శీర్షిక
రాబోయే విషయపు నిర్వచనాన్ని నేను
నన్ను భవిష్యద్దర్శనం అని కూడా పిలుచుకోవచ్చు మీరు
నా తర్వాత వచ్చేదాన్ని చదివితే
నా అర్థం మారిపోతూ వుంటుంది
గతం భవితతో చరితతో ఏర్పడుతుంది.
పేరాగ్రాఫ్
నన్ను నేను రాసుకుంటాను, కొట్టేసుకుంటాను
సవరించుకోవడం, సరిచూసుకోవడం
మళ్ళీ రాసుకోవడం – ఇవన్నీ చేస్తాను
నాకు ఎన్నో ప్రారంభాలు, ఎన్నో పఠనాలు
నన్ను మార్జిన్ల నుండి చదవండి
కింది నుండి పైకి, చివర నుండి మొదలుకు
కూడా చదవటం అవసరం
నేను పానీయమైతే మీరు పాత్ర
నిమ్నరేఖ
మీ నిమగ్నత మీద నమ్మకం లేదు నాకు
మీ సొంత నిమ్నరేఖలతో
నా మీద గెలుపు సాధించవచ్చు.
కామా
మీరు నన్నొదిలేసి ముందుకు సాగవచ్చు
కానీ సాగుతున్నట్టు మీ మీద మీకు
నమ్మకం కలగాలంటే నేను అవసరం
సెమికోలన్
కొసకూ, కొనసాగడానికీ మధ్య
నా పడకను వేసుకుంటాను
దగ్గరివాళ్ళకు కూడా
దూరంగా ఉండటం మంచిది
అది వాళ్ళకూ మీకూ
విమోచనాన్ని ప్రసాదిస్తుంది
కుండలీకరణం
ఆదుర్దా నిండిన ఆలోచనలు
అవతలికి చిందకుండా ఆపుతాను నేను
రెండు చేతుల్ని దగ్గరికి చేర్చినట్టు
వాటిని అదుపులో పెడతాను
అవి అసలు విషయాన్ని మింగేయకూడదు మరి!
‘ఇక చాలు’ అనేది నా సందేశం
కంచెకివతల ప్రేయసి
కంచెకవతల ప్రియుడు
నిల్చుని మాట్లాడుతుంటే
వచ్చి చేరుతాను వాళ్ళ మధ్యన.
అక్కడ లేనట్టు అనిపించినా
నిజానికి వుంటాను స్పష్టంగా
ప్రశ్నార్థకం
బడిలోని గదిలో లేచి నిలబడే బాల విద్యార్థిని నేను
మీ సమాధానాలను సమస్యలుగా
నిశ్చయాలను సందేహాలుగా మార్చుతాను
మీరు నన్ను చూడదల్చుకోకున్నా పురి విప్పిన నెమలి ఫింఛమై నిల్చుంటాను మీ ముందు
ఆశ్చర్యార్థకం
పదాలు ప్రతిఫలించలేని
ఉద్వేగ భావనలుంటాయి కొన్ని
వాక్యాలు వ్యక్తీకరించలేని
విస్మయాలుంటాయి కొన్ని
అక్కడ నేనుంటాను
ఎడం
నేనే లేకుంటే
పదాలు ఒక దానిలో వొకటి చిక్కుకుపోయి
అర్థాలు ఒక దానితో వొకటి అతుక్కుపోయి
భాష చొరరానిదయ్యేది
అవసరమైనచోట మనుషుల్ని ఆపుతాను నేను
వాక్యంలోకి వెల్తురును వెళ్ళనిస్తాను
పదాల మధ్య, వాక్యాల మధ్య
పేరాల మధ్య పఠిత కూర్చుని
విలోకించి వివరించేందుకు
అవసరమైన స్థానాన్ని నేను.
ఖాళీ స్థలాన్నే అయినా
కాసిన్ని సూచనలు చేస్తాను.
బిందువు
గాలి ఆడనప్పుడు మీకు ఊరటనిచ్చే
గుళికను నేను
నా సహాయంతో శ్వాస తీసుకుని
సాగండి మళ్ళీ
చివరి పంక్తి
మిత్రులారా! చివరకొచ్చాం
నేనే లేకపోతే మీరు ఆగరని తెలుసు నాకు
నేను మృత్యువును
మళయాళమూలం: కె. సచ్చిదానందన్
ఆంగ్లానువాదం: కె. సచ్చిదానందన్
తెలుగుసేత : ఎలనాగ