Home కవితలు ఓడి గెలిచే కలల స్నేహం

ఓడి గెలిచే కలల స్నేహం

by Mrudula

చేదు జ్ఞాపకమైతే
మరచిపోయినట్టు
నిర్లక్ష్యం చేయగలను
నువ్వొక
మరుగున దాచలేని
పచ్చి నిజానివి
నా జీవిత లక్ష్యానివి

కల తీరని బాధ చూశాకే
నీ వెంట పరిగెత్తాను
నా అంతర్మధనం తెలుసుకున్నాను
నువ్వు గుర్తుపెట్టుకునేంత
గెలవాలనుకున్నాను !!

మరచిపోవద్దని అనుకున్నాను కనుకే……..
కలలను ప్రోది చేసుకున్నాను
కన్నీళ్లను పొదువు చేసుకున్నాను
నవ్వులను ఆవిరి చేసుకున్నాను
మనసు పొరలను గోడగ చేసుకున్నాను

నన్ను నీ గమనంలోకి
నువ్వే ఆహ్వానించావన్న నిజాన్ని
నీకు గుర్తు చేసేంత సాధించాలనుకున్నాను
నువ్వు మార్చే ప్రకృతి రంగులు లెక్క చేయక మరీ ప్రయత్నించాను

కానీ నువ్వు కాలమనే మాయాజాలానివి
పండు వెన్నెల్లో వేణు గానం వినిపించగలవు
నిశీధి రాత్రిలో జాలిరాగం పాడగలవు

అయినా………
ప్రయత్నమే
అసలు విజయమైతే
గెలుపు నాదిగా
తియ్యని రాగాన్నై
వేణు గానంలో ఓలలాడగలను
ప్రతి రాత్రినీ వసంతరాత్రిగా
మార్చుకోగలను
నీ ఒడిని సైతం ఊయలగా అనుభవించగలను !!

You may also like

Leave a Comment