Home కవితలు చెంచిత రంగులు

చెంచిత రంగులు

by Telugu Venkatesh

జులపాల జుట్టోనికి
దుఃఖం ఎంత ఇష్టం అంటే
నాటుసారాను ఫూటుగా తాగేంత

ఎక్కడ ఏడుపులు వినిపించినా
వాలిపోయి తనూ ఇంత కన్నీటిని
జమచేసే వాడు

వాడికి దుఃఖం ప్రియ నేస్తగాడు
పెల్లిపెటాకుల్లేని చెంచితగాడు

ఊర్లూ పట్టుకుని తిరిగేవాడు
అందరి స్నేహాల్లోకి కుశలంగా ఒదిగేటోడు

బేకారు కట్ట వద్ద
పులి జూదమై గాండ్రించే వాడు

బైరాగుల సవాసం
బైరన్నల తోటి కల్లు కబుర్లు
వీడికి ముదిరిన మోహం

దర్గాల వద్ద ఫకీర్ల తో
ప్రియ ముచ్చట్లు
పీర్ల చావిడి కాడ
మంచి నేస్తగాడు కుక్కలకు

జాతర్లలో గొరవయ్యలతో
ఒకటే కలిసి తిరుగుడు

జుట్టు పొలిగానితో
కల్లుముంతల పోటిలో వీర నెగ్గుడు

అంత్రాలు కట్టే పీరు సాయబుతో
బాగా సావాసం
కుదిరితే నాలుగైదు వారాలు
ఊరిడిచి వనవాసం

మంగలి సవారి
కొలిమి ఉసేను
బెస్త గాలిగాడు
ఉప్పర ఎల్లయ్య
వీడి జిగిరీ దోస్తులు

గాలి వాటం బతుకు
ఫికిర్ లేని జిందగీ
చెట్టు పుట్ట సత్రాల వద్ద కునుకు

బతుకు పై బెంగ లేనోడు
అన్ని తావులు నావేననే మార్మికుడు
ఆశల్ని వదులుకున్న రికామిగాడు

పగల్లు రాత్రులకు
మాసిన చొక్కాను తగిలించి
సగం పాడి వెళ్ళిన
బుల్బుల్ పిట్ట గీతాన్ని ఆలపిస్తూ
కీచురాళ్ళ చప్పట్లను స్వీకరిస్తూ

కడుపులో ఆకలికే కాక
దుప్పటిలో దోమలకీ చోటిస్తూ
అందరి దుఃఖాల్ని
స్వప్నం లో దేవదేవుడికి వినిపిస్తూ
కోడి కూతలో మళ్ళీ మేల్కొంటాడు

మరో దిమ్మరి రంగుల్ని
రేపటికి సాపు చేసుకుంటూ .

You may also like

Leave a Comment