తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితమైన పేరు. కవిత్వపరంగా చాలా తక్కువ కాలంలోనే చాలా వేగంగా అందివచ్చిన తెలంగాణ పల్లెటూరి పిలగాడు. వస్తురూప కవిత్వం రాసినా, కవిత్వంలో మోడ్రన్ ఎక్స్ ప్రెషన్స్, పదజాలం వాడినా, మనిషిలోని ఉక్కపోతను కవిత్వం చేసినా అతని శైలి దినదిన ప్రవర్ధమానం. మూస ధోరణి శిల్పాల్ని బద్దలు గొట్టుకుంటూ కవిత్వాన్ని మెరపెడుతున్న గౌండ్లోల్ల పోరడు. గౌడ వృత్తిని వారసత్వంగా తండ్రి అందుకోకపోయినా, మనువడిగా తాత ముత్తాతలను తల్సుకుని తాటికమ్మలపై కావ్య కన్యని నాట్యమాడిస్తున్న గీశిగాడు తండ హరీష్ గౌడ్.
ప్రతి కులానికి ఒక వృత్తి నేపథ్యపు తాలూకూ జీవితముంటుంది. వృత్తి పురాణం వుంటుంది. కులదైవం ఆరాధ్యుడుగా కొనసాగుతుంటాడు. అట్ల గౌండ్ల కులస్తులకు కాటమయ్య. కవి నోస్టాల్జియా నుంచి పుట్టికొచ్చిన కవిత్వం కొంతయితే, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వాడిగా ఎదుగూ బొదుగూ లేని గౌండ్ల బతుకును చూసి చలించిన మనసుతో కొంత కవిత్వం రాసినట్టు ‘వంకతాడు’ దీర్ఘ కవిత చదివితే మనకు అర్థమయితది.
కాటమయ్య తండ్రికి కల్లుసాక ఆరబోసి ‘వంకతాడు’ కల్లు రుశి జూడ వనంలోకి కదులుతుంటాం. 20 భాగాలుగా సవురిచ్చిన పొందికైన ‘కల్లు పటువ లెక్క అవుపిస్తది. మఖ్యంగా ఈ విభజన తన సౌలభ్యం కోసమే ఏర్పాటుజేసుకున్నట్టు అనుకోవచ్చు. చదివించే గుణం మెండుగా వున్న కావ్యం అవటం వల్ల తాటికమ్మపై పడ్డ నీరా బొట్లు గొంతు తడిపి కడుపు సల్ల జేసినట్టు తృప్తిని అనుభూతి చెందుతాం. ఈ దీర్ఘ కవిత కవి ఎంచుకున్న వస్తువు యొక్క సకల పార్శ్వాలను తడుముతూ భవిష్యత్తు కార్యాచరణకు పురికొల్పే దిశగా కొనసాగటం మనం గమనిస్తాం.
గౌండ్ల వృత్తి కారుల వేషధారణ, తాటి, ఈత వనాల్లో ఎదురయ్యే ప్రమాద సూచికలు, ఆటంకాలు, వివిధ రకాలుగా పేర్లు పెట్టబడ్డ చెట్లు, చెట్టెక్కడం, కల్లు తీయడం, కల్లు ఒంపడం, మండవ కాడి తతంగం, అతారెలు(పనిముట్లు , ఆయుధాలు), కల్లు అమ్మటంలోని కష్టాలు, తాటి ఉత్పత్తులైన ముంజలు, తాటిపండ్లు, గేగులు, కమ్మలు; గౌండ్లు పడే నిందలు- అసలు నిజాలు; ప్రపంచీకరణలో గౌడన్న జీవితం, బతుకు దైన్యం, గౌడతల్లుల గోస, వృత్తిలో స్త్రీ పాత్ర, వారి శ్రమ, వాడికదార్లు, కొత్తల(పైసల) రాకటపోకట, గతం, వర్తమానం, భవిష్యత్తు – కొత్త తరానికి దిశానిర్ధేశం చేయటం, కర్తవ్యబోధ, రేపటిపై ఆలోచన కల్గించటం, కార్యాచరణకు సంసిద్ధ పర్చడం – ఆధునిక జీవితం దిశగా వేసే అడుగుల అలికిడి మొ.న పలు పార్వ్వాలు ‘వంకతాడు’ ను ఒక్కొక్క జంగ ఎక్కుతాంటె తారసపడి ముచ్చట పెడుతాంటయి.
ప్రతీ వృత్తి కార్మికునికి తనవైన పనిముట్లు (అతారెలు) వున్నట్లే, గౌడ వృత్తి కార్మికులకు సుత కొన్ని అతారెలు వుంటయి. ఒక్కొక్క అతారెకు ఒక్కో ప్రాధాన్యత వుంటుంది. మోకు, ముత్తాదు, గుజి, పిల్లబద్ద, నెరుసు రౌతు, గీతకత్తులు, కావడి బద్ద, మండువ, పటువ, బుడ్డి, లొట్టి, కుండ, మెర, నాగ, పాట, బుచ్చ, నీరా, పోద్దాడు, పరుపుతాడు, పండుతాడు, కర్రపుల్ల, నాపతాడు, సప్పశేదు,నలుసు, మోదుగాకు, మర్రిఆకు, పొందిచ్చుడు, నురుసు, మొర్రి, మొదలు, బింకీలు, ముంతలు, పట్టు, దమ్ము, కమ్మ, ర్యాక, చెలుగుడు,మడ్డి, మట్ట మొ.న పదజాలం గౌడులు నిత్య వ్యవహారికంలో వాడుతుంటరు.
*
‘నెరుసు’ను తెల్లని మల్లెపూలతో, గౌడన్ననే ‘కాటమయ్య’ అనడం; మోకు, ముస్తాదులను ఉదయం, సాయంత్రాలతో; తాడిచెట్టును
నిలువెత్తు నల్లనిరంగు రోడ్డు అనటం(metaphor); తాటిచెట్లను కన్నబిడ్డలతో, కల్లును దూదితో; కల్లు తీయటం సులువుగా నీళ్లు తాగటంతో ఔచిత్యవంతమైన పోలికలు చెప్పడం కనిపిస్తుంది. గీతవృత్తి అనేది తాళపత్ర విద్యగా, 65వ కళగా, గీత శాస్త్ర నిపుణతగా కవి రాతల్లో చెప్పబడింది. పారుతున్న ఏటి ఒడ్డున దొరికే నూరుగంటి రాయినో, పలుగు రౌతునో పట్టుకొచ్చి కత్తులను మెత్తగా నూరడానికి మెత్తని పౌడరసొంటి పొడిని తీస్తరు. దీన్ని నెరుసు!’ అంటరు. కొంచెం కొంచెం పిల్ల బద్ద మీద వేసుకుంట కత్తులు నూరుతరు.
నురుగు కల్లును తెల్లని నదిగా, మనసు గాయాలకు పూసే మందుగా, గౌడన్నను లోకాన్ని గిర్రున తిప్పే చక్రంగా వర్ణిస్తాడు. తాడెక్కడంలో ఎంతటి ఒడుపుతనం వుండాలో, కల్లు ఒంపడంలో అంతటి నేర్పరితనం సుత వుండి తీరాలి. ఆకుపట్టి దమ్ముపట్టడం ఒక కళ. మర్రి ఆకు, మోదుగాకు, పాట, ర్యాక యిలా ఒక్కో దాన్ని ఒక్కోతీరు వాడటం పరిపాటి. మర్రి ఆకుల కల్లుతాగుతే రిమ్మ వత్తదంటరు. మోదుగాకును సుట్టాకు అని సుత అంటరు. ర్యాక అనేది తాటాకు కమ్మజీరి ఒకింత నైపుణ్యంతో చేసి ఇచ్చేది. చిన్న పిల్లలు తాగటానికి సులువైనది. పట్టుకుంటే పడవలెక్క, తాగుతాంటే కడుపు సల్వ అంటుంటరు. ‘పాట’ వీటన్నింటికీ భిన్నమైనది. ఇది తాటిచెట్టులోని భాగమే. గీత గీయడానికి ముందు చెట్టును సాపు జేత్తానికే గొలను చెలుగుతుంటరు. కల్లు గీశినంక కుండల కల్లు పటువల పట్టుకరాంగనే ఒంపుతే అందులోని మలినాలు అట్లనే వుంటయి. అందుకే ఫిల్టర్ జేయడానికి ‘బుచ్చ’ వాడుతరు. మర్రి ఆకును పొట్లంగట్టినట్టు మల్శి అందులో తాటి పీచును బెట్టి కల్లు వంచుతరు. గశి, నుశి,నలుసు, మడ్డి,మలినం ఏదైనా సరే అందులోనే ఆగుతది. ఇక స్వచ్ఛమైన కల్లు సర్రున బొండిగ జారుతది. కల్లు తాగే చోటును ‘మండువ’ అంటరు. రోజూ తాగే వారిని వాడికదార్లు అని, వారికి పోసే కల్లును ‘వాడిక’ అని అంటరు. వీళ్లు నెలకో, సంవత్సరానికో ఒకసారి ధన రూపంగానో, ధాన్యరూపంగానో ‘వాడిక’ పైసలు ఇస్తుంటరు. గౌడ్ అన్న కల్లు పోసిన గుర్తుకోసం బొగ్గు ముక్కతో గీతలు గీసుకునేటోడు. కల్లు బాగా పారుకం ఉన్న రోజుల్లో మూడు మాట్ల తాడును ఎక్కుతుంటరు. అట్లా రోజుకు మూడుసార్లు గీయటం వల్ల కల్లుకు తీపిదనం వత్తది. అట్ల వచ్చిన తీపిదనపు కల్లును ‘వడగల్లు’ అంటరు. దీన్ని సాధారణంగా రాత్రి బాగా పొద్దుపోయినంక తీస్తరు. దీన్ని ఎక్కువమంది చాలా ఇష్టంగా తాగుతరు. వడగల్లు తాగితే పెయ్యంత గుమ్ముగుంటది. మనసంతా తేలిక అయితది. వడగల్లు దొరికినోడు అదృష్టవంతుడని సుత చెప్పుకుంటరు. ఇట్లా మూడు మాట్ల ఎక్కే క్రమంలో తిండి మీద ధ్యాస ఉండదు. ఎండనక, వాననక కల్లు గీయడం, నల్లకట్టెబడి పోవడం వెనుక కవి ఆంతర్యం ఇదే అనిపిస్తది.
గౌడ్ అన్న వ్యక్తిత్వం గురించి చెబుతూ ‘పిట్ట మనసు నీది’ అంటాడు కవి. చెట్టును గుండెకాయగా, దైవంగా కొలిచే కాటమయ్య తండ్రిగా భావిస్తాడని చెబుతాడు. ‘సుట్టమొస్తే ఊరంతా పండుగ చేస్తవు’ , ‘గూడున్నంతవరకే ముడుసుకుంటవు’ వంటి స్టేట్మెంట్స్ ‘విరోధాభాస’గా ధ్వనిస్తాయి. అట్లనే తీయటి మాటలు చెప్పడం, మాటలతో కోటలు కట్టడం రాని వ్యక్తిగా అభివర్ణించడంలో ఎవ్వరినీ మోసం చేయనితనం, నిజాయితీగా బతికే వ్యక్తిగా గౌడ్ అన్నను చిత్రీకరించడం చూస్తాం. ఇందుకు విరుద్ధమైన మనుషులు కూడా సమాజంలో, మన నిజ జీవితంలో తారసపడొచ్చుగాక! ఒక్క చుక్క విషం పాలలో కలిసినా మొత్తం విషమనే చెబుతాం కదా! “పుట్ట మొదట్ల మొక్కి చెట్టెక్కడం” అంటే పుట్టలోని పాములకు హాని చేయకుండా మొక్కి తన పని తాను చేసుకుపోతాడని, ఇతరులకు కీడు చేయని మనస్తత్వం అని చెప్పడం ఇందులోని భావంగా గ్రహించవచ్చు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూనే గౌడవృత్తిని కొనసాగించేవారు ఉంటారు. కేవలం కల్లు గీయడం ద్వారానే పూట గడవదు. మూడు నాలుగు నెలల కంటే ‘కల్లు సీజన్’ ఎక్కువ ఉండదు. కల్లు పారని సమయం కొంతైతే, కల్లు పారినా వర్షం పడటం వల్ల పనికి రాకుండా పోయే కాలం వెరిసి గౌడ్ అన్న జీవితం దుర్భరం. కల్లు లేని కాలంలో మళ్లీ ఏదో ఒక పని వెతుక్కోంది…పూట గడవని పరిస్థితి. అందుకే “ఒక్క రోజు కూడా నాకా పెట్టవు” అంటాడు కవి. అంటే ‘పని ఎగ్గొట్టకపోవడం’ అని అర్థం. ఇగ కట్టలు కట్టలు కూడబెట్టుకునే స్థితి ఎక్కడుంటది?
‘నైరాశ్యం, ఊపిరాడనితనం, దుఃఖం, నిస్సహాయత’ మొదలైనవి ప్రపంచీకరణ నేపథ్యం లో గౌడన్న స్థితిగతుల గురించి చెప్పడానికి కవి వాడుకున్న పదజాలం. ఇవన్నీ నెగటివ్ సెన్స్ లో ఉన్నవే. విషాదాన్ని చెప్పడానికి పనికొచ్చేవే. కాళ్లకు గుజి బంధమేసుకుని, మోకుతో తాడిచెట్టును అమురుకుని ఎగబాకుతున్నట్టు కనిపించే దృశ్యం ఆహా! అనిపించినా, తన గుండె మాటున దాగిన వేదన మాత్రం అతడికే తెలుసు. అయితే ఈ క్రమంలో ఒంటిమీద, కాళ్ళ మీద, చేతుల మీద కాయలు కాసిన గుర్తులు కనిపిస్తాయి. ఇవి గౌడ వృత్తి కార్మికునికి తరతరాల వారసత్వపు ఆనవాళ్లు. అందుకే కవి”ఎంతెత్తు చెట్లెక్కినా జీవితపు మెట్లెక్క లేని నిస్సహాయతల పొగ పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు కాళ్లకు చేతులకు బర్రలు తప్ప మిగిలిందేముంది?” అని ప్రశ్నిస్తాడు. అంతలోనే వాడికదారుల నవ్వుల మాటలు వింటాంటే “మనిషితనం నిటారుగా నిలబడ్డట్టున్న వెన్నెముకను తొడుక్కునేది,” అనే ఆశాభావాన్ని సైతం ప్రకటిస్తాడు. నెత్తురు నెరుసుడు తప్ప గొప్పగా ఏం మారలేదని వెంటనే ఉద్ఘాటిస్తాడు.” ప్రపంచకమంతా ఆకుమీదుగా గొంతులకు జారే” సన్నివేశాల్ని ఒడిసి పట్టుకుని కల్లు మండువే ఇంటికాడ రచ్చబండ అయ్యే తీరును పదిల పరుస్తాడు.
గౌడ్ అన్న బతుకు గాలికి పెట్టిన దీపం అని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో గౌడ తల్లులు, ఆడిబిడ్డలు తాడిక్కబోయిన భర్త ఇంటికి తిరిగి వచ్చేవరకు ‘తాళిబొట్టు’ తీసి పక్కన పెట్టే వారట. పైలంగా ఇంటికి చేరుకున్నాకే తిరిగి మెడలోకి చేర్చుకునే వారట. జీవితంలో కష్టసుఖాల్లో సగభాగం పంచుకునే అవ్వలు మండువకాడ, కల్లు అమ్మబోయినకాడల్లా ఎన్ని దెప్పి పొడుపులు, సూటిపోటి మాటలు, పరాశికపు సరసాలు,బనాయుంపులు ఎన్నింటినో భరించేటోళ్లు. ఇసువంటి దినదిన గండం బతుకులు ఎట్లా నెట్టుకొచ్చిన్రో కవి సూఛాయగా చెబుతాడు. ఒకలకొకరు పక్కన నిలబడబట్టే మరో తరానికి బాటపడ్డదనే నిజాన్ని బట్ట బయలు చేస్తాడు. “కల్లు ఒంపి నలుగురి దూప తీర్చే ఆ చేతులే లేకుంటే శ్రామిక సూర్యుడు ఏ దిక్కుకు నడిచెళ్ళేవాడో” అని శ్రమకు పట్టం కడతాడు. ‘స్వరాలముల్లె, ఉద్యమ గొంతుక, మకుటం లేని మహారాజు’ వంటి ప్రతీకలతో తాడి చెట్టు ఎక్కిస్తాడు. కల్లు అమ్మే కష్టాలు చెబుతూనే మూడు కన్నుల చందమామలైన ముంజలను నోటికి అందిస్తాడు. బహుజన వృత్తి కులాలకు నపరింత ముంజల రుశిని చూపెడతాడు. ‘ముంజల దేశానికి అధిపతివని, ఎండాకాలం పూట చల్లని ప్రిస్క్రిప్షన్ రాసే నాడీ శోధకుడివి’ అని వెన్నెల ధారాన్ని కురిపిస్తాడు. కవి రాతల్లో గౌడ్ అన్న దేవదూతవుతాడు. తాడిచెట్టు దేవతా వృక్షం అవుతుంది. కల్లు అమృతమై కురుస్తుంది. తాటి ఉత్పత్తులు చిన్నపిల్లలకు ఆట వస్తువులైన తీరును చూపెడతాడు. నాలుకలను ముత్తాదుకు ముడి వేసుకోవడం, తాడిచెట్టు ఉన్నంతకాలం గౌడ్ అన్న పేరు వినబడుతూనే ఉంటదని చెప్పటం అద్భుతం అనిపించకమానదు.
గీత వృత్తి కార్మికులు కాలక్రమంలో బతుకుదెరువు కోసం వలసలు బోతున్న వైనాన్ని చెబుతూనే మరోపక్క”మరో చెట్టు పుట్టుక కోసం మట్టలను చెలుగుతూనే ఉంటవు”వంటి వృత్తి ధర్మాన్ని తలకెత్తుకునే వాక్యాల్ని సైతం పఠింప చేస్తాడు. ప్రభుత్వ పథకాలు ఏమేరకు దోహదపడ్డాయో, ఓట్ల పండుగప్పుడు ఏ విధంగా చర్యలో పాల్గొనే ఉద్వేగ పూరిత ఉత్ప్రేరకాలు అవుతున్నారో తెలుసుకోమంటాడు. పిల్లల భవిష్యత్తుకు ఇకనైనా మంచి కార్యాచరణ పథకం రచించుకోమని చెబుతూ- ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలని, రాజకీయంగా ఎదగాలని, స్ఫూర్తిని రగిలించిన” సర్వాయి పాపన్న” వారసత్వాన్ని పున: ప్రతిష్ట చేయాలని, అందుకు బహుజనులందర్నీ ఒకే తాటిపై నిలుపాలని, భావి చరిత్రకు కొత్త పేజీని అందివ్వాలని, ధైర్యాన్ని నూరిపోసే, జాగృతం చేసే కవి హితబోధ విజయవంతం కావాలని కోరుకుంటూ “లెమ్మనంగనే పిలుపందుకునే ‘వంకతాడు” కు ప్రణమిల్లుతూ శనార్తులు.
పుస్తక సమీక్ష
డాక్టర్. చిటికెన కిరణ్ కుమార్ గారి “ఎర్ర సూరీడు” కథకు సమీక్ష.
మనిషికి శిరస్సు ఎంత అవసరమో కథకు, శీర్షిక అంత విలువనిస్తుంది.
“ఎర్ర సూరీడు” అన్న పేరు కథకు తగినట్లు ఉంది. వేడి కిరణాలతో ఎర్రబారిన సూర్యునితో పోల్చి సుహాన్ అనే పిల్లవాని పాత్ర ఇందులో ముఖ్య పాత్ర కావడం గమనించాల్సిన విషయం!
ఈ కాలం కుటుంబాలలో జరిగే ఒక విషాదకరమైన విషయానికి ఈ కథ ప్రతిబింబం అని చెప్పవచ్చు.
తన చదువులు వివాహాలు అయ్యేంతవరకు పెద్దరికాన్ని పెద్దలకిచ్చి ఒక్కసారిగా ఆ పెద్దలను వారి వృద్ధాప్యంలో అందరూ ఉన్నా, ఎవరూ లేని పేదవారిగా మార్చడం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని కథా వస్తువుగా తీసుకొని తనదైన శైలి లో ఒక పరిష్కార మార్గం దిశగా కథను నడిపించిన కిరణ్ కుమార్ గారు చక్కటి విషయానికి విత్తు నాటారు!!!
నేడు అపార్ట్మెంట్లలోని పరిస్థితిని చక్కగా చూపించి పరిష్కార మార్గం చెప్పారు. పక్కఅపార్ట్మెంట్లో ఏం జరిగినా మనకు తెలియదు, మనం పట్టించుకోము – ఇది నేటి పరిస్థితి. దీనికి చరమగీతం పాడమని చెప్తూ కథకు చక్కటి ముగింపు ఇచ్చారు.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది:
“పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి” అన్న అతి ముఖ్యమైన మానవత్వానికి సంబంధించిన గొప్ప విషయం ఈ కథలో మనం గమనించాల్సిన మొదటి విషయం.
కిరణ్ కుమార్ గారు ఈ కథలో నిజంగా చెప్పాలంటే ఒక 10 ఏళ్లకుర్రాడుగా మారిపోయారు. ఈ కథలో హీరో ఓ 10 ఏళ్ల కుర్రాడు – అతడి పేరు సుహాన్.
సుహాన్ తండ్రి అరవింద్, తల్లి సంధ్య. కథ నడవడానికి కారకుడు సీతారత్నం.
సీతారత్నం అరవింద్ తండ్రి, సుహాన్ కు తాత, సంధ్యకు మామగారు.
వృద్ధులు పిల్లలు ఒకే రకం మనస్తత్వం కలిగి ఉంటారు అన్నది పెద్దల మాట. అందుకే సుహాన్ కు తాతయ్యంటే ఎంతో ఇష్టం. కానీ పెద్దల వాసన దగ్గర కూడా ఉండకూడదన్న ఈ నాగరికత ప్రపంచంలో సీతారత్నం గారి కోడలు సంధ్య, మామగారిని ఇంటికి దూరం చేసి వృద్ధాశ్రమానికి దగ్గర చేసింది. కానీ సుహాన్ మనసుకు మాత్రం వాడి తాతయ్యను దూరం చేయలేక పోయింది. ఇక ఇక్కడినుంచి కథ మొదలు!!!
ఈ కథ పేరు “ఎర్ర సూరీడు”. ఇది “నేటి నిజం” దినపత్రికలో ప్రచురింపబడింది.
“డాడీ, తాతయ్య ఎప్పుడు వస్తాడు?” అంటూ సుహాన్ ప్రశ్నించడంతో కథ ప్రారంభం.
దానికి ఆ పిల్లాడి తల్లి జవాబు –
“నీవైతే ఆయనను మళ్లీ తీసుకొచ్చావనుకో నా యొక్క అసలు రూపం చూపిస్తా…” అని భర్తను బెదిరించి, పిల్లాడిని చెవులు పెట్టి లాగుతూ –
“మరోసారి తాతయ్య తొండం అంటూ వెధవ వేషాలు వేసావ్ అనుకో, తోలు తీస్తా రా!” అంటూ సంధ్య పిల్లవాడిని తీసుకెళ్తుంది.
ఆ తల్లికి కొడుకు మీద కోపమో, మామగారి మీద అసహ్యమో ద్వేషమో – రెండూ ఈ సంభాషణలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది కొన్ని ఇళ్లలో జరిగే సర్వసామాన్యమైన సంఘటన.
దీనికి కారణం కొంతవరకు బయట నుంచి వచ్చిన కోడలు స్థానంలో ఉన్న స్త్రీలే! వారికి వంత పలుకుతున్న వారి భర్తలు. కానీ అటు భార్యలను కాదనలేక ఇటు తల్లిదండ్రులను వదులుకోలేక మగవాళ్ళు నలిగిపోతున్నారన్న సత్యాన్ని కిరణ్ కుమార్ గారు కథాంతంలో సూచించారు.
సీతారత్నంలాంటి వారెందరో ఈనాడు తాము కట్టుకున్న సొంత ఇంట్లోనే స్థానం లేక వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా కొంత మెలకువగా తెలివితేటలతో తమ వృద్ధాప్యం గురించి జాగ్రత్త పడాలి. పిల్లల మీద ఆధారపడడం గాలిలో పెట్టిన దీపం లాంటిది. లేదా వారి దగ్గర ఉండాలి అనుకుంటే తమ ఆలోచనను, అధికారాలను, ఆశయాలను అన్నిటిని మూటగట్టి పక్కన పెట్టి పిల్లలను నూటికి నూరుపాళ్ళు అనుసరిస్తూ ఉండాలి!
ఈ కథలోని సుహాన్ లాంటి పిల్లలు కూడా ఇప్పుడు అరుదుగా ఉన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు వీటి ప్రభావం వల్ల పిల్లలు వృద్ధుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు. అలాగే పక్కింటి గొడవ పట్టించుకునే నాధుడే లేరు.
ఇలాంటి పరిస్థితులను బాగా గమనించిన కిరణ్ గారు కథకు తగ్గట్టుగా సంభాషణలను, సంఘటనలను రూపొందించి రక్తికట్టించారు. “ఎర్ర సూరీడు” అన్న పేరు పిల్లవాడికి, తాతగారికి తగినట్టుగానే ఉంది.
ఎర్ర సూర్యుడు అనేదానికి సంకేతంగా ప్రత్యేకంగా ఎర్ర వస్త్రాన్ని చూపించారు కిరణ్ కుమార్ గారు.
ఒక కథకు ఆయువు పట్లు వర్ణనలు, మచ్చుకు కొన్ని చూద్దాం:
“తండ్రి సీతారత్నమును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు అరవింద్. తిరుగు ప్రయాణంలో సూర్యుడు వెనక వైపు ఉండగా పక్కన తన తండ్రి సీతారత్నం వెలిగిపోతున్నాడు. పండు వారిన ఆ మడతల చర్మంతో ముఖంలో ఏదో ఆనందం…”
“పంజరం నుండి పక్షి బయటకు ఎగిరిపోయినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీసి తాతయ్య బుజాలను ఎక్కాడు సుహాన్!”
సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు మనిషి ముఖం కొంత లేత ఎరుపులోకి రావడం సహజం.
సీతారత్నం గారికి మనవడిని చూడగానే ముఖంలో కొద్దిగా తేలిపోతూ ఎర్రని… ఎంతో ఆనందంతో తేలిపోయాడు… ఎర్ర సూరీడులా వెలుగుతున్న ముఖంతో!!!
సుహాన్ కు కోపం వచ్చినప్పుడు వాడు చేసిన పనులు – టీవీని, ఫ్రిడ్జ్ ని పగలగొట్టడం, పెద్దగా అరుస్తూ “నాకు తాతయ్య కావాలి, ఇప్పుడే కావాలి!” అంటూ కోపంతో చేసిన పనుల వర్ణనలు కథా వస్తువుకు బలాన్ని ఇచ్చాయి.
కొడుకు కోపం వాడి బాధ మొదట్లో తల్లిదండ్రులకు చికాకు కలిగించి, చుట్టుపక్కల వారిని “మీకేం పనులు లేవా? మీ ఇంట్లో మీరు తగలడండి…” అంటూ సంధ్య ఆవేశంగా మాట్లాడినప్పటికీ, సుహాన్ తండ్రి అరవింద్ లో మార్పు వచ్చి, కొన్ని నిష్టుర వాక్యాలు సంధ్యతో పలకడంతో –
మనుషుల్లో మానవత్వం కొన్ని సంఘటనల వల్ల మేల్కొంటుంది అన్న సత్యాన్ని నిరూపించారు.
పదిమంది రావడం, ఆ దంపతులను చివాట్లు పెట్టడం – ఇవన్నీ ఏ ఇంట్లో అయినా పెద్దలను నిరాదరణ చేసినప్పుడు నిజంగా జరిగితే, ఆ పెద్దలు ఎంతో గొప్ప సంతోషాన్ని, మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కథ ఈనాటి సంఘంలో జరిగే సంఘటనకు దర్పణం లాంటిది. పిల్లలలో సూర్యుని వలె చురుకుదనం, స్వచ్ఛమైన మనసు ఉంటే ఆ సంసారంలో పెద్దవారికి పెద్దపీట వేయొచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దడానికి పిల్లలే పూనుకోవాలని చెప్పే మంచి కథ.
ఇరుగుపొరుగు వారు కూడా అనాలోచితంగా ఆవేశంలో ఉన్న వ్యక్తులను లాలించి, దండించి మంచి మార్గంలో పెట్టాలని… ఈనాడు తాము ఆచరిస్తున్నదే రేపు తమ పిల్లలు ఆచరిస్తారని భార్యాభర్తలు తెలుసుకోవాలని…
ఈ కథలో రచయిత కిరణ్ కుమార్ గారు గట్టిగా స్పష్టంగా చెప్పడం వల్ల పాఠకులకు మంచి సందేశం అందించారు.
ఉమ్మడి కుటుంబం బరువు కాదని, కలిసి ఉంటే సంతోషాలను కోల్పోవడం జరగదని సత్యం చాటి చెప్పే కథ “ఎర్ర సూరీడు”.
రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ గారికి అభినందనలు!!!
తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో వచన కవిత్వం ఒకటి.
తెలుగు భాషా సాహిత్య జ్ఞాన ప్రపంచంలో వచన కవిత్వాన్ని, పద్యాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది. పద్యాలు విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్చారణ పటిమను,ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,ఆలోచనను,వివేచనను,విచక్షణను,పెంపొందిస్తుంది.కనుక భాషాభోధనలో వచన పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.
తెలుగు భాషా మాధుర్యం లోని నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే శతక రచయిత గజ్జారాం చట్ల ఆదిలాబాదు జిల్లా ,బజర్హత్నూర్
మారుముల ఏజెన్సీ మండల కేంద్రంలోని శ్రీమతి/శ్రీ, చట్ల అమృతమ్మ, బక్కయ్య దంపతులకు 01 జూన్ 1961లోజన్మించారు.ప్రాథమిక విద్య స్వంత గ్రామంలో చదివి, ప్రాథమికోన్నత విద్య యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గురుకులంలో అభ్యాసించి ఉన్నత విద్యను హైదరాబాదులో పూర్తి చేశారు.డిగ్రీ పట్టభద్రులై పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. తెలుగు భాష పై ఉన్న మమకారంతో బాల్యం నుండే నాటికలు, కథలు, కవితలు రాయడం అలవాటు కావడంతో
సాహిత్యంలో బీజాలు పడ్డాయి.
వృత్తి రీత్యా పంచాయితి రాజ్ శాఖలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ పదవీ విరమణ పొంది ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ ”కౌమారామృత శతకం” ను రచించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేశారు. దేశానికి రోల్ మోడల్ నిలిచిన సర్వేలు గురుకుల పాఠశాలలో చదివే రోజుల్లో నాటికలు రాసి ప్రదర్శించి గురువుల మన్ననలు పొంది, ప్రధాన చార్యులు చేతుల మీదుగా చిట్టి పురస్కారం సైతం అందుకున్నారు.
తాను మాట్లాడే తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ శతక పద్యంలో
మానవుని జీవితంలో వికాస దశలు అందులో బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం మొదలు దశలు ఉన్నాయి. కౌమార దశ అన్ని దశలలో కెల్లా అతి ముఖ్యమైన దశ. ఈ దశలో సంభవించే శారీరక పరిపక్వత తో పాటు మానసిక వికాసంలో మార్పులు మరియు ఆరోగ్యం అభివృద్ధికి పునాదులు వేయబడతాయి. ఈ దశలో హార్మోన్లు ఉత్పత్తి కావడం, అతి ఒత్తిడితో ద్వంద్వార్థాల పదాలు అతిగా వాడటం, మిత్రులతో చిలిపి చేష్టలు చేయడం, చేడు స్నేహితుల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవడం, చివరికి జైలు పాలు కావడం జరుగుతుంది. కౌమార దశ ముగిసే సమయానికి చదువు సంస్కారంతో మెదడుకు పదును పెడుతూ ఉపాధి పొందాలన్న గొప్ప ఆలోచనలతో ముందుకు సాగితే ఆనందదాయకమైన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ధైర్యంగా కొత్త అనుభవాలను స్వీకరించి, వాటాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కౌమార దశలో సంభవించే కౌమార విజయం, కౌమార రుగ్మతలు వాటి పరిష్కారాల మార్గాలు మొదలగు అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన” కౌమారామృత శతకం” ను ఎంతో ఉత్సాహంతో రచించారు.ఇది గజ్జారాం చట్ల గారి తొలి రచన కావడం విశేషం.
శతక కర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో వచన పద్యాలను తీసుకుని నేటి తరానికి ఈ శతకము ద్వారా సమాజంలో కౌమార దశలో పతన మౌతున్న భక్తి,నీతి, ప్రేమ, జీవిత విలువలను తీసుకురావడానికి, బాలబాలికలు, విద్యార్థులు, సమాజ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారు చైతన్యవంతులు కావాలనే తపనతో, తన యొక్క రచన నైపుణ్యం వలన ప్రయత్నాలు చేస్తూ, నిర్మల్ జిల్లా పద్యకవులలో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు.
ఈ పద్య ఛందస్సు ప్రమేయం లేకుండా 108 పద్యాలు రచించన గజ్జారాం చట్ల గారు. 2023లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్ లో అప్పటి తెలంగాణ తొలి దేవాలయ గృహ, నిర్మాణ న్యాయ అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి శ్రీ , వరుణ్ రెడ్డి ఐఏఎస్,గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. తొలి గురువు ఆయన తన తండ్రి కీ,శే, బక్కయ్య చట్ల గారితో ఏర్పడిన తండ్రి కొడుకుల బంధం కాస్తా గురుశిష్య బంధంగా మారడంతో పాఠశాల స్థాయి నుంచే తెలుగులో కవితలు , కథలు, నాటకం, పద్యాల పట్ల ఆకర్షితులై నాన్న గారి పద్యాలు విని స్ఫూర్తి పొందారు.తదనంతరం స్వయానా భగవద్గీత అర్థ తాత్పర్యాల పుస్తకాలు చదువుతూంటే వాటి అర్థాలను నాన్న వివరించే వారు. ఇంతటి గొప్ప పాండిత్యాన్ని తండ్రి వలన సంపాదించారు.
మాతృ మూర్తి, మాతృ భాష అంటే ప్రాణమని చేప్పే గజ్జారాం చట్ల తెలుగు భాష పై ఉన్న అభిరుచి తో తనకు చిన్నప్పుడు తల్లిదండ్రుల నేర్పిన సాహితీ విద్యతో శతకం పూర్తి చేసారు.తన తొలి శతకాన్ని బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే అను దైవస్తుతి తో ఆరంభించడం గొప్ప విషయం.
కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం; –
1).
శైశవంలో సంరక్షణ – సరస్వతీపతి
బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే
యవ్వనం వార్దక్యం – పరిపక్వమే
చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృత పుత్రా!!
భావము :- పిల్లలు దైవ సమానులు
అని అంటారు.రచయిత మనవ జీవితంలోని వికాస దశలను వివరిస్తూ శైశవ దశలో బ్రహ్మ దేవుడు బాల్యంలో విష్ణువు సంరక్షిస్తూ నడిపిస్తారు.మరి యవ్వనం, ముసలితనంలో ఆదర్శంగా నిలిచిన మనిషి ,కౌమార దశలో పలు సమస్యలను ఎదుర్కొనక తప్పదు అని
చక్కగా వర్ణించారు.
2).
స్నేహితుల సాంగత్యం – అధికమగుటచే
తల్లిదండ్రుల సాన్నిధ్యం – అధమమగునులే
సాంప్రదాయ సంస్కారం – గగనమగుటచే
ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మ న్యూనతే – అమృత పుత్రా !!
భావము:- ఓ అమృత పుత్రా! నీవు స్నేహితులతో కలిసి చేసే సరదా, చిలిపి చేష్టలు ఒత్తిడిని తగ్గించి,స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. కనుక తల్లిదండ్రుల చేప్పిన మాటలు పిల్లలు పట్టించుకొక దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తన సంస్కృతి సంప్రదాయాల పట్ల కూడా చిన్నచూపు కలిగి ఆత్మ విశ్వాసం తగ్గిపోవడంతో ఆత్మ న్యూనత పై ప్రభావం చూపుతుందని కవి స్పష్టం చేశారు
3)
ఇట్టి ఘర్షణ తో గడిపేటి – కౌమారంలో
ప్రేమ తగ్గి,పగనెగ్గి – బుగ్గిపాలె భవిష్యత్తు
హార్మోన్లు,మేధవృద్ధి కారణమని ఎరిగి – తల్లిదండ్రులె
మార్చాలి తనయుల బుద్ది – అమృత పుత్రా!
భావము:- కౌమార దశలో హార్మోన్ల మార్పు వల్ల మానసిక ఆందోళన, చిరాకుతో రక్తసంబంధికుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు తగ్గి పోతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు కారణాన్ని గుర్తించి తనయులను అనుకూలంగా మార్చుకోవాలని కవి భావోద్వేగంతో
తెలియజేశారు.
4).
తనుపడ్డ తిప్పల్ని – తనయులు పడకూడదంటు
గాడిద చాకిరి చేసి – డబ్బు గడించి పెడితే
గార్థభ పుత్రులు మొత్తం – బూడిద పాల్చేసి
అడుక్కు తింటుంటారు – అమృత పుత్రా !
భావము:- తాను పడ్డ కష్టాలు భవిష్యత్తులో పిల్లలు పడకుడదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచడమే అస్సలు పిల్లలు చెడిపోవడానికి కారణం. దీని వల్ల పిల్లల పట్ల మనం చూపిస్తూన్న ప్రేమ వారిని బద్దకస్తుల్ని చేస్తుందని దానితో పిల్లలు దద్దమ్మలుగా తయారవుతున్నరని రచయిత శత శాతం వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
రచయిత గజ్జారాం చట్ల గారు సంఖ్యాపరమైన
శతక లక్షణం పాటించి 108 పద్యాలు లిఖిస్తు “అమృతపుత్రా” అనే తన అమ్మ పేరుతో మకుటంగా శతకం రాయడం అభినందనీయం.
వారి పదపొందిక, రచనా నైపుణ్యం, కవితా శైలి
ఎంతో బాగుంది.ఎన్నో విషయాలను సృజించిన కౌమార రచయిత గజ్జారాముని కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.
వెల : ₹=150/-
ప్రతులకు,
ఇ.నెం1- 4–130/3
ఆదర్శనగర్ ,
నిర్మల్ జిల్లా,-504106
చరవాణి : 9959299039
మనిషిని సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే సమయం బాల్యం అపురూపమైన ఈ పసివయసును తీర్చిదిద్దుకునే అనేక సాధనాల్లో ఒకటి సాహిత్య పరమైన ప్రక్రియ కథ, దీనిని వినడం సులువే కానీ వ్రాయడం కష్టం చెప్పటం మరీ కష్టం, కానీ పూర్వం మన మౌఖిక సాహిత్యం లోని బాలసాహిత్య
మంతా ఆసక్తిదాయకంగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బామ్మలు , నోటి వెంట అలవోకగా వెలువడి నాటితరం బాల్యాన్ని అందంగా తీర్చిదిద్దింది.
నేటి ఆధునిక కాలంలో బాలసాహిత్యపు కొమ్మగా ఎదిగిన వ్యక్తిత్వ వికాసం అనే ఈ సాధనం నేడు అన్ని వయసుల వారికి అత్యవసరమైంది, కారణం గతంలో ఇది పాఠ్యాంశాల గతంగా ఉండి విద్యార్థులకు పాఠ్యాంశాల యుతంగా అందేది, నేడున్న యాంత్రిక, మార్కుల ర్యాంకుల పోటీ చదువుల్లో కేవలం సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించి మార్కులు పెంచుకునే పనిలోబడి అసలైన వ్యక్తిత్వ వికాసం లేక దానికోసం మళ్లీ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాల్సిన బిజీ షెడ్యూల్ మనది,
అందుకనే నేడు బోధనా వృత్తితో సరి సమానంగా వ్యక్తిత్వ వికాస నిపుణుల సేవ కూడా అత్యవసరం అయిపోయింది, అందుకు అనేక పాఠ్యాంశాలు అవసరమయ్యాయి అందుకోసం అందరికీ అర్థమయ్యేలా మాత్రమే కాక అందరూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా తయారు కావాలనే లక్ష్యంతో రూపొందించబడినవి కథాకేళికార్డులు వీటి సృష్టికర్త బాలల కథాతపస్వి చొక్కాపు వెంకటరమణ, వీరు ప్రసిద్ధ పత్రికా రచయిత, ఇంద్ర జాలికుడు, వ్యక్తిత్వ వికాసనిపుణుడు,

తను యావత్ సంసారాన్ని బాలల కోసం అర్పించిన అచ్చమైన బాలసాహితీవేత్త, 2015సం: బాల సాహిత్యంలో కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత,
మనం ముందు చెప్పుకున్నట్లు కథలు, అందునా బాలల కథలు వ్రాయడం కన్నా చెప్పడం చాలా కష్టం, కానీ కథలు చెప్పడంలోని మెళకువలు గురించి ఆసక్తి దయకంగా అనేక టెక్నిక్స్ వివరించారు చొక్కాపు వెంకటరమణ, ఇవి పుస్తక రూపంలో కాకుండా అందమైన ఆకర్షణీయంగా ఉండే పంచరంగుల బొమ్మలతో కూడిన కార్డుల రూపంలో ఉన్నాయి,
“మనిషి మనసును రాకెట్ వేగంతో స్వప్న లోకాలన్నీ తిప్పి తీసుకువచ్చే మాయాతివాచి ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కు సంబంధించిన కథాకేళి కార్డులు” అని రచయిత అభివర్ణించడంలో అక్షరసత్యం ఉంది.
దీనిలో 130 కథలు చెప్పే మెళకువలు,78 కోసమెరుపు కథలు, 120 “పంచ్”దారపలుకులు, కలిసి 56 కలర్ ఫుల్ కార్డులు గా ఉన్నాయి,
రాత్రి నిద్ర పట్టని 60 ఏళ్ళ ముసలాయనకు నిద్ర రప్పించడం కోసం ఆ ఇంటి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు అతనికి నిద్ర మాత్రల వల్ల కూడా నిద్ర రావడం లేదు, చివరికి హిప్నాటిస్టు ద్వారా ఆయనకు ఎలా నిద్ర వచ్చిందో చక్కని చమక్కు గల హాస్యం కలిపి చెప్పిన కథ “పిచ్చోడు” బాల్యంలో కలాం ఆయన పిన్ని కూతురు చెట్టు ఎక్కి ఆడుకుంటున్న వేళ పెద్ద గాలి దుమారం వచ్చింది, ఆ ప్రమాదం నుంచి కలాం ఎలా బయటపడ్డాడు, పిన్ని కూతురు చెట్టు నుంచి కిందపడి కాళ్లు విరగొట్టుకున్న విషయం చెబుతూ పెద్దలు పిల్లలకు జాగ్రత్తలు చెప్పడంలో తీసుకోవలసిన శ్రద్ధ గురించి చక్కగా చెప్పారు, సైకాలజీ కథల విభాగంలో,
పని ప్రారంభించకుండానే ఫలితం ఆశించే బద్దకస్తులకు చెంపపెట్టులా ఉండే చక్కని హాస్యపు గుళిక వంటి కథ “ప్రారంభించు”, కష్టపడకుండానే గొప్పవారు అయిపోవాలని అత్యాశపరులకు కనువిప్పు కలిగిస్తూ చక్కిలి గిలి పెట్టే “వరాలు” కథ కూడా అదే విభాగంలో చేరింది,
కథల్లో క్లుప్తత, మాటల్లో చతురత, ముగింపులో మంచి నవ్వింత, కలిగి ఉండటం ఈ బుల్లి కథల్లోని ప్రత్యేకతలు,
ఆరోగ్యదాయకమైన హాస్యంతో పాటు ఆలోచింపజేసే పదాలు కలిపిన ‘పంచ్’ ధార పలుకులు, భలేగా ఉంటాయి చదివే కొద్దీ చదవాలి అనిపించే ఈ పలుకులు ఎలా ఉన్నాయో మచ్చుకు ఒకటి చదవండి,
“అద్దం చూసుకుంటే/ మనకు మనమే కనిపిస్తాం/ అర్థం చేసుకుంటే/ ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం/..” ఈ పంచ్ లో ఎంత పరమార్థం ఉందో అర్థమైంది కదా??
ఇకపోతే ఇందులో మరో ముఖ్యమైన విషయం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ఎవరిమైనా ఎవరికైనా కథ చెబుతున్న.. వ్రాస్తున్న అతి ముఖ్యమైన ఆరు సూత్రాలు పాటించాలి అంటారు రచయిత చొక్కాపు, కథలు చెప్పడానికి కమ్యూనికేషన్ అత్యవసరం అంటూ… పాటించాల్సిన ఆరు సూత్రాల గురించి గుర్తు చేస్తూ…
ఎవరు చెప్పబోతున్నారు? ఏ కథ చెప్పబోతున్నారు? ఎవరికి చెప్పబోతున్నారు? ఏ సమయంలో చెప్పబోతున్నారు? ఎక్కడ చెప్పబోతున్నారు? ఎలా చెప్పబోతున్నారు? అనే అంశాల గురించి కూలంకుషంగా చెప్పారు, ఇవి పాటించటం ద్వారా మనం చెప్తే కథాంశం ఎవరికి ఎలా చేరాలో అలా స్పష్టంగా చేరుతుంది, ఈ అంశాలు కథా రచయితలకు చాలా ఉపయోగం ఉంటాయి అలాగే ఈ కార్డుల్లో పొందుపర్చిన కథలు చెప్పడంలో వాడాల్సిన కళలతో పాటు, వాడకూడని అంశాలు కూడా పేర్కొన్నారు,
అదేవిధంగా కథ బాగా చెప్పాలంటే చేయాల్సిన పనులతో పాటు.. ఒకే కథను పెంచి చెప్పడం, తగ్గించి చెప్పడం,లోని మెళకువలు కూడా ఇందులో ఉదహరించడం చాలా ఉపయోగంగా ఉంది, అంతేకాకుండా పిల్లలకి పాఠాన్ని కథగా ఎలా చెప్పాలో ఇందులో అద్భుతంగా చెప్పారు, ఇది బోధనారంగం వారికి అత్యవసరమైన అంశం,
ఈ కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే?! వ్యాపార కథలు, కోర్టు కథలు, ఉపాధ్యాయుల కథలు, ఉపన్యాసకుల కథలు, పేరెంట్ కథలు, సీనియర్ సిటిజన్ కథలు, రేపటి పౌరుల కథలు, భాష విన్యాస కథలు, మూఢనమ్మకాల కథలు, మూర్ఖుల కథలు, ఉపాయం, కంగారు, లాజిక్, నిర్ణయం, విమర్శ, మొదలైన విభాగపు కథలను సరళంగా స్పష్టంగా ఆకట్టుకునే విధంగా చెప్పి.. పాత కథకులను కొత్త కథకులను ఔరా! అనిపించారు చొక్కాపు,
కథలు వినడం వల్ల కలిగే లాభాలు చెప్పడంతో పాటు వినూత్నంగా రూపకల్పన చేసిన ఈ కథాకేళికార్డులను ఎలా ఉపయోగించాలో కూడా చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు..
ప్రశ్నించే గుణం ఊహశక్తి సృజనాత్మకత జ్ఞానం శ్రవణ నైపుణ్యం కథలు వినడం చదవడం వల్ల వెంటనే అభివృద్ధి అవుతాయి అనే గొప్ప విషయం ఇందులో వెల్లడించారు భాష మీద పట్టు పెరగటంతో పాటు సంభాషణ చతురత పెంచుతూ స్టేజి ఫియర్ పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని రకాల వారికి అక్షర ఔషధ గుళికలు ఈ కథకి రికార్డులు భావి పౌరులే కాదు సమాజ బాధ్యత తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని సొంతం చేసుకోవడం నేటి ఆధునిక కాలంలో అత్యవసరం అన్ని వివరాలకు రూపకర్త చొక్కాపు వెంకటరమణ సెల్:+91- 9246520050.
కవి హృదయం సున్నితమైనది. ప్రతి వస్తువులో ప్రాధాన్యతను గుర్తిస్తాడు. పువ్వులోని సువాసనలు, పక్షిలోని జీవనతత్వం, మానవ మనగడలోని ప్రతి కోణాన్ని తన కలమనే ఆయుధం ద్వారా కవిత్వీకరిస్తాడు. కొన్ని సందర్భాలలో మనసును వెంటాడే అంశాలను, భావోద్వేగమైన సంఘటనలను ఎద పొరల్లో కదిలించి వేసినప్పుడు, తను ప్రతిఘటించ లేనప్పుడు మానవత్వం గల మనిషిగా మానసికంగా ‘మరణిస్తూనే’ ఉద్యమ గీతమై, ఎగిసిపడే కెరటమై భావాల అలలా తీరం చేరడానికి ప్రయత్నిస్తాడు.
ఒక వస్తువు అందమైన రూపాన్నివ్వాలంటే లోహాన్ని నిప్పులో కాల్చి సుత్తితో కొడుతూ ఆకారాన్ని ఇచ్చి నగిషి కూర్చాలి. కవి హృదయం కూడా అంతే. అంతరంగంగా మథనం చేస్తూ సముద్ర కెరటంలా పడి లేస్తున్నట్లే కవి మనసు సమాజ హితమైన వాక్యం రాయడానికి ఓడి గెలుస్తూ, గెలుస్తూ ఓడడం వల్ల కవి ‘మరణిస్తూనే’ తన కలం ద్వారా తిరిగి జన్మిస్తూ, ఆకాశంలోని సూర్యునిలా ప్రకాశిస్తూ మానవ మనుగడకు ముందు ఉంటాడు. ఇటీవల బిల్ల మహేందర్ వెలువరించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ సంపుటి కూడా మానవ సమాజ మార్పు కోసం పరితపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కవి గా ఆందోళన, సంఘర్షణకు గురవుతూ అనేక ప్రశ్నలు వేధిస్తుండగా ఆ మానసిక స్థితిని కవిత్వం చేసాడు. అలాంటిదే ‘మేం కవిత్వమే రాస్తాం’ కవితలో చూడొచ్చు. అసమానతలను రద్దు చేస్తూ, సమిష్టి ఉద్యమాల అవసరాన్ని గుర్తిస్తూ వాటి ఆశయాలకు నిబద్ధుడై కవిత్వం రాస్తాడు బిల్ల మహేందర్.
సమాజం అంటే మనుషుల సమూహం. అంటే మనిషి సమాజంలో అంతర్గతంగా ఉంటాడు. కరోనాకాలం మనుషుల మధ్య ఎడమ చూపించినప్పటికీ ఆపదలో ఒకరికొకరు అండగా ఉండాలనే ఆవశ్యకత కూడా నేర్పింది. మానవత్వాన్ని సజీవం చేసింది. కవి రాసిన ఓ కవితలో ‘చినుకు/ మట్టిలోంచి విత్తు మొలకెత్తించినట్లు/ మనిషిలోని మానవత్వాన్ని/ మొలకెత్తిస్తే ఎంత బాగుండు!?’ అంటాడు. ఇక మనిషి పువ్వై పుష్పించి మానవతా పరిమళాలను వెదజల్లాలని ఆశపడతాడు.
ఇజ్రాయిల్ బాంబుదాడులకు, సైనిక కాల్పులకు మరణించగా మిగిలిన పిల్లల లేత మనసులు భయబ్రాంతులకు గురైన సందర్భాన్ని ‘ముట్టుకుంటే ముత్యమైపోతరు కదా/ పట్టుకుంటే లేడి పిల్లలై దుంకుతరు కదా/ కదిలిస్తే పువ్వై విచ్చుకుంటరు కదా’ అంటూనే వారి మానసిక స్థితిని ”బ్రెడ్ కు రాసిన జామ్ ను చూసి రక్తమని’ భయపడిన క్షణాలను భిన్నంగా అక్షరీకరించాడు మహేందర్. బతకడమే యుద్దంగా మార్చిన వ్యవస్థను ధిక్కరిస్తాడు.

నేటి ప్రపంచీకరణ కాలంలో చదువుల వేటలో పిల్లలకు, కన్నవారికి మధ్య దూరం పెరుగుతున్నది. అలాంటి సందర్భాన్ని ‘నాలుగు పదుల వయసు దాటాక / ఖాళీ విలువ బాగా తెలిసి వచ్చింది / ఒక్క ఖాళీ పూరించడానికి వేలసార్లు మరణించేవాడిని / ఇప్పుడు నాకు ఆరుపదులు / ఇద్దరు పిల్లలు రెక్కలొచ్చి అందనంత దూరం ఎగిరిపోయాక / బతికే పూరించని ఖాళీగా మిగిలిపోయింది’ అంటాడు. చేనేత పరిశ్రమ గురించి చక్కగా వ్యథభరితంగాత ‘ఆకలి పేగుల్ని పోగులుగా పోగులుగా రాట్నంతో వడికి / కండలను కండేలుగా చేసి / ఒంటి చేత్తో పట్టు బట్టలు నేసిన బాపు / పెయ్యి మీద రోజు ఒక్కటే చినిగిన బనీనును తొడుక్కునప్పుడు / బాపు ఎందుకో నాకు నచ్చలేదు’ అంటూ తండ్రుల త్యాగాలను స్పష్టం చేశాడు.
స్త్రీ, పురుషుల సంబంధాల్లో పురుషాధిక్యతను తెలిపే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ‘మౌనానికి అర్థాలు వేరులే’ అన్నట్లుగానే నిశ్శబ్దానికి భావాలు అనేకం. మనం సూటిగా చెప్పలేని భావం నిశ్శబ్దానికి వదిలినట్లే కవిత్వం నిశ్శబ్దం భావాన్ని వ్యక్తీకరిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీ మెడలోని బంగారం అవసరానికి ఆయుధంగా మారే ఆర్థిక వనరు అవుతుంది. ఎన్నో, మరెన్నో సార్లు మన జీవన యానం ఆర్థిక వనరుగా మారుతుందనే విషయం ‘వసంతహారం’ కవిత తెలుపుతుంది. అంతర్జాలంలో చిక్కుకుపోయి స్మార్ట్ ఫోన్ కి వెళ్ళాడుతున్న తరం గురించి ‘గూగుల్ సెర్చ్’ లో, గాజా యుద్ధం అంతర్జాతీయ దృక్పథాన్ని మరియు దురాక్రమణ, ప్రతిఘటన దాడులు సర్వసామాన్యమైపోయిన పాలాస్తీనా దారుణమైన జీవన బీభత్సవాన్ని ‘గాజా’ కవిత్వం లో అద్భుతంగా కవిత్వీకరించాడు.
రైతులు మన దేశానికి ఊపిరి అని, వాళ్ళ చేతులు కాళ్లు దేశాన్ని, ప్రజలను బతికించే ఆకుపచ్చ సంతకం చెబుతూ వారి ఆత్మ గౌరవాన్ని చాటుతాడు కవి. ‘బతకంతా అసమానత శిలువను మోస్తూ, అడుగడుగున అవమానపు చూపులు ధరిస్తున్న’ బహిష్కృత మానవుడి దుఃఖం మురికి కాలువలు, ఫుట్ పాత్ ల చిరునామాగా ఉపాంతీకరించబడిన మానవుడి దుఃఖం ‘నా దేశం / ఏ కులం గానో మతం గానో / విడిపోయిన ప్రతిసారి / నేను మరణిస్తూనే ఉన్నాను’ అంటూ కవిగా తన మనోవేదనను కవిత్వం చేసిన బిల్ల మహేందర్ తాత్వికత తెలిసిన కవిగా ఈ సంపుటిలో కనబడతాడు.
సంఘజీవియైన కవికి సామాజికాంశాలపై సునిశిత దృష్టి ఉండాలి , ఎరుకతో ఉంటూ విజ్ఞత ప్రదర్శించాలి. ముఖ్యంగా సూక్ష్మగ్రాహిగా ఉంటూ జనం గొంతుకై నినదీస్తూ కలాన్ని ఆయుధంగా
ఎక్కుపెట్టాలి. సమకాలీన అంశాల్ని కథా వస్తువులుగా చేసుకుని అలతి పదాలతో విషయాన్ని సూటిగా సహజంగా చెప్పాలి.
‘లోకం పోకడ’ పుస్తకంలో సోదరులు యరకల యాదయ్య గారు సామాజిక స్థితిగతులను గమనిస్తూ, జనజీవన వైవిధ్యాలను, వారి మనస్తత్వాలను దగ్గరగా చూస్తూ కవిగా తమ భావాలను వర్ణరంజితంగా మలిచి చక్కగా రాసుకున్న అక్షరసత్యాలు.
పేరు పెట్టని కవితలే అన్నీ ,
బతుకు పోరాటంలోని ఆరాటాల్ని , సంఘర్షణలను అద్దంలో
చూపెట్టారు.
ముందుగా కాలే కడుపుల కడగండ్లను కళ్ళ ముందుంచుతూ …
‘మలమల లాడి
ఎండిన డొక్కలు
కష్టాన్ని ఎత్తుకుంటాయి…
అంటూ ఆకలి పోరాటంలోని ఆర్తిని, అవసరాన్ని చిన్న వాక్యాల్లో తేటతెల్లం చేసిన తీరు బాగుంది.
మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తూ’ గల్లీలో లొళ్ళైతే పిలిచిన పోరు
పక్కనుండి చెవులకు పని చెపుతరు… అంటూ
మనిషికి పక్కింట్లోకి తొంగి చూడడంలోని ఆసక్తిని ,ఆతృతను ఎత్తి చూపెడతారు.
ముసుగు వేసుకున్న మనుషుల ప్రవర్తన ,అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తూ…”అవసరమనుకుంటే అంగలారుస్తరు
ఆపద తీరగానే
ముఖం చాటేస్తరు”అంటూ స్వార్థం నిండిన మనుషులు ఎలా ఉంటారో చెప్తారొకచోట.
ఓటు విలువ, ఎన్నికల తంతు ఎంతలా దిగజారిపోయాయో చెప్తూ…
“ఓటు ప్రతి పౌరుడి హక్కు బిచ్చగాడిలా అడుక్కుతింటావేందుకు “అంటూ
ఓటరును అమ్ముడుపోవద్దంటూ మందలిస్తూ చిరుకోపం ప్రదర్శిస్తారు.
నగరీకరణతో పల్లెలు కళతప్పి రసాయన కర్మగారాలుగా రూపాంతరం చెందుతూ ఉంటే ఆవేదన వెళ్ళగక్కుతూ… “రసవాయువులు కొన్ని ఊపిరితిత్తులను
దిగ్బంధించి శాసిస్తే
ఎన్నోఅస్వస్త జీవితాలకు ఊపిరులు పోస్తవి”
అని బాధను వ్యక్తపరుస్తారు.
ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేస్తున్న పెత్తందారీ వ్యవస్థను
ఎత్తి చూపిస్తూ…
“ఉత్పత్తి గొప్పేమి కాదంట
రాజ్యాలను ముంచి తేల్చిన
వర్తక పటిమనేనట”
అంటూ చురకలంటిస్తారు.
నాది నేననే భావనతో తప్పుడు దారిలో కూడబెట్టడం తగదంటూ, అశాశ్వతమైన జీవితంలో చివరికి ఏదీ మనతో రాదని తత్వబోధ చేసి శ్రమ దోపిడి మానుకోండని హితోపదేశం చేస్తారు.
రాజకీయ ఊసరవెల్లి రంగులు మార్చుతూ, కొండచిలువలా భూమిని భక్షిస్తుందంటూ ఆవేదన వ్యక్త పరుస్తారు . మౌనానికి మించిన ఆభరణం లేదని
వివేకవంతుడు సముచిత భాషణంతో భాసిస్తాడంటారు.
చివరగా ‘నా నగరం తెలంగాణ మణిహారం’ అంటూ యాభై యేండ్లలలో హైదరాబాద్ షహర్ ఎన్ని మార్పులు చేర్పులతో విశ్వనగరంగా ఎదిగిన పరిణామక్రమాన్ని చక్కగా వివరించారు.
యరకల యాదయ్య గారు ఒక సభలో కనిపించి రాధికమ్మా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తమ ‘ లోకం పోకడ’ పుస్తకం నాకందించారు. చదివిన తదనంతరం నా మనోభావాలను పేపర్ పై పెట్టాలని అనిపించింది. పుస్తకం సమతామానవతా విలువల కలబోతలతో సమాజం ఎలా ఉందో, మనం ఎలా ఉండాలో చెప్తూ, చిందే చెమట చుక్కలలోని అందాన్ని ,ఆత్మానందాన్ని చక్కగా వివరించిన యాదయ్యగారిని అభినందిస్తూ…
నల్లగొండ రమేష్ గారు నాటిన విత్తనం మొలకెత్తి,47 శాఖలుగా విస్తరించి (స్త్రీ శక్తి, ప్రకృతి, పెదవాగు, ప్రేమ, మానవ సంబంధాలు మొదలైన)ఒక్కో శాఖపై ఒక్కో రంగు పుష్పాలతో, తీయని పరిమళాలను వెదజల్లుతూ ‘కూడలిచెట్టు’గా సాహితీ అభిమానులను అలరించింది.
‘మన చెలిమి చెట్టుకు లేదు శిశిరం
మన మమతలకు లేదు ఏ దూరం
మనది ఆత్మీయమైన సమరం
మనది ఆనందాల తీరం ‘ (వసంతమే నిరంతరం) అంటూ చిగురేసిన చెలిమి చెట్టుపై వసంతగీతాన్నాలపించే స్నేహశీలి.
‘రొదల రొంపి కాంక్రీట్ పొదల హంపి
బందులకు ఇబ్బందులకు కేరాఫ్
సిటీ లైఫ్ నిజమైన పిటీ లైఫ్’ అంటూ సాగిన వీరి (మహానగరం)
ట్రాఫిక్ పద్మవ్యూహాలు, వాహనాల రణగొణ ధ్వనులు వీరికి సుతరామూ గిట్టవనే విషయాన్ని
ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో ప్రకృతి రమణీయతను,
పల్లె జీవనాన్ని వీరు అంతగా ప్రేమిస్తారన్న విషయాన్ని కూడా (ఒక తోవ)అనే కవిత తెలియజేస్తుంది.
‘రామప్ప గుడి నాట్యమదనిక శిల్ప లావణ్యం బలాదూరయ్యే తోవ ‘
ఎంత గొప్ప భావసంపద!
ఎంత చక్కని పోహళింపు!
తాను ప్రయాణిస్తున్న తోవలో నాట్యమదనిక శిల్పలావణ్యాన్ని చూడటం ( ప్రస్తావన దారి మళ్లుతోందని భావింపక,పాఠకులు కాస్త క్షమించగలిగితే… ఇంత అద్భుతమైన ఉపమానం చూడగానే ఒక్కసారిగా
‘పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల తేలేటి పూబంతివి ‘ అనే పాట నా మదిలో స్ఫురించింది. ఆ ఉపమానం ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పడానికి మాత్రమే ఈ ప్రస్తావన తీసుకొచ్చాను.) రాళ్లలో జవరాళ్లను చూడటం(కదిలిన రాళ్లు) వీరిలోని భావుకతను తెలియజేస్తాయి.
‘అరకు అందాలు దిగదుడుపైన దోవలోకి నా బైకుతో నా ప్రయాణం ఆరంభం అవ్వగానే ఒక పులకరింత అలలా లోలో తనువంతా అల్లుకుంది ‘
‘ పెదవాగు ‘ లేని వీరి కవిత్వాన్ని చూడలేం. పెదవాగును ఎంతగా ఇష్టపడతారో ఆకుపచ్చని అందాల నడుమ సాగే తమ బైకు ప్రయాణాన్ని కూడా అంతే ఇష్టపడతారనే విషయం పాఠకులకు చాలాసార్లు అవగతమ వుతుంది.
‘వాగు వంపుల వయ్యారపు నడకలు గవ్వలు గువ్వలు అలలు గాలి వలలు
ఇటు తీరం అందం…. అటు పెదవాగు హోరందం(చానకాలం తర్వాత) అంటూ పెదవాగు అందాలపై తమ భావాల వంతెనను నిర్మిస్తారు.
‘తన బతుకొక వెలుగు చూడని కృష్ణ బిలం
తనకు కలిసి రాలేదు పాడుకాలం
ఐనా
కష్టానికి ఎదురీదిన తీరుకు ఒక సలాం (ఒంటరిగా)’
నాలుగు వైపులా చీకటి ఆవరించిన ఒక స్త్రీ జీవితాన్ని ,
విధి ఆడిన వికృతకేళిలో సర్వం కోల్పోయిన ఓ నిస్సహాయురాలి దీనస్థితిని
‘బాధల రేపల్లె రాధమ్మ
అశోకవనంలో శోకిస్తున్న సీతమ్మ ‘అంటూ
హృద్యంగా వర్ణిస్తూనే,
‘కష్టాల కన్నీళ్లను ఎదిరిస్తున్న మనోరథం ఆమెది
జీవన సమరంలో జవసత్వాలున్న సుప్తచేతనం ఆమెది ‘అంటూ ‘అశోక వనంలో సీతమ్మ ‘అనే కవితలో శూన్యం నుండి కొత్త అడుగులేసే సంకల్పశక్తిని బలంగా నినదించారు.
‘ప్రగతి రఫెల్ లాగా దూసుకెళ్తుంటే
పేదరికం వానపాము లాగా సాగుతుంది'(ఆమె నడిచి వెళుతుంటే) అనడం
సంక్షేమ పథకాలు సామాన్యుడికి చేరడం లేదనే విషయాన్ని గురి చూసి వదిలారు.
‘రాబడికి మించింది అప్పు
తెలియక చేసిందీ తప్పు
జీవితాన్ని ముంచు అప్పోక ఊబి
నిరాశ దాని నాభి (ఆమె కంటిలో సముద్రమే బొట్టు) ‘ అంటూ మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒ లకబోసుకునే మనస్తత్వాలకు చురకలంటించారు.
‘బహుసుందర బహుళ అంతస్తుల భవనాలు
అయితే నేమి నిమిషంలో నిలువునా శిథిలాలు (మరు భూమి) ‘ అంటూ యుద్ధం సృష్టించే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం
‘రాయబారాలకు గ్రహణం పట్టిన వేళ
రాక్షస రాజకీయాలకు ఆగ్రహం పుట్టిన వేళ
పొగల్జిమ్ముతున్నవి సెగల నల్లని బూడిద కుప్పలు
పగల్జిమ్ముతున్నవి నాయకుల కద న ప్రకటనల గొప్పలు ‘
అంటూ (మరుభూమి )
యుద్ధం జనజీవనాన్ని ఛిద్రం చేసిన తీరును హృద్యంగా వర్ణించడమే గాకుండా, యుద్ధాలకు స్వస్తి పలకాలనీ,విశ్వమానవ సౌభ్రాతృత్వానికి చేతులు కలపాలనే శాంతికాముకుడు.
‘పొలమంతా నిండింది వాననీరు
కర్షకుడి కంట కట్ట తెగింది కన్నీరు’
‘ఆశలన్నీ ఆవిరి
ఊసులన్నీ హుష్ కాకి’
(సముద్రమంత దుఃఖం)
అంటూ అన్నదాత జీవితం ప్రకృతితో ముడివడిన విధానాన్ని ఆర్తిగా అల్లారు.
‘నా స్వేదం చిందించి మీకు కడుపు నింపే అమ్మను నేను
మరి నేను ఆకలికి అలమటిస్తున్నానెందుకో ‘(రైతు ధ్వజం) అంటూ దీపం కింది చీకటి వంటి అన్నదాత జీవితాన్ని బరువుగా పలికించారు.
‘పనే దైవం తనకి
కులంలో ఒక రజిత వెలుగు తన ఉనికి’
‘రక్తం కరిగించితే చెంగిలించిన తప్తలోహం
శ్రమించిన స్వర్ణకాల క్షణాలింకా ఎరుకే నాకు ‘అంటూ ఒక స్వర్ణకారుడి జీవితంలోని సాదక బాధకాలనీ, కుటుంబ పోషణకై ఒక తండ్రి చేసే పోరాటానికి(మా నాన్న) అద్దం పట్టారు.
‘ఆశల ఆవలి తీరాలగుండా ఊరేగే బాటసారులం మనం
లోకమంతా మాదే శోకమంతా మాదే(సూర్యులం)’
కవి ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాడో, “రవిగాంచని చోటు కవి గాంచున్” అని ఏ హృదయంలో ఏ వేదన ఉన్నా, అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవికే సాధ్యమనీ, అప్పుడే పదునైన కవిత్వం కాగితం పైకె క్కగలుగుతుందని చెప్పారు.
ప్రకృతి అందాలకు పరవశిస్తూ, దహేగాం తోవలో సాగే వీరి బైక్ ప్రయాణంలో ఏ కారణం వల్లనైనా మనసు స్విచ్ ఆఫ్ అయితే, ‘యూటర్న్ ‘ తీసుకుని వెండి వెన్నెల జల్లుల్లో హారతి పట్టిన ఆడబిడ్డ (కూడలి చెట్టు) చెంత మనసుని రీఛార్జ్ చేసుకుని, ఎదనిండా కొత్త ఊపిరి నింపుకొని, వారి అందమైన భావాలకు అరుణిమ కాంతులను, ధవళిమ వెలుగులను జతకూర్చి, వసంతవిపినపు సోయగాలతో మరో కవితాసంపుటిని సాహితీ అభిమానులకు అందించడానికి సమాయత్తం కావాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ…….
డిస్కో సంగీతం కన్న పల్లెలో వినిపించే కోయిల కంఠస్వరం తీయగా ఉంటుంది. నల్లా నుంచి వచ్చే నీటికన్న ఏటిలో చెలిమె తోడి నీళ్ళు తాగే అనుభూతి గొప్పది. ‘మాజా’కన్న మామిడిపండును స్వయంగా తీసుకొని రసాన్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది! ఆనాడు ఒక్క పైసకే వచ్చే బెల్లాన్ని తింటే కలిగిన ఆనందం ఈనాటి చాక్లెట్ బిస్కట్లతో కలగడం లేదు. చెట్టు కింద కూర్చుని గాలి పీలుస్తుంటే కలిగే సౌఖ్యం ఏసిలతో రావడం లేదు. చిర్ర గోనె ముందు క్రికెట్ బలాదూర్. గుడ్డి దీపం ముందర పదవ తరగతి పరీక్షలకు చదివిన వజ్ర సంకల్పం ముందు భూరి భవనపు ట్యూబ్ కాంతిలో చదివే పట్టా విద్య దిగదుడుపే. వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండాకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్ళీ రమ్మంటే వస్తుందా? ‘‘అనుభూతుల్ని పోగొట్టుకున్న గుండె ఎడారి. అనుభూతుల్ని పదిలపరచుకున్న గుండె సతతహరితారణ్యం’’. ఇటువంటి మధురమైన భావాల సుమమాల డా॥నలిమెల భాస్కర్ ‘‘సుద్దముక్క’’.
మట్టిమీద నడవాల్సిన పాదాలు మార్బుల్ మీద నడుస్తున్నందుకు బాధగా ఉంది. మట్టినిలబెడుతుంది. మార్బుల్ పడగొడుతుంది. అమ్మ ఇల్లంతా పేడతో అలికితే, వారానికి సరిపడిన శీతల గంధస్పర్శ. ఆనాడు ఇల్లు, సమస్త కుటుంబ సభ్యులకు ఓ శీతలీకరణ కేంద్రం. అడుగున ఆలంబనగా మట్టినేల, చుట్టూ మట్టిగోడలు, కప్పుపైన మట్టి గూనపెంకులు. మట్టి పొయ్యి మీద మట్టికుండలో మట్టిమనుషులైన కాపు బిడ్డల చెమట చుక్కలు మెతుకుల రూపంలో. చేదబావి మట్టి ఫ్రిజ్. మట్టి వాకిలి, పేడ సాన్పు, సుద్దతో ముగ్గులు గృహ పుస్తకానికి ముచ్చటైన ముందుమాటలు. మట్టికీ ఇంటికీ మనిషికీ గల బంధం భాస్కర్ కవిత్వంలో ఆస్వాదిస్తాం.

భాస్కర్ మనిషిని రెండు కాళ్ళ గేహం అంటాడు. గృహానికీ దేహానికీ అద్భుతమైన పోలికలు చెప్తాడు. కాళ్ళు పిల్లర్లు. మోకాలిచిప్పలు ప్లింత్ బీములు. జీవకణాలు ఇటుకలు. బొక్కలు ఐరన్. మాంసం సిమెంట్. పై తోలు ప్లాస్టరింగ్. పుర్రె స్లాబ్. కళ్ళు కిటికీలు. ముక్కుపుటాలు శ్వాసకోశాలు, వెంటిలేటర్లు. నోరు ప్రధాన ద్వారం. పొట్ట సువిశాలమైన హాలు. గుండె వాటర్ ట్యాంక్. వీటిని కవిత్వీకరించిన తీరు భాస్కర్లాగా మరెవ్వరూ చేయలేరు.
ఇందులో శ్రామికజనజీవన చిత్రణం ఆర్ద్రంగా ఉంటుంది. శ్రామికుల ఋణం మనం తీర్చుకోవాలనిపించేలా చేస్తుంది. తమ బతుకుల్ని బండలకేసి బాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు రజకులు. మన బట్టల్ని పిండీపిండీ వాళ్ళు తోలుబొమ్మలవుతారు. వాళ్ళు ఉతికిన దుస్తులతో మనం మన లోపలి ముఖాన్నీ మురికినీ చాటు చేసుకొని రోజూ నాగరికులమవుతాం. ఎవరి బట్టల్ని వారికి, తప్పిపోకుండా అందించే అమోఘమైన జ్ఞాపకశక్తి వారిది. ‘‘సమాజ కల్మషాన్ని కడిగివేయడానికి/ కంకణధారులైన వ్యక్తులు సంస్కర్తలయినప్పుడు/ తరతరాలుగా మైలబట్టల్ని/ మల్లెపూలు ఉల్లిపొరలూ చేసేందుకు/ కటి బద్ధులైన వీళ్ళూ సంస్కర్తలే’’.
చెప్పులు కుట్టేవాడురెక్కలూడి విలవిలా కొట్టుకుంటున్న మన పాదరక్షలను ఆప్యాయంగా సేదదీరుస్తాడు. ‘‘తెగిన మన వేళ్ళనీ/ ఊడిన మడమల్నీ/ ఏ సంజీవనితో అతుకుతాడో కాని/ మళ్ళీ మన కాళ్ళు క్షణంలో రెక్కలౌతాయి’’. మడిచిన తన మోకాలిమీద గడ్డం ఆనించి అతనలా తదేక దీక్షతో మన పాదరక్షల్ని కుడుతుంటే ఈ కవికి, బట్టలు తొడుక్కున్న వేమనయోగి భంగిమ గుర్తుకొస్తుంది. బ్రహ్మ కడిగిన పాదమైనా అతనికి బలాదూరే. మగ్గం ముందు చేనేత కార్మికుని ఆకారం ‘‘తన కాళ్ళూ చేతుల్ని/ లయబద్ధంగా కదుపుతూ/ కళ్ళల్లో వత్తులూ పత్తులతో పాటు/ దారాలు వేసుకొని/ వాటిని తన కన్నీళ్ళతో పిండి/ చెమటతో తడిపి/ నెత్తురులద్ది/ మన కళ్ళముందే పడుగూ పేకల్ని కలగలిపి/ ఒక వస్త్రాన్ని తయారు చేస్తుంది. అతని గుండెనిండా లబ్‌డబ్ శబ్దం బదులుగా లట్కురం పొట్కురం శబ్దమే వినిపిస్తుంది. చేనేత వాళ్ళయినా, చెప్పులు కుట్టేవాళ్ళయినా, రజకులైనా ఈ కవి వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి కవిత్వం రాసినట్టుగా ఉంటుంది.
వాన గురించి ఇందులో ఉన్నది కమ్మని కవిత్వపు సోన. మొగులు మెత్తవడుతది. గాలి ఇసిరిసిరి కొడుతది. మొగులు మీద ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు గుడగుడ మొదలయితది. చినుకు పడుడు ఆలిశెంబూమిలకెల్లి బువ్వ వాసన వస్తది. మేఘాలు నేల మీద చేసే తొలి సంతకం వాన. పడిన ప్రతి చినుకూ కంచంలో మెతుకై పరిణమించడం అసలు సిసలైన వాన. ‘‘రైతులు శెమ్ట వడిపితే/ పొలంలకెల్లి సెంటత్తది పంటత్తది’’.
నలిమెల భాస్కర్‌కు ‘‘పుస్తకాల షాపులోనో/ పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడమంటే/ పూలతోటలో అలా హాయిగా విహరించి రావడం/ పుస్తకాన్ని ఎత్తిపట్టుకోవడమంటే/ రచయితను మన చేతి పొత్తిళ్ళలో/ ఒడుపుగా ఓలలాడిరచడం లాలించడం’’. అతనికి ప్రతిదీ కవిత్వమే. చెట్లకు నీళ్ళు పోసి వాటి దాహం తీరుస్తుంటే కవిత్వం రాసినంత సంతోషంగా ఉంటుంది. కాపు బిడ్డలు పొలంలో వంగి నాట్లు వేస్తుంటే సామూహిక కవి సమ్మేళనం గుర్తుకు వస్తుంది. పెరట్లో రకరకాల పూలు రంగులతో వికసిస్తుంటే తనకు మల్టీకలర్ పుస్తకం వేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ‘‘రైలు భూమ్మీద ఊయలలూగే నావ/ దేశం పెట్టెలు పెట్టెలుగా కనిపిస్తుంది/ అసలు సిసలు దేశం జనరల్ బోగీలోనే ప్రత్యక్షమవుతుంది/ పట్టాల పాదాలమీంచి దూసుకువస్తోన్న రైలు/ ఒక ద్విపద కావ్యంలా/ అద్భుతమైన దీర్ఘ కవితలా అనిపిస్తుంది’’.
డా॥నలిమెల భాస్కర్ బహుభాషా కోవిదుడు. అనువాదకుడు. ‘‘మా అనువాద కలాలతో ప్రపంచ సాహితీ పరిమళాల్ని మట్టి అంతటా పరుస్తాం. మాది అనువాద కులం/ మేం అనువాదకులం’’ అని సగర్వంగా ప్రకటిస్తాడు. ఈ కవి ఎన్ని ప్రదేశాల్ని తిరిగినా, ఎన్ని సాహిత్యాల్ని చదివినా స్థానికతను మరువడు. బహు భాషకరుల జిల్లా అయిన కరీంనగరంను ‘‘ఇది ఆదిమానవుని/ కాలితో క్యాలితో పునీతమైన పుడమి/ శాతవాహనుల ఏలుబడిలో/ చేవదేరిన శాగవారిన జాగ/ ఒక్క గాథాసప్తశతి చాలు/ ఇది హాలుని నేల/ కథాసరిత్సాగరాలకే కాదు/ కవితా నవలాది సకల సాహిత్య ప్రక్రియలకిది ఆలవాలం’’ అని ప్రశంసిస్తడు. ‘‘మానేరు కవులారా! మీరు కవిత్వం రాయడం మానేరు సుమా!’’ అని వెన్ను తడుతడు.
‘‘నలిమెల కవిత్వంలో కళ్ళు` ‘‘కదులుతున్న శరీరం తోటలో/ ఒకే తీరు సౌష్ఠవం కలిగి/ విరబూసిన సున్నితమైన కలువలు/ ఈ రెండు కళ్ళే ఈరేడు లోకాల వాకిళ్ళు/ ఈ రెండు కళ్ళే ఏడేడు పదునాల్గు భాషాసాహిత్యాల లోగిళ్ళు’’. చెట్లు పెడస్ట్రల్ ఫ్యాన్లు. మట్టికుండలు ఆదిలాబాద్ నుండి తరలివచ్చిన మట్టి గుండెలు. సహజ శుద్ధ శీతల రంజనిలు. ఉగాది కవితలో కొత్తకుండ తనను మట్టి నుండి సృష్టించిన కుమ్మరి గురించి కన్నీరు కుమ్మరిస్తుంది. నీరుమనస్సు నీరునీరౌతుంది. చింతపండు చింత పడుతుంది. బెల్లం ప్రశ్నిస్తుంది.
‘సుద్దముక్క’లో సామాజికత తక్కువేంలేదు. ‘‘ఈ తక్కెడకు/ ఎలానూ వ్యక్తిత్వం లేదు/ ఏ వైపున కొంత ద్రవ్యం పడ్డా/ అటు వేసే మొగ్గు చూపుతుంది/ గత్యంతరం లేక/ వ్యక్తిత్వం లేని తక్కెళ్ళ చేతనే/ అసంఖ్యాక జీవితాలు తూచబడుతున్నాయి’’ అన్నప్పుడు నేటి రాజకీయం, అధికారగణం, అవినీతి స్ఫురిస్తాయి. ‘‘కనీసం కొలిచే వ్యక్తైనా/ తక్కెడ కాకుండా ఉంటే చాలు’’ అనే దాంట్లో మనుషులు నిజాయితీపరులు కావాలనే ఆకాంక్ష ఉంది. ‘‘ముక్కు ఉక్కులా తయారవ్వనంతకాలం/ ఈకల్లో బాకులు మొలవనంతకాలం/ కోడి మెడ/ పిల్లికి సరదా’’ అనే పంక్తుల్లో బాధితులు సాయుధులు కావాలనే సందేశం ఉంది. ‘రూపాయిబిళ్ళ’ కవితలో మానవాళిని ‘మనీ’ గారడివాడు కోతిని ఆడిరచినట్లు ఆడిస్తున్నది. నాణెంలో బొమ్మాబొరుసుల స్థానంలో ప్రాణమున్న మనిషిని, మానవత్వాన్ని నిలబెడదాం రండి అని ఆహ్వానిస్తున్నాడు.
ఈ పుస్తకంలో ఇవన్నీ ఒక ఎత్తు. ఉపాధ్యాయుని గురించి, సుద్దముక్క గురించి రాసిన ఆరు కవితలు మరో ఎత్తు. ఆరు కవితలలో నలిమెల భాస్కర్ ఉపాధ్యాయున్ని ప్రపంచాన అగ్రభాగాన నిలిపాడు. అధ్యాపకునికి అక్షరాభిషేకం చేశాడు. ‘‘అతడు కాలు మోపడం తోటే అణువణువూ అక్షరమవుతుంది/ అతని మాటల రెక్కల మీద/ పిల్లలు అత్యంత సురక్షితంగా/ జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు’’ అని ఉపాధ్యాయుడి ఔన్నత్యాన్నీ, ‘‘క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ/ అతని కుడిచేతికి ఆరో వేలు/ అదనంగా మొలుస్తుంది/ అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే’’ అని చాక్‌పీస్ ప్రాధాన్యాన్ని వెల్లడిస్తాడు. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరీ. పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరీ. పాఠం చెప్పీ చెప్పీ అతని ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరి తిత్తులవుతున్నా విద్యార్థులకు జ్ఞాన జ్యోతులు పంచుతాడు. విద్యార్థులకు అతడు బోధవృక్షం. సంచార బృహద్గ్రంథం. టీవీ పాఠాలు అతనికి ప్రత్యామ్నాయం కాదు. అతడు రక్తమాంసాలతో అపార ప్రేమాభిమానాలతో పిల్లల ముందు కదలాడుతున్న తల్లి, తండ్రి, మిత్రుడు, వేదాంతి. అతని దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత పవిత్రమైన కార్యం మరొకటి లేదు. అతడొక కాంతి నక్షత్రం. ఈ దీపం వెలుతురులో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తయారయ్యారు.
సుద్దముక్క సూర్యగోళం నుండి కోసుకొచ్చిన రశ్మి శకలం. చందమామ నుండి తీసుకొచ్చిన వెన్నెల గడ్డ, అన్నప్పుడు భాస్కర్ కవిత్వం తారాస్థాయికి చేరుతుంది. సౌందర్యోపేతం అవుతుంది. చాక్‌పీస్ విద్యార్థులకు ‘‘సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని/ తరగతికి వెళ్ళే ఉపాధ్యాయునికి ఊపిరి గుళిక/ ఉపన్యాసకులకు ఊతకర్ర’’.
సహజంగా, సులువుగా, ఆత్మీయంగా, త్యాగమయంగా ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నపుడు ఊగే పిల్లల ముఖాలు చూడాలి. పూవుకు తావిలా, పిల్లలకు చదువు సంస్కారాలు అబ్బినపుడే విద్యకు సార్థకత. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పినప్పుడే సార్థకత. భాస్కర్ దృష్టిలో ‘‘ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం బడి’’.
‘సుద్దముక్క’ తెలుగు కవిత్వంలో ఓ వజ్రపు తునక. ఇందులో అడుగడుగునా కవిత్వం. అణువణువునా నవత్వం. ప్రతివాక్యం ఆస్వాదయోగ్యం. అనుభవైకవేద్యం. డా॥నలిమెల భాస్కర్ ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులను జ్ఞానపీఠం మీద కూర్చోబెడతాడు.
ప్రతులకు :
డా॥నలిమెల భాస్కర్
97043 74081
రచన (అనుసృజన): శ్రీమతి శ్రీదేవీ మురళీధర్
ఒక మహిళ జీవితచరిత్రను మరొక మహిళ రచిస్తేనే అది రుచిస్తుంది అని నిశ్చితంగా రుజువు చేసిన రచన “స్వయంసిద్ధ – ఒక అభినేత్రి జీవనరేఖ”. ముఖ్యంగా శ్రీదేవీ మురళీధర్ గారి భాషా ప్రయోగం, సరళమైన రచనా శైలి, సూటిగా విషయాన్ని తెలియచెప్పే ధోరణి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక అసామాన్య ఆదర్శ జీవితాన్ని లిఖిత పూర్వకంగా సమాజానికి అందజేసిన శ్రీదేవీమురళీధర్ గారికి మన: ప్రీతి శుభాభినందనలు.

“రేఖ…” చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల కాలం నుంచి సంచలనాత్మక నటిగా మార్మోగుతున్న పేరు. తనదైన ప్రత్యేక శైలిలో అభినయ నైపుణ్యం గల అపూర్వమైన అభినేత్రిగా చలామణీ అవుతున్న పేరు. మొదట అయిష్టంగా అనివార్య కారణాల వల్ల చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టినా, సునాయాసంగా దుష్ట ప్రవృష్ట లోకపు చర్యల ద్వారా విషయాలను గ్రహిస్తూ, వాటికి తగ్గట్టు మెసులుకుంటూ రాటుదేలి రాణించిన మహిళగా గుర్తింపును కైవసం చేసుకున్న కథానాయిక. ‘ మహిళా సాధికారత ‘ కు ఈమె చరిత్ర ఒక ఉదాహరణ. ‘ సాధికారత ‘ మాట చిన్నదేగాని దాని వెనుక దశాబ్దాల లేదా జీవితకాలపు శ్రమ దాగివుంటుంది అని చెప్పటంలో “స్వయంసిద్ధ” నిర్ధిష్టమైన తార్కాణం. రేఖకు చిన్న ప్రాయంలోనే పెద్ద కూతురిగా కుటుంబ బాధ్యతలు మీదవేసుకోవలసి వచ్చింది. Elder daughter syndrome!! ఆమె ఉన్న చలనచిత్ర రంగంలోనే అప్పటికే ఘనకీర్తి సంపాదించుకున్న తండ్రి జెమినీ గణేశన్ ఉండి కూడా యే రకమైన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ తన పై పడలేదు సరికదా ఆమె నిస్సహాయ స్థితిని, ఒంటరితనాన్ని ఆసరా తీసుకుని వారివారి స్వార్థానికి వాణిజ్య కోణంలో ఉపయోగించుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఆమెపై నిందారోపణలు మోపుతూ మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అన్నీ భరించి అనుభవజ్ఞురాలిగా పరిణితి చెందింది. ఎవరి అంచనాలకూ అందని ఒక ఋషిక గా స్వశక్తితో ఆవిర్భవించింది.
అయితే, రేఖ ప్రముఖ నటి కాబట్టి ఆమె జీవితపు వెలుగు నీడలు బయటికి చర్చించుకునే అంశాలైనాయి. ఇట్లా బయటకు రాకుండా ఆటుపోట్లను అనుభవిస్తూ జీవితాలను సాగిస్తున్న మహిళలు ఎంతో మంది. తరాలు మారుతున్నా సమాజంలో పురుషాధిక్యత మాత్రం కనుమరుగు అవ్వటం లేదు. ఇక మీద కూడా అవ్వదు అనే నా అభిప్రాయం. కనుక మహిళలు ధీటైన వారిగా నిలదొక్కుకోవడానికి అధికంగా కృషి చేయాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ మహిళలు పురుషులకంటే తక్కువ కాకున్నా ఏదో రకంగా మాటలు పడవలసి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో మహిళలు విచక్షణా జ్ఞానం తో ఆలోచించి తమకు సానుకూలంగా ప్రతీదీ మలుచుకునేటట్టు చాకచక్యంగా వ్యవహరిస్తూ జీవితాలను చక్కబెట్టుకోవాలి. కుదరకపోతే అన్నిటినీ నిష్క్రమించి, మనశ్శాంతి కలిగించే జీవితాన్ని ఎంచుకోవాలి. దీనికి రేఖ వంటి మహిళల చరిత్రలు ఆదర్శప్రాయాలు.
మూడక్షరాల ‘ జీవితం ‘ చాలా విలువైనది, వెలకట్టలేనిది. దానికి రెండక్షరాల ‘ ప్రేమ ‘ ను జోడిస్తే ఆ జీవితము స్వర్గసీమ! స్వచ్ఛమైన ప్రేమ కోసమే తపించింది రేఖ. ఎంత ప్రయత్నించినా తల్లి తప్ప మరెవ్వరి నుంచీ పొందలేకపోయింది. తల్లితండ్రుల నుంచి తప్ప ఇంకెవరి నుంచి మాత్రం ఆశించగలం? కనుక ఆమె నిశబ్దంగా గాంభీర్యంగా హుందాగా తనకు ఇష్టంగా ఆరోగ్యంగా జీవిస్తున్నది. రేఖ జీవితం పురుషులకూ ఆదర్శం. సానపట్టు పడితేనే కదా వజ్రం మెరుస్తుంది. ఇప్పుడు కష్టనష్టాలను అనుభవిస్తున్నామంటే , తరువాత సుఖసంతోషాలను అనుభవించడానికే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెబుతాడు. ఇదే అంశం రేఖ చరిత్రలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కున్నా , కీకారణ్యం లాంటి పరిశ్రమలో తనదైన రీతిలో నిలదొక్కుకున్నది వాస్తవం. ఎన్నెన్నో ప్రముఖ అవార్డులు రివార్డులు తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎవరికీ అందని, ఎవరూ సూటిగా చూడలేని సూర్యుడిగా వెలుగుతుంది. ఆమె జీవితం ఒక గుణపాఠం. కనుక ఆమె ” స్వయంసిద్ద” .
పుస్తకం: “స్వయంసిద్ధ – ఒక అభినేత్రి జీవనరేఖ”
రచన (అనుసృజన): శ్రీమతి శ్రీదేవీ మురళీధర్
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు రచయిత్రిని మెసెంజర్ ద్వారా సంప్రదించగలరు (https://www.facebook.com/sridevi.muralidhar.9)
చెన్నమనేని స్వీయ చరిత్ర
చెన్నమనేని విద్యాసాగర్ గారి ‘ఉనిక’ ఒక విజ్ఞాన ఖని అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ఒక మంచి పుస్తకం చదివాను అన్న భావన కలిగించింది. ఇది వారి రాజకీయ, సామాజిక అనుభవాలని, పరిజ్ఞానాన్ని మనకు పంచుతూ ఇచ్చిన ఒక కానుక. ఈ పుస్తకం నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది, ఆహ్లాద పరుస్తుంది, కదిలిస్తుంది కూడా. There is really a feel good vibe running through the whole book. అయితే మనసుని కలిచివేసే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ పుస్తకంలో వారు తన జీవన ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను ఎంతో క్రమబద్ధంగా తన బాల్యం నుంచి, విద్యాభ్యాసం వరకు, R.S.S. సభ్యత్వం నుంచి రాజకీయ వేత్తగా ఎదిగి, గవర్నర్ పదవికి న్యాయం చెయ్యటం వరకు పొందు పరిచారు. అలా పొందు పరచిన విధానం, ఉపయోగించిన భాష చూస్తే వారు ఒక మంచి రచయిత కూడా అని అనిపించక మానదు.
శ్రీ విద్యాసాగర్ గారి నిశితమైన పరిశీలనా శక్తి, రాజకీయాల పట్ల అవగాహణ, విశ్లేషణ, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, మారుతున్న విలువల పట్ల ఆవేదన, దేశం పట్ల, పార్టీ పట్ల అపారమైన అభిమానం, వారి అత్యున్నత వ్యక్తిత్వం అన్నీ విశదంగా కనిపిస్తాయి వారి స్వీయ చరిత్రలో. ముఖ్యంగా ఇది ఒక పిక్టోరియల్ బుక్. పేజీల మధ్యలో ఉన్న ఫోటోలు, పేపర్ కట్టింగ్స్, జరిగిన సంఘటనలకు సాక్ష్యంగా నిలవటమే కాకుండా, దీర్ఘమైన వచనం మధ్య ఒక విరామం ఇస్తూ సంఘటనలను దృశ్యీకరించుకోవటానికి ఉపయుక్తంగా ఉన్నాయి.
సుపరిచితమైన తెలంగాణా ప్రాంతాలను గుర్తు చేస్తూ, ఎక్కడో జ్ఞాపకాలలో మిగిలిన తెలంగాణ పదజాలమైన కయిసిప్ప, దాలి, గిలాసులు, డేగిసాలు, శిబ్బి, పాలగోకు, ఉట్టి లాటి ఎన్నో పదాలను ఉపయోగిస్తూ తాను అబ్బురంగా చూసిన క్రిమి కీటకాలు, పక్షి గూళ్ళు లాటివి వివరిస్తూ రాసిన వారి బాల్యాన్ని చదవటం మొదలు పెట్టగానే ఆ కథా విధానం మనల్ని కట్టిపడేస్తుంది.

‘ఎవరినీ లెక్కచేయకుండా క్రిమికీటకాలు మరొకవైపు రాజ్యమేలుతుండేవి. నల్ల చీమలు, ఎర్ర చీమలూ, క్రమబద్ధంగా వాటి నడక, చెట్ల కొమ్మలకు వేలాడే పిట్ట గూళ్ళు, తేనెతుట్టెలు, ఆధునిక ఇంజనీరు యుగానికే సవాలుగా అనిపిస్తుంది. వీటిని చూసి ఆశ్చర్యపడటం ఒక్కటే అప్పుడు తెలిసేది.’ (page 57)
తెలంగాణాలో దొరలంటే చాలా గొప్పవారని ప్రతీతి. అలాటిది, విద్యాసాగర్జీ చిన్నతనంలో గడిపిన మధ్యతరగతి జీవనం, వర్షం వస్తే చూరులోంచి నీళ్లు కారేటువంటి ఒక పాకలో వారి జీవనం సాగిందని తెలియటం ఒకింత ఆశ్చర్యం కలిగించిన విషయం. చెప్పుకోగలగాలి కానీ ప్రతి ఒక్కరి జీవనం ఒక కావ్యం అవుతుంది అనిపించింది వారి చిన్నతనంలోని జీవన విధానం చదివితే.
పదేళ్ల వయసులో తన తండ్రి కాలం చేసినప్పుడు, వారి అంత్యక్రియలు జరిగినప్పుడు అర్ధం కాలేదు కానీ, అమ్మ మట్టెల చప్పుడు వినపడనప్పుడు తన తల్లికి ఆ లోటు ఏంటో అర్థమయి ఎంతగానో దుఃఖించానని ఆ పసి వయసు దుఃఖాన్ని తన ‘కాళ్ళ మట్టెలు’’ కథనం ద్వారా సాగర్ జీ చెప్పుకున్న విధానం మనసుని కదిలించివేస్తుంది. అది కూడా తాను జైలు జీవితం గడుపుతున్న సమయంలో గస్తీ తిరుగుతున్న గార్డుల బూట్ల చప్పుడు వింటూ గుర్తు చేసుకుంటూ బాధపడటం మరీ కదిలిస్తుంది.
‘అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని బట్టి నేను పడుకుని ఉన్నా… అమ్మ ఎక్కడ ఉన్నది తెలుసుకోగలిగేవాణ్ణి. మెల్లగా నావైపు వస్తున్న కాళ్ళ మట్టెల చప్పుడును వింటూ ఎప్పుడు నా కడుపు మీద అమ్మ చేయి ఉంచుతుందో తెలుసుకునే వాణ్ణి’ (page 69)
‘ఎప్పుడో అమ్మ వస్తుందనీ, కడుపు నిమిరి మళ్ళీ అన్నం తినిపిస్తుందనీ, వద్దన్నా అది తప్పించుకోలేననీ చూస్తున్నాను. అమ్మ వస్తున్నట్టు అనిపించింది కానీ తనేనా కాదా అని అనుమానం వచ్చింది. కడుపు మీద చేయి ఉంచి నిమిరేవరకు అమ్మ వచ్చిందని తెలియలేదు. అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని గుర్తుపట్టి ఎక్కడికి పోతుందో ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంది. కానీ ఆ రోజు తెలియడం లేదు. అమ్మ కడుపు మీద నిమురుతూ ఒక్క ముద్ద తిను అన్నప్పుడు అమ్మ వచ్చిందని తెలిసింది. మరి కాళ్ల మట్టెలు? అప్పుడు నాన్న చనిపోయింది జ్ఞాపకానికొచ్చింది. మొట్టమొదటి సారి దుఃఖం పెల్లుబికింది.’ (page 70)
ఎమర్జెన్సీలో రాజకీయ నాయకుల జైలు జీవితం గూర్చి నేను విని ఉన్నాను. కానీ వీరి ద్వారా మరొక కొత్త కోణం చూసాను. జైలు జీవితంలో ఉన్న ఇతర నేరస్తులను ఈ రాజకీయ ఖైదీల సహాయానికి నియమించేవారని, వారితో మాట్లాడటం, వారి కధలు అన్నీ వింటూ, వారి విభిన్న మనస్తత్వాలను తెలుసుకునేవారని, ఒక అడ్వొకేటుగా వారి సమస్యలు, వారి కధలు విన్న తరువాత, వారి విడుదలకి అర్జీ లేఖలు రాసి ఇచ్చేవారని, కొన్నిసార్లు వారు నేరస్థులు అని తెలిసీ వారికి అర్జీ లేఖలు రాసి ఇవ్వటం సరైన పనేనా అనే ఆత్మ విమర్శ చేసుకునేవారనీ చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా వారి మానవీయతను చాటుతుంది. ఆ సందర్బంగా జైలు నుంచే వారు ‘అలర్జీ’ అనే పేర ఒక కథ రాసారు. ఎవరు మనకు ఎన్ని సహాయాలు చేసినా స్వధర్మంని మించిన దేముంటుంది అని చెప్తుంది ఈ కథ.

“పొడిసేస్త దొర!’ అతను కిందికి చూస్తూ అన్నాడు.
రామారావు గుండె ధడేలు మన్నది. మొఖం రంగు మారింది. గుడ్లలో నీరు తిరిగింది. కొంచెం ముందుకు వంగి… “నా భార్య ముందు, నా చిన్నారి పసిపాపల ముందు… నీకు సహాయం చేసిన నన్ను… చంపేస్తావా?” రామారావు ఆవేశంతోనే అడిగాడు.
మీరు నన్ను చూసినంక కోర్టుల… గవాయి పలికితే… ఇగ.. నాకేముంటద్దొర! ఉరే అయితది. నా పెండ్లాం, పోరగాండ్ల గతేమయిద్ధి!” మెల్లిగా మట్టి గిల్లుతూ అన్నాడతను. (page 115)
సూర్యోదయం రోజూ ఒకలాగే ఉంటుంది, కానీ అది మనకు అప్పుడుడప్పుడు మాత్రమే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది మన మనసు స్థితిని బట్టి ఉంటుంది అని ఎక్కడో విన్నాను. అలాగే జైలులో ఎన్నో మల్లెలు పూసేవనీ, కానీ ఆ మల్లెలు ఎంత అందమైన వైనా జైలు జీవితంలో అవి ఎవరినీ ఆకర్షించేవి కావు, అంటూ చేప్పే వారి కవిత వారిలోని కవితాత్మకతను చాటుతుంది.
జైలు మల్లెల పొదలు
పెరుగును వరుసగ
జీవన బందీలుగ
చూచును దిగులుగ (page 109)
రాజకీయ నాయకులు అనగానే వారికేంటి, రాజల్లాంటి బ్రతుకులు, అనుకుంటాం మనం. కానీ ఆ రాజకీయ జీవితం పూల పాన్పు కాదు, అది ఊరికే కూడా రాదు. ఆ నాయకత్వం పొందటం వెనుక, వారి అకుంఠిత దీక్ష, పార్టీ పట్ల, ప్రజల పట్ల వారి నిబద్దత, వారి నిరంతర శ్రమ ఎన్నో దాగుంటాయి. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆటుపోట్లను తట్టుకుని అడుగేస్తే ఆ నాయకత్వం చేజిక్కుతుంది. అది చేజిక్కిన తరువాత కూడా వారి జీవితం కత్తిమీద సాములాగే ఉంటుంది. అలాటి శ్రమ, దీక్ష అన్నీ కనిపిస్తాయి, విద్యాసాగర్ గారి రాజకీయ ప్రయాణంలో. మెట్టుపల్లి ఎన్నికలకు ముందు పలు రకాల వ్యతిరేకతలను ఎదుర్కొంటూ కూడా వారు గ్రామ గ్రామాలకు తిరుగుతూ, అందరితో కరచాలనం చేస్తూ ప్రజల మనసులను గెలవటం నిజంగా అభినందనీయం. అంతేకాకూండా, తమ ప్రచార సమయంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి వారు చేసిన కృషి కూడా అభినందనీయం.
విద్యాసాగర్ గారు, రాజకీయ నాయకులే కాకుండా మంచి విజ్ఞానవేత్త. ఎన్నో చోట్ల వారు చదివిన పుస్తకాలను, అవి నేర్పిన మంచిని ఉటంకించారు. శ్రీపాద డాంగే, కార్ల్ మాక్స్, అంబెడ్కర్, సినారే, వివేకానంద, ఎల్.కె. అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి మరెందరో రచనల్ని క్షుణ్ణంగా చదివారని వాటినుంచి, తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకున్నారనీ అర్ధమవుతుంది. ఈ పుస్తకం అడుగడుగునా వారి వ్యక్తిత్వానికి అద్ధం పడుతుంది.
ఒక సందర్భంలో సినారే గురించి ఇలా చెబుతారు.
‘అయన సాహితీధార కూడా సమయానుకూలంగా ప్రజల ఉద్యమాల కనుగుణంగా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక దశలో ‘గోమాత గిట్టలలో కొడవలి అంచులు నడుస్తున్నాయి.’ తెగిపోతున్న కండరాలు / ఎగురుతున్న జండాలు అన్నారు. అయన తెలంగాణా పదబంధ సుగంధంలో ఎన్నో సామాజిక విషయాల విశ్లేషణలు కనపడతాయి..’ (page 254)
ఇక శాసనసభ సమావేశ విశేషాలు చదువుతుంటే వారి చతురత, సమయస్ఫూర్తి, స్పాంటేనియస్ సమాధానాలు, నవ్విస్తాయి, అబ్బురపరుస్తాయి. చిన్న వయసు నుంచి, రాజకీయముగా ఎంతో ఎత్తుకు ఎదిగిన జీవితం వరకు కూడా, తాను చేసిన తప్పులను తప్పుగా ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చటంలో వారి ఆత్మావలోకనం కనిపిస్తుంది.
తాను అధిరోహించిన పదవులకు న్యాయం చేస్తూ, సామాజిక సమస్యలకు తగు సమయంలో తగు విధంగా స్పందించి నీటి సరఫరా, గ్రామ గ్రామానికి దోబీ ఘాట్ నిర్మాణాలు, యూదులకు మైనార్టీ స్టేటస్ కల్పించటం, బహు భార్యత్వంకి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం, లాటి అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపట్టారు. మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివ్రుద్దికి కృషి చేశారు. సర్దార్ వల్లాభాయి పటేల్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్ వంటి వీరుల జీవిత చరిత్రలను వివరిస్తూ, వాటిని స్కూళ్లలో పాఠ్యంశాలు గా చేర్చాలనే తపన వ్యక్తం చేసారు. వారి తల్లి చంద్రమ్మ గారి పేరిట ఎంతో మంది పేదలకు, రోగులకు సహకారం అందేలా చేశారు. ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు.
ఏదో ఉడతా భక్తిగా పనులు చెయ్యటం కాకుండా తాను చేపట్టిన ప్రతి పనీ ఎక్కడా జంకకుండా, మధ్యలో వదిలేయకుండా ఆ పనులు పట్టుదలతో సాధించారు. ఉదాహరణకి గిరిజనులకు చట్ట ప్రకారం అటవీ ఉత్పత్తులపై వారు పొందవలసిన హక్కులను సమకూరుస్తూ, అది సద్వినియోగం అవ్వాలంటే హక్కులు మాత్రమే ఇస్తే సరిపోదని, ఎంతో ప్రణాళికా బద్దంగా వాళ్ళకి నిధులు, నీటి వనరులు కల్పిస్తూ, కావాల్సిన శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేసారు. ఇవన్నీ కూడా వారి సిన్సియారిటీకి, సేవానిరతికి, పట్టుదలకీ సాక్షాలు.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశం ఎక్కువ యువత ఉన్న దేశం. ఈ యువతకు సరయిన శిక్షణని ఇవ్వకపోతే ‘Demographic Dividend’ turns to ‘Demographic Disaster’ అని కూడా వారొక చోట వాపోయారు.
చరిత్ర ఎప్పుడు నిలిచిపోవాలని, రాబోయే తరాలకు అది మార్గ దర్శకంగా నిలవాలనే తాపత్రయంతో ఎన్నోచోట్ల మహానాయకుల విగ్రహ ప్రతిష్ట చేయించటం, వారికి సంబందించిన చరిత్రను వెలుగులోకి తేవటం లాటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. మహారాష్ట్ర లోని రాజభవన్ ప్రజల దర్శనానికి తెరిచేలా చేసారు. అదే రాజభవన్‌లోని బ్రిటీష్ కాలం నాటి అండర్ గ్రౌండ్ బంకర్ వెలుగులోకి వచ్చేలా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
ముందే పేర్కొన్నట్టు ఈ పుస్తకం ఒక విజ్ఞాన ఖని. దీని ద్వారా ఎన్నో రాజకీయ పరిస్థితులు, విశ్లేషణలు తెలుస్తాయి, ఎన్నో పుస్తకాల గురించిన సమాచారం తెలుస్తుంది, భారతీయ తత్వం, దాని గొప్పతనం తెలుస్తుంది. ఇలా ఎన్నో విషయాలను తెలుపుతూ ఆయా కాలాల సామాజిక రాజకీయ పరిస్థితులను రికార్డు చేసిన ఈ పుస్తకం stands as a good resource for research students. భవిష్యత్తులో నాయకులు కావాలనుకునే వ్యక్తులకి ఇది ఒక దిక్సూచి కూడా. ఈ విషయాలన్నీ దాదాపుగా ప్రముఖంగా పత్రికలలో ప్రచురించ పడినవే. రెగ్యులర్‌గా వార్తలు ఫాలొ అయ్యేవారికి కొత్త కాకపోవచు. అయితే తెలిసిన వారికి విషయాలను కొత్త కోణంలో పరిచయం చేస్తుంది, తెలియనివారికి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఈ ‘ఉనిక’.
సాగర్జీ పార్టీ కార్యకర్తగా, వకీలుగా, జైలులో ఖైదీగా, శాసన సభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, గవర్నరుగా… ఏ పాత్రలో ఉన్నా ప్రజల మనిషిగా ప్రజలకు ఉపయోగపడాలని అనునిత్యం పాటు పడిన నాయకుడిగా ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఈ ‘ఉనిక’ వారిని మంచి రచయితగా కూడా గుర్తుంచుకునేలా చెస్తుంది.
