Home పుస్త‌క స‌మీక్ష‌ సమాజానికి మేలుకొలుపు పాడిన శతకం

సమాజానికి మేలుకొలుపు పాడిన శతకం

స్వేచ్ఛా కవి వేణుశ్రీగారి పద్యం కేవలం పద్యం మాత్రమే కాదు. కారు చీకట్లను చీల్చే మయూఖం. ప్రకృతిని పరవశింప జేసే మయూరం. ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. చురుక్కుమనే వాతలు. మేలుకొలుపు గీతలు. సశాస్త్రీయతను చాటే చేతలు. అశాస్త్రీయతకు తోచే కోతలు. ఆలోచనల కలల అల్లికలు. అద్భుతమైన ఆవిష్కరణ జ్యోతులతో సుదర్శనం వేణుగోపాలాచార్య గారి పద్యం ధగద్ధగాయమానంగా మెరుస్తూ ఉంటుంది. ఆయన పద్యానికి అస్థిత్వం ఉంటుంది. పల్లె సొగసును ఆరబోస్తుంది. పట్నం పోకడను పట్టి చూపుతుంది. ప్రపంచీకరణ పీడను ఎత్తి చూపుతుంది. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొడుతుంది. తాడిత పీడితుల ఎతై వలపోస్తుంది. పండిత పామర జనాన్ని పలకరిస్తుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. సమసమాజాన్ని కాంక్షిస్తుంది. నవ సమాజాన్ని నిర్మిస్తుంది. ఆయన జీవభాషా పటిమతో, భావ సంపదతో, శైలీ విన్యాసంతో పద్యాల పంటను పండించారు. వాసిలో వాటిని శతకంగా రాశి పోశారు. ఈ మట్టివాసన గలిగిన పద్యాలను ఆస్వాదిద్దాం. ఇప్పటికే వేణుశ్రీగారు వరేణ్య శతకం, ఓ ప్రచేతసా శతకంలను అందించారు. ఇందులో వరేణ్య శతకం ద్వితీయ ముద్రణ పొందింది. వేణుశ్రీగారి మనుమల పేర్లు వరేణ్య, ప్రచేత్, కైరవ్. వారిని సంబోధిస్తూ సామాజిక శతకాలు రాయడం హర్షణీయం. ఇప్పటి పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు అర్థవంతమైన పేర్లను పెట్టుకోవడం లేదు. తన కొడుకులకు, మనుమలకు వేణుశ్రీగారు చక్కటి పేర్లు పెట్టారు. స్వేచ్ఛ-1, ప్రజాభారతం, స్వేచ్ఛ-2 వచన కవితా సంపుటాలను అచ్చేశారు. విస్తృతమైన రచనానుభవంతో రాసిన కైరవ శతకంలోకి వెళదాం.
“వ్యవసాయదారుల వ్యథలింక తీరునా/ పాలకులెందరో వచ్చినారు/ స్వాతంత్ర్య మొచ్చియు చాలేండ్లు గడిచిన/ ఎవరొచ్చినా యింకా ఇడుముల బడి/ఉండుటే నూతన ఊబి చట్టాలతో/రైతుల బతుకులు రచ్చకెక్కి/చేటు కాల్గునటంచు చెప్పిన వినకుండ/కాలయాపన చేసి గడుపుటేల/కంపెనీ వస్తు ధరలను కంపెనీలె/నిర్ణయించి లాభాలకై నియమముండ/పంట పండించి రైతులె పైక మింత/యనియు చెప్పేటి చట్టాలు యవతరించ/రైతు సేద్యానికింకను రక్షణుండు/తాత మాటలు కైరవా!తరగని నిధి” అంటూ దేశానికి అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్రా! అని అఘోరిస్తున్న తీరును కవి వేణుశ్రీ గారు కళ్ళకు కట్టించారు. గత డెబ్భై యేండ్లుగా ప్రభుత్వాలు ఐదేండ్ల కొకసారి మారుతూనే ఉన్నాయి. ఎవరొచ్చినా సైరికుల బతుకులు మాత్రం ఎప్పటి చిప్ప ఎనుగులో పడ్డట్టుగానే ఉన్నాయి. పరిశ్రమల్లో తయారయ్యే వస్తువులకు ఆ కంపెనీదారుడే ధరలు నిర్ణయిస్తాడు. లాభాలు ఆర్జిస్తాడు. ఇక్కడ రైతు పండించిన పంటలకు మాత్రం రైతుకు ధరలను నికరం చేసే అధికారం లేకపోవడం గమనార్హం. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు తిరిగిరావు. అప్పుల కుప్పలు తీరయి.  ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరనైనా కట్టుదిట్టంగా అమలు కాదు. ధాన్యాన్ని కాజేసే దళారులే దర్జాగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య మూడు నూతన సాగు చట్టాలను తేవడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది రైతుల పరిస్థితి. చట్టాలతో కార్పొరేటులకు రెడ్ కార్పెట్ పరువడం. రైతుల బతుకులను రచ్చకీడ్చడం దారుణాతిదారుణం. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ గ్రామంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపడం పాలకుల నియంతృత్వ ధోరణికి నిదర్శనం. కర్షకుల మెడలకు ఊరితాళ్ళగా పరిణమించిన పెట్టుబడిదారీ పద్ధతులను ధిక్కరించిన ఉద్యమకారుల గొంతులు నొక్కుతున్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులను అరికట్టడంలో ప్రభుత్వం బొత్తిగా విఫలమవుతున్నది. దళారీ వ్యవస్థలో దోపిడీ యధేచ్ఛగా కొనసాగుతున్నది. అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలా పరిణమించింది నేటి వ్యవసాయ రంగ పరిస్థితి. మనది వ్యవసాయిక దేశమని, అన్నపూర్ణయని సగర్వంగా చెప్పుకుంటాం. దేశ జనాభాలో సుమారు ఎనభై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నట్టుగా కనిపించవు. ఇటీవలి కాలంలో స్వాతంత్య్ర భారతానికి అమృతోత్సవాలను కనుల పండుగగా నిర్వహించుకోవడం సంతోషదాయకమే. కానీ అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు అరికట్టలేక పోతున్నామో పాలకులు ఆలోచించాలి. ఇకనైనా రైతు సంక్షేమ పథకాల ప్రచార పటాటోపాన్ని పక్కన పెట్టి, సంక్షోభంలో కూరుకుపోయిన సేద్యాన్ని సంక్షేమ బాట పట్టించడానికి, చిత్తశుద్ధితో పాటు పడాల్సిన అవసరముంది. దాని కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి, వ్యవసాయాన్ని, వ్యవసాయదారులను ఆదుకోవలసిన ఆవశ్యకతను వేణుశ్రీగారు నొక్కి చెప్పారు.

“ప్రతిపార్టి కొకటైన పత్రికుండెను కదా/మీడియా మాత్రము మితము గుండి/ఒకదాని వార్తలు నొకటిగుండవు సుమా/ ఎవరి రాతలు వారె ఎచ్చులుండు/కల్పనా చాతురీ కట్టు కథల తోడ/ వరుస కథనముల వదులు చుండి/జనులయోమయములో చతికిలబడుచుండ/చేయు పత్రికలును చెడును చేయ/ఎట్టి రాజకీయములివి ఎరుగ కుండ/ప్రజల బాగోలింతయు పట్టకుండ/పార్టి వ్రాతలు వ్రాయుట పాడియగునె/చదువరాయను నేర్చిన సారమిదియ/పత్రికల వారి నీతిని పలక తరమ/తాత మాటలు కైరవా! తరగని నిధి”. పత్రికల డొల్లాతనాన్ని తెలుపుతున్న పద్యమిది. మనం పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేటుగా భావిస్తాము. పత్రికలు సక్రమంగా కృషి చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పత్రికల ప్రతి అక్షరం ప్రజా పక్షం కావాలి. ప్రజల గొంతుకై ప్రశ్నించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అవినీతిని, అధికారుల లంచగొండితనాన్ని ఎండగట్టాలి. కుంభకోణాలను బయటపెట్టాలి. ప్రజాధనపు దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాటుపడాలి. అనునిత్యం జనాలను జాగృతం చేయాలి. “పత్రికొకటి యున్న పదివేల సైన్యము/పత్రికొక్కటున్న మిత్ర కోటి/ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న” అని నార్ల వేంకటేశ్వర రావు పత్రికల గురించి గొప్పగ చెప్పారు.  ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పత్రికల పాత్ర అమేయమైనది. నేటి పత్రికలు పార్టీవ్రత్యంతో పనిచేయడం అత్యంత విచారకరం. ఏదో ఒక పార్టీకి బోయిలాగా వ్యవహరిస్తున్నాయి. ఆయా పార్టీల దిన పత్రికలుగా మారాయి. వ్యాపార వ్యామోహంతో ఆస్తులను కూడగట్టుకుంటున్నాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా దొందు దొందుగానే వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజా సంక్షేమం జరిగేలా చూడడంలో పూర్తిగా విస్మరించాయి. విష పుత్రికల్లాంటి పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ము కాయడం వలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. అనేక రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనం కోసం, ప్రచారం కోసం పత్రికలను, పబ్బం గడుపుకోవడానికి, టీవీ చానళ్లను, యూట్యూబ్ చానళ్లను స్థాపించుకుంటున్న స్వార్థపూరిత వైఖరులను మనం చూస్తున్నాము. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు వంటింటి. ఇది నియంతృత్వ పాలనకు పాదులు వేస్తుంది. కాబట్టి పత్రికారంగం ఇప్పటికైన కను తెరువాలి. తన ప్రాధాన్యతను గుర్తెరుగాలి. నిష్పక్షపాతంగా నడుచుకోవాలని, కవిగా వేణుశ్రీగారు కోరుతున్నారు.
“గ్యాసు మొద్దు ధరయు గగనమెక్కుచు నుండె/పెట్రోలు ధరలింక పెరిగిపోయే/పేదమధ్య జనము విలవిలలాడిరి/పాలన రాబడి పక్క చేరు/పాలించు వారికి ప్రజల బాధల గాంచ/పట్టదు వాళ్లకు ప్రభుత సంస్థ/లన్నిటి ప్రైవేటు లాబీయింగులలోన/పెద్దలాప్తులకీయ పెద్దనిధుల/పెట్టి లాభాల చూపక పెరుగు సంస్థ/కార్మికోద్యోగ హక్కులు కాలరాసి/ప్రభుత జీతాల గొడవలు పడకనుండ/జనులునింక ప్రభుత్వ భజనల చేయు/తాత మాటలు కైరవా! తరగని నిధి” నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. దినదినం పెట్రోలు,డీజిల్,గ్యాసు ధరలు అధికమవుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేదలు పప్పు, ఉప్పులను కొని తినలేని స్థితిలో ఉన్నారు. ఆర్ధాకలితో బతుకులు వెల్లదీస్తున్నారు. ఎల్లియెల్లక బలవంతంగా బతుకు బండి సాగుతున్నది. ఆకలి చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కానీ అసలే తగ్గడం లేదు. చిరుద్యోగుల బతుకులు చిందరవందరగానే తయారయ్యాయి. బీదల చేతికి పనిచ్చి, ఆదాయాన్ని పెంచే ప్రయత్నం జరగడం లేదు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయి. గరీబులకు కనీస అవసరాల కల్పన కల్పనగానే మిగిలిపోయింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ముసుగులో కొనసాగుతున్న అవకతవకలను వేణుశ్రీ గారు నిష్కర్షగా ఎండగట్టినారు.
“కూట్లోని రాయిని కూర్చొని తీయక/ఏట్లోని రాళ్ళన్ని యేరదననె/తనపిల్ల లాంగ్లపు తరగతుల్లో వేసి… ” ఇందులో మాతృభాషను పరిరక్షించుకోవాలని, వేదికలనెక్కి ఉపన్యాసాలను ఊదరగొట్టు వారి ఊసరవెల్లి నైజాన్ని బయటపెట్టారు. తాను ఆచరించక ఇతరులకు ఆచరించుమని చెప్పే వారితోనే మాతృభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. “ఏమి రాజద్రోహమేరి రాజులిచట… ఎదురు చెప్పరాదంచును యిట్టిచట్ట/మింక వాడు టెవరికింక మేలు జరుగు…” ప్రభుత్వ ఆగడాలను, అరాచకాలను ప్రశ్నించేవారిపై రాజద్రోహం కేసులు పెట్టి, చెరసాలలో తోయడాన్ని ఖండించారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాల రాయడాన్ని కవి నిరసించారు. ఆంగ్లేయుల కాలంలో చేసిన బూజు పట్టిన చట్టాలను తొలగించవలసిన అవసరముంది. “కమ్మరి కొలిమియు కుమ్మరి సారెయు… కొత్త కొలువుల హామియు ఉత్తదాయె” ప్రపంచీకరణ పడగ నీడలో చేతి వృత్తులు కనుమరుగవుతున్న తీరుకు కలత చెందుతారు. తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడిన వారికి చేతి నిండా పని లేదు. కడుపు నిండా తిండి లేదు. ప్రభుత్వం ఉపాధిని కల్పించడం లేదు. ఇలా అర్ధాంతరంగా అంతరిస్తున్న జీవితాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “అలనాటి ఆత్మీయ అనురాగమేమాయె… మనుసు విప్పి మాట్లాడేటి మనుషులేరి” అంటూ నాటికీ నేటికీ తేడాను చెబుతారు. దినదిన ప్రవర్థమానంగా మానవులలో స్వార్థ బుద్ధి పెరుగుతున్నది. మమతానురాగాలు తగ్గుతున్నవి. ఈ ధోరణి మెరుగైన సమాజ నిర్మాణానికి అవరోధంగా నిలుస్తుంది. ఈ కపట బుద్ధిని బద్ధలు కొట్టాలంటారు కవి. “మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర/బీరప్ప పండగ కురుమగొల్ల… పండుగల సంబరాలన్ని బాగ జరుగు” కవి చిన్నతనంలో చూసిన జాతరలను, చేసిన కొలుపులను, ఆడిన ఆటలను చక్కగా అక్షర బద్ధం చేశారు. సిర్రగోనె, కోనేటి ఈతలు, సోపతిగాళ్లతో కలిసి తిరిగినవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతపు బాల్యంలో ప్రమాదకర ఆటలు తిష్టవేయడం శోచనీయం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవరోధం కలుగుతున్నది. నులక మంచాలు, బొంతలు, గంపలు, గుమ్ములు, కొట్టెలు, కుండలు, కూర కంచుడు, రొట్టెపెంక, చేద బొక్కెన, ఈత చీపురు మొదలుకొని ఆనాటి అనేక వస్తువులను పద్యాలలో చక్కగా పొదిగారు. “గత్తర పోయెను కలరాయు పోయెను… ” పోచమ్మ పొక్కులు, ప్లేగు, మలేరియా, అతిసార మొదలైన భయంకరమైన అసంఖ్యాక వ్యాధులను జయించాము. కరోనా, ఒమెక్రాన్లను సైతం త్వరితగతిననే గెలుస్తామనే ధీమాను వెల్లడి చేశారు. ఇలా ప్రతి పద్యం ఊటంకించదగినదే. వ్యాఖ్యానించవలసినదే. కానీ అన్నం ఉడికిందా? లేదా? అని తెసుకోవడానికి ఒకటి రెండూ మెతుకులను పిసికి చూస్తాము. అలాగే ఇక్కడ మచ్చుకు కొన్ని పద్యాలను మాత్రమే తీసుకున్నాను. వేణుశ్రీగారు తన జీవితానుభవాలనన్నింటిని మేళవించి, శతకాన్ని షడ్రసోపేతంగా, రుచికరంగా వండి వార్చినారు.
కైరవ శతకంలో 121 పద్యాలున్నాయి. అన్నీ ముక్తక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. “తాత మాటలు కైరవా! తరగని నిధి” మకుటం కూడా బాగా కుదిరింది. వస్తువైవిధ్యమున్నది.
వెంట్రుకలు, ముక్కు, కనులు, చర్మం, చెవులు, నాలుక, దంతాలు, మచ్చలు, శరీరం వస్తువులుగా రాసిన పద్యాలు చమత్కారంగా ఉన్నాయి. అవినీతి తిమింగళాలు, పుట్టలోని పాముల వంటి వ్యక్తులు, పల్లె పండుగలు, కయ్యాల కాపురాలు, అంధ విశ్వాసాలు, మద్యపాన వ్యసనం, బంధాలు, బంధుత్వాలను సమర్థవంతంగా పద్యాలు చేశారు. లాక్షణికులు చెప్పిన కావ్య నాయికలు, నాయకుల లక్షణాలను పద్యాలలో ఇమిడ్చడం అద్భుతంగా ఉంది. ఇటీవల జరిగిన కోడిపుంజు కాలికి కట్టిన కత్తి గాటుకు మనిషి బలైన ఘటన పుంజు అరెస్టు, న్యాయ దంతుల నరికివేత, అసలు దయ్యాలు, ఆడపిల్లలపై దాడులు మొదలైన సంఘటనలపై పద్యాల అల్లిక ఆలోచనాత్మకంగా ఉంది. ప్రాచీన నీచ పాత్రలను నేటి దూర్తులకు ప్రతీకలుగా వాడడం బాగుంది. ఇది కవికి ప్రాచీన, అర్వాచీన సాహిత్యాలపై గల పట్టును తెలియజేస్తుంది. కవికి జీవితానుభవంతో వచ్చిన పరిణతిని, పరిపక్వతను ఈ శతకం తెలియజేస్తుంది. సాధారణ సన్నివేశాలను, ఇతివృత్తాలను సందేశాత్మక పద్యాలుగా తీర్చిదిద్దడంలో కవి కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు.
“మాయలునేర్వని మనుషులు కావాలి/మోసము చేయని దోసమెరగ/నట్టి జనుల జీవన విధానమును రాగ/ఆధిపత్యము లేని అవని యందు/భేద భావము లేని బీద బిక్కియు లేని/నవలోకమందున నవ్య జనము/పాలన లేనట్టి పద్ధతితో నుండు/కోర్టులు పోలీస్ల గొడవ లేక/ జనులు సుఖసౌఖ్యముల కల్గి జతను కట్టె/జగము కావాలె నాకును జవము యుండి/బలము హెచ్చుతగ్గులు లేని భావజాల/పసిడి లోకమందు జనము బతుకవలెను/తాత మాటలు కైరవా! తరగని నిధి” కులమతాలకు అతీతంగా, మనుషులందరు కలిసిమెలిసి బతికే రోజులు రావాలి. ఆధిపత్య భావజాలం, అహంకార ధోరణులు అంతమవ్వాలి. హెచ్చుతగ్గులు పోవాలి. కోర్టు తగాదాలు, పోలీసు గొడవలు ఉండకూడదు. మాయలు లేని, మోసాలెరుగని, దోషరహితమైన జీవన విధానం కావాలి. సమాజంలో సుఖ, సంతోషాలు వెల్లి విరియాలి. మనుషులు మనుషులుగా మెలగాలి. ఓ కైరవా! ఈ తాత మాటలు నీకు తరగని నిధి లాంటివి. ఇవి నీ జీతమంతా పనికి వస్తాయి. నిన్ను వేలిపట్టి నడిపిస్తాయి. నీ వంటి పిల్లలందరూ అనుసరించదగినవి. నిత్య జీవితంలో ఆచరించదగినవి. సమాజానికి మేలుకొలుపులా పనికి వస్తాయి. కైరవ శతక ఫలశృతిని కాంక్షిస్తున్నట్టుగా కవి ఈ పద్యాన్ని అందించారు. నేటి సమాజానికి దర్పణం పట్టిన ఈ శతకాన్ని అందరూ చదవాలని కోరుకుంటున్నాను. దీనిని అన్ని పాఠశాల గ్రంథాలయాల్లో పెట్టి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. సమస్యాపరిష్కారాలు కలిగిన శతకాన్ని వెలువరించిన వేణుశ్రీ గారికి శుభాకాంక్షలు.

You may also like

Leave a Comment