పుస్తక సమీక్ష
Thing fall apart అనే ఈ ఆఫ్రికన్ నవల ని ఇటీవల చదివాను. రచయిత Chinua achebe. స్వయం గా ఆంగ్ల ఆచార్యుడు కనుక ఇంగ్లీష్ లో రాశాడు.నైజీరియా అనగానే మనకి మనసు లో ఏర్పడే చిత్ర పటం వేరు కాని ఈ నవల చదివిన తరువాత అది పూర్తిగా కనుమరుగై మరో రూపం ఏర్పడుతుంది. ఆ రకంగా తన ఈబో జాతికి ఇంకా ఆఫ్రికా ఖండానికి చినుబా అచెబా ఒక గొప్ప సేవ యే చేశాడు. ఈ నవల రమారమి 50 భాషల్లోకి అనువదింపడి,కోటి ప్రతులకి పైగా అమ్ముడై ఇంకా తన జైత్రయాత్ర ని కొనసాగిస్తూనే ఉంది. నల్ల జాతి ప్రజల గుండె చప్పుళ్ళని జోసెఫ్ కాన్రాడ్ లాంటి వాళ్ళు వినిపించి ఉండవచ్చుగాకా..! కాని దానిలో లేని ఒక తమదైన స్వరం నూతనం గా దీనిలో వినిపిస్తుంది,కారణం చినుబా అచెబా తాను స్వయం గా ఆ భూమిపుత్రుడు కావడం..!
స్థూలం గా నవల లోకి వెళదాము. చెప్పాలనంటే దీనిలోని ప్రతి పేజీలోనూ ఏదో ఓ ఆసక్తి కరమైన అంశం తారసపడుతుంది. బహుశా నైజీరియా కి సంబందించిన జీవితం మనకి చాలా తక్కువ తెలిసిఉండటం వల్ల అలా అనిపినిస్తుందేమో..! అమెరికన్,రష్యన్,ఇతర యూరపు కి చెందినవి ఎక్కువగా చదివాము తప్పా ఆఫ్రికన్ నవల సీరియస్ గా చదివింది ఎక్కడని..?సరే దానికి కారణాలు అనేకం..అదో పెద్ద గ్రంథం.ఇంచుమించు ప్రతి ఆఫ్రికా దేశం లోనూ ఈ నవల పాఠ్యగ్రంథం గా ఉన్నది. మన వలెనే వాళ్ళూ బ్రిటీష్ వారి చేతనే పాలించబడ్డారు.ఆ పాలన లో జరిగిన కథయే ఈ పుస్తకరూపం లో వచ్చింది.మరి ఆ బ్రిటీష్ వాళ్ళ సైకాలజీ ఏమిటో అర్థం కాదుగాని ఈ నవలని మొదటిసారిగా ప్రచురించింది కూడా లండన్ లోనే..!
Okonkwo తన గ్రామం లోనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాల్లో యోధుని గానూ,పెద్ద మనిషి గానూ పేరున్న వ్యక్తి.పండుగ సమయాల్లో జరిగే కుస్తీ పోటీల్లో ఫాల్గోవటం దాంట్లో గెలిచి వీరతాళ్ళు వేయించుకోవడం అక్కడి ఆనవాయితీ.అలాంటి వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ Umuofia గ్రామం లో మన కథానాయకుడు Okonkwo పెద్ద రైతు కూడా. అతని తండ్రి Unoka దుబారా మనిషి గా,తాగుబోతు గా ,అప్పులు చేసి చెడు పేరు తెచ్చుకున్న వాడిగా ప్రసిద్ధి. ఆ విధంగా తాను కాకూడదని ఎంతో పట్టుదల గా జీవితం లో ఓ స్థాయి కి వస్తాడు. Yams పంట ని విరివి గా పండిస్తాడు.కోళ్ళు,పశువులు బాగా ఉన్నాయి.తన కాంపౌండ్ లో ముగ్గురు భార్యలకి,తనకి ఎవరి ఇళ్ళు వాళ్ళకి నిర్మించాడు.మొత్తం 11 మంది సంతానం.
వారి ఈబో తెగ లో బహుభార్యత్వం సాధారణం. కన్యాశుల్కం అనేది ఉంది. Okonkwo రెండవ భార్య మొదటి భర్త ని విడిచి ఇక్కడకి వచ్చిన మనిషి.సరే..ప్రాణానికి ప్రాణం అనేది ఆ తెగ లోని ఆచారాల్లో ఒకటి. ఉదాహరణకి వీరి గ్రామానికి చెందిన ఒక ఆడ మనిషిని పక్క గ్రామం కి చెందిన వ్యక్తి చంపితే వాళ్ళ కుటుంబం లోని ఓ వ్యక్తిని చంపడానికి ఇవ్వమని అడుగుతారు.అప్పుడు వాళ్ళు మూడేళ్ళ పిల్లాడిని ఇస్తారు.అతని పేరు Ikemefuna.మరో మూడేళ్ళు పెంచిన తరువాత ఈ కుర్రాడిని గొడ్డలితో నరికి చంపుతారు.అది అక్కడి వ్యవహారం.ఇవ్వలేదంటే గ్రామం అంతా ఏకమై దోషి యొక్క ఇంటి పై పడి నరుకుతారు.అదీ విషయం…అలాగని ఎవర్నీ పడితే వాళ్ళని నరుకుతారు అనుకుంటే తప్పు.ఉదాహరణకి Okonkwo తుపాకి పొరబాటున పేలి ఒకరి ప్రాణం పోయినప్పుడు ఊరి పెద్దల్లో ఒకడని కూడా చూడకుండా అతని ఇళ్ళని నాశనం చేసి,ఏడేళ్ళు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.ఇదంతా తమ కట్టుబాటు లో భాగమే కనక మన హీరో కూడా మౌనం గానే భరిస్తాడు.
భూమి వారికి అత్యంత పూజనీయమైనది. ఒక దేవత. అలాగే సర్పం…కొండచిలువ సైతం ఒక దేవత.ఎట్టి పరిస్థితుల్లోనూ చంపరు.అది ఇంటి లోనికి వచ్చినా,దానికి కావాలిసింది తిని వెళ్ళేవరకు వేచిచూస్తారు తప్పా చంపరు. అలాగే ఊరి పెద్దలు కూర్చోవడానికి మేక చర్మాన్ని చాప లా వాడతారు. మన పూర్వీకులు జింక,పులి చర్మాలు ఉపయోగించిన వైనం గుర్తుకు రావడం లేదూ..? సరే…ఎంతో ఆనందంగా…చిన్న చిన్న వైరుధ్యాలతో సాగిపోయే మన కథానాయకుని జీవితం ఏడేళ్ళ ప్రవాస సమయం లో మలుపు తిరుగుతుంది. ఆ ప్రవాసం ఎక్కడో కాదు,తన మేన మామ ఇంటి ప్రాంగణం లో..Mbanta గ్రామం లో..!
ఈ గ్రామానికి వచ్చి ఏడేళ్ళు ఉండాలి,పొరబాటున తన తుపాకి గుండు తగిలి స్వగ్రామం లో ఒకరి చావుకి కారణమైనందువల్ల.అలా ఒకటి రెండు ఏళ్ళు గడుస్తున్న సమయం లో తన మిత్రుడు Obierika చూడటానికి వచ్చి,తమ గ్రామం లో వచ్చిన మార్పులు గురించి చెబుతాడు.క్రైస్తవ ప్రచారకులు ఊరి లోకి వచ్చి తమ తెగ లో కొందరిని మతం మార్చారని,మిస్టర్ బ్రౌన్ అనే తెల్లవాడు దానికి కారకుడని వివరిస్తాడు.మన తాతముత్తాతల,దేవతల ఆత్మలు ఘోషిస్తున్నాయని అంటాడు. Okonkwo కూడా బాధపడతాడు.ఊరికి సంబందించిన పెద్ద ఒకాయన కూడా చర్చ్ కి వెళుతుంటాడు.ఊరిని ఏ విధంగా మిషనరీస్ ఓ క్రమ పద్ధతి లో విడదీసిందీ చర్చించుకుంటారు.
బైబిల్ విషయం లో ఈబో పెద్దలు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు మిష్టర్ బ్రౌన్ ని ఇరకాటం లో పడేస్తాయి.దానితో అతను వేరే దారి అవలంబిస్తాడు.స్కూల్,ఆసుపత్రి,టీచర్ ట్రైనింగ్ సంస్థలు వంటివాటిని ప్రభుత్వం తో మాట్లాడి ఈ ఊరికి రప్పిస్తాడు.అక్కడ చదువుకున్న వాళ్ళు పైకి వచ్చి ఉద్యోగాలు చేయడం చూసి ఈబో తెగ లోని పై వర్గం వారు కూడా మిషనరీ సంస్థ లకి తమ పిల్లల్ని పంపడం మొదలెడతారు.అంతదాకా కింది వర్గం వారు మాత్రమే తమ పిల్లల్ని పంపేవారు.
ప్రవాసం ముగిసి Okonkwo తన గ్రామం వచ్చేస్తాడు.పరిస్థితులు అన్నీ మారిపోయి కనిపిస్తాయి.తమ దేవతలకి,పూర్వీకుల ఆత్మలకి విలువ లేకుండాపోయింది.చర్చ్ నుంచి పాటలు,మాటలు వినబడుతున్నాయి.దీనికి గాను మనం ఏమీ చేయలేమా అని మిత్రులతో అంటాడు.మన లోని వాళ్ళే కొంతమంది అటు మొగ్గినపుడు ఏమి చేగలం అంటారు వాళ్ళు.తెల్ల మిషనరీస్ వ్యాపారాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు.పాం ఆయిల్,దుంపలు వంటివి కొనుగోలు అయ్యేందుకు కేంద్రాలు తెరిచారు.డబ్బులు బాగా స్థానికుల చేతిలో ఆడుతున్నాయి.
ఇదిలా ఉండగా స్థానిక పండుగ జరిగే సందర్భం లో కియాగా అనే మతాన్ని తీసుకున్న వ్యక్తి అలజడి సృష్టిస్తాడు.బాగా అల్లర్లు జరుగుతాయి.కథానాయకుని నాయకత్వం లో అతని అనుయాయులు అంతా కియాగా ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి ఆ వ్యక్తిని చంపేస్తారు.అంతేగాక చర్చ్ ని కూడా తగలబెడతారు.అయితే ఈ సందర్భం లో మిష్టర్ బ్రౌన్ కాకుండా వేరే తెల్లజాతీయుడు ఉంటాడు.అతను ఈ సంగతి అంతా పైనున్న డిప్యూటీ కమీషనర్ కి వెళ్ళి చెబుతాడు.అతనూ ఒక బ్రిటీష్ వాడే.ఆ అధికారి వెంటనే జవాన్లని పంపించి చర్చలకి అని చెప్పి ఊరి పెద్దల్ని కొందర్ని రప్పించి వాళ్ళని బంధించి చిత్ర హింసలు పెడతారు. వీళ్ళని ఒదలాలీ అంటే ఊరంతా కలిసి పెనాల్టీ కట్టాలని ఇంకా కొంతమంది Okonkwo లాంటి అందరూ వచ్చి లొంగిపోవాలని కబురుపెడతారు. దీనితో ఒళ్ళుమండి వచ్చిన ప్రభుత్వ మెసెంజెర్ ని నరికి చంపుతాడు కథానాయకుడు.
ఇక లాభం లేదని కమీషనర్ ఈ ఊరికి వస్తాడు తన బలగం తో. ఊరి చివరన చెట్టు కి ఓ శవం వేలాడుతుందని దాన్ని దింపి సాయపడండి అంటారు ఊరివాళ్ళు.ఆత్మహత్య చేసుకున్న వారి అంత్యక్రియలు తాము జరపమని చెబుతారు.సరే అని చెప్పి ఆ శవాన్ని జవాన్లతో దింపిస్తాడు కమీషనర్.ఇంతకీ అది ఎవరిదో కాదు Okonkwo యొక్క శవం. కమీషనర్ నిర్ఘాంతపోతాడు.ఇక మీద ఎప్పుడూ ఇలా ఫీల్డ్ మీదకి తాను రాకుడదని అనుకుంటాడు. మరో రకంగా తనకి ఆనందం అనిపించింది,ఎందుకంటే తాను రాయబొయే పుస్తకానికి మంచి వస్తువు ,సరంజామా దొరికిందని.తాను రాబొయే పుస్తకం పేరు ఏమిటంటే The pacification of the primitive tribes of the lower Niger. ఆ పుస్తకం లో ఈ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గూర్చి కూడా ఓ పేరాగ్రాఫ్ రాయాలి అనుకుంటాడు.
(సమాప్తం)
వరంగల్ జిల్లా పత్రికల సమగ్ర పరిశోధక సర్వస్వం-డా. నమిలకొండ సునీత పరిశోధన
నిర్థిష్ఠ లక్ష్యంగా సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు సి.నా.రె గారు. గేయం పద్యం, సంగీత రూపకం, కథాకావ్యం, కావ్యేతీహాసం, వచనకవిత్వం, గజల్, పాట నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణా రచన, విద్యబోధన, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్లిన మానవీయకవి సి.నారాయణ రెడ్డి గారు. మేరు శిఖరం లాంటి సినారె జన్మదినం సందర్భంగా తిరునగరి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో ‘‘కవితా విశ్వంభరుడు’’ అనే కవితా సంకలనం వెలువడించారు. ఇందులో 71 మంది కవుల కవితా నీరాజనాల సమహారంగా తరతరాలకు ఆదర్శంగా అక్షర పుష్పాల పరిమళంగా నిలుస్తుంది. తిరునగరి శ్రీనివాస్ గారు కవి, రచయిత, మరియు జర్నలిస్టు కావడంతో పాటు నారాయణ రెడ్డి గారికి ఆప్తుడు కూడా అతి సమీపంగా ఉండి వారి రచనశైలిని కొంత ఆకళింపు చేసుకున్నారు. కాబట్టి సి.నా.రె. కవిత్వం, గజళ్ళు, పాటలపై వచ్చిన రచన పై కూడ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ‘‘జ్ఞానవీచికలు’’ సాహిత్య విమర్శా వ్యాసాలు అనే పుస్తకం కూడా సి.నా.రె జన్మదినం సందర్భంగా ఆవిష్కరించి, గురుభక్తిని చాటుకున్నారు. ‘‘కవితా విశ్వంభరుడు’’ కవితా సంకలనం, మరియు ‘‘జ్ఞానవిచీకలు’’ వ్యాససంపుటి రెండు పుస్తకములు కూడా నేటి తరానికి, మరో తరానికి అధ్యయనం, పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయనేది అక్షర సత్యం. ‘‘విశ్వంభరుడు’’ అక్షరాలతో నిరాజనం పట్టిన కవుల అక్షర లక్షల అణిముత్యాల వంటి కవితలను విశ్లేషించుకుందాం…
అక్షరనాదాల్ని పలికించిన విజ్ఞాని / గుండెనిండా విశ్వంభరా తత్వంతో / ఎన్నో అనుభూతుల క్షేత్ర బంధం / అలలెత్తిన మానవత్వం / ‘యశస్వి’ సి.నా.రె. అంటూ వారి జీవితపు సాహితి ప్రస్తావాన్ని వివరించారు. ‘‘చిత్రం… హాయి భళారే విచిత్రం’’గా మదిలో మీ జ్ఞాపకాలు నింపి / కానరాని లోకానికి ఎలా వెళ్లారు / ‘‘విశ్వంభర’’ తో జ్ఞానపీఠాన్ని అదిరోహించి మీరు ఇంద్రుడి పీఠాన్ని అధిరోహించటానికి వెళ్లారా / అంటు మదినిండ అక్షరాలు నింపిన జ్ఞాపకాలతో జీవిస్తాము అంటూ మనోవేధనను వ్యక్తం చేశారు.
శబ్దసౌందర్యాలు సైనిక కవాతులై సాగేవి / పొద్దును పాట చేసి / భూగోళమంతా భూపాలరాగమైన వెన్నెలపాట / సర్వసామాన్యుడు / బహుముఖీన ప్రతిభా ప్రభాతుడు అంటు ‘‘వనపట్ల సుబ్బయ్య’’ వెన్నెల పాటగా కవిత్వీకరించారు. ‘‘ఆయన ఈ అనంతమైన / సాహిత్య వెలిగే జ్యోతి / ఆసాంఘిక శక్తులపై ఉరిమిన ‘‘మహద్యుతి’’ అంటారు మౌనశ్రీ మల్లిక్. మలి జ్ఞానపీఠ విశ్వంభరుడా ‘‘మాకు దూరమై మీ… పెన్నుమూ ‘‘సి.నా.రె’’! అంటూ తను లేడనే నిజాన్ని జీర్ణించుకోలేని డా॥ అమ్మిన శ్రీనివాసరాజు గారి వ్యధ నే మూడక్షరాలు. ‘‘పద్మభూషణంతో, జ్ఞానపీఠంలో నింగికెగసినారె నిత్యమయినారె / ధృవతారగా నిలిచిపోయినారె అంటు డా॥ రామకృష్ణమూర్తి గారు సి.నా.రె. ను చిరంజీవిగా చేశారు. ‘వగలరాణివినీవే’ నంటూ అక్షరాన్ని వంపులు త్రిప్పిన సముద్రుడు / ‘మబ్బులో ఏముందని’ అంటునే ఆ చోటికే తరలిపోయిన తపస్వి / ‘‘అభినందన మందరామాలలు’’ ఎన్ని వేసిన సరిపోవు అంటు ‘‘పాటల రారాజు’’గా మల్చినారు. యలమర్తి అనూరాధ ‘‘కృష్ణవేణి నడకలా… సాగించిన సృజనకారుడు!’’ / తెలుగు పదాలను కర్పూరం / వసంత రాయలకు కావ్యమల్లిన / కవి శిఖమణి సి.నా.రె. అంటారు. ‘‘కిలపర్తి దాలినాయుడు’’
‘‘గలగలపారే జలపాతమై / ధీర, గంభీర వీరతలతో / సాహితీ సీమను అలరింప చేసిన మహకవి, మహోన్నత కవికి వందనం చేశారు. ‘‘కవిసార్వబౌముడు’’ అనే శీర్షిక ద్వారా శనిగరపు రాజమోహన్ ‘‘పేదలకన్నీటిలో తడిసిన కష్టం / పెద్దల పెదాలతో పలికిన జీవిత సత్యం ఆయన కవిత్వం’’ అంటూ సి.నా.రె. పదాల అల్లికను చెప్పారు. డా. గంజి భాగ్యలక్ష్మి, ‘‘అతడొక సాహితి యుద్దనౌక / ఎడారిలో సైతం పయనించే శక్తి / సాహితి లోకానికే ఆయనొక స్ఫూర్తి’’ అంటారు టి.వి. అశోక్ కుమార్. ‘‘తెలంగాణ అక్షరకీర్తి, కిరీటం, కవితా తపస్వినిత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది, మానవతామూర్తి, కవితా జాతిరత్నం’’ అంటూ సి.నా.రె. గారి కీర్తిని అక్షర శిఖరాల్లో నిల్పినారు ఎల్గటి తిరుపతిరెడ్డి. ‘‘అభినందన మందార విశ్వంభర సాహితి సారంగధర సినారె… దివికేగిన గేయతార తెలుగు కావ్యధార అజరామర సినారె… అంటూ కవి ఎపుడు అమరుడె అన్నట్లు గుమ్మడి రామలక్ష్మి తన కలం ద్వారా వెల్లడిరచారు. ‘‘సాహిత్య సమరంలో గెలిచి నిలిచిన అక్షర తపస్వి / విశ్వజనీనతకు నిదర్శనం / మన తెలుగు వెలుగుల తేజం సి.నా.రె అంటూ సాహిత్య జగత్తులో అక్షరాలను నక్షత్రాలుగా మల్చిన తేజో రూపం సి.నా.రె వారు ప్రతిభకు పట్టంకట్టారు వనపర్తి పద్మావతి. మాతృభాష సినారె / మధుర కవిత సినారె / మహిలోపల వెలిసినట్టి / మహాకవి సినారె అని ‘‘మణిపూసలు’’ గా మల్చారు వడిచర్ల సత్యం. సినీ జగత్తు నీ పాటకు దాసోహం అంది, కర్పూర వసంత రాయల్ని పలకరించినా, నాగార్జున సాగరాన్ని తాకిని నీ మాటల ప్రతిధ్వని మనసును తాకుతుంది. మహాకవి ప్రణామం అంటాడు కందుల శివకృష్ణ సాహిత్యపు బాటసారి… శీర్షికతో.
‘‘తెలుగు భాషా దురంధురుడు / సాహితి విశ్వంభరుడు / మీగజల్స్ అద్భుతాలు భళారే / మిమ్మల్ని ఎప్పటికి మరువలేరే సినారె అందుకోండి మా జోహారే అని అద్దేపల్లి జ్యోతి సినారె గారికి ‘పరిపూర్ణుడు’ అంటు జోహార్లు అర్పించారు. ‘‘సినిరంగాన్ని ఉర్రూతలూగించి మెరిసిన వెండి తెరధృవతార / వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి అని డా. చీదెళ్ల సీతాలక్ష్మి అక్షరసుమాలు అర్పించారు. ‘‘ఓ పద్మశ్రీ… నీకలం పగలే వెన్నెలను, వెన్నెలలోని చల్లదనాన్నే కాక సాగర ఘషను వినిపించింది’’ అని విశ్వకవికి వందనం… అంటారు లింగాల రజని. ‘‘ఆ కలం నడక అమృత వర్షం / ఆ గళం సాహితీ పరవశం / ఆ స్నేహం పుస్తకాల పరిమళం’’ ‘‘మీ బాటలోనే’’ మేము అంటారు ఉండ్రాళ్ళ రాజేశం. ‘‘చిరంజీవిగా చరితార్థులు సినారె / తెలుగు సాహిత్యాంబరంలో / శోభాయ మానంగా వెలిగె స్మరణీయ నారాయణ ధృవతారమీరె’’ ధృవతారగా వెలుగొంది సాహితి లోకానికి వెలుగులు పంచాలనే ఆశ మనోహర్ రెడ్డి గంటా. మరెందరో కవులు, కవయిత్రులు, వ్యధతోను, గౌరవంతోను, ఆవేధనతోను ఓ మహామేరు పర్వతమే సాహితిలోకాన్ని విడిచింది అని తెల్సినప్పటికి కవుల కలంగళం ఎప్పటికి సినారెగార్ని తమవెంట ఉన్నట్లుగానే భావిస్తున్నారు. సినారె గారు మన మధ్య లేకపోవచ్చు కాని వారు రాసిన కవిత్వం సిని గేయాలు, గజళ్ళు, అన్ని కూడా సాహితి వినిలాకాశంలో ఉన్నంత వరకు సినారె అజరామరుడు. చిరంజీవి అంటు నీరాజానాలు అర్పిస్తు విశ్వంభరుడుని విశ్వవ్యాప్తం చేశారు.
తిరునగరి శ్రీనివాస్ కలం నుండి జాలువారిన మరో పుస్తకము ‘‘జ్ఞాన వీచిక’’ సాహిత్య విమర్శా వ్యాసాలు ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి. సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయెగశీలి సినారె గారు. ‘‘వాక్కుకు వయస్సు లేదని’’ ప్రవచించిన సాహిత్యాన్వేషి, ‘నవ్వనిపువ్వు’ మొదలుకొని, ‘‘నా రణం మరణంపైనే’’ వరకు 86 గ్రంథాలను రాసిన నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం. అనుభూతి కేంద్రం ఆయన కవిత్వం. విభిన్నసాహిత్య తాత్విక కోణాలను శోధించిన సమగ్ర పరిశోధన సినారె రచనలు అలాంటి రచనల పై సాహిత్య విమర్శా వ్యాసాలను అక్షరాలక్షలను ప్రోది చేసి భావితరాలు సులభ శైలిలో తన కలం ద్వారా ‘జ్ఞానవీచిక’ అందించారు రచయిత శ్రీనివాస్.
1931 జులై 29 నుండి 12 జూన్ 2017 వరకు నిర్ఠిష్ట లక్ష్యంతో సాహిత్యపున విలువలతో ‘‘నిరంతరకవి’’గా తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు కవిత్వమే చిరునామా, శ్వాసగా మార్చుకున్న నిరంతర బాటసారి సాహితీ ఉన్నత శిఖరం సినారె. ‘వాక్కుకు వయస్సు’ లేదన్న సాహిత్యాన్వేషి, ‘నవ్వని పువ్వు’ మొదలుకొని ‘‘నా రణం మరణం పైనే’’ అంటూ 86 గ్రంథాలను రచన చేసి మధుర కవితాక్షర జలపాతాలను పొంగించారు. ‘‘నడక నా తల్లి పరుగు నా తండ్రి సమత నా భాష’’ అన్న కవితా వారి ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం. ‘‘చిన్న నాటి మురిపెం ఇప్పటికి నా గుండె గూటిలో పదిలంగా ఉంది’’ అంటూ హృదయ నేత్రాలలో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు. చైతన్యం రంగరించుకున్న రవి లాంటి కవి సినారె తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం.
సాహిత్య ప్రపంచంలో ఓ అపూర్వ ప్రయోగంగా నిలిచింది. ‘ప్ర’ పంచపదులు, భావపరిణతికి, చందోవైవిద్యానికి పరాకాష్టగా నిలిచి వెలిగింది ఈ కావ్యం. ‘ప్ర’పంచపదులు అన్న కూర్పులో అనేక అర్థాలున్నాయి. ‘ప్రపంచించి’ చెప్పడం అంటే ‘విస్తరించి చెప్పడం’ అని అర్థం. ‘ప్రపంచ’ అని కలుపుకుంటే లోకతత్వాన్ని బట్టి చెప్పిన పదాలని తెలుస్తుంది. మానవ సమాజ పరిణామతత్వానికి సినారె అందించిన నిరంతర మూల్యాంకన ఫలితమే ‘‘ప్ర’’పంచపదులన్నది అక్షరాక్షర సత్యం, మానవ సమాజాన్ని విశ్లేషించిన సినారె మహత్తర హృదయావిష్కరణే ‘ప్ర’పంచ పదులు అంటూ విశ్లేషించారు రచయిత.
‘‘ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం’’ పట్ల కనబరిచిన ఆర్తినారాయణ రెడ్డి కవితా వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు. 40సం॥ సినారె కవితా కృషికి సంకేతంగా ‘ది బెస్ట్’ అనే ఉద్దేశ్యంతో కాకుండ ‘ఆల్ ఆర్ ది బెస్ట్’ అనుకున్న కవితలను ఎంపిక చేసి ‘నిరంతరం’ను ప్రచురించారు. ‘‘తరం మారుతుంది ` ఆ స్వరం మారుతున్నది / వందేమాతరం గీతం వరుస మారుతున్నది’’ అనే కవితలో అభివృద్ధి వైపుగా కనబరుస్తున్న నిర్లిప్తత, నిర్లాక్ష్యాన్ని ఎండగడుతూ చిదిమి వేసినా వదలని చీడ అంటుకుని ముసి, ముసినవ్వుల మాటున విషం మరుగుతున్నదని వేదన చెందారు. ‘‘కాలం ఇసుకలో దిగబడ్డ కాళ్ళను పెరుక్కుంటూ వేళ్ళమీద నడుస్తున్న మాతృభారతిని ‘జాగ్రత్త సుమా అంటూ ముందు జాగ్రత్త చెప్పారు. ‘‘ఆకలేస్తే వీధి దోసిలి / ఆగ్రహిసై వీధి పిడికిలి’ అంటూ నిన్ను నిన్నుగా నిలిపి భుజం తట్టే మహాభోధి వీధి’ అంటారు. శబ్దశక్తితో కూడిన హృదయ స్పందనలకు చైతన్యాన్ని రంగరించి నిరంతరం కవిత్వాన్ని అజేయంగా, ఆప్రతిహతంగా సినారె గారు ఆవిష్కరించారు.
ప్రౌడ నిర్భరవయః పరిపాకంలో ప్రచురించిన కవితాసంపుటి ‘వ్యక్తిత్వం’ 69వ జన్మదినంన వెలుబడిన ఈకృతిలోని కవితల్లో సినారె క్రాంత దర్శిత్వం ప్రస్ఫుటించడం ప్రత్యేక విశేషం, అత్యాధునికుడుగా సృజన చేసిన ప్రతిభాశాలి ‘వ్యక్తిత్వం’ సంపుటిలోని ప్రతికవితా నవనవో న్మేషమైందె అనడంలో సందేహం లేదు. ‘‘గుండెకు నిప్పంటుకుంది అర్పడానికి నా దగ్గం కన్నీళ్ళు లేవు’’ అనే పంక్తుల్లో సమాజంలో ఒక గుండె బాధతో రగులుతున్నపుడు సానుభూతీదయాచూపలేని కఠినాత్ములను మెత్తగా మందలించిన తీరు బాగుంది అంటారు వ్యాసకర్త శ్రీనివాస్.
సినారె వెలువరించిన అత్యాధునిక, ఆలోచనాత్మక కవితా సంపుటి ‘‘కవితావ్యక్తిత్వం’’ వర్తమాన పరిస్థితుల మధ్య సినారె ఎగురవేసిన మానవీయపతాకం ‘వ్యక్తిత్వం’
‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి / జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి అనే మానవతా వాదాన్ని మకుటాయమానం చేసుకున్నారు. ఐదు ప్రకరణాల సమగ్రకావ్యం 1980లో ‘‘విశ్వంభర’’గా మానవ పురోగమనశీలితకు నడకలు నేర్పిన కావ్యంగా ప్రచురితమై జ్ఞానపీఠపై నిలిచింది సినారె గారి రచనాశిల్పం. మానవత్తత్వం, అలంకార ఔచిత్యం కల్పనం, శబ్ధ, ఉదాత్తభావమై సమనిష్పత్తిలో కలిసి హృదjైుక, వేద్యమైన ప్రతికాత్మక కావ్యం ‘విశ్వంభర’ జ్ఞాన బీజమే విశ్వంభరాభ్రమణానికి శాశ్వతచైతన్య తేజమై నిలిచింది. నాయకుడైన మానవునికి విశాల విశ్వంభరనే జీవన రంగస్థలంగా మలిచి చూపిన మహాకావ్యమైంది ‘‘విశ్వంభర’’
చిరకాలం స్మృతిపదంలో నిలిచే మనోజ్ఞ కళాఖండాలుగా కథాకావ్యాలను మలిచాడు. సి.నా.రె. ‘‘జాతిరత్నం’’ ‘‘విశ్వనాథనాయుడు’’ కర్పూర వసంత రాయలు, ‘‘సప్నభంగం’’ ‘‘నాగార్జున సాగరం’’ లాంటి రచనా వైచిత్రిని అనుభూతుల దృశ్య పరంపరలను కళ్ళముందు నిలుపుతాయి. ఉదయం నా హృదయం మధునం, విశ్వగీతి, భూమిక, సమదర్శనం, మావూరు మాట్లాడిరది, ముఖాముఖి సమీక్షణం, రామప్ప, గాంధీయం, మీరాబాయి, శిఖరాలు, లోయలు, ముత్యాలకోకిల, మందార మకరందాలు, మట్టిమనిషి, ఆకాశం, నిరంతరం, విశ్వంభర వంటి కావ్యాలలో అనవరతంగా పరిజ్ఞాణంతో సాగిన సినారె రచనా ప్రయాణపు మలుపులు, మార్పులు, వారు ఇచ్చిన తీర్పులు పరిశోధనాత్మక విమర్శకు, విశ్లేషణలకు ద్వారాలు తెరిచాయి. కవిత్వాన్ని గుబాళింపచేసే లక్షణాన్ని పుష్కలంగా కలిగిన కవి కావున కవిత్వమే సినారెకు శ్వాసగా మాతృభాషగా మారింది.
అంత్యప్రాస, పూర్వాంత్యప్రాస నియతితో ఫారసీ, ఊర్ధూకవితలోని రదీప్, ఖాసియా చందస్సులో ‘తెలుగు గజళ్లను’ సృజించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకవచ్చారు సినారె గజల్పల్లవి ‘మత్లా’చరణం ‘ముక్తా’ కవినామముద్ర ‘తఖల్లుస్’, నారాయణరెడ్డి గజళ్లలో తఖల్లుస్ ‘సినారె’’ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి స్మృతిలో ప్రఖ్యాతమై విఖ్యాతిపొందిన తెలుగు గజళ్లనెన్నింటినో రచించి స్వరకల్పన చేసి స్వయంగా గానం చేశారు. ‘అమ్మ’ లాంటి వాళ్లమ్మాయి ‘గంగ’కు తన గజళ్లను అంకితమిచ్చారు. 35 గజల్ను ‘‘సినారె గజల్స్’’ పేరిట పుస్తకంగా వెలువరించారు. అంతకు ముందే ‘తెలుగు గజల్లు’ కూడా ఆయన లేఖిని నుండి వచ్చాయి. ‘మత్లా’ మొదులుకొని ‘మక్తా’ వరకు అన్ని పాదాల్లో మాత్రా సంఖ్యాసమత్వాన్ని పాటిస్తూ ‘కాఫియా’ స్వరూపంలో స్వేచ్ఛ తీసుకుంటు గజళ్లలో కూడా యతి నియతిని పాటిస్తూ సినారె గజల్స్కి పరిపూర్ణత తీసుకవచ్చారు.
ఆచార్య సినారె ప్రతినిత్యం నడకలో సహచరుల పలకరింతలకు బదులు పలుకుతూనే మనసులో పంక్తుల అట్లుకుంటూ చెప్పగా వెలుబడిన ‘ద్విపదులు’ ‘కలం సాక్షిగా’ పేరుతో 1995 సం॥లో ప్రచురించబడ్డాయి. చతురస్ర, మిశ్రతిస్ర గతులలో సాగిన ఈ ద్విపదులు నడకలో జనించిన ముత్యాలుగా, మనసుకు అద్దం పట్టిన మౌలిక సత్యాలుగా అభివర్ణించారు. కత్తిరిస్తేనే మొక్కలు కొత్తగా చిగురు పెడతాయని చెప్పిన సినారె బీజం చిన్నదైనా దిక్కులను కాపాడె దిక్కయ్యే పచ్చని చెట్టుని ప్రసవిస్తుందని సూచించారు. ‘కరగని జీవన నిధులు’’గా నారాయణ రెడ్డి ద్విపదులుగా భాసించాయి. ‘‘ఊపిరిగాడ్పులు చెలరేగుతున్నాయి / ఉరికే రోజులతో చేయి కలిపి నా మనసు పరుగులు తీస్తున్నది / పరిసరాల ప్రశంసలతో… ముంచేస్తున్నవి. అనే ఉరికే రోజులు ` సినారె చివరి ప్రచురిత కవిత ‘‘మన తెలంగాణ’’ దిన పత్రిక ` కలం పేజీలు 12/6/2017 లో అచ్చు రూపంలో ఉంది. ‘‘చెక్కనిదేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది / మరగనిదే నీరు ఎలామబ్బు రూపుకడుతుంది / నలగనిదే అడుగు ఎలానటన రక్తి కడుతుంది’’ అన్న సినారె మరణం సాహిత్య ప్రపంచానికి, సాంస్కృతిక వైభవానికి ఎంతో లోటును మిగిల్చింది.
‘‘సంకల్పం అచంచలంగా వుంటే / ఈదగలిగే చేతులకు సముద్రాలు లొంగిపోతాయి’’ అనే ధీమాను వ్యక్త పరుస్తూ 116 కవితలతో తన 86వ జన్మదినోత్సవ సందర్భాంగా సినారె గారు ‘‘నా రణం మరణం పైనే’’ అన్న కవితల సంపుటిని వినూత్న వస్తు వైవిద్యం, భావవైశిష్ట్యం, శిఖరస్థాయిలో అభివ్యక్తిని సంతరించుకున్న కవితలను ఈ సంపుటిలో చేర్చారు. ‘‘తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం’’ అని తెలిసిన ప్రాణికి కరిగిపోయిన జీవనకాలంలో తాను మిగిల్చిన పునాదులే మరణానంతర సజీవత్వాన్ని ఆపాదిస్తాయని అ ంటారు. మరణాన్ని జయించే దైర్యపు ధీరతనే జీవిత వృక్షాన్ని అక్షయంగా నిలుపుతుందన్న ఆశావాహ దృక్పథాన్ని నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు. పరిపక్వఫలభరితమై తరుదశకు చేరుకుని అన్నీ తట్టుకుని నిలబడే మనుగడల జీవిత వృక్షాన్ని కాంక్షించారు. వారి వారసులుగా మనం సాగుదాము అంటూ తిరునగరి శ్రీనివాస్ వారి వ్యాసాల ద్వారా తెలిపారు. ఈ సాహిత్య విమర్శా వ్యాసాలు భావితరాలకు పరిశోధనకు నాందిపలుకుతాయని భావిస్తున్నాము.
‘‘చినుకును రమ్మని చిటికేశాను అది జల్లై వచ్చి కురిసిపోయింది చిగురును చేత్తో నిమిరి చూశాను అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది. తారను ధగధగ వెలిగిపో అన్నాను, అది మధ్యాహ్న సూర్యబింబంలా ఉజ్వలించింది’’ అనే పంక్తుల్లో ప్రకృతిలో మనిషి మమెకమైతే సంపదలను ఇస్తుంది. ఆదే ప్రకృతిని విధ్వంసం చేస్తే కల్లోలం సృష్టింస్తుంది. వ్యక్తి నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా మానవతా దృష్టిలో తోటి వారిని ఆదుకోవాలనే సమన్యాయం వీరి రచనల్లో ఉన్నాయి. ఓ మేరుపర్వతం లాంటి భావకుడు స్పర్శించిన అక్షర జ్ఞానం మనకిచ్చిన అక్షర వరాలుగా భావిస్తూ ఆదర్శవంతమైన, సాహితి విలువలతో కూడిన రచనలు చేయటానికి ఆదర్శనీయులు మన ఆచార్య సి.నారాయణ రెడ్డి అంటారు శ్రీనివాస్ తిరునగరి.
‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే` రమంతే తత్ర దేవతా:!
యత్రైతాస్తు స పూజ్యంతే ` సర్వాస్తత్రాఫలా:క్రియా: !!
శోచంతి జామయోయత్ర -వినశ్యత్యాశు తత్కులం!
నశోచంతితు యత్రైతా: `వర్ధతే తద్ధి సర్వదా !!
తస్మాదేతా సదా పూజ్యా: `భూషణాచ్ఛాదనాశనై : !!’’
మహిళలు గౌరవం పొందే స్థలంలో దేవతలు ఆనందంతో నిలుస్తారు. స్త్రీలను అగౌరవపరిచే వారికి ఏ పనులలోనూ మంచి ఫలితాలు లభించవు. ఏ స్త్రీలు వంశంలో దు:ఖిస్తూ ఉంటారో ఆ వంశం నాశనమైపోతుంది. నిజానికి వారి సంతోషమే వంశోన్నతికి మూలం. ఎపుడూ వారికి అన్నం, వస్త్రం తదితర సామగ్రీ ఉండే విధంగా వ్యవహరించాలి అనేది శాస్త్రం. వాస్తవం కూడా.
అనాది నుండి అత్యాధునికం వరకు మహిళ తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ తన ఉనికి పతాక స్తాయిలో వినువీధుల్లో విస్తరిస్తూనే ఉంది. ఇది నిజం. నిజానికి ఆదిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత రాను రాను తగ్గుతూనే వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మహిళ కి ఇన్ని పరిమితులు విధించి ఉన్నట్లయితే కులాలకతీతంగా ఒక రaాన్సీ లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలు, జ్యోతీరాయ్పూలే, మొల్ల, చాకలి ఐలమ్మ వంటి వారు ఉండేవారే కారు. ఆ కాలంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ అహంతో ముందువరసలోకి వచ్చిందో అపుడే స్త్రీల అణచివేత ప్రారంభమైంది. కన్యాశుల్కం ఇచ్చిన రోజులనుంచి నేడు వరకట్నం ఇస్తున్న నేటి రోజుల వరకు మహిళ ఆర్థికంగా సమానత్వం సాధించినా కూడా ఇంకా ఇంకా అణచివేత సాగుతూనే ఉంది. వీటిని ఎలా అధిగమించడం? అమ్ముడుపోతున్న చట్టాలను ఎదిరించి గెలిచే ధైర్యమూ ఎవరికీ లేదు. మరి ఆడపిల్లను ఎలా పెంచడం? కాపాడటం ఎలా? అంతరిక్షానికి ఎగురుతున్నా కూడా ఇంకా అణగారిన కథలే వినిపిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది? అసలు ఆడపిల్ల సమాజంలో బతకగలదా? తనకు తానే ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలదా? వంటి అనేక పశ్నలకు సమాధానంగా వెలువడిన ‘‘భారతీయ మహిళ’’ అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
ఈ గ్రంథంలో వేదాలలో మహిళలు, పురాణాల్లో మహిళలు, భాగవతంలో మహిళలు, రామాయణంలో మహిళలు, మహాభారతంలో మహిళలు, దేశ చరిత్రలో మహిళలు, ఆధునిక కాలంలో మహిళలు , పూజ్యశ్రీ గురూజీ చెప్పిన మహిళల భాగస్వామ్యం వంటి అతి విలువైన అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి.
భారతీయ మహిళ` మాతృశక్తి లో ఆత్మకు స్త్రీ అనీ, పురుషుడనీ, మృగమనీయ పక్షి అయనీ పాము అనీ భేదం లేదు. అందరిలోనూ అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే. సంసారంలో ఎవరి విధి వారు నిర్వర్తిస్తారు. పరస్పరం సహకరించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తారు. వర్గపోరాటమే జీవితమనుకుంటే అదే చరిత్ర అనుకుంటే కలిసి బతికే వ్యవస్థ ఏర్పడి కాదు ఆత్మీయత , అనురాగం సర్వ ప్రాణుల మధ్య ఎప్పటికీ ఉంటాయి. ఈ సువిశాల భావాలు, ఆచారాల కారణంగా, మహిళను భార్యగా, అక్కగా, చెల్లెలిగా గౌరవించబడుతున్న కారణంగానూ, జీవితంలో పురుషుడు స్త్రీనే అనుసరించి నడుస్తాడని చెప్పడం జరిగింది.
ఋగ్వేదంలోని అనేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని అంటారు. ‘‘గార్గి, రోమశ, ఘోషా, విశ్వాపర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, కామాయని, వైవస్వతి, యామిపైలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరని, ఇంద్రమాత, సర్వరాజ్ఞి, వాక్, గోధ.. తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరూ దార్శనికులైన మేధావినులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాహిత్యం, కళలు వంటి వివిధ వృత్తులు, రాజనీతి తదితర రంగాలలో ప్రతిభావంతులుగా వెలిగారు. మహిళావికాసం సమగ్రంగా జరిగిన కాలమది. ఆ కాలంలోని కొంతమంది మహిళామణులను గురించి తెలుసుకోవాలంటే ముందుగా
బ్రహ్మవాదిని గార్గి గురించి: మహావేదాంతి రాజఋష జనకుడు మిథిలను పరిపాలిస్తున్న రోజుల్లో సీత తండ్రి జనకుడు కాడు. రామాయణ కాలం కన్నా ఎంత ముందున్నవాడు. ఈ రాజవేదాంతి ఆస్థానంలో గార్గి అనే బ్రహ్మవాదిని ఉండేది. యాజ్ఞవల్క్య అనే ఋషి ఉండేవాడు. వీరిరువురికి బ్రహ్మతత్త్వ వివేచనార్థం సభ జరుగుతున్నప్పుడు ఆకాశం, నేల, నీరు వంటి పంచభూతాల పట్ల వాదోపవాదాలు జరిగింది. చివరికి యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానిగా గార్గి గుర్తించింది. అంటే అతను బ్రహ్మజ్ఞాని అని గుర్తించిన మహామేధావి గార్గి అన్నమాట. అందుకే ఈమె బ్రహ్మవాది అయింది.
శ్రేయోమార్గంలో మైత్రేయి యజ్ఞవల్కుని భార్య. వీరికొక ఆశ్రమమున్నది. పోషణ నిమిత్తుం ఆశ్రమ భూములున్నాయి. గోవులున్నాయి. ఫలధాన్య సమృద్ధి వున్నది. ఆయన ఆశ్రమం విడిచి వెళ్ళి కొన్నాళ్ళపాటు తపస్సు చేసి దేశ పర్యాటన చేసి రావాలనుకుని మరో భార్య అయిన కాత్యాయనికి మొదటి భార్య మైత్రేయికి ఆస్థి విభజన చేసి రక్షించుకోవలసినదిగా తెలిపి మైత్రేయితో ఈ విషయం ప్రస్తావించాడట. కానీ మైత్రేయి ఈ భూమి వల్ల నేను అమృతత్త్వం పొందుతానా? అని అడిగిందట. అందుకు ఎప్పటికీ పొందలేవు. సంపదలున్నవారు అమృతత్త్వాన్ని పొందలేరు అంటే అమరత్వం పొందని ఈ ఆస్తి వలన, సంపద వలన నాకేం ప్రయోజనం ఉంది అని తిరస్కరించిందట. అయితే ఆత్మ బ్రహ్మ ఒక్కరే! ధ్యానం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి, ఇంద్రియాలను తాడిరచి ఆత్మను శోధించి ఈ పంచభూతాత్మక ప్రపంచం కంటే ఆత్మ ఎలా భిన్నమైనదో భార్యకు యజ్ఞవల్కుడు వివరించాడట. పృథ్వి జలము, అగ్ని , వాయువు, ఆదిత్యుడు, దిశలు, విద్యుత్తు, మేఘం, ఆకాశం తదితర వివరాలు చెప్పి ధర్మమే సర్వప్రాణులకు ప్రీతియని మైత్రేయి తెలుసుకున్నది.. కానీ రెండవ భార్య మాత్రం ఆస్తివైపే దృష్టిని సారించి కఠోపనిషత్తులోని శ్రేయస్సును, ప్రేయస్సును స్వీకరించింది. ఇపుడు కాత్యాయని సంసారాన్ని నడుపుతోంది. మైత్రేయి మోక్ష పథంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు తపస్సులో ఉన్నాడు ముగ్గురిలో ఒకరు ప్రేయస్సుకు ప్రతీక, మైత్రేయి శ్రేయస్సుకు ప్రతీక, యాజ్ఞవల్క్యుడు తపస్సుకు ప్రతీక అనచ్చు. ఇలా సుజ్ఞాని సులభ జనక మహారాజుతో సులభ వేదాంత గోష్టి చేసిన అంశం భారతంలో సూచించబడిరది. వేదాల్లో వందల కొలది మహిళలు పృథ్వి, ఇల, సరస్వతి, భారతి, సినీవాలి, రాఖ, సూనృత, పురంధ్రి, ధిషణ, అనుమతి, తిఱిని, ఇంద్రాణి, ఉషస్సు, రాత్రి, శ్రద్ధ, అనుమతి, అరామతి, దంపతి, అరణ్యాని, వరుణాని వంటి వారంతా మహిళా రూపంలోని దేవతలే అనవచ్చు. ఇలా మహిళల పేర్లు ఎన్నో ఒక్క ఋగ్వేదంలోనే ఉన్నాయి. వీటన్నిటిమీద ప్రత్యేకాధ్యయనం చేయాల్సిందే అంటారు రచయిత.
మాతృశక్తి దివ్యత్వాన్ని తీసుకుంటే ఆదిశక్తి మహామాయగా అవతరించింది. ఈ తల్లికి మహాకాళి అని పేరు. మొదటి అవతారంలో ఈ అమ్మవారు మధుకైటభులనే రాక్షసులను సంహరించారు.
రెండవ అవతారం మహిషాసురమర్థిని. సింహవాహనjైున ఈ తల్లికి ‘మహాలక్ష్మి’ అనే పేరుంది. ఈ తల్లి మహిషముఖుడైన అసురుడిని సంహరించింది. మూడవ అవతారం అయిన మహాసరస్వతి రక్తబీజుడ్ని సంహరించింది. నాల్గవ అవతారంలో యోగమాయగా జన్మించి కంసుడ్ని భయపెట్టి అదృశ్యమైపోయింది. ఐదవ అవతారంలో అమ్మవారు దంతాలనే ఉపయోగించడం వల్ల రక్తదంతిగా పేరును సంపాదించుకుంది. లోకంలో కరువు కాటకాలు ఎక్కువై పోవడంతో తల్లి అంతటా శాకాలు సృష్టించి కరువును తొలగించింది. అందుకే ఈ తల్లిని శాకాంబరిగా పిలుస్తారు. ఏడవ అవతారంలో దుర్గుడునే రాక్షసుడ్ని సంహరించినందువలనే దుర్గాంబగా పేరు వచ్చింది. ఎనిమిదవ అవతారంలో తల్లి మాతంగుని ఇంట పుట్టి మాతంగిగా పిలవబడిరది. తొమ్మిదవ వతారంలో రాక్షస సంహారం నిమిత్తం అమ్మవారు భ్రమరాలను సృష్టించి విజయం సాధించింది. అందువల్లే ఈ అవతారానికి భ్రామరి అనే పేరు వచ్చింది. ఇలా భిన్న రూపాలతో వర్ణితమైన పురాణాది ప్రక్రియలను ఆధారంగా గ్రహించి రేఖామాత్రంగా మనకు దర్శనమిస్తున్నాయి.
పురాణాల్లో మనసావాచా కర్మణా శుచీ దేవి. శచీదేవి, వేదవేత్త వేదవతి, వరూధిని మన నాయనమ్మ, అరుంధతి మన అంతర్యామి, ఆత్మబంధువు అనసూయ, ప్రేమరస చైతన్యమూర్తి ఊర్వశి, సుస్థిర మానస సుకన్య, ఎల్లలు లేని ఎల్లమ్మ రేణుకమ్మ, సత్యసారమతి చంద్రమతి, సంపదల దేవి లక్ష్మీదేవి, పరాశక్తి పార్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి వంటి దివ్యశక్తులున్న మహిళలెందరో పురాణాల్లో ఉన్నారు. మన జీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళలకు ఆదర్శాలయి, ఆచరణ యోగ్యాలయ్యాయి.
ఇంద్రసేన, దేవసేనచ పులోమ, ఇల, అంగీరస, కావేరి, ఘృతాచి, జలంధర, తిలోత్తమ, మనోరమ, యమున, రాధ, లోపాముద్ర, శతరూప ఇలా మరో వందమంది పురాణ మహిళల ద్వారా సార్వకాలీన సత్యాల్ని అనుసరించవచ్చు. అయితే ఈ పురాణ మహిళలు ఏం చేసారు? అని ఆలోచిస్తే సత్యమే మాట్లాడుతారు. స్వేచ్చాభిప్రాయాలు ప్రకటిస్తారు. రాజీపడి జీవిస్తారు. ప్రేమను పంచి పెడతారు.అన్యాయాన్ని ఎదిరిస్తారు. పురుషునితో పాటు సమానంగా వ్యవహరిస్తారు. జన హితం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేస్తారు. ఆత్మబంధువులై అందరినీ ఆదుకుంటారు. శక్తి పూత్కారం చేస్తారు. జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అంతేనా? అంటే కాదు. మహిళాలోకానికి ఆదర్శవంతులై నిలిచారు. ఆధునిక మహిళా ప్రస్థానంలో ప్రాథేయాలంగా మహిళలంతా నిలిచారు. ఒక్కొక్కరి స్పర్శ ఒక్కొక్క పీఠికై నిలిచేలా చేసారు. నేడు దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపించేలా ఆనవాళ్ళను ఉంచి మరీ కదిలారు.
భాగవతంలో ఆదితి మాత నేతృత్వం. వ్యతిరేక దిశలో దితి ప్రయాణం, దివ్య మార్గం చూపిన దేవహూతి, సహనశీలి ఆశావాది దేవకి, వాత్సల్యద యశోద, చంద్రునికో నూలుపోగు అంటున్న కుబ్జ, జగన్మోహిని యుక్తి, అరుచి సురుచి వినీతి సునీతి, తమస్సు చీల్చిన ఉషస్సు ఉష, జనగణనాయక రాధ, మహిళా చైతన్య ప్రతీక సత్యభామ, కృష్ణ చైతన్య స్రోతస్విని రుక్మిణి వంటి వారెందరో మహిళలు భారతీయ మహిళల జీవితాలతో పెనవేసుకుపోయారు. వీరిలో కొందరు భారతాది గ్రంథాల్లోనూ, అన్య పురాణాల్లోనూ వచ్చారు. కొందరిని మాత్రమే పరామర్శించే అవకాశం ఉంది. వీటి వివరణలు ఈ గ్రంథంలో చదవవచ్చు.
రామాయణంలో మహిళలు గమనిస్తే ఈ మహాకావ్యం నిండా మహిళల కథలే. మహితమైన దారిలో నడిచిన మండోదరి, రాజనీతి దురంధర మంథర, జైజైజై కైకామాతా దేవహిత కార్యనిర్మాత స్త్రీ జనాభ్యుదయతారా తార, అసురత్రాత, కైకసి కైసేత,, సత్య సౌందర్యమూర్తి సరమ, జనరంజన అంజన, కౌశల పూర్ణ కౌసల్య, ఫలిత పర్ణ శబరి, విషాగ్ని వృక్షం శూర్పణఖ, యోగిని ఊర్మిళ, పరమపునీత లోకమాత సీత తలుచుకుంటే రామాయణమంతా రమణుల కథే కదా అనిపించకమానదు.
మహేతిహాసంలో (మహాభారతంలో)మహిళల విషయానికి వస్తే స్వేచ్ఛాజీవి గంగ, ధీరమానస సత్యవతి, సౌజన్యవతి శర్మిష్ట, స్వాభిమాని దేవయాని, కపటి కద్రువ వినీత వినత, మేధానిది మేనక, సత్యవాది సరమ, ధర్మవాదిని జరత్కారువు, మృత్యుంజయ సావిత్రి, పరమ పతివ్రత పారమార్థికత, వీరమాత కుంతి, భారత భారతి ద్రౌపది. వీరిని తలుచుకుంటూనే ఉంటాం. మళ్ళీ మనం యథాస్థానంలోకి వస్తూనే ఉంటాం.
దేశ చరిత్రలో మహిళల్ని ఆలోచించుకుంటే గృహంలో యశోధర, ప్రచారిక సంఘమిత్ర, దేవిగా మారిన ఉభయభారతి, ఉత్తమ సేవిక సుజాత, వీర నారి రుద్రమ, రామాయణ రచయిత్రి మొల్ల, నాయకురాలు నాగమ్మ, వీరునికి వెన్ను చూపని చానమ్మ, చితిని వరించిన సంయుక్త, కృష్ణభక్తిని చూపే మీరాబాయి, విద్వేషాల మంటల్లో దుర్గావతి, యువతకు ప్రేరణ రaాన్సీరాణి ఇలాంటి చరిత్రలో ఎందరో ఇంకెందరో ఉన్నారు.
కీస్తు శకారంభం నుండి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు ఎందరో మహిళలు గృహిణులుగా, వీర వనితలుగా, పరిపాలకులుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయదారులుగా, వృత్తి నైపుణ్య రమణులుగా, నాట్యగత్తెలుగా, సంగీత విద్వాంసులుగా, దార్శనికులుగా, కర్మయోగినులుగా, భక్తి ప్రచారకులుగా, దేశికలుగా, ఋషికలుగా, రచయిత్రులుగా, కవయిత్రులగా దేశంలో భిన్న ప్రాంతాలలో వికసించారు. అయితే ఈ దేశం జాతిలో శక్తి తగ్గి విదేశీయులను తనలో జీర్ణించుకునే పాటవం కోల్పోయిన నాటినుంచి స్వతంత్య్రాన్ని కోల్పోతూ వచ్చింది. దానివల్ల, స్వదేశీ ఆచారాలపై జీవన విధానాలపై విదేశీయ అశాస్త్రీయ భావజాలం పెత్తనం చలాయిస్తూ వచ్చింది. ఇది కాస్త రాజ్య సభల్లో, వీధుల్లో వీర విహారం చేసినా చాలాకాలం గృహంలోనే ప్రవేశించలేకపోయింది. అందువల్ల విశాల హిందూ ధార్మిక సాంస్కృతిక తాత్త్వికాంశాలను ఎన్నింటినో గృహిణి అందించగలిగింది. ఇలా జాతి జీవనాడి నిత్య చైతన్యంతో పోరాడిన స్థలం గృహమే. ఈ గృహానికి యజమానే గృహిణి. ఆమె పుణ్యఫలమే జాతిలో స్వాతంత్య్ర భావబీజాలు నాటుకోవడం, ఆధునిక మహిలకు స్పూర్తి ప్రదాతగా నిలవడం అంటూ వివరిస్తున్న రచయిత భావాలకు ప్రణమిల్లక తప్పదు.
ఇదొక అద్భుతమైన గ్రంథం. ప్రతి మహిళ ఇంట్లో నిత్యం నిలవాల్సిన గ్రంథం కూడా. స్వేచ్ఛ అనేది ఒకప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. నేడు స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కడ ఎలా అవుతోందో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే అందరికీ ఖచ్చితంగా బోధపడుతుంది. నామటకు నాకు చాలా కాలమైంది ఇంత చక్కని గ్రంథం చదివి అనిపించింది. గౌరవనీయులైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఒక తలమానికం.
కసిరెడ్డిగారి గురించి
కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు
పద్య సంపుటులు:::చైతన్యశ్రీ, సుభాషిత గీత త్రిశతి, లేతమబ్బుల
గేయ సంపుటులు: సింహగర్జన, ప్రబోధమాల, మున్నూరు ముక్తకాలు, శ్రీ భగవద్గీత
సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే
సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.
తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి. కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. ర
చనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది. కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం “తెలంగాణ బి.సి. వాద సాహిత్యం”. ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే “మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.
‘ఆకాశంలో సగం’ అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ ఈ పుస్తకానికి ‘బహుజనుల వీలునామా’ పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ ” తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.
“బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు” (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ 24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్న పాట’ లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు “కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు” అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ ‘కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం’ అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం “అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన” అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం ‘సబ్బండ సాహిత్యం’ గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు, బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా “తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం” అనే విభాగంలో చర్చించారు.
ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం “తెలంగాణ పద్య కవిత్వం – బిసీ వాదం”. పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో, వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి ” గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని” రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో ” వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు” లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి ‘కట్టడముల ధాత! కరము మోడ్తు’ అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి ‘కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన ” కుడిమూపుపై కాడి యెడమ భుజంబున,,,,,,,,,,,” ను గూర్చి రాశారు. “తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం” శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.
ఈ పుస్తకంలో మరొక శీర్షిక “తెలంగాణ పాట- బిసి వాదం”. ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. “జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)” అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట ‘బావయ్యో…బావయ్యో’, గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట ‘పల్లే కన్నీరు’ ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: ‘గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసి ,,,,,,,,,,బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు’ అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: ‘చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది’ అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.
“తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం” అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది. బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ‘ బహువచనం’, ‘మేమే‘, ‘మొగి‘, ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’, ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన ‘మట్టి చిత్రం’ కవితలో కొన్ని పంక్తులు:
“జీవితమంతా మట్టిమయం
అంతెందుకు!?
అసలు మట్టి అంటేనే జీవితం
జీవితమే మట్టి కదా
అదే మట్టికుండ నాడు
రాగి, ఇత్తడి,వెండి
ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది
నేడు ప్లాస్టిక్
చెరలో బందీగా కనుమరగవగా
ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది…”
ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.
తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి. బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే ‘పడుగు పేకలు’, గొల్ల- కురుమల కథల సంకలనం ‘వేపకాయంత నిజం’, నేరెల్ల శ్రీనివాస్ గౌడ్ ‘ మా బతుకులు’, తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన ‘అడపం’, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.
ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ’ పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి ‘బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010’- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. ‘కవిత్వంలో బిసి సూర్యోదయం’ 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై ‘ఒక కవిత ఇరవై కోణాలు’. మరొక విమర్శ గ్రంథం ‘ప్రవాహం’ ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.
అట్టెం దత్తయ్య రూపొందించిన “ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు. దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన ‘ఆంధ్ర కవుల సంచిక’ లాగానే, నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం” బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం లో ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.
తెలంగాణ బి.సి.వాద సాహిత్యం రచయిత: అట్టెం దత్తయ్య
ప్రచురణ సం: 2021 పుటలు : 259
వెల : 23
ప్రచురణ : ప్రణవం పబ్లికేషన్స్
రచయిత పరిచయం
పేరు : అట్టెం దత్తయ్య
చదువులు : బి.ఏ (ఎల్), టి.పిటి, ఎం.ఏ. తెలుగు (ఓ.యు) ఎం.ఏ (జర్నలిజం), ఎం.ఏ(సంస్కృతం)
రచనలు: 1. కళ్ళం (సాహిత్య వ్యాసరాశి) (2018) 2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021)
సంపాదకత్వం: 1. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాసాల సమాహారం) 2018, 2. శిలాక్షరం (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం – సమాలోచనం) 2019
సహాయ సంపాదకత్వం
- ఆలోకనం (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం – చరిత్ర, సంస్కృతీ సమాలోచనం) 2017, మూసీ ప్రచురణ
- శతవాసంతిక (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక 1917-2017) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
- తెలంగాణ సాహిత్యం – సమాలోచన (పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
ఇంకా
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25కు పైగా పత్రసమర్పణలు, వివిధ ప్రతికలలో 70కి పైగా వ్యాసాల ప్రచురణ.
చిరునామా : ఇం.నెం. 3-9/3, గ్రా.శట్పల్లి, మం.లింగంపేట్, జిల్లా, కామారెడ్డి, తెలంగాణ
ఫోన్ : 9494715445
ఆనాటి కాలంలోనే చలం తన రచనల్లో స్త్రీకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. ఆమెకు మనసుంది, దాని స్పందన ఉంటుంది. ఆ స్పందనకు స్వేచ్ఛ కావాలని ఆమె ఆలోచనకు రూపం ఉండాలని స్త్రీని గౌరవిస్తూ ఆమెకు మాట్లాడే హక్కుతోపాటు జీవన స్వేచ్ఛ కావాలని చాలా సందర్భాల్లో చెప్పారు.
నేటి కాలంలో స్త్రీ చదువుకుంది. ఎన్నోరకాల ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లోను తన ప్రతిభ చాటుకుంటుంది. కాని మానసికంగా స్వాతంత్రాన్ని కుటుంబపరంగా స్వేచ్ఛను పొందలేక పోతున్నది. ఎ.కె.మల్లీశ్వరిగారు రాసిన ‘నీల’ నవల ద్వారా మహిళ స్వాతంత్రాన్ని మరింత నిశితంగానూ నిర్ధిష్టంగాను తెలుసుకునె అవకాశం లభించింది. స్త్రీ పురుషుల మధ్య సహచర్యం ఆర్థిక రాజకీయ స్వాతంత్రాల వల్ల వచ్చేది కాదు. కేవలం మానసిక స్వాతంత్ర్యం వల్ల మాత్రమే సాధ్యం అంటారు స్త్రీ వాద రచయితలు. మన చుట్టూ ఉన్న పదిమంది మనకు అండగా ఉంటారనుకోవడం మానవ సహజం. అయితే ఒకరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవడం బేలతనం అవుతుంది. అలాంటి బేలతనం నుండి తన జీవన ప్రయాణం నుండి తెలుసుకున్న పాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్నపాఠాలే నేడు సామాజిక ఉద్యమాలు రాజకీయ సమానత్వపు పోరాటాలను తెలుసుకున్న ఆమె జీన పోరాటము అందులోని సామాజిక అసమానతుల, స్త్రీ పురుషుల సమానత్వం అంటూనే స్త్రీని అణచివేస్తున్న పరిస్థితులకు నిలువెత్తు రూపం ‘నీలం’ నవల సముత్ర చెలియలి కట్ట దాని అలలే దాన్ని నియంత్రించినట్లుగా స్వేచ్ఛ లేనపుడు పెళ్ళి, ప్రేమ, సహజీవనం ఒంటరి జీవితం బరువే అంటారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తికీ – వ్యక్తికీ స్వేచ్ఛ నిర్వచనాలు మారుతాయి. ఒకరికి స్వేచ్ఛ అనుకున్నది. మరొకరికి విశృంఖలత్వం అనిపించవచ్చు. ఇవి అన్ని కూడా వ్యక్తులు మనస్తత్వాలు, సంస్కారాలను వాటి పరిమితిల్లో నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఓ మహిళ జీవితంలో జరిగిన సంఘటనలే ‘నీల’ నవలగా చెప్పవచ్చును.
నీల బాల్యం నుండి కష్టాల కొలిమిలో రాటు తేలింది. తన తల్లిని చంపిన తండ్రి జైలుకెళ్ళగా అనాథగా జీవనం సాగించింది. మానసిక పరిపక్వత చెందని వయస్సులోనే పెంచినవాళ్ళు పెళ్ళి చేయగా తనకు ఓ తోడు దొరకదని ఆనందపడింది. ఓ బిడ్డకు తల్లిగా మారింది. అంతలోనే తన భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకొని ‘స్వచ్ఛమైన, నిష్కలషమైన ప్రేమకోసం పరితపించింది. ఋతువులు మారుతున్నాయీ కాని నీల జీవితంలో ఏ వర్ణము ఆమెను దరిచేరలేదు. కుటుంబ జీవితంలో హింసను చూసింది తనను హింసిస్తున్న మగవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. పైగా అతను పడుతున్న హింస నుంచి విముక్తి కల్గించాలనుకుంది. అంటే తను విముక్తమవ్వాలి అనుకుంది. అందుకే పెళ్ళి పేరున ఏర్పడిన సాహచర్యాన్ని తెంచుకుంది. సహజీవనంలో భద్రత కోరుకుంది. స్వచ్ఛతని, సమానత్వాన్ని కోరుకుంది. స్త్రీ పురుషుల సాహచర్యంలో ప్రేమ, స్వేచ్ఛలతో కూడిన దృఢమైన బంధం కోసం వెతికింది. అతి హింసాత్మక నేపథ్యం నుంచి దుర్భర దారిద్ర్యం నుంచి భవిష్యత్తు సందేహంగా మారగా ‘నీల సుదీర్ఘ ప్రయాణంలోని అనుభవాల నుంచి మరియు చుట్టూ వున్న తనలాంటి మరికొందరి జీవితాల నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంది. తనలాంటి నీలవేణులకు జీవితపు అస్తిత్వము సులుపు చేయాలనుకుంది. మళ్ళీ కథలోకి వస్తే పెళ్ళి బంధం నుండి విముక్తి అయిన తరువాత నీల తొలి ప్రేమ పరదేశిపై కల్గింది. కాని అప్పటికే పరదేశి మరో స్త్రీతో రిలేషన్లో వున్నట్లు తెలుసుకుని తన ప్రేమను విరమించుకుంది. ఎవరి వ్యక్తిగత జీవనం వాళ్ళదే దానివల్ల కలిగే మంచి చెడ్డల ఫలితం అనుభవించేది కూడ వాళ్ళే అందులోకి తొంగి చూసె అవసరంకాని ప్రమేయం లేదు. స్త్రీ పురుషుల సహజీవనానికి ప్రేమ అవసరం కాని సమాజం, కుటుంబ విధించిన నియమాల సంకెళ్ళ, చిక్కుదారులు అనేకం వాటిని తెంచుకొని స్వేచ్ఛ కోసం వెతుకులాడే వాళ్ళంతా నీలగాను, నీల తల్లిగాను, నీల నేస్తం సంపూర్ణం, పరదేశిలాగా, ఆపన్న హస్తం అందించిన అజితలాగ సంఘర్షణకు గురికావల్సిందే. స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యానికి, లైంగిక స్వేచ్ఛకి వున్న కనిపించని సంబంధాలు గూర్చి వెలువడిన ఎన్నో ప్రశ్నలకు రచయిత ఈ నవలలో సమాధానాల కోసం అన్వేషణ చేశారు. కొన్నిటికి సూచనప్రాయంగా జవాబులు ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ నవలలోని ‘నీల’ వేసుకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు జీవితానుభవం ద్వారా తనకు తానే రాబట్టుకుంది. ఆమెకు తెలియకుండానే జారిపోయిన వాటిని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో సరిదిద్దుకునే క్రమంలో తనను తాను తెల్సుకుంది. చదువుకుని సొంత కాళ్ళమీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అనే జీవన తత్త్వంగా మార్చుకుంది. ‘నీల’ స్వీయ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనంగా మారింది. దాతృత్వం కాన్సెప్ట్ తో పనిచేసే స్వచ్ఛంద సంస్థలో లోపిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాల్ని తెలుసుకుంది. అభివృద్ధి నీడ కింద సమాజం అనుభవించే వేదనని అర్థం చేసుకని జీవించే హక్కు కోసం పోరుసల్పె జనంతో కలిసి రాజ్యం చేస్తున్నఅమానవీయం హింసకు వ్యతిరేకంగా నిలవాలని నిర్ణయించుకుంది.
‘నీల’ అనే వ్యక్తి జీవిత చిత్రణలో సామాజిక చరిత్రను చేర్చారు. వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయ సామాజిక సంఘటనల్ని ప్రస్తావిస్తూ ‘నీల’కి సొంత జీవితము, సామాజిక జీవితము వేర్వేరుగా లేవు అనే స్పృహతోనే రచయిత ‘నీల’ని ‘ఒక పిరియడ్’ ‘నవల’ తీర్చిదిద్దారు. ఒక నిర్దిష్ట కాలంలో గ్రామీణ పట్టణ నగర నేపథ్యాలు స్త్రీల స్వేచ్ఛపై లైంగికతపై చూపే ప్రభావాల్ని వాటిలోని భిన్న పార్శ్వాల్ని కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. స్వశక్తి డ్వాక్రా గ్రూపుల ద్వారా స్త్రీలకు కొత్తగా ఆర్థిక వెసులుబాటు వల్ల దాంపత్య సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల కుటుంబ వ్యవస్థపై అధిక ప్రభావము లేకున్న స్త్రీ పురుష లైంగికతపై బలమైన ప్రభావాన్ని చూపాయని సూచనప్రాయంగా తెలిపారు. గ్రామాల్లో సైతం కమ్యూనిజం కోరలు చాచింది. మార్కెట్ గద్ద రెక్కలు విప్పుకోగా దేశీయకళాకారులకీ కొత్త మార్కెట్ లభించింది. చాలా సందర్భాల్లో పురుషులు కుటుంబ భారాన్ని ఆడవాళ్లకి వొదిలేశారు. ఊర్లు ఆత్మహత్యలకి, అత్యాచారాలకి నిలయంగా మారాయి. స్వశక్తి గ్రూపులు స్త్రీ వోటు బ్యాంక్ రాజకీయాలకు దారులు వేశాయి. మహిళలు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం ఆధిపత్యపు కులాల ఎత్తుగడలకు వీళ్ళు పావులుగా బలైనారు. నవల్లో రచయిత్రి ఈ విషయాన్ని విస్తృతంగానే వివరించారు. సమకాలీన స్థానీక రాజకీయాల్తో పాటు పలాస అడవుల్లో ‘నీలధార’ సాక్షిగా నడిచిన గిరిజన ఉద్యమాల ఊసులు, స్టాలిన్ సూర్యం పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమాలపై అమలైన అణచివేత జాడలు నవల్లో సందర్భానుసారంగా ప్రస్తావనకి వచ్చాయి.
ప్రకృతి వనరుల్ని మల్టీ నేషనల్స్ కి అప్పజెప్పడానికి సముద్ర మైదానం అడవి తేడా లేకుండా మానవ విధ్వంసానికి ప్రకృతి వినాశనానికి తెగబడ్డ భీభత్స సందర్భంలో మల్లీశ్వరి నీల గురించి నీల లాంటి మరికొందరి నీల చేయబోయే నూతన ప్రస్థానం గురించి మనం మాట్లాడటం అనివార్యమే కాని ఆ అనివార్యములోంచే ఈ నవల పుట్టి వుండవచ్చు. ‘సముద్రం కార్పోరేట్ల నీటి తొట్టి’ అవడానికి కారణాలు అనేకం. వాటిని తెలుసుకునే దిశగా ‘నీల’ ప్రస్థానం మొదలైంది. ‘జీవితమంతా పోరాటమైన స్థితి నుంచి పోరాటాన్నే జీవితంగా’ మార్చుకునే కొత్త ప్రణాళికల్ని రచించుకుంటుంది. నాలుగు పదులు కూడ నిండని ‘నీల’ మరింత సంఘర్షణాత్మకమైన దారిలో నీల తనలాంటి మరెందరినో కలుపుకుని అడవుల వేడి నిట్టూర్పుల్ని సాగరాల గంభీర శ్వాసని వింటు నడుస్తుంది. స్వతంత్ర జీవనం గడపాలి అనుకునేవాళ్ళు, జాలరి పైడమ్మ లాంటి పీడితుల కోసం పరదేశిలా భుజంకాయారి అనుకునేవాళ్లు సదాశివలా స్వేచ్ఛని గౌరవించగల వాళ్ళు అందరూ నీలకు హితులే, సన్నిహితులే.
మానవ సంబంధాల్లో బలీయమైనది ప్రేమ, స్వేచ్ఛకి సంకెళ్ళుగా పరిణమించిన సంఘర్షనాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ చిక్కుముడులు నిప్పుకుంటూ ప్రేమ – స్వేచ్ఛల మధ్య సమన్వయం సాధించటానికి ఓ స్త్రీ జీవన పోరాటమే ‘నీల’ నవల.
Writer: A. K. Malleswari
ఈ నవలని రచయిత్రి దృష్టిలోంచి చూసినపుడు అశాంతిని కాక జీవశక్తిని ఆవిష్కరిస్తుంది. అది వ్యక్తిలో అపార జీవశక్తి ఉంది. ఆమె వైరిలో ఉద్వేగముంది. సన్నివేశ కల్పనలోను, మనోభావాల్ని పట్టుకొని వివరించడంలో కౌశల్యముంది. కె.ఎఫం.మల్లీశ్వరిగారు రచించిన ‘నీల నవల’ ‘తానా’ బహుమతి పొందినది. మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ అన్ని దశల్లో పురుషుడి మాటునే ఉండాలనే నియమాలకు విరుద్ధంగా స్త్రీ స్వేచ్ఛ కోసం ‘నీల’ పాత్ర ద్వారా మనకు అనేక విషయాలను సమా కోణంలో చూపిస్తూనే స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎంత అవసరమో చెప్పడంలోనను కొన్ని మెళుకువలతోపాటు ఆధిపత్యపు సంస్థ ద్వారా స్త్రీ జీవన సంఘర్షణని చూసారు. ఈ నవల ప్రతి ఒక్కరిని చదివించేదిలా ఉంది.
భాష పుట్టుకకు ప్రాంతముంటుంది కానీ దాని పరిమళాలు నిండిన గాలులు ఏ ప్రాంతంలో వీస్తాయో ఎవరూ చెప్పలేము…
భాష వైభవం సాహిత్యంలోనే కనిపిస్తుంది…
భాష మనుగడ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది…
సరిహద్దులు దాటి స్వేచ్ఛగా విహరించేదే కదా సాహిత్యమంటే…
కమ్మనైన అమ్మభాషకు కవుల కలాలే కప్పురపు హారతులు…
కాదంటారా…!?
అనేక ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక శైలితో పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలను నింపుతున్న కవి , రచయిత శ్రీధర్ బిల్లా…వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని మల్లక్కపల్లి గ్రామం. ప్రస్తుతం ఉంటున్నది కాలిఫోర్నియా(అమెరికా). దాదాపు పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలోనే ఉంటున్న శ్రీధర్ కు తెలుగుభాషన్నా , భారతీయ సంప్రదాయమన్నా ఎంతో అభిమానం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను , తన బాల్యాన్ని , తన వృత్తిని ఇలా అనేక అంశాలను వస్తువులుగా తీసుకుని వాటిని వివిధ ప్రక్రియలలో అక్షరీకరించారు.
ఒక్కో ప్రక్రియకు ఒక్కో పుస్తకాన్ని విడిగా వేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలను కలిపి ఒకే సంపుటిగా తీసుకు రావడం కాస్త సాహసమనే అంటాను…ఏదైనా కవిత్వమే కదా అంటారు శ్రీధర్…
కవి మనసుకు ప్రతిబింబమే అతని సాహిత్యం…బహుశా అందుకే తన ఈ సంపుటికి “ప్రతిబింబం” అని పేరు పెట్టారని అనుకుంటాను.
ఇందులో వచన కవిత్వం, నానీలు, రుబాయీలు, పద్య ఖండికలు ఉన్నాయి.
వచన కవిత్వం ఎక్కువగా దీర్ఘ కవితలుగా ఉన్నాయి. అందుకే తీసుకున్న ప్రతి వస్తువుకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.
ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి ”ఒంటరీ బందీ” అనే కవితలో హృద్యంగా తెలియజేశారు. ఇది తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన…తన సోదరిలాంటి బాల్య మిత్రురాలికి జరిగిన బాల్య వివాహం గురించి ఆవేదనతో రాసుకున్న అక్షర నివాళి ఇది…
// హృదయాంతరాళం ప్రళయ ఘోష చేస్తున్న,
అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌన శిఖరం తాను!
గర్భమంతా మంచుకాసారం నిండియున్నా ,
మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్ని పర్వతం తాను! // అంటూ ఆవేదనతో రాశారు…
//పెంచిన తల్లివి గావు! తండ్రివీ గావు!
తోడబుట్టిన దానవు కావు! కానీ, తోడై నిల్చిన దానవు!// అంటూ ”ఎర్ర బర్రె” కవితలో తన బాల్యంలోని ఆత్మబంధువైన ఎర్ర బర్రెను ఆత్మీయంగా తలచుకొన్నారు.
అకాల వర్షాల వల్ల రైతు ఆశలు ఎలా కొట్టుకు పోతాయో “చినుకుల మాటున” కవితలో మన కళ్ళ ముందుంచారు.
రెక్కలొచ్చిన పిల్లలు సుదూర తీరాలకు ఎగిరెళ్ళిపోతే…రెక్కలుడిగిన ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లి పోతుందో ”ముసలోడు” కవితలో ఇలా రాశారు…
//ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో
పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమి చూశాడు
ముసల్ది మరణించిందని ఓ క్షణం పాటు మరచాడేమో
ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది//
//తాను విలపిస్తూ చితికి శిధిలమై పోతుంటే
ఆ విలాప శిధిలాలతో పేరుస్తున్న విలాస సౌధాలు
కళకళలాడుతున్నాయి//అంటూ వేశ్యల జీవితాలలోని ఆక్రందనలను ”ఆక్రందన” కవితలో అక్షరీకరించిన తీరు కవికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తుంది.
//అందమైన ఒకనాటి ఆంధ్రదేశానికి
జాతీయ భాషను నేను
జాతీయ భాషగా వేరొకటి రుద్దగా
‘ప్రాంతీయ భాషనయ్యాను’ నేడు!//
అంటూ ”తెలుగు అనే నేను” కవితలో నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలియజేస్తూ విదేశాలలో మన భాష ఎంత గొప్పగా వెలుగొందుతోందో
//ప్రాంతీయ భాషగా
భారతావనిలో భారంగా బతుకీడుస్తున్నా,
ప్రవాస సంఘాల కృషితో
ప్రపంచ భాషగా గుర్తింపు పొందుతున్నా!// అంటూ ఈవిధంగా తెలియజేశారు. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న వచన కవితలు 38 శీర్షికలతో ఉన్నాయి.
ఈ కవికి అంత్యానుప్రాసలు బాగా ఇష్టమనుకుంటాను. అందుకే అతని కలం ప్రాసలను అందంగా జాలువార్చింది.
ఇంక నానీలు , రుబాయీలు, పద్య ఖండికలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.
శ్రీధర్ రాసిన కొన్ని నానీలను చూద్దాం…
//నాలుగు మెతుకులు
ఆకలి మంటల్లో
బాలల హక్కులు
కాలిపోయాయి//
//ఆటలాడి
రాటుతేలాల్సిన దేహం
రాళ్ళు కొడుతూ
రాటుదేలుతోంది!// అంటూ ‘బాల కార్మికులు’ అనే శీర్షికలో సందేశాత్మక నానీలను రాశారు. ఇంతే కాకుండా మామగారు , కొడుకులు, బడి , చెత్తకుండీ, పందెం కోడి , రోడ్డు గుంత అనే శీర్షికలతో కూడా నానీలు ఉన్నాయి.
ఇంకా ఈ సంపుటిలో “అన్వేషణ”, “దిన దినం” శీర్షికలతో రుబాయీలు కూడా ఉన్నాయి…
చివరగా 14 శీర్షికలతో పద్యఖండికలు కూడా ఉన్నాయి.
తే.గీ. నీదు ఇంటిలోన, కటిక పేదరికపు
కాళరాత్రుల చీకట్లు కప్పియుండె!
నీవు జెక్కిన శిల్పము, దేవళమున
దీపములలో వెలుగుచుండె, తేజమలర!
అంటూ రాసిన ఈ తేటగీతి “శిల్పి” అను శీర్షికలోనిది.
పద్యఖండికలోని పద్యాలన్నీ సులభ శైలితో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉన్నాయి.
ఇందులోని సాహిత్యం చదువుతుంటే ఈ కవికి సామాజిక బాధ్యతే కాకుండా భాషాభిమానం కూడా చాలా ఉందని మనకు తెలుస్తుంది.
ప్రచురింపబడిన మొదటి పుస్తకం ఇదే అయినా మరెన్నో గ్రంథాలను త్వరలో ఆవిష్కరించాలని కోరుకుంటూ…
“ప్రతిబింబం” రచయిత శ్రీధర్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను.
అవును! ఎంతటి చింతనీయమైన ‘దుర్గతి’ ఇది!
భూమి, నీరు, వెలుగు, సమీరాకాశాలను కేవలం తన కడకంటి చూపుతో, 4 అంగుళాల అరచేతిలో ఇమిడపోయిన ‘రిమోట్’ ఒకచోట వ్రేలి కొస నొక్కుతో శాసించగల్గిన మానవుడికేనా – ఈ చింతనీయ గతి!
త్రివిక్రముడులా అపరపరాక్రమంతో ఒక కాలు భూమిపై నుంచి, మరోకాలు చంద్రమండలాన్ని తాకి విర్రవీగిన మానవుడికేనా – త్వరలో అంగారక సదృశ గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోబతోన్న మానవుడికేనా ఈ దుస్థితి!
‘సర్వాంతర్యామి’ అనే వాడెవడో, ఎక్కడో లేడని, భూలోకంతో సహా 14 భువనాలు తనవేనని, తనే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వంతనేనంటూ విర్ర వీగుతూ తనే మాన్యుడనీ మరెవరినీ కొలువొద్దని విర్రవీగుతోన్న అసురసంధ్యవేళ పుచ్చిపోయిన మొగురం (స్థంభం)లోంచి, అటు మనిషి కాక ఇటు జంతువుకాని ప్రాణి ఉద్భవించి తన ఇనపగోళ్ళతో గర్వాంధుడు మదాంధుడు అయిన హిరణ్యకశిపుడిని సంహరించినట్లు, అటు సురల్నీ ఇటు అసురుల్నీ, తన ఉనికి, స్థితి, చింతనకు తెచ్చినట్లు –
ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఊహించను కూడా వీలుకాని ‘ఊహాన్’ నగరంలో, బొగ్గురామిత్రవ్వే చీకటి గనుల్లో, అటు జంతువుకాక ఇటు పక్షీ కాక, నోరు, విసర్జక అవయవం ఒక్కటే అయి, పరమ రోత కలిగించే గబ్బిలం కడుపులో పుట్టి, మానవ హిరణ్యకశిపుల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా అన్ని జాగ్రత్తలకు అతీతంగా, పేద ధనిక ఆడ, మగ, ఇక్కడ అక్కడ, అనే తేడా చూపకుండా ఈ మానవ హిరణ్యాక్షులను తన వాడిగోళ్లతో, కళ్లకు కనిపించక, దును మాడటం ఏమిటి?
అంతటి అసమాన పరాక్రమశాలి, అతులితబలుడు అస్త్ర, శస్త్ర సంపన్నుడూ అయిన మానవుడు ఈ కంటికి కనిపించని శ్రతువు ఖడ్గ ప్రహారాలకు బెంబేలెత్తి, కకావికలై ‘తాను శాసిస్తున్నాను’ అనుకున్నా ఉచితంగా ప్రకృతిలో అనాయాసంగా, ఆయాచితంగా దొరికే వాయువు; ప్రాణవాయువు, ప్రాణాధార సమీరాన్ని లీటర్ల చొప్పున లక్షలు వెచ్చించి కొనుక్కోవటం ఏమిటి? ఇంతా చేసినా, లక్షలు ధారపోసినా, ప్రాణాలు దక్కక విలవిలలాడటం ఏమిటి?
ఇంత చేసినా, బ్రహ్మ కలంపోటుతో కసువుగా మారి అసువులు బాస్తే – పూడ్చటానికో, కాల్చటానికో ఆలుబిడ్డలకు దూరమై ‘అనాధ’ చావు చస్తే, ఎవరూ భయంతో రాకపోతే, మ్యునిసిపాలిటీ వాడి కుక్కల బండే, వైకుంఠరథమై ప్రయాణం కట్టటం ఏమిటి? విలయం కాకపోతే, ఇది ఏమిటి?
సర్వాంతర్యామి మానవాతీత శక్తి మహాదేవుడు – ఎవరూ లేరని అన్నీ తానేనంటు, అన్ని వనరుల్ని అప్పనంగా అనుభవించాల్సింది తానేనని విర్రవీగిన ఈ మానవ హిరణ్యాక్షుడిని కరోనా – అవును- కరోనా ఎక్కడి నుండి ఎక్కడకు దిగజార్చింది!
ఇలాంటి గతిలో, దుర్గతిలో నరజాతి సమస్తం విలవిల్లాడుతోంటే – చీకటి కుహరంలోకి త్రోయబడి చివరకు గాలి కూడా ఆడని గతిలో, 68 కళలు సాహిత్య సౌరభాలు గానసభలు, కళారంగ భారతిలు ఎవరడిగేను? ఎవరికి గుర్తు వచ్చేను?! సన్మాన పంచాంగాలు కాదు: ప్రాణాంగ దక్కితే చాలు; గండం గడిస్తే చాలు; బలుసాకు తినగలిగే స్థితిలో ఉన్నా చాలు.
మనల్ని ఈ కష్టకాలంలోంచి పైకి చేదుకునే ప్లహ్లాదుడు – అదుగో వస్తున్నాడు. సూది మొనయై మన భుజకండాల్లోకి, సున్నితంగా దిగబడి మనలో ఎదురిచే అస్త్రశ్రస్తాలను నింపటానికి వస్తున్నాడు. చిక్కగా క్రమ్ముకుని మసకేసిన మబ్బులు ప్రపంచాన్ని చెదరగొడుతూ చెదిరిన మబ్బు పూలదండ ఆయన గళహారంగా ప్రకాశిస్తోంటే , మనల్ని ఆదుకోవటానికి, చేదుకోవటానికి వాక్సీనై వస్తున్నాడు.
మనల్ని ఈ సమస్య వలయంలోంచి పైకి లాక్కుని అలిసిన మన ‘పాల’ బంధువుల్ని తుడిచి స్వాంతన చేకూర్చుతాడు. సకల కళాభారతిని గంధర్వగాన సభల్ని మళ్ళీ వింటాము. చింతవద్దు. తొందరవద్దు.
(బుర్రా లక్ష్మీనారాయణగారి మబ్బుదండ (పాలపిట్ట మే 21) చదివాక.