చుక్క చుక్క నదిగా తరలి సంద్రమై
ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నట్టు
పువ్వు పువ్వు నవ్వుల దీపమై వెలిగే
బతుకమ్మ ఓ దివ్య దీక్షా తిలకం!
తెల తెలవారే తూరుపులో
తొలి పొద్దు రేఖలు నగవుల శిఖరం
క్షణాల అనుపద గమనాలలో
హరిద్రా మూర్తికి గాత్ర పూజనం
సాయం సంజె వేళల్లో చెరువుగట్టున ఆటపాటల సంబరం
బతుకమ్మ ఓ సామూహిక తేజో కళా తిలకం!
వర్ణరంజిత పరాగమే సురాగమై పరిమళించినట్టు
ప్రాణవాయువు డోలలో
అంతరంగ ఉయ్యాలో పాటల్లో తూగినట్టు
చందమామ చల్లని వెన్నెల తెమ్మెరల వలలో తేలి ఆడినట్టు
అస్తిత్వ ప్రతిధ్వనుల కోల్ కోరస్
ఒక్కేసి పువ్వేసే పాటల మెట్లెక్కినట్లు
బతుకమ్మ ఓ జానపద సారస్వత తిలకం!
తల్లి సౌజన్య మే తాయిలమై
బిడ్డ సంతసాల సాంగత్యమే పల్లవై
ఆంక్షలు దాటి కాంక్షలు దీర
ఇంటింటి గానము తానై
ఆడపడుచుల కమ్మన్ని ఆప్యాయతల పంటతానై
బతుకమ్మ కౌటుంబిక సహజీవన సురభిళ తిలకం!
కాఠిన్యాలను కాలదన్ని
అనంతమైన కలివిడితనానికి పునరుజ్జీవనం తానై
అంతర్ లోకాల
భావ సమ్మేళనాల
సరమూ తానై సాహిత్య స్వరమూ తానై
బతుకమ్మ ఓ సామరస్య సంజీవని తిలకం!
ఏటేటా
ఎలమి తానై బలిమి తానై
తల మీదికి ఎక్కిందంటే చాలు బతుకమ్మ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సామాజిక చైతన్య తిలకం!
ఆకార ప్రాకారాలు దాటి
సాద ప్రసాదాలు పంచి
సమరసత తానై సౌశీల్యతా తానై
బతుకమ్మ తెలంగాణ స్నేహ సౌభాగ్య దీక్షా తిలకం!
పసుపూ కుంకుమా పూలు పండ్లూ
స్వచ్ఛమైన మనసులూ
అచ్చమైన ముచ్చట్ల పచ్చందనాలూ
నలుగురితో నడకలూ
పదుగురితో మృదు హాసాలు
ఆరోగ్యం చంద్రికలు ఔషధ మై
బతుకమ్మ ఓ పర్యావరణ పరిరక్షణ తిలకం!
సంతోష పల్లకినెక్కి
పాడ్యమి నవమిల నవ సందేశాన్నితెచ్చే
బతుకమ్మ
ప్రకృతి ఒడి
రంగు రంగుల సింగిడి
పూలు స్త్రీలు పాటలు పిల్లలు
ఇంటిల్లిపాది బతుకు బడి
తొమ్మిది రోజుల నమ్మిక సందడి
ఆ జీవ పర్యంత భావ సామరస్యం
బతుకమ్మ ఓ సౌందర్య దీక్షా తిలకం!! ॥2॥