కళ్ళు మాత్రమే చెప్తాయి నిజమైన అందానికి సరైన చిరునామా
చూసే కళ్ళను బట్టే కదా అందాన్ని బేరీజు వేసేది
మాటల మాటున దాగిన సంస్కారానికి
ఆత్మ సౌందర్యం ఆభరణమై భాసిస్తే
మురిసిన మనసు మయూరమై నాట్యమాడుతుంది
హంగులు ఆర్భాటాల వెంట పరుగులు పెడుతూ
నిజమైన సౌందర్యాన్ని చేజార్చుకోకు
సౌశీల్యానికి మించిన సౌందర్యం లేదు
రంగుటద్దాల మాటును దాగిన సొగసులన్నీ పై పూతలే
నీ మనసును కమ్మిన మాయపొర తీసి చూడు
అసలు సిసలైన అందం నీ కంటబడుతుంది
ప్రకృతి సోయగ మెంతో సహజమైనది
గడ్డి పూలలో దాగిన చక్కదనాన్ని మనసు పెట్టి చూడు
కష్టించే చేతుల్లోని శ్రమ సౌందర్యాన్ని చూడు
అమ్మ ప్రేమలోని చెలువమెంత కమ్మనైనదో చూడు
దేహ సౌందర్యాన్ని చూసి మిడిసి పాటెందుకు
ఎంతో కాలం నిలువని ఆ బాహ్య సౌందర్యంపై మక్కువేల
తలపుల్లో సొగసు తావులు
విరజిమ్మాలి
మనోహరమైన హరివిల్లులా
వర్ణ రంజితం కావాలి
ఇన్ని ప్రయాసలెందుకు ఒక్క క్షణం కండ్లుమూసి చూడు
రెప్పల మాటున దాగిన చిత్త సౌందర్యం ఎంత గొప్పదో!
ఆత్మ సౌందర్యం
previous post