మొక్క
వంశవృక్షం
పువ్వు
రాసింది సంక్షిప్తం
తరతరాల పరంపర
రూపురేఖల చరితం!
బయట
ఆకాశం తేటగా నిర్మలంగా వుంది
గాలి స్వచ్చంగా మంద్రంగా వీస్తోంది
వెన్నెల చల్లగా కురుస్తోంది
లోపల
గది ప్రశాంతంగా వుంది
కవే
తన అసంపూర్ణ కవితను ముందేసుకుని
దుఖంగా వేదనగా కోపంగా
చిన్న పిల్లాడిలా
కాళ్ళూ చేతులూ ముడుచుకుని
నిద్రలోకి జారుకున్నాడు
అసంపూర్ణ కవితలోని పదాలు
హార్మోనియం మెట్ల లాగా
ఒక్కోటీ లయబద్దంగా కదులుతున్నాయి
సవ్య రాగాన్ని పలుకుతున్నాయి
నవ్య భావాల్ని ధ్వనిస్తున్నాయి
అన్ని పరిధులూ దాటి
కాలం స్థబ్దతలోకి
అన్ని పరిమితులూ దాటి
మనుషులు స్వార్థం లోకి
దిగజారి పోయినా
ఒక్క కవే తన
అసంపూర్ణ అసమగ్ర కవితకు తోడుగా
మరిన్ని తెల్లకాగితాల్ని ముందేసుకుని
కొత్త మాటల్ని చెక్కుతాడు
నిద్దట్లోంచి మెలకువలోకి
చీకట్లోంచి వెలుతురులోకి
సరికొత్త దారులు తీస్తాడు
కవి దివిటీ అయితే
కవిత దిక్సూచి
పొగమంచు తో భూతలం
ఆయెను అతి శీతలం
॥ పొగ..॥
ఉపతరిలపు ద్రోణియో
చలి గాలుల శ్రేణియో
ఉరుమనెంచు ప్రకృతి యో
ఉనికి నెల్ల వణికించెను !…
॥ పొగ..॥
విమల ధవళ వస్త్రంతో
విధిగా అగుపించునట్లు
దేశమెల్ల పొగమంచను
తెలిముసుగుతొ పలకరించె!
॥ పొగ..॥
హేమంతానికి ప్రేమగా
సీమంతం జరుపసాగె
“శిశిర” శిశువునే కనగా
ఋతుచక్రం తిరగ సాగె !
కలిసి నడిచే మనం-కాదులే చెరిసగం
పతిదేవుణ్ణి నేను-చరణదాసివి నువ్వు
ఆధిపత్యం నాది : నాదే పైచేయి
ధర్మపత్నివి నీవు- నీవే నీతల కొంత దించు
నిన్ను వీధిలో అమ్మే దృశ్యాల తాలూకు కమురు వాసన
నిన్ను జనారణ్యంలోనెట్టిన వెగటుదనం
జూదంలో ఒడ్డిన పురాణ మై తోస్తున్నది
పాతివ్రత్యం పరమ భూషణమనే పాత కథ విన్న చెవులు
కొత్త చరిత్రలేమి వింటాయి ?
అన్యమైనవో అనన్య సామాన్యమైన వో
నిను ఏం తీరున చూపెడతాయి
వంశాన్ని నిలబెట్టడమె
కదా నీ వంతు-మాంగల్యం తంతు
నటి గా సఖి గా దాసిగా దాదిగా నీకెన్నో రూపాలు
అయినా దూతికగా
నీజాతి తోనే నిను తార్చాలనుకుంటున్న
మాయాప్రపంచం లో నీవు
తననుగని పెంచేటి సామర్థ్యం నీకు
ఎంతున్నా
అబలవే అంటాడు
అపహాస్యం చేస్తాడు
శీల సంస్కారమే
తగునమ్మ నీకసలు అంటాడు తరుణీ అవే నీ నగలని నమ్మిస్తాడు
తన పనులు వికటించే దాకా
నిన్ను గుర్తింపు గుచ్ఛాలలో విరిసే
“ముగ్ధ”వే నీవంటు ముచ్చటగా పిలుస్తాడు
నీవు మరణిస్తే వేరొకతె నాకు సతి నేను చనిపోతేను సతి నీవంటు నీకు “బ్రతుకు చితి ” అనీ తీర్మానిస్తాడు
బతుకుబండి నడకంతా భయాల బాటలోనే
సెలబ్రిటీస్ లలో
అభద్రతా భయం
తల్లిదండ్రులలో
ఓల్డ్ ఏజ్
హౌస్ భయం
ఉద్యోగాలులేక
యువతలో
బతుకు భయం
నిజాయితీపరులకు
లంచం భయం
పేదవాడికి వడ్డీ భయం
ఆటో వాడికి
ఫైనాన్సర్ భయం
తాగుడు వల్ల
భార్యా పిల్లలకు
భయం
ప్రయాణీకుడికి
టిక్కెట్టు ధర
బాదుడు భయం
ఖాళీ జాగా వాడికి
భూ కబ్జాదారుల
భయం
ఓట్ల కోసం
హిందూ ముస్లింల
విభజన భయం
ధర్మ సంసద్ లో
తీవ్రవాద భయం
ప్రభుత్వానికి
ఉచితాల భయం
స్కూల్ ఫీజులవల్ల
పేరెంట్స్ కు భయం
చిన్నారులకు
మొబైల్ ఫోన్ ల
భయం
పార్టీలో
నిజాయితీపరులకు
గెంటివేత భయం
ప్రార్థనాల
యాలలో
నిర్వాహకుల భయం
కరోనా కోర్సుకు చిక్కుతామేమోనని
ప్రపంచ మానవాళికి
భయం
కోవిడ్ షీల్డ్
తీసుకున్నా భయం
Covid 19
తీసుకోకపోయినా
భయం
మారు పేరుతో
వచ్చిన వోవిుక్రోన్తో
భయం
చివరికి దేశ దేశాల ప్రధానరక్షకులకూ
ప్రాణ భయం
మరి సామాన్యుడికి ఇక
ఏది భద్రత సుఖం ?
అందరికీ
ఇక దైవమే అభయం.
ఎన్నో స్మృతులను దాచుకునేది
ఎన్నో రహస్యాలను గుప్తపరుచుకునేది
ఎన్నెన్నో ఆనందాలను గుర్తుచేసేది
మరెన్నో నిగూఢ మధనాలను నిరంతరం చవిచూపేది
ఇంకా ఎన్నో మరెన్నింటినో
తనలో దాచుకొని
నిరంతరం నాకు నన్ను గుర్తు చేసే
నా మనసిజ నా నేస్తం
నాకు మాత్రమే సొంతం
నా మనసిజ
నా దిశా నిర్దేషిణి
నా పూర్ణ స్వరూపిణి
నా మనసిజ
అమ్మ నవ్వితే…
గుత్తులు గుత్తులుగా పూసిన
శిక్కుడు పూల లెక్కుంటది
అమ్మ కోపం చేస్తే…
పడమటేల సూరీడు
సుర సుర కాలినట్టుంటది
అమ్మ ప్రేమ చూపితే…
తేనె జడి వానలో
నిలువునా తడిసినట్టుంటది
అమ్మ యెదకద్దుకుంటే…
ఏండ్ల నాటి భారమంతా
ఒక్కసారిగా తీరినట్టుంటది
అమ్మ నా నెత్తి నిమిరితే…
వెయ్యేనుగుల బలం
ఒంట్లో చేరినట్టుంటది
ఆ.వె. మూడు లింగములను ముద్దుగా కలుపుతూ
ఉద్భవించె తెలుగు ఉజ్వలముగ
భాషలను గెలిచెడు భావంబు కలిగిన
ఉచితమైన భాష ఉర్విలోన!
ఆ.వె. కోరుచు తినిపించె గోరు ముద్దలుపెట్టి
అమ్మ నేర్పె జగతి కాంధ్ర భాష
వర్ణమాల తోడ వయ్యారములు చూపు
కన్నతల్లి లాంటి వెన్నభాష!
ఆ.వె. కవుల కలములందు కలకాలమును నిల్చు
నవరసమ్ములు పాడు నాందిభాష
మదిని దోచు తెలుగు మాధుర్య రసధుని
మానవీయ భాష మాతృభాష!
ఆ.వె. నన్నయార్య జయము ననువదించిన భాష
వెలుగులిచ్చినట్టి తెలుగు భాష
తిక్కనెర్రనలకు తీపి చూపిన భాష
కాకునూరి యప్ప గ్రంథభాష!
ఆ.వె. ఇంటి ఇంటిలోన నింగ్లీషు చదువాయె
అమ్మ నాన్న పిలుపు లాగమాయె
అచ్చతెనుగు పలుకు లాంతర్యమును మల్చు
ఇంపు లేని యాంగ్ల ఇచ్చ వీడు!
సంవత్సరానికి
ద్వితీయ సంతానం
ఇంటికి రెండో బిడ్డ
రూపుకు చిన్నది
ఇరువది ఎనిమిది
రోజుల నెల బాల ఇది
నాలుగేళ్ల కోసారి
కొసరు వడ్డిస్తది
లీప్ ఇయర్
తన సార్థక నామధేయం
బరువు బాధ్యత లేదు
పండుగల మోత లేదు
ఉరుకు పరుగు లేదు
ఉరుము మెరుపు రాదు
చలి లేదు వేడి లేదు
చక్కని వాతావరణం
ముడుచుకోదు
మూలకు ఉండదు
ఎండకు ఎండదు
వానకు తడువదు
తెలుగు హేమంత
శిశిర ఋతువుల చుట్టం
ఫాల్ ఫీల్ ఇచ్చే సీజన్
ఫీవర్ రాదు
పవర్ పోదు
పబ్లిసిటీ ఉండదు
ఉద్యోగస్తుడికి ఉపకారి
పనిదినాలు సెలవుదినాలు
సమ వాటా కలిగి వుంటది
పిల్లలకు పరీక్షలుండయి
తల్లిదండ్రులకు ఫీజుల
పరీక్షలుండయి
అందరికి ఫిదా ఇది
ఫికరు లేని ఫిబ్రవరి…