Home వ్యాసాలు భాషకు వైద్యం చేస్తున్న పిల్లల డాక్టరుకు అంతర్జాతీయ పురస్కారం

భాషకు వైద్యం చేస్తున్న పిల్లల డాక్టరుకు అంతర్జాతీయ పురస్కారం

by Dr. Rayarao SuryaPrakashRao

పిల్లలతో గడపడం వల్ల, సంభాషించడం వల్ల ఏ అంశాన్ని అయినా సులువుగా ఎలా అందించవచ్చో అవగతమవుతుంది. అందువల్లేనేమో చాలా మంది రచయితల నేపథ్యం పిల్లలకు విద్యా బోధన. పిల్లల వైద్యులు కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపిస్తున్నారు ప్రముఖ రచయిత ఎలనాగ. భాషలో సాధారణంగా చేసే తప్పులను అరటిపండు ఒలిచినట్టు చెప్పడంలో సిద్ధహస్తులు ఆయన. అంతేకాకుండా సాహిత్య సృజనలో, అనువాదాల్లో ఆయన రాణిస్తున్నారు. బహుముఖీనంగా సృజనాత్మక రచనారంగంలో శ్రమిస్తూ, ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఎలనాగ ఇప్పటికే ఎన్నో పురస్కారాలను స్వీకరించారు. ఇప్పుడు ఉకియాటో అనే అంతర్జాతీయ ప్రచురణ సంస్థ 2023 సంవత్సరానికి ఉత్తమ కవిగా అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఆంగ్ల భాషలో ఆయన రాసిన ‘డాజ్లర్స్’ అనే కవితా సంపుటికి ఈ పురస్కారాన్ని శనివారం కోల్ కతాలో జరిగే కోల్ కతా సాహిత్య సమారోహం రెండవ రోజు కార్యక్రమంలో స్వీకరిస్తారు.
ఉకియోటో ప్రచురణ సంస్థ గత పదేళ్లలో ప్రచురించిన అసంఖ్యాక కవితా సంపుటాల నుండి ఎలనాగ రాసిన ‘డాజ్లర్స్’ గ్రంథాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తెలుగు సాహితీవేత్త ఎలనాగకు అందించడం తెలుగు సాహిత్యానికి కూడా గొప్ప గౌరవంగా భావించవచ్చు. ఈ పురస్కారాన్ని అందించడంతో పాటు ‘డాజ్లర్స్’ కవితా సంపుటిని వివిధ అంతర్జాతీయ భాషల్లోకి ఉకియోటో సంస్థ అనువదింపజేయడం మరో విశేషం. ఆ అంతర్జాతీయ భాషల్లో టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్, జపనీస్ ఉన్నాయి. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ గ్రంథ ప్రదర్శనల్లో ఆయా గ్రంథాలను ప్రదర్శిస్తున్నారు. ఈ గ్రంథం తెలుగులోకి కూడా ‘మిరుమిట్లు’ పేరుతో తర్జుమా అయింది. అయితే తెలుగులో ఇంకా ప్రచురించవలసి ఉంది.
కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించారు ఎలనాగ. ఆయన అసలు పేరు నాగరాజు సురేంద్ర. కవిగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా, భాషావేత్తగా పేరు పొందిన ఆయన ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పడే రచనా వ్యాసంగం ప్రారంభించారు. విద్యార్థి దశలో ఆయన రాసిన కవిత మొదటిసారిగా కరీంనగర్ నుండి అప్పట్లో వెలువడుతుండిన ‘గౌతమి’ అనే పత్రికలో ప్రచురితమైంది. అప్పుడు మొదలైన రచనా వ్యాసంగం మెడిసిన్ చదువుతున్నప్పుడు మరింత విస్తరించింది. భారతి, కృష్ణాపత్రిక, స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో అప్పట్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.
ఇప్పటివరకు దాదాపు 40 గ్రంథాలను ఎలనాగ ప్రచురించారు. ‘ది ఏలియెన్ కార్న్’ అనే సోమర్సెట్ మామ్ నవలికకు ఎలనాగ అనువాదం ‘కలుపుమొక్క’ అనే పేరుతో మొదటి ప్రచురణగా 2005లో ప్రచురితమైంది. తొలి కవితా సంపుటి ‘వాగంకురాలు’ 2009 లో వెలువడింది. సజల నయనాల కోసం, అంతర్లయ, అంతర గాంధారం, అంతర్నాదం కవితా సంపుటా లు వెలువడ్డాయి. ‘పెన్మంటలు – కోకిలమ్మ పదాలు’ అనే గేయసంపుటిని వెలువరించారు. ‘అంతస్తాపము’ ఆయన రాసిన ఛందోబద్ధ పద్యాల సంపుటి. ‘మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం’, ‘కొత్తబాణి’ ఆయన ప్రయోగ పద్యాల సంపుటాలు. ఈ రెండింటిలో అచ్చం వచన కవితల్లా కనిపించే ఛందోబద్దమైన పద్యాలుండడంవిశేషం. ‘పొరుగు వెన్నెల’, ‘ఊహల వాహిని’ ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటాలు. ఎన్నో గ్రంథాలను తెలుగునుండి ఆంగ్లంలోకి కూడా ఎలనాగ అనువాదం చేశారు. ‘ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫ్లైస్’, ‘ఇంప్రెషన్-ఇమేజెస్’, మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్’ మొదలైనవి ఆయన తెలుగు నుండి ఆంగ్లంలోకి తెచ్చిన కవితా సంపుటాలు. సుప్రసిద్ధ తెలుగు రచయితల కథలను, నవలలను కూడా ఆయన ఆంగ్లంలోకి తీసుకువచ్చారు. వాటిలో వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు తదితరులు రాసిన కథా సంపుటాలు, నవలలు ఉన్నాయి. వివిధ దేశాల సాహిత్యాన్ని కూడా అయన తెలుగులోకి తెచ్చారు. వాటిలో ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు ఉన్నాయి. వివిధ దేశాల కథల అనువాద గ్రంథం ‘కథాతోరణం’ కూడా ఆయన వెలువరించారు. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథాన్ని ‘గాలిబ్ – నాటి కాలం’ అనే పేరుతో తెలుగులోకి తెచ్చారు.
తెలుగు భాషపై అనేక గ్రంథాలను తెచ్చిన ఎలనాగ భాషలో సవ్యత దిశగా కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తారు. ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’, ‘యుక్తవాక్యం’, ‘నుడిక్రీడ’ అనే ప్రామాణిక గళ్లనుడికట్ల పుస్తకం, ‘పన్’నీటి జల్లు, ‘మేధామథనం’ మొదలైనవి వాటిలో ఉన్నాయి. ‘పళ్లెరం’ అనే పేరుతో భాష, సాహిత్య, సంగీతాల మీద రాసిన వ్యాసాలను కూర్పుగా తెచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని వస్తువుగా చేసుకుని పెద్ద సంఖ్యలో కవితలు రాశారు. లెక్కలేనన్ని పేరాగ్రాఫ్ కవితలు రాసారు. భాషాసంగీతాల గురించిన రచనలు, ప్రయోగ పద్యాలు, ప్రామాణిక గళ్లనుడికట్లు, అనువాదాలు ఎలనాగ ప్రత్యేకతలు.
విస్తృతంగా స్వీయ రచనలు, అనువాదాలు చేస్తున్న ఎలనాగకు అంతర్జాతీయ కవిగా పురస్కారం సృజనాత్మక రంగాలన్నింటిలో మరింత కృషి చేసేందుకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా అంతర్జాతీయ స్థాయికి చేర్చేలా అనువాదాలు చేయాలని తెలుగు సాహిత్యాభిమానుల ఆకాంక్ష.

You may also like

Leave a Comment