Home వ్యాసాలు కొండకి కొండ నమస్కరించింది

కొండకి కొండ నమస్కరించింది

by mayuukha

తెలుగుజాతి గర్వించదగ్గ మహా కళాకారుడు
కొండపల్లి శేషగిరి రావు శత జయంతి
జనవరి 27 ఆయన్ని మరోసారి తలుచుకుంటూ
……………………………………………..

ఊళ్ళో పెళ్ళికి మా వాళ్ల హడావిడి. ఫోన్లు, సూడియోకి బండేసుకొస్తే కలిసిపోదామా? మీరు ఫలానా ఆర్టిస్టులతో కలిసి వస్తారా అని ఎంక్వయిరీలు. సర్లెండి డైరెక్టుగా సభ దగ్గరే కలిసి రాత్రికి అందరం కూచుందాం అంటూ ఎలాబరేట్ ఎరేంజ్మెంట్లు. ఎన్నడూ ఏ సన్మాన సభకూ చచ్చినా పోని మహానుభావులైన వీరంతా కాళ్లు తొక్కుకొనుట ఎలా? బాపూగారికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎవార్డిచ్చుకుంటే వీళ్లు మధ్యాహ్నం నుంచే చంకలెగరైడమేల?
వీళ్లు సరే, ఎక్కడో కొత్తగూడెం నుంచి అజ్ఞాత కార్టూనిస్టు చిరుద్యోగానికి లాస్ ఆఫ్ పే పెట్టుకుని, బండికట్టుకొని వచ్చి స్వహస్త చమురొదిలించుకుని, అనేక వందల గజాల దూరం నుంచి మరనేక వందల మంది గుంపుల మధ్య నుంచి బాపూగార్ని చూసి కళ్లు చెమర్చి మళ్లీ మౌనంగా
కొత్తగూడెంకేసి మరలిపోవడమేంటి?
వెర్రా? సర్రియలిజమా? ఏమో.
యూనివర్సిటీ కాంపౌండ్ అంతా సాహిత్య ప్రముఖులూ, కవులూ, ఆర్టిస్టులతో సందడిగా ఉంది. ఎంట్రెన్స్లో మాత్రం పోలీస్ బందోబస్త్ జబర్దస్తీగా ఉంది. ఆడ నక్సలైట్లను కనిపెట్టడానికి రహస్య మెటల్ డిటెక్టర్. మగ నక్సలైట్ల కోసం ఓపెన్ డిటెక్టర్, అందర్నీ తడుముతున్నారు. గుచ్చి గుచ్చి చెకింగ్. అలిపిరిలో చేయని పనులన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా బాపూగారు పీపుల్స్ వార్ హిట్ లిస్టులో ఉన్నందువల్ల కాదు. ఆఫ్ట్రాల్ చిత్రకారుడి కోసం డైరెక్షనల్ మైన్లు వేస్టుచేసుకుంటారా నక్సలైట్లు?
దేవేంద్రగౌడ్ గారు చీఫ్ గెస్ట్ గనక ఈ తతంగం. ముందుస్తుగా తోసుకొచ్చిన అనేకానేక కారణాల వల్లా, కళకి బొత్తిగా టైమ్ లేనందువల్లా గౌడ్ గారు రాలేకపోయారు. బాపూగారి యందు, మా వంటి పేదల యందూ శ్రీ వేంకటేశ్వరస్వామి దయవల్లా, దీవెనెల వల్ల గూడా గౌడ్ గారు రాలేకపోయారని మా మూఢ విశ్వాసం. నిజంగా ఆయన వచ్చి “బాపూ చిత్రకళ, పత్రికల్లో కార్టూన్లు, గ్రేహౌండ్స్ తక్షణ కర్తవ్యం” అని లెక్చరిచ్చి ఉంటే మా గుంపు కకావికలై ఉండేది.సభ ప్రారంభం అనుకోని అద్భుతం, జి.వి. సుబ్రహ్మణ్యం గారు బాపూ గురించి సుతారంగా చెప్పారు. ఏకకాలంలో కవితలాగా, సంగీతంలాగా, శాస్త్రీయ విశ్లేషణలాగా, లోతైన అంచనాలా సాగిందాయన ప్రసంగం. సందర్భోచితంగా మినిమమ్ ఓవర్ యాక్షన్ కూడా లేకపోవడం సుబ్రహ్మణ్యం గారి సూపర్ స్పెషాలిటీ . తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, నూతన్ ప్రసాద్ గార్ల ప్రసంగాలు పెద్ద దుర్భరంగా ఏమీ లేవు. రవీంద్రభారతి, త్యాగరాయగాన సన్మాన సభల బ్రాండ్ ఉపన్యాసాలెంత దుర్భరంగా ఉంటాయో ఖచ్చితంగా అంతే దుర్భరంగా ఉన్నాయి. అలవాటుపడ్డ ప్రాణాలంగనక పరమ వీజీగా తట్టుకున్నాము. తదనంతర అంత్యప్రాసల కామిక్ ఇంటర్లూడ్స్ మమ్మల్ని కదిలించాయి. ప్రాణవాయువు కోసమూ సిగిరెట్ల కోసమూ ఆనందంగా హాలు నుంచి బయటపడ్డాము.
అదిగో మా ఆర్టిస్టు హీరోలు చంద్ర, గోపీ కారిడార్లో ముందే ఉన్నారు. వి. రాజారామ్మోహనరావు లెక్చర్లు. అక్కడ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జానకీబాల, ఇటు శ్రీరమణ, ఆర్టిస్టు చిత్ర, కార్టూనిస్టులు శంకర్, అన్వర్లు, బాలి రాలేదేమో అని తలుచుకుంటున్నారు. ఇంకా బోల్డన్ని పెద్ద పేర్లు పుంజీళ్లు పుంజీళ్లుగా కబుర్లు కొడుతున్నారు. అంతలో కొండపల్లి శేషగిరిరావు గారొక్కరే శాలువా సర్దుకుంటూ గుంపుల్లోంచి దారిచేసుకుంటూ వెళ్తున్నారు. వెంట ఎవరూ లేరు. ఆయన్నీ చూసి చాలా రోజులయింది. ఆనందంగా నమస్కారం పెట్టా. పక్కనే ఉన్న కొత్తగూడెం కార్టూనిస్టుని పిలిచి ఇతను వెంకటి అని పరిచయం చేశా. మా వాళ్లంతా ఆరాధనా భావంతో చుట్టూచేరారు. లోపల సభ ఇంకా నడుస్తూనే ఉంది. ఈతి బాధల వల్ల ఈ మధ్య మీ ఇంటికి రాలేదని సంజాయిషీ చెప్పి, కొత్తగా పెయింటింగ్ లు ఏం వేస్తున్నారని అడిగితే కొద్ది రోజులుగా చూపుసరిగా లేదనీ ‘బొమ్మలకు తాత్కాలికంగా సెలవిచ్చానని చెప్పినపుడు ప్రాణం కొట్టుకుంది. అయినా తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మీద సుదీర్ఘమయిన పానెల్స్ తయారు చేశానన్నారు. (వాటిలో కొన్ని స్కెచ్లు ముందే మేమందరం చూశాం) త్వరలో తప్పక వాటిని పూర్తి చేస్తానన్నారు. “ఈనాటి చిత్రకారులకు ఆనాటి చరిత్ర గురించి తెలీదు గనక ఆ పని ముగిస్తా”నన్నారు. ఈ పని ఆయన ఒక్కరే చేయగలరని అక్కడున్న మా అందరికీ తెలుసు. శేషగిరిరావుగారి గ్రాంధిక భాష, ఇంగ్లీషు విన ముచ్చటగా ఉంటాయి. అంతకు మించిన అమాయకత్వం ముడతలు పడ్డ తెల్లటి పొడుగాటి వేళ్లు తిప్పుతూ మాట్లాడుతుంటే ఆయన చైనా చెట్లు, కోడిపుంజుల రంగులూ కదలాడుతాయి. తటాకము వద్ద కణ్వమహర్షి వెంట ఉన్న శకుంతల పక్కన లేడి, ఒంపులు తిరిగిన స్టైలైజ్డ్ చెట్లూ కొండలూ కదిలొస్తాయి. భక్తిపరుడైన కొండపల్లిగారి దేవతామూర్తుల భంగిమలూ ఆ రంగులూ చూస్తే మొండి నాస్తికులు కూడా మోకాళ్లపై వంగి నమస్కారాలు చేయాల్సిందే.
తెలంగాణ కొండలు ఆయన దోసిట నీలపురాళ్ళై మెరుస్తాయి. వాటి మధ్య రావి నారాయణరెడ్డి గర్జించే ఆయిల్ పెయింటింగ్ కెంపుల పోవు. రామప్ప దేవాలయం నంది మెడ గంటల తాళ్ల ముడుల గ్రామర్నీ, నాగరిక సమస్యల నడుముల పట్టీల మడతల శాస్త్రాన్ని రచించి విశ్లేషించిన చేతులవి. తెలుగునాట ప్రాచ్య కళా సంప్రదాయ జ్యోతి ఆరిపోకుండా అడ్డంపెట్టే ఆఖరి చేతులివే.
హాల్లో సభ అయిపోయింది. మేడ మీద ఆర్ట్ ఎగ్జిబిషన్ను బాపూ ప్రారంభించాలి
(ఏంటో! అష్టకష్టాలూ పడి పగలూ రాత్రి బొమ్మలేయాలి. మళ్లీ వాటిని తానే ఇనాగురేట్ చేసుకోవాలి. పాపం ఎంత కష్టం) బాపూ చుట్టూ పాతికమంది నిర్వాహకులు రక్షణ వలయంలా కమ్ముకున్నారు. హాల్లోంచి కారిడార్ గుండా ఆయన్ని తీసుకెళ్తున్నారు. అడ్డంగా ఉన్న మా గుంపుల్ని చెదరగొడుతున్నారు. తప్పుకోండని అరిచి ఏ మాత్రం అక్కర్లేని హడావుడంతా చేస్తున్నారు. బాపూ గుంపు మమ్మల్ని తాకి ముందుకెళ్తుంది. తప్పుకున్నాం. ఎందుకో ఆయత్నకృతంగా (స్పాంటేనియస్ గా అన్నమాట) “బాపూ గారూ” అని అరిచాను.
ఆయన ఆగారు. ఆ గుంపూ ఆగింది.

‘కొండపల్లి శేషగిరిరావు గారు
బాపూ













ఆయన ముందుకొచ్చారు. ‘కొండపల్లి శేషగిరిరావు గారు” అని పరిచయం చేశాను. వాళ్ల చేతులు కలిశాయి. శేషగిరిరావు మరింత ముందుకెళ్లారు.
ఆ పొడుగాటి చేతులు రెండూ బాపూ భుజాలపై పడ్డాయి. “నాయనా బాపూ నీ రేఖ నిజంగా ఒక విలక్షణమైన… (ఆయన గ్రాంధికం తడబడుతోంది)మనిషి ఎక్సైట్ అయిపోతున్నాడు. అది నీవే గీసేగీత. యువార్ గ్రేట్. రియల్లీ గ్రేట్. నాట్ ఓన్లీ ఫర్ ఆవర్ స్టేట్. బట్ టు అవర్ నేషన్…చెప్తూనే ఉన్నాడాయన. ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది.
మాటలు మరీ ఇన్ కొహెరెంట్ గా వస్తున్నాయి. సన్నగా వణికి అరిచేతులు బాపూ భుజాల మీంచి దిగి మోచేతుల దగ్గరకొచ్చాయి. ఇంకా ఏదో చెప్తున్నాడు. చెప్పలేకనూ పోతున్నాడు.
హఠాత్తుగా ఆ చేతులు నేలకి వంగాయి. బాపూ పాదాలు రెండూ పట్టుకుని ఆయన నమస్కారం పెట్టాడు. చుట్టూ ఉన్న మేం ఈ షాక్ కి రెడీగా లేము. బాపూ గారి దుస్థితి వర్ణనాతీతం, బాగా ఎంబారాస్ అయిపోయి, సిగ్గుపడిపోయి, తల్లకిందులయ్యారు. శేషగిరిరావు గారిని రెండు చేతుల్తో లేవ దీశారు. ఈయన ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు. “బాబూ, నేను శాంతి నికేతన్లో చదివినా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నా, ఎన్ని చేసినా నీ రేఖ మాత్రం“ అంటూనే ఉన్నాడు. పెద్దవారు మీరు మాకలా చెప్పాలా.. అయ్యో’ అంటూ బాపూగారు సిగ్గు భారంతో కొంచెం వంగి అంతలోనే ఆయన కాళ్ల మీద పడి పాదాలు పట్టుకుని నమస్కారం చేసేశారు. డబుల్ షాక్… అంతా సైలెన్స్.
ఈ షార్ట్ సర్క్యూట్ కి నివ్వెరపోయిన మాలో కొందరికి కన్నీళ్లే తక్కువ.ఇంతలో నిర్వాహకులు బాపూని పైకి తీసుకుపోయారు. అందరం శేషగిరిరావు గారి వెంట బయటికొచ్చాం. ఆయనింకా బాపూ హిప్నాటిక్ స్పెల్ నుంచి తేరుకోలేదు. “ఈతని వలే ఎవరూ గీయలేదు.
అదియాతని సొంతము. వాక్చమత్కృతి లేదు. సకల చమత్కృతినీ చిత్ర చమత్కృతిగా మార్చినాడు.” ఇంకా చాలా చెప్పాడాయన.
తెలుగు చిత్రకళ చరిత్రలో ఒకే ఒక భువనగిరి కోట, ఆదిలాబాద్ పచ్చల కొండ, కరీంనగర్ అడివితల్లి వంగి తెలుగు రేఖకీ రంగుకీ నమస్కారం చేసింది.
ఈ నర్సాపురం నది సిగ్గుతో మెలికలు తిరిగి
ఆ నూనె రంగుల బృహత్పాదాలను కడిగింది.
ఇలాటి దృశ్యం ఈ దెష్ఠ బతుకులో ఇంకెప్పుడేనా చూడగలమా, కెమెరాలేవి? లైట్లేవి? ఎవరక్కడ?
కాలచక్రం గిర్రున కాకుండా టిక్కు టిక్కుమంటూ రెండ్రోజులే తిరిగింది. శ్రీరమణగారి ఫోను. “బాపూగారు మీకొక్క జపనీస్ యానిమేషన్ కేసెట్, మరో లెటర్ ఇచ్చారు”.
అమాంతంగా అరడజను ఆఘమేఘాలనూ సింగిల్ ఆటోనూ బుక్చేసి ఆంధ్రజ్యోతిలో వాలాను.
స్టూడియోకి తిరిగి రాగానే కేసెట్ను మూడు సీడీలుగా మార్చి మా సిస్టమ్ లో అందరం చూశాం. మళ్ళీ చూశాం. రెండున్నర గంటల ఎండ్వెంచర్. అంతా జపాన్ భాష ఒక్క ముక్క అర్ధం కాలేదు. సినిమా మొత్తం ముక్కస్య ముక్కహా అర్ధమయింది. ఇలాంటి కేసెట్లు ఇంకా సంపాయించాలి ఎలా? సింపుల్! బాపూగారు మద్రాసు మనిషి గదా. హైదరాబాద్ లో కొండపల్లి శేషగిరిరావు గారి లాంటి వారిని పరిచయం చేస్తే కేసెట్ పంపిస్తారని అర్థమయింది గదా.
మరైతే ఇక్కడగానీ హోల్ ఇండియాలో గానీ
మరో కొండపల్లిని పట్టుకోడం ఈ జన్మకి గానీ
మరేడు జన్మలకిగాని జరిగే పనేనా?
నాకింకో కేసెట్ దొరకదా!

ఈ వ్యాసం 2002లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో అచ్చయింది.

You may also like

Leave a Comment