Home బాల‌సాహిత్యం ఏనుగు మరియు దర్జీ

ఒక చిన్న గ్రామంలో ఒక దర్జీ ఉండెను. అతనికి దేవాలయం దగ్గర చిన్న దుకాణం ఉన్నది. ఒక ఏనుగు ప్రతిరోజు ఇతని దుకాణం ముందునుండి నదిలో స్నానానికి పోతుంటుంది. ఆ దయగల దర్జీ దానికి అరటిపండ్లో లేక కొబ్బరికాయనో లేక బెల్లమో ఇస్తుండేవాడు. ఆ ఏనుగు ఆ వస్తువులను అతని చేతినుండి తీసుకుని తొండముతో దీవించేది. ఆ ఏనుగుకు ఆ దుకాణం ముందు ఆగి ఎదురు చూడడం అలవాటయ్యింది.

ఒకనాడు దర్జీ ఏదో చిరాకులో ఉన్నాడు. యథాప్రకారం ఆ ఏనుగు అతని దుకాణం ముందుకు వచ్చి నిలబడింది. ఆ దర్జీ దానికి ఏమీ ఇవ్వలేదు. ఏనుగు చాలా ఓపికగా నిలబడింది కానీ దర్జీ కనీసం దానివైపు కూడా చూడలేదు. ఏనుగు ఏదో ఒకటి తినేందుకు దర్జీ ఇవ్వాలని లాశిగా ఘీంకరించింది . ఇది దర్జీకి బాగా కోపం తెప్పించింది. అతను ఒక సూది తీసుకుని దాని తొండాన్ని గట్టిగా కుచ్చాడు. పాపం ఆ ఏనుగు చాలా బాధపడి వెళ్ళిపోయింది. దానికి దర్జీ ఎందుకు ఇలా చేసాడో అర్థం కాలేదు. కానీ అతనికి తగిన పాఠం చెప్పాలని నిశ్చయించుకుంది.

మరునాడు ఆ ఏనుగు స్నానానికి నదికి వెళ్ళింది. తిరిగి వస్తున్నపుడు దాని తొండం నిండా బురద నీరు నింపుకుంది. ఆ దర్జీ దుకాణం ముందు ఆగి బురద నీరంతా దుకాణంలోని కొత్త బట్టలపై కుమ్మరించింది. ఈ చర్యతో దర్జీ తన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అతను మరల ఏనుగుతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఏనుగు దర్జీ దుకాణం వైపు వెళ్ళడం మానేసింది.

నీతి : మనం జంతువులను హింసించకూడదు.

You may also like

Leave a Comment