుండా కోడలు అంజలి కొంగు చాటుగా పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.
ఇదేమిటీ ఎప్పుడూ లేని అలవాటు అనుకొని హాచర్యపోతూ “కాంతం ఇదేమిటే అడుగుతున్నా పెట్టకుండాతీసుకుపోయింది?” రాత్రి భోజనానికి పిలిచిన కాంతం ను అడిగాడు.
“అన్ని ఆరాలూ కావాలి. అయినా ఇప్పుడు నీ తిండికే లోటు వచ్చింది?” విసుక్కుంటూ కంచంలో రెండు ఫుల్కాలూ, పక్కన ప్లేట్ లో ఏవో కూరగాయముక్కలూ, గ్లాస్ లో మజ్జిగ పెట్టింది.
“ఈ రొట్టెముక్కలు, పచ్చి కూరగాయలు, మజ్జిగ ఏమిటీ? నేనెప్పుడైనా తిన్నానా? ఎన్నడైనా పెరుగు తప్ప మజ్జిగ పోసుకున్నానా?” కోపంగా అరిచాడు.
వినిపించుకోకుండా మనవడికి తినిపించటం లో ఉండిపోయింది.
అదిమొదలు తన తిండి ఖనాఖష్టం అయిపోయింది. స్వీట్స్ తనకు పెట్టకుండా దాచుకోని తినటం, తనకిష్టమైన పూరీలు అవీ కూడా తన ముందే తనకు పెట్టకుండా మనవడికి పెట్టటం ఇలా బోలెడు మార్పులు తన తిండిలో. అప్పటికీ ఉక్రోషం ఆపుకోలేక “నేనేమైనా పశువునా ఈ గడ్డీగాదం తింటానికి?” అని అరిచినా పట్టించుకున్న వాళ్ళే లేరు. సాత్వికులైన కొడుకూ కోడలు మారిపోయారు. “నా కొడుకు అమాయకుడమ్మా, వాడికి కాస్త తిండిపుష్ఠి ఉన్నదని వాడి మనసెరిగి కావలసినవి చేసిపెడుతూ, కాస్త కనిపెట్టుకొని ఉంటావని నీ చేతిలో పెడుతున్నానే కోడలుపిల్లా” అని అమ్మ మేనకోడలికి తనను అప్పగించినప్పటి నుంచీ ఏదో అప్పుడప్పుడు అరవటం తప్ప ముద్దుగా చూసుకుంటున్న కాంతం సూర్యకాంతం పేరును సార్ధకం చేసుకుంటూ ముందే కాస్త గట్టిదేమో ఇప్పుడు మరీ గంపగయ్యాళమ్మ అయిపోయి కొడుకుకు, కోడలికి వంతపాడుతోంది. పైగా “ఎద్దులా కూర్చున్నావు. కాస్త మనవడిని పార్క్ కు తీసుకెళ్ళి ఆడించవచ్చుగా” అని కూడా కసురుకుంటోంది మొగుడన్న మర్యాదలేకుండా! అందుకే మావకూతురిని పెళ్ళి చేసుకోకూడదు. ఇట్లాగే నెత్తినెక్కుతారు. ఇప్పుడనుకొని ఏమి లాభం!
అంతటితో తన కష్టాలు ఆగలేదు, “ఎప్పుడూ ఆ టీ.వీ ముందు కూర్చొని అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూడకపోతే చెట్లకు నీళ్ళుపోసి, తోట పని చూసుకోవచ్చుగా రెండురోజుల నుంచి మాలి రావటం లేదు. పెరట్లో కూరగాయల మడులు, ముందు పూల మొక్కలూ ఎండిపోతున్నాయి. ఏదీ పట్టదు దిష్ఠిబొమ్మలా హాల్ మధ్యలో కూర్చున్నావు” అని చిరాకు పడ్డాడు రామం.
అట్లా ఒక్కొక్కపని తనకు అప్పగించారు. పకోడీల వాసన వస్తుంటే హబ్బా తనకిష్టమైన పకోడీలూ హూ అని వంటింట్లోకి వెళ్ళాడు. మీకిక్కడేమి పని బయటకెళ్ళండి అని తరిమింది అంజలి. హంతే తనకు పౌరుషం వచ్చేసింది. “రామం” భీకరంగా అరిచాడు.
ఆ అరుపుకు అదురుబెదురు లేకుండా గదిలో నుంచి బయటకు వచ్చి “ఏమిటీ” అడిగాడు థాఫీగా.
“ఆ మధ్య నా బాంక్ పాస్ బుక్ తీసుకున్నావు అది ఇటివ్వు. ముద్దకుడుముల్లా నా పెన్షన్ బోలెడు మీ చేతుల్లో పోస్తుంటే నాకుతిండి పెట్టకుండా గొడ్డు చాకిరీ చేయిస్తూ హీనంగా చూస్తున్నారు. ఇంకా ఊరుకునేదిలేదు. నాకన్నా ముందే మీ అమ్మ డబ్బులు తెచ్చేసుకుంటోంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తోంది.నా ఎకౌంట్ మీ అమ్మతో జాయింట్ కాకుండా నా పేరు మీదకే మార్చుకుంటాను. నాకు కావలసినవి తెచ్చుకుంటాను. హోటల్ కు వెళ్ళి తింటాను.అప్పుడు కుదురుతుంది మీ తిక్క.నువ్వు పాస్ బుక్ ఇవ్వకపోయినా బాంక్ కు వెళ్ళి మార్చుకోగలను ఏమనుకుంటున్నారో ఖబడ్ధార్” ఆయాసపడిపోయి, ఖళ్ ఖళ్ మని కాస్త దగ్గాడు కూడా!
“ఓయబ్బో మహా వచ్చాడండీ.ఆ పని నువ్వు చేస్తే ఇదో ఈ ఫాన్ కు ఉరేసుకొని చస్తా. దయ్యమై నిన్ను పీడిస్తా” కళ్ళు పెద్దగా చేసి, చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.
ఒక్క క్షణం బిత్తరపోయి, ఇంక ఏమి మాట్లాడలేకవిసురుగా బయటకు వచ్చి మొక్కలల్లో గడ్డిని పీకుతూ కూర్చున్నాడు. పక్కింటి ఛాయమ్మ ఎందుకో బయటకు వచ్చి తనను చూసి “ఇదేంటన్నయ్యగారూ, వేళకాని వేళ గడ్డి పీకుతున్నారు? చాయ్ తాగారా?” అడిగింది.
ఆప్తురాలు దొరికినట్లుగా తన ఘోషను వెళ్ళబోసుకుంటుంటే “ఏమిటో నండి ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు” అని సానుభూతిని చూపిస్తున్న ఛాయమ్మను భర్త రమణారావు వచ్చి “నీకెందుకూ లోపలికి రా” అనిగడకర్రలాగాలికి ఊగిపోతూ పిలుస్తూనే ఉన్నాడు లోపలి నుంచి కాంతమ్మ వచ్చింది.
“బజార్ లో పక్కింటోళ్ళతో పంచాయితీ పెట్టిస్తున్నావా?దేభ్యమొహం వేసుకొనిఆడోళ్ళతో నీకేమిటి మాటలు? ఏందమ్మా ఛాయమ్మ నా కాపురంలో నిప్పులు పోస్తావా?” అని అరిచేస్తుంటే ఛాయమ్మ ఊరుకుంటుందా? ఇద్దరూ చేతులు తిప్పుకుంటూ పెద్ద గొంతులేసుకొని అరుచుకుంటుంటే తను ఆ గంపమ్మ కథ చూడలేకఇదో ఇట్లా వచ్చి, పార్క్ లో వేపచెట్టుకింద బెంచీ మీద కూలబడ్డాడు.
అవును ఏ రచయత అన్నాడో కానీ “మనసెరిగి మసలు…కునే వాళ్ళే మన వాళ్ళు.” వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని మళ్ళీ లెక్కపెట్టలేనన్నోసారి అనేసుకొని, పరిపరి విధాల చింతిస్తూ, ధుఃఖిస్తూన్న రంగారావు నెత్తిన ఠప్ మని ఓ వేపకాయ, ఆ వెనువెంటనే ఓ వేప రెమ్మ వచ్చి నెత్తిన పడ్డాయి. అవి చూడగానే, అప్పుడే కాంతగంపమ్మ ఉరేసుకున్నట్లూ, దయ్యమై తనను ఘట్టిగా పట్టేసుకొని ఖంగాళీ నృత్యం తనతో చేయిస్తున్నట్లూ, మంత్రాల మాంచారయ్య వచ్చి వేపకొమ్మలతో కసాబిసా బాదేస్తున్నట్లూ, గంపమ్మ వికట్టాట్టహ్హాసం చేస్తున్నట్లూ ఊహ వచ్చేసి వణికిపోయాడు రంగారావు. అంతలోనే తెలివి తెచ్చుకొని చుట్టూ చూసాడు. పార్క్ లో అందరూ వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న మనవడు కూడా లేడు. వెధవ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? ఇహ ఇప్పుడేమి గోల ఉందో కొంపలో నిట్టూరుస్తూ, అయినానేనెందుకు వీళ్ళకు భయపడాలి? అసలు ఆ చావేదో నేనే చచ్చి వీళ్ళను పీడిస్తే! మంత్రాల మాంచారయ్య వీళ్ళను చితక బాదాలి.తను భీకరంగా నవ్వాలి. వళ్ళో పడ్డ వేపకాయను నలుస్తూ, కాసేపు ఏ విధంగా చస్తే బాధలేకుండా చావొచ్చా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలతోనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.
“ఇంతసేపటి వరకు ఎక్కడికెళ్ళావు?” గయ్ మంది కాంతమ్మ.
కాంతమ్మను నిర్లిప్తంగా చూసి, లోపలి నుంచి నిద్ర మాత్రల సీసా తెచ్చి చూపిస్తూ “నేనింక నీ కడవళ్ళు భరించలేను. ఈ మాత్రలు మింగి చస్తాను” అని చేతిలోకి సీసా వంపుకొని, మంచి నీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ, మనవడు, కొడుకు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద పొగలు చిమ్ముతూ అన్నం, ముక్కుపుటాలను అధిరిస్తూ ఘాటుఘాటు కొత్తావకాయ, కొద్ది దూరం లో చెరుకు రసాలు కనిపించి నోరూరించాయి. అవి తిని చద్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిచ్చికానీ ఈ రాక్షసులు తనను తిననిస్తారా విరక్తిగా అనుకొని వాటి వైపు చూడకుండా మనసును అదుపు చేసుకుంటూ,కళ్ళుమూసుకొని నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు.
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
అందరూ గగ్గోలుగా అరిచారు. పక్కింటి నుంచి రమణారావు, ఛాయమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. రమణారావు, రంగారావు చేతిలోనుంచి మాత్రలు గుంజుకొని “ఏం పనిది” మందలింపుగా అన్నాడు.
“మీకు తెలియదు వీళ్ళు నాకు తిండిపెట్ట కుండా ఎంత హింస పెడుతున్నారో, చాకిరీ చేయిస్తున్నారో” అన్నాడు ఉక్రోషంగా.
“బావండీ నన్ను క్షమించు బావా క్షమించు” రంగారావు చేతులు పట్టుకొని బాధగా అంది కాంతం.
“దీని దుంపతెగ ఇప్పుడూ కాళ్ళు కాకుండా చేతులు పట్టుకుంది హెంత గీర” మనసులో అనుకొని “క్షమించను పో” అన్నాడు రంగారావు మరింత గీరగా!
“నాన్నా అదికాదు, అసలు సంగతేమిటంటే అయిదు నెలల క్రితం నువ్వు టీ. వీ చూస్తుండగా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో” రింగులు తిప్పాడు రామారావు.
“ఆ …ఇప్పుడు రింగులు తిప్పి అంత హవస్త ఎందుకు కానీ, బావండీ ఆరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అట్లా రెండు సార్లు జరిగే సరికి నిన్ను రామం డాక్టర్ కు చూపించాడు. అన్ని టెస్ట్ లూ చేసి, నీకు బీ.పీ బాగా పెరిగిందనీ, షుగర్ బార్డర్ లోకి వచ్చిందనీ, బరువు 200 కిలోలు పెరిగావు, బరువు తగ్గాలనీ జాగ్రత్త పడాలనీ చెప్పాడు గుర్తుందా?కుర్చీలో నుంచి లేవటానికీ, నడవటానికీ ఇబ్బంది పడ్డావు. పైగా ఆ శంఖుమార్క్ లుంగీలు వదలవు. గడ్డం చేసుకోమన్నా చిరాకు పడిపోతూ ఎంతసేపటికీటీ.వీ ముందు నుంచి లేవవు. అక్కడికే రకరకాల రుచులతో స్నాక్స్ కావాలి.ఎంత చెప్పినా నీకు తిండియావ తగ్గదు.”
“వాకింగ్ కు వెళ్ళమంటే వెళ్ళవు.”
“అమ్మాయ్ అంజలీ నువ్వు మీ అత్తయ్యా ఓసారి ఈ సీరియల్ లో లాగా పోట్లాడుకోండి అని సరదా పడిపోయారు.”
ఒకళ్ళ తరువాత ఒకరు చెప్పుకుంటూ పోయారు.
“భారీ ఏనుగులా వళ్ళు పెంచేసావు. తాతయ్య కు బీ.పీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి ఎన్నాళ్ళో మంచాన తీసుకొని తీసుకొనిపోయాడు. బామ్మా, తాతయ్యషుగర్ ఎక్కువ అయ్యి గుండెపోటుతో పోయారు. నీకు ఆ పరిస్తితి రాకూడదని ఎంతో ఆలోచించి ఈ ప్లాన్ వేసాము. ఇప్పుడు చూడు నువ్వు గున్న ఏనుగులాగా కాదు బుజ్జి ఏనుగుసైజుకు వచ్చావు. నీకోసమే డాడీ ఇదంతా నీ కోసమే” బాధగా పిడికిలి నోటికి సుతారంగా ఆనించుకొని, మొహం బాధగా పెట్టిఅన్నాడు రామారావ్.
“అవును మామయ్యగారు అట్లా మాట్లాడినప్పుడల్లా ఎంత బాధ పడ్డామో తెలుసా” చేతులు నలుపుకుంటూ, కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది అంజలి.
“బావండీ నిన్ను చూసినప్పుడల్లా మాయాబజార్ లోని ఘటోత్కచునిలా కనిపించి ఎంత దడుచుకునే దాన్నో తెలుసా? ఉమ్మడి కుటుంబం లో యమధర్మరాజులాగా దున్నపోతెక్కి యముండ అని భీఖరంగా అరుస్తూ యమధర్మరాజు వస్తుంటే నిన్ను కాపాడాలని ఆ సావిత్రిలా నీతో ఈ నిరాహార దీక్ష హెంత నిష్ఠతో చేయించాను” అంటూకాంతం కొంగు నోట్లో కుక్కుకుంటూ ఆపసోపాలు పడుతోంది.
హోరినీ హిదా సంగతి అని రమణారవు, ఛాయాదేవి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.
శుభం కార్డ్ పట్టుకొని తన చుట్టూ నిలుచున్న అందరి మొహాలు ఒకటొకటిగా స్లో మోషన్ లో చూసాడు. చిన్నగా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు…
“అమ్మాయ్ ఆ రెండు చెరుకు రసాలు ఇటందుకో”అంటూకంచం దగ్గరికి జరుపుకున్నాడు…
వేడి అన్నం, ఆవకాయ కంచంలో తోడుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్న వెన్న ముద్దను చేతిలోకి తీసుకొని మొత్తం వేసేసుకున్నాడు…
అన్నం కలిపాడు…
గుండ్రాయంత ముద్దను చేసి, ఆబగా నోటి దగ్గరగా తెస్తుంటే…
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
“రంగారావ్…”
“హన్నయ్యగారు…”
ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా, చేతిలోని ఆవకాయ ముద్దను మురిపెంగా చూసి, ఘాఠ్ఠిగా వాసన పీల్చి, ఆ ఘాటుకు, ముక్కు, కళ్లు ధారలు కారుతుండగా అందరి వంకా చిద్విలాసంగా చూసి, నోట్లో కూరుతూ, ఆహా ఇది కదా “స్వర్గం అంటే” తన్మయంగా అన్నాడు.
కొత్తగా పెళ్ళిచేసుకుని వచ్చిన మాధురికి అత్తగారిల్లు చూడగానే అయోమయంగా అనిపించింది… ఏదో తిన్నాము అన్నట్లు ఉంటారు… లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవడం…మామగారు రిటైర్ అయ్యారు… ఆయనకి ఒక రూమ్ అందులో టి వి… అత్తగారు, ఆమె తల్లి మధ్య హాల్లో ఉంటారు… అత్తగారి తల్లి మంచంలోనే ఉంటుంది… అన్నీ చేతికి ఇవ్వాలి…ఇద్దరూ తెలుగు హిందీ సీరియల్స్ కలిపి రాత్రి పది గంటల వరకు చూస్తూనే ఉంటారు…
తమది పెద్దలు కుదిర్చిన వివాహమే.. ప్రశాంత్ ది ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం… పెళ్ళిచూపుల్లోనే చెప్పాడు ఆమె ఉద్యోగం చెయ్యటం తనకు ఇష్టం లేదని…తన ఇంటి పరిస్థితి తెలిసిన ప్రశాంత్ ఆవిషయం చెప్పకుండా తనకే ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని చెప్పాడు…తనకు ఎప్పుడూ ఒక మంచి గృహిణిగా ఉండాలని కోరిక… అదే మాట ఇలా వినడం నెత్తిన పాలు పోసి నట్లుగా అనిపించి ఒప్పుకుంది…మొదటి రాత్రి తన ఇంటి వ్యవహారం చెప్పాడు… ఈ ఇల్లు అమ్మమ్మది అనీ, అమ్మ ఒక్కతే కూతురనీ, అన్నిటికీ తను సర్దుకు పోవాలని… నీకు వీలైతే ఇంటి వాతావరణం మార్చు అంటూ హింట్ ఇచ్చాడు… బలాదూరుగా తిరిగే మరిది శ్రీకాంత్… ఉద్యోగం లేదు… బి టెక్ చదివినా ఉద్యోగం చెయ్యడు… బయటి వ్యాపకాలు ఎక్కువ…
డిగ్రీ చదివి ఎమ్ బి ఎ పూర్తి చేసిన మాధురి, ఒక గృహిణిగా ఆ ఇంట్లో కాలు పెట్టింది… బ్రేక్ ఫాస్ట్, కూరలు బయటి నుంచి వస్తాయి… అన్నం మాత్రం వండుకుంటారు… టి వి సీరియల్లో వంట చెయ్యని అత్తగారిని మాత్రం, ఇద్దరూ తిట్టుకుంటూ కూర్చుంటారు… వింతగా అనిపించింది తనకు…
ఇలా పనీ పాటా లేకుండా కూర్చోవడం, తనకు నచ్చటం లేదు… ఒక రోజు భర్తని అడిగింది…”ఇక నుంచి రోజూ నేను వంట చేస్తాను..”
“అందరూ పని చెయ్యకుండా సినిమాలూ, షికార్లూ,పార్లర్ల చుట్టూ తిరగడం చేస్తారు… నువ్వేంటి ఇలా ?” అంటూ నవ్వాడు…
“అయినా నీది ఒంటరి పోరాటం అవుతుంది… ఇక్కడ ఎవరూ అంతగా పాటించరు జాగ్రత్త సుమా” అని హెచ్చరించాడు…
“మీరు అవసరం అయిన సహాయం చెయ్యండి చాలు…” అంటూ తన నిర్ణయం చెప్పింది…
“ఓకె “అంటూ తంబ్ చూపించాడు ప్రశాంత్…
మరుసటి రోజు అత్తగారితో చెప్పింది…”ఈ కూరలు ఇలా బయట నుండి వద్దు అత్తయ్యా! నేను వంట చేస్తాను ఈ రోజు నుంచి”
సీరియల్లో మునిగి ఉన్న అత్తగారు మొహం పక్కకి తిప్పి, “ ఇదుగో అమ్మాయ్! నీ ఇష్టం… నాకు మాత్రం పని చెప్పకు…” అని అన్నది…
ఏమనాలో తెలియక, తల ఊపి లోపలికి వెళ్ళింది మాధురి…పనిమనిషిని పిలిచి వంట గది శుభ్రం చేయించింది… రోజూ చేసే పనులు కాకుండా ముందుగా కూరగాయలు తరిగి ఇవ్వాలని చెప్పింది…
అది డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్… ఫస్ట్ ఫ్లోరులో మూడు బెడ్ రూములు ఉన్నాయి… అందులో ఒక రూమ్ తమది, ఒకటి మామగారిది, ఇంకొకటి ఊర్లో ఉన్న ఆడపడుచు పద్మది… ఆడపడుచు ప్రతి వారం వస్తూనే ఉంటుంది…సెకండ్ ఫ్లోరులో పెంట్ హౌసులా, ఒకే రూమ్ వేసారు… అది మరిది రూము… అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ, ఎవరి లోకం వారిదే అన్నట్టుగా వుంటారు… మామగారికి రాజకీయాలు, అత్తగారు, ఆమె తల్లిగారలకు సీరియల్స్, మరిదికి సినిమాలు… వింత ప్రపంచంలో వున్నట్టుగా వుంది… తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది ఈ ఇంట్లో పరిస్థితి… పాత సినిమాల్లో సావిత్రి బతుకులా ఉంది అనుకుని ప్రక్షాళన మొదలు పెట్టింది మాధురి…
కిచెన్ లో ఒక ప్రక్కన ఉన్న దేవుడి బొమ్మలు అన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపారాధన చేసింది… మామగారు రోజూ కాసేపు తోట పని చేస్తారు… ఆ కాస్త జాగాలోనే ఎన్నో పూలు… అవి కోసి పూజ చేసింది… రోజూ అందరూ పాలల్లో బ్రూ కలుపుకుని త్రాగుతారు…. అలా కాదని ఫిల్టర్ వేసి అందరికీ కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో పెట్టుకుని, తీసుకు వెళ్ళి ముందు మామ గారికి ఇచ్చి, తరువాత అత్తగారికి, మామ్మగారికి ఇచ్చింది…
“కాఫీ సూపర్” అంటూ అత్తగారు ఈమోజీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది… “ అమ్మాయి! అచ్చం కొంగు ముడి సీరియల్లోలా తెచ్చావు… బాగుంది…” ఆమె మెచ్చుకున్నది సీరియల్నా, నన్నా, ఒకింత ఆశ్చర్యపడుతూ, ఒక పిచ్చి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది…
ఇంకా పిండి అదీ రుబ్బుకోలేదని, గోధుమరవ్వ ఉప్మా అన్ని కూరగాయలు, జీడిపప్పు, బఠాణీలు వేసి చేసింది…ఆ రోజు ప్రశాంత్, శ్రీకాంత్, మామగారు వెంకట్రావు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు… టేబుల్ పైన ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి రెండు గులాబీలు పెట్టింది… మామగారు ఆ పూలని చూసి ఆమె అభిరుచికి మెచ్చుకున్నారు…
రోజూ ఆఫీసులో తినే ప్రశాంత్ కు ఆనందంగా ఉంది…ఒక ఇంటిని స్వర్గం చేసినా, నరకంగా మార్చినా స్త్రీ చేతిలోనే ఉంటుంది అని అనుకున్నాడు… “ఏమండీ! రేపటి నుండి మీకు లంచ్ బాక్స్ కూడా ఇస్తాను…” అన్నది…
“మాధురీ ఏమైనా కొనాలంటే తీసుకో…” అంటూ కొంత డబ్బు ఇచ్చాడు…
అత్తగారికి, మామ్మ గారికి టిఫిన్ పెట్టి, తరువాత పనిమనిషికి పెట్టి, తను కూడా తిన్నది…
మధ్యాహ్నం వంటలో మామిడికాయ పప్పు, కంది పచ్చడి, బెండకాయ కూర, చారు చేసింది… అత్తగారితో ఆమె సీరియల్స్ భాషలో మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది…
మామ్మగారికి అన్నం పెట్టి, కాసేపు టి వి ఆఫ్ చేసింది… సీరియల్ తరువాత హాట్ స్టార్ లో చూడవచ్చు ప్రశాంతంగా తినమని చెప్పింది…
“అమ్మాయి! నీ కోడలు వంట బాగా చేసింది… ఉదయ రాగం సీరియల్లోలా పనంతా ఒక్కతే చేస్తోంది… కంది పచ్చడి పేరు కూడా మరచి పోయాను…” అని కూతురుతో చెపుతూ, తన వైపు తిరిగి “వంట బాగా చేసావు మాధురీ…” అంటూ మెచ్చుకుంది మామ్మగారు…
సీరియల్స్ చూస్తూ బద్దకంతో కదలని శరీరాలు వాళ్ళని అశక్తులుగా మార్చాయి… అందుకే పని చెయ్యకుండా ఇలా తయారయ్యారు…
అత్తగారికి, మామగారికి, వెండి కంచాలు పెట్టి వడ్డించింది… కొంగుముడి సీరియల్లో కొత్త కోడలులా ఉంటుంది అనుకున్న తనకు ఇంత మంచి కోడలు వచ్చినందుకు మనసులో సంతోషిస్తూ, తృప్తిగా భోజనం చేసింది విజయ…
వాళ్ళలో మార్పు చూసి తను ఇంటిని మార్చగలను అనుకుంది మాధురి…
ఈ రచన నా స్వంతం… ఎక్కడా ప్రచురించలేదు..
గంపకింద కోడి కొక్కొరొక్కో కొక్కొరక్కో అనికూస్తుంది పందిరి కింద గడెoచెల పoడుకున్న సిరిలచ్చిమికి మేల్కొచ్చింది కానీ లేవబుద్దికాలేదు మళ్లోసారి కొక్కరొకో కొక్కరొకో అన్నదికోడి. ఇగ లేసి శిఖ ముడుసుకొని బొట్టు సరిజేసుకొని చీపురుకట్ట పట్టింది. ఊడువoగ ఊడువoగ యాప చెట్టుకింద నాలుగు తట్టల కసువుఎల్లిoది నిన్న పొద్దుగూకి ఊడ్చిన కుప్పతోటి. ఎత్తి పెoట మీదపోసొచ్చి రోటి మీద కూసున్నది సిరిలచ్చిమి.
అంతలోనే బర్రెనుగొట్టొచ్చిన భర్త మల్రెడ్డి
ఏoదే చిన్నబోయికూసున్నవు లచ్చిమి అన్నడు.
నాతోటైతలేదయ్య ఊడిసిఊడిసీ నా రెక్కలుబోతానయి అన్నది లచ్చిమి
మొన్న యాకన్నకిద్ధామంటే నువ్వే వద్దంటివి ” మొదలు మంచిగా ముదిరింది కోస్తే తలుపు చెక్కలెల్తయ్ నాకీయమని ఒక్క తీరుగా బతిలాడితె నువ్వే వద్దంటివానాడు”… ఇచ్చేయనామరి ? అన్నడు మల్రెడ్డి. “ఇగ ఇయ్యిమరి నాతోటైతలేదు నీడ ఉంటదిగదా అనుకున్నగని” ఇగ ఇయ్యిమరి అని లేసి ఇంట్లోకి బోయింది
సిరిలచ్చిమి.
పన్నెండుగొట్టంగా సిరిలచ్చిమి చిన్న బిడ్డ లలిత ఉరికొచ్చి అమ్మా….. యాకన్న మామ మన యాపచెట్టు కొడ్తాండు వద్దని చెప్పవే…. నా బొమ్మరిల్లుoదాడ… అన్నది
అవును బిడ్డా “మీ బాపూ…చెట్టు అమ్మిoడు ఆ మావకు.” ఆళ్లదే… కొట్టుక పోనీ అన్నది. తల్లి మాటలకు గుడ్లల్ల నీళ్ళు చెంపల మీదికిగారతాoటే లలిత ఇంటిముందుకిపోయి కూసున్నది ఆసాంతం చెట్టు నరికి తీసుకు పోయే దాకా పానమంటి నేస్తాన్ని తీసుకో పోయినట్లు చూస్తూ….
ఓ నాలుగు రోజులు గడిచినంక ఒక నాడు పొద్దుగూకి దిగులుతో కూర్చున్నది లక్ష్మి
అంతలోకే మల్రెడ్డి వచ్చి ఏమైంది లచ్చిమి అట్లున్నావ్? అన్నాడు ఇయాల పక్కూరి పార్వతమ్మ వచ్చి పోయింది నిరుడెండాకాలమంతా మన యాప కాయలు ఏరుకపోయింది మొన్న ఎన్నడో చేనుకు పురుగు పట్టకుండా వేయడానికి యాప గింజలు కావాలని ఎవరో వచ్చి 4000 రూపాయలు ఇచ్చి తీసుక పోయింరట. వద్దంటాంటె నా చేతుల 500 పెట్టి పోయింది ” మీ చెట్టు కాయలే కదా “అనుకుంటా… అన్నది సిరి లచ్చిమి బాధగా నిట్టూర్పుతో… దానికి మనకు రుణం తీరిపోయింది మనసు నిమ్మలం చేసుకో అన్నాడు మల్రెడ్డి.
చెట్టు పోయినా ఆ బొమ్మరిoట్లనే ఆడుతున్నది లలిత రోజూ.
వారం రోజులకు ఓనాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అడ్డం పడ్డది లలిత.
సిరిలచ్చిమి గాబరపడి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే అన్ని పరీక్షలు చేసి ,”పాపను ఎండలు తిప్పింరా వడ దెబ్బ కొట్టింది…ఎండల ఆడిందా? అని చెప్పి మందులు రాసిచ్చిoడు. పార్వతమ్మ ఇచ్చిన 500 పెట్టి మందులు తెచ్చిన… కసాయిదాన్నై చెట్టుకొట్టిచ్చినా కూడా ఇంటి దేవతై నా బిడ్డను ఆదుకున్నది పది రోజులకు గానీ లేవలేదు బిడ్డ.
అప్పుడు లచ్చిమి బాధతో తoడ్లాడుతూ కన్నతల్లిలాంటి చెట్టును పోగుట్టుకుంటినే…. అని వెంటనే ఒక యాపచెట్టు తెచ్చి మళ్లీ నాటిoది…. అప్పుడే వచ్చిన
లలిత అమ్మ కొంగు పట్టుకొని అమ్మా… ఈ చెట్టు ఎప్పుడు పెద్దగయితదే అని అడిగింది అమాయకంగా…పోయిందేదైనా తొoదరగారాదు బిడ్డా అన్నది తాను చేసిన తప్పుపనికి బాధపడుతూ…
వారు నాడు రాణి వాసపు స్త్రీల పల్లకీల మోసిన బోయిలు
ప్రపంచ వింత అయిన తాజ్ మహాల్ కి రాళ్ళు మోసిన కూలీలు
గుళ్ళు, గోపురాలు, ఇళ్ళు, వాకిళ్ళు బహుళ అంతస్తులు
కట్టే శ్రామికులు
నిత్యం గనుల్లో, కర్మాగారాల్లో కష్టించి పనిచేసే కార్మికులు
రక్తాన్ని చెమట చుక్కలుగా కార్చే
బడుగు జీవులు
నవ్య భవంతుల నిర్మాణం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమ జీవులు
తాము మాత్రం రహదారి ప్రక్క
తడికల్లోనే కాపురముండే
అభాగ్యులు
ఎన్నడు రానున్నదో క్రాంతి
సమసమాజ స్థాపన తోనే శాంతి
అప్పుడే అందగా నిండుగా నిజంగా సందడిగ
జరుపుకుందాం మెండుగా మేడే పండగ**
నేను గజిని లెక్క. ఒకసారి చూసిన మొహం, విన్న పేరు అంత బాగా గుర్తుండవు. నాతో కాసేపు మాట్లాడి, మీ పేరు మీరే చెప్తే అప్పుడు మీ గొంతులో మీ పేరు, ఆ పేరుకి ఒక మొహం నా బుర్రలో ఫీడ్ అవుతాయి.
అలాంటి నాకు నా పెళ్ళికి ముందు పెద్దగా పెళ్లిళ్లకు వెళ్ళే అలవాటు అవసరం, అవకాశం కూడా లేవు. ఇంటరు వరకు చదువు చదువు అని హోం అరెస్ట్. ఆ తరువాత చదువు ఉద్యోగం కోసం రాష్ట్రం బహిష్కరణ.
కట్ చేస్తే నా పెళ్లికి పదిహేను వందల మంది అతిథులు. అందులో నాకు తెలిసింది తిప్పి తిప్పి కొడితే వంద మంది. ఏదో ప్లాస్టిక్ నవ్వుతో పెళ్లి అయిపోయింది.
ఆ తరువాత చూస్కోండి ఇంటికి ఏ పెళ్లి శుభలేఖ వచ్చినా ఇదే తంతు.
“వీళ్లు నాకు తెలియదు. నేను పెళ్లికి వచ్చి ఏం చేస్తాను అత్తమ్మా? పైగా సెలవు కూడా లేదు.”
“దగ్గరి వాళ్ళేనే. మా చిన్నమ్మ ఆడిబిడ్డ మేనల్లుడికి మరదలు. ఆళ్ళ మొగుడు మా మారక్క మనుమరాలు అత్త ఏరాలి తమ్ముడే. రెండు దిక్కుల దగ్గరే కదా. సెలవు పెట్టు. వెళ్లక పోతే బాగుండదు.”
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆట మొదలు. ఆ చిన్నమ్మ ఆడిబిడ్డ దగ్గరే నా బుర్ర వాళ్ళ మొహాలు, పేర్లు వెతుక్కుంటూ “Error 404 Not Found” అని తెల్ల మొహం వేస్తుంది.
అలా హాజరు అయిన పెళ్లిళ్ల సాక్షిగా ఆ పెళ్ళిళ్ళలో మరో సీన్ రిపీట్
“ఈమెను గుర్తు పట్టినవా?
ఆరోజు చెప్పిన గదా. మా పెద్దాడిబిడ్డ వాళ్ళ అత్త తల్లిగారు వీళ్ళ ఊరే. చిన్నప్పుడు ఒకసారి వెళ్లి వాళ్ళ ఇంట్లో తిన్నం. మంచి మనుషులు.”
ఈలోపు నా బుర్ర మీ పేరెంత.. సారీ..పేరేంటి, మాకు ఏమవుతారు అని అడగాలని ప్రయత్నిస్తూ ఆ వరసల పురాణం ఎప్పుడు తెగేను అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
ఇహ ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ లాగా వాళ్ళే దగ్గరికి వచ్చి మనం నమస్కారం చేశాక “హే నన్ను గుర్తు పట్టావా, నా పేరేంటి చెప్పుకో చూద్దాం” అన్నప్పుడు వెయ్యి ఓల్టుల కరెంటు షాక్ కొట్టి మెదడు మొత్తం కొయ్యబారిపోయినట్టు ఉంటుంది..
అదండీ నా అశక్తతకు అంచనాలకు మధ్య యుధ్ధాలు నా సహనాన్ని అలా పరీక్షిస్తూ ఉంటాయి. ఎవరైనా పూనుకుని ఎదుటి వాళ్ళ మొహం స్కాన్ చేసి మన ఫోన్ మీద వాళ్ల పేరు, ఊరు, మనకు ఏమవుతారు లాంటి వివరాలు వచ్చేలా ఒక యాప్ చేస్తే బాగుండు.
హైదరాబాదులో చదువంటే ఎంతో కష్టం. అద్దె ఇంట్లో ఉండి స్వయంగా వంట చేసుకోవాలి. నేనైతే పది రూపాయలు సంపాదించుకోవాలి. నా అవసరాలు తీర్చుకోవాలి. అద్దె ఇంట్లోను ఒకరిద్దరు మిత్రులతో కలిసుంటే నావంతు అద్దె కూడా తగ్గుతుంది.
ఏదేమైన సిటీలో డిగ్రీ పూర్తి అయ్యేవరుకు ఒక ఇరవై ఇండ్లైనా మార్చి ఉంటాను. ఇంటివారికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా ఇల్లు మారవలసిందే కదా!
బొగ్గులకుంట, హనుమాన్ టేక్డీ, నారాయణగూడా, గౌలిగూడా, హుస్సేన్ ఆలం, గౌపురం, షాలిబండా మొదలైన ప్రాంతాల్లో నీ విద్యార్థి థలో అద్దెకుండడం జరిగింది. వివాహం తర్వాత లాల్ దర్వాజలో కొంతకాలం ఉండి 1977లో వారాశిగూడాకు రావడం జరిగింది. అక్కడుండగానే బౌద్ధ నగర్ లో ఎనభై గజాల్లో చిన్న ఇల్లు నిర్మించుకొని అందులో ఇరవై ఐదేండ్లున్నాను.
ఇస్లామియా బాయిస్ హైస్కూలులో ఆరేండ్ల అధ్యాపక వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రగతి మహా విద్యాలయంలో లెక్చరర్ గా చేశాను. అక్కడ ఎనిమిదేండ్లు పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశించాను.
ప్రగతి మహావిద్యాలయం నుండి నిష్క్రమించినప్పుడు వచ్చిన పి.ఎఫ్. డబ్బుతో బోడుప్పల్ లో ఒక ప్లాటు తీసుకున్నాను.
పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. కనుక ఇల్లు సరిపోక బోడుప్పల్ ప్లాట్ లో ఇల్లు కొత్తగా నిర్మించు కోవాలన్న కోరిక కల్గింది. తదనుగుణంగా లోన్ తీసుకొని ప్రమీల పేరుతో ఉన్న ప్లాటులో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. ఐతే నా ఇద్దరు పిల్లలకు బోడుప్పల్ పల్లెటూరుగా కనిపించింది. అందుకే వాళ్ళు నాతో ”ఫ్యూచర్ లో అమ్మా, నీవు మాత్రమే ఇక్కడ ఉండవలసి వస్తుంది” అని పదే పదే చెప్పడం నాకు గుర్తుంది.
ఎట్లాగైతేనేమి ఇల్లు కట్టుకొని కొత్తగా నివసించడం మొదలుపెట్టిన తర్వాత పల్లె రూపంలో ఉన్న బోడుప్పల్ పట్నమైంది. ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్ మాల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూళ్లు, కాలేజీలు వచ్చాయి. 2004 నాటికి 2022 నాటికీ కాలనీల రూపురేఖలే మారిపోయాయి.
నేను ఏది చేసినా ప్రమీలతో ఆలోచించి మాత్రమే చేస్తాను. బోడుప్పల్ లో ఇల్లు ఆమె పేరు మీదనే కట్టాను. విచిత్రమేమిటంటే మా ఉదయనగర్ కాలనీలో ఎవరి ఇంట్లోను బోర్లున్నా పని చేయవు. కాని ప్రమీలచే కొబ్బరికాయ కొట్టించిన పుణ్యవిశేషం కావచ్చు, మా ఇంట్లో ఇప్పటికీ దేవుని అనుగ్రహం వల్ల బోర్లో నీళ్లున్నాయి.
వారాశిగూడా నుండి బోడుప్పల్ కు వచ్చి అప్పటికి పదకొండు సంవత్సరాలవుతుంది. ఈ కాలంలో మగ పిల్లల పెళ్లిళ్లు చేశాం కట్నాలు ఏమీ తీసుకోకుండానే. ప్రమీలకు కట్నాలు తీసుకోవడమంటే ఇష్టం ఉండేది కాదు. పిల్లల కోరిక మేరకు ప్రమీల, నేను ఇద్దరమే బోడుప్పల్ ఇంట్లో మిగిలాం. కొత్తింట్లో మీరిద్దరే ఉంటారన్న పిల్లల మాట నిజమైంది.
తోడుగా ప్రమీల ఉందనే ధైర్యంతో, విశ్వవిద్యాలయానికి దూరంగా ఉన్నా క్రమం తప్పకుండా డ్యూటీ చేశాను. వేళకు ఇంటికి రావడం, భోజనం చేయడం విద్యార్థులు వస్తే మాట్లాడడం, బంధు మిత్రులకు ఆతిథ్యమివ్వడం – ఇవన్నీ సజావుగానే జరిగేవి.
మేం ఇద్దరం ఉల్లాసంగానే ఉండేవాళ్లం. ప్రమీల అనారోగ్యం అనే మాట ఎఱుగదు. ఆమెను ఎన్నడూ పిల్లలు పుట్టినప్పుడు తప్ప హాస్పిటల్స్ కు తీసుకొని పోలేదు. ఆమెనే ఇంటిపనులన్నీ చూసుకునేది. కాని అప్పుడప్పుడు నేనేమైనా అంటే బాధపడేది. ”నేను పోయిన తర్వాత నువ్వొక్కడవే ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని హెచ్చరించేది. కని ఎన్నడూ ఆమె నాకంటే ముందుగా ఈలోకాన్ని విడుస్తుందని భావించలేదు.
ఇద్దరే ఉంటారని పిల్లలనడం, నువ్వొక్కడవే ఉంటావని ప్రమీల అనడం పదేపదే గుర్తుకు వస్తాయి. కాని కళ్ల నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇప్పుడు నేనేమి చేయగలను?
——————–
అది వేసవి కాలం, ఎండలు మండుతున్నవి. ఏ.సీ. గదుల్లో ఉన్నవారిక బయటికి వెళ్లాలంటే భయం. మా ఇంట్లో ఏ.సి ఉన్నా దాన్ని వాడం. చిన్నప్పటి నుంచి శీతోష్ణాలను సహించే శక్తి భగవంతుడు నాకే కాదు, నా అర్ధాంగి ప్రమీలకు ఇచ్చాడు.
మా ఇద్దరిదీ ఇకే మనస్తత్వం. చిన్న కుమారుని పెద్ద కూతురికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని తిరుపతికి బయలుదేరాం. రిజర్వేషన్ సౌకర్యం ఉండడం వల్ల రైళ్లో చక్కగా ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాం. మాది ఎనిమిది మంది గ్రూప్. నేనూ, మా ప్రమీల, మా చిన్నక్క, చిన్న కుమారుడు ప్రణవ్, వాడి భార్య అఖిల, అమ్మాయి శ్రీవిష్ఠ, మా పెద్ద కుమారుడు క్రాంతి, ప్రణవ్ బావమరిది సుమన్.
అందరం దిగువ తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమలకు మా ప్రణవ్, అతని భార్య, బావమరిది క్రాంతి కుమార్ అందరూ కాలినడకన బయల్దేరారు. నేనూ ప్రమీల, మా అక్కగారు ముగ్గురం బస్సులో కొండ పైకి చేరుకున్నాం. కాలినడకన రావడం వల్ల వారికి దర్శనం సులభంగా లభించింది. కాని మా ముగ్గురం మూడువందల టికెట్ లైన్లో నిలబడ్డాం. లైన్ పెద్దగా ఉంది. లోపల కంపార్ట్ మెంట్లలోనూ జనం నిండుగా ఉన్నట్లు ఎవరో చెప్పగా విన్నాను. టికెట్టు తీసుకున్నా, తీసుకోకున్నా దైవ దర్శనం మర్నాడే జరుగుతుందని ఊహించాను ఆ స్థితిలో.
దైవదర్శనం కోసం వచ్చినప్పుడు అంతా దైవమే చూసుకోవాలి కదా! అందుకే దైవం మీద భారం వేసి కంపార్ట్ మెంట్ల వైపు నా భార్యతో, అక్కతో వెళ్లాను. గేటు దగ్గరున్న అతడు మమ్మల్ని చూసి ”మా మనుమరాలు, వాళ్ల తల్లిదండ్రులు కాలినడకన వచ్చి, దైవదర్శనానికి వచ్చారు. మమ్మల్ని లోపలికి పంపవా పుణ్యముంటది” అని ప్రమీల వినయంగా గేటు దగ్గరున్నవాణ్ణి అడిగింది. అంతే అతడేమనుకున్నాడో ఏమో మమ్మల్ని లోపలికి పంపించాడు. మేం బ్రతుకుజీవుడా అని లోపల పడ్డాం కాని, అప్పటికే జనం ఆ కంపార్ట్ మెంటులో నిండుగా ఉంది. నిలబడడానికి కూడా స్థలం లేదు. కూర్చోవడం దేవుడెరుగు. నాకు ఎక్కువగా నిలబడడం చేతగాదు. ప్రమీల, అక్కగారు ఇద్దరూ కష్టంగా నిలబడ్డారు.
ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్ల చేతుల్లో టికెట్లున్నాయి. కొందరు బయటికి వెళ్లి రావడానికి పాసులు కూడా తీసుకున్నారు. మా దగ్గరవేం లేవు. మేం నేరుగా 10వ కంపార్టుమెంటులో ప్రవేవించాం. మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు. ప్రవేశించనైతే ప్రవేశించాం గాని, నిలబడడానికి చోటు లేదు. కంపార్టుమెంటు నుంచి కంపార్టుమెంటులోకి మారేటప్పుడప్పుడు గేటు ఇట్లా తీసారో లేదో జనం ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరు ఊపిరాడక నిశ్చేష్టులయ్యారు. నాలో ఆందోళన పెరుగుతుంది. కూర్చోలేం. నిలబడలేం. ప్రక్కకు కదలలేం. ముందుకు నడవలేం. బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. ‘ఏమిట్రా ఈ దైవ దర్శనం? కాకుండే బాగుండేది” అనుకున్నాను నా మనస్సులో.
ప్రమీలకు చాలా ఇబ్బంది కల్గింది. చాలాసేపు నిలబడడం వల్ల కదలలేకపోయింది. నిజానికి ఆ జనం కదలనిస్తే కదా! గేటు తెరిచి తెరవకముందే వెనుకున్నవాళ్లు ముందున్న వాళ్లను నెట్టేస్తూ గేటు దాకా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెట్లాగో కదిలినా ప్రమీలకు, మా అక్కకకూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.
ఆశ్చర్యంగా ఇద్దరు యువకులు మా దగ్గరకు వచ్చి ”సార్ మీరేమి భయపడకండి. మేడం గారికి మేం రక్షణగా ఉంటాం. మీకు దర్శనం సులభంగా జరుగుతుంది” అని మాట్లాడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది.
”సార్ మీరు ఆచార్యులు గదా! మిమ్మల్ని టీవీలో చూశాం. అందుకే మిమ్మల్ని గుర్తు పట్టాం. మీరే వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు ఆ యువకులు. మా పిల్లలు బహుశా ఇప్పటికే స్వామి దర్శనం చేసుకొని ఉంటారు. మేం ఇలా రావలసి వచ్చింది” అని వాళ్ల డౌట్ క్లియర్ చేశాను. నిజంగా వారిద్దరూ ప్రమీలకు అక్కకూ బాడీ గార్డ్స్ లాగా ఉండి దైవదర్శనం చేయించారు.
నాకాశ్చర్యం కల్గింది. వారు మమ్మల్ని మా పిల్లలు లోపల ఉండగానే మాతో కలిపారు. మేం మా పిల్లలతో కలిసిన మరుక్షణంలో వాళ్లు మాయమయ్యారు. వారికోసం అక్కడా ఇక్కడా ఎంత చూసినా కనిపించలేదు. ఇదొక అద్భుత సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.
నా ప్రమీల గురించి గొప్పగా చెప్పవలసిన పనిలేదు గాని, ఇక్కడ కొన్ని మాటలు చెప్పక తప్పదు. మూడువందల రూపాయల టికెట్ తీసుకోకుండానే కంపార్టుమెంటులో ప్రవేశించడానికి ఆమే కారణమైంది. అట్లే ఆమె రక్షణకు ఇద్దరు యువకులు రావడం విశేషం. వారు మమ్మల్ని మా పిల్లలతో కలిపి మాయం కావడం చిత్రమనిపించింది.
ప్రమీల కొంచెం బొద్దుగా ఉన్నా, ఆమె దేహకాంతి ఎరుపు. ముఖం గుండ్రంగా ఉండి, కుంకుమ తిలకం దానికి మరింత అందాన్ని కల్గించేది. ఆమె చీరకట్టు, స్ఫురద్రూపం ఎవరినైనా ఆకర్షిస్తుంది. సాధుస్వభావుల్ని చేస్తుంది. మొదటినుంచి ఆమెతో నేనెక్కడికి వెళ్లినా నాకు గంటలో అయ్యే పని క్షణంలో అయ్యేది. ఆమెను చూసినవారు, నన్నదృష్టవంతునిగా వర్ణించేవారు. నా నలభై ఏండ్ల కాపురంలో నా సహధర్మచారిణిగా ప్రమీల మంచి మార్కులు సంపాదించింది. ఒక్క తిరుపతే కాదు, దేశంలోనూ, విదేశంలోనూ ఎక్కడికి వెళ్లినా ఆమె సహధర్మచారిత్వం ఆమెకు శ్రీరామరక్షగా ఉండిందని చెప్పక తప్పదు.
ఆనంద్ మా ప్రమీలకు పెద్దమ్మ కొడుకు. చిన్నప్పుడు మా ఆవిడ అతణ్ణి ఎత్తుకొని ఆడించేదట. అందుకేనేమో ఆనంద్ తన పెళ్లి అయిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చేవాడు. మా పెళ్లి సమయంలో అతడు మా వూరికి వచ్చినట్లు జ్ఞాపకం ! ”బావా మీ ఇల్లు నాకు నచ్చలేదు. ఇంట్లో ఫ్యాన్లు లేవు. లైట్లు లేవు. ఇక్కడ నువ్వెట్లా చదువుకున్నావు బావా?” అని ప్రశ్నిస్తే, ”మాది వూరు కదా! పట్నంలోలాగా అవేవీ ఉండవు. ఐనా అన్నీ సజావుగానే జరుగుతాయి” అని సమాధానపరచడం నా వంతయ్యింది.
”అక్కా! ఎట్లుంటవు ఈ వూర్లో?” అని నా ముందరే ప్రమీలనడిగాడు. ఆమె నెమ్మదిగా ”బావ ఉద్యోగం హైదరాబాదులో కదా!” అని సమాధానపరిచింది. తానుండేది పట్నంలోనే కదా అని ఆమె ఆంతర్యం.
ఆనంద్ కు ఒక ఉపాధ్యాయురాలి కూతురుతో పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏవో పొరపొచ్చాలు వచ్చి భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒక జడ్జి గారి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు.
అక్కమీది ప్రేమతో తరుచుగా వారాసిగూడాలోని ఇంటికి వస్తుండేవాడు. ప్రతి సంవత్సరం శబరిమలైకి వెళ్లి ప్రసాదం తెచ్చేవాడు. ఆ సంవత్సరం కూడా వెళ్లి వచ్చాడు.
”బావా! ఒంటరిగా ఉన్నాను. ఆ అయ్యప్ప కూడా కరుణ చూపడంలేదు. నాకు చెన్నప్ప బావే దిక్కు” అని కాళ్ల మీద పడ్డాడు. వాడి ఉద్దేశం అర్థమైంది. వాడికో పిల్లను చూసి పెళ్లి చేయాలని వాని కోరిక.
‘సరే చూద్దాంలే’ అని అప్పటికి తప్పించుకున్నాను.
ఒకరోజు మా ఇంటికి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్లి అప్పుడే వచ్చాను. ఆనంద్ ప్రత్యక్షమయ్యాడు. నాకు వెంటనే ఒక ఆలోచన మనస్సులో తళుక్కున మెరిసింది. రామాలయంలో నాకు తెలిసిన వాళ్లే అర్చన చేస్తున్నారు. కొండబత్తిని కుటుంబం అని మంచిపేరే ఉంది. హనుమంత రావుకున్న ఏడుగురు సంతానంలో చివరి ఐదుగురు ఆడపిల్లలే. ఒక అమ్మాయి పెళ్లి అయింది. రెండవ అమ్మాయిని సోలాపూర్ ఇస్తే ఏవో తగవులొచ్చి, ఇంటి పట్టుననే ఉంది. బి.ఏ. చదివింది. హెచ్.ఎమ్.టీ వాచ్ కంపెనీలో ఉద్యోగం. ఇంకా ముగ్గురి పెళ్లిళ్లు కావలసి ఉంది. రెండవ అమ్మాయి ఎంతో భారమైంది. హనుమంతరావు మా బస్తీలో పెద్దమనిషి. తరుచుగా మా ఇంటికి వచ్చి ప్రమీలతో మాట్లాడేవాడు. ప్రమీలకు వారి కుటుంబం గురించి బాగా తెలుసు.
హనుమంతరావు 2వ అమ్మాయిని ఆనందుకు ఇప్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమనుకున్నా సరే అనుకొని ప్రమీలకు ఈ విషయం చెప్పాను లోగడ ఒకసారి.
ఆనంద్ ఆ సంవత్సరం శబరిమలైకి వెళ్లి మాకోసం ప్రసాదం తెచ్చాడు. నేను ఒకరోజు రామాలయం నుంచి వచ్చి రాగానే ప్రమీల హనుమంతరావు కుటుంబం అక్కడికి వచ్చిందా అని అడిగింది. వచ్చిందని చెప్పాను. వెంటనే ప్రమీల ఆ 2వ అమ్మాయి ఎట్లనిపించింది? అని నన్నడిగింది. ఫరవాలేదన్నాను. ప్రమీల ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆనంద్ తో ”మీ బావ నీకో అమ్మాయిని చూశాడు- రామాలయంలో. చూస్తే ఇప్పుడే పోయి చూడు” అని పురమాయించింది.
ఆనంద్ ఆనందంతో ఎగిరి గంతేశాడు. అక్కా బావలు చెప్పిన తర్వాత ఇంకా ఆగవలసిన పని లేదనుకొని అడ్రస్సు పట్టుకొని రామాలయానికి వెళ్లాడు. ”మా బావగారు పంపించారు నన్ను” అని హనుమంతరావుతో పరిచయమయ్యాడు. హనుమంతరావు తన పరివారాన్ని అతనికి పరిచయం చేశాడు. ఆ 2వ అమ్మాయిని గుర్తించాడు. అక్కడేమీ మాట్లాడకుండా, ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చాడు.
హఠాత్తుగా అక్క కాళ్ల మీదపడి ”ఆ అమ్మాయితో నా పెళ్లి నువ్వే చేయాలి. మా అన్న పెళ్లి కూడా నువ్వే చేశావు ఆలేరు నుంచి పిల్లను తెచ్చి” అని ప్రాధేయపడ్డాడు.
ఆనంద్ కు ఆరుగురు అన్నలు. పెళ్లి కావాలంటే అన్నలనందరిని ఒప్పించాలి. ఇరువైపుల మాట్లాడి సంబంధం కుదిరించాలి. పెళ్లి చేసుకోవడం సులభం కాని, పెళ్లి చేయడం కష్టం.
పెద్దమ్మ కొడుకైనా ఆనంద్ బాధ్యతను ప్రమీల తన భుజానికెత్తుకుంది. పెళ్లి కాని అమ్మాయితో ఆనంద్ పెళ్లి చెయ్యాలనే ఆలోచన అన్నలకు లేకపోలేదు. ఐనప్పటికీ ప్రమీల వారినందరినీ ఒప్పించింది. ”ఆనంద్ కు భార్యలేదు. హనుమంతరావు కూతురికి భర్తతో తెగదెంపులయ్యాయి. ఇద్దరూ సమానమే. న్యాయం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది” అని తెలివిగా అందరిని తన వాదానికి అనుకూలంగా మార్చింది.
ఎట్లాగైతేనేమి ప్రమీల ముందుండి ఆనంద్ పెళ్లి చేసింది. ఇప్పుడానంద్ ఇద్దరు పిల్లల తండ్రి. ఒక బాబు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. చిత్రమేమిటంటే హనుమంతరావు ముగ్గురు ఆడపిల్లలకు చకచకా పెళ్లిళ్లయిపోయాయి.
ఆనంద్ ఎప్పుడైనా కలిస్తే ప్రమీలను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ”బావా! అక్క లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు” అనే మాటలు ఆనంద్ హృదయంలోంచి వచ్చినవిగా భావిస్తాను. ప్రమీలను గూర్చి నేను ”ఘటనా ఘటన ధురీణురాలు” అని సంతృప్తి చెందుతుంటాను.
——————-
అసహనంగా ఫోనులో వాట్సప్ ఓపెన్ చేసాడు రాజశేఖర్.
స్మార్ట్ ఫోను వచ్చినప్పటినించీ వాట్సాప్ ఓపెన్చేయ మెసెజెస్ డిలీట్ చేయా! దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది. పొరపాటున రెండు రోజులు చూడలేదంటే వార్నింగ్ ఇంటర్నల్ స్పేస్ నిండిపోయిందని. వద్దుమొర్రో అంటే అమ్మాయి రాజశేఖరానికి ,అబ్బాయి వాళ్ళమ్మకి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు.
“తెల్లారిందా! పిల్లలకంటే ఎక్కువైంది పొద్దూకులూ ఆ ఫోన్ పట్టుకుని.నాతోకాస్త మంచీచెడు మాట్లడదామనిలేదు. టిఫిన్ , భోజనం
ఆ ఫోన్ పట్టుకొని ఏం తింటున్నారో కూడా తెలియకుండా, ముగించేయడం. ఏమిటో బాబు మీ ధోరణి. కాస్త ఏ.గుడికో గోపురానికో అలా.నడుచుకొని వెళ్దామంటే.మోకాళ్ళ నొప్పులు మోక్షానికి అడ్డు..మీతో మాట్లాడుదామంటే మీకు ఆ వెధవ ఫోన్ తో సరిపోతుంది.” సరోజ సణుగుడు వాట్సప్ మెసేజెస్ కి మించి ఉంది.
నిజమే మరి రిటైర్ అయ్యేవరకు తన ఆలనా పాలనా చూసింది.పిల్లల్నిప్రయోజకుల్నిచేసింది.తను తన ఉద్యోగం సంపాదన,తప్పించి వేరే విషయాలు పట్టించుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సంసారాన్ని దిద్దింది.యాంత్రికంగా బాధ్యతలతో జీవితం ఎలా గడిచిందో ఊహకి అందటంలేదు.స్వగతంగా అనుకున్నాడు రాజశేఖర్.
“సరూ! నీ సణుగుడు ఆపు. ఫోన్ చస్తున్నానని మొరపెట్టుఘకుంటోంది. డిలీట్ చేయలేదనుకో, వాట్సిప్ ఎగిరి పొయ్యిందంటే పిల్లలతో వీడియో. కాల్ మాట్లాడలేము”.
“సరే బాబు ఒక అరగంటలో ఆ పని కానీండి నేను ఈ లోగా వంటింట్లో పని పూర్తి చేసి వస్తా! యోగా మేట్స్ వేయండి.” అంటూ నిష్క్రమించింది.
పొద్దున్నే ఇద్దరూ కలసి శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు. రిటైర్ అయ్యిన తరువాత ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు.అందులో భాగమే ఈ వ్యాయామాలు.
★★★
రాజశేఖర్ రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంకా రావలసిన డబ్బు చేతికి అందలేదు. వాట్సాప్ లో “రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫ్రెండ్స్” గ్రూప్ లో చేరాడు. ఊరికొకడు గా చెల్లా చెదరవుతున్న సహచరులతో అనుబంధం ఉండాలని విషయాలు తెలుస్తాయని.
అందులో అతిఛాందసులు రోజూ ఏదో సూక్తి లేక దేముడి బొమ్మతో శుభోదయాలు, పండగల్లో శుభాకాంక్షలు పెడ్తూ ఉంటారు. కొందరైతే మరీ వాళ్ళ పిల్లలవి మనవలవి ఫోటోలు పెడ్తారు.ఎవరి గోల వారిదన్నట్లు ఉంటుంది గ్రూప్.
“అందరూ బాధ్యత గలిగిన ఉద్యాగాలు చేసి రిటైర్ అయ్యారు ఏంలాభం గ్రూప్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు.” స్వగతంగా అనుకోబోయి కొంచెం గట్టిగానే అన్నాడు.
“ఏమిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?” చేయిచెంగుకి తుడుచుకుంటూ అడిగింది సరోజ.
“ఆఁ ! ఏముంది లేవంగానే నీకు ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకోవడం అన్నా అవుతుంది కాని ,నాకు దీన్ని శుభ్రం చేయటం కావటంలేదు.” అంటూ ఫోను చూపాడు.
“చక్రపాణి అయితే మరీను. వీడు గ్రూప్ లో చాలనట్లు పర్శనల్ గా శుభోదయం ,శుభాకాంక్షలు పంపుతాడు. ఎన్నోసార్లు చెప్పాను ఎక్కడో ఒకచోట పెట్ట రా! రెండుచోట్ల ఎందుకురా ?’అని.
దానికి వాడు, “ఒరేయ్ శేఖర్! అది మాస్ గ్రీటింగ్స్. ఇది నాప్రాణ స్నేహితుడికి పంపే స్పెషల్ కోట్స్. నీకో విషయం తెలుసా! నీకు పంపాలంటే గూగుల్ లో ఎంత సెర్చ్చేస్తానో !” అని.
ఏమిటో వాడి అభిమానానికి నవ్వాలో ఏడవాలోతెలియదు. అంటూ స్నేహితు జ్ఞాపకాల్లో హఠాత్తుగా వెన్ను చరచి నట్లయింది.
అవును దగ్గర దగ్గర నెల రోజుల్నించీ సరిగ్గా మెసేజెస్ డిలీట్ చేయడంగాని తిరుగు మెసేజ్ పెట్టటం చేయలేదు.తమ కంపెనీ రిటైర్మెంట్ గ్రూప్ వాళ్ళ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చిందో చూడనేలేదు . దక్షిణ భారతదేశం తీర్ధయాత్రలకి వెళ్ళటం వచ్చాక కాస్త ప్రయాణం బడలికతో వళ్ళు వెచ్చపడటంతో .
మన గురువుగారివే చాలా ఉంటాయి అనుకుంటూ వాట్సప్ గ్రూప్ తెరిచాడు.
ఏ వేవో చవకబారు జోక్స్,ఫొటోలు తప్పించి శుభోదయం, శుభాకాంక్షలు లేవు.అలా అలా వెనక్కి వెళ్ళి చూస్తున్న నా మతిపోయింది. గత రెండు నెలలుగా చక్రపాణినించీ ఒక్క మెసేజ్ పంపలేదు.వాడి పర్సనల్ ఎక్కౌంటు చూసాను. రెండు నెలల క్రితం అంటే ఆగస్టు పదిహేనున ” స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు”అంటూ చక్రి మెసేజ్ .
దాని క్రింద తనతిట్లు.”ఒరేయ్ చక్రీ!ఒక్కసారి ఫోన్ చేయవచ్చు కదరా! నువ్వు చెయ్యవు,నేను చేస్తే ఎత్తవు”అని. దాని కింద వాడి వైపునించీ ఒక స్మైలీ.
మా చదువు ఉద్యోగం ఒకే చోటవడంతో మా ఇద్దరికీ చాలా అవినావభావ సంబంధం. రిటైర్మెంట్ కి రెండు సంవత్సరాల ముందే వాడి భార్య కేన్సర్ వ్యాధితో పోవడంతో ఆ రెండేళ్ళు ఒంటరిగా అతి కష్టం మీద వంటరిగా సమర్ధించుకున్నాడు.పెద్ద కొడుకు ఢిల్లీలో డిఫెన్స్ లో చేస్తున్నాడు. చిన్నవాడుఅమెరికాలో.తనే సలహా ఇచ్చాడు “పిల్లలు వాళ్ళ దగ్గిరకితీసికెళ్తానంటే వాళ్ళదగ్గరకి వెళ్ళిపోరా!రెండు సంవత్సరాలనించీ చేయికాల్చుకుని అవస్తపడుతున్నావు.” అని.
“ఒరేయ్! ఢిల్లీ వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదురా!కొడుకు కోడలు వారి ఉద్యోగాలలో వాళ్ళు బిజీ. మనవలు చదువులు.అందులో వాడికూతురు ఐ.ఏఎస్ కి ఎప్పియర్ అవుతోంది.తాత తాత అంటూ అదేకాస్త నాదగ్గరకి ఎక్కువ వచ్చేది” అన్నాడు.
“ఏది ఏమైనా నువ్విక్కడ వంటరిగా ఉండద్దు.
ఫోన్లో మాట్లాడుకుందాం!ఇండియా లోనే కదరా!నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు.” అని కష్టం మీద ఫ్రెండ్సందరం కలిసి ఒప్పించారు.
గత రెండు నెలలుగా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు.అలా అని ఫోన్ డెడ్ ఏమో అనుకోవటానికి యధావిధిగా శుభోదయాలు, శుభాకాంక్షలు వస్తున్నాయి. మెసేజెస్ కి ఎమోజీ లు.
ఏది ఏమైనా ఇవాళ వాడితో మాట్లడాలని నిర్ణయించుకున్నా. అదేమాట సరోజతో చెప్పాడు రాజశేఖర్.
“అలాగా అండీ! జ్రోత్స్న పోయినప్పటినించీ అన్నయ్యగారు చాలా వంటరి వారయ్యారు సుమా!”
“అవును సరోజా!జంటలో ఏ ఒక్కళ్ళు వంటరిగా మిగిలినా వారి బ్రతుకు దుర్భరం.సరే ఇవాళ వాడితో ఎలాఅయినా మాట్లాడాలి. వాడు కాంటాక్టు లోకి వస్తే నిన్ను పిలుస్తా పలకరిద్దుగాని అంటూ వాడికి అదేపనిగా కాల్ చేస్తునే ఉన్నాడు. అటునించీ స్పందన లేదు. రాజశేఖరానికి పట్టుదల ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలైంది. రాజశేఖర్ మొహం వివర్ణమైంది. దుఃఖం తన్నుకు వస్తోంది. “ఏమైంది వాడికి?” అదేమాట సరోజతో అన్నాడు.
“ఫోన్ పారేసుకున్నారేమో! లేదా కొత్తఫోన్లో కాంటాక్ట్స్ లోడ్చేసుకోలేదేమో ! లేదా కొత్త నంబరు తీసు కున్నారేమో! “
సరోజ ఇన్ని కారణాలు చెప్పినా రాజశేఖర్ మనసు రాజీ పడలేదు. అతని మీద అతనికే కోపం వచ్చింది.
ఇండియాలోనే గా అన్నాడు కానీ వాడి ఢిల్లీ ఎడ్రస్స్ గానీ వాడి కొడుకు ఫోన్ నంబరు కానీ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు తనకి పిచ్చి వాడిలా?
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో!స్వంత పిల్లల దగ్గరనుండి క్షేమసమాచారం తెలియక పోతే అల్లల్లాడినట్లు అల్లల్లాడిపోయింది మనసు.
“శేఖర్!కోవిడ్ తగ్గాక హైదరాబాద్ వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా!ఎవరైనా ఉంటే చూడు.” అన్న వాడి మెసేజ్ గురించి ఆతృతగా వెదికా!
మెసేజ్ కనబడింది .ఆఁ ! ఆ మెసేజ్ ఆఖరి మెసేజ్ వాడు టైప్ చేసింది. తరువాత అన్నీ ఎమోజీలు స్మైలీ లు.
నా ఆలోచనలకి అంతరాయంకలిగిస్తూ ఫోన్ మ్రోగింది.చక్రపాణి దగ్గరనించీ.ఒక్కక్షణం సంతో్షం వెంటనే విపరీతమైన కోపం వచ్చింది.ఫోన్ ఎత్తుతూనే ఛడామడా తిట్లవర్షం మొదలుపెట్టా!”ఇడియట్! నన్నింత టెన్షన్ పెట్తావా” అంటూ.
“అంకుల్! నేను రాకేష్ ని.చక్రపాణిగారి పెద్దబ్బాయిని”
“అవునా బాబూ రాకేష్!బాగున్నావా!వాడికివ్వు ఫోన్.”
“అంకుల్ ! నాన్నగారు లేరండీ!”
“అమెరికా వెళ్ళాడా ఫోన్ మరచిపోయి.వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ బాబూ.”
“లేదండీ !నాన్నగారు పరమపదించి నెలైంది.
ఇవాళ మాసికం ఇక్కడ దగ్గర సంస్థ లో పెట్టివచ్చాం. నాన్నగారి ఫోన్ చాలా రోజులుగా కనపడలేదు. బాయ్ ఎక్కడోపెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారి గది శుభ్రం చేస్తుంటే కనపడింది. చార్జ్ లేకపోవటం తో చార్జికి పెట్టి ఇప్పుడే నాన్నగారి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్దామనుకుంటుంటే మీ మిస్డ్ కాల్స్ చూసా!
ఫారెన్ ఎంబసీస్ ని రిసీవ్ చేసుకోవటం వారి సెక్యూరిటీ ఎరేంజ్మైంట్స్ తో నాన్నగారు పోయాక కంటినిండా ఏడవలేదు అంకుల్ .”
రాకేష్ !గద్గద స్వరం విని రాజశేఖర్ తల తిరిగి పోయింది.
బలవంతంగా తెప్పరిల్లి ,”ఎలా జరిగింది బాబూ రాకేష్ ” .
“నాన్నగారికి మూడునెలల క్రితం పరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది.ఒకచేయి.కాలు పడిపోయాయి. అప్పటినించీ మంచంలోనే ఉన్నారు. ఫిజియోథెరపీకి మెడిసిన్స్ కి రెస్పాండ్ కాలేదు.” ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం బ్రయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు.అంతా క్షణాలమీద అయిపోయింది దుఃఖాన్ని అదిమి పెట్టుకొని వివరాలు అందించాడు రాకేష్.
“మరి ఆ మెసేజెస్……” రాజశేఖర్ మాట పూర్తి కాకుండానే….,.
“నాన్న గారికి ఒక బాయ్ ని కుదిర్చాము. ఆయన అవసరాలు తీర్చటానికి.వాడి కి ఫోన్ యూసేజ్ బాగా తెలుసు.ప్రతిరోజు ఆయన కాలకృత్యాలు తీర్చిన తరువాత ఆయన చూపెట్టిన వాళ్ళకి గుడ్ మాణింగ్ మెసేజెస్ పంపమనేవారు.మెసేజెస్ చదివి ఎమోజీలు పంపమనే వారు.పండగలకి నేనే గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసే వాడిని.అవి పంపేవారు. ఆయన ఫ్రెండ్స్ మెసేజెస్ చదువుతుంటే కళ్ళలో ఒక స్పార్క్ చూసేవాడిని. నాబిజీ లైఫ్ లో ఆయన పరిస్థితి మెసేజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు . కాకపోయినా ఆయనకి సింపతీ ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంకుల్ అందుకని.
అంకుల్ మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడుతుంటే నాన్నతో మాట్లాడినట్లుంది.గుండె బరువు తగ్గినట్లుంది అంకుల్. వచ్చేనెలలో నేను హైదరాబాద్ వస్తాను. మీ ఇంట్లోనే దిగుదామనుకుంటున్నా! మీకు ఇన్కన్వీనియన్స్ అయితే తెలపండి అంకుల్. మాఇంటి గురించి డెసిషన్ తీసుకోవాలని దానికి మీ సలహా కోరుతున్నా!”
“అలాగేబాబూ!నాకెటువంటి ఇబ్బంది లేదు.చక్రపాణే వచ్చాడనుకుంటా. అమ్మాయిని పిల్లల్ని కూడా” తీసుకునిరా!మీపినతండ్రి పెదతండ్రి ఇల్లనుకో! నా! ఎడ్రస్ వాట్సప్ లో పెట్తా ఉంటా బాబూ రాకేష్!”
రాజశేఖర్ మెదడు మొద్దుబారిపోయింది వాడి సిన్సియారిటీకి.అంత సుస్తీలో కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి దగ్గర నుండి శుభోదయం రాని రోజు లేదు.తను పెట్టిన మెసేజెస్ కి వాడెందుకు జవాబివ్వకుండా ఎమోజీలు పెట్టెవాడో తెలిసాక రాజశేఖర్ గుండె పగిలిపోయింది.
“ఒరేయ్!చక్రీ “నువ్వు చాలా ‘గ్రేట్’ రా!నీలాంటి స్నేహితుడు ఒక్కడు చాలురా జీవితానికి. నీచిరునవ్వు నీ స్మైలీ లో ఉందిరా! ఒరేయ్!ఎంత అన్యాయంరా!నీవు పోయి రెండు నెలలు, నీవు మంచంలో పడి ఆరునెలలు, వెరసి ఎనమిది నెలలు.
నిన్ను నాలో ఎప్పటిలాగే ఊహించుకునేటట్టు చేసావు. స్నేహానికి నిర్వచనం నువ్వేరా!నీదగ్గిరనించీ మెసేజెస్ రాకపోతే ఎందుకా అని కూడా ఆలోచించని దౌర్భాగ్యుడిని.నువ్వు పోయా వని తెలియక నీ శుభోదయాలు,శుభాకాంక్షలు డిలీట్ చేయాలని తిట్టుకున్నా! తనలో తను ఉన్మాదిలా గుండె పగిలే లాగా ఏడుస్తూ అనుకున్నాడు.
★★★
తెల్లవారింది. ఎప్పటిలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్..యాంత్రికంగా గ్రూప్ ఓపెన్ చేసాడు.
అందులో మెసేజెస్,గ్రీటింగ్స్ అన్నీ చాలా అమూల్యమైనవిగా ఉన్నాయి.గబగబా అందరికీ శుభోదయాలు,శుభాకాంక్షలు, టైప్ చేసాడు! రెగ్యులర్ గా మెసెజ్ పెట్టే వాళ్ళ దగ్గిర నించీ మెసేజ్ లేకపోతే ఫోన్ చేసి వాళ్ళెలా ఉన్నారో కనుక్కున్నాడు! చాలా తృప్తిగా ఉంది నాకిప్పుడు. అనుకుంటూ వాలుకుర్చీలో వాలుతూ, ‘చక్రీ !నాకు మంచి గుణపాఠం చెప్పావురా! ‘అంటూ చమ్మగిల్లిన కళ్ళని పంచె అంచుతో తుడుచుకున్నాడు రాజశేఖర్.