స్వప్నాలన్ని సత్యాలే
సత్యాలన్ని స్వప్నాలని
నీ చేతలే నిర్ధారిస్తాయి
జీవించడమంటే ఒకరకంగా స్వప్నించడమే.
గొప్పవిషయాలన్నీ సాధారణమైనవే
సాధారణ విషయాలన్నీ గొప్పవని
నీ కళ్ళే చెబుతాయి
సృష్టిలో ప్రధానమైనది దృష్టే.
ముఖ్య వ్యక్తులందరూ మామూలు వ్యక్తులే
మామూలు వ్యక్తులందరూ ముఖ్యులని నీ మనసే చెబుతుంది
కర్మలన్నీ నిర్మలమైనవే.
కాయమంటే గాయాలే
గాయలుంటేనే కాయమని
అణువణువు బోధిస్తుంది
గాయాల కాయంకదా అనుభవమంటే.
బాధపడే క్షణాలన్ని మరచిపోయేవే
మరచిపోయే క్షణాలన్ని బాధలమయమని
నీ బ్రతుకు నేర్పిస్తుంది
ఈ భూమి పై ఇంద్రజాలం చేసేది కాలం ఒక్కటే.
“ఆనందంగా జీవించాలి” అనే వాక్యం
ఎన్ని గ్రంథాల సారమో
ఈ బ్రతుకు ఎన్ని మిలియన్ల పుటల సమూహమో
అంతిమ జీవనపరిణతి వెల్లడయ్యేది ఆఖరు స్మృతినుండే.
రమేశ్ నల్లగొండ
8309452179