Home అనువాద సాహిత్యం కథాపంచకం (చిన్న కథలు)

కథాపంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M

పూజ

పోద్దార్ కుటుంబం ఇద్దరు సోదరులతో విడిపోయింది. మృణాల్ అన్న, సత్యజీతం తమ్ముడు వీరి మధ్య పంపకాలకు, భాగాలకు లోను కాని వాడు వారి కుటుంబాలకు గత 40 సంవత్సరాలుగా సేవచేస్తున్న నౌకరు ధర్మా ఒక్కడే.

ఈ సంవత్సరం రెండు కుటుంబాలవారు ఒకరికొకరు తీసిపోని విధంగా చేస్తున్నారు.

‘దేవీ పూజలు’.

‘అమ్మ అందరికన్నా మిన్న. ఆమెకి అన్న మృణాల్ గారింటిలోనే స్వాగతం చెప్పి పూజ చెయ్యాలి. మీరంతా వంగి ప్రణామాలు చేయండి’ – అని ప్రకటించాడు  పూజారిగారు. వాతావరణంలో ప్రశాంతత ఒక్కసారిగా నెలకొన్నది. ఇంతలో తమ్ముడు సత్యజీతం ఇంట్లోంచి కూడా అలాంటి ప్రకటనే వెలువడింది. అక్కడున్న వాళ్లంతా వంగి దణ్ణాలు పెట్టారు. ధర్మా ఆలోచనలో పడిపోయాడు. తను ఇప్పుడు ఏ దుర్గమ్మకు నమస్కరించాలి? అన్న దుర్గమ్మకా? తమ్ముడి దుర్గమ్మకా? తనకైతే ఇద్దరూ పుత్ర సమానులే….

“అమ్మా! నేనెక్కడ చెయ్యాలి పూజ? ఇక్కడా? అక్కడా?” అరిచాడు ధర్మ.

“ఈ అన్నదమ్ముల ఆస్తులైతే పంచుకున్నారుగాని నిన్నెలా పంచుకుంటారమ్మా? నేనలా చేయను చేయలేను. నేనిద్దరి ఇళ్ళ మధ్యనా నమస్కరిస్తా. నా దుర్గమ్మ ఇక్కడా, అక్కడా అన్నిచోట్లా ఉంది”

ధర్మ వంగి నమస్కరించి, తిరిగి మరి లేవనే లేదు.

ఋణం

డా. నాయక్ తన గదిలో ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో ముణిగి ఉన్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్న రోగి పరిస్థితి విషమగా ఉంది. తరువాత లేచి అటూ ఇటూ తిరగసాగారు. ఇంతలో ఫోన్ ట్రింగ్, ట్రింగ్ అనగానే ఆయన మొహంతో నవ్వు విరిసింది. “హమ్మయ్య” అనుకుని.

‘ఎవరైనా దొరికారా?’ అని అడిగాడు.

‘సారీ సర్? దొరకలేదు, తిరుగుతూనే ఉన్నాం’-

అంతే! డాక్టర్ మొహం మారిపోయింది. మళ్ళీ విషాదం అలముకుంది.

‘ఆశ’కు తగిన బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు.

ఎందుకు దొరకడం లేదో కూడా ఆయనకు తెలుసు.

డా. నాయక్ దేవుణ్ణి నమ్మడు. కాని ఇవాళ ఆయన దేవునికి నమస్కరించాడు తలవంచి.

“ఆశ” కోసమై ఆరాధిస్తున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. వెంటనే అందుకున్నాడు.

“నేను, ఇన్స్ పెక్టర్ ఖన్నా. పేపర్లో మీ ప్రకటన చూసాను. నా దగ్గర ఉన్న ఖైదీల్లో ఒక ఖైదీ రక్తం గ్రూపు మీ “ఆశ’ పేషెంటుతో ‘మ్యాచ్’ అవుతుంది. అతను రక్తం ఇవ్వాలనుకుంటున్నాడు.

ఆఁ అలాగా! తప్పకుండా?

ఆ ఖైదీ పేరు?

“కిషన్”

డాక్టర్ నాయక్ గారి కళ్ళనుండి కన్నీళ్ళు జలజలా రాలాయి. వాటి మధ్యనుంచే ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు.

ఇంతకీ…

ఆ కిషన్ అనేవాడే ‘ఆశ’ తండ్రిని హత్యచేసి, దానికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు.

అద్దాల ఇల్లు

శ్రీరాంసేవకంగారి మూడ్ ఇవ్వాళ అస్సలు బాగా లేదు. ఆయన భార్య హాస్పిటల్ లో ఉన్నది. గత ఐదు రోజులుగా ఆయన ఆందోళనగానే ఉన్నాడు. ఇవ్వాళ ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నా ఇవ్వాళే మరి రాంసేవక్ గారి మనసు చాలా క్రుంగిపోయి ఉంది.

ఆయన మనసు పాడైపోడానికి కారణం సుస్పష్టమే. ఈ హాస్పిటల్ ఆయన లాంటివారికి తగినది కాదు. ఆయన నాతో – “చూడండి, ఈ హాస్పిటల్ ఎలా ఉందో? శ్రద్ధగా గమనించండి. అసలు ఇది హాస్పిటలేనా? బాత్ రూంలు మురికిగా ఉన్నాయ్. ఎక్కడ చూసినా బ్యాండేజీలు, గుడ్డలు, మందుల ప్యాకెట్లు – చెత్త, చెదారం ఎంతైనా సిగ్గు పడాల్సిన విషయం ఇది.”

ఆయన మాటలో నిజం ఉందని నాకూ అనిపించి ఆయనతో ఏకీభవించసాగాను. మేమిద్దరం అప్పుడు హాస్పిటల్ వరండాలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా నాకు హఠాత్తుగా నిజంగానే అక్కడక్కడ చెత్త – చెదారం కనబడ్డాయి.

తర్వాత నేను రామసేవక్ గారిని గమనించసాగాను. ఆయన తన జేబులోంచి ఒక బీడి తీసి వెలిగించాడు. దాని బూడిద నేల మీద దులిపాడు. అంతకుముందే ఆయన నోట్లో తాంబూలం (పాన్) ఉంది. మధ్య మధ్య తుఫుక్కున నేలమీద ఉమ్ముతూనే గచ్చుని రంగు మయం చేస్తున్నారు. తర్వాత ఎంతో నిబ్బరంగా నా భుజంపై చెయ్యేసి – “ఈ హాస్పిటల్ లోని మురికి, చెత్తల గురించి నేను చెప్తున్నా కదూ! అసలు మనందరం కలిసి దీన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

భాషా జ్ఞానం

ఒక రోజున నేను సైకిల్ మీద ఇప్పటికి వస్తున్నా. దారిలో ఓ మూల ఓ పెద్ద గుంపు కనబడగా నేను కూడా ఆగిపోయి కుతూహలఁగా వాళ్ళ మాటలు వినసాగాను.

అక్కడ ఒకాయన జనం మధ్య నిలబడి ఏవో పళ్ళు అమ్ముతూ ఉన్నాడు. పళ్ళన్నీ చకచకా, చూసూ్త ఉండగానే పెద్ద సంఖ్యలో అమ్ముడుపోసాగాయి.

ఆ వ్యక్తి తన తియ్యని మాటల ధోరణిలో ఒక మరాఠి మహిళతో – నమస్తే అమ్మా! “ఇదేఫలం చాంగలే భేట్ తాత్ ఫారచ్ స్వస్త్” అని అన్నాడు.

అలాగే, ఒక సర్దార్జీతో – ‘సత్ శ్రీ అకాల్!  ఏ చంగే ఫల్ నే, సస్తేనే” అని అన్నాడు.

అంతలోనే అక్కడికొక సూట్ బూట్ లో వచ్చిన పెద్దమనిషితో – గుడ్ మార్నింగ్ సర్! నైస్ ఫ్రూట్స్ హియర్, వెరీ చీప్!”

ఇలా చాలాసేపు అమ్మకాలు కొనసాగాయి. గుంపు కొంత చెదిరిపోగా – ఆ మనిషి చూపు నాపైన పడింది. వెంటనే బెంగాలీలో – “నమొష్కార్ మోశాయ్! ఎ ఖానౌ భాలో ఫౌల్ ఆచే – భూబ్ హే శౌస్తా!”

నేను కొన్ని పళ్లు కొన్నా ఆ మనిషి భుజంపై చెయ్యివేసి – ‘ఎన్ని భాషలొచ్చు నీకు భయ్యా” అని అడిగా.

కన్నార్పకుండా ఆ వ్యక్తి – ‘మన దేశంలో మాట్లాడే భాషలన్నీ సుమారుగా నా కొచ్చు అని అనగా – నేనాశ్చర్యపోయి ‘అన్నీనా?’ అని అన్నా. ఆయన నవ్వి – సుమారుగా ప్రతిభాషలోనూ ‘నమస్కారం. ఇక్కడ అన్ని రకాల పళ్లూ చాలా చౌకగా దొరుకుతాయి” అనే మాటల్ని మాత్రం నేర్చుకున్నా”.

“దీనివల్ల ఏమిటి లాభం?” నేనడిగాను.

చందు అనే పేరున్న ఆయన – “బాబుగారూ! నేనిలా వాళ్ళ భాషలో చెప్తే వాళ్ళు ఆనందం పొందుతారు. ఇలా చెయ్యడంతో వాళ్ళ మనసులో నాకు ముందుగా చోటు దొరుకుతుంది. తర్వాత వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను నా పళ్ళు తూస్తూ ఉంటా” నన్నాడాయన.

సరిపోని సమయం

మంచం మీద పడి ఉన్న ఆ పెద్ద మనిషి పరిస్థితి పాపం! దయనీయంగానే, విషమంగానే ఉంది. బుగ్గలు పీక్కుపోయి ఉన్నాయి. పెద్ద బొజ్జ. ఆయనకి గుండెజబ్బు. అలాగే పోర్టల్ సిరహోసిసంతో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇటువంటి దుస్థితిలో కూడా ఆయనకు ఫోనుమీద ఫోను అలా వస్తూనే ఉన్నది. అస్సలు తీరిక లేకుండా, ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి వ్యాపార సంబంధమైన వ్యవహారాలపై ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.

ఇంటికొచ్చిన డాక్టర్ – “మీకింత తీరిక లేకుండా ఉంది కద! మరి ఈ జబ్బెలా వచ్చింది మీకు? నిజానికి ఇది ఎక్కువగా అతిగా త్రాగే వాళ్ళకే వస్తుంది”. ఏం చెప్పమంటారు? డాక్టర్! తీరిక లేనందువల్లే నేను తిండి తినలేను. ఏదో ఇలా మద్యపానం చేస్తూ కాలం గడుపుతా త్రాగడానికైతే నాకు తక్కువ టైం పడుతుంది సార్!” అన్నాడు.

You may also like

Leave a Comment