Home ఇంద్రధనుస్సు మన తెలుగు నాటకాలు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya

స్వేచ్ఛ నాటిక
విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెలువడిన నాటిక స్వేచ్ఛ. వివిధ ప్రదేశాలలో 35కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన నాటిక స్వేచ్ఛ. మూల కథ శ్రీ పి. ఎస్ నారాయణ, నాటకీకరణ శ్రీ పరమాత్ముని శివరాం, దర్శకత్వం శ్రీ బి.ఎం రెడ్డి .
పి .ఎస్ నారాయణ : పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.

స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు సాగించుకోవడం, ప్రవర్తించడం కాదు అంటారు రచయిత (మూల కథకులు) పిఎస్‌ నారాయణ.
బి.ఎం రెడ్డి : దర్శకునిగా రాణించిన బిఎంనరెడ్డి గారు స్వేచ్ఛ , ఆకెళ్ళ రచించిన కలనేత మొదలైన నాటికలకు దర్శకత్వం వహించారు. స్వేచ్ఛ అంటే నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండాలని చాటింది విశ్వశాంతి కల్చరల్‌ హైదరాబాద్‌ బృందం. పరమాత్ముని శివరాం నాటకీకరణకు బి ఎం రెడ్డి దర్శకత్వంలో నటవర్గం జీవం పోసింది. ఈ నాటిక యొక్క దర్శకత్వం, నటన, సాంకేతికత ప్రేక్షకులను కట్టిపడేసింది. నాటికలో దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులకు విసుగు కలగకుండా ఒక దాని వెనుక మరో సీన్ విరామం లేకుండా ప్రదర్శిండం వలన నాటికకు అందరూ కనెక్టయ్యారు. కళాకారులు. లైట్స్‌ ఆఫ్‌, ఆన్‌ ఉన్నా… సీనులు, తెరలు మారుతున్నా, ఫ్లాష్‌ బ్యాక్‌ నడిచినా… అంతరాయం అన్న భావన కలగదు. ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. అందుకే ఈ నాటిక పలు అవార్డులు గెలుచుకున్నది.


విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ముఖ్యంగా నాటక రంగం మరియు సాహిత్యంలో చురుకుగా ఉంటుంది, ప్రముఖంగా “ఆకెళ్ళ నాటిక రచనల పోటీలు” వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు నాటక ప్రదర్శనలకు మద్దతు ఇస్తుంది, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రచయితలను ప్రోత్సహిస్తుంది
విపరీతమైన స్వేచ్ఛ ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. సరైన గమ్యమూ, గమనము దానికి ఉండదనే విషయాలను ‘స్వేచ్ఛ’ నాటిక రేఖామాత్రంగా చర్చిస్తుంది.
ఆధునిక సంపన్న కుటుంబ కథ ఇది. మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో తెగదెంపులు చేసుకుని అవినాశ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నది. మహేశ్వరి కూతురు శ్వేత కూడా తల్లి దగ్గరే పెరుగుతుంటుంది. తల్లి ప్రవర్తన శ్వేతకు నచ్చదు. ఆమెకు దూరంగా, అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. తల్లి అందుకు అంగీకరించదు. తల్లీ-కూతుళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. తన తండ్రి స్థానంలోకి వచ్చిన అవినాశ్‌ అంటే శ్వేతకు నచ్చదు.మహేశ్వరి కూడా మన మధ్య సంబంధం మనవరకే పరిమితమని, ఇతర ఏ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకోవద్దని అవినాశ్‌ను హెచ్చరిస్తుంది. కూతురు వరుసైన శ్వేతపై కాముక దృష్టి ఉన్న అవినాశ్‌ కన్నేస్తాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… మహేశ్వరి అవినాశ్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.అతని సహాయంతో ప్రమోషన్ రావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది . అవినాష్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇస్తుంది. ఆ సందర్భంలో మద్యం తాగుతూ ఇద్దరూ శ్రుతిమించుతారు. ఆధునిక యుగంలో ఇవన్నీ సర్వసాధారణమని వాళ్ల భావన. ఇంటికి వచ్చిన భర్త మూర్తి మందలిస్తాడు. అతను చెప్పే మాటలు వినక ఎదురిస్తుంది. కోపం లో అవినాశ్‌పై చేయి చేసుకుంటాడు మూర్తి . మూర్తిని ఎదురించి అవమానించి తెగతెంపులు చేసుకుని కొడుకును తీసుకుని బయటకు వెళ్ళమంటుంది మహేశ్వరి . వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు ఆనంద్‌, కూతురు శ్వేత. ‘మగపిల్లవాడిని నీవు తీసుకెళ్లు, కూతుర్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను’ అని పురుష ద్వేషంతో అంటుంది మహేశ్వరి. చేసేది లేక భార్యకు విడాకులు ఇచ్చేసి ఆనంద్‌ బాధ్యత తీసుకుంటాడు మూర్తి.

కొంతకాలం గడిచాక మూర్తి చేతుల్లో పెరిగిన ఆనంద్‌ పెద్దవాడవుతాడు. మూర్తి లాగే ఉంటాడు . మూర్తి మరణిస్తాడు.తల్లి కోసం చెల్లి కోసం ఆరాటపడి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు . ఆ క్రమం లో శ్వేత పరీక్షకు డబ్బు కట్టడానికి పార్కు కు వచ్చిన విషయం తెలుసుకుని తెలియని వ్యక్తిగా వచ్చి కథ నడిపిస్తాడు.అన్నాచెల్లెళ్లు తల్లికి ఎలా బుద్ధి చెబుతారో చూడాలంటే స్వేచ్ఛ నాటిక చూడాల్సిందే!

మందుకు బానిసవడం స్వేచ్చా? అని మూర్తి సంధించిన ప్రశ్న మహేశ్వరి తో పాటు ఈ సమాజానికి వర్తిస్తుంది.

మితి మీరిన స్వేచ్ఛ తెడ్డు లేని పడవలా ఉండడమా?

స్వేచ్ఛ పేరుతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? వంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.

పలు అవార్డులు అందుకున్న స్వేచ్ఛ నాటికలో మహేశ్వరి పాత్రలో సురభి లలిత , అవినాశ్ పాత్రలో శ్రీనివాస్ , మూర్తి,ఆనంద్ పాత్రల్లో డా . వెంకట్ గోవాడ, శ్వేత పాత్రలో మంజు , సాంకేతక సహకారం నాగరాజ్ , తేజ , ఫణీంద్ర , రోహిత్, భీం తదితరులు అందించారు. బి ఎం రెడ్డి గారి దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో స్వేచ్ఛ నాటిక తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది

You may also like

1 comment

Leave a Reply to Walter3399 Cancel Reply