సీసము:- అమ్మపాలు బలము
లందించు తీపి గా
నల్లారుముద్దుగా నారు నెలలు;
అయ్య పెంపకమున నదుపాజ్ఞలను జూప
నగుపించు కారమై యతని తీపి;
వలపులు సుఖములు కులుకులు తళుకులు చెలిమియు కలతల దెలుపు పులుపు ,
ఇష్టమైన పనుల కష్టము గనరాక
తినగ తినగ చేదు తీపి నిచ్చు!
తే.గీ ౹౹ వగరు రుచిలేక నారోగ్యవంతమగును,
మితముగా జేర్చ రుచులకు జతయె యుప్పు !
శుభకృదబ్దాది హార్దికశోభలందు,
మనుజుల నుగాదిపచ్చడి మైత్రి బెంచు!
కవితలు
ఉదయసూర్య తేజమై ” మయూఖ విషయ ” వెలుగు నిచ్చుగాక !
మధ్యాహ్న మార్తాండుడి వలె- మతలబుల నిగ్గు తేల్చి, పదుగురికి పంచుగాక!
అజ్ఞాన తిమిరాల బాపు ” మయూఖ “మై బ్రహ్మాండాలన్నిటా విస్తరిల్లు గాక!
పండిత పామర భేదమేలేక ” మయూఖ భాసమై ప్రత్యక్షరం యువతకు ప్రకాశమగుగాక!
ఆదర్శాలన్నీ ఆచరణలోరాగా ఆశయాల తళుకీను మయూఖ గా
రచనా జ్వాల సమాజ సమస్య పరిష్కరింపబడు సూచనలిచ్చుగాక!
పూర్వకవుల దీధితి- అభ్యుదయ కవుల అభ్యున్నతి మయూఖ మై – భావికవులకు ప్రేరణై
చంద్రుల కిరణ సమమగు గాక!
విలువల సమాజ నిర్మాణపు పునాదిగా మయూఖ పీఠమగుగాక !
ద్వైమాసిక పత్రిక- మాస పత్రికై,పక్షమై,వారమై ,దినపత్రిక యై దినదినాభివృధ్ధి యగు గాక!
మయూఖ విశ్వమంతా ప్రసరించి,అన్నిరంగముల అభివృద్ధి గాంచుమా! మయూఖమా
“శార్వరి బతుకు చీకట్లో సాగిపోయే
ప్లవరు జనులంత పడరాని పాట్లుపడిరి
నేటి కైనను బతుకాశ నిజము చేయ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
కోవిడను వ్యాధి బీదల కొంపముంచె
చేయ పనులేవి లేకను చెదిరె మనసు
ఉసురు సురని బతుకువారి యుసురు నిలుప
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రెండువత్సరాలుగ ప్రజలేమి తోడ
చెప్పలేనట్టి బాధల చిన్నబోగ
ఊపిరిని పీల్చు కొనజేసి యుత్సవముగ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖము గూర్ప
రోగ బాధలు లేనట్టి రోజు లొచ్చి
కష్టజీవులు సుఖపడుకాలమొచ్చి
లోకమంతట శుభములు కేకవేయ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రైతు శ్రామిక జనులంత రేయి పగలు
శ్రమకు తగిన ఫలితములు సొంతమవగ
సర్వవృత్తుల జనులెంతొ సౌఖ్యమొంద
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
భారతీయులందరునిక బాధలేక
సుఖము సంతోషములనెంతో చూరగొనగ
ఈ యుగాదియు నూరట నిచ్చుచుండ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
చం.శుభములొసంగుచున్ ప్రకృతి శోభలతో నెదమోదమొందగా
ప్రభవమయెన్ శుభోదయ ప్రభాత మయూఖములే వసంతమై
సభికుల లాస్యలాహిరి ప్రశాంత మనోహర రంగభూమియం
దభయముదెల్పుచున్ శుభకృతై తరలెన్ ఘనమౌయుగాదియై
ఉ.తీయని గూఢముల్ బ్రతుకు తీరును మార్చగ, వేపపూతయే
మాయని గాయముల్ మరచి మౌనముదాల్చగ,నుప్పు కారముల్
సోయగమౌచు జీవితపు సొంపులు హంగులు తీర్చిదిద్దగా
సాయమొనర్చు షడ్రుచుల సారముగూర్చు నుగాది పచ్చడై
ఉ.కోకిల సుస్వరమ్ములును కొమ్మలరెమ్మల లేత పత్రముల్
సాకరమై మనోహర వికాసములై వనశోభనింపగా
చీకటి వీడ జాతకము చింతలు బాపెడి యోగమందగా
యీకలి దోషముల్ తొలగి యీశ్వర దీవెనలే స్రవించులే
శా.పంచాంగశ్రవణమ్ము పాపహరమై భావిన్ ప్రసాదించగా
సంచారమ్మొనరించుచుండు గ్రహముల్ చైత్రమ్ముతో సాగుచున్
పంచున్ వత్సర సత్ఫలమ్ములదె సంప్రాప్తమ్ములౌ రాశులున్
పెంచున్ ధైర్యము జాగ్రతల్ ప్రజలలో విచ్చేయు సన్మిత్రతన్
కాల మెప్పుడు ముందుకే కదలుచుండ
జ్ఞాన సంపన్నుడయ్యెను మానవుండు
అయిన హత్యలు యుద్ధాలు ఆక్రమణలును
ఆప లేనట్టి యిట్టి విజ్ఞానమేల 1
తీయగా రాగమ్ము తీయవే కోకిలా
కఱకు గుండెల లోన కరుణ గలుగ
చలువ చేయగరావె మలయానిలాంగన
కోపాగ్ని చల్లారి కుదురు కొనగ
తెల్లని మల్లెలు చల్లుమా వల్లికా
పగల భావము లన్ని ప్రణయ మవగ
తరులార రెక్కల తలిరాకు నింపుడీ
బీటలౌ మనముల ప్రేమ లోలుక
అరుణ కిరణాల రథమెక్కి తరలి రమ్ము
అంద మంతయు లొకాన చిందు లాడ
సరస మాధవా శుభ వసంత మవగ
వచ్చు నీకు నిదియె శుభ స్వాగతమ్ము 2
తెలుగు జనాలు షడ్రుచుల తీరును పచ్చడి గా గ్రహించి యీ
కలుములు లేములున్ మరియు కష్ట సుఖమ్ముల రాక పోకలన్
దలతురు గాని యాశలను తప్పక పెంచుక చూచు చుందు రా
ఫలముల నీయ రాగదవె| పండుగ వోలెను నవ్య వత్సరా | 3
వైద్య మెంతగా పెరిగిన , వాయు వందు
ప్రాణ హరమైన కీటముల్ ప్రాకి పోయె
మానవులు తప్పు చేయుట మాన రైరి
మనిషి తడి యెండి పోవుటే మనకు శిక్ష 4
ఎప్పుడు వచ్చి పోయెదవు నెన్నియొ కోర్కెల పంచి పెట్టుచున్
ఇప్పుడు తీరునింక నని యెంతోముదమ్మున చూచు చున్న మా
తప్పులు దిద్ది సర్వ శుభదాయిని వైన యుగాది నీకు మే
మెప్పుడు స్వాగతించెదము, మీరిన యాశల త్రుంచ బోకుమా | 5
దేశము లందు వైరములు తెచ్చి, యమాంతము పోరు పెట్టి,యా
వేశము నింపి ప్రాణముల పేల్చి నివాసము కాల్చి వేసి యా
కాశము వైపు చూపినది కాలము కాలుడు గాప్లవాబ్ది ,రా
వే, శుభ కృత్ సార్థకము వేయివిధమ్ముల చేయు మాధవా| 6
చైత్ర రథమెక్కి భాస్కర శస్త్రములతొ
దుష్ట రాక్షస గుణముల దునిమి వేయ
శ్రీ వసంతమాధుర్యము చిహ్న ములుగ
సకల జనులకు మేలుగా సాగి రమ్ము 7
ఈ శుభ కృత్ వత్సర మున
రాశులు గా పంచి పెట్టు ప్రజలందరకున్
పేశల మైన గుణమ్ముల
దేశము సుఖ శాంతులందు తేలి సుఖించన్ 8
అర్థ కామమ్ము లందున అణగి పోక
ధర్మ మార్గమ్ము వైపుకు ధరణి యంత
కదలి సాగగ నీవె దిగ్దర్శనమ్ము
నగుచు రావయ్య నీకు నమస్కరింతు 9
పల్లవాలపై పచ్చ రంగు తో
లిఖియించిన స్వాగత లేఖ
నోట కరచుకొని గొంతు సవరించి
పాట పాడినది కోకిల దూత
పిలుపునందుకొని వసంత రాజు
చైత్ర రథము పై పుడమికి రాగా
రాలిన పువ్వులు తివాచీ పరువా
రాలే పువ్వులు అక్షితలైనవి
మధువు టీ గలు విందు చేయగా
మధువు గ్రోలిన మత్తు మదాన
నిదుర పోయెను వన రా రాజు
రెక్కల మాటున దాచుకున్న
మంచు బిందువుల పన్నీరు జల్లుతూ
మేలుకొలిపినవి కుసుమ రాణులు
కళ్ళు తెరిచిన రుతు రారాజుకు
కనిపించిందోక నందన జాన
ఆమె మోము చందమామ
పేరేమో శుభకృత్ నామా
చైత్ర వసంత సుధాంబుధి
నేత్రములకు పర్వ మగుచు నిండెను మదిలో
స్తోత్రము లయ్యెను కోయిల
గాత్రమునందుద్భవించు గానామృతముల్!
🍀🍀
తెల్లారెన్గద నేడుగాది శుభమై తీండ్రించు సౌదామినై
ఉల్లాసంబుగ లోకమంత మురియన్ ఉప్పొంగు వాసంతమై
సల్లాపంబులు చేసిరందరెదతో సౌహార్ద సంతుష్టులై
కల్లోలంబగు మాన వాళికిది యే
కాస్తంత యాహ్లాద మౌ!
🍀🍀
ఆకుపచ్చని చీర ఆమని అందాల
వనకాంత మురిసెను వలపు సిరిగ
మధుపానవిందులో మత్తిల్లి ఝమ్మని
భ్రమరమ్ము నిలువెల్ల పరవశించె
గాన కచేరీలగంధర్వ లోకమై
పికరాగ మాలికల్ ప్రేమ పంచె
నల్ల మబ్బుల నీడ నాట్య మయూరము
పురివిప్పి పుడమిపై పులకరించె
మనసు మధుమాస ధ్యాసలోమరులు నిండి
కలిసె క్రొంగొత్త జంటలు కలలు పండి
తెలిపె రతిరాజు వారికి తెలుగు వేడ్క
వెలిసె వాసంత శుభకృతు విమల కీర్తి!
🍀🍀
మందార గన్నేరు మమతా నురాగాలు
చేమంతి బంతుల చిందులాట
పారిజాత కలువ ప్రణ యాతి శయములు!
కమల గులాబీల కనుల పంట
కస్తూరి విరజాజిఘన పరీమళ ములు
పున్నాగమోదుగు పూల సొగసు
మల్లె సంపంగుల మన్మధ బాణాలు
నంది వర్ధనముల నాట్య కేళి!
సకల కుసుమాలు కొలువైన సంబరమున
పికము శుకముల పలుకులు ప్రియము గొల్ప
మామిడాకుల తోరణమయము గాగ
వచ్చె వాసంత విభవమ్ము వసుధ మెచ్చ!
🍀🍀
కాముడు సంతసించు శుభకాల వసంత లతాంత కాంతిలో
కోమల పుష్పసౌరు యెలకోయిల పాటల పల్ల కీలలో
నామది యూయలూగినది నవ్య సుధాంశు మయూఖ వాహినీ
భామల సోయగమ్మువలె భావ సరాగప్రశాంత చిత్తమై!
బయట
ఆకాశం తేటగా నిర్మలంగా వుంది
గాలి స్వచ్చంగా మంద్రంగా వీస్తోంది
వెన్నెల చల్లగా కురుస్తోంది
లోపల
గది ప్రశాంతంగా వుంది
కవే
తన అసంపూర్ణ కవితను ముందేసుకుని
దుఖంగా వేదనగా కోపంగా
చిన్న పిల్లాడిలా
కాళ్ళూ చేతులూ ముడుచుకుని
నిద్రలోకి జారుకున్నాడు
అసంపూర్ణ కవితలోని పదాలు
హార్మోనియం మెట్ల లాగా
ఒక్కోటీ లయబద్దంగా కదులుతున్నాయి
సవ్య రాగాన్ని పలుకుతున్నాయి
నవ్య భావాల్ని ధ్వనిస్తున్నాయి
అన్ని పరిధులూ దాటి
కాలం స్థబ్దతలోకి
అన్ని పరిమితులూ దాటి
మనుషులు స్వార్థం లోకి
దిగజారి పోయినా
ఒక్క కవే తన
అసంపూర్ణ అసమగ్ర కవితకు తోడుగా
మరిన్ని తెల్లకాగితాల్ని ముందేసుకుని
కొత్త మాటల్ని చెక్కుతాడు
నిద్దట్లోంచి మెలకువలోకి
చీకట్లోంచి వెలుతురులోకి
సరికొత్త దారులు తీస్తాడు
కవి దివిటీ అయితే
కవిత దిక్సూచి
పొగమంచు తో భూతలం
ఆయెను అతి శీతలం
॥ పొగ..॥
ఉపతరిలపు ద్రోణియో
చలి గాలుల శ్రేణియో
ఉరుమనెంచు ప్రకృతి యో
ఉనికి నెల్ల వణికించెను !…
॥ పొగ..॥
విమల ధవళ వస్త్రంతో
విధిగా అగుపించునట్లు
దేశమెల్ల పొగమంచను
తెలిముసుగుతొ పలకరించె!
॥ పొగ..॥
హేమంతానికి ప్రేమగా
సీమంతం జరుపసాగె
“శిశిర” శిశువునే కనగా
ఋతుచక్రం తిరగ సాగె !