Home కథలు మనిషికి ఒక మాట

మనిషికి ఒక మాట

by Lingamneni Sujatha

అమ్మా! అమ్మా! అన్న ఆర్తనాదం విని, వంటగదిలో పోపు పెడుతున్న శారద స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చింది.
హాలులో కూర్చుని పూజ చేసుకుంటున్న పార్వతమ్మ కంగారుగా బయటకు వచ్చింది.
వరండాలో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెబుతున్న రాము పరుగు పరుగున వెనక దొడ్లోకి వచ్చాడు. ట్రాక్టర్ కింద రక్తపు మడుగులో చిన్నారి కిశోర్ పడి ఉన్నాడు.
డ్రైవర్ ట్రాక్టర్ దిగి, నేను కిశోర్ ను చూసి బాబూ! బాబూ! అంటూ అరుస్తూ, ట్రాక్టర్ కు బ్రేక్ వేసాను. బ్రేక్ పడేలోపు కిశోరే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, ట్రాక్టర్ కింద పడి పోయాడు. నా తప్పేమీ లేదు బాబుగారూ! కావాలంటే పాలేరు సుబ్బయ్యను అడగండి అన్నాడు.
ట్రాక్టర్ ను చూసిన హుషారులో కిశోర్ ఎదురుగా పరుగెత్తుకు వచ్చాడు బాబుగారూ! అన్నాడు సుబ్బయ్య.
ఈ అరుపులు కేకలకు ఇరుగు పొరుగు వారు కూడా ఏమైందంటూ పరుగు పరుగున వచ్చారు.

అప్పటివరకు ఇల్లంతా తిరుగుతూ, తన ముద్దు మాటలతో మురిపిస్తూ, కిశోర్ ఆడుకుంటున్నాడు. మరుక్షణంలో ట్రాక్టర్ కింద పడి తల పగిలి రక్తంతో తడిసిపోయిన కిశోర్ ను చూసి, అక్కడ ఉన్న అందరి హృదయాలు ద్రవించి కన్నీరుగా కారాయి.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మా!
చాక్లెట్ పెత్తవా? అంటే పెట్టాను. ఇంతలోనే నీకు ఈ కర్మ వచ్చిందేమిటిరా? అంటూ తల్లి చూసే వారి హృదయాలు ద్రవించేలా ఏడుస్తోంది.
ఇప్పుడే కదరా నాన్నా! అమ్మ చాక్లెట్ ఇచ్చింది అని ఆనందంగా చెప్పావు? ఇంతలో నీకీ గతి వచ్చిందేమిటి? అంటూ తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటివరకూ నాముందే ఆడుకుంటున్నావు కదా! ఇంతలోనే ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అని నాయనమ్మ బాధపడుతోంది.

డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలేమో చూడండి అన్నారు ఒకరు.
రక్తపు మడుగులో పడి ఉన్న కిశోర్ ను డ్రైవరు, పాలేరు తీసుకు వచ్చి, వరండాలో ఉన్న మంచం మీద పడుకోబెట్టారు. పెద్దవాళ్ళు ఒకరిద్దరు వచ్చి, కిశోర్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి శ్వాస ఆడడంలేదు. పిల్లవాడు పోయాడు అన్నారు.

“శారద కిశోర్ దగ్గర కూర్చుని బాబూ! అంటూ భోరున ఏడవడం మొదలు పెట్టింది.”
శారదను వంగదీసి వీపు మీద గుద్దుతూ ఒసే పాపిష్టిదానా! బిడ్డను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావే? మా వంశనాశనానికి వచ్చావా? బంగారం లాంటి బిడ్డను ట్రాక్టర్ పాలు చేసావు కదే! అంటూ కోడలిని తిట్టడం మొదలు పెట్టింది పార్వతమ్మ.
శారద తలెత్తి అత్తగారి మాటలకు వణికిపోతూ, కిశోర్ మీ దగ్గర ఆడుకోవడం చూసి వంటగదిలోకి వెళ్ళాను. కూరకు పోపు పెడుతున్నా ను. అమ్మా! అన్న కేక విని స్టవ్ ఆఫ్ చేసి పరుగెత్తుకుంటూ వచ్చాను. కావాలంటే వంట గదిలోకి వెళ్ళి చూడండి అని శారద అంది.
శారద మాటలు పట్టించుకోకుండా, “ఓసి దరిద్రపు మొహమా! బిడ్డను పట్టించుకోకుండా వాడిని గాలికి వదిలేసి, నా మాటకు మాట సమాధానం చెప్తావా?” అంటూ కోడలిని, పార్వతమ్మ కొడుతూనే ఉంది.

అప్పటి వరకు ఈ వింతను చూస్తున్న ఎదురింటి సూరయ్య,
“పార్వతమ్మా! ఆగవమ్మా! కోడలిని కొడతావేంటి? అమ్మాయి ప్రొద్దున లేచిన దగ్గరనుండి పని చేస్తూనే ఉంటుంది.
మేము ఎదురింట్లో ఉండి అంతా చూస్తూనే ఉన్నాము. నీవు ఏపని చేయకుండా మహారాణిలా కూర్చుని కోడలితో చేయించుకుని బాగా తింటున్నావు. పసిబిడ్డతో ముద్దు ముచ్చట్లతో ఆడుకోకుండా బిడ్డను గాలికి వదిలేసి, పైగా కోడలిని కొడతావా? నీ రాక్షసత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది” అని అరిచాడు.

నేను పూజ చేసుకుంటున్నాను అన్నయ్యా! అంది పార్వతమ్మ.
“మనము రైతులం. రైతులకు రోజంతా పని ఉంటుంది. మనకు పూజలు
చేసుకుంటూ కూర్చోవడానికి కుదరదు.
కోడలితో ఇంటి పని అంతా చేయిస్తూ, కూచుని తింటూ కోడలిని తిడుతూ, పైగా కొడతావా? నీ లాంటి అత్తగారు ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారా? మళ్ళీ కోడలి మీద చేయి ఎత్తావంటే, పక్క ఇళ్లలో ఉన్న మేమందరం కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్ళి నీమీద కంప్లైంట్ ఇస్తాం.”
ఆ తర్వాత పోలీసులే నీకు బుద్ధి చెపుతారు జాగ్రత్త! అంటూ హెచ్చరించాడు.
అప్పటి వరకు తనమాటకు ఎదురే లేదని విర్రవీగుతున్న పార్వతమ్మ
ఏడుస్తూ నేల మీద కూలబడింది.

అప్పుడే అక్కడకు వచ్చిన మధ్య వయసు మగవాళ్ళు పార్వతమ్మతో, పెద్దమ్మా! కిశోర్ కి చేయవలసినవి చేయండి.ఎంత సేపని ఏడుస్తూ కూర్చుంటారు? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా! అన్నారు.
పార్వతమ్మ మనుమడికి స్నానం చేయించింది. శారద పార్వతమ్మలు
ఏడుస్తూ ఉంటే, శ్మశానానికి రాము ఇరుగు పొరుగు పెద్దలతో కలిసి కిశోర్ శవాన్ని తీసుకుని వెళ్లాడు.

పార్వతమ్మ సన్న గొంతుతో శారదను ఇంకా తిడుతూనే ఉంది.
పక్కింటి కమలమ్మ వంట గదిలోకి వెళ్లి కూర వండి, రాముకు పార్వతమ్మకు భోజనం పెట్టింది. ఆ పూట శారద ఎవరెంత బ్రతిమాలినా, ఏమీ తినలేదు, సరికదా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. శిలా ప్రతిమలాగా కూర్చుండిపోయింది.

రాత్రికి కమలమ్మ వాళ్లింటిలోనే వండి, భోజనం తీసుకుని వచ్చింది. రాముకు, పార్వతమ్మకుపెట్టింది. శారదను అన్నము తిందువు రామ్మా! అని పిలిస్తే ఉలుకూ పలుకూ లేదు. కళ్ళు మూసుకుని పడుకున్న శారద కనీసం కళ్ళుకూడా తెరిచి చూడలేదు.

బాబూ! రామూ! “నీవే నీ భార్యను బ్రతిమాలి అన్నం తినమని చెప్పు. శారద కుమిలి కుమిలి ఏడుస్తోంది.
రామూ! మీ అమ్మ పద్ధతి బాగా లేదు. మీ అమ్మకు నచ్చ చెప్పి ఆమెను మంచి మార్గం లోనికి వచ్చేటట్లు చూడు. నీ భార్యను సముదాయించి ఆమెకు ధైర్యం చెప్పు. నీవు మగాడివి. తల్లిని, పెళ్ళాన్ని ఇద్దరినీ నీ మాటలతో, అదుపులో పెట్టుకోవాలి.” నేను నీ మంచికే చెపుతున్నాను. వస్తా నాయనా! అంటూ వెళ్ళిపోయింది.

రాము శారద దగ్గరకు వెళ్ళాడు. “శారదా లే! అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టాడు. శారదా! పొద్దుటినుండి నీవు ఏమి తినలేదు. మన దురదృష్టం. కిశోర్ మనకు లేకుండా మాయమయ్యాడు. అలాగని ఏడుస్తూ ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉంటాం? మా అమ్మ మనుమడు పోయాడు అన్న బాధతో అమాయకురాలైన నిన్ను తిట్టింది. అంతే గాని నీవంటే ప్రేమ లేక కాదు. ఆమెకు మాత్రం ఎవరున్నారు? ఆమెను మనమే అర్ధం చేసుకుంటూ, ముందుకు పోవాలి.”
లేచి రా! అన్నం తిను.
ఈ రోజు మన ఊరిలో అందరూ నాతో
“నీ భార్య బంగారపు బొమ్మలా ఉండడమే కాదు. ఆమె మనసు కూడా బంగారమే. అత్తగారు తిట్టినా, కొట్టినా నోరెత్తకుండా పడి ఉంది. అట్లాంటి స్త్రీ ఈ ఊరిలో ఎవరూ లేరు. ఆమెను జాగ్రత్తగా కాపాడు. మీ అమ్మను అదుపులో పెట్టు” అని కూడా చెప్పారు.

ఇంతటి మంచి భార్య నాకు దొరకడం, నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమని చెప్పాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి నీవు పని చేస్తూనే ఉన్నావు. మా అమ్మ పూజ అంటూ పని తప్పించుకుంటూ కూర్చుంటుంది. పెద్దది. మా అమ్మను ఏమన్నా అంటే ఏడుస్తూ కూర్చుంటుందని నాకు భయం. ఆమె మనస్తత్వం తెలిసినవాడిని కాబట్టి నేను ఏమీ అనలేక పోతున్నాను. నువ్వు కూడా నా మొహం చూసి, నా బాధ తెలుసుకుని, ఆమెను క్షమించు. నా బంగారం కదూ! లేచి అన్నం తిందువు రా! అంటూ భార్య కన్నీరు తుడిచి, ప్రేమగా భార్యను వంట గదిలోకి తీసుకెళ్లాడు.
పళ్ళెంలో అన్నం,కూర నెయ్యి వేసి కలిపి, జీవితంలో మొదటి సారి భార్య నోట్లో ముద్ద పెట్టి తినమన్నాడు. భర్త ప్రేమకుకరిగిపోయిన శారద అన్నం తినడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంటగది సర్దారు. ఇల్లంతా సర్ది, తమ గదిలోకి వెళ్లిపోయారు. శారదా! నీవు పడుకో! నేను అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మను చూసి వస్తానంటూ రాము వెళ్ళాడు.

అమ్మా! నిద్రపోతున్నావా? అన్నాడు రాము.
లేదు రామూ! నిద్ర రావడం లేదు. కిశోర్ ట్రాక్టర్ కింద పడి చనిపోవడం గుర్తుకు వస్తూనే ఉంది. వాడిని పట్టించుకోవడంలేదని, కోపం ఆపుకోలేక కోడలి మీద చేయి చేసుకున్నాను. దానికి మన ఇంటి చుట్టుపక్కలవాళ్లు పోలీసు కంప్లైంట్ ఇస్తాం అన్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నా కోడలిని నేను ఏమీ అనకూడదా? అంది.

అది కాదమ్మా! నీకు తెలియదు గాని గవర్నమెంట్ “గృహహింస” చట్టం అమలులోకి తెచ్చింది. “నీ కోడలిని నీవు తిట్టినా, కొట్టినా…
నీ కోడలుగాని ఇరుగు పొరుగు వారు కానీ పోలీసు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వచ్చి, అత్త మామలను, భర్తను, ఆడబిడ్డలుంటే వారిని, తీసుకువెళ్ళి జైలులో పెడతారట. ఆ తర్వాత కోర్టులో విచారించి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారట.” రోజూ మన ఇంటి చుట్టుపక్కల వాళ్లు వార్తాపత్రికలు తెప్పిస్తారు. వారు ఆ పత్రికలు చదివి చెపుతున్నారు. మనం విని మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రాము అన్నాడు.

సరే రామూ! ఇక మీద నేను కోడలిని ఏమీ అనను. నా జాగ్రత్తలో నేను ఉంటాను అంది పార్వతమ్మ.
అలాగే అమ్మా! అంటూ రాము తన గదిలోకి వెళ్లిపోయాడు.

శారదా! అంటూ రాము శారదను దగ్గరకు తీసుకుని, కిశోర్ ఆయువు తీరి వెళ్లిపోయాడు. భగవంతుడు చల్లగా చూస్తే మళ్ళీ ఇంకొక బాబు పుడతాడులే. ఆ బాబును మనం జాగ్రత్తగా కాపాడుకుందాము. ధైర్యంగా ఉండు అని భార్యకు నచ్చ చెప్పాడు.

మరునాడు ఉదయం పార్వతమ్మ వంట గదిలో ఉన్న శారద దగ్గరకు వెళ్లి, అమ్మా శారదా! ఈ రోజు నుండి నేను కాఫీ పెడతాను. నీకు వంట పనుల్లో సాయం చేస్తాను. మిగతా ఇంటి పనులన్నీ నీవు చూసుకో! అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది. నివ్వెరపోయిన శారద అత్తగారినే చూస్తూ ఉండిపోయింది. దూరం నుండి వీళ్ళిద్దరినే చూస్తున్న రాము మొహంలో చిరునవ్వు విరిసింది.
ఇరుగు పొరుగు వారు అత్తా కోడళ్లను చూసి ఆశ్చర్యపోయారు.
“మనిషికి ఒక మాట. పశువుకు ఒక దెబ్బ” అనే సామెత ఇరుగు పొరుగు వారికి గుర్తుకు వచ్చింది.
నిజంగా జరిగినదానికి ఒక రూపం ఈ కథ.

You may also like

Leave a Comment