Nellutla Madhava Srinivas
ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి వ్యక్తి భగవంతుడు ఏదైనా చేయగలడు అని అంటాడు. రెండవ వ్యక్తి ఏదైనా చేయగలడు అని అంత గట్టిగా చెప్తున్నావు ఏంటి నీకు ఆయన మీద అంత నమ్మకం అని అడుగుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక చిన్న కథ చెప్తా విను తర్వాత నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది అని కథ చెప్పటం మొదలు పెడతాడు.
ఒక ఊళ్లో ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటాడు. అతడు తన పని తాను చేస్తూ కూడా ఆ శివ నామస్మరణ అనుక్షణం చేస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనవంతుడవటం చేత ఎన్నో రకాల పూజలు, దానధర్మాలు చేస్తూ అందర్నీ పలకరిస్తూ సరదాగా మాట్లాడుతూ అందరూ తనను పొగుడుతూ ఉంటే సంతోష పడిపోతూ ఉంటాడు. అటుగా వెళుతూ ఈ ఇద్దరిని చూసిన నారద మహర్షి ఆ శివుడి దగ్గరికి వెళ్లి ప్రణామములు తెలియజేసి నాకు ఒక సందేహం శివయ్య. అది నువ్వైతేనే తీర్చగలవు అని అంటాడు. ఏంటో చెప్పు అని ఆ శివుడు అడగగా….. ఆ నారద మహర్షి శివుడితో నువ్వు చూస్తున్నావు కదా కింద ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ శివుడు చెప్పులు కుట్టే అతనికి అని చెప్తాడు. అదెలా ఆ ఇంకో వ్యక్తి కూడా అనేక రకాల పూజలు దానధర్మాలు చేస్తాడు కదా మరియు చెప్పులు కుట్టుకునే వ్యక్తి అవేమీ చేయకపోగా నీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటాడు. అయితే ఒక పని చెయ్యి నేను ఒక మాట చెప్తాను దానిని తూ.చా తప్పకుండా వారితో చెప్పు ఎవరు ఏం సమాధానం చెప్తారో దానిని బట్టి ఎవరికి పుణ్యం ఇవ్వాలో నిర్ణయిద్దాం అని అంటాడు. నారద మహర్షి సరే అని శివుడు చెవిలో చెప్పిన విషయాన్ని మారువేషంలో ముందుగా సంపన్నుడి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. ఓయ్ పెద్దమనిషి నేను ఆ శివయ్యను చూశాను తెలుసా అని చెప్తాడు. ఓ!!! అవునా. శివయ్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు వెటకారంగా. శివయ్య సూది బెజ్జం లో నుండి ఏనుగును దూరుస్తున్నాడు అని సమాధానం చెప్తాడు మారువేషంలో ఉన్న నారద మహర్షి. చాలు చాలు లేవయ్యా సూది బెజ్జం లో నుండి ఏనుగును దూర్చడమేంటి వెటకారంగా ఉందా అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాస్త ముందుకెళ్లి ఇదే విషయాన్ని చెప్పులు కుట్టుకునే వాడితో చెప్తాడు. చెప్పులు కుట్టుకునే వాడు చాలా సంతోషంగా అవునా!!! అయినా నా శివయ్య ఏదైనా చేయగలడు అని అనుకుంటూ తన పనిలో తాను నిమగ్నమై శివనామ స్మరణ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నారద మహర్షి నీకు నేను చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కోపంగానీ ఆశ్చర్యం కానీ కలగలేదా అని అడుగుతాడు నారద మహర్షి. లేదయ్యా ఆ రెండు కలగటానికి ఆయన మనలాగా మామూలు మనిషి కాదు కదా!!!! అంటూ పక్కనే చెట్టు మీద నుండి రాలి పడిన మర్రి పండును ఒక దాన్ని తీసి మారువేషo లోఉన్న నారదమహర్షికి చూపిస్తూ ఇంత చిన్న పండు లో నుండి ఇంత పెద్ద వృక్షాన్ని సృజించగలిగిన నా తండ్రి సూది బెజ్జ ం లోనుండి ఏనుగును తీయలేడా??? ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యం ఎందుకు???? ఆయన ఏదైనా చేయగలడు. మనకు కావాల్సిందల్లా ఆయన మీద నమ్మకం మాత్రమే అని తన పని తాను చేసుకుంటాడు. ఈ సమాధానం విన్న నారద మహర్షి శివుడి దగ్గరికి వెళ్లి నిజమే స్వామి మీరు చెప్పింది అని ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు.
మనం కూడా చాలాసార్లు మనకు దైవం మీద నమ్మకం లేకపోయినా అలవాయితీగానో అలవాటుగానో ఇష్టం లేకపోయినా ఆడంబరాలకు పోయి పొగడ్తలకు లొంగిపోయి చాలా పనులు చేస్తుంటాం. కానీ ఆ పరమేశ్వరుడికి కావలసింది తన పైన నమ్మకం పెట్టుకోవటం, భగవంతుడు మీద ప్రీతి కలిగి ఉండటం . దేవుడి మీద భారం వేసి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చటమే ఆయన పని. తనపైన నమ్మకం పెట్టుకున్న వారిని అనుక్షణం కాపాడటం భగవంతుడు ప్రధమ కర్తవ్యం గా భావిస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా అంతా మనదే గొప్ప అని గొప్పలకు పోకుండా ఆ భగవంతుని తలుచుకొని చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. అప్పుడప్పుడు చిన్నచిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి.ఇక ఎదురయ్యే ఆటంకాల గురించి అంటారా అవి మన కర్మఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే.
సర్వేజనా సుఖినోభవంతు
చిట్టి కథ గొప్ప సందేశం
బాగా సంపన్నులు అయిన ఒక కుటుంబంలో వారితో చాలా సంవత్సరాలుగా ఒక కుక్క ఉండేది. ఆ కుక్క చాతనైనన్ని రోజులు ఆ ఇంటికి తను చేయగలిగినంత చేసి కంటికి రెప్పలా కాపాడింది ఇంట్లో వాళ్ళని. ఇక ఇప్పుడు దాని ఓపిక తగ్గి అది ఏమి చేయలేదు అనుకున్న సమయంలో ఆ ఇంటి యజమాని ఇక దీంతో మనకు పని లేదు దీనిని వదిలేసి ఇంకొక దాన్ని తెచ్చుకుందామని దానిని దూరంగా ఉన్న అడవిలోకి వదిలిపెడతాడు. ఆ కుక్కని వదిలేసి ఆ యజమాని వెళ్లిపోయిన తర్వాత నిదానంగా ఓపిక కూడతీసుకొని నడుస్తున్న కుక్కను అటుగా వస్తున్న ఒక పులి చూస్తుంది. హమ్మయ్య !!!!ఎక్కువగా కష్టపడకుండా నాకు ఈ రోజుటి ఆహారం లభించింది అని అనుకుంటూ నెమ్మదిగా కుక్క వస్తున్నవైపు అడుగులు వేస్తూ వస్తుంది. అది గమనించిన కుక్క ముందు భయపడిన ….నిదానంగా ఆలోచించి తనలో తాను అనుకుంటున్నట్లుగా పులికి వినబడేటట్టుగా ఈ విధంగా మాట్లాడింది. కొంచెం సేపు అటు ఇటు నడిచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ పులి దగ్గరికి వచ్చే సమయానికి దానికి వినిపించేటట్లుగా ఇవి నిన్న మొన్న నేను తిన్న పులి ఎముకలు కదా !!! ఇక ఈరోజు ఆహారం వెతకకుండానే నా దగ్గరికి వస్తుంది అని అంటుంది. అది విన్న పులి భయపడి నిదానంగా వెనుకకు జరుగుతుంది అక్కడినుండి. ఇదంతా చెట్టు పైన కూర్చుని చూస్తున్న కోతిగమనించింది. పులి కొంచెం దూరం వెళ్లిన తర్వాత కోతి రెండు చెట్ల అవతలికి దూకి పులితో ఈ విధంగా అంటుంది. అయ్యో!!!! పిచ్చిదానా నువ్వు దాని మాటలు నమ్మావా??? అది ఇప్పుడు తిన్నవి కావు .చాలా రోజుల నుండి ఉన్నాయి ఆ ఎముకలు అక్కడ. నువ్వు ఏమీ భయపడాల్సిన పనిలేదు .ఆ జంతువు నీ నుండి తప్పించుకోవడానికి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది అంతే. నువ్వు వెళ్లి హాయిగా దానిని ఆరగించు. నీకు తోడుగా నేను వస్తాను పద అని పులికి చెప్పి రెండూ కలిసి బయలుదేరాయి. అది గమనించిన కుక్క విషయం గ్రహించి ఇప్పుడు ఏం చేయటం అని ఒక నిమిషం ఆలోచించి తెలివిగా అవి రెండు వినేటట్లుగా నేను ఇందాకే చెప్పి పంపించాను కదా ఒక కోతికి మొన్న తెచ్చిన పులిని మూడు రోజులకు సరిపడా తిన్నాను. పులి మాంసం చాలా బాగుంది. మళ్లీ ఒక పులిని ఆహారంగా తీసుకురమ్మని పంపాను. ఇంకా రాలేదేంటి అని ఆ రెండింటికి వినిపించేటట్టుగా స్వగతంగా అనుకుంటుంది. అది విన్న పులికి చాలా కోపం వస్తుంది. పులి కోపంగా కోతిని చూసి నిజంగానే తనను ఆ జంతువుకు ఆహారంగా ఇవ్వడానికే కోతి పన్నాగం పన్నింది అని భ్రమపడి అమాంతం కోతిని తన పంజాతో కొట్టి చంపి అరవిస్తుంది. ఇది వినడానికి చిన్న కథ అయినా ఎంత నీతి చూడండి. అనవసరంగా ఎదుటి వారి వ్యవహారంలో తల దూర్చకూడదు దూరిస్తే కోతికి పట్టిన గతే పడుతుంది. అంతేకాకుండా అపాయం వచ్చినప్పుడు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలా అని మనం ఆలోచించటం మొదలుపెడితే ఎదుటి వ్యక్తి, ఎదుట ఉన్న ప్రమాదం ఎంత పెద్ద వైనా సరే తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం కనపడుతుంది. అప్పటికి బయటపడే అవకాశం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేయకుండా భయపడితే మాత్రం మనంతట మనమే గోతిలో పడ్డట్లుగా ఉంటుంది. పులిని భయపెట్టడం అనేది కుక్క వల్ల అయ్యే పని కాదు కానీ …..తన ప్రాణం మీద ఉన్న తీపి తో ఒక ప్రయత్నమైతే చేసింది కుక్క. ఆ క్షణానికి కుక్క మాటలను పులి నమ్మటం వలన కుక్క సేఫ్ గా బయటపడగలిగింది.
అందుకే ఆపద రాగానే కంగారుపడి భయపడి హడావిడి చేయకుండా ఏ ప్రయత్నము చేయకుండా కూర్చోవడం కన్నా మెదడుకు పదును పెడితే ఆపద నుండి దాదాపుగా గట్టెక్కగలం . ఒక జంతువే అంత తెలివిగా ప్రవర్తించి తన ప్రాణాలను కాపాడుకోగలిగినప్పుడు ….మనం మానవులం దానికన్నా తెలివైన వాళ్ళం అంతకన్నా తెలివిగా మనం ఆలోచించలేమా చెప్పండి.
నేను విన్నది నాకు నచ్చింది మీతో పంచుకోవాలనిపించి పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి.
సర్వేజనా సుఖినోభవంతు
కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం యొక్క విశిష్టత, మరియు ప్రయోజనము
కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే ముందు ప్రమిద మీద కాస్త పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి దీపంలోనికి ఆ భగవంతున్ని ఆవాహన చేయాలి. ఆవాహన చేసేటప్పుడు చదవవలసిన మంత్రం త్రయంబక మావాహయామి అని గాని దామోదర మావాహయామి అని గాని చెప్పి ఆ దీపాన్ని పరమేశ్వరుడిగా గాని, దామోదరుడిగా గాని భావించి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి.
ఆ దీపస్వరూపమే దామోదరుడు లేదా పరమేశ్వరుడు.
ఆ *దీపమే పరబ్రహ్మము *అటువంటి దీపాన్ని వెలిగించుట వలన కలుగు ప్రయోజనములు
ఈ లోకంలో కొన్ని లక్షల, కోట్ల ప్రాణులు ఉన్నాయి కానీ …..అవి తమను తాము కానీ, ఇతరములను గాని ఉద్ధరించు శక్తి కానీ, భగవాన్నామస్మరణ చేయగల శక్తి గాని కలిగి లేవు. కానీ మానవుడు ఎంతో ఉత్కృష్టమైన మనిషి జన్మను పొంది ఉండటం వలన ఇతర ప్రాణులను ఉద్ధరించుటకు కావలసిన విభూతిని పొంది ఉన్నాడు. కనుక ఇతర ప్రాణులను ఉద్ధరించడానికి ,చెట్లు, జంతువులు, పశువులు, పక్షులు, కీటకాలు, మొదలగు ఎన్నో చరాచర జీవరాసులకు అనుగ్రహం చేయగలిగే అనువైన తిథి ఈ కార్తీక పౌర్ణమి. (మనం ఈ భూమి మీద ఎన్నో ప్రాణులను మన అవసరాలకు వాడుకుంటున్నాం అందులో మొట్టమొదట చెప్ప తగినవి చెట్లు) ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే దీపాన్ని మన చుట్టూ ఉన్న ప్రాణులు చూసిన కారణం చేత అవి మరల జన్మను పొందవు అని ఋషి వాక్యం.🙏🏻🙏🏻 అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించకుండా ఉండటం వలన ఇతర ప్రాణుల వలన మనం ప్రయోజనం పొంది వాటికి విముక్తి కలిగించకపోవడం వలన కృతఘ్నతా దోషం కూడా పొందుతారు మానవులు. తద్వారా మనిషి జన్మకు అర్థం కాని సార్ధకత గాని కలగవు .కనుక ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించి మన చుట్టూ ఉన్న జీవకోటికి విముక్తిని కలిగిస్తారో… వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరు . కాలాతీతులు కాగలరు . ఫలితంగా పుణ్యాన్ని సంపాదించుకోగలరు. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించి ఈ మానవ జన్మకు సార్ధకత పొందుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బిడ్డలను కాపాడు ఉయ్యాలో
పిల్లలంతా గూడి ఉయ్యాలో
పువ్వులను తెచ్చిరి ఉయ్యాలో
రంగురంగుల పూలు ఉయ్యాలో
రాసిగా పోసిరే ఉయ్యాలో
రాశిలోని పూలతో ఉయ్యాలో
రమ్యంగా పేర్చిరి ఉయ్యాలో
అతివలoత గూడి ఉయ్యాలో
అందంగా పేర్చిరి ఉయ్యాలో
సిరిగల్ల తల్లిని ఉయ్యాలో
సిద్ధమే చేసిరీ ఉయ్యాలో
వెంపలి చెట్టు నే ఉయ్యాలో
బొడ్రాయిగా నిలిపి ఉయ్యాలో
పూలతో పూజింతుము ఉయ్యాలో
తీర్చినా బతుకమ్మనుయ్యాలో
తనివితీరా చూసి ఉయ్యాలో
పడతులంతాగూడి ఉయ్యాలో
పాటకైగట్టిరే ఉయ్యాలో
కన్నెపిల్లలంతా ఉయ్యాలో
పట్టు పరికిణీ లతో ఉయ్యాలో
పడతులందరేమో ఉయ్యాలో
పట్టు చీరలతోని ఉయ్యాలో
తీరొక్క సొమ్ములతో ఉయ్యాలో
తీర్చిదిద్దు కొనిరి ఉయ్యాలో
తంగేడు పూలతో ఉయ్యాలో
బతుకమ్మలే పేర్చి ఉయ్యాలో
గునుగు పూలతోని ఉయ్యాలో
అందం గా దిద్దిరీ ఉయ్యాలో
రంగు రంగుల పూలు ఉయ్యాలో
పొంకముగ పొంగించి ఉయ్యాలో
పసుపు ముద్దతోని ఉయ్యాలో
గౌరమ్మనే నిలిపి ఉయ్యాలో
గుండ్రంగా తిరుగుతూ ఉయ్యాలో
పాటలే పాడిరీ ఉయ్యాలో
చప్పట్లు కొట్టుతూ ఉయ్యాలో
సంబరంగా ఆడిరీ ఉయ్యాలో
అమ్మ లక్కలు గూడి ఉయ్యాలో
అబ్బురంగ చూస్తుండి రుయ్యాలో
ఘనమైన తెలంగాణల ఉయ్యాలో
బతుకమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఆట మొదలు పెట్టే ఉయ్యాలో
బీరప్పపాటలను ఉయ్యాలో
తీరు తీరుగ పాడి రుయ్యాలో
అలుపు సొలుపు లేక ఉయ్యాలో
మగువలంతా చేరి ఉయ్యాలో
ముదముతో ఆడిరీ ఉయ్యాలో
దేశ దేశాలలో ఉయ్యాలో
దినమొక్క తీరుగా ఉయ్యాలో
బతుకమ్మను చేసిరి ఉయ్యాలో
చిన్న పెద్ద భేదాలు ఉయ్యాలో
ఎవరికసలు లేదు ఉయ్యాలో
అందరూ ఏకమై ఉయ్యాలో
ఆనందముతోడ ఉయ్యాలో//2//
అలుపెరుగ కాడిరే ఉయ్యాలో
అలసి సొలసినారు ఉయ్యాలో
నప రొక్కతీరు తీరుగాఉయ్యాలో
నైవేద్యములను తెచ్చి ఉయ్యాలో
పంచ కజ్జాయంబు ఉయ్యాలో
నైవేద్యము పెట్టి రుయ్యాలో
ఆడి పాడి అలసి ఉయ్యాలో
జోల పాట పాడి రుయ్యాలో
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
పోయి మల్ల రావమ్మా ఉయ్యాలో//.2//
ప్రతి వ్యక్తి జీవితం పాఠశాలలోని తరగతి గదిలో
నిర్మించబడుతుంది అంటారు
అటువంటి విద్యాలయం ఒక ఉద్యానవనమైతే…
గురువే ఆ ఉద్యానవనానికి తోటమాలి…
క్షేత్రం ఎంత సారవంతంగా ఉంటే…
ఫల సాయం అంత అద్భుతంగా వస్తుంది…
అంతటి సారవంతమైన పాఠశాల అనే క్షేత్రంలో…
గురువు అనే తోటమాలి
విద్యార్థి అనే విత్తనాన్ని నాటి…
దానికి ప్రేమ ఆప్యాయత అనే నీరు పోసి…
ఈర్ష్య, అసూయ అనే కలుపును ఎప్పటికప్పుడు పెరికి వేస్తూ…
కోపం, ద్వేషం అనే చీడ పీడలను దరిచేరినీయకుండా…
విద్యాబుద్ధులతోపాటు జ్ఞానం అనే ఎరువు వేస్తూ…
మంచితనం మానవత్వం అనే పూలు పూయిస్తూ…
ఎంత పెద్ద గాలివాన వచ్చిన విద్యార్థి అనే మొక్క నేలకొరకకుండా…
తానే ఊత కర్రలా నిలబడి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా…
ఆ విద్యార్థి అనే మొక్కను పెంచి పోషిస్తాడు.
అలుపెరుగని హాలికుడు, అవిశ్రాంత శ్రామికుడు గురువు.
తల్లిదండ్రుల తర్వాత సమాజంలో అంత గొప్ప స్థానాన్ని
దక్కించుకున్న మహోన్నత వ్యక్తి గురువు….
అటువంటి గురువులకు వారిలాగా ఉన్నతమైన
జీవన ప్రమాణాలతో జీవించి చూపించడమే మనం వారికి ఇచ్చే అసలైన గురుదక్షిణ.
మరొక మారు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
చిట్టి కథ
చైనీస్ బ్యాoబు అని ఒక చెట్టు యొక్క విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల కనిపించదు. కానీ ఓపికగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఐదవ సంవత్సరము కూడా ఆ నాటిన విత్తనాలకు నీళ్లు పడుతూ ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఆరువారాలలోనే 90 ఫీట్ ఎత్తు ఎదుగుతుంది. చూసేవాళ్ళందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తారు. అరే!!!! ఇన్ని రోజులు ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగే ఉన్నది ఇది. ఆరు వారాల్లో ఎంత ఎత్తు ఎదిగిపోయింది అని. కానీ చూసే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అది స్తబ్దుగా ఉంది కాదు కాదు ఉన్నట్లు కనిపించింది కానీ అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. వేర్లను బలంగా భూమిలోకి పాతుకపోయింది. పైన దాని యజమాని ఎంత కష్టపడ్డాడో, అది అంతకు రెట్టింపు భూమిలోనికి పాదుకొని పోయింది. దేనికైనా ఒక సమయం అంటూ వస్తుంది కదా!!!! అదే విధంగా దానికి కూడా సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా ఆకాశానికి ఎదుగుతుంది. దాని యజమాని నిరాశ పడి ఇది పెరగట్లేదు అని దానికి నీరు పట్టడం ఆపేస్తే ఆ మొక్క ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండేదేమో.!!! కానీ ఆయన అలా చేయలేదు .ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దానికి నీళ్లు పట్టేవారు .పోషణ అందించేవాడు. యజమాని ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఆ మొక్క కూడా భూమి లోపల తన పని తాను చేసుకుని అకస్మాత్తుగా అందరు ఆశ్చర్యపడే విధంగా ఆకాశానికి ఎదిగింది.అదేవిధంగా మనిషి కూడా అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకుని పనిని కల్పించుకొని నమ్మకంతో మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యేవరకు ఎదురు చూడగలిగితే అది తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు అంటారు కష్టేఫలి అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వండకుండా నోట్లోకి ముద్ద రావాలి అనుకునే అంత మూర్ఖత్వం. నిజాయితీగా కష్టపడితే ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక రోజుఫలితం తప్పకుండా దక్కుతుంది . ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సినవి ప్రకృతి మనకు నేర్పించేవి చాలా ఉంటాయి. సరిగ్గా శ్రద్ధ పెడితే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదిగానే కనిపిస్తుంది. తదనుగుణంగా మనం మసలగలిగితే అది మన ఎదుగుదలకు సహకరిస్తుంది. చిట్టి కథ గొప్ప సందేశం. నాకైతే బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనిపించి రాశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు
చిట్టి కథ గొప్ప సందేశం
ఒకరోజు ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్లాడు . అతడు కొన్ని పావురంలను వేటాడు సాయంత్రం ఇంటికి తిరుగు ముఖం పట్టాడు దారిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై దారంతా జలమయం అయ్యింది. అప్పుడు ఆ వేటగాడు గబగబా ఒక మర్రి చెట్టు కింద తలదాచుకోవడానికి వెళ్ళాడు. వేటగాడు మర్రి చెట్టు కిందకు వెళ్లిన తర్వాత ఆ మర్రి చెట్టుకు ఒక వాగ్దానం చేశాడు. నన్ను విపత్కర పరిస్థితి నుండి ఈరోజు నువ్వు కాపాడినట్లయితే నేను రేపటినుండి వేటను వదిలేస్తాను ఇంకా ఏ కష్టమైనా చేసుకొని బ్రతుకుతాను ఈ జీవహింస చేయను అని అమరు చెట్టుకు వాగ్దానం చేస్తాడు. కాసేపటికి వాన కొంచెం తగ్గుముఖం పడుతుంది.అప్పుడే పైన చెట్టు మీద గుడి కట్టుకొని నివసిస్తున్న ఒక మగ పావురం మేత కోసం వెళ్లిన ఆడ పావురాన్ని తలుచుకొని దుఃఖిస్తుంది. అయ్యో!!! మేత కోసం వెళ్లిన నా భార్య ఇంకా రాలేదు ఏ ఆపద వచ్చిందో తనకు అని బాధపడుతుంది. ఇంతలో చెట్టు క్రింద వేటగాడు వేటాడి తెచ్చి పెట్టుకున్న పావురాలలో ఈ మగ పావురం భార్య అయిన ఆడ పావురం కూడా ఉండి మగ పావురం మాటలను వింటుంది. ఆహా!! నా జన్మ ధన్యం. నా భర్తకు నా మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షంగా చూడగలిగాను. మొదటి అదృష్టవంతురాలిని అని అనుకుంటుంది. తనకోసం వ్యాకులత చెందుతున్న భర్తను చూసి జాలి వేసి ప్రేమగా అరుస్తుంది. ఆడ పావురం అరుపును గమనించిన మగ పావురం చెట్టు కిందకు వంగి చూస్తుంది. అక్కడ తన భార్య అయిన ఆడ పావురాన్ని చూసి చాలా సంతోషించి అది కూడా అడపావురం వద్ద వాలుతుంది. భర్తను చూసిన ఆడ పావురం మగ పావురంతో ఈ విధంగా అంటుంది. ఈ చెట్టు పైన మనం గూడు కట్టుకొని నివసిస్తున్నాం కనుక ఇదే మన ఇల్లు ఈ వేటగాడు మన ఇంటికి వచ్చిన అతిధి. కనుక నీవు అతనికి అతిధి మర్యాదలు చేయి అని మగ పావురంతో చెప్తుంది. మగ పావురం అలాగేనని అయ్యా!!! ఇది మా ఇల్లు. మీరు మా ఇంటికి వచ్చిన అతిధి. అతిధికి అతిధి మర్యాదలు చేయాల్సిన బాధ్యత కూడా నాదే కనుక మీకు నేను ఏ విధంగా మర్యాదలు చేయగలను తెలియజేయండి అని అడుగుతుంది మగ పావురం. అప్పుడు ఆ వేటగాడు ఇప్పటికైతే నాకు చాలా చలిగా ఉంది చలిని తగ్గించడానికి ఏమైనా చేయగలిగితే చేయి అని చెప్తాడు. అది విన్న మగ పావురం వెంటనే చెట్టు కింద అక్కడక్కడ పడి ఉన్న చిన్నచిన్న కర్ర పుల్లలను తెచ్చి చలిమంటను వేస్తుంది. వేటగాడు కాసేపు ఆ చలిమంట కాచుకొని కాసేపు ఆగిన తర్వాత తనకు బాగా ఆకలిగా ఉందని చెప్తాడు. అది విన్న మగ పావురం అయ్యా!!! మాకు ఆకలి వేస్తే అప్పటికప్పుడు వెళ్లి ఆహారాన్ని సేకరిస్తాము దానినే తింటాము. మీ మానవుల లాగా మేము ఆహారాన్ని దాచుకోము. కానీ మీరు పక్షులను వేటాడి తింటారు కదా!!! అయితే ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే నేను ఈ మంటల్లో దూకి మీకు ఆహారాన్ని అవుతాను స్వీకరించండి అంటూ…. మగ పావురం ఆ మంటల్లో దూకుతుంది. అది చూసిన వేటగాడు చలించిపోయి ఛీ!! పక్షికి ఉన్న పాటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది. అతిధి మర్యాద చేయడానికి వేరే దారి లేక అది పక్షి అయినప్పటికీ దాని ప్రాణాన్ని త్యాగం చేసి నాకు ఆహారంగా మారింది. మరే విధంగానైనా ఆహారం సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన నేను మాత్రం మూగ జీవులను హింసించి వాటిని ఆహారంగా సేకరిస్తున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది .అనుకొని వలలో ఉన్న పావురాలన్నింటిని ఆకాశంలోకి విసిరేస్తాడు. అన్ని పావురాలు గాల్లోకి సంతోషంగా ఎగిరిపోగా ఆడ పావురం మాత్రం అతిధి మర్యాద కోసం ప్రాణత్యాగం చేసిన భర్తను తలుచుకొని దుఃఖిస్తూ తను కూడా ఆ చితిమంటలో దూకి ఆత్మర్పణం చేసుకుంటుంది. అప్పటికే ముక్తిని పొందిన మగ పావురం దేవలోకంలో బంగారు విమానంలో కూర్చుని ఎదురుచూస్తుంది ఆడ పావురం కోసం. భార్య మాట కోసం భర్త ,భర్త కోసం భార్య ఒకరికొకరు త్యాగాన్ని ప్రదర్శిస్తారు. మనల్ని నమ్మి ఆశ్రయించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించి అతిధి మర్యాదలు చేసినంత మాత్రము చేత పక్షులైన పావురాలకి మోక్షం కలిగింది. మనం చేసిన మంచి ఎప్పటికీ వృధా పోదు అనటానికి ఈ కథ ఒక నిదర్శనం. కథ కల్పితమే అయినప్పటికీ విని నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ కథలో. మనం మంచి విషయాన్ని స్వీకరించాలి అనుకున్నప్పుడు అది కథన, కల్పితమ, వాస్తవమా చూడాల్సిన అవసరం లేదు. సందేశాత్మకంగా ఉన్న దేని నుంచైనా మంచిని నేర్చుకోవచ్చు . చిట్టి కథ గొప్ప సందేశం. మిత్రులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చే మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో రాయటం జరిగింది.
(సామాజిక మాధ్యమం నుండి సేకరణ)
సర్వేజనా సుఖినోభవంతు
ఒకరోజు ఒక ఆసుపత్రికి గర్భం దాల్చిన ముగ్గురు స్త్రీలు వస్తారు పరీక్ష చేయించుకోవడానికి. స్త్రీలకు ఉన్న సాధారణమైన అలవాటుగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ వారి యొక్క స్థితిగతులను చెప్పుకుంటారు. అందులో మొదటి స్త్రీ ఈ విధంగా చెప్తుంది. నా భర్త చాలా ఆస్తిపరుడు నేను ఏది కావాలన్నా కాదనకుండా కొనిస్తాడు నా కోసం ఒక కారు డ్రైవర్ను కూడా సిద్ధంగా ఉంచుతాడు ఎప్పుడు. ఇంటి నిండా పనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అని చెప్పింది. అది విన్న రెండవ స్త్రీ నా భర్త ఒక మల్టీ నేషనల్ కంపెనీకి మేనేజర్. నాకు కూడా దేనికి కొదవలేదు ఏ లోటు రాకుండా ఏది అడిగినా కాదనకుండా కొనిస్తాడు. అంతేకాకుండా తన క్రెడిట్ కార్డు కూడా ఎప్పుడూ నా చేతిలోనే ఉంటుంది .అని గర్వంగా చెప్పింది. అది విన్న మూడవ స్త్రీ మీరు చెప్పినట్లుగా మేము అంత ధనవంతులం కాదు మాకు కార్లు బంగాళాలు నౌకర్లు లేరు కానీ….. నా భర్త నన్నుఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఏదైనా చిన్న బాధ కలిగితే అతని కంట్లో కన్నీళ్లు వస్తాయి. ఇప్పుడు కూడా నన్ను నా బర్తనే ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అని చెప్పింది .అది విన్న ముందు ఇద్దరు అంతేలే అంతకన్నా ఏం చెప్పుకుంటారుఈ డబ్బు లేని వాళ్ళు. అని ఎగతాళి చేస్తారు మూడవ స్త్రీని.ఆసుపత్రిలో వైద్య పరీక్ష తర్వాత ముగ్గురు బయటికి వస్తారు. అప్పుడు మొదటి స్త్రీ ఇందాక నేను చెప్పాన నాకోసం కారు డ్రైవరు అప్పుడే వచ్చేసింది అని చెప్పి కార్ డోర్ తెరిచి కూర్చుంటుంది. తర్వాత రెండవ స్త్రీ అదిగో మా కారు డ్రైవర్ కూడా వచ్చారు అని నవ్వుతూ కార్ డోర్ తెరుస్తుంది. ఇక మిగిలిన మూడవ స్త్రీ తన భర్త రాకను గమనించి చాలా సంతోషంగా అటువైపు అడుగులు వేస్తుంది. ధనవంతులైన ఇద్దరు స్త్రీలు కూడా ఆమె చూస్తున్న వైపు చూస్తారు. ఒక పాత స్కూటర్ తో అత్యంత సాధారణంగా ఉన్న వ్యక్తి వారు ఉన్న వైపుగా వస్తున్నారు. అతనిని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. కానీ అతని భార్య మాత్రం ఎదురెళ్లి ఇంత ఎండలో మీరు ఎందుకు వచ్చారండి నేను వచ్చేదాన్ని కదా అని అంటుంది ఆప్యాయంగా. అదేంటి లక్ష్మి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది కాదా!!! ఇంత ఎండలో నువ్వు మాత్రం ఎలా వస్తావు అందుకే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అంటూ బాటిల్లో నీళ్లు తీసి భార్య చేతికి అందించి ముందు నీళ్లు తాగు అంటూ అతని జేబు రుమాలు తీసి భార్య నుదిటిన వస్తున్న చెమటను తుడుస్తాడు ఎంతో ప్రేమగా. సరే ఇక పదండి బాగా ఎండగా ఉంది. ఆకలిగా కూడా ఉంది ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం.అంటూ అతని స్కూటర్ ఎక్కి వెళ్ళిపోతుంది. అది చూసిన మిగతా ఇద్దరూ ఆమె వెళ్లిన వైపే చూస్తూ నిశ్చేష్టులై నిలబడతారు. అప్పుడు అర్థమవుతుంది వారికి వారు ఏం కోల్పోతున్నారు అనేది. డబ్బు, హోదా, పలుకుబడి ఎంత ఉన్నా ఆప్యాయంగా పలకరించే మనిషి ,అభిమానించే మనిషి కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి భర్తగా దొరకడం స్త్రీల అదృష్టం అది కదా అసలైన సంపద. అవునంటారా? కాదంటారా??
సామాజిక మాధ్యమంలో ఒక చిన్న రీల్ చూసి నా కలాన్ని కదిలించి రాయించిన చిట్టి కథ

కాకతీయ ప్రభల కాణాచికోటలో
గూడూరునందుదయించె సూర్యుడు!
తెలగాణతెగువకు తేజోవిరాజితుడు
నైజాముప్రభువుకు నిత్యాగ్నిహోత్రుడు!
రాచరికవ్యతిరేక రామబాణమ్మతడు
ప్రజలగుండెల్లోన మరఫిరంగేయతడు!
భూస్వామ్యపద్ధతిని భూస్థాపితముచేసి
సామ్రాజ్యవాదాన్ని చెత్తబుట్టలో వేసే!
సంస్కృతాంధ్రపద్య ధారలను పారించి
ప్రతిఘటించునటుల ప్రజలనుమేల్కొల్పె!
కవనపాండిత్యాన కవచకుండలధారి
విప్లవాగ్నినిరాల్చ విస్ఫొటక ఝరీ!
విశ్వవేదికనందు శాంతికాముక గాంధి
సమరమునుసాగించ శంఖమూదిన క్రాంతి!
నా తెలంగాణ కోటిరత్నాలవీణంటూ
తిమిరములు బాపగ సమరమెంచిన కాంతి!
ఏరులై పారేటి అగ్నిధారలజూసి పారిపోయిరి
దొంగ బూర్జువా దొరలంతా!
ముసలినక్కకుయేల నైజామురాజ్య?మని
నైజామురాజాల పైజామాలనడిగే!
నిగ్గుతీసెడి నల్లబొగ్గురాతలతోడ
పదఘట్టనల పద్యగద్యాలమేల్కొలిపే!
రుద్రవీణను మీటి ఉక్కుగొలుసులు తెంచి
గాలీబూగీతాలప్రేమసారము పంచె!
సినీ యాకసమున కవిరవిలాగ పేరొంది
అలుగునేనన్నాడు పులుగునేనన్నాడు
వెలుగునేనన్నాడు తెలుగునేనన్నాడు!
సాహిత్యలోకాన శశికాంతుడయ్యాడు
తెలగాణమేథకు తెలివితానైనాడు!
అందుకో మాచేత దాశరథి మా జోత
అందుకో వందనము మా కృష్ణమాచార్యా!

