నందిని సిధారెడ్డిగారు మంజీరా రచయితల సంఘం అంతర్జాల వేదికపై నిర్వహించిన ప్రసంగపాఠాల పరంపర, ‘కవిత్వ రచన – కవిత్వ నైపుణ్యాలు’ అంశంపై పదిహేను భాగాలుగా ప్రసంగించారు. ఆ వరుస ప్రసంగాల్ని సిధారెడ్డిగారు మాట్లాడింది మాట్లాడినట్టుగా రికార్డు చేస్తున్నాను. మొదటి ప్రసంగ పాఠం ‘కవిత్వ కళ – నిర్వచనాలు – ప్రత్యేకతలు’ (click this) గత సంచికలో ప్రకటించినాము. ఈ సంచికలో రెండవ అంశం ‘కవిత్వం – దర్శనం – దృక్పథం’ ప్రసంగ పాఠం.
దర్శనం దృక్పథం అనే అంశాలపై ఈ రోజు మాట్లాడుకుందాం. దాశరథిగారు ఎప్పుడో అన్న మాట : “కవులు అందరూ ఒక్కచోట చాపకూడు కూడ్చే ప్రాంగణం కవిత్వం” అని కవిత్వాన్ని నిర్వచించారు. కవిత్వమనేది లైఫ్ లాంగ్ క్రాఫ్ట్. జీవితమంతా మెరుగుపర్చు కోవాల్సిన కళ. ఒకరోజు చదివి వదిలిస్తే అయిపోదు. ప్రతిరోజు చదివితే తప్ప సజీవంగా ఉండదు. కవిత్వ రచనా నైపుణ్యాలు నిరంతరం ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే తప్ప ఎక్కువగా రాణించే అవకాశం ఉండదు. అధ్యయనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
కవిత్వం అంటే దర్శించినదాన్ని వర్ణించడం దర్శనాత్ వర్ణనాత్ లొకేరూఢా కవిః అని సంస్కృత ఉక్తి ఉన్నది. దాని ఆధారంగా చూసినపుడు దర్శించడంలో కవికి ప్రత్యేక స్థానం ఉన్నది. రవి గాంచనిచోటు కవిగాంచును అని మనం చాలాసార్లు విని ఉన్నాం. సూర్యుడు కూడా చూడలేని ప్రాంతాలను కవి చూస్తాడు. రవి కిరణాలు ప్రవేశించని చోటు, పోలేని చోటును కూడా కవి దర్శిస్తాడు. దర్శించడమంటే చూడడమే కదా. అందరూ చూసేది చూపే కదా. అంటే అందరికంటే వేరుగా కవి చూస్తాడు అని. అంతర్ దృష్టితో లోపలికి పరిశీలించి చూడడం. లో చూపు, చూపు ఎంత లోతైనదైతే పరిశీలన అంత లోతుగా ఉంటుంది. అందుకే కవయః క్రాంత దర్శినః అన్నారు. ఒక యాభై ఏళ్ల ముందు వంద ఏళ్ళముందు, ఉండబోయేది కవి ఊహించి రచిస్తాడు. దాన్ని దార్శనికత అంటాం. అందుకే వాల్మీకిని ఇప్పటికి స్మరించుకుంటాం చెప్పుకుంటాం ఈ దార్శనికత కీలకమైనది. ఇదే సాహిత్యంలో ప్రత్యేకం. ఒక కొత్తకోణంలో చూడడం. ఏది దర్శించాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, జీవితాన్ని దర్శించాలి. ఒక మామూలు వ్యక్తి చూసే చూపుకు, ఒక కవి, ఒక కళాకారుడు చూసే చూపుకు తేడా ఉంటుంది. ముఖ్య లక్షణం ఏమిటంటే అనుభవం ద్వారా చూడడం. కవి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. జీవితాన్ని అనుభవంతో కొందరు, జ్ఞానంతో కొందరు చూస్తారు. జ్ఞానం ద్వారా చూడడం యోగదృష్టి, తత్త్వ దృష్టి, దివ్యదృష్టి అని మూడు విధాలుగా చెప్పవచ్చు. దివ్యదృష్టి అంటే అక్కడ లేనిది చూడడం. కవికి అంతర్ దృష్టితో చూడడమనే దాంట్లో కవికి ఒక అంతర్ నేత్రమనేది ఉంటుంది. రెండు నేత్రాలే కాకుండా కవికి మనోనేత్రం కూడా ఉంటుంది. మనోనేత్రాలతో చూసి కవిత్వ వస్తువును ఎంచుకోవడమే సగం కవిత్వం. సామాన్య మానవుని ఆకర్షించని విషయాలు కవిని ఆకర్షిస్తాయి.
పక్షిని అందరూ చూస్తారు. వేటగాడికి దాన్ని కొట్టాలని అనిపిస్తుంది. వాల్మీకి క్రౌంచ పక్షి జంటను చూసినపుడు ఒక క్రౌంచ పక్షి వియోగంతో ఎట్లా బాధపడింది, క్రౌంచ పక్షి పొందిన వియోగాన్ని చూసాడు. పడిపోయిన పక్షి కంటే పడిపోని పక్షిని మనోనేత్రంతో చూశాడు. అట్లా అంతర్ నేత్రంతో ఒంటరి పక్షిని ఊహించి భావించి కథ రాశాడు. ఆ పక్షి దుఃఖాన్ని రాశాడు. ఆ దుఃఖం నుండే రామాయణం మహాకావ్యంగా ఉద్భవించింది. దాన్ని దివ్యదృష్టి అనండి, మనో దృష్టి అనండి, అది అంతర్ దృష్టి అనదగినది. ప్రత్యేకమైనది. అందుకే నానృషిః కురుతే కావ్యం అనే మాట వచ్చింది. ఋషి కాని వాడు కావ్యం రాయలేడని అన్నారు. ఋషికి ఒక ప్రత్యేక మైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టితో కొత్తగా దర్శించి రాస్తాడు. రోడిన్ అనే పాశ్చాత్య తత్త్వవేత్త లుక్ ఎట్ ద థింగ్ అన్నాడు. వస్తువువైపు చూడు, ఎంతవరకంటే అంటిల్ యు గాట్ ఏ పోయమ్ నువ్వు కవిత్వమయ్యేదాకా దాన్ని చూస్తూ ఉండు అంటాడు. శేషేంద్రశర్మ ఏమన్నాడంటే పుష్పాన్ని చూస్తూనే కొ్న్ని యుగాలు గడుపుతాను అంటాడు. భౌతిక విషయాలైన ఆకలి దప్పులు ఉంటాయి. ఇవన్నీ చూడను. కానీ ఇవన్నీ దాటి సౌందర్య దృష్టి అనేది ఉంటుంది. కవికి ఉండే సౌందర్య దృష్టి వీటన్నింటినీ, భౌతిక విషయాలన్నింటినీ దాటేసి చూడాలి. సౌందర్య దృష్టితో చూస్తేనే ముడిసరుకు దొరుకుతుంది. ఆ ముడిసరుకే కవిని కవిగా నిలబెడుతుంది. పుష్పాన్ని మనమందరం చూసినా మన చూపు వేరు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చూసిన చూపు వేరు. కొమ్మ నుండి పువ్వును తెంపినపుడు తల్లి నుండి దూరమైనట్టు, పుష్పాన్ని తెంపివేసిన తరువాత ఆ పువ్వు దుఃఖాన్ని, వియోగాన్ని పుష్పవిలాపంగా రాశాడు. కొమ్మ నుండి విడిపోయిన పువ్వులో ఏడుపును దర్శించాడు. అందుకే దర్శనం ముఖ్యం కవికి. దర్శనం చాలా కీలకమైనది. చుట్టూ ఉండే వస్తువుల్ని చూసేప్పుడు తప్పనిసరిగా మూడు రకాలైన దర్శనాలుంటాయి. ఒక అంచనాకు గనుక వస్తే 1. భౌతిక ఆకారాన్ని చూసేటువంటి వస్తు దృష్టి, ఇది ప్రాథమికంగా మనకు కనబడేది, అది పుస్తకమా, పెన్నా, టేబులా ప్రాథమికంగా చూసేది. మన ఇంద్రియాలతో మన కనులతో చూసేది. తత్వదృష్టి రెండోది. ఆ భౌతిక ఆకారం పుస్తకమైతే, దాన్ని తత్త్వాన్ని చూసే దృష్టి వేరు. ఆ పుస్తకం నవలనా, కథనా, ఏమిటనేది, ఆ పుస్తకంలోని సారమేమి అనేది. పుస్తకాన్ని చూడగానే దాని రంగు, రూపు, వాసన కాకుండా తత్త్వాన్ని, సారాన్ని తెలుసుకోవడమన్న మాట.
మూడో దృష్టి కవితా దృష్టి. పోయెటిక్ విజన్. కవి తనదైనటువంటి కవితా దృష్టి కలిగి, దర్శన శక్తి కలిగి ఉన్నప్పుడే అది కవితగా అవుతుంది. ఇదే ప్రధానమైనది, అంటే ఆ రచనకు శక్తినిచ్చే దృష్టి ప్రధానమైనది. భావుక దృష్టితో చూడడం. కవికి ఉండాల్సింది పోయెటిక్ విజన్. దానితో వస్తు, తత్త్వ, కవితా దృష్టి అనే వాటిలో మూడోదృష్టికి కావలసింది భావుకత సార్త్రే అనే అస్తిత్వవాద తత్త్వవేత్త నువ్వు ‘వస్తువును చూసేటపుడు నువ్వు ఏ యాంగిల్ లో చూసినా అది సమగ్ర దర్శనం కాదు’ అన్నారు. ఒక్కోవైపు నుండి అంటే కుడివైపు నుండి చూస్తే ఎడమవైపు కనిపించదు, ఎడమ వైపు నుంచి చూస్తే కుడివైపు కనిపించదు. ఒక టేబుల్ ను చూసినా పుస్తకాన్నిచూసినా తత్త్వాన్ని చూసే దృష్టి ప్రధానం భావనాత్మక దృష్టితో తత్త్వాన్ని అర్థం చేసుకోవడం కవి దృష్టి.
ఇంకొక ఉదాహరణ తీసుకొంటే చెట్టు ఉంటుంది. చెట్టుకు పండు కాయలు ఉంటాయి. ఒక ఆకలితో ఉన్నవాడికి ఆ పండును చూస్తే ఆకలిని తీర్చేది అనుకుంటాడు. అది భౌతిక దృష్టి, ఒక సాధారణ దృష్టితో చూస్తే భౌతికవాది అనవచ్చు. అంటే పండును తింటే ఆకలి తీరుతుంది అనుకుంటాడు కనుక. అదే ఒక తాత్త్వికుడు (ఫిలాసఫర్) అయితే ఏమంటాడు, ఏదైనా కోయక తప్పదు, పండి రాలిపోక తప్పదు. జీవితం కూడా అంతే. మానవుడైనా రాలిపోక తప్పదు. జీవితం ముగించక తప్పదు. పండు వంటిదే ఈ జీవితం, ఈ మానవ జన్మ. ఒక వయస్సు వచ్చాక అది రాలుతుంది. భూమిలో కలిసిపోతుంది. ఎలాగైతే పండు భూమిమీద పడి మట్టిలో కలిసిపోతుందో అట్లే ఒక మనిషి కూడా అంతే. ఒక తాత్త్వికుడు, ఒక వేదాంతి అట్లా చూస్తూ జీవితాన్ని ఒక తత్త్వంతో ముడివేసి చూస్తాడు. పండును మనిషి జీవనంతో ముడివేసి చెప్తాడు. అతన్ని తత్త్వవేత్త అంటారు. అదే ఒక శాస్త్రవేత్త ఈ దృష్టిని గమనిస్తే : న్యూటన్ చూశాడు ఒక పండు రాలడాన్ని, అది చూసి భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉన్నదని, పండు భూమి మీదనే ఎందుకు రాలింది? పైకి ఎందుకు పోలేదు అని ఆలోచించి భూమ్యాకర్షణ శక్తిని కనిపెట్టిన దృష్టి శాస్ర్తవేత్త దృష్టి. శాస్త్రవేత్త దృష్టితో చూస్తే ఎంతటి వస్తువైనా కిందనే పడుతుంది. శాస్త్రవేత్తగా నిరూపించుకోగలిగాడు అతడు. ఒక బంతిని పైకి వేస్తే అది కిందనే పడుతుంది. శాస్త్రవేత్త భూమి ఆకర్షణ శక్తిని ఇట్లా నిరూపిస్తాడు. కవి దృష్టిలో వేరు. ఒక పండును చూసినపుడు పండు సౌందర్యాన్నిగొప్పగా వర్ణించడం జరగవచ్చు. చెట్టు సౌందర్యాన్ని వర్ణించవచ్చు. పండు రాలక ముందు చెట్టును, పండు రాలిన తర్వాత చెట్టును భావోద్వేగంతో వర్ణించవచ్చు. ఇది కవి దృష్టి. చెట్టుతో ఉన్న బంధాన్నిభావోద్వేగంతో వర్ణించి వ్రాస్తాడు. తల్లి బిడ్డ అనే భావనతో చూస్తాడు. చెట్టు వొడి నుండి అంటే అమ్మ వొడి నుండి మట్టిని చేరుకున్నది అనే భావనతో రాయవచ్చు. సౌందర్య దృష్టే కాకుండా ఈ మూడు భౌతిక, తాత్త్విక, శాస్త్ర దృష్టి కంటే కూడా కవి యొక్క భావనాత్మక దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. భావుక దృష్టితో చూడడం, చెట్టు తల్లిగా చెప్పడం, కింద భూమిని మళ్ళా భూమి తల్లి వొడిలో పడిపోయింది బిడ్డ అనేది చెప్పడం, ఇవన్నీ కూడా. శాస్త్రవేత్త, తత్త్వవేత్త ఇద్దరు కూడా సత్యాన్నే చెప్పారు. ఇంకో సత్యాన్ని చెప్తాడు కవి. శాస్త్రవేత్త దృష్టిలో, తత్త్వవేత్తల దృష్టిలో ఉన్నదానికంటే కూడా కవికి భావనాత్మక దృష్టితో చెప్పగలిగే దృష్టి ఎక్కువ ప్రాధాన్యతతో ఉంటుంది. తత్త్వవేత్త తర్కాన్ని చెప్తాడు, శాస్త్రవేత్త సత్యాన్ని నిరూపిస్తాడు. ఈ ఇద్దరికన్నా కూడా కవి తన పదాల చాతుర్యంతో వాక్యాల చాతుర్యాన్ని జోడించి నవీనంగా దృష్టీకరించి చూపిస్తాడు. పండు మట్టిలో కలిసిపోయింది నిజం. ఆ పండు యొక్క భౌతికతను, దాని అంతర్ భావ సౌందర్యాన్ని దృశ్యమానం చేసి వర్ణించి చెప్తాడు. అంటే భూమి చేతులతో స్వీకరించినట్టు, చెట్టుకు పండు దూరమైనట్టు వర్ణించి చెప్పడం. అట్లా దృశ్యమానం చేస్తాడు కాబట్టే కవికి ప్రత్యేక దృష్టి ఉన్నదని అంటాం. ఈ దృష్టిని రెండు విధాలుగా చెప్పవచ్చు. సూక్ష్మదృష్టి, స్థూలదృష్టి. ఆంతరమైన విషయాలదాక పోయి కవి వర్ణిస్తాడు. ఆంతరమైన విషయాలకు వెళ్లిన కవి ఏ విషయాన్ని, ఏ వస్తువును ఎట్లా స్వీకరిస్తాడనేది ముఖ్యం. నన్నయ్యగారు లోనారసి అన్నాడు. భారతం రాసేటప్పుడు, భారత కథను చెప్పేటప్పుడు ఇతరులు అక్షర రమ్యతను ఆదరించగా అంతకంటె ఎక్కువ స్థాయి విమర్శకుడు ‘లోనారసి మేలు’ అన్నాడు. చాలామంది కవిత్వమనేది సౌందర్యంవల్ల, శబ్దగుణంవల్ల, లయగుణం ఉండడంవల్ల వినగానే ఆకర్షితులవుతుంటారని అంటారు. కాని నిజానికి ఇతరులు అక్షరరమ్యతను ఆదరించినప్పుడు అందులో మేలుగా ఉన్న అంశం ‘లోనారసిన’ వాళ్ళకే తెలుస్తుంది.
లోనారసి అంటే లోన్ లోపలిదాకా హృదయం లోపలిదాకావెళ్ళి చూసి రాయడం కవి రాస్తాడు కనుక కవి ప్రత్యేకమైనవాడు. నన్నయ్య చెప్పినదాన్ని ఇంకొంచెం లోపలిగా చెప్తూ, విస్తృత అర్థాన్ని చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నారంటే ‘చిత్తానన్ చూచి అన్నాడు. కళ్ళతో చూస్తారు అందరూ, కానీ కవి
హృదయంతో చూడాలి, ఒక వస్తువు తత్త్వాన్ని, ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని, గుణాల్ని గుణాల లోపలి అనేక అంశాలను హృదయంతో చూడాలి. అప్పుడే భావోద్వేగం కలుగుతుంది. కవి హృదయంలో పుట్టేది భావోద్వేగం. ఇది కవితాశక్తి.
దేనితో చూడాలి, హృదయంతో చూడాలి. మనందరికి తెలిసిన మాటలే. శ్రీ శ్రీ ఏమన్నాడంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, దేన్ని హీనంగా చూడకు. అంతా కవితామయమేనోయ్ అన్నాడు. హీనంగా చూడకు దేన్ని అని ఎందుకు అన్నాడంటే అంతకుముందు ప్రాచీన అలంకారికవేత్తలు, ప్రాచీన తాత్త్వికులు, ప్రాచీన కవులు
ఏమన్నారంటే కవిత్వం కొన్ని విషయాలలోనే ఉంటుందనీ, కొన్నిచోట్లనే ఉంటుందనీ అన్నారు. కవిత్వానికి గొప్ప నాయకుడు కావాలి, సౌందర్యవంతమైన స్తీ ఉండాలి, భగవంతుడు లేక ప్రభువు లేదా అందమైన స్త్రీ వర్ణనలలోనే కవిత్వం ఉంటుందని ప్రాచీన కవులు భావించారు. వాటిల్లోనే కవిత్వాన్ని చూడాలి అన్నారు. అదే శ్రీ శ్రీ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు కుక్కపిల్ల, అగ్గిపుల్ల దేన్నైనా తక్కువగా హీనంగా చూడవద్దు, అంతా కవితామయమే అన్నాడు. బల్లచెక్క, అరటి తొక్క వీటన్నిటిని కూడా కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కంటూ అంటూ ఉంటే రాసి అని అన్నాడు. మళ్లీ ఎందుకు అన్నానంటే, కళ్ళతో చూడడం కళ్ళు ఉన్నా అందరూ చూడరు, కళ్లున్న కబోదులు అని కూడా అన్నారు. దర్శించడానికి హృదయం అనేది ఉండాలి. కళ్లు, హృదయం రెండూ ఉండాలి. అపుడే తెలుస్తుంది. కాళిదాసు విషయానికి వస్తే కూడా కాళిదాసు ప్రత్యేకంగా మేఘాన్ని చూసి కవిత్వం రాశాడు. ఆయనకు ఏం కనబడింది? మనమూ చూస్తాం, మేఘాలు వస్తాయి పోతాయి. వర్షం కురుస్తుంది. మనకు తెలుసు. రైతు మేఘాలను చూస్తే వాన పడుతుంది అని చెప్తాడు. రైతు దగ్గర అంత సైన్స్ కూడా ఉంటుంది. రైతు దగ్గర అంత జ్ఞానం ఉంటుంది. వానపడితే చాలు రైతుకు. కానీ కాళిదాసు చూసినపుడు వేరుగా కనిపించింది. ఒక వియోగంలో ఉన్న భర్త తన ప్రియురాలు భార్యకు తన వియోగాన్ని ఈ మేఘం ద్వారా చెప్పడం. అదీ రామగిరి నుండి అలకాపురికే వెళ్తుంది ఆ మేఘం అనుకొని, ఓ మేఘమా నా భార్య, నా ప్రియురాలు అలకాపురిలో ఉన్నది, ఆమెకు ఈ సందేశాన్ని తెలుపుమని, మేఘాన్ని ఒక దూతగా ఊహించడం, భావించడం కల్పన చేశాడు. కాళిదాసు గొప్ప తనానికి ఇది కారణం. ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే దూత, రాయబారం దృష్టినుండి వచ్చింది. కదిలే మేఘమనేది దూతగా రాయబారాన్ని తీసుకెళ్ళడమనే భావన దృష్టి కవి దృష్టి నుండి వచ్చింది.
అదే జాషువా వరకు వచ్చేసరికి శివుడికి చేరువగా భగవంతునికి దగ్గరగా వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు కనుక ఆయన దళితుడు కనుక భగవంతుని ఆలయంలోకి ప్రవేశం లేదు కనుక ఒక శివాలయాన్ని ఎంచుకుని ఆ శివాలయంలోని గబ్బిలాన్ని దూతగా ఎంచుకున్నాడు. పూజారి ఆలయానికి రానిస్తాడో లేదోనని గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. కాళిదాసు మేఘాన్ని భావించినట్టు జాషువా గబ్బిలాన్ని దూతగా భావించాడు. శివునికి చేరువగా ఉన్నావు కాబట్టి నా మాటను శివునికి విన్నవించు. అక్కడ మేఘం చేరవేయదు, ఇక్కడ గబ్బిలం చేరవేయదు. పావురం చేరవేయదు. నలుడు దమయంతిల రాయబారం హంసతో చేశాడు. హంస కూడా చేరవేయదు. కవి వియోగం పొందే ప్రియుని బాధను గుడి నుంచి దూరం చేసిన దళితుని బాధను తన బాధగా స్వీకరించాడు. ఈ దృష్టి నుండే, ఈ దర్శనం నుండే కవి అవతరిస్తాడు. ఈ ఆలోచన రావడం, ఈ దర్శనం కలగడం అనేది చాలా కీలకం.
దర్శనంవల్లనే ఉత్తమ కవి కావడానికి అవకాశమున్నది. ఈ దర్శనానికి కూడా కొన్ని అంశాలు ఉన్నవి. ఆ కాలంలో అంటే ప్రతీకాలంలోనూ మనం ఔనన్నా కాదన్నాఒక తాత్వికత ఉంటుంది. 20 ఏళ్లకు కావచ్చు, 30 ఏళ్ళకు కావచ్చు దర్శనానికి సంబంధించిన భావనలు, సూత్రాలు మారుతుంది. ఈ చూడడమనేది, దర్శనమనేది కాలాన్నిబట్టి ఉంటాయి. ఆ సూత్రాలు ఒకే కాలానికి వేరుగా కూడా ఉంటాయి. అందుకే మనకు తెలిసిన కవులే, చాలా కరుణామయమైన కవులే వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపయోగించి రాసిన కవులు ఉన్నారు. నాలుగు వర్ణాలు – ముఖంలోనుంచి బ్రాహ్మణున్ని, భుజాల్లో నుంచి క్షత్రియున్ని, ఊరువుల్లో (తొడల) నుంచి వైశ్యున్ని, పాదాల్లో నుంచి శూద్రులను సృష్టించాడని భగవంతుని రూపాలుగా చెప్పారు. ప్రతీ సమాజంలో మన మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు, శిక్షలు చాలా జాలిగొలిపే విధంగా ఉండేవి. పొలం దున్నుకొని జీవించిన పోతన కూడా వర్ణాశ్రమ ధర్మాలను బట్టే అనుకూలమైన కవిత్వం రాశాడు. ఎందుకంటే ఆ కాలంలో ఆ ధర్మం ఉన్నది. ఈ అంశాలన్నీ కవిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అట్లానే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసే దర్శనాన్నిబట్టి, దానికి సహాయకారులుగా ఉండటానికి కొన్ని సూత్రాలు ఈ తాత్త్విక యోగులైనవారు, వేదాంతు లైనవారు ఏర్పరిచారు, తయారుచేశారు. అట్లాంటి దర్శనంలో వేదాంతం దర్శనమనేది ఒకటి ఉంది. చూడడం మొదలు పెట్టిన తరువాత ఈ జీవితాన్ని దర్శించాలంటే ఏమేమి దర్శనాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వస్తువును, ఒక పువ్వును దర్శించాలన్నా, ప్రకృతిని దర్శించాలన్నా, జీవితాన్ని దర్శించాలన్నా, లోకాన్ని దర్శించాలన్నా మనం కొన్ని సూత్రాలు, నియమాలు కాలానికి అనుగుణంగా ఉంటాయి. ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉంటాయి. ఆ తరువాత కాలంలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. ఈ విధమైన చర్చ కాలమాత్రంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాలం చాలా కీలకం. ఈ కాలాన్ని కవి దృష్టిలో పెట్టుకోవాలి. కవి ప్రత్యేకత ఏమిటంటే త్రికాలదర్శనం చేయటం. గతాన్ని దర్శించగలడు, వర్తమానాన్ని దర్శించగలడు, భవిష్యత్తును దర్శించగలడు. గత వర్తమాన భవిష్యత్తు కాలాలను దర్శించడం. ఎప్పుడనుకుంటే అప్పుడు గతంలోకి వెనుకకు వెళ్ళగలడు, ఎప్పుడనుకుంటే అప్పుడు వర్తమానంలో ఉండగలడు, ఎప్పుడనుకుంటే అప్పుడు ముందుకు, మునుముందుకు కూడా పోగలడు. ఈ శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక కవికి మాత్రమే ఉంటుంది. వెనుకకు వెళ్ళి ‘అప్పుడు పుట్టి ఉంటే’ అని ఒక వ్యాసాన్ని రాశాడు కృష్ణశాస్త్రి. ఇందుకిదొక ఉదాహరణ.
శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నేను పుట్టి ఉంటే నేను ఎట్లా ఉండేది అని రాశాడు. వెనక్కు వెళ్ళి దర్శించి రాశాడు. అట్లాగే శ్రీశ్రీ చాలా ముందుకు వెళ్ళి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని రాశాడు. ఈ కవి కాలాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. వర్తమానంలో ఉంటాడా? ఆనాటి లోకంలో ఉంటాడా? అన్న అభిప్రాయాలనుబట్టి విషయాలను వర్ణిస్తాడు. ఇవి కవి ఇష్టాన్ని, ఆసక్తిని బట్టి ఉంటాయి. వస్తువును దర్శించడం, జీవితాలను దర్శించడం, కాలాన్ని దర్శించడం, సమాజాన్ని దర్శించడం, ఇవన్నింటిలోనుంచి వస్తువును తీసుకోవాలి. వస్తువు అనేది ఎక్కడ ఉంటుందీ అంటే ఎవరెన్ని చెప్పినా వస్తువు ఎక్కడ నుండి తీసుకోవాలంటే ఎవరైనా జీవితంలో నుండే తీసుకోవాలి. వాల్మీకి రామాయణంను జీవితంలో నుంచే తీసుకున్నాడు. వ్యాసుడు భారతం జీవితంలో నుంచే తీసుకున్నాడు. భారతం భూమికోసం వచ్చిన కొట్లాట, తగాదా. రామాయణం తల్లిదండ్రులకు ఇచ్చిన మాటలోంచి వచ్చిన గాధ. మాట నిలబెట్టుకోవటానికి పొందిన కష్టాలకు సంబంధించిన గాధ. ఇవన్నీ జీవితానికి సంబంధించినవి. ఇప్పటికీ బ్రతికి ఉన్నవి. జీవితంతోని సంబంధం ఉన్నవే ఉంటాయి. ఏ వస్తువు జీవితంతో సంబంధం లేకుండా ఉండదు. స్వర్గమైనా సరే, నరకమైనా సరే, ఈ జీవితం బాగు లేదనుకుని సృష్టించుకున్నారు. దర్శించుకున్నారు. చావు లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, ఎప్పటికీ సంగీతాన్నివింటూ నృత్యం చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించుకున్నదే, ప్రతిదీ మన జీవితం నుండే దర్శించాలి. అది ప్రాథమికమైన అంశం. జీవితం నుంచి కాలం నుంచి తీసుకున్న అంశం. ఇక రెండవ అంశం దృక్పథం. దృక్పథం అనే మాట దర్శనం నుండి వచ్చింది. దృక్పథం చూసే విధానం ఒక పద్ధతి ప్రకారం చూడడం. ఈ చూడడాన్ని ఒక సూత్రం అనుకుంటే అది క్రమానుగుణంగా ఉంటుంది అనుకుంటే, ఒక పద్ధతి ప్రకారంగా చూస్తే అది దృక్పథం. జీవితాలని దర్శించడానికి మనకు ఏర్పడిన దృక్పథం. అందులో భౌతిక దృక్పథం, భావవాద దృక్పథం అని రెండు రకాల దృక్పథాలను ఏర్పర్చుకొని, నిర్వచించుకొని చెప్తారు. మార్క్సిస్టుల ప్రకారం చెప్పేటప్పుడు దృక్పథాలు రెండు ఉన్నాయి. 1. భావవాద దృక్పథం, 2. భౌతికవాద దృక్పథం. ఇలా ఐడియలిస్టిక్ అవుట్ లుక్, మెటీరియలిస్టిక్ అవుట్ లుక్ అనే రెండు దృక్పథాలు ఉన్నాయి. దర్శనాల దగ్గరికి వచ్చేసరికి వేదాంత దర్శనం ఉంది మనకు. సంస్కృతంలో దర్శనం ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. భారతీయ తత్త్వవేత్తలలో దర్శనం అనే మాట ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. ఇటువంటివి నాలుగైదు పైన దర్శనాలు మనకు కనపడతాయి. ఆ సూత్రాలకు అనుగుణంగా అందులో ఉండే ధర్మాలను తీసుకోవడం. అందుకే మనకు మొదటిది వైదిక దర్శనం, రెండవది బౌద్ధ దర్శనం, మూడవది చార్వాక దర్శనం. ఏమిటి ఈ వైదిక దర్శనం అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడిన అంశాలను ఆ నియమాలకు అనుగుణంగా, ఆ సూత్రాలకు అనుగుణంగా అందులో ఉండే ధర్మాలను తీసుకోవడం, చూడడం. వేదాలు, ఉపనిషత్తులలో చెప్పినదానినిబట్టి జీవితాన్నిఅర్థం చేసుకోవడం. ఈ జీవితాన్ని అర్థం చేసుకునేటపుడు జీవితానికి పునర్జన్మ ఉంటుంది. ఎవరైనా చనిపోతారు, ఎవరికైనా పునర్జన్మ ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం. దీన్ని ఏమన్నారు? కర్మసిద్ధాంతం అన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసే కర్మవల్లనే నీకు మానవ జన్మ వస్తుందా, ఇంకో జన్మ వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాపం, పుణ్యం అనేవి కర్మలు వాటి కర్మ దేన్నిబట్టి ఆధారపడి ఉంటుందంటే ధర్మాన్నిబట్టి. పాప పుణ్యాలనుబట్టి నీకు జన్మ వస్తుంది అని చెప్పేది కర్మ సిద్ధాంతం. పుణ్య కర్మలు చెయ్యమని చెప్పేది వైదిక ధర్మం, ఇది వైదికదర్శనం లేదా వేదాంత దర్శనం. హిందువులు భారతీయులు ఎక్కువగా నమ్మే సిద్ధాంతం. ఈ జీవితమనేది అంతరించదు. ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఇంకో శరీరాన్ని వెతుక్కుంటుంది. రాబోయే కాలంలో ఇంకో జన్మ ఎత్తుతావు, కాబట్టి పునర్జన్మ వస్తుంది. ప్రతిదీ జీవితం నుండే ఆలోచించాలి. ఈ జీవితం అంతరించదు. ఈ జన్మలో చేసే పాప పుణ్యాలనుబట్టి జీవితం వస్తుంది. నువ్వు పాపం చేస్తే ఫలానా అయి పుడతావు, పుణ్యం చేస్తే ఫలానా అయి పుడతావు అని వైదిక భావాల్లో కీలకమైనవి. వర్ణాశ్రమ ధర్మాలలో 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, కత్రియ, వైశ్య, శూద్ర. తరువాత పంచములు. పంచమ జాతి, పంచమవర్ణం. కాబట్టి ఈ నాలుగు వర్ణాలకు, ధర్మాలు నిర్ణయించారు. వాటికి అనుగుణంగానే ఉండాలి అనే చెప్పే తత్త్వం, సిద్ధాంతం ఏదైనా ఉంటే అది వైదిక దర్శనం. ఇందులో ఆధిక్య వర్ణాలు , తక్కువ వర్ణాలు అనేవి ఉంటాయి. కర్మసిద్ధాంతం, వైదిక మతం. వర్ణాశ్రమ ధర్మం. వీటి ప్రకారంగా జీవితాన్ని దర్శించడం. రెండవది బౌద్ధ ధర్మం. వీళ్ళు కొంచెం దీన్ని ఖండించారు. పునర్జన్మ ఉండదు. విగ్రహారాధన ఉండదు. జీవితంలో మంచి చెడు ఉంటుంది. నీవు ఉన్నంత కాలం ధర్మమయంగా సహప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి. ధర్మంగా ఉండాలి. అదే నీకు ఆత్మ తృప్తిని ఇస్తుంది. అత్యాశకు పోతే నష్టపోతావు. కాబట్టి నీవు ఎంత కోరికలు తగ్గించుకొంటే అంత మంచిది. కోరిక దుఃఖానికి కారణం- సంతృప్తికరంగా జీవిస్తే మంచిది. చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోవడం చాలా కీలకం అన్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడం జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. లుక్ అట్ ది థింగ్స్ వాట్ దే ఆర్. ఇది విపశ్యన దృష్టి. వస్తువు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ప్రకృతి అనేది బౌద్ధ దర్శనలో కీలకమైనది. ప్రకృతి ఎట్లా నడుస్తుందో అట్లా నడిస్తే శాంతిని పొందుతావు. ప్రకృతిని దర్శించి, అర్థం చేసుకున్నదే జ్ఞానం. దానితో సఖ్యత పెంచుకోవడం ద్వారానే జీవితానికి శాంతి, సార్థకత చేకూరుతుంది ఇది బౌద్ధ దర్శనం మూడోది హేతువాద దృష్టితో ఉండేది చారువాక దర్శనం – జీవితాన్ని ప్రత్యక్ష అనుభవం నుంచి దర్శించడం. ఏ పదార్థం శాశ్వతంగా ఉండదు. నశించక తప్పదు. అన్నీ నశిస్తాయి. ప్రపంచాన్ని సత్యప్రమాణాల నుంచి అర్థం చేసుకోవాలి. జీవితం జీవించటానికే. ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవించాలి. హేతుబద్ధంగా ఉండేదే చార్వాక దర్శనం. తరువాత ఆధునికకాలంలో ఆధునిక దృష్టితో వచ్చింది స్వభావ వాదం పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది. ప్రకృతిని అర్థంచేసుకొని ప్రకృతితో సఖ్యతతో జీవించడం. నీవు అర్థం చేసుకోవడంలోనూ, నీదైన ప్రయత్నంతోనూ ఉండాలి. నాచురల్ ఫిలాసఫి ఏదైతో ఉందో దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం – ప్రకృతి తత్వాన్ని దర్శించడం. జీవితానికి అన్వయించుకోవడం. జీవిత తత్త్వాన్ని స్వీకరించే సిద్ధాంతం. అది ఏ పదార్థం ఏదీ శాశ్వతంగా ఉండదు. తరువాత వచ్చిన సిద్ధాంతం మార్క్సిస్టు సిద్ధాంతం. ప్రపంచంమంతా విస్తరించిన సిద్ధాంతం.
అందరూ ఒకేరకంగా లేరు. అంతరాలు, అసమానతలు మనం సృష్టించుకున్నవే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావం సరైంది కాదు. ఈ లోకంలో ఏ వస్తువు కూడా అంతరించదు. అది రూపం మారుతుంది. మరణించిన తరువాత శరీరం కాలుతుంది. బూడిదవుతుంది. మట్టిలో మట్టిగా మారుతుంది. పరిణామమే శాశ్వతం. కాలిపోవచ్చు. పదార్థం మారుతుంది తప్పా అంతరించదు. పరిణామక్రమంలో మారుతుందే తప్పా నశించదు అంటుంది మార్క్సిస్టు సిద్ధాంతం. ఇది సైన్సుకు సంబంధించిన చలన సూత్రాలమీద నిర్మించబడింది. గతి తర్కం మీద ఆధారపడి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం గతి తార్కిక భౌతికవాదం. రెండోది చారిత్రక భౌతిక వాదం. చారిత్రక దృక్పథంతో చెప్పింది. కొందరు రాజులుంటారు. కొందరు పనిసేవారుంటారు. పనిచేసే వారి శ్రమమీదనే రాజులు బతుకుతారు, పనిచేయకుండా బతుకుతారు. రెండే తెగలు ఉంటాయి. ఒకటి ధనిక తరగతి, రెండవది శ్రామిక తరగతి. దీనికి వర్గం అని పేరు. క్లాస్ – వర్ణం కాకుండా వర్గం అనడం. వర్గ దృక్పథం. అన్ని దృక్పథాలను సమూలంగా మార్చివేసింది ఈ మార్క్సిస్టు తత్త్వం. మార్క్సిస్టు భావజాలంతో అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించాయి. మార్క్సిస్టు దృక్పథంలోంచే సాహిత్యాన్ని, కవిత్వాన్ని సృష్టించడం మొదలైంది. సమాజంలో వర్గాలుంటాయి, ఒక వర్గం పని చేస్తుంది. మరో వర్గం పనిని దోచుకుంటుంది. పని ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తుంది. సంపదగా మార్చుకుంటుంది. అసమానతలు సృష్టిస్తుంది. శ్రమదోపిడీ, అసమానతలు లేని సమ సమాజాన్ని స్థాపించడం మార్క్సిస్టు సిద్ధాంతం. సమాజంలోని వ్యత్యాసాలను పోరాటం ద్వారానే పోగొట్టగలం అని విశ్వసిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిస్టు దృక్పథానికి ఆదరణ ఏర్పడింది. ఈ దృక్పథం కవులకు ఇన్ స్పైరింగ్ గా ఉండేది. కాబట్టే కవిత్వం అట్లా వచ్చింది. ఈ సమసమాజ దృక్పథం ప్రపంచ భాషల్లో గొప్ప సాహిత్యం సృష్టించింది.
తర్వాత అంబేద్కర్ దృక్పథం అనేది వచ్చింది. అంబేద్కర్ వచ్చిన తర్వాత స్పష్టంగా ఏం చెప్పాడంటే వర్గం, వర్ణం వేరువేరు. కులం భారతదేశంలో కీలకమైంది. కులం పొమ్మంటే పోదు. కులం, వర్ణం అనేది సత్యం. ఈ సామాజిక వర్గీకరణ ఏదైతే ఉందో అది లోతుగా వేళ్లూనుకుని ఉన్నది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, దీనిద్వారా వెళ్ళినపుడు మనకు స్పష్టంగా అంతరాలు అర్థం అవుతాయి. భావోద్వేగాలు ఈ అంతరాలను అర్థం చేసుకొనేదాన్నిబట్టి ఏర్పడుతాయ. కుల వర్ణ దృక్పథం నుంచి సమాజాన్ని చూడటమే అంబేడ్కర్ దృక్పథం. ఈ అంబేడ్కర్ దృక్పథాన్ని తెలుగు సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో దళితవాద దృక్పథం అంటారు. ఈ దళితవాదంలో కులం ప్రధాన పాత్ర
వహిస్తుంది. కులం నేపథ్యంలో విషయాలూ అర్థం చేసుకోవడం, శ్రమను అర్థం చేసుకోవడం, శ్రమదోపిడీని అర్థం చేసుకోవడం, వివక్షను అర్థం చేసుకోవడం అంబేడ్కర్ తీసుకొచ్చిన ఆలోచన. అంబేడ్కర్ దృష్టికోణంలో వివక్ష అనేది చాలా కీలకం. ఈ అగ్రవర్ణాలు ఎప్పడూ వివక్ష పాటిస్తారు. వివక్ష, అణచివేత, ఈ అంతరాలు వీటన్నింటినీ చర్చించిన దృక్పథం. ఇది అంబేడ్కర్ ఆలోచనా విధానం. ఇది దళిత దృక్పథం. అట్లానే తదనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో వచ్చినది జెండర్ ఔట్లుక్. జెండర్ దృక్పథం. కేవలం వర్గంతో చూసినంత మాత్రాన అర్థం కాదు, కులంతో చూసినంత మాత్రానా అర్థం కాదు. జెండర్ అనేది కూడా ఉన్నది. కులం, వర్గం, వర్ణం ఈ మూడు కాక లోకంలో ఏముందంటే లింగ (జెండర్) వివక్ష. స్త్రీ పురుషుల మధ్యన అన్ని భేదాలతోపాటు ఈ జెండర్ వివక్ష కూడా ఉంది. దీన్ని జెండర్ సిద్ధాంతం, జెండర్ థియరీ అన్నారు. స్త్రీలు వర్గము వివక్షకు గురవుతున్నారు. స్త్రీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. సమాజాన్ని జెండర్లోంచి చూసేదే స్త్రీ వాదం అన్నారు. సార్త్రే ఏ వస్తువును సమగ్రంగా చూడడం సాధ్యం కాదు అని అన్నారు కదా. ఆ వస్తువును చూస్తున్నపుడు వ్యూ పాయింట్ అవసరం. ఏ పాయింట్ దగ్గర నుంచి చూసినపుడు ఆ వస్తువు అదే కోణంలో కనబడుతుంది. దాని అవతలి కోణం అర్థం కాదు. స్త్రీల అస్తిత్వ
వేదనను వారి కోణంలోంచే చూడాలి. అట్లా జెండర్ దృష్టికోణం నుంచి స్త్రీవాద కవిత్వం వచ్చింది. స్త్రీ ల బాధను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు స్త్రీ అయితే తప్ప అర్థం కాదు, స్త్రీ అయితే తప్ప రాయలేరు. దళితులైతే తప్ప దళితుల బాధ అర్థం కాదు, దళితులయితేనే ఆ బాధ రాయగలరు అనే వాదం వచ్చింది.
ఇక మైనారిటీ దృక్పథం – మైనారిటీ వాదం
తక్కువ మతస్తులైన వారి దృష్టి నుండి చూస్తే తప్ప మెజారిటీ మతం మైనారిటీవారిని అణచివేస్తున్న తీరు, దానిలో ఉన్న సమస్యలు తెలుసుకోలేము. ముస్లింలు అనుభవిస్తున్న వివక్ష నుంచి మైనారిటీ దృక్పథం వచ్చింది. ముస్లింల అస్తిత్వ సమస్యలను మైనారిటీ మతం చర్చిస్తుంది. ఇప్పటికీ సమాజం సమగ్రంగా అర్థమైందా అంటే ఇప్పటికీ సమగ్రంగా అర్థం అయినట్టు కాదు. తెలుగు సాహిత్యం పరిశీలించినట్లయితే మరో దృక్పథం ప్రాంతీయత, రీజనల్ ఔటులుక్, ప్రాంతీయ దృక్పథం. వర్ణము ఒక కోణం మాత్రమే చూపింది. వర్గం ఇంకో కోణం మాత్రమే అర్థం చేయించింది. కులం ఇంకో ఒక కోణాన్ని అర్థం చేయించింది. జెండర్ ఒక కోణాన్ని అర్థం చేయించింది. ఈ మైనారిటీ మెజారిటీ కూడా మరో కోణాన్నేఅర్థం చేయించింది. ప్రాంతీయ ఆధిపత్యం ప్రాంతీయ దృక్పథం తో చూసినపుడే అర్థం అవుతుంది. తెలంగాణవాదం ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని సృష్టించింది.
రీజనల్ దృష్టితో చూసినప్పుడే అభిృద్ధి అసమానతలు, వివక్ష ఆత్మగౌరవం అర్థమ వుతుంది. ముఖ్యంగా తెలంగాణవాదం, తెలంగాణ దృక్పథం ప్రాంతీయ అస్తిత్వ నిర్మాణంలో చాలా కీలకంగా పనిచేసింది. అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరు. అక్కడి పాలకులు ఇక్కడి పాలకులు వేరు వేరు. ఆధిపత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుందని అర్థమయింది. ఈ ఇద్దరి మధ్య అంతరాలు ఉంటాయని తెలిసింది. వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతం తేడాలుంటాయి. రెండు ప్రాంతాల అగ్రవర్ణాల నడుమ, రెండు ప్రాంతాల దళితుల నడుమ అంతరాలు ఉన్నాయని నిరూపణ అయింది. ఉదాహరణకు తెలుగు భాష. ఒకే భాష అయినా ఆధిపత్య ప్రాంతాలవారు మాట్లాడే భాష ఎక్కువ అని, ఈ వెనుకబడిన ప్రాంతంలోవారు మాట్లడే భాష తక్కువ అనే భావన వుంది. అది ఎక్కడిదాకా వచ్చిందంటే, ఇక్కడి ప్రజల భాషను అవమానించేదాకా పోయింది. అది తెలుగే కాదన్నారు. ప్రాంతీయ కవిత్వాన్ని ఆధిపత్య ప్రాంతంవారు శిల్పం లేదని కొట్టి పారేశారు. అంటే ఒక దృక్పథంతో ఉంటే తప్ప ఇన్ని కోణాల నుంచి చూస్తే తప్ప, సమగ్రంగా అర్థం కాదు. సార్త్రే అన్నట్టు కుడి నుంచి చూస్తే ఒక రకంగా కనపడుతుంది, ఎడమ నుంచి చూస్తే ఒక రకంగా కనబడుతుంది. పై నుండి చూస్తే ఒక తీరు. నేరుగా చూస్తే మరో తీరు. ఎట్లా చూసిన వస్తు సమగ్ర దర్శనం కాదు అనేది ఏదైతే ఉన్నదో దర్శన పద్ధతుల్లోకి ఇంకో కొత్తకోణం వచ్చింది. అదే ప్రాంతీయత. రకరకాల వివక్షలనేవి ఉన్నవి. మనం చూసే చూపులో ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే లోకం అనేటువంటిది ప్రశాంతంగా సౌందర్యంగా ఉండాలంటే వివక్షలు, అసమానతలు, అణచివేతలు పోయిప్పుడే సాధ్యమవుతుంది. ఒక ఫోటోగ్రాఫర్ దృష్టి అయినా ఒక కళాత్మక దృష్టి అయినా సాపేక్షకు, అందంగా ఉన్నదని నువ్వు చూసేది, దృష్టిని బట్టే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫోటోగ్రాఫర్ కనుక కళాత్మకంగా తీయకపోతే ఆ కోణం మనకు ఆవిష్కారం కాదు. ఒక ఫోటోగ్రాఫర్ ఒక గ్రామీణుడైతే అక్కడ గోడకు వేసిన జాజు రంగులో ఉన్న అందాన్ని చూడగలడు. నా చిన్నప్పుడు జాజు రంగును మట్టి గోడలకు వేసేవారు. ఈ జాజు రంగు కూడా అందాన్ని ఇస్తుందని ఎప్పడు తెలుస్తుంది అంటే, ఆ ప్రాంత గ్రామీణుడైతేనే ఇది తెలుస్తుంది. ఒక ప్రాంతీయ దృక్పథం, ఒక దళిత దృక్పథం. కిందిదాకా పోయి చూడగలిగినపుడు మాత్రమే, కింది దాకా సాహిత్యం వెళ్ళినపుడు మాత్రమే తెలుస్తుంది. అద్భుతమైన ఒక పువ్వునో, ఒక ఇంద్ర ధనస్సునో అందంగా భావిస్తారుగానీ మన తెలంగాణ గ్రామంలో ఉండేటువంటి జాజురంగు గోడ కూడా అందంగా ఉంటుందని ఆ ప్రాంతీయ ఫోటోగ్రాఫర్ అయినపుడు, భరత్ భూషణ్ వంటివాడు తీసినపుడు ఈ సాంస్కృతిక సౌందర్యం అర్థమవుతుంది.
బతుకమ్మ పండుగను ఒక పండుగనే కాదు అని అన్నవారు ఉన్నారు. అందులో ఏం సౌందర్యం ఉన్నదని అన్నవారు కూడా ఉన్నారు. తంగేడుపువ్వు అందంగా ఉంటుందా? గునుగు పువ్వు అందంగా ఉంటుందా? అందులో ఏ కళ ఉన్నదని అన్నారు. కానీ గునుగు పువ్వు, తంగేడు పువ్వులను కూడా అందంగా పేర్చవచ్చు, కళాత్మకంగా పేర్చవచ్చు అని చెప్పేదే ప్రాంతీయత. ప్రాంతీయ దృక్పథంతో సాంస్కృతిక భావోద్వేగంతో చూసినపుడు తంగేడు పువ్వు అందంగా కనిపిస్తుంది. అందుకే కళాకారుడు లోతుగా చూడాలన్నప్పుడు ఈ అన్ని దృక్పథాలను తెలుసుకొని ఉండాలి. ఈ కళాత్మకత ఏదైతే ఉన్నదో, ఈ సౌందర్య దృష్టి ఏదైతే ఉన్నదో చూసే దృష్టినిబట్టి మారిపోతుంటుంది. ఈ సౌందర్య దృష్టి లోతు గ్రహించగలిగి నప్పుడే ఆవిష్కారంచేసే శక్తి కవికి ఒనగూడుతుంది. కవితాత్మక కోణం నుండి ఆవిష్కరించాలి. కవికి కవితాత్మక దృష్టి ఉన్నప్పుడే ఇది వస్తుంది. అందుకే ఏది అందం అన్నప్పుడు, అందానికి ప్రమాణం ఏమిటి అన్నప్పుడు ఒక పెద్దాయన ఏమని నిర్వచించాడంటే ప్రమాణం అన్నప్పుడు మాటిమాటికి ఏదైతే చూడాలనిపిస్తుందో అది అందం అన్నాడు. అది పుష్పమే కావచ్చు, మాటి మాటికి నిన్ను ఆకర్షిస్తుందంటే, నువ్వు మరిచిపోలేనిది, నిన్ను వెంబడించేది ఏదైతే ఉన్నదో అదే అందం. నేను అందంగా లేనా అని అంటే అది అందం కావచ్చు, కాక పోవచ్చు. ఇప్పుడు అందానికి కూడా కొలతలు వచ్చినవి. ప్రపంచంలోనే ఇవాళ అందానికి కొలతలు వచ్చింది మనం చూస్తున్నాం. కొలతలతో అందాన్ని నిర్వచిస్తున్న పద్ధతి వచ్చింది. కానీ నిజమైన కళాకారుడు కొలతలతో అందాన్ని నిర్దేశించడు, చూడడు, కొలతలతో చెక్కిన శిల్పం అతిలోక సౌందర్యమే, అది మాట్లాడకపోతే, నవ్వకపోతే నిజమైన అందాన్ని చూడలేము. నిజమైన భావోద్వేగం కలగదు. నిజమే. శిల్పము అందమైనదే. శిల్పి గొప్పవాడే. జీవకళ లేకపోతే అది ఆకర్షించదు. రంభను మనం చూడలేదు. ఊర్వశిని మనం చూడలేదు. ఊర్వశిని, రంభను అందంగా చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలతో మనకు తెలిసింది వారు అందంగా ఉన్నారని. అందానికి ప్రతీకగా ఉన్నారు. నవ్వకపోతే, ఏడ్వకపోతే, భావోద్వేగాలు లేకపోతే,ఈ రసాత్మకత, ఔచిత్య గుణాది పద్ధతులు లేకపోతే శిల్పం కంటే మనిషి గొప్ప అని ఒప్పించలేము. గురజాడ కొయ్యబొమ్మను మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నాడు. నిజమైన కళాత్మకత ఎక్కడ ఉంటుందంటే జీవితంలో ఉంటుంది ప్రాణంలో ఉంటుంది.
శిల్పం యొక్క గొప్పతనం ఎంత కాలం రాస్తారు, ఎంత రాసినా తరగిపోని జీవన సౌందర్యం బతుకులో ఉన్నది. ఒకరిని పోలి ఇంకొకరు ఉండరు. ఒకరు నవ్వినట్టు ఇంకొకరు నవ్వరు. కవి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఆ వస్తువును దర్శిస్తాడు అప్పుడే వర్ణిస్తాడు. కవి దృష్టి బలమైందా కాదా అనే చర్చా మళ్ళీ కాలం మీద ఆధారపడి ఉంటుంది. పాత ఉపమానాలతో అందం బోధపడే అవకాశం లేదు. ప్రాచీన కవిసమయాలు అందాన్ని వర్ణించలేకపోవచ్చు. కవిత్వం ఎప్పటికప్పుడు నిత్యనూతనం అన్నారు. పర్వతాలు ఎత్తైన ఆకాశాన్ని ముద్దుపెట్టుకుంటున్నవని అన్నారు. ఈ మాట మనకు చాలా పాతది. ఇదే విషయాన్ని కాళిదాసు ఎప్పుడో చెప్పాడు. అలకాపురి పట్టణంలో ఉండేటటువంటి సౌధాలు ఎత్తయినవి అ సౌధాలు ఆకాశాన్ని ముద్దు పెట్టుకొంటున్నాయని కవి వర్ణించాడు. ఎత్తులో ఉంటాయి. అంటే ఇక్కడ ప్రేమను చెప్పడం. రెండవది అంత ఎత్తుగా ఉన్నవని చెప్పడం చెప్పవచ్చు. అట్లాగే పర్వతాన్ని మరొక వ్యక్తి వర్ణించేప్పుడు ఊహ మారిపోవచ్చు. ఒక సంస్కృత అలంకారికుడు పర్వతాలు దుఃఖిస్తున్నాయి. ఎందుకు దుఃఖిస్తున్నాయని వర్ణించాడు. భూమిలాగా పరుచుకొని లేనందుకు, ఆకాశంలాగా ఎత్తుగా లేనందుకు దుఃఖిస్తున్నాయి. అంటే పర్వతాన్ని చూశాడు. గొప్పగా ఆవిష్కరించాడు. శ్రీశ్రీ పర్వతాన్ని వర్ణించవలసి వస్తే, విశాఖపట్టణంలోని పర్వతాన్ని వర్ణించినపుడు కరికళేబరంవలె కదలకుండా ఉన్నది కొండ అన్నాడు. ఏనుగు చనిపోతే కళేబరం పడిపోతే ఎట్లా ఉంటుందో పర్వతం అట్లా ఉన్నది అనడం. చూడడమే, దర్శనమే. పోయెటిక్ విజన్. ఇది అందరిలో ఉంటుంది. ఇన్నిరకాల తేడాలు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి వీటిని దర్శించగలగడం. ప్రతి వస్తువును ఆ కాలానికి అనుగుణంగా, మన దృక్పథానికి అనుగుణంగా స్వీకరించి, దర్శించినపుడు వ్యక్తీకరించినప్పుడు అది ఎక్కువ రాణించడానికి ఇతరులను ఆకర్షించడానికి అవకాశమున్నది. కవికి తప్పనిసరిగా ఊహా దృష్టి ఉండాలి. ఏ కవైనా గొప్ప కవి కాదలచు కున్నప్పుడు తప్పనిసరిగా గొప్ప దృష్టి ఉండాలి. ఈ విధమైన గొప్ప దృష్టి లేకపోతే, ఒక మహత్తరమైన దృష్టి లేకపోతే గొప్ప కవిగా అతను వెలుగలేడు. గొప్ప తత్వ దర్శనం ఉన్నప్పుడు మాత్రమే, భౌతిక దర్శనంతో తత్వ దర్శనం, కళా దర్శనం జోడించి చూసినప్పుడే ఆ వస్తువు తత్త్వాన్ని, స్వభావాన్ని మొత్తం గుర్తించగలుగుతాడు. కళాత్మకంగా ఆవిష్కరించగలుగుతాడు. ఆ ఉత్తమోత్తమమైన దర్శనం ఉత్తమ సాహిత్యం సృష్టించ గలుగుతుంది.
కరోనా మీద వేల కవితలు వచ్చినవి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలలో వచ్చినవి. కానీ కరోనామీద ఎవరి ప్రత్యేకతతో వారు రాశారు. దర్శనం ఎట్లా ఉంటుందో, ఎట్లా చూడగలమో అట్లా రాశారు. ఎంత గొప్పగా, లోతుగా, భిన్నంగా, కొత్తగా చూడగలమో అట్లా కావ్యాన్ని రచించాలంటే గొప్పతత్త్వదర్శనం ఉండాలి, దర్శనం, దృక్పథం రెండూ ఉన్నప్పుడు కవిత్వానికి ఎక్కువ సొగసు, శక్తి, బలం రావటానికి అవకాశమున్నది, ఈ ఆలోచనలు కొన్ని నావి, కొన్ని ఇతరులవి కలిపి ఈ విషయాలన్నీ ఒక్క దగ్గరగా చేర్చి మీ ముందు ఉంచడానికి నాకు ఒక అవకాశం కలిగింది. దీనిమూలంగా నేను ఇపుడు ప్రత్యేకంగా చాలా చదివాను. ఇది చాలా కీలకమైన అంశమే గాని చాలా తక్కువ మ్యాటర్ ఉన్నది. అట్లా చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న అంశంగా భావిస్తున్నాను. కవులు ఈ భావుకత్వ దృష్టిని కళాత్మక దృష్టిని అలవరచుకుంటారని కోరుకుంటున్నాను.
-నందిని సిధారెడ్డి