1.ఉత్పల మాల:
స్వాగతమో పరాభవ దివాకర తేజుడ వౌచు రమ్మికన్
మాగత మంత మార్చుచును మంచిని పెంచుచు వాంఛితమ్ములన్
వేగమె తీర్చుమయ్య మది వీణలు మీటుచు నాట్యమాడ,నీ
వేగతి దేశ శాంతి నిలబెట్టి ఉషస్సుల నందజేయాగా !!
2.ఆటవెలది:(ఉగాది గూర్చి)
ఆరు రుచులు గల్గి యారోగ్య మొసగేటి
పచ్చ డార గించు పర్వ దినము
కొత్త ధాన్య మొచ్చు కోర్కెల దీర్చుచు
మొదటి పండు విదియు ముదము గూర్చు !!
3.శార్దూలం:(పరాభవ గూర్చి)
నీపేరున్ వినభీతిగల్గును సదా నిక్కంబిదీ వత్సరా
మాపన్ జూడుము మాదు భావనలలో మాలిన్యముల్ నీవికన్
కాపాడుమ్మిక మమ్ములన్ కరుణతో కన్నెర్ర జేబోకుమా
ఆపన్ జూడుమ ఆగడమ్ములభువిన్ అన్యోన్యతన్ బెంచుమా !!
4.చంపక మాల:(ప్రణతులు)
అమెరికలోప్రవాసులకు నాపద లేవియు రాని రీతిగా
సమతయు శాంతి సౌఖ్యములసారధిగా నడిపించు వాడవై
భ్రమలను త్రుంచివేయుచును భారత బిడ్డల కీర్తి బెంచుచున్
తమ తమ కొల్వులందునను ధన్యత గూర్చు మయా పరాభవా !!
5.ఆటవెలది:
తెలుగు సంఘములకు తేజమ్ము పెంచుచు
వెలుగునింపు మింక వేగిరముగ
మాతృ భాష మీద మమకారమున్ పంచు
దేశ సేవ పట్ల దీక్ష పెంచు !!
4,5 పద్యములు NRI లకు మరియు US లోని తెలుగుసంఘాలకు అంకితం
