Home వ్యాసాలు కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

మానస చామర్తి పంచుకున్న పుస్తకం కవిత
అనుభూతి కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవయిత్రి,మానస చామర్తి కలం నుండి జాలువారిన పంచుకున్న పుస్తకం కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇది కేవలం ఒక పుస్తకం గురించి చెప్పడం కాదు.తాను పొందిన అనుభూతులను పంచుకోవడం,స్నేహ సంబంధాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంది.ఇది ఒక వ్యక్తి తనకు నచ్చిన వారితో పుస్తకాన్ని పంచుకోవడాన్ని తెలుపుతుంది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాన్ని ఇతరులతో పంచుకుంటే చెప్పలేనంత హాయిగా ఉంటుంది.ఈ కవిత భావోద్వేగాలతో కూడి హృదయాన్ని తట్టి లేపుతుంది.ఇది పుస్తకాన్ని గురించి మాత్రమే కాకుండా ఆ పుస్తకం కలిగించిన అనుభూతుల్ని,తన ఎదలో కలిగిన భావాలను,జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఏర్పడే తృప్తిని గుర్తు చేస్తుంది.
“ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం/గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని మిగిల్చి/ఇష్టమైన వాళ్ల కోసం ఇంటికి తేవడం లాంటిది/అంటున్నారు.పుస్తకం చదివిన తర్వాత మనసులో ఒక చెప్పలేని అనుభూతి కలుగుతుంది.అందులోని విజ్ఞానాన్ని,ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి అనే ఆకాంక్షను కలిగిస్తుంది.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకాన్ని ఆ వ్యక్తి ఎంతో ఇష్టంగా చదివి,ఆస్వాదించి,విలువైనదిగా భావించి మనతో పంచుకుంటున్నాడు.అతను పుస్తకం చదివిన తర్వాత తనలో కలిగిన అనుభూతిని ఇతరులతో పంచుకోవడం సామాన్యమైన విషయం కాదు.అది అసాధారణమైన పుస్తకం అయి ఉంటుంది.ఒకరు చదివిన పుస్తకాన్ని మనకు ఎందుకు ఇస్తాడు? అందులో ఏదో మతలబు ఉంది.ఆ పుస్తకంలోని సంగతులు ఏమిటో తెలుసుకోవాలి అనే కుతూహలం కలగడం సహజమే.అది కేవలం పుస్తకం కాదు ఆ వ్యక్తి మనసుకు నచ్చిన దానిని తాను ఇతరులతో పంచుకోవడాన్ని తెలుపుతుంది.
ఒకరు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదంలో కొంత భాగాన్ని ప్రియమైన వారి కోసం తీసుకువెళ్లడం,వారి పట్ల గల ప్రేమకు,శ్రద్ధకు నిదర్శనమని చెప్పవచ్చు. దేవుని ప్రసాదం తింటే పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు.దేవాలయంలో ప్రసాదం అందించినప్పుడు దానిలో కొంత భాగం తినకుండా మనకు నచ్చిన వారి కోసం ఇంటికి తీసుకురావడం, ఇది ఒక ఆదరణ,అనుబంధానికి సూచికగా భావిస్తారు.అలాగే పుస్తకాన్ని చదివిన వారు దానిని మరొకరికి ఇవ్వడం కూడా ఆ పుస్తకంలోని ఆనందాన్ని,విలువను పంచుకోవాలన్న వారి మంచి సహృదయతను సూచిస్తుంది.ఒకరు చదివిన పుస్తకాన్ని మనతో పంచుకోవడంలో వారు దానిని ఎంతో విలువైనదిగా భావించి,మనకు అదే ఆనందాన్ని పంచాలి అనే ప్రయత్నం కనిపిస్తుంది. అది ఒక ఆత్మీయతను,ఆదరణను,మానవ సంబంధాలలోని ప్రేమను కనబరిచే స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది.తాను చదివిన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని సూచిస్తుంది.మన భారతీయ సంస్కృతిలోని పంచుకోవడం అనే సాంస్కృతిక విలువను నొక్కి చెబుతోంది.ఒకరు తాను అనుభవించి దాని సారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది ప్రేమను, అనురాగాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో పుస్తకాన్ని పంచుకోవడాన్ని,గుడిలో పెట్టిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వచ్చి పంచుకోవడాన్ని పవిత్రమైనదిగా భావించారు.ఇందులో పంచుకోవాలి అనే గొప్ప మనసు,ప్రేమ వంటి భావాలను సున్నితంగా హృద్యంగా చెప్పిన తీరు బాగుంది.
“తోక చుక్క రాలి పడుతుంటే/పక్కనున్న వాళ్ళని తట్టి చూపించడం లాంటిది/అంటున్నారు. ఆకాశంలో ఒక అద్భుతమైన,అరుదైన సంఘటన జరుగుతోంది.విశాల విశ్వంలో తోకచుక్క ఒక అద్భుత విశేషం.మనం ప్రపంచంలో జరిగిన ఒక అద్భుతాన్ని గుర్తించి చూసిన వెంటనే పక్క వాళ్ళకి చూపించాలి,వారితో పంచుకోవాలి అనే తహతహ, సహజమైన అనుభూతి, ఉత్సాహాం ఇందులో కనిపిస్తుంది.ఆకాశంలోని అద్భుతమైన దృశ్యాన్ని చూడటమే కాక గొప్ప క్షణాల్ని పక్కవారితో కూడా పంచుకోవాలి అనే మనిషిలోని ఆతృతను తెలియజేస్తుంది.అనంతమైన ఆకాశంలో వేనవేన చుక్కలు కనిపిస్తాయి.తోక చుక్క ఆకాశంలో అరుదుగానే కనిపిస్తుంది.ఆ తోకచుక్క రాలి పడుతుండగా చూడడం,ఒక వింత అనుభూతి. అటువంటి గొప్ప అనుభూతిని ఒంటరిగా కాకుండా పక్కవారితో పంచుకోవాలి అనిపిస్తుంది కదా?అదే భావన పుస్తకం చదివినప్పుడు కలుగుతుందని చెప్పడం గొప్పగా ఉంది.
“దూరాలనున్న ప్రేమికులు ఫోన్ లో కబుర్లాడుకుంటూ/చందమామను ఇప్పుడే చూడమని/గుసగుసలాడడం లాంటిది/ అంటున్నారు.ఈ కవితా పంక్తులు దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ఉండే భావోద్వేగాన్ని తెలుపుతుంది.వారు ఒకే చోట లేకపోయినా ఒకే సమయంలో ఆకాశంలోని చందమామను చూస్తూ భావోద్వేగాలను పంచుకుంటారు.ఇది వారి మధ్య గల అనుబంధానికి సంకేతం.ప్రేమికులు దూరంగా ఉన్నా ఫోన్ లో మాట్లాడటం వల్ల దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది.గుసగుసలాడడం అనే భావన అంతరంగిక మధుర సంభాషణల స్వభావాన్ని చూపిస్తుంది.ఇది బహిరంగంగా చెప్పే మాటలు కావు.మనసు విప్పి గుసగుసలాడుకోవడం.ప్రేమికుల మధ్య దూరం ఉన్నప్పటికీ ఒకే సమయంలో ఒకే దృశ్యం అయిన చందమామను చూపిస్తూ అనుబంధాన్ని పంచుకుంటున్నారు అనే గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.ఇది ప్రేమలోని లోతును,మౌన సంభాషణల మాధుర్యాన్ని మరియు దూరాన్ని దాటి చేరే మనుషుల బంధాన్ని చక్కగా చూపిస్తుంది.ఇద్దరు ప్రేమికులు,దగ్గరగా లేరు.అతను,ఆమె దూరంగా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు.అయినా వారు ఇప్పుడు కలిసి తిరిగే అవకాశం లేదు.వారిరువురు ఫోన్ లో సంభాషిస్తు చందమామను ఇప్పుడే చూడమని చెవిలో చెప్పి గుసగుసలాడడం ఊహకు అందనిది.ప్రేమికులు ఇద్దరు దూరంగా ఉన్నా ఒకే సమయంలో ఒకే విషయాన్ని చూడాలి అని కోరుకుంటారు.అలాగే చదివిన పుస్తకంలోని అనుభూతిని ఇతరులతో పంచుకోవాలి అనిపించడం సహజమే.

“వాళ్లు కలిసి గుర్తు చేసుకోవాలనుకునే/తీపి జ్ఞాపకం లాంటిది/అంటున్నారు.అతను మనతో పంచుకున్న పుస్తకం ఒక మధురమైన జ్ఞాపకం.ఆ పుస్తకంలోని అనుభూతులను పంచుకొని తిరిగి చూసుకునే మధుర క్షణాలను ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పవచ్చు.
“ఒకరు చదివి గుర్తులు పెట్టి ఇచ్చిన పుస్తకం/ నీలాంటి ఎవరో నీ కలలోకి రావడం లాంటిది/ అంటున్నారు.ఒకరు తన ఆలోచనలు,భావనలు, ఆకర్షణలు,గుర్తులు చెప్పి అందించినప్పుడు,అది మనం ఊహించని విధంగా మన హృదయాన్ని తాకుతుంది.అతను పుస్తకాన్ని చదివినప్పుడు కలిగిన భావోద్వేగాలను, గుర్తులు పెట్టిన పేజీలను చూడగానే ఎందుకో తెలియదు మనం కూడా ఆ భావంలో లీనం అయిపోవడం సహజంగానే జరుగుతుంది.అప్పుడు మనం ఆ పుస్తకాన్ని ఒంటరిగా చదివినట్లుగా ఉండదు.ఎవరో మనతో పాటు కలిసి చదివినట్లుగా అనిపిస్తుంది.
“అనూహ్యంగా ఎవరో నీ గుప్పెట్లో పెట్టి/మూసిన ప్రేమ లేఖ లాంటిది/అనుకోని ప్రయాణంలో కలిసి/ అదాటున మనసుకు దగ్గరైన స్నేహం లాంటిది/ అంటున్నారు.అతను,ఆమెతో పంచుకున్న పుస్తకం ఓ ప్రేమ ప్రబంధంలా మారుతుంది.అందులోని అక్షరాలు దాని వెనుక ఉన్న వ్యక్తి మనసే ముఖ్యం అనిపిస్తుంది.ఈ పుస్తకం ఒక ప్రేమ లేఖలా మారి మనుషులను దగ్గర చేసే సాధనంగా మారుతుంది. అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఇద్దరు కలిసిపోవడం,జీవితంలో జరిగే ఒక యాదృచ్ఛిక సంఘటనలకు సంకేతం.కొన్ని పరిచయాలు, బంధాలు ఆకస్మాత్తుగానే మొదలవుతాయి.ఆ యాదృచ్ఛిక పరిచయం తర్వాత ఏర్పడిన అనుబంధం,మన మనసుకు హత్తుకొని గాఢమైన స్నేహంగా మారుతుంది.ఒక చిన్న సంఘటన వల్ల ఏర్పడిన అనుకోని పరిచయం జీవితంలో నిలిచిపోయే విలువైన స్నేహంగా రూపు దాల్చడం సహజం.ఈ కవితా పంక్తులు అందమైన యాదృచ్ఛికాల గురించి చెబుతున్నాయి.ఒక అనుకోని ప్రయాణం వల్ల కలిగిన పరిచయం మనసుకు ఎంతో దగ్గరైన స్నేహంగా మారి మన జీవితానికి కొత్త అర్థాన్ని,కొత్త బంధాన్ని ఏర్పరుస్తుంది.మనిషి జీవిత ప్రయాణం ముందే లిఖించబడిన గ్రంథం లాంటిది.కానీ,దానిలో కొన్ని పేజీలు అనుకోని సంఘటనలతో రాసి ఉంటాయి.ఆ సంఘటనల్లో ఒకటి – యాదృచ్చిక పరిచయం. కవయిత్రి చెప్పినట్లు ఒక అనుకోని ప్రయాణంలో కలిసిన అనుబంధం మనసుకు హత్తుకునే స్నేహంగా పరిణమిస్తుంది.ఇది ఒక రకంగా హృదయానుభూతి. స్నేహానికి మనసును కదిలించే శక్తి ఉంది.ఆ స్నేహం కూడా చాలా సార్లు ముందుగా నిర్ణయించబడింది కాదు.అది అనుకోకుండా జీవిత మార్గంలో దొరికే ఒక వరం.ఇది కవిత్వంలో అనూహ్యత అనే సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఒక యాదృచ్ఛిక పరిచయం ఆత్మీయ స్నేహంగా మారడాన్ని అద్భుతంగా చూపించారు.
“చిట్టి పిట్ట మృదుత్వం నీకు అనుభవమవ్వడానికి/దాని ఈకనొకరు నీ చెంపల మీద రాయడం లాంటిది/అంటున్నారు.ఇక్కడ ఒక చిన్న పిట్ట యొక్క మృదుత్వం నేరుగా అనుభవించ లేని ఒక గుణం.దానిని మనకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా కవయిత్రి పిట్ట ఈకను చెంపపై రాయడం అనే సన్నివేశంతో పోల్చింది.దీని వల్ల మృదుత్వం అనే భావనకు స్పష్టమైన అనుభూతి లభించింది. మృదుత్వాన్ని ఒక గుణంగా కాకుండా స్పర్శ ద్వారా కలిగే అనుభూతిగా చూపించారు.చిట్టి పిట్ట అనే పదాల ద్వారా చిన్నతనం,అమాయకత్వం, సహజత్వం వ్యక్తం అవుతున్నది.ఈక అనే పదం ద్వారా సున్నితత్వం,లేతదనం ప్రదర్శించబడినది. చెంపపై రాయడం వల్ల మనిషి అనుభవించే మృదుత్వానికి హృద్యమైన రూప కల్పన ఇది.
ఇది మృదుత్వం అనే భావనను స్పర్శగా మార్చి పాఠకునికి అనుభవం అయ్యేలా చేసిన కవితా సంపద.పుస్తకం చదివిన అనుభూతి,సున్నితత్వం కలిగిన మన హృదయాన్ని చలింప జేస్తుంది.
“ఒకరు చదివి,చదవమని ఇచ్చిన పుస్తకం/ జగమంతా తిరిగినా తరిగిపోని/జాబిలి తునక వెలుగు లాంటిది/ఆ అనుభవం/అంటున్నారు. పుస్తకం చదివిన అనుభవం చిరకాలం మనసులో గుర్తుగా మిగిలి పోతుంది.అది మానవీయ సంబంధాల్లో మృదువుగా,శాశ్వతంగా మనలో నిలిచే అనుభూతిని కలిగిస్తుంది.పుస్తకాన్ని
ఎవరో ఒకరు చదివి మనకు అందజేయడం,వారి మనసులో కలిగిన వెలుగును మన చేతిలో పెట్టినట్టే.ఆ వెలుగు ఎప్పటికీ తరిగిపోదు.ఎందుకంటే పుస్తకాన్ని చదివిన అనుభవం మనలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.జాబిల్లి వెలుగు ఎప్పుడు మన కోసం అందంగా,మృదువుగా,శాశ్వతంగా ఉంటుంది‌.ఒక మంచి పుస్తకం నుంచి వచ్చిన జ్ఞానం,అనుభవం కాల గమనానికి లోబడదు.అది ఆనందాన్ని ఇస్తుంది.పుస్తక జ్ఞానం వల్ల మనసు తేలిపోతుంది.ఎందుకంటే పుస్తకం మనం ఎరుగని లోకాల వైపు నడిపిస్తుంది.పుస్తకం ప్రేరణను ఇస్తుంది.ఎందుకంటే ప్రతి పుస్తకం వెనుక ఒక అమూల్యమైన జీవితం ఉంది.ఒకరు చదివి మనకు ఇచ్చిన పుస్తకం అది కేవలం వస్తువు కాదు.అది ఇద్దరిని కలిపే చక్కని బంధం అని చెప్పిన తీరు బాగుంది.
“ఈ లోకంలో సూర్యోదయాలను చూడటానికి/దగ్గరి మిత్రులు కలిసి సముద్రాలకు వెళ్లడం లాంటిది/ అంటున్నారు.ఈ లోకంలో సూర్యోదయాలను చూడటానికి దగ్గరి మిత్రులు కలిసి కన్యాకుమారి సముద్రాల తీరాలకు వెళ్లడం పరిపాటి.మానవ జీవనంలో స్నేహం మరియు సౌందర్యాస్వాదన అనే రెండు విలువలు ఇందులో ఒకే సమయంలో ప్రతిబింబిస్తున్నాయి.సూర్యోదయం మానవ జీవనంలో కొత్త ఆరంభాలకు,ఆశలకు సంకేతం.అది చీకటిని తొలగించి వెలుతురు నింపే గొప్ప క్షణం. కాబట్టి సూర్యోదయాన్ని చూడడం కొత్త దారులను, కొత్త ఆశలను దర్శించడంగా భావించవచ్చు. సముద్రం విస్తారమైనది,లోతైనది.ఇది మానవ హృదయంలోని లోతైన భావాలను ప్రతిబింబిస్తుంది. సముద్ర తీరంలో సూర్యోదయాన్ని చూస్తూ అద్భుతమైన క్షణాలను గడపడం ఉల్లాసంగా ఉంటుంది.సూర్యోదయాన్ని చూడటానికి ఒంటరిగా వెళ్లడం కాకుండా సహచరులతో వెళ్లి చూడడం జీవిత సౌందర్యానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది.స్నేహం అనేది జీవితపు ఆనందాలను మరింత పుష్కలంగా అనుభవించడానికి తోడ్పడుతుంది. జీవితంలో సౌందర్యాలను ఆస్వాదించడం మాత్రమే కాదు‌.వాటిని దగ్గరి మిత్రులతో పంచుకోవడం ద్వారా మనసు మరింత తృప్తిని పొందుతుంది.పుస్తకం చదవడం, దానిని పంచుకోవడం అనేది ఒక మంచి అనుభవం.అది సూర్యోదయాన్ని కలిసి చూసే మిత్రుల అనుభూతిలా ఉంటుంది.
“ఎగసే ఒక సంతోష కెరటానికి ఎదురెళ్ళి/ ఇద్దరు మనుషులు నిలువెల్లా తడిసిపోవడం లాంటిది/అంటున్నారు.ఈ కవితా పంక్తులు కేవలం ఒక దృశ్యాన్ని మాత్రమే కాకుండా లోతైన అనుభూతిని సూచిస్తున్నాయి. ఇక్కడ కెరటం అనేది ప్రకృతి వైభవం మాత్రమే కాదు.ఒక భావోద్వేగపూరితమైన ఉప్పెన.సంతోషం అనేది ఒక తాత్కాలిక తరంగంలా వస్తూ పోతూ ఉంటుంది.కానీ, అది ఎగసినప్పుడు ఎదురెళ్ళిన వారిని సంతోషసాగరంలో ముంచెత్తుతుంది.ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉన్నా ఇద్దరు వ్యక్తులు ఒకే కెరటంలో తడవడం వల్ల పంచుకునే ఆనందం హాయిగా ఉంటుంది. ఇది వ్యక్తికి పరిమితం కాకుండా కలిగిన సామూహిక అనుభవం,సంతోషం ఎవరి వద్ద ప్రారంభమైనా అది పంచుకున్నప్పుడు మరింత పరిపూర్ణం అవుతుంది.ఇది నిలువెల్లా తడిసిపోవడం యొక్క గాఢతను తెలుపుతుంది. శరీరం మొత్తం తడిసినట్లే మనసు మొత్తం ఆనందంలో ముంచెత్తబడింది అనే గొప్ప అనుభూతిని సూచిస్తుంది.ఇది జీవితంలో ఒక క్షణ కాలమైనా కొత్త వెలుగుతో నింపుతుంది.పుస్తకం చదవడం ద్వారా వచ్చిన అనుభవం ఇద్దరిని భావోద్వేగాల వర్షంలో తడిపేస్తుంది.అదే నిజమైన అనుభూతిని పంచుకోవడం.ఈ కవితా పంక్తులు ఒక సన్నివేశాన్ని చూపుతూ మనస్సులో కలిగే సంతోషాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది కేవలం ఒక క్షణ కాలపు ఆనందం కాదు.పంచుకున్న భావన వల్ల పది రెట్లు పెరిగిన జీవనోత్సవం ఇది. ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే విషయాన్ని ఒక మానవీయ అనుబంధానికి ప్రతీకగా చూపించారు.పుస్తకం మార్పు నొంది ప్రేమ,స్నేహం,సంభాషణ,జ్ఞాపకాలు, అనుభూతులు అన్నిటిని పంచుకుని సాధనంగా ఉపయోగపడుతుంది.ప్రేమతో మానవీయతతో అనుభూతులతో నిండిన పుస్తకాన్ని పంచుకోవడాన్ని ఈ కవిత చాలా అందంగా ప్రదర్శిస్తుంది.పుస్తకం అంటే కథ కాదు.అది ఒక అనుబంధం.ఒక మధుర జ్ఞాపకం.ఒక ప్రేమ లేఖ.ఒక మనసుకు స్పృశించే అనుభూతిగా చెప్పవచ్చు.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే అనుభవాన్ని అనేక దృశ్యాల ద్వారా ఉపమానాల ద్వారా కవిత్వ రూపంలో వివరించడం జరిగింది.ఇది సాహిత్య రీతిలో ప్రతీకాత్మక శైలికి దగ్గరగా ఉంటుంది.గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని మిగిల్చి తెచ్చి పంచిన విధంగా పుస్తకం కూడా ఆనందాన్ని పంచుకునే దైవీయ అనుభవంగా ఉద్దేశింపబడింది. ఇందులోని భాషా విన్యాసం సాధారణమైనది.కానీ, దానిలోని భావుకత కవిత్వానికి ప్రాణం పోసింది.ఒకే భావాన్ని అనేక రూపాల్లో చెప్పడం బాగుంది.పుస్తకం అనే వస్తువును జ్ఞాన సాధనంగా కాకుండా,భావ సంబంధాలను కలిపే వంతెనగా చిత్రీకరించారు.ఇది ఆధునిక సాహిత్యంలో వ్యక్తిగత అనుభూతుల కవిత్వపు శైలికి దగ్గరగా ఉంది.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం కవయిత్రి దృష్టిలో మానవ సంబంధాల చిహ్నం.అది ప్రేమకు,స్నేహానికి ప్రతీక.జీవితంలోనీ చిన్న చిన్న ఆనందాలకు ప్రతిరూపం.ఇందులోని ప్రతి ఉపమానం,ఆ అనుభవాన్ని మరింత లోతైన మమకారభరితమైన స్థాయికి తీసుకు వెళ్తుంది. సాహిత్యం అనేది మనసులోని అనుభూతులను అందమైన భాషా రూపాల్లో వ్యక్తపరచడం.ఒక్క చిన్న అనుభవం కూడా కవి హృదయంలో విస్తారమైన దృశ్యాలుగా వికసిస్తుంది.ఇక్కడ ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే భావం సాధారణ జీవితానుభవమే అయినప్పటికీ కవయిత్రి దృష్టిలో అది అమూల్యమైన ఆత్మీయతకు,స్నేహానికి,ప్రేమకు, జ్ఞాపకాలకు ప్రతీకగా రూపాంతరం చెందింది.ఈ కవితా పంక్తులలో పుస్తకాన్ని కేవలం జ్ఞానం అందించే సాధనంగా కాకుండా అనుభూతులను పంచుకునే వస్తువుగా వర్ణించారు.తోకచుక్క రాలి పడుతుంటే పక్కనున్న వాళ్ళని తట్టి చూపించడం లాగా పుస్తకం పంచుకోవడంలో ఉత్సాహం ఉట్టిపడుతుంది.దూరాన ఉన్న ప్రేమికులు చంద్రుని చూపించడంలాగా పుస్తకం పంచుకోవడంలో గాఢమైన ఆత్మీయత వ్యక్తం అవుతుంది.చిట్టి పిట్ట ఈక చెంపల మీద రాయడం లాగా,సముద్ర తీరంలో సూర్యోదయాన్ని స్నేహితులతో కలిసి చూడడం లాగా ఈ పోలికలు పుస్తకాన్ని పంచుకునే అనుభవానికి కవిత్వ రూపాన్ని తెచ్చి పెట్టాయి. ఇందులోని భావాలు పుస్తకాన్ని ప్రేమలేఖ,చిట్టి పిట్ట,జాబిలి తునక వెలుగుతో పోల్చడం ద్వారా మమకారం,మాధుర్యం,ఆత్మీయత ప్రతిఫలించినాయి.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే ఆలోచన,కవయిత్రి కవిత్వంలో మానవ సంబంధాల మమకారానికి చిహ్నంగా నిలుస్తుంది. అది ఒక వస్తువు కాదు ఒక అనుభూతి,ఒక జ్ఞానం కాదు,ఒక జ్ఞాపకం,ప్రేమ,స్నేహం,ఆత్మీయత, అనురాగం కలిసిన ప్రతిరూపం.కవయిత్రి పంచుకున్న పుస్తకం ద్వారా సరళమైన అనుభవాన్ని కవితా రూపంలో వ్యక్తం చేయడం గొప్పగా ఉంది. ఇది పాఠకులను ఎంతగానో అలరిస్తుంది.అందరి హృదయాలను హత్తుకునే గొప్ప భావనగా నిలుస్తుంది.కవయిత్రి మానస చామర్తి ని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవయిత్రి మానస చామర్తి బి.టెక్. కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. వీరు సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వీరికి చిన్నతనంలోనే సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఏర్పడింది.వీరిలో పదమూడు సంవత్సరాల చిన్న వయసులోనే తొలి కవితకు బీజం పడింది.వీరు రాసిన కవిత మొదటి సారిగా కళాశాల మేగజైన్ లో ప్రచురింపబడింది. వీరు రాసిన పరవశ తొలి కవితా సంపుటి,2022 సంవత్సరంలో అనల్ప పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితం అయింది.వీరు ఈ మాట వెబ్ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు.ప్రాచీన ఆధునిక కవిత్వాల నుండి నాన్న ప్రధాన వస్తువుగా ఘంటసాల నిర్మల ప్రధాన సంపాదకులుగా వెలువరించబడ్డ నాన్న బృహత్సంకలనానికి మానస చామర్తి సంపాదకవర్గ సహకారం అందించారు.వీరు మధు మానసం బ్లాగ్ లో తమ అనుభవాలను, జ్ఞాపకాలను గత పదిహేను సంవత్సరాలుగా రికార్డ్ చేస్తున్నారు.వీరు 2015 సంవత్సరంలో ఇస్మాయిల్ పురస్కారం అందుకున్నారు.వీరు 2024 సంవత్సరంలో ఉమ్మడిశెట్టి అవార్డును అందుకున్నారు.వీరికి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల కొడుకు ఉన్నాడు.ఆ పిల్లవాడి చుట్టూరా అల్లుకున్న అందమైన ప్రపంచాన్ని గమనించడం తనకు ఇష్టం అంటూ తనలో పొంగి పొర్లుతున్న ఆత్మీయ అనుభూతులను ఆనందంగా పంచుకున్నారు. ‌

You may also like

8 comments

Adrienne1204 October 6, 2025 - 8:54 am Reply
June3237 October 15, 2025 - 12:50 am Reply
Walter2669 October 17, 2025 - 4:12 am Reply
Don1738 October 23, 2025 - 11:47 pm Reply
Brock239 October 24, 2025 - 10:36 am Reply
Hazel1806 November 1, 2025 - 1:51 am Reply
Sophie4479 November 11, 2025 - 1:13 pm Reply
Harper3565 November 16, 2025 - 8:29 am Reply

Leave a Reply to Harper3565 Cancel Reply