పూరిగుడిసె ముంగిటి పుష్పగుఛ్చం
అద్దాలమేడకు అలంకారమైంది
ఆకాశాన విహరించే అందాల చిలుక
బంగారు పంజరాన బందీ అయింది
కొమ్మ వేదికపైని మధుర గాయని కోయిలమ్మ
గొంతుకు పసుపు తాడేదో బిగుసుకున్నట్టుంది
గడప దాటిన కౌమార్యం గంపెడు బరువును తలకెత్తింది
కొంగుముడిలో కొత్త జీవితం కత్తుల బోనులో కాలు మోపింది
విరిసీవిరియని కుసుమం నిప్పుల కుంపటి పాలయింది
ఏటిలోని చేపపిల్ల ఒడ్డున పడి విలవిల్లాడింది
గాండ్రించే పులుల నడుమ లేడికూన గిలగిల్లాడింది
కాలచక్రం కఠిన వేగంతో గిర్రున తిరిగింది
అంతలోనే తలుపు తట్టిన అమ్మతనం
అదనపు బాధ్యతల్ని అప్పగించింది
అగ్ని కీలలకు అంతరంగం ఆహుతి అయింది
నిరసన జ్వాలలకు ఆత్మగౌరవం మాడి మసయింది
దిక్కుతోచని దీనావస్థ సారస్వత సాగరాన సేద తీరింది అనుభవాలే
పాఠాలు అయినవి పరిస్థితులు పాండిత్యాన్ని అలదినవి
తల్లి ప్రేమ అగ్ర పీఠాన నిలిచింది ఆణిముత్యాలని జాతికి అంకిత మిచ్చింది