Home కవితలు తీపి చెమరింతలు

తీపి చెమరింతలు

by వకుళవాసు

కోటికలలను కన్నుల్లో దాచుకొని కొత్తగా అత్తింట్లో అడుగుపెడుతున్నా
ఇన్నాళ్ళు రెక్కలమాటున ఒదిగిన గువ్వలోలె పెరిగినం నేను నాతోబుట్టువు….
ఎన్నో జ్ఞాపకాలను ఎదలో దాచుకొని వెళ్తున్నా
తిరిగిరాని బాల్యాన్ని నాతీపిగురుతుల బొమ్మలపెట్టెలో భద్రంగా దాచుకొని నా కలలలోకంలోకి …
కనురెప్పల కాన్వాసుపైన హరివిల్లు ఊయలలో ఆనందవిహారం చేస్తూ…
కనుల కొలనులో కమలాలు పూయించ
ఆశల పయనం సాగిస్తున్నా
కన్నవారి కళ్ళల్లో తీపిచెమరింతల చిత్రాలను
కన్నుల్లో దాచుకొని రెప్పలమాటున ఉప్పెనకు ఆనకట్టవేస్తూ…
నాపుట్టింటికి అన్నీశుభాలే జరగాలని కోరుతూ గడపకి కుంకుమెట్టి
పసుపుపాదాల పారాణి మెరుపులతో నావాకిలికి వీడ్కోలు పలుకుతున్నా….
అప్పుడప్పుడొచ్చిపోయే నాకోసం ఎదురుచూస్తూ
పొద్దునపూచే పూలలో నానవ్వులు చూడమని ….
వరండాలో పిచ్చుకలకు నాఎడబాటుకు కుములొద్దని
ఉదయరాగాల కువకువలతో నాకన్నవారితో ముచ్చట్లాడమని
కనురెప్పలసవ్వడితో బుదగరిస్తూ వీడ్కోలు పలుకుతున్నా…

You may also like

Leave a Comment