ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది
నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది
ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా
అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం
రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం
మూడు సముద్రాల మధ్యనున్న మానవ మహా సముద్రం
కోహినూర్ వజ్రంతో బాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ
వేదాలను అందించడమే కాదు వేదాంతాన్ని తెలియజేసిన నేల
సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి
తిరిగొచ్చే దారి తెలియక పోయినా పద్మవ్యూహం లోకి
చొచ్చుకు పోయే యోధులు పుట్టిన గడ్డ
హంసను బాణంతో బాధించిన దేవదత్తుడి పేరు చరిత్రలో మాసిపోయినా
లేపనం పూసి ఊరడించిన సిద్దార్ధుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల
గాయం చేసిన వాడిని మరిచినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం కల జాతి
హంసలు నడయాడిన అవని
పరమ హంసల బోధనల పావని
ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకుని తిరిగినప్పుడు చీనాంబరాలు ధరించిన ధరిత్రి
సింధు నదీ లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత
సప్త సాగరాలకు సప్తస్వరాలను బహూకరించిన భరత మాత
కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ ను కన్న మాతృ మూర్తి
జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు
కట్టుబడిన పురుషోత్తముల సౌభ్రాతృత్వం
నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం
మొక్కల్నీ కుక్కల్నీ పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం
నీళ్లకూ పూలకూ హారతులిచ్చే ధరణి
పుట్టలనూ గుట్టలనూ పూజించే పుడమి
ఎలుకలకూ , ఏనుగులకూ ఒకేలా దండం పెట్టే దేశం
ఆహారమడిగిన డేగకు సైతం తొడను కోసి ఇచ్చిన శిబి దాతృత్వం
పర్యావరణ స్పృహ లేనప్పుడే ‘వృక్షో రక్షతి రక్షిత ‘అని చాటిన ధరిత్రి
జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి
నల్లని రాళ్ళనూ , నల్లని దేవుళ్లనూ ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ
యోగాతో ఆరోగ్యాన్నీ గీతతో వైరాగ్యాన్నీ గీతాంజలితో సాహిత్యాన్నీ
బహుమతి నిచ్చిన మహీమండలం
చుట్టుపక్కల మానవబాంబులు పుట్టుకొస్తున్న వేళ
మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల
నెత్తురోడుతున్న దేశాల దేహాలకు
శాంతి లేపనాన్ని పూసిన శ్వేత కపోతం
బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన
కారుణ్య మూర్తిని కన్న తల్లి
జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృత మూర్తి నా భరత మాత !!
ఏడు దశాబ్దాల క్రితమైనా .. ఇప్పుడైనా నా దేశ పతాకానికి మూడే రంగులు
సత్యం .. శాంతి … అహింస ..
నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే !
నా జాతి లక్ష్యం శోకమే లేని సరి కొత్త ప్రపంచమే !!
కవితలు
ఎన్నాళ్ళైంది వాన
వానాకాలం పొడవునా కురిసి
నేల దాహం నీ దాహం తీరేదాకా కురువు
మీ ప్రేమ పరిపూర్ణత సాధించే దిశగా
పరుగు పరుగున వచ్చి
చెరువు కట్ట రాతి ని ముద్దాడాలని
ప్రవాహ పరువం తహ తహ
సంద్రమెరుగని పల్లె పడుచు
రాతి ని తాకి కట్ట మీద పడే జల్లు లో తడిసి
పరవశించే
ఎప్పుడెప్పుడు దూకుదామని
ఆతృతలో వాగు
అలుగు రాళ్ళ లెక్కెట్టుకుంటూ
ఒంట్లు నేర్చుకుంటుంది
అలుగు పారితే నమ్మకం తో
కోసే యాట కోసం మైసమ్మ
కళ్ళల్లో వత్తులు వేసుకుని
ఎదురు చూస్తుంది
మోట బొక్కెన లో
నాన బోసిన వడ్లు మొలకెత్తి
ఎప్పుడు అలుకుతావని రైతుని
మడి దున్నమని అడుగుతున్నాయి
ముసురు లో
జారుతున్న కట్ట తోవ మీద
విన్యాసాలు చేస్తూ
కొక్కెరలు తల మీంచి కింది దాకా వేసుకుని
బడి బాట పడుతున్న పిల్లలు
ఎదురెక్కే చేపల కోసం
ఎర గాలాలతో వాగొడ్డున
సోపతి గాళ్ళు ముచ్చట్ల మురిపాల్లో
మంచు ముత్యమెరుగని మర్రి
ఆకాశాన్నంటిన తాటాకు కొసన
రాలనా వద్దా అని ఆలోచిస్తున్న వాన బిందువును
ఒడిసిపట్టుకుందామని నిరీక్షణ లో మర్రి ఆకు
కలిసి పెరిగిన
వేప రావి సహజీవనం లో
రాలే చినుకులు కొత్త దనాన్ని
సృష్టిస్తున్నాయి
మోదుగు పువ్వుపై
రాలిన చుక్క ఎరుపు రంగు పులుముకుని
తంగేడు పూల జత కలిసి
కొత్త సంధ్య కోసం దారి పరుస్తున్నాయి
అది నిన్నటి నీటిని,
ఈనాటి కన్నీటిని
పీల్చుకొని ఊపిరి పోసుకుంది.
ఆటంకాలని చీల్చుకొని,
చీకటి తొడుగుని
విప్పుకొని మొలకెత్తింది.
కొండగాలి కొంటెగా
హార్మోనియం వాయిస్తుంటే
అడుగుల్లో అమ్మోనియం నైట్రేట్
రైట్! రైట్! అంటుంటే
శ్రవణానందకరంగా
ఆకులు అల్లరి చేస్తాయి
నయన మనోహరంగా
కొమ్మలు ఊయలలూగుతాయి
కిరణజన్య సంయోగ క్రియతో
పరిసరమంతా
పత్రహరిత నర్తనమౌతుంది.
దాని వేర్లలో
నల్లని జాడలు ఇంకా ఉన్నాయి.
అయినా
ఆత్మీయతా వెలుతురు సోకినప్పుడల్లా
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది
[తెలంగాణ సిద్ధాంతకర్త కీ౹౹శే౹౹ కొత్తపల్లి జయశంకర్ గారి స్మృత్యర్ధం]
పల్లవి: జయ జయహే జననాయక జయశంకర జోహారులు
జనని తెలంగాణ కంట కురిసె అశ్రుధారలు ౹౹ జయ ౹౹
చరణం 1౹౹ తెలంగాణ కష్టాలకు కారణాలు వెదికావు
దాయాదుల దోపిడీల గుట్టురట్టు చేసినావు ౹౹ తెలంగాణ ౹౹
ఊరూరా ఉద్య్మాల సెగలు రగులజేసినావు
ఉవ్వెత్తున ఎగిసిపడే ఉప్పెనగా మార్చినావు ౹౹ జయ ౹౹
చరణం 2౹౹ ఉద్యమానికూతము రాజకీయ మార్గమని నీవు
భావజాల జ్వాలను రాజేసిన మేధావివీ ౹౹ ఉద్యమా ౹౹
తెలంగాణ పోరు నావ తెరచాపవు నీవు 2
దిశను నిర్దేశించిన ఉద్యమ దిక్సూచి నీవు ౹౹ జయ ౹౹
చరణం 3౹౹ నీ వాదనలో తెలంగాణ, నీ రచనల్లో తెలంగాణ
నీ గమనంలో తెలంగాణ, నీ గమ్యంలో తెలంగాణ ౹౹ నీ ౹౹
ఓ జయశంకర వాదమా! సాధించే తెలంగాణ
ఈ తెలంగాణ రాష్ట్రమే ఇక బంగారు తెలంగాణ!! ౹౹ జయ ౹
రోజుకో నిజం
రాత్రికి నాకు తగాదా పెట్టి
పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది.
ఒళ్ళు విరుచుకుని
కాలమెంత జాగానిచ్చినా
చీకటిలో నానిన మాటలలో
ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే
మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై…
కళ్లెదుటే పల్టీ కొట్టి
ప్రశ్నలుగా పుట్ట పగిలి
పాయలు పాయలుగా పాకే
ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో
మనసుకు నిద్రనప్పజెప్పి
కన్నార్పని భయంతో
కటిక చీకటిలో శరీరం ఎన్నో అనుభవాలకు చేసేది దాస్యమే .
ఇంతలో వేకువ వెన్నును గుచ్చగానే
నిన్న నిజం నేడెక్కడోనని వెతికే కళ్ళకు
పగటి నటనే ఓ వింతసమస్యగా
విస్మయించలేనిదే యుద్దానందం.
దారిపొడవునా ముళ్ల కాట్లకు
కళ్ళ వెంట మాటలు
చురుకు చురుకుమని జారి
తడిసే జాము జాములో
బొట్లు బొట్లుగా కదిలిన భావప్రవాహానికి
రాత్రికో నిజంలా
పగటికో అబద్దం కొత్త అవతారం.
క్షణం తీరికలేని మనసు ఆకలికి
ఆవిరయ్యే అందాలన్నీ
రుచిగల ఇష్టాలుగా
రాత్రి వేదిక కావడం అనివార్యం.
మనసును చంపుకోలేని శరీరం
శరీరాన్ని తెంపుకోలేని మనసు
పెనవేసుకుని ముడులేసుకుని
రోజుకోసారి కొత్తగా పుట్టడం
రోజుకోసారి వింతగా గిట్టడమనే
వింతానుభవాల నేపధ్యమే సాంగత్యం.
పగటి ప్రతిధ్వనిగా రాత్రిని
రాత్రి ప్రతిరూపంగా పగటిని
మనిషిని శాశ్వతంగా లిఖించి
మనసును నటింపచేయడమే సత్యం.
రోజుకో నిజం ఓ వైపు
పగటికో అబద్దం మరోవైపు
మద్య మనిషి పాదం
మనసు పథం వేరువేరుగా
మనిషి తనకు తానే భిన్నంగా
మనసును నగ్నంగా
బయట నిలబెట్టటమే
సత్యమైనది….స్వార్థమైనది …
స్వర్గమైనది….సొంతమైనది….
….చందలూరి నారాయణరావు
9704437247
సకల జీవుల బతుకు
చీకటి వెలుగుల అతుకు’బొతుకు
చీకటి విశ్రాంతి కోసమే !
వెలుగుతో మేల్కొని
వెలుగులో మేల్ కని
చీకటినీ గెల్వవచ్చు
చీకటిని గెల్వటమంటే
బుద్ధి పదునెక్కటమే
చీకటిని వెలిగించు’కోకుంటే
మనుషులు గెలువ’లేరు
ఎవరూ గుర్తించలేరు
పారతంత్య్రం మానవాళికి
మహాంధకార సదృశం
* * *
మున్ముందే ఝాన్సీ కీ రాణీ
పసిబిడ్డను ఒడి’నిడుకొని
అశ్వారూఢయై ఖడ్గం ఝళిపించింది.
ధిక్కార స్వరాలను అచటానికి
పరాయి రాయ్ రాయి ప్రభుత్వం
చట్టాలను మరింత బిగించింది.
ఉద్రేకం మిట్టమధ్యాహ్నమయింది.
* * *
“స్వాతంత్ర్యం నా జన్మ’హక్కు” అనే వాక్కు
‘లోకమాన్య’ తిలక మహామంత్రం.
“వందేమాతరం” బంకించంద్ర నినాదం.
ఈ వాక్యద్వయి ప్రతిపౌరుని
నోటిగూటిలో రెక్కలల్లార్చింది.
- * *
చెఱసాలలు చంద్రశాల’లైనాయి
ఉరితాళ్లు కంఠహారాలైనాయి
ఉప్పు చేయటమే సత్యాగ్రహమైంది
“వందేమాతరం”అంటూ ఆ తరమంతా
హర్ ఏక్ కదమ్ కదమ్ పర్ కదమ్
ముందడుగే వేసింది వీరావేశంతో
ప్రతి కరాన మూడు రంగుల జెండా
ప్రతి గళాన వందేమాతరం నిండా
దేశం దేశమే పోరాడింది
దేశం వేషమే మారిపోయింది
* * *
అది ఆగష్టు 15 , 1947 సుప్రభాత వేళ
భారత స్వాతంత్ర్య భానూదయ వేళ
స్వతంత్ర భారత సుస్వర పరిమళ హేల
* * *
యుగయుగాల పర్యంతం
స్వతంత్ర భారతం ఆద్యంతం
సమైక్య జీవన సంకేతం
శ్రేయోరాజ్య సంగీతం
అమర వీరులకు జోహార్లర్పిస్తూ
స్వాతంత్ర్య గీతం ఆలాపిస్తూ
రోజు రోజూ ఎదుగుతూ
సగర్వంగా బతుకుతూ
మనం భారతీయులమని
“సత్యం శివం సుందరం” గీతం మనదని
సంతోషంగా గొంతెత్తి పాడుతూ
జీవిద్దాం జీవిద్దాం శోభిద్దాం శోభిద్దాం!!!
మేరా భారత్ మహాన్
మేరా భారత్ మహాన్
కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!
కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !
వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!
బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!
స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్
గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి
ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!
కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది
అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది
పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!
నీవు లేని నీకోసం కవిత రాయాలని
ముప్పిరి గొన్న ఆలోచనల.. కలం చేత పెట్టాను
ఆరు పదుల పైగా నీ తో నడిచిన రోజులన్నీ
ఒకటొకటిగా మెదడు సందుగ దూకి నెట్టుకొస్తున్నాయి
నీవు లేని నీకోసం తన్నుకొస్తున్న అక్షర ప్రవాహం
కంటి సుడిగుండాల వలయాల చీల్చి వర్శిస్తూ..
మసక మసకగా కాగితం మీద వాలిన
పదాల పాదాలను నదీ జలమై అభిషేకిస్తూ..
బాపూ!నీవు లేని నీకోసం కవిత రాయాలనుకున్నా
నీ చుట్టే నేనున్నానని భుజం తడుతున్నట్టు..బాపు
ముందు రోజు మల్లెపువ్వులా నవ్వులు చల్లి
మనవడి పెళ్లి శుభలేఖ ఆసాంతం చదివి
అందులో నీ పేరు ఉందని మెరిసి
విద్యుద్దీపకాంతుల్లో ఇల్లంతా బాగుందని మురిసి
చక్రాల కుర్చీ మీద ఫోటోలకు ఫోజులిస్తివి
చూసి అబ్బురపడితివి కదా బాపూ..
పత్తి పువ్వు లా చూసుకున్నాము కదా …
అంతలోనే ఏమైంది…ఇంటి నిండా చీకట్లు
చెప్పా చెయ్యక ఎలా వెళ్ళిపోయావు బాపూ..
మేమంతా ఉన్నతంగా ఎదగాలి అన్నావు
నీవేమో ఉన్నంతలోనే బతకాలనుకున్నావు
నీ స్వప్న సాకారం కోసం మా చదువుల కోసం
మాటిమాటికి ఇరుకిరుకు ఇళ్లకు మారుతూ
కిరాయి ,కిరాణా దుకాణం ఖాతా,ఫీజులు బట్టలు పుస్తకాలు,రోగాలు..మధ్యతరగతి ఖర్చులకై..
బతుకు తెరువు కోసం చాలీచాలని
ఆనాటి అత్తెసరు జీతాల బడిపంతులు నీవైనా
నిర్మొహమాటంగా గలగల మాట్లాడే నిష్కపటి వై
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడివై
ఎదిగి జీవించిన ఆత్మాభిమానపు జెండా నీవు బాపు
ఉద్యోగానంతరమే అసలు జీవితమని
అరిగిపోయిన శేష జీవితం కాదని అది అశేష మని
సుప్తంగా ఉన్న అంతశ్చేతనను తట్టిలేపి
పసితనపు ఛాయతో కవిత్వమై వెలిగావు
ఒక విశాల ప్రపంచంలో ఒదిగి పోయావు
తనదైన భావన పరిధిలో తట్టిన ప్రతిదీ
కవిత్వీకరించి పిలిచిన ప్రతి చోటా
దూరాభారమనక వయసును మరిచి
వినిపించి పొంగిపోయావు కదా!బాపు
కలల కుంచెతో అక్షరీకరించి
కలల కొలిమి తో స్నేహించి
కలల సంతకం చేసిన చెలిమి నీవు
కలుపుగోలుతనం అసలు రూపం నీవు
కోపం లోనూఆర్ద్రతలోను శివుడి పేరును
సార్థకం చేసుకున్న ధరణీశ్వరుడవు నీవు
అవును భోళాశంకరుడివి నీవు నీ వని
నీవు లేని నీకోసం ఏమి రాసినా…
గుర్తొస్తే చాలు బరువెక్కి ఎక్కెక్కి ఏడిచే గుండెలు
మర్చిపోతే కదా!చాక్‌పీస్ చేతులతోఎందరికో
జ్ఞాన గవాక్షాలు తెరిపించిన బోధి వృక్షాన్ని…
ఆ నీడలో మమ్ము నడిపించిన జ్ఞాన సుగంధాన్ని..
అన్నీ ఉన్నా నీవు లేవు
నీవే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి
మా అందరి హృదయాల్లో ఏదో కలత
భావా లన్ని గజిబిజిగా
సందడి చేస్తున్న వేళ
ఏది మంచో ఏది చెడో
సందిగ్ధంలో ఉన్న వేళ
ఉదయాన్నే చూసినప్పుడు
ఉరకలు వేసిన మనసు
సాయంకాలం కాగానే
పెన్ను ముందుకు కదలనంది
సాయం కోసం వెదికే కష్ట జీవుల చేతుల్లా
భావాలన్నీ ఒక్కసారి నా పై
దాడి చేస్తున్న క్షణాలు
కవి కావాలన్న కులం కావాలి
కవిత ప్రచురణ పొందాలన్న
నా వెనుక అభయహస్తం కావాలి
కవిత కాని కవిత్వం
పలుకుబడితో రాసే కవిత్వం
అనుభవం లేని కవిత్వం
భావం లేని కవిత్వం
ఓ చిరునవ్వు నవ్వుతూ
నిన్నటి నా కవిత
నేడు మరొకరి పేరుతో
అన్ని పేపర్లలో పేరు చూసుకుని మురిసిపోతూ
ఉన్న క్షణాలు
పెన్ను ముందుకు కదలనన్నది
సహాయం చేసే చేతులు
కవితలు రాసే చేతులు
మార్పిడి చేసుకుంటున్నాయి
ఇందులో ఏది గొప్ప
నేనంటే నేనని పోటీపడి మనసున సంఘర్షణని రేపుతున్నాయి
కదలికలో సౌందర్యాన్ని
ప్రతి పువ్వు ప్రతి ఆకు ఇంద్రధనస్సులలా
ఊగీస లాడుతూ
ఆనంద డోలిక లతో తేలిపోతూ కవిత్వమే సాగిపోతూ పిల్ల గాలిలో కలిసిపోతుంది ఆ భావాల్ని నా మనసులో ఉద్వేగాన్ని ఆనందాన్ని నింపుతూ ముందుకెళుతోంది
పెన్ను ముందు కు కదలనన్నా
ఒకానొక శుభోదయం కోసం
సంయమనాన్ని వెంటబెట్టుకొని మునుముందుకే వెళ్తోంది
—*—-
జులపాల జుట్టోనికి
దుఃఖం ఎంత ఇష్టం అంటే
నాటుసారాను ఫూటుగా తాగేంత
ఎక్కడ ఏడుపులు వినిపించినా
వాలిపోయి తనూ ఇంత కన్నీటిని
జమచేసే వాడు
వాడికి దుఃఖం ప్రియ నేస్తగాడు
పెల్లిపెటాకుల్లేని చెంచితగాడు
ఊర్లూ పట్టుకుని తిరిగేవాడు
అందరి స్నేహాల్లోకి కుశలంగా ఒదిగేటోడు
బేకారు కట్ట వద్ద
పులి జూదమై గాండ్రించే వాడు
బైరాగుల సవాసం
బైరన్నల తోటి కల్లు కబుర్లు
వీడికి ముదిరిన మోహం
దర్గాల వద్ద ఫకీర్ల తో
ప్రియ ముచ్చట్లు
పీర్ల చావిడి కాడ
మంచి నేస్తగాడు కుక్కలకు
జాతర్లలో గొరవయ్యలతో
ఒకటే కలిసి తిరుగుడు
జుట్టు పొలిగానితో
కల్లుముంతల పోటిలో వీర నెగ్గుడు
అంత్రాలు కట్టే పీరు సాయబుతో
బాగా సావాసం
కుదిరితే నాలుగైదు వారాలు
ఊరిడిచి వనవాసం
మంగలి సవారి
కొలిమి ఉసేను
బెస్త గాలిగాడు
ఉప్పర ఎల్లయ్య
వీడి జిగిరీ దోస్తులు
గాలి వాటం బతుకు
ఫికిర్ లేని జిందగీ
చెట్టు పుట్ట సత్రాల వద్ద కునుకు
బతుకు పై బెంగ లేనోడు
అన్ని తావులు నావేననే మార్మికుడు
ఆశల్ని వదులుకున్న రికామిగాడు
పగల్లు రాత్రులకు
మాసిన చొక్కాను తగిలించి
సగం పాడి వెళ్ళిన
బుల్బుల్ పిట్ట గీతాన్ని ఆలపిస్తూ
కీచురాళ్ళ చప్పట్లను స్వీకరిస్తూ
కడుపులో ఆకలికే కాక
దుప్పటిలో దోమలకీ చోటిస్తూ
అందరి దుఃఖాల్ని
స్వప్నం లో దేవదేవుడికి వినిపిస్తూ
కోడి కూతలో మళ్ళీ మేల్కొంటాడు
మరో దిమ్మరి రంగుల్ని
రేపటికి సాపు చేసుకుంటూ .