Home కవితలు ఎప్పటిలెక్కనే..

ఎప్పటిలెక్కనే..

by Chandu Pendyala

ఎడ్లబండ్లు ఎనుకకు పట్టినయి
గా సందుల ఏడికెల్లో ఓ పెద్ద కోపు పట్టుకొని ఇమానం ల కెల్లి
ఓ యాబయి మంది దాక దిగిండ్రు. అందరు లైనుబడ నిల్సోని సప్పట్లు కొట్టుకుంట,
శిన్న పొల్లగాల్లను ముద్దు పెట్టుకున్నట్లు ఆ కోపుకు ముద్దు పెట్టుకొని
ఆల్లను కార్లల్ల ఎక్కిచ్చి ఇండ్లల్లకు సాగనంపిర్రు.

తెల్లారి నాలుగు తొవ్వల్ల వున్న శాయ బండికాడికి పోయి పొద్దుగాల పిండిన
అద్దషేరు బర్రెపాలు పోసి పైసలడిగితె కాసేపు ఆగమని కసిరిచ్చుకున్నడు .
అయ్యో గట్ల గంజిలీగను తీసేసినట్లు తీసేత్తానవేందన్నా అని అంటే …..
రేపటి సంది పాలు బంజేయి పక్కన పెద్ద మార్కెటు పడ్డది

వాల్లు నెలకోసారి పైసలియ్యమంటాండ్రు నువ్వేమో ఆగవు ,
దినాం వచ్చి కూకుంటవు అనె!
ఇంతల ఆడ అందరు మబ్బుల మొకాన సూస్తాండ్రు

ఆయనడిగె ….
ఏమన్నా తప్పుడు ఆనలు గిన పడతానయా గింతంత జివాల్లకు
తోపులల్ల నీల్లన్న వస్తయి అని !
ఏ ఊకో ఆనలు లేవు పాడు లేవు పైన మబ్బులల్ల కెల్లి కిందికి ఎవరో వస్తాన్నరట
గందుకోసం చూస్తానం నువు కూడ చూడు అనిరి! .

ఇగ ఆయన రోజు గొడ్లు గాసుకుంట , శేనుకు నీల్లు పెట్టుకుంట
పైన సప్పుడు గాంగనె మబ్బులల్ల జూత్తె ఇమానాలు కనబడుతనే వుండె ,
ఇంట్ల TV డబ్బాలల్ల గవే ముచ్చట్లాయె …
ఇప్పుడు రిచ్చాలేడున్నయి ?అన్ని అంతరిచ్చాలేనాయె !
ఇగ కొత్తగ ఇనుడేంది సూసుడేంది.?

రైలుబండ్ల సప్పుడు ముంగట ఎడ్లబండ్ల సప్పుడు ఎట్లయినా ఇనిపియ్యదు
అది ఎరుకున్న ముచ్చటేనాయె అని శెద్దరు కోసం ఎనుకులాడిండు కూర్పాట్ల పడుదామని….
కాని ఎంతకు నిర్ద పట్టి సత్తలేదట , ఇగెట్లయినా ఇయాల గాకపోతె రేపు ఎవుసం బూములు ,
ఇంటి పక్కపంట పెరట్ల జాగలన్ని ఇమానాలు దిగేటానికి , రైలు టేషన్ లకు ఇచ్చి

ఇగ పరాగతుగ నడింట్ల మోకాల్లు మలుసుకుని కూసునుడేనాయె !
తలపులల్ల దుక్కం ఎవరు కనిపెడ్తరు
కండ్లు కాయలుగాసే మనుసులేడున్నయ్ !

ఎట్లయినా పొల్లగాల్లు అందరు ఏరే దేశాల పట్క పోతనే వున్నరు,
ఈడున్న పొల్లగాల్లేమొ ఏడ వింటర్నేషనల్ బడులున్నయాని…
ఎండ్ల వాల్ల పిల్లల్ని షరీకు చెయ్యాల్నని
ఇశారించేదానికే వున్న టయామ్ అంత అయిపోతాండె !
కాలం గుప్పిటవట్టిన కొండచిలువంటి కోరికలేనాయె!
ఇగ పంటలు లేవు , పెంటలు లేవు
ఇండ్లల్ల గ్యాసు మంటలు , ఇంటి పక్కపంట గుళ్ళల్ల గంటలు…

అయినా ఇగ ఆల్ల ఇంటిపొంటనే ఇమానాలు దిగినాక మబ్బుల మొకాన జూసుడెందుకు ?
ఇగ ఎనుకట శిన్నప్పుడు జాతరలల్ల ఇమానం బొమ్మలు ,
ఎలికాప్టర్లు కొనుక్కొని ఆడుకున్నట్లేనాయె…
గుండె పండు పండిపోతాంటె
గల్మట్ల కూసోని మంచికోసం ఎదురుసూసుడేనాయె…

You may also like

Leave a Comment