Home కవితలు అల్లనేరేడు !!

అల్లనేరేడు !!

by Ananthaacharaya K.S.

కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!

కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !

వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!

బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!

స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్

గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి

ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!

కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది

అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది

పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!

You may also like

Leave a Comment