
కాకతీయ ప్రభల కాణాచికోటలో
గూడూరునందుదయించె సూర్యుడు!
తెలగాణతెగువకు తేజోవిరాజితుడు
నైజాముప్రభువుకు నిత్యాగ్నిహోత్రుడు!
రాచరికవ్యతిరేక రామబాణమ్మతడు
ప్రజలగుండెల్లోన మరఫిరంగేయతడు!
భూస్వామ్యపద్ధతిని భూస్థాపితముచేసి
సామ్రాజ్యవాదాన్ని చెత్తబుట్టలో వేసే!
సంస్కృతాంధ్రపద్య ధారలను పారించి
ప్రతిఘటించునటుల ప్రజలనుమేల్కొల్పె!
కవనపాండిత్యాన కవచకుండలధారి
విప్లవాగ్నినిరాల్చ విస్ఫొటక ఝరీ!
విశ్వవేదికనందు శాంతికాముక గాంధి
సమరమునుసాగించ శంఖమూదిన క్రాంతి!
నా తెలంగాణ కోటిరత్నాలవీణంటూ
తిమిరములు బాపగ సమరమెంచిన కాంతి!
ఏరులై పారేటి అగ్నిధారలజూసి పారిపోయిరి
దొంగ బూర్జువా దొరలంతా!
ముసలినక్కకుయేల నైజామురాజ్య?మని
నైజామురాజాల పైజామాలనడిగే!
నిగ్గుతీసెడి నల్లబొగ్గురాతలతోడ
పదఘట్టనల పద్యగద్యాలమేల్కొలిపే!
రుద్రవీణను మీటి ఉక్కుగొలుసులు తెంచి
గాలీబూగీతాలప్రేమసారము పంచె!
సినీ యాకసమున కవిరవిలాగ పేరొంది
అలుగునేనన్నాడు పులుగునేనన్నాడు
వెలుగునేనన్నాడు తెలుగునేనన్నాడు!
సాహిత్యలోకాన శశికాంతుడయ్యాడు
తెలగాణమేథకు తెలివితానైనాడు!
అందుకో మాచేత దాశరథి మా జోత
అందుకో వందనము మా కృష్ణమాచార్యా!