Home కవితలు అసలైన కాంతి

అసలైన కాంతి

by Aruna Dhulipala


గడియారం కొట్టే గంట కోసం
సంబరంగా నిరీక్షణ
గుండెకు సవ్వడులను పులిమి
కొత్త కాంతి రేఖలకై తపన !
ఆ క్షణం మిగిలేదా? ముగిసేదా?
ఏమీ తెలియని అనిశ్చితి

అదొక భ్రాంతి మోహచక్రం
ఆశా సుగంధాలను చిమ్మి
వెంపర్లాడమంటుంది వాటికై
ఇగురులొత్తే మనసుతో
ఆ దారుల వెంట పరుగులెత్తి
అలసి పోతూనే ఉన్నావు
మనిషిగా చస్తూనే ఉన్నావు

అనుభవాల కొలిమిలో సాగి
పర్యవసానంగా మిగిలే జీవితాలకు
గతం గుర్తుకు రాదెందుకో
వేసే ప్రతీ అడుగుకీ
వెనకటి జ్ఞాపకం ఓ చరిత్ర
నిన్ను నిన్నుగా తీర్చుకునే
గుణపాఠాల ఉలి దెబ్బ

వత్సరాలు మారడం
గాయాలను మాన్పించడం
స్మృతులను మరపించడం
కాలానికి కొత్త కాదు
చెరిగిపోయే గీతకు ముందే
చెరగని సంకేతాన్ని ముద్రించడమే
మనిషికి అసలైన కాంతి !!

You may also like

Leave a Comment