Home బాల‌సాహిత్యం చిలుక కథలు (కథాగుచ్ఛము)

చిలుక కథలు (కథాగుచ్ఛము)

by Arutla Sridevi

గర్వమణిగిన చిలుక

అందాల అడవిలో ఓ మేడి చెట్టుపై చిలుకమ్మ గూడుకట్టుకొని అందులో హాయిగా ఉ ంటుంది. ఉన్నట్లుండి తుఫాను రావడంతో అడవి అంతా గాలి దుమ్ముతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పక్షులన్నీ వాటి వాటి గూళ్ల లోపల వెచ్చగా తల దాచుకొన్నాయి. అటువైపుగా వస్తున్న ఒక కాకి వర్షానికి బాగా తడిచిపోయి ఓ కొమ్మచాటున సేద దీరుదామని చిలుకమ్మ ఉన్న గూటివైపు వచ్చి ఒక కొమ్మచాటున కూచుంది. కాకి అంటే చిలుకకు అసహ్యం. చిలుక గూటిలో నుండి బయటకు వచ్చి “ఏయ్ కాకి వెళ్లిపో నా గూటిని ముట్టుకోకు. మేము అందమైన చిలుకలం పండ్లు మాత్రమే తినే వాళ్లం. నువ్వు ఎంగిలి కూడు, మాంసం తినేదానివి. పైగా శరీరమంతా నల్లరంగు, ఆ గొంతన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. పొద్దస్తమానం కావు కావు అని పిచ్చి కేకలు నువ్విక్కడుంటే మా గూటి అందం చెడిపోతుంది. మా పరువు కూడా పోతుంది. వెంటనే వెళ్లిపో” అన్నది. అందుకు కాకి “చిలుక గారు మీరన్నదంతా వాస్తవాలే. నేను కాదని అనను. కాని భగవంతుని సృష్టిలో నేను ఒకదాన్ని నా కర్మ ఇట్ల రాసి ఉంది. కొంత వాన తగ్గగానే వెళ్లిపోతాను. బాగా చలివేస్తుంది” అని కాకి చిలుకను కాళ్లవేళ్ల పడి బ్రతిమాలుకుంది. అయినప్పటికీ చిలుకకు కాస్తయినా కనికరం లేకుండా లేదు వెళ్లిపో ఇప్పుడే వెళ్లిపో అని కసురుకుంది. చేసేదేమి లేక కాకి చిన్నబుచ్చుకుని అదే వర్షంలో తడుస్తూ తన గూటికె వెళ్లిపోయింది.

తెల్లవారింతర్వాత సూర్యుడి లేలేత కిరణాలు అడివిలో ప్రసరిస్తున్నాయి. కిరణాలకు ఆకులపై నిలబడ్డ మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అడవంతా పండగకి కడుక్కున్న ఇల్లులా శుభ్రంగా కనబడుతుంది. చెట్ల కింద గడ్డిపువ్వులు నవ్వుతూ పలకరిస్తున్నాయి. గూటిలోని చిలుకమ్మకు ప్రకృతి అందాలు చూసిరావాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడువు అది వెంటనే ఎగురుతూ ఎగురుతూ అట్లా అడవిలో వింతలు చూస్తూ పోతోంది. అది ఒక చెట్టుకొమ్మపై వాలింది. చెట్టుకు సమీపంలో ఒక స్వచ్ఛమైన నీరున్న గుంట కనబడింది.

ఎగిరి, ఎగిరీ అలిసి ఉన్న చిలుకకు నీరు తాగాలనిపించింది. అది వెంటనే నీటి గుంట దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుదామని మెల్లగా ఒక కాలు ముందుకు వేసింది. అంతే అది

జర్రున జారి గుంటలో పడ్డది. నిజానికి అది స్వచ్ఛమైన నీటి గుంటకాదు. అందులో అంతా బురద నిండుకొని ఉన్నది. బురదంతా చిలుకకు అంటింది. దాని ఆకుపచ్చటి రెక్కలు కాని నల్లగా అయిపోయినాయి. ఒళ్లంతా కంపుకొడుతుంది.

జరిగిందానికి చిలుక చాలా బాధపడ్డది. ఏడ్చింది.

కానీ బురదను కంపును ఎట్లా వదిలించుకోవాలో చిలుకకు తెలియలేదు. అది అట్లా ఎగురుతూ ఎగురుతూ ఒక పాడుబడ్డ గుడిలోని గూటిలో తల దాచుకున్న పావురం గూటిలో వాలింది. సమయంలో పావురం గూటిలో లేదు. అది గింజలేరుకొనడానికి అట్లా బయటికి వెళ్లింది. పావురము గూటికి తిరిగి వచ్చేసరికి బురదతో కంపుకొడుతున్న చిలుక కనిపించింది. పావురము చిలుకతోఛీ ఛీ నువ్వెవరు బురదేమిటి నడు.. ముందు నా గూటినుండి బయటికి పోఅన్నది. అందుకా చిలుక దీనంగా పావురం గారూ నేను చిలుకమ్మను నన్ను గుర్తు పట్టలేదా. ఒకసారి సరిగ్గా గమనించి చూడండిఅన్నది.

హు, చిలుకవైతే ఏమిటి? అప్పటి అందమేది నీలో అంతా బురదంటింది. ఇటువంటి దానికి ఆశ్రయమిస్తే నా పావురాల జాతి నన్ను వెలివేస్తుంది. మర్యాదగా బయటకు పోఅని పావురము చిలుక ఎంత బ్రతిమాలుకున్నా వినకుండా గూటి నుండి వెళ్లగొట్టింది.

అయ్యో! తానొకప్పుడు ఎంత అందంగా ఉండేది అందరిలో ఎంత గౌరవంగా ఎంత హుందాగా

ఉండేదాన్ని ఇప్పుడు నాకీ గతి పట్టింది. అని ఏడుస్తూ ఏడుస్తూ ఒక చెట్టుకొమ్మపై వాలింది చిలుక. కొమ్మ మీద పాలపిట్టలు కాపురముంటున్నాయి. అందులో

మొగ పాలపిట్ట తన భార్య పిట్టను ఇలా తిట్టసాగింది. “ఏమేవ్ ఏదో దరిద్రపు గొట్టు పక్షి మన పక్క కొమ్మపై వాలింది నువ్వు లోపలికిరాఅంటూ అరిచింది. అలాగే అని ఆడ పాల పిట్ట అటువైపు కొమ్మపై వాలింది. చిలుక వెంటనే పాలపిట్టల ముందు వాలి అయ్యా నేను చిలుకమ్మను అనుకోకుండా బురదలో పడి ఇట్లా తయారయ్యానే కాని ఇది నా నిజరూపం కాదు. దయచేసి నాకు ఆశ్రయమివ్వండి అని కోరింది. అమ్మో ఇంతకుముందు నీవు చిలుకవుఇప్పుడు నువ్వు దుర్వాసన అంటించు కున్నదానవు. నువ్విట్లాగే ఎక్కువ కాలం మా దగ్గరుంటే మా పిల్లలకూ ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దయచేసి వెళ్లిపో చిలుకమ్మా. మర్యాదగా వెళ్లకపోతే

మెడపట్టి గెంటి వేయవలసి వస్తుంది”. అని ఆడ పాలపిట్ట చిలుకతో అన్నది. చిలుక తనకెంత దుర్గతి పట్టిందిరా దేవుడాఅని ఏడుస్తూ ఏడుస్తూ ఊరపిచ్చుకలుండే చెట్టుపై వాలింది. అక్కడ కూడా చిలుకకు శృంగ భంగమే అయ్యింది. నిరాశ చెందిన చిలుక ఇక తనకేదారీ లేదని, అటు తన జాతి రామ చిలుకలు రానివ్వడం లేదు. ఇటు పర జాతి పక్షులూ రానివ్వడం లేదని బాగా బాధపడ్డది. నిరాశ చెందిన చిలుక చివరకు ఒక స్మశానంలోని వేప చెట్టుపైకి చేరింది. అక్కడ ఎవరో పిండం పెట్టిన పదార్థాలు తింటున్న కాకులు చిలుకకు కనిపించాయి. బాగా ఆకలితో న్న చిలుక ఆకలికి తట్టుకోలేకపోయింది. అది కూడా కాకులతో చేరి అవే ఎంగిలి మెతుకులు ఏరుకోసాగింది. ఇంతలో ఒక కాకి చిలుకకు అడ్డం పడి, నువ్వు ఎంగిలి మెతుకులు ఏరుకోవడానికి వీల్లేదు అన్నది. చిలుక అయ్యా ! “కాకి గారు ఇది కూడా తినక పోతే ఇక నేను చచ్చిపోవలసిందే దయచేసి ఇదన్నా తిననివ్వండిఅని దీనంగా అడిగింది. “నువ్విలా రా చిలుకా !” అని కాకి చిలుకను ఒక నీటి పంపు దగ్గరకు తీసుకెళ్లింది. స్మశానంలో శవ దహనం తర్వాత స్నానాలు చెయ్యడానికి గాను మనుషులు ఏర్పాటు చేసుకున్న నల్లాలు అక్కడున్నవి ఒక నల్లకింద చిలుకను కూర్చొమ్మన్నది. చిలుక అట్లాగే చేసింది. కాకి దాని మూతితో నల్లపై భాగాన్ని గట్టిగా వత్తి పట్టుకొన్నది. అంతే నీళ్లు చిలుకపై జలజలా రాలిపడ్డాయి. చిలుకకున్న బురదంతా కొట్టుకుపోయింది. చిలుక ఎప్పటి మాదిరి పచ్చగా శుభ్రంగా తయారయ్యింది. ఈలోపుగా కాకి ఎక్కడనుండో రకరకాల పండ్లు తెచ్చి చిలుకకు ఆహారంగా ఇచ్చింది. చిలుక కడుపు నిండా పండ్లు తిన్నది.

గతంలో తాను కాకి పట్ల ఎంత నీచంగా, ఎంత నిర్ధయంగా ప్రవర్తించింది. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా కాకి తననెంతగా ఆదరించింది. నాకు పై భాగమే అందము. బుద్ది లేనిదానను నేనే కాకి ముందు గుణశీలత ముందు నా అందమెంత? అవి మనసులో తలచుకొంది పాశ్చాత్తాపంతో చిలుక కళ్లలో నీళ్లు తిరిగాయి. చిలుక కాకితో ఇలా అంది నేను జీవితమంతా నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాను. ఇక నుండి నువ్వే నాకు గురువు అంది. కాకి చిలుకలో వచ్చిన మార్పుకి సంతోషించింది.

అప్పటి నుండి చిలుకమ్మ పక్షులన్నింటినీ పోగుచేసి వేదాంతం, నైతిక విలువలు, గురించి చెప్తూ దాని జీవనం కొనసాగించింది.

You may also like

Leave a Comment