Home వ్యాసాలు సావిత్రీ దర్శనం

సావిత్రీ దర్శనం

by Devanapalli Veenavani

అనేక మంది ఆధ్యాత్మిక సత్ జీవన చరిత్రలు ఏదో యోగ సూత్రానికి అనుసంధానించి ఉన్నవే.నా మటుకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాధనాపరులతో ఉన్నప్పటికీ అది నాకు అర్థం కాలేదు, సాధ్యమూ కాలేదు. మనః శరీరాల మధ్య సమన్వయం లేనిదే ఏ యోగ సాధనా సఫలం కాలేదని మాత్రం తెలుసుకోగలిగాను. గీత, కపిలుని సాంఖ్యం, క్రియా, భక్త్రు రహిత రాజయోగం మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ అది కేవలం పత్రికలు చదివి వార్తలు గ్రహించినంత మాత్రమే.

అయితే నేను పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు శ్రీ అరబిందో గురించి , అతను “సావిత్రి “ని రాశారని తెలుసుకున్నప్పుడు అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఒక ICS అధికారి కాగదగినవాడు, విప్లవకారుడు, స్వతంత్ర పోరాటంలో ఉన్నవాడు, ఉన్న ఫలంగా ఎలా యోగ దర్శనం చేశాడు, ఎలా పూర్ణ యోగం సిద్ధాంతం చేశాడు, యోగిగా ఎలా మారాడు అన్నది తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. అయితే అన్నిటికీ మించి అతని ‘ సావిత్రి ‘ లో ఏముంది అని , అది తెలుసుకోవాలనీ అనిపించేది. అది స్వామి రామా రాసినట్టుగా ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభవాల సమాహారం అయి ఉండవచ్చు అని చాలా రోజుల వరకు అనుకున్నాను. తెలుగులో చదవగలిగితే బాగుండుననీ అనుకున్నాను.కొన్నాళ్ళకు నాకు వరంగల్ సెంట్రల్ లైబ్రరీ లో ఒక కాపీ దొరికింది కూడా. కానీ ఎంత అడిగినా లైబ్రేరియన్ Xerox తీసుకోవడానికి గానీ ఇంటికి తీసుకు వెళ్లి చదవడానకి గానీ అనుమతించలేదు.ఒకే ఒక కాపీ ఉండడం దానికి కారణం.

మరి కొన్నాళ్ళకు నాకు సిరికోన సాహిత్య అవార్డుల కార్యక్రమం లో శ్రీ వాసిలి వసంత కుమార్ గారి పరిచయమైంది. వారు అరవిందుల సావిత్రిని ఆంధ్ర మహా సావిత్రి లా తెలుగు చేసిన మాస్టర్ శార్వరి గారి పుత్రులు. అయితే ఆ విషయం నాకు తెలియదు. మాటల్లో నేను సావిత్రిని చదవాలని ఉందని ,అయితే అది దొరకడం లేదనీ అన్నాను. వారు, మా తండ్రి గారు శార్వారి , వారే దానిని అనుసృజన చేశారని చెప్పడంతో ఆశ్చర్య పోయాను. అనేక పునర్ముద్రణ ల తర్వాత తిరిగి ముద్రించామనీ , తప్పక ఒక కాపీ పంపగలననీ హామీ ఇచ్చి మరో పది రోజుల్లో పంపారు.

ఇది మూడేళ్ల కిందటి సంగతి. రెండు మూడు సార్లు చదవడానికి ప్రయత్నం చేశాను. కానీ అందులోకి ప్రయాణం చేయలేకపోయాను.
ఈనాటికి మూడు సంపుటాలుగా వెలువడిన వెయ్యి పేజీల బృహద్ గ్రంథం పూర్తి చేయగలిగాను. సాధ్యం అయినంత వరకు అర్థం చేసుకోగలిగాను.

సానిత్రి అనుసృజనకు శ్రీ శార్వరి గారు దశాబ్దకాలం వెచ్చించారు. అరవిందులు కూడా మూల ప్రతిని పూర్తిగా సిద్ధం చేయడానికి పుష్కర కాలానికి పైననే తీసుకున్నారు.
యథా వారి యోగ దర్శనం , తథా కావ్య గతం చేశారు. అటువంటి ధ్యాన యోగ దర్శనానికి శ్రీ శార్వరి వారు అంతే యోగ సాధనా శక్తి ద్వారా అనుసృజన చేయగలిగారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరూ యోగ సాధకులు కనుకనే సాధ్యం అయిందని నేను భావిస్తున్నాను.

శార్వరి వారి సావిత్రికి గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాస్తూ వ్యాస వాల్మీకి సరసన నిలబడగల కావ్యం సావిత్రి అన్నారు. అలా అనడానికి కారణం సావిత్రి కావ్య రూప ఆధ్యాత్మిక వాఖ్యానం.

ఇంతకీ సావిత్రి ఏమిటి అంటే మహా భారతంలోని సావిత్రి కథనే. సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని
మృత్యువునుంచి గెలిపిస్తుంది.అయితే ఆమె మృత్యువు(యమున్ని)జయించడానికి చేసిన సాధన, ఆమె చేసిన దర్శనాలు, తెలుసుకున్న సత్యాలు ఇవన్నీ పన్నెండు గ్రంథాలుగా రాశాడు అరవిందుడు. .సావిత్రిలోని పన్నెండు భాగాలు అనేక పర భౌతిక విషయాలను చర్చిస్తాయి. వాటిని మూడు భాగాలు సత్య దర్శనం, యోగ దర్శనం, విశ్వదర్శనం గా కూర్పు చేశారు శార్వరి వారు. ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రయాణం లేకుండా సావిత్రిని అర్థం చేసుకోవడం కష్టం.

ఇవి అరవిందులు తాను సావిత్రిగా మారి ప్రయాణం సిద్ధిస్తేగానీ రాయగలిగేవి కావు.
సావిత్రి దేనిని సాధించిందో దాని ద్వారానే మృత్యువుని జయించింది. ఆ సాధనే ఒక తేజస్సు, అదే గాయత్రి. అరవిందులు పూర్ణయోగం ద్వారా ఆ సావిత్రి సాధించిన అమరత్వ ఉషస్సును పొందమని సూచించారు.
ఇక అరవిందుల పూర్ణ యోగం అంటే భక్తి, జ్ఞాన, కర్మ యోగాలు మూడు కలిసి చేయగల యోగం. అది సావిత్రి చర్చించదు. కాకపోతే ఈ యోగ సాధనలో సావిత్రి ద్వారా చెప్పిన అమరత్వం సిద్ధిస్తుందని భావించాలి.

ఈ విలువైన కృషిని తెలుగులో అందించడానికి మరొక్క మారు ప్రయత్నం చేసిన శ్రీ వాసిలి వసంత కుమార్ గారు ఎంతగానో అభినందనీయులు.
అది నాకు అందించినందుకు కృతజ్ఞతలు

అరవిందుని సావిత్రి పరిచయం తర్వాత మిత్రులు కొంతమంది సావిత్రి గురించి మరి కాస్త వివరంగా రాస్తే బాగుంటుందని అడగడం జరిగింది.

సావిత్రిని చదవడం నా బలమైన కోరిక, అలా ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఒక శిక్షణా కార్యక్రమంలో గెస్ట్ స్పీకర్ గా వచ్చిన ఒకరు మాటల్లో అరవిందుడులాంటి ప్రజ్ఞాశాలి మన స్వతంత్ర పోరాటం నుంచి ఎందుకు బయటికి వచ్చాడు , అలా రాకుండా పోరాటంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనడం నాకు అరవిందుని మీద అంతకు ముందు ఉన్న భావనను మరింత పెంచింది. ఇక పండిత పరమేశ్వర శాస్త్రి రాసిన త్రిపురనేని గోపీచంద్ మనసులో మాట ఆ నవల్లో చెప్పకనే అరవిందుని పూర్ణ యోగాన్ని చెప్తుంది. పూర్ణయోగం సంభవమేనా అన్న సంశయం ప్రధాన పాత్ర వెలిబుచ్చడం ఆ నవల్లో కనిపిస్తుంది. అయితే దానిని ఆచరించిన వారు మాత్రమే చెప్పగల సాహసకార్యమది. అంతటి సాహసం చేయలేను కాకపోతే సావిత్రి గురించి మాత్రం చెప్పగలిగే సాహసం చేస్తాను. ఎందుకు అంటే అర్థం చేసుకోగల వివరణలు ఇంతకు ముందు పెద్దలు అనేకులు అందజేశారు కనుక.

అరవిందుని సావిత్రి అర్థం కావాలి అంటే అంతకుముందు మృత్యువును జయించడానికి ప్రయత్నం చేసిన వారి చరిత్రను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసి తెలుసుకొని శక్తి మేరకు అర్థం చేసుకున్న దానిని ఇక్కడ రాస్తున్నాను.

17, 18 శతాబ్దానికి చెందిన మహనీయులు, యోగ సిద్ధాంతాలని ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసి ప్రజలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిన్చడం కోసం సులభమైన విధివిధానాన్ని ఏర్పరచే ప్రయత్నం చేశారు. అయితే పాత కథని తిరిగి దర్శించడం, రాయడం జరగలేదు. అయితే అరవిందుని విషయంలో ఇది జరిగింది.

పురాణాలని అంటుంటాం కదా ఇటువంటి పురాణాలని అరవిందుడిలాంటివాడు సమకాలీనానికి ఏ విధంగా తీసుకువచ్చాడు, తన యోగదర్శనాల కొరకు అతను సావిత్రిని ఎందుకు ఎంచుకున్నాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత ,భాగవతం లాంటి వాటి వ్యాఖ్యానం, కాకుండా అందులోని ఒక స్త్రీ కథని అది మృత్యుంజయ కథని ఎందుకు తీసుకున్నాడు? ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ? ఎవరైనా అసలు మృత్యువుని ఎందుకు చేయించాలి? ప్రతి ఒక్కరూ మృత్యువుని జయించడానికి ప్రయత్నించినట్లయితే ఎలా ? ఎటువంటి సాధన చేసినట్లయితే అటువంటి వారి యొక్క భౌతిక ప్రయోజనము కలుగుతుంది ? అది ఎట్లా ఉండబోతోంది..? అమరత్వము, మృత్యువును జయించడం రెండు ఒకటేనా ? ఇవన్నీ నాకు కలిగిన సందేహాలు.

సందేహ నివృత్తి కోసం లోకంలో చిరంజీవులు గా ఉన్నవారు , మృత్యుంజయులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. మృత్యువును జయించిన వారు ఆ ప్రత్యేక సందర్భంలో మృత్యువుని తప్పించుకున్నారు కానీ వారు శాశ్వతలు కారు అంటే చిరంజీవులు కారు. వారు ఏ ప్రయోజనం కోసం మృత్యువుని వాయిదా వేశారో అది సిద్ధించిన తర్వాత వారు మామూలు మానవుడిలాగే నిష్క్రమించారు. కానీ అమరులు, వారు మృత్యువు యొక్క మితిని దాటి పరివ్యాప్తం చెందారు కనుక వారిని
మృత్యువు అందుకోలేదు. ఇలా మృత్యువు యొక్క మితిని అతిక్రమించి లోకంలో పరివ్యాప్తమై ఉన్నటువంటి వారు చిరంజీవులు. శాస్త్రం ప్రకారం చిరంజీవులు ఏడుగురు అనీ, ఎనిమిది అనీ అంటారు. మనకు హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, మార్కండేయుడు బాగా తెలిసిన పాత్రలు.

అయితే మృత్యుంజయులు మాత్రం ముగ్గురు. మార్కండేయుడు, సావిత్రి దేవి, నచకేతుడు. ఇందులో మార్కండేయుడు మృత్యుంజయుడు ఇంకా చిరంజీవి. మిగిలిన ఇద్దరు సావిత్రి, నచికేతులు మృత్యుంజయులైనప్పటికీ వారు చిరంజీవులు కారు. ఈ మూడు మృత్యుంజయ పురాణాలు లేదా పాత్రలు మృత్యువును జయించడానికి లేదా మరణాన్ని వాయిదా వేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
అయితే అన్ని జీవులకి సమవర్తిగా ఉండేటువంటి యముడు వీరి పట్ల ఏ కారణం చేత తన సమవర్తి నియమాన్ని పక్కకు పెట్టాడు ఎందుకు వారి యొక్క విన్నపాన్ని మన్నించి తన సమవర్తి నియమాన్ని దాటి వారికి ఆయువృద్దికి తోడ్పడ్డాడు ? ఇదే ముఖ్యమైనటువంటి విషయం .

ఇవి మనం మూడు కథలుగా అధ్యయనం చేయవల్సి ఉంటుంది. ఒకటి మార్కండేయుని కథ, రెండవది సావిత్రి కథ, మూడవది నచికేతుని కథ. మార్కండేయుని పాత్ర చూసినట్లయితే రామాయణంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది. అయితే సావిత్రి యొక్క ఉపాఖ్యానం మహాభారతంలో మార్కండేయుడు ద్వారా ధర్మరాజుకు అరణ్యవాసంలో తెలియజేయబడుతుంది. ఇక నచికేతుని కథ కఠోపనిషత్ కథ.

మార్కండేయుని కథ చూసినట్లయితే భృగు మహర్షి యొక్క కుమారుడు ధాత. ఇతను పగలుకి అధిపతి.మరొక పుత్రుడు విధాత రాత్రికి అధిపతి. ఒక పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు విధాత తలపున ప్రభవించినది అనాది రాగమని రాస్తారు అంటే చీకటి అధిపతి అయినటువంటి విధాత తలపున ప్రభాతం అనేటువంటి ఒక అనాది రాగం వస్తుందని ఆయన అర్థం. మహాత్ములు పదాలను ఆయాచితంగా వాడరు. అయితే ఇక్కడ ధాత యొక్క కుమారుడు ఎవరైతే పగటి అధిపతి ఉన్నాడో అతని కుమారుడు మృకండుడు. సంతాన ప్రాప్తి కోసం శివునికీ విష్ణువుకీ చేసిన తపస్సు ఫలితంగా మార్కండేయుడు జన్మిస్తాడు. అతని ఆయుషు 16 సంవత్సరాలు.

తల్లిదండ్రుల ద్వారా తాను అల్పాయుష్కుడను అని తెలుసుకున్న మార్కండేయుడు ఏ ప్రయోజనం ఆశించి తన తండ్రి తపస్సు ఫలితంగా తనను పొందాడో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు తనకు వచ్చిన జన్మ యొక్క సార్ధకత్వం ఉండదని దానిని సాధించడం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. అతని తపస్సు ఎంతగా ఫలిస్తుందంటే శివుడు మార్కండేయుడు రెండు రూపాలు సాయుజ్యం అయిపోతాయి. అంటే శివుడే మార్కండేయుడు మార్కండేయుడు శివుడు. మార్కండేయుని ఆయుర్థాయం పూర్తయిన తర్వాత
యముడు మార్కండేయుడుని తీసుకువెళ్లే సమయంలో అతనికి శివుడికి మార్కండేయుడికి భేదం తెలియదు. అయితే అప్పుడు శివుడు యమధర్మరాజు తో ఎవరైతే పరోపకార సిధ్యర్థం తన ఆయుష్షుని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయోజనము అంత నిష్కల్మషమైనదీ లోకోపకారి అయినట్లయితే వారికి శివుని అనుగ్రహం ఉంటుంది కనుక వారి ప్రాణాలను హరించవలదని యమునికి ఆజ్ఞ వేస్తాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆయుష్షు ప్రపంచానికి ఉపకారం చేసేటువంటిది అయితే అతను ఏ ప్రయోజనం కోసం కృషి చేస్తున్నట్లయితే అటువంటి ప్రయోజనము నెరవేరేవరకు అతనికి మృత్యువునుంచి శివుని యొక్క రక్షణ ఉంటుంది ఇది మార్కండేయుడు చెప్పేటువంటి సత్యం. మార్కండేయుడు తన తండ్రి యొక్క కోరిక నెరవేరడం కోసం ఏ ప్రయోజనం కోసం తన తండ్రి తనను పొందాడు అది నెరవేరేంత వరకు సమయం ఇవ్వాలని కోరుకుంటాడు. అలా పుట్టిందే మృత్యుంజయ మహామంత్రం..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వరుహ నివ బందనాత్ మృత్యోర్ముక్షీణ మామృతాత్

జీవుడు తను పుట్టి, పొందవలసినవి పొంది, పూర్తిగా మగ్గిన ఒక దోస కాయ తన తల్లి తీగ నుంచి విడిపోయినట్లుగా తాను శరీరం విడిచి పెట్టాలని అర్థం.అదే మార్కండేయుడు కోరిక , అలా శివానుగ్రహం పొంది అలాగే తల్లి తండ్రి సేవ చేసి ఆ పాత్రలకు న్యాయం చేస్తాడు మార్కండేయుడు. లోకహితునికి, పరోపకార ప్రయోజకునికి మరణభయం లేదు ఇది మార్కండేయుడు మృత్యువుని జయించిన వివరం.
మార్కండేయుడు తదుపరి ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు, సమవర్తి నుంచి రక్షణ పొంది చిరంజీవి అయ్యాడు.

తదుపరి నచికేతుడు, సావిత్రి కథలు చూస్తే ముందు నచికేతుని గురించే చూడాలి.ఎందుకంటే నచికేతుడి ద్వారా లేదా కఠోపనిషద్ ద్వారా
ఏ విద్య అయితే లోకానికి అందించబడిందో అది సావిత్రి ఆచరించింది కాబట్టి.

నచికేతుడు, యముడి సంవాదమే కఠోపనిషత్ చెప్తుంది.
అయితే కఠోపనిషత్ అన్న పదం, దాని వివరణ మాస్టర్ పార్వతీ కుమార్ గారు వారి ప్రసంగపాఠం’ మరణ రహస్యం. -3 ‘ లో చక్కగా వివరించారు.

నచికేతుడు ఐదేళ్ల చిన్న పిల్లవాడు, తండ్రి పేరు ఉద్దాలకుడు
గౌతమ వంశస్తుడు, అరుణ కుమారుడు.ఇతను అన్న దానము తదితర దానాలు వంటివాటిని విని అచరించదలిచిన వాడై దానక్రతువు చేస్తాడు. ఇలా తనకు ఉన్నది అంతా ఇచ్చివేసే వ్రతాన్ని చేయడం వల్ల ఇతనికి వాజశ్రవనుడు అనే పేరు వచ్చింది. ఉత్తమ గతులు పొందడమే లక్ష్యంగా చేసినప్పటికీ మంచి గోవులను తాను ఉంచేసుకొని,తనకు అవసరంలేనివి దానం ఇవ్వడం చూసిన నచికేతుడు తండ్రి తప్పుచేస్తున్నాడని మదనపడతాడు.అన్నీ ఇచ్చివేస్తున్నాడు కదా..మరి నన్ను ఎవరికి ఇస్తావు నాన్నా అని తండ్రిని అడుగుతాడు.తండ్రి వెంటనే జవాబు ఇవ్వకపోతే నచికేతుడు ఈ ప్రశ్నని మళ్లీ మళ్లీ అడుగుతాడు, చిరాకు పడ్డ తండ్రి నిన్ను యముడికి ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోయి యముడి కోసం చూస్తాడు. అక్కడ ఆ సమయంలో యముడు వుండడు. మూడు రోజులకు యముడు వస్తాడు. నచికేతుడి రాకకు కారణం అడుగుతాడు.

యమ లోకంలో మూడు రోజులు భూ లోకంలో మూడు సంవత్సరాలు. అంతకాలం ఎటువంటి ఆతిథ్య ఆదరణ లేక ఒక పిల్లవాడు, బ్రాహ్మణుడు తన లోకంలో ఉండడం వల్ల తనకు అతిధి నిరాదరణ దోషం కలుగుతుందని భావించిన యముడు నచికేతుడిని మూడు వరాలు ఇస్తాను, కొరుకోమంటాడు.

నచికేతుడు సంతోషించి మొదటి వరంగా తన తండ్రి గారు ఇలా యమలోకానికి వచ్చినందుకు తన మీద కోపం కలిగి ఉండకూడదని , రెండవ వరంగా ఏం చేయడం లేదా ఏ విద్యను ఆచరించడం వల్ల స్వర్గాన్ని చేరవచ్చునో తెలియజేయాలనీ, మూడవ వరంగా జీవుడు మరణించిన తర్వాత ఉంటాడా, ఉండడా తెలియజేయాలని కోరతాడు.

యముడు మొదటి వరాన్ని అనుగ్రహించి, నీ తండ్రి ఎప్పటిలాగా నిన్ను ఆదరిస్తాడని, రెండవ వరం స్వర్గం చేరుకునే విద్య అంటే అగ్ని విద్య గురించి చెప్పి ఇకనుంచి ఆ అగ్ని విద్య నచికేత అగ్ని అని పిలవబడుతుంది అనే నాలుగో వరాన్ని ఇస్తాడు. ఒక రంగుల మాల కూడా బహుమతిగా ఇస్తాడు. సృష్టిలో మొదట ఆవిర్భవించినది అగ్ని కనుక అగ్ని విద్యను ఆచరించాలి. అగ్ని విద్య లేదా యజ్ఞం. ఇది బహిర్యజ్ఞం, అంతర్యజ్ఞం. బహిరి యజ్ఞం 24 ఇటుకలతో చతురస్రంగా పేర్చినటువంటి హవనకుండంలో అగ్నిని ఆవాహన చేస్తూ భూత సూక్ష్మాన్ని అనగా బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు భూత సూక్ష్మంగా ఏర్పడి ఉన్న వాటిని సంచయనం చేయడం. అంతర్యజ్ఞం ద్వారా మనలో అగ్నిని సంచయనం చేయడం అలా అంతరయజ్ఞం ద్వారా సంచయనం చేయబడిన అగ్ని ద్వారా జీవుడిని ఊర్ధ్వ లోకాలకి తీసుకువెళ్లడం ఆ విధంగా స్వర్గ ప్రాప్తి పొందడం ఇదే నచికేతాగ్ని. దీనికి ఆది శంకరులు భాష్యం చెప్తూ మూడు సార్లు నచికేతాగ్ని సంచయనం చేసిన వారు, తల్లి, తండ్రి, ఆచార్యుల అనుశాసనాన్ని పొంది జన్మ రహితుడు అవుతాడని తెలియజేశాడు.

మూడవ వరంగా నచికేతుడు అడిగిన ప్రశ్న మరణాంతరం జీవుడి అస్తిత్వం ఏమిటో తెలియజేయడానికి యముడు నచికేతుడిని పరిపరి విధాల పరీక్షిస్తాడు. ఇది అత్యంత గహనమైన విషయమని దీనికి బదులుగా మరొక వరం కోరుకోమని అడుగుతాడు, కానీ నచికేతుడు పట్టుబడతాడు. మరణాంతరం
జీవుడు అస్తిత్వం తెలియజేయడానికి తమరి కన్నా ఉత్తమమైన గురువు నాకు దొరకడని మీరు మాత్రమే తెలియజేయడానికి సమర్ధులని నాకది తప్పనిసరిగా తెలియచేయాలని కోరుకుంటాడు నచికేతుని పట్టుదల చూసిన యముడు అతనికి జీవుడు మరణాంతరం ఉన్నాడా లేడా అన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఈ ప్రశ్నకి జవాబును అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా నచకేతుడి ద్వారా యముడు జీవుడు మరణాంతరం ఉంటాడని ఉండగలడని ప్రతి వ్యక్తి సాధన ద్వారా తన అస్తిత్వాన్ని తెలుసుకోగలరని తెలియజేస్తాడు.

ఇక్కడ కఠోపనిషత్ మీద ఆదిశంకర భాష్యం వివరంగా ఇచ్చినప్పటికీ నాకు మాస్టర్ పార్వతీ కుమార్ గారి ప్రసంగ పాఠం మరణ రహస్యం-3 గా వచ్చిన నచికిత విద్య పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది మాస్టర్ పార్వతీ కుమార్ గారు తన ప్రసంగం ద్వారా చాలా సులభంగా నచికేతుని మూడో వరం వివరించారు. మాస్టర్ పార్వతి కుమార్ గారు కఠోపనిషత్ పదం ఉత్పత్తిని వివరిస్తూ ఇలా చెప్తారు.

కఠోపనిషత్ అంటే క నుంచి ఠ వరకు ఉన్న 12 అక్షరాలు కలది. ఈ 12 అక్షరాలు 12 రేకులు గల పద్మాన్ని ద్వాదశ దళ పద్మం అంటారు. ఇది అనాహిత చక్రాన్ని సూచిస్తుంది.

మన శరీరంలోని షడ్చక్రాలు మీరు వినే ఉంటారు మూలా ధార , స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు అత్యంత పైన ఉన్నది సహస్రార. అనాహితం హృదయ స్థానం హృదయం అంటే గుండె కాదు, గుండె పక్కన శరీర మధ్య భాగంలో ఉండేటువంటి ఈ చక్రము నాలుగు స్థరాలుగా మూడు మూడు దళాలతో మొత్తం 12 దళాలు మధ్యలో ఆత్మని కలిగి ఉంటుంది. మొదటి స్థరం అన్నమయ కోశం, రెండవ స్థరం ప్రాణమయ కోశం, మూడోస్తరం మనోమయ కోశం , నాలుగవ స్థలం విజ్ఞానమయ కోశం మధ్యలో ఉన్నవాడు వెలుగు అదే ఆత్మ.

ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ప్రతిదీపానికి సమానమైన వెలుగు ఉన్నట్టు జీవులను ప్రకాశితమయ్యేటువంటి ఈ వెలుగు ఆత్మ రూపంలో మన శరీరంలోనూ ఉంది. జీవుడు సూక్ష్మ దేహంగా మన నాభి కింద రెండు వేళ్ళ అంత దూరంలో సూక్ష్మ శరీర ధారుడుగా ఉంటాడని అక్కడ ఉన్నటువంటి జీవుడిని అంతర్యజ్ఞం ద్వారా షట్ చక్రాల ద్వారా ప్రయాణింప చేసి అనాహిత ద్వారా ఆత్మను చేరుకొని ఉన్నవాడు తన సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరనీ పూర్వపు రచనల్ని బట్టి అర్థం చేసుకోగలము. అటువంటి సాధన చేసిన వారు
ఆజ్ఞా చక్రం అనగా రెండు కనుబొమ్ముల మధ్య ఉన్న స్థానం ద్వారా సూక్ష్మ శరీరం ధరించి కావలసినప్పుడు శరీరం లోపలికి, బయటకు ప్రయాణం చేయగలరు. పరమహంస యోగానంద తన ప్రసిద్ధ పుస్తకం యోగి ఆత్మకథ లో ఎంతో మంది భారతీయ యోగులను పరిచయం చేస్తూ తన పరమ గురువైనటువంటి శ్యామ చరణ్ లాహిరి మహాశయుల గురించి చెప్తూ లాహిరి మహాశయులు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎంతో మందికి కనిపించారని రాశారు. ఇలా అనేక చోట్ల కోరుకున్న చోట ప్రత్యక్షమైనటువంటి యోగుల్ని చూసిన సందర్భాలు అనేకులు తమ అనుభవాలలో రాశారు.

కఠోపనిషత్ చెప్పింది ఇలా అనాహిత చక్రాన్ని దాటి ప్రయాణం చేయమనే. అలా ఎవరైతే సాధన ద్వారా చేయగలుగుతారో, వారు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు, వారు శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా తమ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలరు. తమ భూత భవిష్యత్తు ప్రయాణాన్ని వారు నిర్దేశించుకోగలరు. ఆ విధంగా సాధన ద్వారా తెలుసుకున్న వారు తమ మరణాంతరం కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటారని యముడు నచికేతులకి తెలియజేసినట్టు మనం కఠోపనిషత్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక నచికేతుని మూడో ప్రశ్నకు యముని సమాధానం నీ సాధనే నీ అస్తిత్వానికి సమాధానం. అయితే ఈ ప్రయాణం అంతా కూడా సుశిక్షుతుడైనటువంటి గురువు ద్వారానే సాధ్యపడుతుంది అనేది అన్ని పుస్తకాల్లో ఇచ్చినటువంటి వివరణ. అందుకే భారతీయతలో గురువుకి అంతటి పవిత్ర స్థానం.
ఇక ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం చేరగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే అంటాడు సద్గురు.

ఇది సూక్ష్మంగా కఠోపనిషత్ సారము లేదా నచికేత యముని సంవాదము. యముని ద్వారా మూడువరాలనీ, అనుకోని నాలుగో వరాన్ని పొందిన నచికేతుడు తిరిగి తన తండ్రి వద్దకు చేరుకొని యముడు ఏవైతే సూచించాడో వాటిని పాటించి తన భౌతిక ప్రయాణాన్ని ముగిస్తాడు.

మార్కండేయుడు స్వీయ ప్రయత్నం ద్వారా, నచికేతుడు తండ్రి యథాలాపంగా అన్న మాటతో యముడి ద్వారా మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. వీరు ఇరువురికీ తమ పరిస్థితి అది ఎదుర్కునే వరకు తెలియదు. ఇందుకు భిన్నంగా సావిత్రికి తాను ఏం చేయాలనుకుంటూదో ముందే తెలుసు. యే సాధన ద్వారా తాను సూక్ష్మ శరీరధారి కాగలదో, దానితో ఏమి సాధించగలదో తెలుసు. ఆమెకు తెలుసు కనుకనే అల్పాయుష్కుడు అని తెలిసినా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. తన సాధన మీద తనకంత నమ్మకం ఉంది గనుకనే తన అభీష్టాన్ని నెరవేర్చుకోగలిగింది కేవలం తన భర్త ప్రాణాలనే కాకుండా తన మామగారు, తండ్రి గారి అభిష్టాలను కూడా వరాలుగా పొందగలిగింది.

సావిత్రి, మద్ర దేశ అధిపతి అయిన అశ్వపతి కుమార్తె. అశ్వపతి సంతానం కొరకు 18 సంవత్సరాలు రోజుకి పదివేల గాయత్రీ మంత్రాలను అనుష్టానం చేస్తూ తపస్సు చేస్తాడు అతనికి సవిత్రమూర్తి ప్రత్యక్షమై సావిత్రి పేరుతో కుమార్తెగా జన్మించగలదని వరం ఇస్తుంది. అశ్వపతి తనకు పుత్రుడు కావాలని కోరుతాడు అందుకు సవిత్రమూర్తి ఈ కుమార్తె ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తుంది.

అశ్వపతి సావిత్రిని అపురూపంగా పెంచుతాడు ఆమె యుక్త వయసుకి సత్యవంతుని గురించిన సమాచారం తెలుస్తుంది అప్పటికే ఆమెకు సత్యవంతుడు తన భర్త అయితే బాగుంటుందని అభిప్రాయం ఏర్పడుతుంది. సావిత్రి యొక్క ప్రతిభాపాటవాలకి ఆమెకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకోవాల్సిందిగా తండ్రి అయిన అశ్వపతి సూచిస్తాడు. సావిత్రి తాను సాల్వ రాజ్యానికి చెందిన ద్యుమత్సేనుని కొడుకు సత్యవంతుణ్ణి వివాహం చేసుకోగలనని అంటుంది. నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని ఒక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుష్యు ఉందని అతను ఫలానా రోజు మరణిస్తాడని ముందే తెలియజేస్తాడు. అయినప్పటికీ సావిత్రి తాను సత్యవంతున్నే వివాహం చేసుకోగలనని చెప్తుంది. తండ్రి అశ్వపతి కూడా కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించడు.

అతను సావిత్రిని, సత్యవంతునికి ఇచ్చి వివాహం చేస్తాడు. సావిత్రి వివాహం చేసుకునేటప్పటికీ సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అంధత్వంతో ఉన్న తండ్రి, అరణ్యంలో మునివాసం చేస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. అందునా అతను అల్పాయష్కుడు. అతను అల్పాయుష్కుడన్న విషయము అతనికి గాని అతని తల్లిదండ్రులకు కానీ తెలియదు కానీ సావిత్రికి తెలుసు. అన్నీ తెలిసి సావిత్రి సత్యవంతుని జీవితంలో ప్రవేశిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. ఆమె తన సాధన మీద ఆమెకున్న నమ్మకం.

సావిత్రి సత్యవంతులు సంవత్సరకాలం ఆనందంగా జీవిస్తారు. సత్యవంతునికి మరణ సమయం ఆసన్నమవుతుంది. యధావిధిగా అరణ్యంలో కట్టెలు సేకరించడానికి సత్యవంతుడు బయలుదేరుతాడు. తానూ వస్తానని సావిత్రి అంటుంది. అతనితో బయలుదేరుతుంది. అరణ్యంలో కట్టెలు సేకరిస్తూ ఉన్నఫలంగా సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రికి దీని గురించి ముందే తెలుసు కనుక ఆమె అంతకుముందు మూడు రోజుల నుంచి త్రైరాత్ర వ్రతం చేస్తుంటుంది. త్రైరాత్ర వ్రతం అంటే మూడు రోజులు పగలు రాత్రి సాధనలో ఉండడం. సావిత్రి పరిస్థితిని అర్థం చేసుకొని అతని శరీరాన్ని ఒక భద్రమైన చోటుకు మార్చి తాను అక్కడే ఉండి, తన సూక్ష్మ శరీరం ద్వారా సత్యవంతుని ప్రాణాలను తీసుకున్న యమునితో ప్రయాణం చేస్తుంది. యముడు తనతో రావద్దని వారిస్తాడు. సావిత్రి యమునితో తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యమని అందుకనే తను సూక్ష్మ శరీరధారియై తనతో ప్రయాణం చేస్తున్నానని చెప్తుంది. ఈ లోకాలవెంట రాకూడదని యముడు పదేపదే చెప్తాడు. అందుకు ప్రతిగా నాలుగు వరాలను కోరుకో, కానీ ఈ ప్రయాణం మానుకో అని చెప్తాడు. అప్పుడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అంటాడు.

మొదటి వరంగా సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రెండవ వరంగా రాజ్యం రావాలని కోరుకుంటుంది. మూడవ వరంగా తన తండ్రికి నూరు పుత్రులు కలగాలని కోరుకుంటుంది నాలుగవ వర సమయంలో యముడు ‘నీ పతి ప్రాణాలు తప్ప’ అన్నమాట అనడు. అప్పుడు ఆమె తన భర్తని పునరుజ్జీవున్ని చేయాలని కోరుతుంది.

ప్రసన్నుడైన యముడు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎందుకంటే అది కృతయుగం కనుక కృతయుగంలో మానవుని ఆయుషు నాలుగు వందల సంవత్సరాలు కనుక నాలుగు వందల సంవత్సరాలు నూరుగురు పుత్రుల్ని కలిగి సుభిక్షంగా బతకమని వరం ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి తన మామగారి చూపుని, రాజ్యాన్ని, తన తండ్రికి పుత్రుల్ని, తన భర్త ఆయుష్షుని యముని ద్వారా పొందగలిగింది. ఆమె తిరిగి తన సూక్ష్మ శరీరంతో తనదేహానికి ప్రవేశిస్తుంది అలాగే సత్యవంతుడు యొక్క ప్రాణాలని యముడు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ విధంగా యముడికి సావిత్రి కి మధ్య జరిగిన ప్రయాణం శుభప్రదంగా ముగిసి సత్యవంతుడు పూర్ణాష్కుడై చిరకాలం ఆనందంగా జీవిస్తారు. ఇది సావిత్రి కథ. ఇది మార్కండయుడు ధర్మరాజుకి చెప్పిన ఉపాఖ్యానం.

మాస్టర్ పార్వతీ కుమార్ గారు రాసిన తన ప్రసంగ పాఠం పుస్తకం మరణ రహస్యం -2 లో సావిత్రి సంబంధించిన అంశాలని ఇలా విశ్లేషిస్తారు. సవిత్రు మండలం అంటే 12 సూర్యులని కలిగినటువంటి ఒక మండలం. ఇలాంటి 12 సవిత్రు మండలాలు కలిసి ఒక భర్గో మండలం. సావిత్రి అన్న పదానికి అర్థం సాయం సంధ్య లో ఉన్న వెలుగు అది శక్తివంతమైనది. సావిత్రి వెలుగు యొక్క ప్రతిరూపం. అందుకే గాయత్రి మంత్రంలో ” భర్గో దేవస్య ధీమహి ” అని ఉంటుంది. వెలుగు ప్రతిరూపమే సావిత్రి అది అనుష్టానం చేయడమే గాయత్రి. అశ్వపతి అనే పదానికి అర్థం ప్రాణాలకు అధిపతి అయిన జీవుడు. ఈ అశ్వపతి తపస్సు చేయడం కోసం మిగిలిన కథలలో లాగా శివుడినో, విష్ణువునో ధ్యానం చేయలేదు. అవ్యక్త రూపమైన వెలుగు. సృష్టి లో ఏది వెలుగు ను ప్రకటిస్తుందో అది.
అతను సవిత్ర మండలంలోని వెలుగును, సావిత్రిని పొందడానికి 18 సంవత్సరాలు గాయత్రీ మంత్రోపాసన చేశాడు. ఆ సవిత్ర మండల వెలుగే సావిత్రిగా అశ్వపతికి జన్మించింది. ఆ వెలుగు సూక్ష్మ శరీరాన్ని ధరించగలిగే సాధన కూడా పొందగలిగిన ప్రజ్ఞ. తనకు భవిష్యత్తు తెలిసిన ఆమె వెరవలేదు తన వెలుగు దేహంతో ముందు లోకాలకు సైతం ప్రయాణం చేసి తాను సాధించాలనుకున్న వాటిని సాధించింది.

ఆమె సాధించిన వాటిలో మొదటిది మామ గారి అంధత్వం పోవడం. మామగారు ధ్యుమత్సేన రాజు జ్ఞానముతో మూడో కన్ను కూడా కలిగిన వాడు, కానీ తన అహంకార ప్రభావం చేత తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. సావిత్రి అతని అధంత్వం పోవాలని అంటే తిరిగి జ్ఞానం రావాలని కోరుతుంది. సత్యవంతుడు అసలు పేరు చిత్రాశ్వుడు అంటే చిత్రంగా ప్రాణాలని నిలుపుకోగలిగినటువంటివాడు. వ్యవహార శైలి వలన అతనికి సత్యవంతుడు అనే పేరు వస్తుంది. అతని జన్మతః వచ్చినటువంటి పేరు చిత్రాశ్వుడు లాగానే చిత్రంగా సావిత్రి వల్ల తన ప్రాణాలను పునరుద్ధరించుకోగలుగుతాడు. సావిత్రి యమునితో చేసిన సూక్ష్మలోకాల ప్రయాణం షట్ చక్రాల ప్రయాణమే. చక్రాలు ఒక్కొక్క లోకానికి ప్రతీకగా చూపబడతాయి వాటి ప్రయాణము అనుభవము అరవిందుడు మరింత విపులంగా రాస్తాడు.
పరోక్షంగా సావిత్రి యొక్క ఉపాఖ్యానమంతాను సూక్ష్మదేహధారియై ప్రయాణించగలిగేటువంటి శక్తి సాధన దాని యొక్క ఫలితాలు, శక్తి వంటివి చెప్పడం.

మార్కండేయుడు, నచికేతుడు, సావిత్రి కథల వల్ల అర్థం చేసుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది పరోపకారం, లోక శ్రేయస్సు. మరణం సత్యం, దానిని వాయిదా వేయగల శక్తి వారి వారి సంకల్పాలకు ఉంది. అందుకు దైవం సహకరిస్తుంది.దాని కోసం సంకల్ప వృద్ది చేయాలి.దానికి కొరకు సాధన చేయాలి. అలాటి వారు మృత్యువును వాయిదా వేయగలరు. మరణించినా జనుల స్మృతిలో ఉన్నంత కాలం అమరులుగా ఉండగలరు. ఎందుకు మృత్యువును జయించాలి అంటే ప్రతీ జీవి ఎంతో కొంత నాణ్యమైన, భద్రమైన, ఆదర్శమైన జీవనాన్ని తన తదుపరి తరాలకు మిగిల్చి వెళ్ళాలి.అదీ లక్ష్యం.

అరవిందుడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు. తన సాధన ద్వారా ఆయన ప్రయాణం చేసినటువంటి సుక్ష్మ లోకాలు సావిత్రి పాత్ర ద్వారా తన ” సావిత్రి” లో నిక్షిప్తం చేశాడు సావిత్రి ఒక కావ్యానురూప యోగానుభవ ప్రకటన. ఇరవై నాలుగు వేల వాక్యాలు కలిగిన బృహత్ కావ్యం.1872 లో పుట్టిన అరవిందుడు తన 54 వ యేట మౌని గా మారిపోయి తదుపరి 24 యేళ్లు మౌనంగానే ఉండిపోయారు. 1930లో సావిత్రి రచనను మొదలు పెట్టి చాలాకాలం తన యోగానుభవాలను చేరుస్తూ పోయారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారునిగానున్న అరవిందుడు అలీపుర్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆధ్యాత్మిక అనుభవాలను పొందినట్లు రాశారు. అప్పటినుంచి యోగిగానే జీవించారు.ఆయన రూపొందించిన భక్తి, కర్మ, రాజ యోగాల ఆచరణ , అది సూప్ర మైండ్ థియరీ లేదా పూర్ణ యోగంగా చెప్పబడింది. మానవ మేధస్సులో అనేక స్థరాలు వున్నాయని దానిని కనుగొనే అవకాశం ఉందని చూపారు. అయితే దీనిని విమర్శించిన వారూ ఉన్నారు. అరవిందుడు దీర్ఘకాలం మౌనంగా ఉండడమూ దీనికి ఒక కారణము.

అరవిందుడు మొదట విప్లవకారుడు, దేశాభిమాని.తన దేశ ప్రజలకు యే సందేశం ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు ఒక భావన కలిగింది. “పెద్దపులి ఆత్మకథ ” లో ఆర్కె నారాయణ్ , భారత దేశాన్ని పెద్దపులితో పోల్చుతారు. నాకు అరవిందుడి సావిత్రిలో జ్ఞానంతో మూడు కన్ను కలిగి ఉన్నా అజ్ఞానంతో దానిని కోల్పోయి రాజ్య భ్రష్ఠుడైన రాజు ద్యుమత్సేనుడిగా భారత పాలకులూ, అతని విరోధులుగా పరదేశ పాలకులూ కనిపించారు. మరణించి మళ్లీ జీవించిన సత్యవంతుడు ఈ దేశ స్వాభిమానం , దానిని సాధించిన సావిత్రి అదే ఆ వెలుగు సామాన్యుని సాధన లేక పోరాటం.
మనం మన అస్తిత్వాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు, మన ఆస్తిత్వం మనం నిలబెట్టుకోవాలని అనుకుంటే నచికేతుడు వలె ప్రయత్నం చేయాలి, సావిత్రి వలే మన దేశమాతకి చూపునివ్వాలి. స్వాభిమానంతో జీవించాలి.సాధనా సమన్వయంతో ఇది సాధ్యం.ఇది నాకనిపించిన ఒక భావన.

ఇది స్థూలంగా అరవిందుడి సావిత్రిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే సుదీర్ఘ వివరణ. తెలుగులో వచ్చిన సావిత్రిని చదివి సులువుగా వారి కావ్యంలోకి ప్రయాణించవచ్చు. అనుసృజన, అనువాదం రెండూ అందుబాటులో ఉన్నాయి. అందరికీ సావిత్రి అవగాహన సులభతరం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను.

దేవనపల్లి వీణావాణి
17.03.2024

You may also like

Leave a Comment