ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రపంచంయాంత్రికయుగంగా ఎప్పుడైతే మారిందో అప్పుడేపర్యావరణమూ కలుషితంకావడం ప్రారంభమైంది. ఈ సృష్టిలోని ప్రాణులన్నింటిలో బుద్ధిజీవి మానవుడు. కానీ బుద్ధిగలిగిన మనిషే నేడు మితిమీరిన స్వార్థంతో ప్రకృతి, సృష్టిలోని సమతౌల్యందెబ్బతినడానికి కారణమవుతున్నాడు. ప్రకృతిశక్తులను విచక్షణారహితంగా వాడుతూ పర్యావరణకాలుష్యానికి దోహదపడుతున్నాడు. అందువల్ల నేటి సామాజికసమస్యలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం.
ఈ సమస్యను గుర్తించిన ఎందరో తెలుగు రచయితలు తమ రచనలద్వారా పర్యావరణ స్పృహను తీసుకొస్తున్నారు. నేడు సాహిత్యంలో అత్యంత విలువైన వస్తువు పర్యావరణం కావడంవల్ల తమ రచనలద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రబోధిస్తున్నారు. ప్రజలను జాగృతం చేస్తున్నారు. కర్తవ్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మైనంపాటి భాస్కర్, పెద్దింటి అశోక్ కుమార్, పాపినేని శివశంకర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, మధురాంతకం మహేంద్ర, సలీం, కస్తూరి మురళీకృష్ణ, చిత్తర్వు మధు,సడ్లపల్లి చిదంబరం, గన్నవరపు నరసింహమూర్తి, గుజ్జారి రామచంద్రరావు,కె. వరలక్ష్మి,ఒమ్మి రమేష్, కాలువ మల్లయ్య, బెలగాం భీమేశ్వరరావు, అప్పిరెడ్డి హరినాథరెడ్డి వంటి ఎందరో కథా రచయితలు పర్యావరణ చేతనపై రచనలు చేస్తున్నారు. వారు రాసిన కొన్ని కథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
1. భూ కాలుష్యం : పర్యావరణంలో జరుగుతున్న కాలుష్యాల్లో భూకాలుష్యం ప్రధానమైంది.మనుషులు తమ స్వార్థంకోసం పెరుగుతున్న పారిశ్రామికీకరణతో ఎన్నోరకాల కల్తీ ఎరువులు విత్తనాలు మందులు తయారుచేసి వాటిని ఉపయోగించడం ద్వారా భూమి కలుషితమవుతూ ఉంది. భూమి మాత్రమే కలుషితంకాకుండా పండించిన పంటలు మొత్తం రసాయనాలతో నిండిపోతున్నాయి. వాటినితినడంవల్లఎన్నో వ్యాధులకు మనిషి దేహం కేంద్రం అవుతూ ఉంది. ఈస్థితిపట్ల రచయితలు గాఢంగా స్పందించారు.
విదేశీపంటలను ఆహ్వానించి వాటిద్వారా మననేల, నీరు, గాలివంటివాటన్నింటినీ కలుషితం చేసుకుంటూ మనపైన మనకే హక్కులేని పరిస్థితిని మన ప్రభుత్వం కలిగించింది. ఈ నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు” అనే కథను రాశారు. ఆంధ్రప్రదేశ్లోని సిరిసిల్ల ప్రాంతం సర్వాయి పల్లెలో గులాబీ పూలసాగును చేపట్టి వాటికి రసాయనిక మందులు స్ప్రే చేయడంవల్ల ప్రజలు ఉక్రిబిక్కిరి అయిన తీరుని చెప్తూరాసినకథ. మరోవైపు ఆహార భద్రతపై, దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడంతో విదేశీ మార్కెట్లు విచ్చలవిడిగా దేశంలోకి వచ్చాయి. ధాన్యంరేటు పడిపోయి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రారంభించడం, వాణిజ్య పంటలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగా కౌలుదారు చట్టాన్ని ప్రభుత్వం మార్చడంవల్ల రైతులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం జెనిటికల్ ఫుడ్స్ ప్రాజెక్టుకు అనుమతిస్తే, దానికి పెద్ద ఎత్తులో రసాయనాలు వాడాల్సి ఉంటుందని అదే జరిగితే వాటిని తిని ఎన్నో సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుందంటాడు కథలో జర్నలిస్ట్. విదేశీ కంపెనీలు ఆర్థిక, జన్యుపరమైన పంటలను మనదేశంలో ప్రవేశపెట్టడం, ఆ పంటలకు విపరీతంగా రసాయనాలను ఉపయోగించడంవల్ల మనభూమి నీరు గాలి అన్నీ కలుషితమైనాయి. దానితో ఎన్నో జబ్బులకు ఆలవాలమై మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రచయిత ఆవేదనతోఆవిష్కరించినకథ.
రసాయనిక ఎరువులు, మందులవల్ల ఒక రకమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, పాలిథిన్ వాడకంవల్ల మరోరకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పాలిథిన్ వాడకంపై ఉండే మోజును వాటి వల్ల జరిగే నష్టాన్ని తెలియజేస్తూ డా. కాలువ మల్లయ్య “గ్లోబలైజేషన్” అనే కథను రాశారు. గ్లోబలైజేషన్ ద్వారా సమాజంలోచాలామార్పులువచ్చాయి. ఆమార్పులవల్ల స్నేహితుడి పెళ్లిలో వాడిన పాలిథిన్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు, కాగితాలు వంటి చెత్తాచెదారాన్ని ఆవు తినడం చూసిన అర్జున్ అదిలించడం, ఇవి తినడం వల్ల పశువులు మరణిస్తున్నాయనే ఆవేదన చెందటం, ఇది చూసిన స్నేహితుడు తింటే ఏమవుతుందని ప్రశ్నించడం, దానికి కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ తిరిగి బయటకురాదని దీనితో అటు పశువులకు ఇటు భూమికి కాలుష్యం పెరిగిపోతుందని వాపోవడంకథ.మారుతున్న నాగరికత వలన మనం ఆరోగ్యాన్నిచ్చే అరటి ఆకులకు బదులు ప్లాస్టిక్ ఆకులు, ప్లేట్లు, గ్లాసులు వాడడంవల్ల ఇటుమనిషి అటు పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు ఇవి సులభంగా లభిస్తున్నాయి కానీ వాటివల్ల జరిగే కాలుష్యాన్ని మనం గుర్తించడంలేదు. ఒకవేళ గుర్తించినా నాగరికతా వలయంలో చిక్కుకుంటున్నాడనే ఆవేదన రచయితది.
రసాయనికఎరువులు పాలిథిన్ వాడకం ఒక ఎత్తు అయితే, ప్రకృతిలో అత్యంత ప్రాధాన్యం వహించిన వృక్షాన్ని సంరక్షించకపోవడం భూకాలుష్యానికి మరో ప్రధానకారణం. అందుకే‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న ఆర్యోక్తిని శిరసావహించిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “ఆకుపచ్చని మాయ”, కస్తూరి మురళీకృష్ణ “మనిషి – మామిడి చెట్టు”అనేకథలను రాశారు. ప్రపంచీకరణ ఫలితంగా మనిషి డబ్బు మాయలోపడ్డాడు. దానితో ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఎక్కువైంది.అయితే పిల్లలకి ఫీజులు కట్టలేక చెట్లని అమ్మాలనుకున్నాడు కొడుకు. దానికి తండ్రి రామయ్య ఒప్పుకోలేదని తన ప్రాణమే తీయాలనుకున్నాడు. తాతలకాలంనాటి వ్యవసాయ పద్ధతులు నలుగురికి తిండినీ నీడనూ ఇచ్చేవి. కానీ నేడు ఆ పాత పద్ధతులు పనికిరావని పొలాల్లోకి వచ్చే ఉడుతల్ని ఎలుకల్ని చంపాల్సిందేనని అప్పుడే పంటను రక్షించుకోగలమని అంటాడు మరోవైపు కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి.“మీరేం మనుషులయ్యా? ఉడత ఎలక పిట్ట గొడ్డూగోదా చీమా దోమా తినకుండా పండించినవన్నీ నీవే తిందాం అనుకున్నావా”? అని మనిషిలో పెరిగిన స్వార్థాన్ని ప్రశ్నించాడు రామయ్య. ఊళ్లో ఇల్లు, పొలంలో చెట్టు మనిషికి నీడ అన్న విషయాన్ని గుర్తించక ఆ చెట్టునే నరికి సొమ్ము చేసుకోవడం పాపమని భూమి నాశనమవుతుందనేహితబోధ చేశాడు రచయిత.
కస్తూరి మురళీకృష్ణ రాసిన “మనిషి – మామిడిచెట్టు” అనే కథలో మనిషికీ చెట్టుకూ ఉన్న చక్కని అనుబంధాన్ని చెట్టునుండి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను బోధించారు. ఒక విత్తనం భూమిలో వేస్తే అది మహావృక్షమై ఎందరికో ఆలవాలమవ్వటమే కాకుండా తరతరాలకు నీడను పళ్ళను అందిస్తూ…ఆచెట్టుపై ఆధారపడి ఒక జీవవలయమే ఉంటుందని తెలియజేసిన కథ. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా ఎంతదూరం పోయినా అతని వ్రేళ్ళు భూమిపై స్థిరంగా ఉండాలని చెప్పిన కథ ఇది. కనుక భూమి మనిషికి శక్తి. అలాకానిపక్షంలో గాలి ఎటు వీస్తే అటుకొట్టుకుపోతాడు. ప్రకృతితో కలిసి జీవిస్తే ఎంతో విజ్ఞానం నేర్పిస్తుందనే జీవితసత్యాన్ని వెల్లడి చేసిన కథ. చెట్లవల్ల భూకాలుష్యం జరగకుండా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో క్రమంగా వివరిస్తూనే అటువంటి చెట్లను నరికి దానవుడు కావద్దని హెచ్చరించాడు కవి. జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా చెట్లను అభివర్ణించారు. ఆదిమానవుడి స్థితి నుండి ఆధునిక మానవుడి స్థాయిదాకా మానవ ప్రస్థానంలో ప్రతి దశలోనూ చెట్టు మనిషికి అండగా నిలిచి ముందుకు నడిపించిందనే స్పృహనందించారు.
జల కాలుష్యం :పెరుగుతున్న జనాభావల్ల పారిశుద్ధ్యంలోపించి నీరు కలుషితమవుతూ నీటి కొరతకు కారణమవుతూ ఉంది. నీటివనరులైన చెరువులు, నదులు, సముద్రాలు వంటివి పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతూ ఉన్నాయి.దానితో ఎన్నో సముద్రజీవులు కోల్పోతూ ఉన్నాం. నీటిలో ఫ్లోరిన్ మోతాదు పెరిగి తాగునీటి కొరత ఏర్పడుతూ ఉంది. నీటికాలుష్యంవల్ల నీటి వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఈ స్థితికి చలించిన సాహితీస్రష్టలు ఎన్నో కథలను రాశారు. అందులో ఒకటి ఒమ్మి రమేష్ బాబు రాసినకథ‘మురికి’. నగరాలలో పారిశుద్ధ్యం లోపంవల్ల ప్రజలు పడే ఇబ్బందులను గూర్చి రాసిన కథ. రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ లోపల ఒక హోటల్. పక్కనే నాలుగు కాకా హోటళ్ళు. ఈ హోటల్ లో నుండి పారబోసే వ్యర్థాలవల్ల అక్కడ ఉన్న స్థలం అసహ్యంగా అపరిశుభ్రతతో ఉంది. కాలువల్లో మురికితో నిండిన నీళ్లు. ఆ నీటిలో పొర్లుతున్న పందులు, కుక్కలు.హోటల్స్ నుండి వచ్చి చేరే మురికినీళ్లు. ఇంకోవైపు వ్యర్థ పదార్థాలతో కూడిన పారిశుద్ధ్యలోపంతో పాటు బండి రాముడు హోటల్ వల్ల ఏర్పడిన పెంటకుప్ప. మరోవైపు ఆ హోటల్లో మంచినీళ్ల బానకి పేరుకున్న నాచు. ఇది అక్కడి మంచినీటి పరిస్థితి. జనసంచారం ఉన్న ఇలాంటి చోట్ల అపరిశుభ్రతతో పాటు కాకాహోటల్స్ వల్ల మరింత పారిశుద్ధ్యంలోపం పెరుగుతూ ఉన్న స్థితిని రచయిత కళ్ళకు కట్టించారు. అక్కడి ప్రజల జీవనం ఎంత దుర్భరంగా ఉందో వ్యక్తీకరించారు.
వాయు కాలుష్యం : నేడు నవనాగరిక మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలలో వాయు కాలుష్యం మరొకటి. వాయుకాలుష్యంతో అనేకరకాలైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పరిశ్రమలు వాహనాలు ఎక్కువైపోయి, ఇవి వదిలే విషవాయువులతో వాయుకాలుష్యం పెరుగుతూ ఉంది.ప్రాణవాయువులను ప్రసాదించే చెట్లను నరికేయటం వల్ల జరుగుతున్న పరిణామమిది. మరోవైపు పారిశుద్ధ్యలోపంతో వాయువు కలుషితమవుతూ ఉంది. దీనితోనూ అనేకరకాల వ్యాధులకు మనిషి గురవుతున్నాడు. ఈ విషయాలను గూర్చి సాహితీవేత్తలు తమ సాహిత్యం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పరిశ్రమలద్వారా జరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఆ ధూళితో అక్కడ పనిచేసేవారు అనారోగ్యానికి గురయ్యే తీరును చెబుతూ కె. వరలక్ష్మి “అతడు – నేను” కథను రాశారు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి 15 ఏళ్ల కుర్రాడు గ్రానైట్ మిల్లులో చేరడం, దాని ద్వారా వచ్చే పౌడర్ వల్ల దుమ్ము ధూళితో వారి శరీరాలు నిండిపోవడం, దీనితో ఆకుర్రాడికి టీబీ రావడం, ఎన్ని మందులు వాడినా అదే ధూళిని పీల్చడం వల్ల నీరసించి పోవడం, ఆతర్వాత పనిలోకి రాకుండా నిలిచిపోవడం, దీనితో ఆ కుటుంబం ఏమైందోననే ఆవేదనతో రచయిత్రి రాసిన కథ ఇది. గ్రానైట్ మిల్లులో పనిచేసే వారి జీవితాలు ఎంత అర్ధాంతరంగా ముగిసిపోతాయోననేది చూసినప్పుడు హృదయం ద్రవించిపోతుంది.
కాలుష్యం వల్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిన తీరును కె. వరలక్ష్మి చిత్రీకరిస్తే, చెట్లను నాటి వాయుకాలుష్యాన్ని దూరం చేసుకోవచ్చు అంటూ సడ్లపల్లి చిదంబర రెడ్డి “ఉగాది” కథను రాశారు. ఉగాది పండుగకోసం మామిడి ఆకులను బస్తాలకు బస్తాలు బస్తీలకు కోసుకుపోతూ చెట్లను విరిచేస్తున్న మనుషులకు హితబోధ చేయడమే కథ. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఇంటిముందు రెండు మామిడి మొక్కలు నాటితే నిత్యం పచ్చతోరణాలై ఇళ్లకు శోభనీ శుభాన్నీ అందిస్తాయనే స్పృహను అందించారు రచయిత.ఇదేవిషయాన్ని సుందర్ లాల్ బహుగుణ “ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ” (నాశనంకాని జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని అంటారు. కనుక మనంకూడా రెండు రోజుల్లో వాడిపోయే మామిడిఆకులను తోరణాలుగా కట్టడం కాకుండా ఇంటిముందు మామిడి మొక్కనే నాటితే శాశ్వతంగా పచ్చదనాన్ని పొందవచ్చునంటారు రచయిత.
ధ్వనికాలుష్యం : వాహనాల వలన వాయుకాలుష్యంతో పాటు ధ్వనికాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. దీనినే సాహితీస్రష్టలు కథల ద్వారా ప్రజలకు కనువిప్పు కలుగజేస్తున్నారు. వాహనాలు ఎడతెరిపి లేకుండా ప్రయాణించడం వల్ల వాటిద్వారా వచ్చే దుమ్ముతో శబ్దాలతో ప్రజలు పడే కష్టాలను తెలియజేస్తూ సలీం “రూపాయి చెట్టు” కథను రాశారు. వాహనాలు ఎక్కువగా ప్రయాణించే హైవేలలో రమేష్ లాంటివాళ్లు ఎస్టీడి బూత్ పెట్టుకొని చాలీచాలని డబ్బులతో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వాహనాల ద్వారా వెలువడే వాయువులతో మానసిక ఒత్తిడితో శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తీరును దృశ్యమానం చేశారు.
మైనంపాటి భాస్కర్ రాసిన మరో కథ “డీప్ ఫ్రీజ్”. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని 2050వ సంవత్సరం నాటి మానవ సమాజాన్ని సాంకేతిక పురోభివృద్ధిని ఊహించి రాసిన కథ ఇది. భారతదేశ జనాభా 2050వ సంవత్సరంనాటికి 3000 కోట్లు అవుతుందని అంచనా వేసి రాసిన కథ. జనాభా పెరగటంతో విపరీతమైన కాలుష్యంతో వ్యాధి నిరోధక దుస్తులు, ఆక్సిజన్ మాస్క్, చెవులకు ఫిల్టర్లు లేకుండా బయటకు రాలేని దుస్థితి మనుషులకు రాబోతుందని రాసిన కథ. చివరికి ఆరుబయట ఒక్క చెట్టు కూడా కనిపించదని కథలో ఎంతో ముందు చూపుతో రచయిత ఊహించి పాఠకులకు ఒక స్పృహను అందించారు. మనిషి అత్యాశతో చేస్తున్న అసహజమైన పనులవల్ల ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. అందుకే ప్రకృతిని నాశనంచేసి తిరిగి ప్రకృతిని శాసించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఈ కథ నడిచింది.చనిపోయాడనుకొన్న మనిషి క్యాన్సర్ వ్యాధి ప్రయోగంలో భాగంగా తిరిగి బ్రతికితే ఆకుటుంబ సభ్యులు ఏవిధంగా ఆలోచిస్తారనేది కూడా స్పష్టంచేశారు. ఆధునికత పెరిగేకొద్దీ కుటుంబసభ్యులమధ్య ఉండే ఆర్థిక సంబంధాలు వ్యాపారసంబంధాలైపోయాయి. చివరికి చిన్నపిల్లలను కూడా రోబోలు ఆడించాల్సిన దుఃస్థితిని, మనిషి తనకు కావాల్సిన వాటికి తన మెదడుతోకాకుండా యంత్రాలపైన ఆధారపడటం వంటివన్నీ మనిషి నిర్వీర్యం కావడానికి దోహదమవుతున్న తీరును రచయిత చాలా చక్కగా వ్యక్తీకరించారు.
భూతాపం – జీవవైవిద్య ప్రమాదం : ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యం నెలకొని ఉంది. అలాగే నేడు మానవతప్పిదాలవల్ల ప్రకృతి వైపరీత్యాలవల్ల జీవులన్నీ నశించి సమతూకం చెడిపోతూ ఉంది. భూతాపం పెరిగిపోయి జీవులకు నీటి కొరత, మరోవైపు ఆహారం దొరకక అవి నివసించడానికి తగిన వసతులులేక అంతరించిపోతున్నాయి. ప్రకృతికి అందాన్నిచ్చే రంగురంగుల పిట్టలు, వన్యప్రాణులు, గర్జించే మృగరాజులు, కనులకు విందుచేసే నెమలి నాట్యాలు, లేళ్ల గంతులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి. దీనికి మానవ తప్పిదాలు ఒక కారణంకాగాభూతాపం మరోకారణమై నీటికొరతతో, అడవుల నాశనంతో వన్యప్రాణులన్నీ మాయమవుతున్నాయంటూ పాపినేని శివశంకర్ “చివరి పిచ్చిక”; సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “పిట్ట పాట”, “కడితివేట”, “అతడిబాధ”; గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”;చిత్తర్వు మధు “రెండు డిగ్రీలు” వంటి కథలను రాశారు.
వ్యవసాయ పంటలకు వాడే రసాయనాలవల్ల భూమికలుషితమై మనిషి మనుగడ కునారిల్లుతుంటే స్పందించిన సాహితీస్రష్ట హృదయం అక్షరంగా ఆవిష్కృతమైన కథ “చివరి పిచ్చిక”. తమ చిత్రవిచిత్ర చేష్టలతో కిచకిచ శబ్దాలతో నిత్యం మనల్ని వెంటాడే పిచ్చుకలు కనుమరుగవటం వల్ల అంతరించిపోతున్న పిచ్చుకజాతికి అంతిమనివాళిగా అందించిన కథ ఇది. వడ్లకంకులను గుత్తులుగా వేలాడదీసి పక్షులకు ఆహారాన్ని అందించే మానవీయత నేడు కరువైంది. చదువుల వేటలో అధికారదాహంలో డబ్బుసంపాదనలో ఈవిషయం మనకు సంబంధంలేనిదైపోయింది. పర్యావరణంలో పశుపక్షాదులది విడదీయరాని అనుబంధం. కానీ మనిషి తను అభివృద్ధి చెందడానికి ఇతర ప్రాణులకు ఎప్పుడూ హాని చేస్తుంటాడు. అందుకే రచయిత ‘ఏదో ఒకనాటికి ఈ రెండు చేతుల జీవివల్లనే మన జాతి అంతరిస్తుందని నాభయం’ అంటాడు. ఇక్కడ రెండు చేతుల జీవి అంటే మనిషి. సృష్టిలో రెండుచేతులు ఉన్నది ఒక్కమనిషికే. తన స్వార్థంకోసం మనిషి ఏమైనా చేస్తాడనేది రచయిత ఆవేదన.“సృష్టిలో కెల్లా తానే విజ్ఞానవంతుడని తెలివితేటలు కలవాడినని విర్రవీగుతుంటాడు మనిషి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వివిధ జీవరాశులలో ఎన్నో జీవులు తమకి మాత్రమే సాధ్యమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తాయని తెలుస్తుందం”టారు కేకలతూరి కృష్ణయ్య గారు. అది అక్షరాలా నిజం. పర్యావరణ సమతుల్యాన్ని మనిషి దెబ్బతీస్తున్న విధానాన్ని రచయిత పిచ్చుకద్వారా స్పష్టపరిచారు. అంతేకాదు మనిషి జాతిసమస్తాన్ని ధ్వంసంచేస్తూ చివరికి తానే ధ్వంసమయ్యే పరిస్థితిని తెచ్చుకోబోతున్నాడనే హెచ్చరిక ఈకథలో ఉంది. ఒకప్పుడు పిచ్చుకలకు పంటపొలాల్లో తినడానికి జొన్నకంకులు అందుబాటులో ఉండేవి. కానీ నేడు మిరపలాంటి తోటల్లో ద్రావకాల్లో తేలుతున్న పురుగులను తినడంవల్ల పిచ్చుకలు అంతరించిపోయాయని పిచ్చుకలకు చోటులేని ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోతుందన్న భవిష్యత్తు ఉపద్రవాన్ని సూచించారు రచయిత.
పరిశుభ్రత పేరిట, నాగరికత పేరిట పిచ్చుకలు పెట్టే గూళ్ళను ఊడబీకడం ఎంత కారుణ్యరాహిత్యమో తెలియజేస్తూ రాసిన మరోకథ “పిట్టపాట”. ఒకప్పుడు పంటపొలాల్లో వచ్చే పురుగులను ఏరి తినే పక్షులు నేడు లేకపోవడం వల్ల పంటలమీద పురుగులు ఎక్కువై దిగుబడి లేక రైతులు అప్పులు పాలైన స్థితిని చిత్రీకరించిన కథ. పాతతరంలో పొలాలు కుటుంబాన్ని పోషిస్తే నేటితరం పొలాన్ని పోషించుకోవాల్సి రావటం బాధాకరం. అది మనిషి స్వయంకృతాపరాధమేనని తెలిపిన కథ. పర్యావరణ చేతనారాహిత్యం జీవావరణ విధ్వంసానికి కారణమవుతుందని హెచ్చరించిన కథ. చివరికి బంధువులను కలవడమన్నది అవసరానికేకాదు హృదయసంబంధమైనదిగా భావించాల్సిన అవసరాన్నికూడా తెలిపిన కథ. అందుకే కేకలతూరి కృష్ణయ్యగారు సామాజిక విలువలు, సమతామమతలను అందించే ‘సృష్టి జనజీవన దర్పణం’ అనే ఒక మంచి పుస్తకం వెలువరించారు. బంధాలు అవసరానికి మాత్రమే అనే నేటి సమాజంలో అవి ఎంతమేర ఉండాలో చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇదే విషయాన్ని ‘పిట్టపాట’ కథలోనూ రచయిత సూచించడం నేటి సమాజానికి ఇది ఎంత అవసరమో తెలుస్తూ ఉంది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత చిత్తర్వు మధు. ఇతను వృత్తిరీత్యా డాక్టరు. తన వృత్తిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ లాంటి ముఖ్య విషయాల మీద పరిశోధించి రాసిన కథ “రెండు డిగ్రీలు”. రాబోయే తరాలు ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారో చూపిన కథ. భవిష్యత్తు పరమైనటువంటి అవగాహనలేని మనల్నిఇక ఆ భగవంతుడే కాపాడాలనేఅద్భుతమైన కథనంతో ఈకథనుమనకుఅందించారు.
ప్రభుత్వంచేసిన నల్లచట్టంవల్ల బాక్సైట్ తవ్వకాలు చేయడంతో జంతువులన్నీ మాయమైపోతున్నాయని చెప్తూ గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”కథరాస్తే, నీళ్లులేక ఎన్నో జీవాలు అంతరించిపోయిన దుస్థితిని చిత్రిస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి“కడితి వేట”అనే కథను రాశారు. నోరులేని మూగజీవాలమీద మనిషి పైశాచికత్వానికి నిదర్శనం జంతువుల అదృశ్యం. అరణ్యాలలోని చెట్లను నరికి మంటపెట్టడంవల్ల ఎన్నో పక్షులు, జంతువులు, లేతచెట్లు మాడిపోయి కనీసం తాగడానికి నీళ్లుకూడా లేని దుస్థితిలో ఒక కడితి నీళ్ల కోసం మడుగులో దిగి తాగితే దాన్ని కూడా చంపి తినడానికి సిద్ధమైన మానవ మృగాలను చిత్రించిన కథఇది.
మన పర్యావరణంలో ఒకరిమీద ఆధారపడి మరొకరు జీవించటం సహజం. కాని ఇది జరగనప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియజేస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు “అతడిబాధ” అనే మరోకథను రాశారు. నక్కలు, తోడేళ్ళు అంతరించిపోయాక కుక్కలను పెంచేవాళ్ళులేక అవి తిండికోసం పెద్దనక్కలు తోడేళ్ళ బదులు కుక్కలే గొర్రెలని, కోళ్ళను తినే పరిస్థితికి వచ్చిన తీరుని తెలిపిన కథ ఇది. ఒకప్పుడు కుక్కలకు ఇంట్లో తిండి పెట్టేవారు. కాని నేడు అలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. దానితో కుక్కలకి తిండి దొరకక రాబోయేకాలానికి నక్కలు, తోడేళ్ళ మాదిరి మారిపోతాయేమోననే ఆవేదన రచయితది.
ఇలా మనిషి తన స్వార్థంకోసం ప్రతీదాన్ని కలుషితంచేస్తూ జీవులను నాశనంచేస్తూ ప్రకృతి సమతౌల్యాన్ని చెడగొడుతున్నాడు. ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణమవుతున్నాడు. తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు కనుక స్వార్థాన్ని వదలి పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆచరిస్తేనే ఈ భూమి,భూమిపై మనిషి మనుగడ స్థిరమవుతుంది.దీనికోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాల్సినతరుణంఆసన్నమైంది.
***