మాదాడి నారాయణ రెడ్డి (మానారె) ఇదీ నీ బాట కవిత కవిత్వం ఓ విశ్లేషణా
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలంనుండి జాలువారిన ఇదీ నీ బాట కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇదీ నీ బాట కవిత చదివాను.చాలా బాగుంది.నన్ను ఆలోచింప జేసింది.ఇదీ నీ బాట ఏమిటి?ఆంగ్లంలో This is the path అంటారు.తెలుగులో నీవు నడవవల్సిన దారి అని అర్థం.నారాయణ రెడ్డి (మానారె) తెలుగు భాషా ఉపన్యాసకులుగా మరియు ప్రిన్సిపల్ గా కళాశాలలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. అట్లా వివిధ రకాల అనుభవాలతో సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తి ఎలా నడుచుకోవాలో ఇదీ నీ బాట కవిత ద్వారా మార్గ నిర్దేశం చేశారు. విద్యార్థులకు విద్యను అందించిన గురువుగా తన జీవితానుభవం నుండి రాసినట్లుగా తోస్తోంది. ఆనాటి గురువులకు విద్యాబోధన మరియు విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడం తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు.నారాయణరెడ్డి (మానారె)చిన్నతనంలో గురువుల వద్ద నేర్చుకొని గురువుగా ఎదిగిన తీరు పరిశీలించినట్లయితే ఇదీ నీ బాట కవితలో పంచుకున్న భావాలు హృదయం నుండి చీల్చుకు వచ్చినట్లుగా తోస్తోంది. నారాయణరెడ్డి (మానారె) డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆణిముత్యాల్లాంటి ప్రాచీన ఇతిహాసాలైన ఆదికావ్యం రామాయణం,మహాభారతం వంటి మరెన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తున్నారు. ఇవ్వాళ మంచి చెప్పేవాళ్లు అరుదుగా ఉంటారు. నారాయణ రెడ్డి ఇప్పటికి మంచితనం తన గుండెల్లో నింపుకుని ఇదీ నీ బాట కవిత ద్వారా సందేశాత్మక బోధ చేస్తున్నారు.ఈ కవిత 1982 సంవత్సరంలో స్పందన కవితా సంపుటిలో వచ్చింది.ఇదీ నీ బాట కవిత రాసి 40 సంవత్సరాలు పూర్తి అయింది. అయినప్పటికి కవితలోని భావాలు సమాజంలో జరుగుతున్న వికృత ధోరణుల తీరుకు అద్దం పట్టినట్టుగా ఉంది.బోధ ఎవరు చేస్తారు?గురువులు బోధ చేస్తారు.నేను ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,1985-1986 సంవత్సరంలో బికాం డిగ్రీ చదువుతున్నప్పుడు నారాయణ రెడ్డి సారు నాకు తెలుగును బోధించారు.నా గురువు రాసిన కవితను విశ్లేషించడం ఆనందంగా ఉంది.ఇదీ నీ బాట ప్రతి ఒక్కరు చదవాల్సిన కవిత.సమాజం ఎటు పోతుంది?ఈనాటి సమాజానికి సరియైన దారి చూపడంలో ఇదీ నీ బాట కవిత ఉపకరిస్తుంది.
“లేలేత కొమ్మల్ని చిదుమకు/పూచిన పువ్వుల్ని నలుపకు/స్నిగ్ధ ముగ్ధ హృదయాలలో/చిచ్చు పెచ్చుగా రగిలించకు/అంటున్నారు.జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మరియు ఆహారం మొక్కల నుంచి లభిస్తుంది.మొక్కలతో చదువు నేర్చుకుంటున్న విద్యార్థులను పోల్చడం బాగుంది.మొక్కల ఎదుగుదలకు లేలేత కొమ్మలు కూడా అవసరం.అట్లాంటి ఎదుగుతున్న లేలేత కొమ్మల్ని గోరుతో చిదిమి వేయడం,చేతితో విరిచి వేయడం జరుగుతున్నది.మొక్కలకు ప్రాణం కొమ్మలు.కొమ్మలు ఉంటేనే ఆ మొక్క శాఖోప శాఖలుగా విస్తరించి మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందరికో నీడనిస్తుంది.ఎన్నో పక్షులు గూడు కట్టుకుని ఉంటాయి.ఎందరో మనుషులు చెట్టు నీడన సేద తీరుతారు.లేలేత కొమ్మల్లా ఎదుగుతున్న పిల్లలను కాపాడుకోవాలి.ఆ పిల్లలు సన్మార్గంలో నడుచుకునేలా తీర్చిదిద్దాలి.పువ్వు సాధారణంగా ఆకుల చివరలలో అభివృద్ధి చెందుతుంది.ఆకులు పునరుత్పత్తి పనితీరును కలిగి ఉంటాయి.ఈ నిర్మాణాలన్నింటిని ఆంథోపిల్స్ అంటారు. పువ్వులను మనం పవిత్రంగా చూస్తాం.దేవుని వద్దకు మనం ఖాళీ చేతులతో వెళ్లకుండా పూలమాల తయారు చేసుకుని వెళతాం.దేవుని విగ్రహానికి పూలమాల వేస్తాం.దేవుని ఆశీస్సులు కావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తాం.ప్రేమికులు తమ ప్రియురాలికి గులాబీ పువ్వులు అందించి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.పువ్వులను స్త్రీలు తమ కేశాల్లో కొప్పుల్లో అలంకరించు కుంటారు.పూలు పెట్టుకోవడం ద్వారా స్త్రీల అందం ఇంకా ఇనుమడిస్తుంది.పూచిన పువ్వులతో కూడిన చెట్టు ఎంతో అందంగా ఉంటుంది.పూలు కూడా ఉదయాన్నే పూస్తాయి.సాయంత్రానికి పూలు వాడిపోతాయి.రాలిపోయే పువ్వు అయినప్పటికి ఉన్నంత సేపు పరిమళాన్ని వెదజల్లుతుంది.పూల మీద వాలి తుమ్మెదలు,సీతాకోకచిలుకలు తేనెను త్రాగుతాయి.చిన్నచిన్న పక్షులు కూడా పూలలోని తేనెను ఆస్వాదిస్తాయి.పూచిన పువ్వులను నలపకు అంటే పూలలా సున్నితంగా ఉన్న హృదయాలు కల విద్యార్థులను పాడు చేయకుమని చెబుతున్నారు. పూలను చూసినట్లుగా పిల్లలను చూడాలి.పిల్లలు కూడా పూల లాగా మృదువుగా,స్వచ్ఛంగా ఉంటారు.పూరేకులాంటి పిల్లల హృదయాలు ఎప్పటికి తేటగా ఉంటాయి.పిల్లలు దేవుడు చల్లని వారే కల్లా కపటం ఎరుగని కరుణామయులే అని పిల్లలను కరుణామయుడైన దేవునితో సినీ గీతంలో పోల్చబడింది.దేవుని రాజ్యంలో ప్రవేశం పిల్లలకే ఉంది అని బైబిల్ లో వ్రాయబడి ఉంది.పిల్లల హృదయాలు సున్నితమైనవి.స్వచ్ఛమైనవి. పిల్లలను చూడగానే ముచ్చటేస్తుంది.అటువంటి అపురూపమైన పిల్లల హృదయాలలో వారి స్వచ్ఛమైన మనస్సులలో ద్వేషాగ్నిని రగుల్కొల్పి పెనుమంటగా జ్వలింపజేసి సమాజానికి ద్రోహం చేసే వారిగా పురికొల్పవద్దు.పిల్లలు ఇప్పుడిప్పడే మంచితనంతో మానవత్వంతో ఎదుగుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగించవద్దు.పిల్లల సున్నితమైన స్పటికంలాంటి హృదయాలను మంచితనానికి మారుపేరుగా తీర్చిదిద్దాలి.పిల్లలు సన్మార్గంలో నడిచేలా ప్రేరణను అందించాలి.భగత్ సింగ్ చిన్నతనంలో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నారు.23 సంవత్సరాల వయసులో దేశం కొరకు ఉరి కొయ్యకు వేలాడారు. భగత్ సింగ్ దేశానికి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో,స్ఫూర్తితో దేశం కొరకు ప్రాణాలు అర్పించారు.భారత దేశ ప్రజల హృదయాల్లో మరువ రాని వీరుడిగా నిలిచిపోయాడు.ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ కొత్తగా ఉంటుంది.ఈ దేశంలో పెరుగుతున్న బాలలు అందరు గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు.అట్టి పిల్లల మనస్సులను కలుషితం చేయవద్దు అని కవి నారాయణరెడ్డి (మానారె) పిలుపునిస్తున్నారు.

“అమృతాంతరంగాలలో/హాలాహలం చిందించకు/
“పాలవెల్లి లాంటి పసి మనసులో/సంక్షోభపు సందడి కలిగించకు/అంటున్నారు.అంతరంగం అంటే మనస్సు యొక్క శక్తి.అట్టి అంతరంగంలోని శక్తి వల్ల మంచి చెడు స్పష్టంగా తెలుస్తుంది.అంతరంగం అనేది మనస్సులో జ్ఞాపకాల జ్ఞానాన్ని కలిగించే శక్తి. అంతరంగంలో నిలిచియున్న ఆత్మ ఎన్నటికి నాశనం కాదు.క్షీరసాగర మధనం : దుర్వాసముని శాపం కారణంగా సమస్త సంపదలు కోల్పోయినారు. దేవతలు దేవదానవ యుద్ధంలో రాక్షసులను గెలువలేక పోతున్నారు.ఆప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువును శరణు వేడుతారు.దేవతలు అసురులతో సఖ్యంగా ఉండాలి.దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని సూచిస్తాడు.అప్పుడు దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా,సర్పమైన వాసుకిని తాడుగా చేసుకుని, పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెడతారు.ఈ క్షీరసాగర మధనంలో అనేక అపురూపమైన వస్తువులతో పాటు హాలాహలం కూడా ఉద్భవించింది.అట్టి హాలాహలం నుండి దేవ, రాక్షసులను మరియు ముల్లోకాలను కాపాడటానికి శివుడు హాలాహలంను మింగి తన కంఠంలోనే ఉంచుకున్నాడు.అందుకే శివునకు గరళకంఠుడు లేదా నీలకంఠుడు అనే పేరు వచ్చింది.హాలాహలం ప్రాణాలు తీసే విషం వంటిది.అమృతంతో కూడిన అంతరంగాలు కలిగిన లేలేత చిన్నారుల మనస్సులలో హాలాహలం లాంటి విష బీజాలు నాటకు.ఎదుగుతున్న చిన్నారుల మనస్సు అమృతతుల్యమైనది.పాలవెల్లి అంటే పాల సముద్రము అని అర్థమవుతుంది.పాల సముద్రంలా తేటగా ఉన్న ఆ చిన్నారులకు లోకంలోని కుటిలత్వం అంటే ఏమీ తెలియదు.చిన్నారులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారకుండా చూడాలి.చిన్నారులు హింసా మార్గం వైపు అడుగులు వేయడం ప్రమాదకరమైనది.చిన్నారులను విధ్వంసకులు కాకుండా కాపాడుకోవాలి.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సముద్రంలో ఏర్పడిన అలల తాకిడి శ్రుతి మించి తుఫానుగా మారి సునామీ లాంటి విపత్తులకు మూలం కావడం మనకు తెలుసు.జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్నారులు అలజడులను సృష్టించడానికి ఆటంకవాదానికి లోనై సునామీ సృష్టించిన సముద్రమును పోలివుంటే సమాజానికి అపార నష్టం కలుగుతుంది.విపత్తుల వల్ల లేలేత చిన్నారుల జీవితం అధర్మ మార్గాన్ని అనుసరించి, అస్తవ్యస్తం,అల్లకల్లోలం కాకుండా కాపాడుకోవాలి అని కవి నారాయణ రెడ్డి (మానారె) బోధ చేస్తున్నారు.
“నెయ్యం తియ్యం కోరే వారికి/కత్తులతో పొత్తును గూర్చకు/కుత్తుక నెత్తురు దాహం కోరే/నినాదాల మత్తెక్కించకు/అంటున్నారు.నెయ్యం అంటే స్నేహం, రక్తసంబంధం కానిది.స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు.నెయ్యం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోను,పరులందరు తన వారే అనే భావన.ఆంగ్లంలో నెయ్యం అంటే To be kind or loving అని అర్థమవుతుంది.స్నేహ వర్షాన్ని కురిపిస్తూ అందరి క్షేమాన్ని కోరే మంచి మనసు కల చిన్నారులకు విధ్వంసాన్ని కోరే వారితో,హింసను రేకెత్తిస్తూ కత్తులు వాడే సంఘ విద్రోహులతో పొత్తులు కూర్చవద్దని కవి నారాయణరెడ్డి కోరుతున్నారు.సాటి మనిషిని చంపి రాక్షసానందాన్ని పొందే వారిలో చిన్నారులు జమ కాకూడదు.హింసా మార్గంలో నడుస్తున్న వాళ్ళతో చిన్నారులు కలిసి ఉండడం తగదు.హింసా మార్గంలో నడిచే వాళ్ళు కత్తులతో కొట్లాడుతారు.అట్లాంటి వారి సావాసం వల్ల చిన్నారులు హింస వైపు సాగుతారు.సాటి మనిషిని చంపి నెత్తురుతో కోర్కెలు తీర్చుకోకు అంటున్నారు.నినాదం అంటే ఆంగ్లంలో Slogan or Motto.నినాదం అంటే ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య.ఒక వ్యక్తి సంఘం,సంస్థ లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేషమైన ఉద్దేశం.ఉద్యమాలు, మతపరమైన సంఘర్షణలు రాజకీయ పార్టీ వాళ్లు నినాదాల పేరిట ప్రభావితం చేస్తుంటారు.చిన్నారుల హృదయాలలో మతం సాకు చూపి కొందరు, ఉద్యమాల పేరిట కొందరు,రాజకీయ నాయకులు అధికారం పేరిట వాళ్ల స్వార్థం కోసమే చిన్నారులను పావులుగా వాడుకుంటున్నారు.నినాదాల మాయలో పడి చిన్నారులు చదువుకు దూరం అవుతారు. చిన్నారులు తప్పుడు మార్గంలోకి వెళ్ల వద్దు అని చెబుతున్నారు.చిన్నారుల జీవితాలను కలుషితం చేయవద్దని హితవు పలుకుతున్నారు.పిల్లలు నినాదాల మాయలో పడి చదువు అనే సంకల్పం నుండి దూరం అవుతున్నారు అని కవి నారాయణ రెడ్డి(మానారె) ఆవేదన చెందుతున్నారు.
“మానవతా వాదంతో/మారణ హోమం తలపెట్టకు/
జనోద్దరణ పేరు చెప్పి/జన నాశం చేపట్టకు/ అంటున్నారు.మానవతా వాదం నీతి తత్వములకు సంబంధించిన ఒక విశాలమైన మార్గం.మానవతా వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. మానవతా వాదం ఒక తత్వంగానో,మతం గానో పరిగణిస్తే దానిలో ఉన్న సహజత్వం ఔన్నత్యం లోపిస్తాయి.మానవతా వాదం ఒక జీవన దృక్పథం.మానవతా వాదానికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ మానవ వికాసానికి దోహదం చేస్తుంది. సత్యం కోసం,జ్ఞానం కోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు.హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తిని పరిమితులను సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.మంచి,చెడుల్ని విశ్లేషించగలుగుతాడు.ఏ సమాజమైన అభివృద్ధి చెందడానికి నీతి ఉండాలి.నీతికి పునాది మానవ స్వభావంలోనే ఉంటుంది.మనిషి నీతికి కట్టుబడి ఉండాలి.మనిషి దైవానికి,ప్రభుత్వానికి,చట్టానికి నీతిగా ఉండే విషయంలో ఏ మాత్రం భయపడ కూడదు.మానవత్వం యొక్క ఉత్తమ లక్షణం సహనం.మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది.మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాలకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి అని చెప్పుకోవాలి.మానవతా వాదంలో ప్రేమకి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.మానవులు పరస్పర అవగాహన,సహానుభూతుల నుంచి ఉద్భవించేది ప్రేమ.ప్రేమ మనిషిలోని ఆటవిక ప్రవృత్తిని నాశనం చేస్తుంది.ప్రేమ స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.మానవతా వాదం ఐక్యతను ప్రసాదిస్తుంది.స్వేచ్ఛ, జ్ఞానం,నీతి కోసం హేతువు,ఐక్యత ఉండాలి.ఐక్యత సహనం వల్ల కలుగుతుంది. మానవులు దయతో వ్యవహరించడం వల్ల ఇతర మానవుల బాధలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.నీతిమంతులు, పరోపకార పరాయణులు,ధార్మికులు మానవత్వంతో తోటి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి సహాయం అందించడం జరుగుతుంది.మానవతా వాదం పేరిట కొందరు మారణ హోమం సృష్టిస్తున్నారు.మన దేశంలో నివసించే ప్రజలంతా వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలి.అన్ని మతాలను ప్రేమించాలి.నీ మతం గొప్పది నా మతం గొప్పది అనే భేదాభిప్రాయాలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు.ఈ దారుణ మారణ హోమంలో సామాన్యుల జీవితాలకు భద్రత లేకుండా పోతున్నది.హింస వైపు అడుగులు వేయడం వల్ల అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ దారుణ మారణ కాండను ఆపాలని కవి ప్రబోధిస్తున్నారు.జనోద్దరణ పేరు చెప్పి జననాశం చేపట్టకు.ఇవ్వాల జనాలను ఉద్ధరిస్తున్నామని చెబుతూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ ప్రజలకు తాయిలాలు అందిస్తామని మోసం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.ప్రజల్లో విభేదాలు ఏర్పడి ప్రజలు ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి జననాశనం జరగకూడదని కవి నారాయణరెడ్డి(మానారె) తమ కవితలోని భావాల ద్వారా వ్యక్తీకరిస్తున్నారు.
“మంచిని మనసా కోరే పెద్దల/అభివృద్ధి నిరోధకులుగా ఎంచకు/కసితో కల్లోలం పుట్టించే కపటుల/అభివృద్ధి మార్గ వారధులుగా భావించకు/
అంటున్నారు.మంచిని మనసారా ఆచరించమని కోరే పెద్దలు అరుదుగా ఉంటారు.అట్లాంటి పెద్దలు నడుస్తున్న బాటలోనే మనం సాగాలి.మంచి చెప్పే పెద్దలను,సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే వాళ్లను గౌరవించాలి.అట్లాంటి వెలుగులు చూపించే వాళ్లను అభివృద్ధి నిరోధకులుగా భావించకు అని హితవు చెబుతున్నారు.కొందరు ఇవ్వాళ సమాజంలో కసితో కల్లోలం పుట్టించే కపటులు ఎక్కడ చూసినా మనకు అగుపిస్తారు.ఆ కపటుల మాయలో పడ కూడదు. కపటులు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ వంచన మార్గంలో పయనిస్తున్నారు.అట్లాంటి కపటుల జోలికి వెళ్ళవద్దు అని చెబుతున్నారు.కవి నారాయణ రెడ్డి (మానారె) భావం చక్కగా ఉంది.
“పడి కట్టు మాటల ప్రవాహంలో పడకు/పండంటి జీవితాన్ని కుళ్ళి పోనీయకు/గతాన్ని స్మరించి ఆ గతాన్ని ఊహించి/వర్తమానం లో బంగారు బాట వేసుకో/అంటున్నారు.సమాజంలో కొందరు మాటల మాంత్రికులు ఉంటారు.అట్లాంటి మాటల మాంత్రికులు మాయ చేసి గొప్ప గొప్ప మాటలు చెబుతారు.అట్లాంటి కపట మాంత్రికుల వలలో చిక్క వద్దు.ఆ మాయావుల వల్ల చిన్నారుల పండంటి జీవితం పాడైపోతుంది. గతంలో ఏం జరిగింది? చిన్నారులకు తెలుసు.ఆ గతాన్ని ఊహించి వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి.నడుస్తున్న కాలం,వర్తమాన కాలం.వర్తమాన కాలంలో సరిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.బంగారు బాట వేసుకోవాలి.ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతో మెదలాలి.చిన్నారుల మనస్సులో ఏం జరుగుతుంది? చిన్నారులు సరిగా ఆలోచిస్తే తెలుస్తుంది.అలాంటి మనస్సును పక్కదారి పట్టించే దుర్మార్గుల మాయ మాటలకు లొంగకుండా సరైన మార్గంలో పయనించాలి అని కవి నారాయణరెడ్డి (మానారె)సందేశాత్మక ప్రబోధం చేస్తున్నారు.ఇది అందరికి ఆచరణీయమైనది.ఇవాళ సమాజానికి అవసరమైన విషయాలను చెబుతూ చిన్నారుల జీవితాలు భావి తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా చేస్తున్న ప్రయత్నంలో కవి సఫలమయ్యారు.ఇదీ నీ బాట ఈనాటి చిన్నారులకు, యువతకు,పెద్దలకు అందరికి ప్రేరణగా నిలుస్తుంది.కవి నారాయణరెడ్డి (మానారె) మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

8 comments
https://shorturl.fm/2vCDr
https://shorturl.fm/qLg8y
https://shorturl.fm/nLUET
https://shorturl.fm/5Y3J3
https://shorturl.fm/NdQI3
https://shorturl.fm/j430W
https://shorturl.fm/GiFB6
https://shorturl.fm/7rlET