Home ఇంట‌ర్వ్యూలు జానపదసాహిత్యవేత్త డాక్టర్ రావి ప్రేమలత

జానపదసాహిత్యవేత్త డాక్టర్ రావి ప్రేమలత

by Vanga yashoda

మానవ సంబంధాలు, వైతిక విలువలు శిథిలమవుతున్న ప్రస్తుత తరుణంలో మన మూలాలను తెలియజేసే ఎన్నో పరిశోధనలు రావల్సిన అవసరం ఉంది.  ఇలాంటి తరుణంలో  మన సాహిత్యంలోని అమూల్యమైన అంశాలను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.  అందుకే జానపదసాహిత్యంపై పరిశోధనలు పెరగాలి.  భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడమే జానపద విజ్ఞాన ప్రత్యేకత.   అలాంటి ప్రత్యేకత కలిగిన జానపద సాహిత్యంలో స్త్రీల స్వరాన్ని సాధికారికంగా వినిపించే బాధ్యతను కొందరు మాత్రమే తీసుకోగలరు. వారిలో ప్రముఖులు డాక్టర్ రావి ప్రేమలత గారు. ఆమె  గత నాలుగు దశాబ్దాలుగా జానపద, ప్రాచీన సంప్రదాయ, ఆధునిక సాహిత్య రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. మూడు దశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా  అనేక కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం వాకిట్లో వేసే ముగ్గుల గురించి ఆమె ఒక పుస్తకమే తీసుకువచ్చారు.  ఆమెతో జరిగిన మాట ముచ్చట మయుఖ పాఠకుల కోసం.

జానపద సాహిత్య పరిశోధనలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు జానపద సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది.?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమైన వ్యాపకం.  అలా  పుస్తకాలు చదువుతున్నప్పుడు అందులో ఉండే అంశాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తపన కలిగేది. అందుకోసం మరిన్ని రిఫరెన్స్ పుస్తకాలు చదివేదాన్ని. అలా చదివిన అంశాలన్నింటినీ వ్యాసంగా రాయడంతో అది పరిశోధనాత్మక వ్యాసం అయ్యేది. జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన ఆచార్య నాయిని కృష్ణకుమారి గారి మార్గదర్శకత్వంలో పిహెచ్ డి చేశాను.  అప్పుడు తెలిసింది చరిత్ర చెప్పని, పుస్తకాల్లో లేని చాలా విషయాలు ప్రజలల్లో ఉన్నాయి అన్న విషయం. అలా తెలుసుకున్న వాటికి అక్షర రూపం ఇవ్వడం వల్ల  రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాలు అందించడం సాధ్యమవుతుంది.  మన సంప్రదాయంలో ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక చరిత్ర ఉంటుంది. అది ఏంటో తెలుసుకుని చేయగలిగితే ఏ సంస్కృతియైనా, సంప్రదాయమైన, ఆచారమైన భవిష్యత్ తరాలకు అందుతుంది. అలా చెప్పలేకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. అందుకే నేను తెలుసుకున్న విషయాలను వ్యాసాలు రాశాను. అయితే జానపద సాహిత్యంలో ఎక్కువగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశాను.

మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా మరి రచనలు ఎప్పుడు  ప్రారంభించారు?
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడంపై ఉన్న అభిరుచితో మాలతీచందూర్, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శ్రీశ్రీ, సినారె తదితరుల సాహిత్యం ఎక్కువగా చదివేదాన్ని., తెలుగు సాహిత్యంపై ఉన్న ఆసక్తి, పెద్దవాళ్లు చెప్పే జానపదకథలు నన్ను రచనావ్యాసంగం వైపు మళ్లించాయి.  ఎం.ఏ చదువుతున్నప్పుడు వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. అయితే ఇది ఒక రోజుతో జరిగిన ప్రక్రియ కాదు.
మొదటి సారిగా ‘స్రవంతి’లో నేను రాసిన వ్యాసం వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. ఆ తర్వాత చాలా పత్రికల్లో పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి. పాఠకుల నుంచి మంచి స్పంధన రావడంతో జానపద సాహిత్యంపై , పరిశోధనాత్మక వ్యాసాల వైపు ఆసక్తి మరింత పెరిగింది. 

మీ పరిశోధనలో భాగంగా క్షేత్రస్థాయి అంశాల కోసం గ్రామల్లో ఎక్కువగా తిరిగారు కదా? మీ దృష్టికి వచ్చిన అంశాలు?

కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో మారుమూల గ్రామాలకు సైతం వెళ్లేదాన్ని. అక్కడ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలుసుకున్నాను.  పూర్వం మతాలు మనుగడలో లేని కాలంలో మాతృస్వామ్య  వ్యవస్థ ఉండేది. అందుకు నిదర్శనం గ్రామదేవతలు. ప్రతి ఊరికి రక్షణ గా గ్రామ దేవతలు ఉంటారు. కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి గ్రామ దేవతల పేర్లు మారినా వారందరినీ గ్రామ రక్షకులు గానే ప్రజలు భావిస్తారు. అందుకే వందల ఏండ్ల చరిత్ర ఉన్న గ్రామ దేవతల కథలు మనకు జానపద సాహిత్యంలో కనిపిస్తాయి.  మహిళలు ఇంటికే కాదు  గ్రామాలు, రాజ్యాలకు కూడా రక్షకులుగా, పూజ్యులుగా వచ్చ చరిత్ర మనకు కనిపిస్తుంది.  ప్రజల మధ్య నుంచి వచ్చిన జానపదకథల్లో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు మెండుగా ఉంటాయి. వాటికి తెలుసుకోవడం వల్ల మన మూలాలు గ్రహించే వీలు కలుగుతుంది.  అందుకే  జానపదకథలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను. అనేక పల్లెల్లో తిరిగి దాదాపు రెండువందల కథలను సేకరించాను. వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను.

జానపద కథల్లో మూడు రకాల కథలుంటాయి. సందర్భోచిత కథలు, కాలక్షేపకథలు, నీతికథలు. ఒక్కొక్క విభాగంలో నాలుగైదు కథలను ఎంపిక చేశాను.   పిల్లలకు మంచిఅలవాట్లు, ప్రవర్తన నేర్పేలా ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి. అయితే అవి అన్నీ మౌఖిక రూపంలోనే తప్ప లిఖిత రూపంలో లేవు.. వాటిని సేకరించి పుస్తకంలో పొందుపరుస్తున్నాను. 

తెలంగాణ జానపద సాహిత్యం పై మీ అభిప్రాయం?

 తొలి తెలుగుకథ, శతకం, వాజ్మయం వంటి అనేక సాహిత్య ప్రక్రియ లకు పుట్టినిల్లు తెలంగాణ. అయితే సమాచార రాహిత్యంతో ఇన్ని రోజులు జానపద సాహిత్యం మరుగున పడింది. ఇప్పుడిప్పుడే జానపద కళా రూపాలు వెలుగులోకి వస్తున్నాయి.

జానపదసాహిత్యంలో పరిశోధనలు చేశారు. మరి ఇంటి ముందు వేసే ముగ్గులపై పరిశోధన చేయడానికి కారణం? మీరు రచించిన ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ గురించి చెప్పండి.

మన సంప్రదాయాల్లో ఒక సైన్సు ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యకరమైన అంశం ఉంటుంది. అది ఏంటో చెప్పకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. నేను ముగ్గుల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఇదే విషయం స్పష్టమైంది. అతి ప్రాచీన కాలం నుంచి సంప్రదాయకం గా మహిళలు వేస్తున్న అనేక ముగ్గులను పరిశీలించినపుడు అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలిశాయి. ముగ్గులు అనేవి భావవ్యక్తీ కరణ సాధనాలుగా, ఒక విధమైన లిపిగా గుర్తించాను. మహిళల కళానైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. వాకిట్లో వేసే ముగ్గులు చిత్రకళాధిదేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు అన్న విషయాన్ని చెబుతూ ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’గా వాటన్నింటినీ పుస్తకం రూపంలో తీసుకువచ్చాను. ఈ పుస్తకానికి రామరాజు జానపద విజ్ఞాన బహుమతి వచ్చింది.  మన రాష్ట్రంలోని మహిళల చిత్రకళా నైపుణ్యం ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మహిళల చిత్రకళతో పోలి ఉంటుంది. ఈ విషయం పరిశీలిస్తే  జానపద విజ్ఞానానికి ఎల్లలు లేవు అన్నది మరింత స్పష్టంగా తెలుస్తుంది. 

ఇప్పటివరకు మీ సాహిత్యం, పరిశోధనల గురించి చెప్పారు. ఇప్పుడు మీ గురించి చెప్పండి.

 భువనగిరి దగ్గర నాగిరెడ్డి పల్లె మా సొంతూరు. నాన్న రావి రామిరెడ్డి, ఆర్ అండ్ బి లో ఇంజనీర్ గా పనిచేశారు. అమ్మ మనోరమ. ముగ్గురు అమ్మాయిలం, ఒక అబ్బాయి. ఇంటికి నేనే పెద్దదాన్ని. హైస్కూల్ వరకు భుననగిరిలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ లోని రెడ్డి కాలేజీ లో పియుసీ, వనితా మహావిద్యాలయలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్, పిజీ(తెలుగు), తెలుగు పద సాహిత్యం పురాగాథలు’ అంశంపై పి హెచ్ డి పూర్తి చేశాను. రామచంద్ర డిగ్రీ, పీజీ కాలేజీ లో ముప్పై ఏండ్లు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేసే జె.వి.సత్యనారాయణ రెడ్డితో పెండ్లి అయ్యింది. మాకు ఒక అమ్మాయి. డాక్టర్‌ ప్రణీత, ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. 

  అవార్డులు.. – ఉత్తమ విమర్శ గ్రంథం ‘వ్యాసలతిక కు తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ గ్రంథం ‘ తెలుగు స్త్రీల చిత్రలిపి’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ పరిశోధకురాలు తంగిరాల బహుమతి – ప్రముఖ రచయిత పాకాల యశోదరెడ్డి స్మారక పురస్కారం – వై. రంగనాయకమ్మ స్మారక పురస్కారం – ఉత్తమ విమర్శ గ్రంథం’అవలోకనం’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం – తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం

రచనలు..

[1. తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు – 1980

2. జానపద విజ్ఞాన పరిశీలనం – 1990

3. తెలుగు స్త్రీల చిత్రలిపి – 1991

4.జానపద విజ్ఞానంలో స్త్రీ – 1996

5. వ్యాస లతిక – 2002

6. Folk tales of south india – Andhra pradesh – Editor – 2005

7. ఆలోకనం – 2015

8. పాకాల యశోదరెడ్డి – 2015

You may also like

Leave a Comment