Home వ్యాసాలు చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ

by Kondapally Neeharini

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ పుట్టిన తేదీ – 3-1-1939. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

తండ్రి గారు – పొడిచేటి వీరరాఘవచార్యులు గారు (కీ.శే.) భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం, ప్రధానార్చకులు, ఆగమశాస్త్ర పండితులు.

ఏడేళ్ల వయస్సులో కవితారచన ప్రారంభించారు  లక్ష్మీ నరసమ్మ. గాంధీజీ మరణవార్త విని ”భారత జనకుడు ఇక లేడు. గాంధీతాత ఇకలేడు” అంటూ కవితా ప్రస్థానం సాగించారు. వీరికి బాల్యవివాహం జరగడం , కొద్ది కాలానికే వివాహంభగ్నం  కూడా అయ్యింది అనడానికి ఓ నిదర్శనం వీరిని – బావిలో పడద్రోయటం  పెద్ద ఋజువు. పాలేర్లు బయటకు తీసి ప్రాణం రక్షించారు. పదిహేనేళ్ల ప్రాయంలో ఈ కష్టాన్ని మోసుకొని పుట్టింటికి రావడం తో లక్ష్మీ నరసమ్మ గారి జీవితం లో పెను మార్పులు  వచ్చాయి. ప్రైవేటుగా హిందీ పరీక్షలు వ్రాయటం, పద్యాలు వ్రాయడం వంటివి  వీరి చిన్ననాటి  ప్రతిభకు ఉదాహరణలు.

దక్షిణ భారత హిందీ ప్రచార సభలో రాష్ట్ర భాష హిందీ ఉత్తీర్ణత సాధించిన ఘనులు.- ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ముఖ్యంగా గోల్కొండ పత్రిక, ప్రజామత ఇలా అనేక పత్రికలలో కథలు, గేయాలు, వచన కవితలు ప్రచురించి ప్రోత్సహించాయని వీరు చెప్తుంటారు.

అంధ్రా మెట్రిక్‌ ప్రైవేటుగా వ్రాసి, ఉత్తీర్ణులైననారు. ఇల్లందు బి.టి.ఎస్‌.లో ఎస్‌.జి.బి.టి. 2 సంవత్సరాలు చదివారు.1964లో భద్రాచలం మల్టీపర్పస్‌ హైస్కూలులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగం ప్రారంభం.హైస్కూలు కాలేజీ అయింది. ఉద్యోగం చేస్తూ పి.యు.సి., బి.ఏ., ఎం.ఏ. తెలుగు సాహిత్యం అన్నీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.

ఉద్యోగం జీవితంలో అనేక విజయాలు సాధించిన  ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. లక్ష్మీ నరసమ్మ 1985-86 ప్రాంతంలో వాచకాల సెలక్షన్‌ కమిటీలో 2 సార్లు పాల్గొన్నారు.- బెంగుళూరు రీజనల్‌ కాలేజీకి ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌తో పాల్గొన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయినిగా విద్యార్థులతో మంచి అనుబంధం ఏర్పడింది. – వృత్తి – ప్రవృత్తి రెండు ప్రాణంగా, రెండు కళ్ళుగా భావించి అక్షరయాత్ర చేస్తూనే ఉన్నారు. నాటినుండి నేటికి ఆపలేదు. 1999 సం|| ఉద్యోగ విరమణ చేసారు. సెకండరీ గ్రేడ్‌, గ్రేడ్‌-2 తెలుగు పండిట్‌, గ్రేడ్‌1 తెలుగు పండిట్‌గా ఉద్యోగ నిర్వహణ, విరమణ తర్వాత కూడా 3 సంబబ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తెలుగు బోధన విభాగంలో ఉన్నారు.

1981లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వీరు ఉద్యోగం చేస్తున్న భద్రాచలం జూనియర్‌ కళాశాల వార్షికోత్సవానికి వచ్చినప్పుడు లక్ష్మి నరసమ్మ గారి కి ”అభినవ మొల్ల” బిరుదు ప్రదానం చేశారు.

కరుణశ్రీ, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి, ఆచార్య కులశేఖరరావు గారు, ఆచార్య బిరుదు రాజురామరాజు గారు, ఆచార్య తిరుమల, ఆచార్య ఎన్‌.గోపీ గారు , ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, దుగ్గిరాల రామారావు గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఇలా ఎందరో మహనీయుల  మన్ననలందుకున్న లక్ష్మీ నరసమ్మ గారి కి వందల కొలది సన్మాలు జరిగాయి.

తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు వీరిని కొన్ని కవితలు ఆంగ్లానువాదం చేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఏదో ఒక పురస్కారం గ్రహిస్తూనే ఉన్నారు. తిరుపతి ప్రపంచ మహాసభలు, హైదరాబాదు ప్రపంచ మహాసభలు ఆహ్వానించి సన్మానించాయి.

”ఆడపిల్ల” కవితను వెన్నెల-3 అనే తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి గౌరవించాయి. సమతాభిరామం (భద్రగిరిధామ శతకం) – ఇందులో ప్రకృతిలో పరమాత్మ రామదాసు దాశరథీ శతకం వలెనే ” భద్రగిరి ధామ రఘోత్తమ శ్రీమనోహరా !” పద్యాలన్నింట ఒకేయతి స్థానం  తో , ఉత్పల – చంపకమాలలు. శ్రీపథం – ఆళ్వారులు రచించిన ఆరు దిద్యప్త బంధాలకు అనుసృజన – ఇందు గోదాదేవి రచించిన తిరుప్పావై ప్రధానం. ఆటవెలదులు, సీసములు, శార్దూల, మత్తేభాల ఛందస్సు. అక్షర తర్పణం – తండ్రిగారైన వీరరాఘవాచార్యుల గారికి కుమార్తెగా కవితాక్షర తర్పణం (పద్యకావ్యం). మారుతీ సుప్రభాతం – ఇవి తెలుగు పద్యాలు – భక్తిభావ భరిత మేలుకొల్పులు. యోగానంద లక్ష్మీనృశింహ సుప్రభాతం – రాముని ఆలయం కంటే అతి ప్రాచీన దేవాలయం – భద్రాద్రి యోగానందుడు క్షేత్రపాలకుడు. పద్యాల్లో మేలుకొల్పులు రాసారు . నీరాజనం – పద్యకవితా సంపుటి : సమాజానికి ప్రతిబింబంగా అనేక విషయాలు. సమస్యాపూరణ : ఒకానొకప్పుడు ఆకాశవాణిలో ప్రసారమైన పూరణలు. మరి అవధానంలో అవధాని కాకుండా ఈ కవయిత్రి పూరణలు మధువని – పాటలు, గేయాలు. కావ్యగౌతమి – ఇందులో అచ్చులో వెలుగు చూసిన కావ్యాల సంకలనం. రామదాసు, సమతాభిరామం, నీరాజనం, శాంతిభిక్ష, ‘కవితాధనుస్సు’ మొదలైన 11 కావ్యాల సంకలనం. స్వరార్చన – భారతదేశంలో పుణ్యక్షేత్రాల వర్ణానాత్మక చంపూకావ్యాన్ని రచించారు.  ఒకానొక కోకిల భారతదేశంలో పుణ్యక్షేత్రాలను సామాజిక స్పృహతో దర్శించి చివరగా భద్రాద్రి రాముని పాదాలపై తులసీదళమై మోక్షాన్ని పొందుతుంది. గోదాకళ్యాణం – రాయలవారు రచించిన ఆముక్త మాల్యద కథను నవలారూపంలో రచింప బడింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఫిల్‌ చేయబడింది. భద్రాచల క్షేత్ర చరిత్ర – తానీషా – భద్రాచల క్షేత్ర మాహాత్మ్యము – రేడియో నాటకాలు అన్ని కేంద్రాల నుండి ప్రసారం – రేడియో కళాకారులతో కలిసి కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. మాతృభూమి – గజనీ దండయాత్ర కథ. రాజపుత్రుల వీరగాథ  (చరిత్రాత్మక కథ) గడియారం వెంకటశేష శాస్త్రి పురస్కారం. దివ్య గీతాంజలి – రవీంద్రుని గీతాంజలి వలె జీవాత్మ పరమాత్మల సంబంధం. జీవనాయిక పరమాత్మ కోసం పడే తపన. ఇది వచన కవిత. నమ్మాళ్వారు రచించిన నాలాయిర దివ్వ ప్రబంధానికి (తమిళం) అనుసృజన. సుందరకాండ – పద్యాంజలి – ద్విపద అచ్చులో ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు. నేటి సామాజికాంశాలు మరియు ఆయా సందర్భాలలో ప్రముఖ వ్యక్తుల విశేషాలు, అభినందనలు, అక్షరాంజలులు.

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ సంప్రదాయ కవిత్వంలోనూ ఆధునిక విప్లవ భావాలను రాసిన తెలంగాణ ముద్దుబిడ్డ. చైతన్యరహితంగా ఆడవాళ్ళను చులకన చేస్తూ, వాళ్ళ అస్తిత్వంపై దెబ్బకొట్టే ప్రబుద్ధులకు వీరి కవిత్వం ఓ చెంపపెట్టు.

”ఆమె / కాదు కేవలం / ఒక భామ / ఈ తరం సత్యభామ/ ఆమె కాదు కేవలం అభిసారిక/ ఆమె ఈ విశ్వనాటక ప్రథమ భూమిక/లేవామెకు కులుకులు / లేవామెకు అలకలు/లేవామెకు సపత్నీ మత్సరాలు/లేనేలేవామెకు కోపగృహాలు/కాని, ఆమ ధరించిందొక కవితా ధనుస్సు

తమ పదహారేళ్ళ ప్రాయంలో తల్లిగారింటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరి మనస్సుకు తల్లిదండ్రులు నరసమాంబ, కొడిచేటి రాఘవాచార్యులు బాసటగా నిలిచారు. లక్ష్మీనరసమ్మగారు ఇల్లిందల, కొత్తగూడెం దగ్గర చదువుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ బేసిక్‌ ట్రెయినింగ్‌ అనే రెండేళ్ళ కోర్సును 1962-64లలో పూర్తి చేశారు. ఇక్కడే వీరు జీవితాన్ని నేర్చుకున్నారు, భారతదేశాన్ని కాపాడుకోగలిగే జ్ఞానాన్నీ నేర్చుకున్నారు. చైనాతో యుద్ధం అయితే అవసరార్థం వీళ్ళను బార్డర్‌కు పంపిస్తారని కట్లు ఎట్లా కట్టాలో అత్యవసరసేవలు ఎట్లా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. ఆ స్థితి రాలేదు గానీ, తమ పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకునే నైపుణ్యాన్ని సాధించుకున్నారు. ఇక వెనుదిరిగలేదు. చదువుకున్నారు. డిగ్రీలు సాధించారు.

1964 ‘భద్రగిరి’ అనే నవలను రాశారు. దాశరథిగారు ఈ నవలకు ముందు మాట రాశారు. ఆనాటి కృష్ణాపత్రిక, గోలకొండ పత్రికల్లో వీరి వ్యాసాలు వచ్చేవి. దాదాపు ఓ 10 సంవత్సరాలు పత్రికా వ్యాసంగంలో ఉన్నారు. మొల్ల తరిగొండ వెంగమాంబల స్థాయిలో వీరి కవిత్వం ఉన్నదని పేరును పొందారు.

‘సోమనాథ విజయం’ అనే ఆధునిక చంపూకావ్యాన్ని ‘రామదాసు’ పద్య కావ్యాన్నీ రాశారు.

”భద్రాద్రి ముంగిట వరకల్పవల్లీ/రాముని పాదాల పాద్యాల వెల్లీ

నా కవితలై పొంగవే ! గోదారి తల్లి” అంటూ భద్రాచల క్షేత్రంపై రాసినట్టే ఇప్పటివరకు వీరి కవిత్వ రచనా ప్రవాహం సాగుతూనే ఉన్నది.

”ఈ కారుచీకట్లను / నీ చేతి చిరుదీపం జయిస్తుంది/ మానవతా శీతశీకరాల / జల్లులో నీ మనోభూమి తడిసి/ఆత్మవిశ్వాస బీజం మొలకెత్తుతుంది / మొగ్గలా నీ అజ్ఞానం నిద్దుర/విజ్ఞానపు వెలుగు కోసం / గుండెలు విప్పుతుంది/వేకువ వస్తుంది / …. అపుడు ఒకేజాతి / ఒకే నీతి/నిలుస్తుందని / ఆశవుంది” అంటూ ఆశావహకంగా వ్రాసిన తీరు ఆలోచనా త్మకంగా ఉన్నది. వీరి అనుభవాలను చరవాణిలో పంచుకుంటూ, వీరు కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పటి విషయాల్ని చెప్పారు. ” ‘సమతాభిరామం’ అనే కవితాసంపుటిలో ఆధ్యాత్మిక భావాలతో రాసాను, సామాజికాంశాలది కాదు ఇది అంటే, ”రామ స్పృహే సామాజిక స్పృహ – ఇంకేముంటుందమ్మా. ఆధ్యాత్మికత లేని సామాజికత ఉండదు” అన్నారట వారి కళాశాల ప్రిన్సిపల్‌ సామల సదాశివగారు ఆనాడు.

లక్ష్మీనరసమ్మగారు 3వ తరగతిలో ఉన్నప్పుడే ‘మహాత్మాగాంధి ఇక లేడు’ అనే గేయంలో గాంధీ తాతను గురించి వ్రాశారంటే ఆశ్చర్యపోవడం నావంతైంది. వీరికి మనదేశం రాజకీయాలైనా, ప్రపంచ విషయాలైనా మంచి అవగాహన ఉన్నది. ‘మతం మత్తులో’ అనే కవిత ”పంచనదీ వీచికలు / విపంచికలై / ప్రపంచ శాంతి వినిపించిన చోట / మతం మత్తు / మానవతను ఉరితీసింది/ ఆదిగ్రంథం అవతరించి/ అమృత చషకమై…/…./” ఇట్లా సాగిన ఈ కవిత ”శాంతిని తరిమి వేసిందని” ముగిస్తారు. పంజాబ్‌ దుర్వార్త విని రాసిందీ కవిత. ‘వసంతమూర్తి’ కవితలో…

”నిరుపేద దోసిళ్ళ నింపి కన్నీళ్ళతో/ కడిగెనీ కాళ్మొక్క కన్నెపడుచు/ జాలిచూపుల పూలు జోలినిండుగ దెచ్చి/ పూజింప పిలచెనో పూలపిల్ల/ కరిగిన స్వప్నాల కర్హార మధువుల/ నారబోసెనొక యభాగ్య యువతి/ కడుపులో బడబాగ్ని కర్పూర కళికగా

అందించెనొక్క కక్షుధార్త హృదయ” అంటూ ఉగాది పచ్చడిలో మానవాభ్యు దయము ఆకాంక్షిస్తూ వీరు ”ఒక వసంతగమన వేళలో…”, ”రమ్ము వేంచేయు మఖిల విశ్వముపైకి / హర్షమొలికింప నూతన వర్షమూర్తి” అంటూ నిరుపేద కన్నెపిల్ల వైపునుంచీ, జాలిచూపుల పూలు తెచ్చిన పూలపిల్ల వైపునుంచీ, ‘కరిగిన స్వప్నాల కల్లార మధువులారబోసిన అభాగ్య యువతి వైపునుంచీ కొత్త సంవత్సరానికి విన్నపం చేయడం గమనిస్తాం.

వీరు రాసిన ‘శతక శంఖారామం’ను ‘స్త్రీ మనోహర శతకం’ అంటూ పదివారాలు ఈ.టి.వి.లో జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి చెప్పడం వీరి కవిత్వ భావాలెంతో ఉన్నతంగా ఉన్నవో తెలుస్తుంది. ఇప్పుడు వీరు ‘సుందరకాండ’ను రాస్తున్నారు. ఇది ద్విపద కావ్యం. ఈ ఆధునికకాలంలో ఇంతవరకూ రాలేదు. ద్విపద తేలికగా హృదయాల్లోకి చేరుతుంది. అందులోనూ మంజరీద్విపదకు యతులు ప్రాసలు వంటి నియమాలు లేకుండా గానయోగ్యంగా ఉంటుంది. ఆనాడు గోనబుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, తాళ్ళపాక తిమ్మక ‘సుభద్రా కళ్యాణం’ గమనిస్తాం.

‘కన్యామేధం’ కవితలో ఛందోబద్ధ కవిత్వం రాసినా సామాజిక స్పృహతో-

అంటూ ఆడవాళ్ళ కష్టాలకు కారణాలేమిటో చెప్తారు. వివాదాలు విషాద గీతాలై, వివాహ సంబంధాన్ని ఎట్లా విఘాతం చేస్తారో లక్ష్మీనరసమ్మగారు చెప్తూనే…

”ఓ మానవాభ్యుదయ మూర్తి, ఓ సుకీర్తి! / కర్మవీర ! ఓ భారత ధర్మవీర/ ఓయి! వీర విద్యార్థి! లేవోయి! దీక్ష

బూనవోయి! కట్నాలు ముట్టననుచు! అంటూ అబ్బాయిలకు పిలుపునిచ్చారు. 1980లలో ఆకాశవాణి విజయవాడ అంటూ కేంద్రం నుండి ప్రసారమైన కవిత! బెంగుళూర్‌ ఇంటర్నేషనల్‌ కాలేజీవారు వీరికి డాక్టరేట్‌ ఇచ్చారు. ‘భద్రగిరి నానీలు’ అని 120 నానీలు ఉన్నాయి” సంప్రదాయ కవిత్వం వదిలిపెట్టని కవులు నా నానీలు రాయడం గర్వకారణం” అన్నారు. డా|| ఎన్‌.గోపీగారన్నారు. దాదాపు 23 పుస్తకాలు రాసిన వీరిని ఎన్నో పురస్కారాలు తీసుకున్న వీరి ‘ఆడపిల్ల’ అనే కవితను తెలంగాణ ప్రభుత్వం వెన్నెల-3లో 8వ తరగతి వారికి పాఠ్యాంశంగా పెట్టారు.

”జీవితపు సానమీద అరిగిపోతున్న / పరిమళాలు వెదజల్లే / మంచిగంధపు చెక్క” అంటూ వీరు రాసిన కవితను పద్యాంజలిలో విద్యార్థులకు అందివ్వడం ముదావహం. ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, సామాజిక స్పృహతో రాస్తున్న చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారి కలాన్ని సంధించారు. ఆ అంతుబట్టని సునామీలు ఆపాలని కవిత్వ వారధి అయ్యారు. అవుతున్నారు.

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారు మహిళా లోకంలో మరొక మొల్లగా అవతరించింది అని కొనియాడబడ్డారు.

‘రామదాసు’ కావ్యాన్ని మనోజ్ఞంగా అల్లారు. ”రామపద్బా మరంద మాధురీ భోజన రాజమంసి’ అంటూ హృదయోల్లాసం కవిత్వం రాసిన లక్ష్మీనరసమ్మ గారు ఆనాటి మొల్ల, తరిగొండ వెంగమాంబ స్థాయివారు పూర్వ సాహిత్య కవయిత్రుల కోవకు చెందినవారు. వారు వారి రచనల్లో ఎన్ని పాత్రలను సృష్టించి సమాజానికి సుతిమెత్తగా బుద్ధి చెప్పించారు

(నమస్తే తెలంగాణా సౌజన్యంతో)

You may also like

Leave a Comment