Home కవితలు బరిగీసి ఇంకోసారి

బరిగీసి ఇంకోసారి

by Sunkara Ramesh

బరిగీసి యుద్ధం చెయ్యు ఇంకో సారి

చైతన్యం నీ ఇంటి పేరు కదా

చుట్టు పక్కల

పది ఊళ్లకు నీవే పెద్ద దిక్కు

గడప గడప లో

సరస్వతి కొలువు దీరిన నెలవు కదా

ఎర్రని నీ నుదుటి బొట్టు తో

నిత్య ప్రకాశినివి కదా

నీ వెలుగు పడమటి కొండలకు

వాలుతుంటే

ఈ కళ్ళు చూడలేవు తల్లీ

ధీమంతులకు

శ్రీమంతులకు నీవు ఇష్టసఖివి కదా

స్నిగ్ద ,స్వచ్ఛ  కిరీటం తో

ధగ, ధగా మెరిసిపోతుంటే

అమ్మ వారిని చూసినట్టే ఉండేది

స్వర్గం లో దేవతలు నిన్ను చూసి

పూల వర్షం కురిపించారే

ఈరోజు వాడిన పువ్వులా

నీవు కనిపిస్తే హృదయం

విల ,విల లాడుతున్న కొమ్మలా ఉన్నది

అందరూ నిన్ను

వేలెత్తి చూపిస్తుంటే

ఆదిత్య హృదయం

అల్లాడుతుంది.

సూర్యుణ్ణి చుట్టూ భూమి

తిరుగు తున్నట్టు

పొద్దు పొడవక ముందే

నీ చుట్టు జన సందోహం తో

పక్షులు వాలే మహా వృక్షం లా

భాసిల్లే దానివి

నేడు బారెడు పొద్దెక్కినా

నిన్ను చూడాలంటేనే

లక్ష సందేహాలు

ఎన్నెన్ని పోరాటాలలో

పదును తేలావో

ఇప్పుడు కనిపించని

క్రిమి ముందు తేలి పోయావు

ఎత్తిన పోరు కొడవలి

పదునేమాయే

ధాన్యలక్ష్మీ రాకతో

పూర్ణకుంభంలా ఉండే దానివి

ఇంతటి ఖాళీ తనాన్ని చూసి

మనసు కకావికలం అవుతున్నది

రాశులు పోసిన కూరగాయలు

రత్నపు రాశులు

ఆకు పచ్చని

కూరలతో పచ్చని

పట్టు చీర కట్టినట్టు కనిపించే దానివి

నేడు కనిపించని క్రిమికి కంపించి పోతున్నవా

మాతా

బజార్లన్నీ జనం లేక

బోసి పోయిన మెడ లాగున్నది

నీళ్లు లేని బావిలాగున్నది

ఏ ఊరు మీదంటే

పది ఊళ్ళ వాళ్ళు కూడా

కాసింత పొగరుగా

మాది పేట అనేవారే

ఇపుడు ఏ పెదాలు కూడా

నీ పేరు పలకవు

మీసాలు మెలేసే రొయ్యల

వీధేక్కడ

బొమ్మడి మచ్చీ బుట్టలెక్కడ

బొడ్రాయి బజారు

బట్టల బజారు జాడెక్కడ

మిరపకాయల ఘాటు

కొత్త మామిడి పులుపు లెటు పోయే

భజన మందిరంలో పాట

బ్రోచేవారెవురా పాట గుండెను

పిండుతుంది

భానుపురి నీ బాధను చూసి

బావురుమంటుున్నది మనసు

నా ప్రేమ పురి

నీ వాడి కిరణాల

కరవాలంతో

క్రిమిని వేటాడు

ముప్పేట ముంచేస్తున్న

మహమ్మారిని మట్టు బెట్టు

సూర్యగ్రహణం

ఎంతోకాలం ఉండదు

కారుమబ్బుల్ని చీల్చుకుంటూ

ప్రకాశించవే పేట

బస్తీ మే సవాల్ అని

బరిగీసి యుద్ధం చెయ్యవా

ఇంకో సారి

 

You may also like

Leave a Comment