Home పుస్త‌క స‌మీక్ష‌ “సరాకృతులు” అనుభవాల అక్షరాకృతులు

“సరాకృతులు” అనుభవాల అక్షరాకృతులు

“కవిత్వంలో ఏం రాయాలో తెలుసుకోవాలి. అంతకన్నా ముఖ్యం…ఎలా రాయకూడదో తెలుసుకోవాలి. ఎవరైనా కానివ్వండి…కవిత్వం దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు భూమ్మీదే  మోపాల్సి ఉంటుంది”-ఆచార్య జయధీర్ తిరుమల రావు.
కవనం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఏం చేయకూడదో, పై వాక్యాలు చెబుతున్నాయి. కవి ఎక్కడ నిలబడాలో, ఎట్లా నిలదొక్కుకోవాలో, ఎటువైపు ఉండాలో  మార్గ నిర్దేశం చేస్తున్నాయి. కవిగా మారడమంటే ఆలోచన,ఆచరణ ఏకం కావడం. ప్రతి కవికి ఒక విస్పష్టమైన ఆలోచన దృక్పథం అవసరం. హేతుబద్ధంగా, ప్రామాణికంగా, విశ్వసనీయంగా, ఆలోచనాత్మకంగా, సార్వజనీనంగా ఉన్న రచనలే సామాన్య జనాధరణను చూరగొంటాయి. అలా సుస్పష్టమైన అభివ్యక్తి గల సృజనలే జన బాహుళ్యంలో కలకాలం నానుతుంటాయి. తమ స్థానాన్ని సాహిత్య చరిత్రలో సుస్థిరం చేసుకుంటాయి. భావి తరాలకు స్ఫూర్తినిస్తాయి. తరగని, చెరగని సంపదగా నిలిచిపోతాయి. కవిగా ఉడుత సంపత్ రాజ్ గారు కూడా  వస్త్వాశ్రయ రచనలతో సాహితీ తెరంగేట్రం చేస్తున్నట్లుగా భావిస్తున్నాను. తొలి రచనగా “వెన్నెలమ్మ పదాలు” అచ్చేశారు. మలి ప్రయత్నంగా “సరాకృతులు” కైతికాలను తీసుకువస్తున్నారు. మునుముందు కూడా ఆయన సాహిత్య కృషి సఫలీకృతం కావాలని మనసారా అభిలషిస్తున్నాను.

  పలు సాహితీ ప్రక్రియలను అవగాహన చేసుకోవడానికి పాఠకులకు భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరముంటుంది. కానీ కైతికాలు వాడుక భాషలో ఉండడం వలన చాలా సులభంగా అర్థమవుతాయి. ఇందులో ఎలాంటి  మార్మికత ఉండదు. సూటిగా, సరళంగా ఉంటాయి. మన నిత్య వ్యవహారంలోని భాషనే సంపత్ రాజ్ రచనకు వినియోగించారు. కాబట్టి కైతికాలు పాఠకులకు సులువుగా చేరుతాయి. ఇవి మామూలుగా తెలుగు చదువడం, రాయడం వచ్చిన వారికి కూడా  తేలికగా అవగతమవుతాయి. ఏ కవితా ఖండికకు ఆ కవితా ఖండిక సంపూర్ణ భావాన్ని కలిగి ఉంటాయి. దీనినే ముక్తక లక్షణం అంటారు. తొలి నాలుగు పాదాలకు మాత్రా ఛందస్సు ఉంటుంది. ఇది గేయ ప్రక్రియ లక్షణం. ఐదారు పదాలకు మాత్రా గణాల సడలింపు ఉంటుంది. ఐనా గాన సరళికి అనుగుణంగా ఉన్నాయి. మొదటి నాలుగు పాదాలను సరితూచే విధంగా  చివరి రెండు పాదాలు బలంగా ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ఉండడం సర్వ సాధారణం. కానీ ఇందులోని  చాలా కైతికాలలో ఐదవ పాదారంభంలో “వారెవ్వా” అనే పదం మకుటంగా ఉన్నది. మకుటముండడం శతక లక్షణం. దీనిని “కైతిక ఖండిక”ల గేయ శతకం లేదా సమాహారం అని అనవచ్చు.  వాస్తవాలను నొక్కిచెప్పడంలోనే కవి తపన కనబడుతున్నది. సమాజం పట్ల ఈ కవికి గల నిబద్ధతను బాధ్యతను తెలియజేస్తున్నాయి.ఈ ముక్తకాలను నిరక్షరాస్యులకు వినిపించినా, వీటి సారాంశాన్ని అల్కగ గ్రహిస్తారు. ఇలా పండిత పామరజన రంజకంగా ప్రజా సాహిత్యం ఉంటుంది. ఆరవ పాదంలో సూక్తులు, సామెతలు,నానుడులు,నినాదాలు విరివిగా వాడతారు. ఇవి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఈ పద బంధాలు ప్రజల్ని చైతన్యవంతుల్ని కూడా చేస్తుంటాయి. “సాహిత్యానికి,రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని కవులూ రచయితలూ ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది” – మహాకవి శ్రీశ్రీ. ఈ వాక్యాలు ప్రతి రచయిత ఒక సరైన  దృక్పథాన్ని అలవర్చుకోవల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. సామాజిక దృష్టికోణాన్ని సంతరించుకున్న ఉడుత సంపత్ రాజ్  కైతికా గేయ ఖండికలు సైతం మెరుగైన సమాజ నిర్మాణం కోసం తోడ్పడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

   కైతికం సాహిత్య రూపకంగా ఏనుకున్న వైనాన్ని నెమరు వేసుకుందాం. ఈ కైతిక పద మూలాలను ఓసారి పరిశీలిద్దాం. బహుజనపల్లి సీతారామాచార్యులు “శబ్ద రత్నాకరం”లో “కయిత” రూపాంతరమే “కైత”గా పేర్కొన్నారు. కవిత ప్రకృతి. కైత వికృతి. నాదెళ్ల పురుషోత్తమకవి “విశేష రూపదర్శిక”లో “కయిత – కయితము – కైతము – కైత”గా మార్పు చెందిన విధానాన్ని వివరించారు. కైతకము పదానికి కేతకీ పుష్పము అనే అర్థాన్ని ఆచార్య రవ్వా శ్రీహరి (శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు), జి. ఎన్. రెడ్డి (తెలుగు నిఘంటువు), ముదిగంటి గోపాల రెడ్డి (సంస్కృత – ఆంధ్ర నిఘంటువు) లు సూచిస్తున్నాయి. కేతకీ అంటే మొగలి అని అర్థం. కవిత్వానికి పర్యాయ పదాలుగా “కవనము, కవిత, కైత”గా జి. ఎన్. రెడ్డి “తెలుగు పర్యాయ పద నిఘంటువు”లో పొందుపరిచారు. కైతికం అనేది తెలంగాణ పల్లెల్లో వాడుక పదం. ఇప్పటికి నిఘంటువులకు ఎక్కని దేశీ పదం. హాస్యంగా, చమత్కారంగా, జర ఎత్తిపొడుపుగా మాట్లాడే వారిని “కైతికాల పోశెట్టి, కైత్కాలోడు” అని పిలుస్తారు. సృజనాత్మకత గల ఇలాంటి గుణాన్ని “కైతికాలతనం” అని అంటారు. సినారె “మా ఊరు మాట్లాడింది”లో ఈ పదానికి “అల్లిక చెప్పుడు” అనే అర్థాన్ని ఇచ్చారు. కైతికం అంటే అందంగా, హాస్యస్ఫోరకంగా,చమత్కారగర్భితంగా,పరిహాసపూరకంగా,కొంత కల్పితంగా అల్లిక చేయడం అని భావించవచ్చు. “Poetry is the half lie” అన్నారొక సాహిత్య విమర్శకులు. కవిత్వానికి వాస్తవికతతో పాటు ఊహాజనీనత, కాల్పనికత కొంతవసరం. ఈ కైతిక పక్రియ రూపకల్పనలో, ఎదుగుదలలో గోస్కుల రమేశ్ తో పాటు ఉడుత సంపత్ రాజ్ కీలక భూమిక పోషించడం అభినందనీయం. కవితా ప్రక్రియ ఏదైనా… కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ గారు చెప్పినట్లు “కవిత్వం మనసులను కలిపే…పేగు బంధంగా మారాలి”. రాశిలో కంటే వాసి ముఖ్యం కాబట్టి ఆ పనిని కైతికాలు పోషిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

ఇక “సరాకృతులు” కావ్య నామౌచిత్యాన్ని పరిశీలిస్తే, అదీనూ సముచితంగానే అమరింది.”సర” అనే పదానికి వావిళ్ల తన సంస్కృత – తెలుగు పదకోశంలో హారం, మీదిపెరుగు, గమనం అను అర్థాలను చెప్పారు. సర – ప్రకృతి. సరి, సరిగె, చేరు –  వికృతులు. “ఆకృతి”కి శబ్దరత్నాకరంలో రూపం, దేహం ఇత్యాది అర్థాలను చూడవచ్చు. సరాకృతులు అనగా మాలిక లేదా దండ రూపాలుగా తలచవచ్చు. సామాజిక సమస్యల సమాహారంగా భావించవచ్చు. సంపత్ రాజ్ కలం పేరు “సరా”కు ఆకృతులు కలిపితే సరాకృతులు ఏర్పడతాయి. సంపత్ లోని మొదటి అక్షరం “స”. ఆయన సతీమణి రాజేశ్వరిలోని తొలి వర్ణం “రా”. వీరిద్దరి పేర్లలోని ప్రథమాక్షరాలతో తన కలం పేరును “సరా”గా పెట్టుకోవడం అర్ధనారీశ్వరతత్త్వాన్ని సూచిస్తున్నది. ఇందులో సమాజ అపసవ్య పోకడలకు అక్షరాకృతులను గీసి, వాటికి సరైన సాధన మార్గాలను చూపారు. ఈ సందర్భంగా “సరా” గారికి అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని మేలైన గ్రంథాలు వెలువరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

You may also like

Leave a Comment