మహిళలూ – సమాజం March మయూఖ సంపాదకీయం
డాక్టర్ కొండపల్లి నీహారిణి మయూఖ సంపాదకులు
మార్చ్ నెల,మే నెల మహిళా ప్రాతినిధ్యానికి ముఖ్యమైన నెల లు గా గుర్తించారు. బాగానే ఉంది. ఏడాది పొడుగునా ఎదురయ్యే సమస్యలు సందేహాలతో ఆడవాళ్ళు పడే వేదనలకు ఏమైనా జవాబుగా మార్గం చూపాయా? చూపితే, ఏ దారి గా ఏ ఋజువులు గా చూపారు? చూపగలరు? అని ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తాయి.
అడుగడుగునా ఆధిపత్యాన్ని చూపిస్తూ అణగదొక్కుతూ ఆడవాళ్లను ఆత్మ న్యూనతలో పడవేస్తున్న ఈ పురుషస్వామ్య సమాజం ఒక్కసారైనా ఆత్మావలోకనం చేసుకోవాలి.
మగవాళ్ళంతా చెడ్డ వాళ్లని ఆడవాళ్లంతా మంచి వాళ్ళని అనడం లేదు. ఆడవాళ్లు చెడ్డవాళ్ళు ఉంటారు,మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎక్కడైనా మంచి చేస్తూనే ఉంటారు. ఇది మంచి చెడు సమస్య కాదు ఇది ప్రస్తుతంలో దృష్టి పెట్టి చూడాల్సిన సమస్య కాదు యుగయుగాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలను బట్టి ఆలోచించాల్సిన విషయం. మంచి ఉద్దేశంతోటే, గొప్ప ఉద్దేశంతోటే స్త్రీని గౌరవిస్తూ జగతికి మూలం స్త్రీ అని, ముగ్గురమ్మల మూలపుటమ్మా అని, ఆదిశక్తి అని పరాశక్తి అని అన్ని స్థానాలలో అమ్మకే స్థానం ముఖ్యమని, ఆడవాళ్ళకే ప్రముఖ స్థానం అంటూనే… అమ్మానాన్న తల్లి తండ్రి, సీతారాములు, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు అంటూ ఉన్నాము , స్త్రీ లకు గౌరవం ఇచ్చేవాళ్ళు అని చెప్పిన వేద కాలాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది.
స్వార్ధచింతనతో అధికార దాహంతో, అహంభావాదివికారాలతో స్త్రీల అస్తిత్వాన్ని అణచివేసినటువంటి దుర్మార్గాలన్నీ అందరికీ తెలుసు. అయినా నిజాన్ని ఎవరు ఒప్పుకోరు. పుత్రుడు పుడితేనే పున్నాగ నరకం నుండి తప్పిస్తాడని అనడంతోటే పురుషస్వామ్యం అంటే ఏంటో బయటపడింది. ఇలాంటి ఏవేవో, ఎన్నెన్నో ఉన్నాయి. “ఆ బొంత లోనిదే ఆ మాసిక “అన్నట్టు తమ కన్న ముందు తరాల వాళ్ళు ఏం చేశారో చూసి అదే వ్యవహారాలు నడిపే మగవాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. మేము తప్పు చేయమని అంటారు.కానీ శారీరక శక్తిని తక్కువ చూపిస్తూను అపాయాలు ఎక్కువ పరిస్థితులు ఎదురవుతాయని స్త్రీలు బయట కాలు పెడితే ఎవరీ మతాచారాలు చేస్తారో నని ఇంటిపట్టున ఉంచాము అని సర్ది చెప్పుతూ ఉంటారు.అసలు ఇలాంటి పరిస్థితులు దారి తీయడానికి కారణం ఏమై ఉంటుంది మొదటి నుంచే స్త్రీలకు విలువ ఇస్తూ, స్త్రీల స్థానాన్ని పదిల పరుస్తూ వచ్చినట్టయితే ఈ అపాయాలు వస్తాయి అనే ఆలోచననే కలగకపోయేది. ఆడవాళ్ళని భోగపు వస్తువుగా వాడుకున్నంత వరకు పని యంత్రాలుగా మార్చినంతవరకు పురుషులు ఇటువంటి విపరీతాలకు దారి తీసే రోజులు వస్తాయని ఆ మధ్య యుగంలో ఆలోచించి ఉండకపోవచ్చు. అప్పటికప్పటికీ ప్రస్తుతానికే ఆలోచించుకున్నారు వాళ్ళానాడు. కానీ, భావి జీవితం గురించి ఆలోచించలేదు.అదే ఇప్పుడు ఒక పెద్ద సంఘవిద్రోహంగా సామాజిక దాష్టీకంగా తయారై పురుష జాతిలోని మేధావులను కలవర పరుస్తున్నది. పాత రోజులను తీసుకురాలేము కొత్త రోజులను ఆపలేమూ, నడుస్తున్న రోజులను మార్చలేము !ఇటువంటి సందిగ్ధావస్థలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు మంచి వాళ్లంతా.
అయితే నిస్తేజం లో పడిపోయే పనిలేదు. ఎంతటి వ్రణాణికైనా మందు ఉంటుంది. ఎంతటి కఠినమైన పనికైనా ప్రణాళిక ఉంటుంది. ఏ జాతిని గురించే అయితే తక్కువ చేసి ఇళ్లల్లో మాట్లాడారో ,ఉదాహరణకు ఆ …ఆడపిల్ల దానిపైఎందుకు ఇంత ఖర్చు చేయాలి ?ఆ… ఆడపిల్ల ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్లొచ్చింది? ఆ …ఆడపిల్ల ఇంట్లో వంట చేసి పెడితే సరిపోతుంది? ఆ… ఆడపిల్ల అంత పెద్ద చదువులకు ఎందుకు? ఆ…. ఆడపిల్ల సైనా సైన్యాధ్యక్షురాలు వంటి పదవులు ఎందుకు ?ఆడపిల్ల రాజకీయాలు ఎందుకు అంటూ అనడం మానేసి, కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అనుకోవాలి.కొడుకును కూతురును ఒకటే బడిలో చదివిస్తున్న వాళ్లు కూడా ఏర్పడకుండా ఇళ్లల్లో భయాలను కలుగజేసేలా మాట్లాడే మాటలు మానుకోవాలి.తండ్రి, తాత బాబాయ్, మామ, తమ్ముడు, అన్న వంటి పురుష పాత్రలందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక కొందరు ఆడవాళ్లు, కాస్త నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడితేనైనా ఈ మగవాళ్ళు అణిగి ఉంటారనుకునే వాళ్ళు ఉంటారు. దీనికి కారణం తన అమ్మకు నానమ్మ కు అమ్మమ్మకు అత్తకు ఇంటి పక్క వాళ్లకు జరిగినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి అనుభవాలను ఆ భయం తెలియకుండానే వాళ్ళ మనసులలో జొరబడి ఇంకా ఇలాగే,పాతకాలం వారిలా ఉంటే ఎలా ? నన్నూ అట్లాగే చేస్తారనుకొని, ముందు జాగ్రత్త గా ఉండాలని అనుకోని ఇప్పుడు కొందరు కాస్త నోరు చేసుకుంటున్నారు. ఎదురు తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇది ఆలోచన చేయాలి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా గ్రహిస్తారు.
ఒకటి మాత్రం నిజం పెరుగుట విరుగుట కొరకే! సామాజిక న్యాయం కోసం ఆలోచించే వాళ్ళు ఇది గ్రహిస్తారు. ఆనాటి చరిత్ర ను తిరిగి చూస్తే తెలుస్తుంది.
_____*****_____