పచ్చని వన్నెలో కోమలపు
మేని మెరుపులతో
అలరించే ముచ్చటైన పత్ర విశేషం
మంచిగంధపు వాసనలతోకూడి
అన్నానికి రుచిని పెంచే
అమృత పత్రం
తెలుగు లోగిళ్ళ విందుల్లో
విరాజమానపు హరిత దళం
అందంగా అమరిన వడ్డింపుల
సమాహారపు కళాత్మక నిండువిస్తరి

సనాతన భారతావనిలో లిపిసాధనమై మెరిసి
మాలికలు తోరణాలుగా
రూపం మారుస్తూ
పండుగలు పబ్బాలలో
అలంకారమై ఒప్పే అందమైన
శుభసూచక చిత్రపర్ణిక
పర్యావరణ పరిరక్షణా
నేస్తపు పత్రిగా
మెండైనఔషధ విలువలతో
స్వస్థత నిచ్చేఆరోగ్యప్రదాయిని
భగవంతుని ప్రసాద నివేదనకై
యోగ్యత పొందిన
పళ్ళెరమై భాసిస్తున్న
ప్రత్యామ్నాయమెరుగని
విశేషపు పత్రరాజం