Home బాల‌సాహిత్యం పసివాని కోరిక

పసివాని కోరిక

by Sammeta Umadevi

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

You may also like

Leave a Comment