Home కథలు అడవిలో చెట్లు

అడవిలో చెట్లు

by Devulapalli Vijayalaxmi

గబగబా మెట్లుదిగి వెహికల్ పార్కింగ్ దగ్గరకు అడుగులేసింది శారద. హెల్మైట్ పెట్టుకుంటూ ఆకాశంవంక చూసింది వర్షంపడే సూచనలున్నాయేమోనని. ఆతరువాత చుట్టూచూసింది అపరాజిత గురించి.ఫ్రెండ్సతో క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటోంది.

“అప్పూ!”అని కేకేసింది శారద.

“ఆఁ అమ్మా!” అంటూ స్కేటింగ్చేస్తున్నట్లు వచ్చి ఆగింది హోండాఏక్టివ్ దగ్గర అప‌రాజిత.

“అప్పూ! ఎన్నిసార్లు చెప్పానమ్మా స్కూల్ బెల్ అవంగానే వెహికల్ దగ్గరకు వచ్చి నుంచోమని‌.అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది.” అంది శారద.

“అమ్మా! ఇవాళ ఉన్న ఒక్క గేమ్స్ పీరిడ్ నువ్వే ఎక్స్ట్రా క్లాసు తీసుకున్నావు.అందుకే కాస్త రిలాక్సేషన్. ” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కాళ్ళతో స్టెప్సు వేస్తూ అంది అపరాజిత.

“సరే డేన్స్ ఆపి బండెక్కు.”అంటూ బండి స్టేండ్ తీసింది శారద.

అందరినీ దాటుకుంటూ స్కూల్ గేటు నించీ బయటకు రావడానికి ఐదు నిమిషాలు పట్టింది.

‘అపర్ణ కాలేజీకి వెళ్ళడానికి పది నిమిషాలు, అక్కడనించీ మ్యూజిక్ క్లాసుకి పదినిమిషాలు,క్లాసు గంట,తరవాత ఇంటి ప్రయాణం ఎంతలేదన్నా అరగంట.ఇంటికి చేరేసరికి గంటన్నర.’ అంటూ మనసులో టైము కేలిక్యులేట్ చేసుకుంది శారద.

‘సాయంత్రం ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు. పనిమనిషి రాలేదు.ఇంటినించీ ఆదరా బాదరాగా స్కూలు కెళ్ళటంతో ఇల్లంతా చిందరవందరగా ఉంది. యూనిట్ రిపోర్ట్స్ తయారుచేయాలి.’అనుకుంటూ తను చేయవలసిన పనుల లిస్టు మననంచేసుకుంది శారద.

ఆలోచనల్లో కాలేజ్ కి వచ్చిన సంగతే గమనించలేదు శారద.గేటుదగ్గర అపర్ణ సిధ్ధంగా ఉంది.
పిల్లలిద్దరినీ మ్యూజిక్ క్లాసులో వదిలి దగ్గరే ఉన్న కూరగాయల షాపుకెళ్ళ కూరలు తీసుకుంది.

మ్యూజిక్ క్లాసు అవుతున్నంతసేపు పేరెంట్స్ పూలమొక్కలదగ్గర బయట కుర్చీల్లో కూర్చొని ఖబుర్లు చెప్పుకుంటారు.శారద వింటున్నట్లు తలపంకిస్తూ తోటకూర శుభ్రచేసి చిక్కళ్ళువలిచి, మెరపకాయలు తొడిమలు తీసింది.

‘హమ్మయ్య రేపటికి కూర రెడీ.’అనుకుంది మనసులో శారద.

ఈలోపు పిల్లలు మ్యూజిక్ క్లాసు అయింది.పిల్లని ఎక్కించుకున్న వెంటనే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది.కాదు పెట్టిస్తారు పిల్లలు.క్లాస్ రూమ్ ఖబుర్లతో,గిల్లికజ్జాలతో,ఎక్కిరింతలతో,వారి చేష్టలు శారద మనస్పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఇల్లు దగ్గర పడుతోందంటే వాళ్ళ అల్లరి తారాపధం చేరతుంది. శారదకి బండి బేలన్స్ చేయటమే కష్టమవుతుంది.

“అమ్మా!హాట్హాట్ బజ్జీ స్నాక్స్ ఆకలేస్తోంది.” అంది అపరాజిత.

“చాల్లే అప్పూ!జాండీస్ తగ్గి వన్మంత్ కాలేదు ఆయిలీ ఫుడ్.” అంటూ కసిరింది అపర్ణ.

“అమ్మా ! బేకరీలో దిల్పసంద్ తీసుకో మళ్ళీ ఏ ప్రిపరేషన్ వద్దు .”అంది అపర్ణ.

ఇద్దరికీ సమాధానం చెప్పకుంండా ఇంటిదగ్గరకి వచ్చి ఆపింది శారద.పోర్టికోలో బండి ఆపి తాళం తీయంగానే చిన్నారిసింధూ తోకాడిస్తూ మీదకొచ్చింది.

“అప్పూ!స్నూపిని వాకింగ్ తీసికెళ్ళు.” అంటూ కాళ్ళకడుక్కొని వంటింట్లోకి వెళ్ళి గ్లాసుల్లో ప్రొటీనెక్స్, ప్లేట్లల్లో బొప్పాస ముక్కలతో వచ్చింది శారద.

“పిల్లలూ! పప్పాయ్యాతిని పాలు తాగి ఇల్లు సర్దండి.ఇవాళ డాడీ ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు.” అంటూ ఒకకప్ టీ సిప్ చేసి పాతచీర కట్టిగిన్నెలుతోమ ఉపక్రమించింది శారద.

బొప్పాసముక్కలు పాలు చూడంగానే పిల్లల మొఖాలు మాడిపోయాయి.అయినా తల్లి. హడావుడి చూసి నోరు మెదపలేదు బంగారుతల్లులు.మెదలకుండా పండుతిని పాలుతాగి వాళ్ళగదిలోకెళ్ళి చదువుకోసాగారు.

నెమ్మదిగా వంట పూర్తిచేసి తనుకూడా ఫ్రష్ అయి కూర్చొంది శారద.

‘రిపోర్ట్ వర్క్ ఉంది వాళ్ళు వచ్చి వెళ్ళాకగానీ ఆ పని చేయలేను.’అనుకుంది శారద.

‘ఛీ ! ఏమిటో ఆడదాని జీవితం.ఎంత చదువుకున్నా గిన్నెలు,బట్టలు వంట,పిల్లలని కనటం,వాళ్ళ పెంపకం అంతా ఆడదాని మొహానే రాసాడు భగవంతుడు.ఏదైనా తేడావస్తే ‘ఆతల్లి పెంపకం’ అంటూ సమాజం తల్లినే వేలెత్తి చూపుతుంది .తాతయ్య అన్నట్టు ‘బి.ఏ.’చదివినా బియ్యం కడగక తప్పదే శారదా అనేవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే.”

ఆలోచనలలో వాకిట్లో కార్ హారన్ వినపడలేదు శారదకి.సింధూ గేటుదగ్గరకెళ్ళి ఒబీడియంటుగా తోక ఊపుతూ డాడీ ని స్వాగతిస్తోంది.శారదవెళ్ళి గేటు తీసింది.

కారుపార్కు చేసి”పిల్లలేరి శారదా?అన్నిసార్లు హారన్ కొట్టినా రాలేదు.”అన్నాడు వంశీకృష్ణ.

“చదువు కుంటున్నారు వాళ్ళగదిలో!”అంటూ అనుమానంతో గదిలోకి వెళ్ళింది శారద.

‘పుస్తకం హస్తభూషణం’ అన్నట్లు చేతిలో పుస్తకంతో కునికి పాట్లు పడుతున్నారు పిల్లలు.

శారద మాతృహృదయం తల్లడిల్లింది.’పిచ్చితల్లులు నాలుగింటికి లేచి అలసిపోయారు.స్కూలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇల్లు. స్వంతఇంటిని అనుభవించాలని ఉండటమేకాని దేనికీ దగ్గరకాదు.”అనుకుంది శారద.

వంశీ !టీ పెట్టనా!”అడిగింది.

“తప్పకుండా! ఇవాళ ఆడిటింగ్ కాదుగానీ పిచ్చెత్తిపోయింది. డిన్నరుకు వాళ్ళు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో వస్తానన్నారు.”అంటూ ఫ్రష్ అవటానికి వెళ్ళాడు.

“తల్లులూ రండి డిన్నరుకు చేసి పడుకోండి రేపెటూ సెలవేకదా చదువుకుందురుగాని.”అంటూ కేకేసింది శారద.

“డాడీ వచ్చారా?అమ్మా!”అన్నారు ముక్తకంఠంతో.

“వచ్చారు.కారు హారన్ కి మీరు లేవలేదు మీ చెల్లెలు రిసీవ్ చేసుకుంది. క్రెడిట్సన్నీ దానికే.”అంటూ నవ్వింది శారద.

“ఆయ్!”అంటూ ఇద్దరూ స్నూపి వెంట పడ్డారు.అది వంశీ కాళ్ళసందులోదూరి అరవసాగింది.

సారీ డాడీ అంటూ తండ్రికిరుపక్కలా గారంగా. చేరారు.

కంచాలదగ్గరకి ఈదురో అంటూ వచ్చిన అప్పూ అపర్ణలు” వావ్!” అంటూ ‘హైఫై’ ఇచ్చుకున్నారు.
బాదంపౌడరు స్పెషల్టచ్ సేమియాపాయసం, ఆనియన్ పకోడీ ,చోళే బటూరా,దధ్ధోజనం.

“అమ్మా!ఇవి గెస్ట్స్ కని చేసావా మాగురించా.” అంటూ తల్లిని వాటేసుకున్నారు.
★★★

వంశీకృష్ణ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్.ఇవాళ చాలా చికాకుగా ఉంది.వంట్లో నలతగా ఉంది.
“ఇన్సపెక్షన్ కి సైట్ కి వెళ్ళాలి.అమ్మకి వంట్లోబాగాలేదన్నమెసేజ్ ఒకమూల కలవర పెడుతోంది.దసరా సెలవలకి శారద పిల్లలు పుట్టింటికి వెళ్ళారు.ఇంటికెళ్ళి చెయ్యకాల్చుకోవాలి.పిల్లలకి టర్మ్ ఫీజుకట్టాలి హౌసింగ్ లోను హౌస్టాక్స్, వగైరా వగైరాపోనూ ఇంటి ఖర్చుకి బొటాబొటి ఇరవై ఇరవై ఐదు మధ్యలో మిగులుతుంది ఇంటిఖర్చుకి. మధ్యలో మెడికల్ ఖర్చు లేకపోతే.

ఇదిలా ఉండగా హెడ్ఆఫీస్ నించీ టార్గెట్ రీచ్ అవలేదని షంటింగ్.”ఎవరిమీదో ఎందుకో అర్ధం కాని కోపం చికాకుగాఉంది వంశీకి.

వంశీకృష్ణకి ఛీర్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ పర్శనాలిటీ అని సబ్స్టాఫ్ నించీ హెడాఫీస్ వరకూ పేరుంది.అంతేకాదు సిన్సియర్ అండ్ హైలీ డిసిప్లైన్డ్ అని కూడా భయపడతారు.

వంశీకృష్ణ చికాకుకి అసలు కారణం ఒక ప్రాజెక్ట్ కి కోటిన్నర సాంక్షన్ చేయమని ప్రషర్.కావాలంటే కమీషను తీసుకోమని.ఒక్క కాగితమూ సరిగ్గాలేదు.ఆల్రడీ ముఫ్ఫై లక్షలు సాంక్షన్చేసి సైట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీలేదు.ఆ పార్టీ దర్జాగా ఖరీదైన కారులో బ్యాంకుకు వచ్చి సొల్లు ఖబుర్లు చెప్తాడు.ఆమినిస్టరు ఈ ఏక్టరు తన బంధువులంటూ.వళ్ళుమండిపోయి ఉన్నదున్నట్లు రిపోర్టు పంపినందుకు హెడాఫీస్నించీ దొబ్బులు. ఉద్యోగం రిజైన్ చేసి పారేద్దామనిఉంది వంశీకృష్ణకి.

‘ఛ! వెధవ బ్రతుకు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఉద్యోగం చేయక తప్పదు.అదే ఆడది కావాలంటే ఉద్యోగం చేయకపోయినా భర్త తెచ్చింది తిని హాయిగా ఇంటిపట్టున ఉన్నా ఎవరూ ఎద్దేవా చేయరు.అదే మగవాడైతేఎన్నెన్ని మాటలంటారు.”ఆడంగివెధవ.పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చుంటున్నాడు.ఉద్యోగం పురుషలక్షణం అని కూడా తెలియదు.”అని ఎద్దేవా హేళన చేస్తారు.జీవితంలో అన్ని కష్టాలకంటే ఆర్ధికంగా సంసారాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపేందుకు ఎంతో మానసికమైన వత్తిడికిమగవాడు గురౌతాడన్నది ఎవరికీ తెలియదు. వాడికేం మగ మహరాజు ఇంటికెళ్ళేసరికి హారతి పళ్ళెంలో వండి వార్చిపెడుతుంది పెళ్ళాం. అంటారు.ఆ వండి వార్చటానికి కావలసిన ముడిసరుకుకు మగవాడు పడే తిప్పలు ఎవరైనా ఆలోచిస్తారా? ఛీ! ఈ మగవాడిగా పుట్టడం కన్నా అడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అనుకున్నాడు వంశీకృష్ణ.
★★★

అర్ధరాత్రి రెండున్నర వరకూ కూర్చున్నా క్వార్టర్లీ పేపర్ కరక్షన్లు పూర్తికాలేదు.ఇంకాఒక్కరోజుంది స్కూలు రిఓపెనింగ్ కి.ఎవరి క్లాసుమార్కలిస్టు వాళ్ల కి అందచేయాలి.సెలవలకి నాలుగురోజులు ఊరెళ్ళేసరికి వర్కంతా డిలే అయింది. పిచ్చెక్కినట్లుంది శారదకి.

“శారదా!ఆ లైట్ ఆపేయి.ప్రొద్దున్నించీ గొడ్డుచాకిరి చేసి రాత్రికాస్సేపు ప్రశాంతంగా పడుకుందామంటే ఆ వెలుతురు బెడ్రూం వరకూ వస్తోంది.”ఆసహనంగా అరిచాడు వంశీ.

“ఎక్జామినేషన్ పేపర్స్ కరక్షన్ చేసుకుంటున్నా వంశీ.సారీ బెడ్రూం తలుపేసుకోండి.”ఎంతో సౌమ్యంగా జవాబిచ్చింది శారద.

“బోడి ఉద్యోగం.ఏదో పెద్ద ఉద్యోగం వెలగపెడుతున్నట్లు అర్ధరాత్రి ఏంపని?గుడ్డిగుఱ్ఱానికి దానా ఎక్కువన్నట్లు సంపాదన తక్కువకానీ ఉద్యోగం చేస్తున్నానన్న పోజెక్కువ.”అన్నాడు చిరాగ్గా వంశీ.

శారద అహం దెబ్బతింది.”అవును బోడి ఉద్యోగమే.గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని మీకు వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా ఉందామని ఈ ఉద్యోగం చేస్తున్నా.ప్రొద్దున్న నాలిగింటికి లేచి పిల్లలని చదివించాలి.పనిమనిషి రాకపోతే గిన్నెలుతోమడం,బట్టలుతకడం,ఇల్లూడవడం వండి కేరీర్లుకట్టడం ఇవన్నీ కూడా బోడిపనులే.నా ప్రాణానికి ఇద్దరూ ఆడపిల్లలువాళ్ళకి జడలువేసి మీతో పాటు వాళ్ళని పంపి.నేను ఇల్లుచక్కపెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ స్కూలుకెళ్ళేసరికి ఏరోజు ఆఖరి నిమిషం లేదా లేటు.
సాయంత్రం మ్యూజిక్ క్లాస్,కూరలు,వెచ్చాలు కొనటం కూడా బోడి పనులే.బండి నేర్చుకుని తప్పుచేసా ఆడపని మగపని చేస్తుంటే మీకేం తెలియటంలేదు.ప్రొద్దునే టిప్టాప్ గా రెడీ ఆయి కారులో ఎంచక్కా బ్యాంక్ కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అలసిపోతారు.ప్రొద్దున్నించీ స్కూల్లో పిల్లలతో వాగివాగి అదెంత అలసి పోతోందో అని ఎప్పుడైనా ఆలోచించారా!పైగా బోడి ఉద్యోగమట బోడి ఉద్యోగం అంటారా! ఆ బోడి టీచర్లు పాఠాలు చెపితేనే మీరింతవారయ్యారని మరవకండి. ఛీ!వెధవ ఆడజన్మ.ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానునైపుట్టినా బాగుండేది.”అంటూ ముక్కుచీదుకుంది శారద.
★★★

పనిమనిషి రాదని మూడుగంటలవరకూ నిద్రపోని శారద ,నాలుగు గంటలకల్లా లేచింది. చలిలో గిన్నెలు తోముతున్న శారదనిచూసివంశీకృష్ణ గుండె తరుక్కు పోయింది.బ్యాంకు గొడవలతో చికాకుగాఉండి
ఎక్కవగానే కసిరాననుకున్నాడు.

“శారదా! నాకుసారీచెప్పటం ఇష్టముండదు.నేను ఆడది హాయిగా ఉంటుంది. మగవాడే కష్టపడతాడనిపించి అలామాట్లాడాను.” అంటూ సింక్ లొ గిన్నెలు కడుగుతున్న భార్యబుజంమీద అనునయంగా చేయివేసాడువంశీ.

సరేలెండి మీటెన్షను అర్ధంచేసుకున్నా.అందరూ డబ్బుకోసం ఉద్యోగంచేస్తే మీది డబ్బతోనే ఉద్యోగమయ్యే.ఏంతేడాచ్చినా జేబులోంచి కట్టుకోవాలి. కాకపోతే నన్నూ నా ఉద్యోగాన్ని ఏమన్నా ఊరుకోను.”అంది పూర్తిగా భర్తకి లొంగకుండా.
★★★

దుప్పట్లోంచి లేవకుండా సైలంట్ గా అమ్మానాన్నల సంభాషణ విని. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని నవ్వుకున్నారు పిల్లలు.రాత్రి తల్లిదండ్రుల హాట్ డిస్కషన్ విని వాల్కెనో ఎరప్షన్ అనుకున్న అపర్ణ అపరాజితలు.
★★★

‘ఏమైనా ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానై పుట్టినా బాగుండేది.’ అందిశారద కాఫీ సిప్చేస్తూ.

‘ఔనౌను!మగవాడిగా పుట్టడంకన్నా ఆడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అన్నాడు వంశీ క్రీగంట శారదని చూస్తూ.

“డాడ్! బోత్ ఆర్ ట్రీస్ అండ్ దె గివ్ షెల్టర్ టు అదర్స్.”అంది అప్పూ దొంగలాగ తండ్రి వెనకచేరి.

“అమ్మా!నువ్వలా మాట్లాడితే మాకు భయంగా ఉందమ్మా! మేము నీలా ఆడపిల్లలం కదమ్మా!” అంది అపర్ణ.

శారద వంశీలు తమ తప్పు తెలుసుకున్నారు.

సంసారమనే రథానికి భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటివారు.అందులో ఏచక్రం గొప్పదని చెప్పగలం. ఏ చక్రం లేకపోయినా బండి సజావుగా నడవదు.రెండుచక్రాలమీద భారం సమానంగా ఉంటేనే సంసారరథం సాఫీగా సాగుతుందని
తెలిసినప్పటికి స్త్రీ పురుషులు తాత్కాలికమైన శారిరక,మానసిక,ఆర్ధిక వత్తిడి లో ఎవరికి వారే వారే సంసారభారాన్ని మోస్తున్నామనుకోవటం పరిపాటి కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ఎవరి కష్టం వారిదన్న సత్యం స్ఫురిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు.

You may also like

Leave a Comment