Home కవితలు ద్వేష ఖననం

ద్వేష ఖననం

by Dr. Thanda Harish

అసూయ ఆమడదూరంలో కూర్చుంటుంది
ద్వేషం అతడి దేహంలో బతకలేక
ఖాళీ చేసి వెళ్ళిపోతుంది
శేషాల లెక్కల్లో
శత్రువుల సంఖ్య సున్నా

కవికో కవితావాక్యాన్నిచ్చే మంచితనం
అతడిలో ప్రసరిస్తున్నందుకేమో
చంద్రుడు తలపాగా మీద వెలుగుతుంటాడు
ప్రియమైన పాటలన్నీ చెవులను ముద్దాడుతుంటాయి
మసకచీకట్లే టార్చ్ లైట్లయి ఎదురొస్తాయి
చిరు చిరు జల్లులు
పూలలా మీద కురుస్తాయి
చురకలు పెట్టిన చేతులే
లేపనాన్ని పూస్తాయి

అహం కొలతలు తగ్గించబడి
దూరాలు దగ్గరగా నిలుచున్నప్పుడే
నిజమైన ప్రేమ..గుండెలను చీల్చుతూ
బయటికొస్తుంది

సన్నని గీతలను చెరిపేసినందుకో
అంతరాలను ఖననం చేసినందుకో
పగ, ప్రతీకారాలను కనబడకుండా ఊడ్చేసినందుకో
జీవన లయాన్విత చందమామకు
గోరుముద్దలు తినిపిస్తూ
ఆ కాంతుల్లో మెరిసిపోతున్న
ఆనందకర దృశ్యాల్లోనే
అతనిప్పుడు తడిసిపోతున్నాడు

You may also like

Leave a Comment