సూర్యకిరణంతో పాటు మేలుకుని మొదలయ్యే నా దైనందిన జీవితం ఆ సూర్యకాంతితో పాటే ప్రయాణిస్తుంది. పొద్దున డ్యూటీకి పోతున్నప్పుడు ఉత్సాహంగా… సాయంకాలం ఇంటికి తిరిగిగొస్తూ నీరసంగా. నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలోని ఓ గురుకుల పాఠశాలలో టీచర్ని. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పటం హాయిగానే ఉంటుంది. కాని స్కూలుకు రానూ పోనూ ప్రయాణమే ప్రాణం మీది కొస్తుంది. ఏంజేస్తాం..! నగరాన్ని వొదిలి శివార్లకో లేక గ్రామాలకో వెళ్లిపోలేం. సిటీలో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు. పిల్లల చదువులు. ఇలా ఎన్నో కమిట్మెంట్స్. ఆరోజు మామూలుగానే స్కూలుకు బయలుదేరిన. మా స్కూలుకు పోవాలంటే ముందు పావుగంట నడిచి బస్టాండ్ చేరాలి. నాకు కావాల్సిన బస్సు రావాలి. ఖాళీగా ఉండాలి. నేను ఎక్కగలగాలి. ఆ తర్వాత బస్సు బయలుదేరిన గంటన్నరకు గానీ నేను స్కూలు మెట్లెక్కే అవకాశం లేదు. బస్సును పాయింట్ మీద ఆపేసి డ్రైవర్ ఎటుపోయిండో పత్తా లేడు. స్కూలుకు లేటైపోతున్న ఫికరు పట్టుకున్నది. బస్సెక్కి కూర్చుండి పది నిముషాలైంది. ఆ బస్సు ఏ టైముకు పోవాలో, అసలు దానికో షెడ్యూల్ ఉన్నదో లేదో కూడా తెలియదు. కింద ప్లాటుఫారం మీద నిలుచున్న కండక్టర్ బేరం కోసం అరిచే చిల్లర వ్యాపారిలా ప్రయాణికుల్ని బస్సు ఎక్కమని పిలుస్తున్నడు. ఆర్టీసీలో ఈ కొత్త పద్ధతి ఎప్పుడు పెట్టారోగానీ బస్సు సీట్ల వరకు నిండితేగాని కదుల్తలేదీ మధ్య. నాకో పక్క విసుగ్గానూ ఆందోళనగానూ ఉన్నది. బస్సులోకి ప్యాసింజర్ల కన్నా ఎక్కువగా తినుబండారాలు అమ్ముకునేటోళ్లు వొచ్చిపోతున్నరు. “ సమోసా.. వేడివేడి సమోసా..” చేతిలో చిన్న గంప పట్టుకొని ఒకతను వొచ్చాడు. అతని రాకతో బస్సు సమోసాల వాసనతో ఘుమఘుమలాడి పోయింది. “వాటర్ బాటిల్.. వాటర్ బాటిలండి” మరొకతను. “పేపర్ సార్.. ఈనాడు..సాక్షి.. జ్యోతి..” కిటికీ అద్దం పక్కకు జరిపి బయటకు చూస్తున్నా. డ్రైవరు వస్తున్న జాడలేదు. “అల్లమురబ్బా.. అల్లమురబ్బా.. పైత్యానికి మంచిది అల్లమురబ్బా..” కొందరు కొనేవాళ్లు తమకు కావాల్సినవి కొంటున్నరు. ఇట్లాంటి చిరుతిండ్లు, బయట పదార్థాలు తినడం అలవాటు లేదు గనుక నేను పట్టించుకోలేదు. బస్టాండు చాలా రద్దీగా ఉన్నది. బతుకమ్మ పండుగ, ఆపైన దసరా పండుగ రోజులు. పట్టణాలు సెలవు తీసుకొని పల్లెలకు తరలిపోతున్న సమయం. ఎక్కడెక్కడి దూరప్రాంతాల నుంచో వచ్చిన ఆడా మగా పండుగల కోసం ఉరుకులాడుతున్న హడావిడి కనిపిస్తున్నది. అప్పుడే డోర్ తెరిచి ఒక్క జంపుచేసి స్టీరింగు ముందు కూర్చున్న డ్రైవరు బస్సు స్టార్టు చేశాడు. “రండి.. ఎక్కండి. బస్సు పోతున్నది” కింద కండక్టరు హడావిడి చేస్తున్నాడు. “ ఏంది సార్.. ఎక్కెక్కుమని తొందర జేస్తవు. లోపల ఒక్క సీటన్న ఖాళీ లేదు. ఊరు చేరేటందుకు రెండు గంటలైతది. అంతసేపు ఎట్ల నిలవడుతం” కండక్టర్ బలవంతం మీద బస్సెక్కినోళ్లు చిరాకు పడుతున్నరు. “ ఎందుకట్ల తొందరపడుతవు.. వెనుక సీట్లున్నయి జర సూడు పెద్దమనిషీ..!” కండక్టరు సముదాయింపు. “ ఒక్కటి సూత లేదు. అన్ని నిండినయి” “ ఫర్వాలేదు ఎక్కన్నా. ఎంత.. అర్ధగంట. ప్రజ్ఞాపూర్ల పదిమంది దిగుతరు” మొత్తానికి బస్సు బయల్దేరింది. ఆ టైములో హఠాత్తుగా ఒక అమ్మాయి బాణంలా లోపలికొచ్చింది. ఆమెకు పదేళ్లకు మించి ఉండవు. సన్నగా, అమాయికంగా ఉన్నది. ఆమె రెండు చేతుల్లో రెండేసి చొప్పున కాల్చిన మక్క కంకులున్నయి. వాటిని పట్టుకొని కదులుతున్న బస్సు ఎట్లా ఎక్కిందో అర్థంకాక ఆశ్చర్యపోయాను. “ లేత కంకులు సార్.. గరం గరం కంకులు. ఒక్కటి పది రూపాయెలు” గట్టిగా అంటూ నావైపు వొచ్చింది. ఆమె చేతుల్లో కంకుల్ని పట్టించుకోకుండా నేను తననే చూస్తుండిపోయిన. “ ఒక్కటి తీసుకో అన్నా.. లేత కంకి. మంచిగుంటది” “ ఓ పోరీ.. ఓపక్క బస్సు నడుస్తుంటె నీ బేరాలేంటిదే. దిగు జల్దిన” టిక్కెట్లిస్తున్న కండక్టర్ కోపంగా అరిచాడు. ఆ పిల్ల కండక్టరు అరుపుల్ని పట్టించుకోకుండా “ అన్నా.. తీస్కో అన్నా. లేత కంకులు..” నా దగ్గరే నిలబడింది. ఆ పాపను చూస్తే జాలేసింది. లేత కంకి మీద పెద్దగా ఇంట్రస్టు లేకపోయినా డబ్బిచ్చి కంకి తీసుకున్నా. కదుల్తూన్న బస్సులోంచే పాప దిగిపోయింది. నిజంగానే కంకి లేతగా రుచిగా ఉన్నది. మక్క కంకి ఆరోగ్యానికి మంచిదని కూడా అంటుంటరు. రోజూ సిటీలో పెద్దపెద్ద హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో వందల్లో డబ్బు తగలేసి ఎగబడి తినే జంక్ ఫుడ్స్ కంటే ఎన్నో రెట్లు మంచిదనిపించింది. లేకలేక ఒక మక్క కంకి తింటూ ఆరోగ్య అంశాలు తలపోస్తున్నందుకు లోపల నవ్వుకున్నా. కిటికీలోంచి కదిలిపోతున్న పరిసరాలు చూస్తూ బస్సు సిటీ లిమిట్స్ దాటేసరికి నా కంకి తినడం కూడా పూర్తయింది.
ఒకరోజు సాయంత్రం ఐదు ప్రాంతంలో స్కూలు నుంచి ఇంటికొస్తూ బస్టాండులో దిగాను. పొద్దంతా పనితోనూ, ప్రయాణంతోనూ అలసి ఇంటికి చేరుకొని నాలుగు మెతుకులు మింగి నిద్ర పోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేను. రెండు రోజులుగా జోరుగా వానలు కురిసి అప్పుడే పల్చబడుతున్న తుపాను ప్రభావం. ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి వాతావరణం చలిగా ఉన్నది. అప్పుడప్పుడు కొద్దిగా తెరిపిచ్చినా ముసురుపడుతూనే ఉన్నది. బస్టాండులోంచి బయటికిపోతూ ఆగిపోయిన. రోడ్డుకు ఇరువైపుల వరుసగా కూర్చుని కొందరు కంకులు కాలుస్తున్నరు. చిటపట చప్పుడు. గాలిలో కలుస్తున్న కమ్మని వాసన. ఆ వాతావరణంలో వేడివేడిగా కంకి తినాలన్పించి అటు నడిచాను. జోరతట్టు మీద కూర్చొని దీక్షగా కంకులు కాలుస్తున్న పాపని వెంటనే గుర్తుపట్టిన. నేను రావడాన్ని గమనించి ఆమె ఓమారు చూసి మళ్లా తన పనిలో మునిగింది. మొన్న బస్సులోకి వొచ్చి నాకు కంకి అమ్మిన పాప. ఆమె ముందు ఒక రాతిబండ. దానిమీద ఇనుపతట్ట. అందులో నిప్పుకూ బూడిదకూ నడుమ సన్నటి మంటతో కాలుతున్న బొగ్గులు. విసనకర్రతో విసురుతూ కుడిచేత్తో కంకులు మర్లేస్తున్నది. పక్కన చిన్న ఎలితె బొంగు భూమిలో పాతి దానికి నిలువుగా ఒక పాత చెత్తిరి తాడుతో కట్టింది వాన నుంచి రక్షణగా. ఒక పాత ముక్కాలిపీట మీద చిన్న ఈత తట్టలో అప్పటికే కాల్చిపెట్టిన కొన్ని కంకులు వరుసగా పేర్చి ఉన్నయి. ఆ పిల్ల వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్నట్టు బలహీనంగా ఉన్నది. చటుక్కున నాకు బాలకార్మిక చట్టం గుర్తొచ్చింది. ఏం చేస్తున్నయి ఈ చట్టాలన్నీ? ఆ పాప బాల్యంలోనే అంత బరువు ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనికి ఎవరు బాధ్యులు? ఆ వయసులో బాలికను ఏ స్కూలుకో పంపకుండా ఆమెచేత చాకిరి చేయిస్తున్నదెవరైనా నేరస్థులే. అట్లా కాకుండా తానుగా చేస్తున్నా అదీ నెరమే. నన్ను పట్టించుకోకుండా తలవంచి కాలుతున్న కంకుల్ని పట్టిపట్టి చూస్తున్నది. బొగ్గుమరకలు నిండిన పాత లంగా మీద అసలు రంగేదో తెలియకుండా వున్న బుషట్ తొడుక్కున్నది. “లేత కంకి ఒకటియ్యి బుజ్జీ.. యెంత..?” అడిగిన. ఆ పిల్ల చప్పున తలపైకెత్తి చూసి “పది రూపాయలన్నా” అనిచెప్పి బొగ్గు కణికెల మీద కాలుతున్న కంకుల్లోంచి ఒకటి తీసింది. దాన్ని చేత్తో శుభ్రంగా తుడిచి పక్కన గిన్నెలో ఉన్న ఉప్పుకారం పొడిలో నిమ్మకాయ బద్దను ముంచి కంకిమీద రుద్దింది. సంతృప్తి పడినంక జొన్నబూరులో ఆ కంకిని భద్రంగా మడత చుట్టి నా చేతికి అందించింది. నేనిచ్చిన పది రూపాయల నోటు తీసుకొని జాగ్రత్తగా జోరబొంత మడతల కింద పెట్టుకున్నది. “ నీ పేరేంది బుజ్జీ” అడిగాను. “నాపేరు నీలమ్మ” అనిచెప్పి తన యజ్ఞాన్ని తిరిగి కొనసాగించే మునిలా కుంపట్లో కంకులు మర్లెయ్యసాగింది. నేను ఇంకేం మాట్లాడకుండా ఇంటిదారి పట్టిన.*****************************************వైరల్ జ్వరంతో బాధపడుతూ నాలుగు దినాలు స్కూలుకు పోలేదు. అయిదో రోజు కొంచెం కోలుకున్న. ఇంకా వెళ్లకపోతే ఉన్న కొలువు ఊడుతదని భయపడి ఓపిక చేసుకొని వలసపక్షి మాదిరి డ్యూటీకి బయలుదేరిన. బస్టాండ్ దగ్గరికి రాగానే మక్కకంకి మీదికి మనసు పోయి నీలమ్మ పెట్టుకునే దుకాణం దిక్కు చూసిన. అదే దృశ్యం. నిప్పులమీద కంకులు తిప్పుతున్న లేత చేతులు. బూడిద దుమ్ముతో మసిబారిన అమాయకమైన మొఖం. దగ్గరకువెళ్లి ఆమెను నవ్వుతూ పలకరించి ఓ కంకి కొనుక్కొని చిల్లరలేక వంద రూపాయల నోటిచ్చిన. నీలమ్మ చిల్లర కోసం జోరతట్టు మడతల్లో కొద్దిసేపు వెతికి బాగా నలిగిన ఎనిమిది పది రూపాయల నోట్లు అందించింది. “అన్నా.. ఇంకో పది రూపాయలు లేవన్నా.. మళ్ళొచ్చినప్పుడు ఇస్తలే” అన్నది అర్థింపుగా. నేను మాట్లాడలేదు. మంటల వేడిలో మోటుతనం పూసుకున్న ఆమె లేత చేతుల వంక చూసి బాధ కలిగింది. ఇంత చిన్న వయసులో అంత బరువు బాధ్యతలు. వెనుదిరిగి నేను వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్న. ఆ విధంగా నా ఉద్యోగానికీ, ఇంటికీ రోజూ నేను జరిపే రాకపోకల నడుమ పాప.. ఆమె కాల్చిఇచ్చే మక్కకంకి నాలో ఒక భాగమైనయి. హఠాత్తుగా ఒక రోజు నీలమ్మ కన్పించలేదు. ఆమె కూర్చునే చోట ఆమెకు ఆదిశేషునిలా నీడపట్టే నల్లచెత్తిరి, పక్కన ముక్కాలిపీట కూడా కనిపించలేదు. ఆవేళ ఎందుకో రానట్టున్నది. అక్కడే కొన్ని నిముషాలు ఆగి చూసిన. పక్కన మక్కబుట్టలు అమ్మేవాళ్ళు కూర్చుని ఉన్నరు. వాళ్ళను అడుగుదామనుకొని అప్పటికే స్కూలుకు ఆలస్యమవుతున్న నేను ఇంక ఆగలేక వెళ్లిపోయిన. మళ్ళా సాయంత్రం తిరిగొస్తున్నప్పుడు చూస్తే పాప కనిపించలేదు. మరి కొన్ని రోజులు గడిచినయి. అయినా ఆమె రాలేదు. ఆ తోవలో పోతున్నప్పుడల్లా జ్ఞాపకమొచ్చేది. నిజానికి ఆ పిల్ల నాకేమీ కాదు. ఏ అనుబంధం మా నడుమ లేదు. కానీ ఎందుకో ఆ పాపను మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులుగా రావడం లేదంటే తనకేమన్నా అయిందా అన్న ఆలోచన. ఏదో వెలితి. మనసులో చిన్న మరక. తనకేదన్నా సాయం చెయ్యలేక పోయానన్న భావన నాలో ఉన్నట్టు అనిపించింది.
కాలం వర్తమానాన్ని భూతకాలంలోకి నెట్టుతూ పోతుంటే నేను నా యాంత్రిక జీవన సరళిలో కదిలిపోయాను. రెండురోజుల సెలవుల తర్వాత ఆదినం సోమవారం అనుకుంటా. బస్సుస్టాండులోకి నడుస్తుంటే హఠాత్తుగా నా దృష్టికి నీలమ్మ కూర్చునే చోట ముక్కాలిపీట కనిపించింది. దాని పక్కనే ఎలితె బొంగుకు కట్టి నిలబెట్టిన నల్లచెత్తిరి. కింద రాతిబండ మీద ఇనుపతట్ట. నిప్పుకణికెల పైన కాలుతున్న కంకులు. స్కూలు లేటవుతున్న హడావిడిలో ఆమె కోసం చూడకుండా లోపలికిపోయిన. చిన్నగా ముసురు పడుతున్నది. బస్సు కదిలింది. గేటుదాటి బస్సు బయటికి పోతుంటే విండోలోంచి అవుతలికి చూస్తే దారిపక్కన చెత్తిరి కింద ఏకాగ్రతగా కంకులు కాలుస్తున్న పాప కనిపించింది. సాయంత్రం తిరిగొచ్చినప్పుడు బస్సు దిగగానే ఆమె దగ్గరకు నడిచి పలుకరించాను. “ఇన్ని దినాలు ఏమైపోయినవు బుజ్జీ .. కనపడలేదు” అన్నాను. నన్ను చూడగానే గుర్తుపట్టి నీలమ్మ నవ్వింది. “ అన్నా.. బాగున్నవా” అని పలుకరించి ఇంకోమాట లేకుండా వెంటనే జోరతట్టు కింది నుంచి పది రూపాయల నోటు తీసి “అన్నా.. మీ పైసలు. మొన్న మీకు పది తక్కువిచ్చినగద” అన్నది. నిజానికి ఆ సంగతి నాకు గుర్తులేదు. పది రూపాయలు పెద్ద మొత్తం కాదు గనుక మరిచిపోవచ్చు. కానీ ఇన్నిరోజుల తర్వాత కూడా పాప గుర్తుపెట్టుకుంది. ఏదో స్పర్శ మనసును తాకినట్టు అనిపించింది. “ఉండనియ్యిలే పాపా.. మరి కంకి తినిపియ్యవా..” అన్నాను నామాటకు ఆ పిల్ల కండ్లు మెరిసినయి. నోటు మళ్ళా జోరతట్టు కింద పెట్టుకొని జోరసంచిల నుంచి లేత కంకి ఒకటి తీసి జాగ్రత్తగ బూరు తీసి కాల్చసాగింది. సవ్యసాచిలా కదులుతున్న ఆమె లేత చేతుల వంక చూసిన. ఎడమ చెయ్యి విసనకర్ర ఊపుతుంటే కుడిచెయ్యి నిప్పుల్లో కంకిని కదిలిస్తున్నది. “ఇన్ని రోజులు యాడికిపోయినవు బుజ్జీ.. కనిపించలేదు” “మా తాత సచ్చిపోయిండన్నా.. అందుకే రాలే” “ ఏమైంది మీ తాతకు” “ చాన దినాల నుంచి పాణం బాగలేదు” “ చిన్న పిల్లవి.. నువ్వీ పని జేస్తున్నవేంది. స్కూలుకు పోవా..” “ మొన్నటిదాక పోయిన. నాలుగో తరగతిల ఉన్న. ఇప్పుడింక పోను” “ అదేంది ఎందుకు” “ గిప్పుడు ఇంక సదువు కల్వదన్నా.. ఏదన్నా పనిజేసుకోవాలె. అందుకే మక్కకంకులు అమ్ముతన్న” “నువ్వమ్ముడేంది పాపా.. మీ అమ్మా నాయనా లేరా?” ఆమె సప్పుడు జెయ్యలేదు. కానీ ముఖంలో దిగులు కమ్ముకొని బొగ్గుమరకల కన్నా చిక్కగా గూడుకట్టింది. “మా నాయిన లేడు. నా చిన్నతనం నుంచే లేడు. ఏమైండో తెల్వది. ఊర్ల అందరేమో నాయిన నా చిన్నప్పుడే సచ్చిపోయిండని అంటరు. కానీ మా అవ్వనేమో ఆయన పనికోసం మస్కట్ పోయి ఇంక రాలేదంటుంది” “ ఎంత కాలమైంది మీ నాయన పోయి” “ అదికూడ నాకు తెల్వది. నాకు బుద్ధి తెల్వకముందే పోయిండట” “ మరి మీ అమ్మేం జేస్తది” “ కూలికి పోతది. మా ఇంట్ల నేను, అవ్వ, చెల్లె, తాత, నల్గురం ఉంటం. ఇంక గిప్పుడు తాత సూత లేడు. మొన్ననే సచ్చిపోయిండు. ఇంతకుముందు ఈ కంకుల దుకుణం ఆయన్నే నడిపిండు. ఎప్పుడన్నా నా బడికి సెలవున్నప్పుడు తాతకు సాయం జేసేటందుకు వొచ్చేదాన్ని. ఇప్పుడు తాత లేడుగద.. ఇగ ఇప్పటిసంది ఈ పని నేనే జేస్త” ఇనుపతట్టలో కంకిని జాగ్రత్తగ మర్లేసి కాలుస్తూనే అన్ని వివరాలు చెప్పింది. నేనేం మాట్లాడకుండా ఆమెనే చూస్తుండిపోయిన. మనసులోంచి సానుభూతి పొంగుకొచ్చింది. ఆ పిల్ల పరిస్థితి నన్ను బాగా కదిలించింది. ఈలోగా నీలమ్మ కంకి బయటికితీసి దానికి అంటిన బూడిది దులిపింది.“ ఉప్పు కారం రుద్దుమంటవా అన్నా” అని అడిగింది. తలూపాను. నిమ్మకాయ ముక్కతో ఉప్పుకారం రుద్ది జొన్నబూరులో చుట్టి అందించింది. పర్సులోంచి పదినోటు తీసి ఇచ్చిన. నావైపు సాదరంగా చూస్తూ అందుకున్నది. పాపతో ఇంకా మాట్లాడుతూ వుండే టైము లేదు. అందుకే తొందరగా పోయి బస్సెక్కిన. బస్సు కదిలిపోయే సమయంలో నీలమ్మ ఎగపోసుకుంట ఎదురునుంచి పరిగెత్తుకొచ్చింది. డ్రైవరు ఏమూడ్ లో ఉన్నాడోగాని ఆమెను చూసి తిట్టుకోకుండా బస్సాపిండు. హడావిడిగా బస్సెక్కి నేను కూర్చున్న సీటు వద్దకొచ్చింది. “అన్నా.. మొన్న నీకు ఇయ్యాల్సిన పదిరూపాయలు” అని పదినోటు నా చేతిలో పెట్టబోయింది. షాక్ తిన్నాను. ఆమె అమాయకత, నిజాయితీ నన్ను కట్టేసినయి. నోరితెరిచి ఒక్కమాటా మాట్లాడలేక పోయాను. ఆమె తిరిగిచ్చే డబ్బులు తీసుకోవాలా? వొద్దులేమ్మని ఉంచుకోమనాలా? లేక ఆమె నిజాయితీకి మెచ్చి ఆ పదికి మరికొన్ని డబ్బులు కలిపి ఆమెకే ఇచ్చి సంతోషపెట్టాలా? ఇవేవీ చేయకుండా మౌనంగా ఉండిపోవాలా? నా ఆలోచనలు సాగుతుండగనే ఆమె డబ్బు నా చేతిలో పెట్టి బస్సు దిగిపోయింది. వెనుక నుంచి చేష్టలు దక్కి బొమ్మలా చూస్తుండి పోయిన. ఒక్కక్షణం ఆ సందర్భంలో.. సన్నివేశంలో నేను లేకపోయివుంటే బాగుండేదనిపించింది. బస్సు వేగం పుంజుకుంది. ఆరోజుకి నీలమ్మా, నేనూ ఎవరి దారుల్లో వాళ్ళం కదిలిపోయాం. ఆ పాప ఏ భావమూ లేకుండా ఎప్పట్లాగే మామూలుగనే వుండవచ్చు. ఎంత అనుకున్నా నేను మామూలుగా ఉండలేకపోయాను. ఎంత అణుచుకున్నా ఏదో గిల్టీనెస్.
ఆవిధంగా నెలరోజులు గడిచాయి. మక్క కంకుల సీజను కూడా అయిపోవొచ్చింది. ఆ పాప ఎక్కడికి పోయిందో తెలిస్తే బాగుండును అనిపించింది. మనసులో పదేపదే అదే ఆలోచన. ‘ఆ పిల్ల నాకేమవుతదని ఇంత ఆరాటపడుతున్నా?’ అని నన్ను ప్రశ్నించుకున్న. ఆ పసిదాని పరిస్థితి పూర్తిగా తెలుసుకుని కూడా ఆమెకి ఏవిధంగానూ సాయపడనందుకు సిగ్గనిపించింది. బాధ కలిగింది. నేనలా చేసివుంటే ఆమె ఆత్మాభిమానం గాయపడి వుండేదేమో అని అనుకున్నా. కానీ నా చేతకానితనాన్ని అట్లా సర్దిచెప్పుకొని ఊరటచెందానని తెలుసు.
సాకులు చెప్పుకోవడం ఒక విధంగా మాబోటివాళ్ళకు పలాయనవాదానికి తెలివైన దారి కావొచ్చు. కావొచ్చేమిటి.. అదే నిజం. ఎందుకంటే ఎంత సానుభూతి గుమ్మరించినా వాస్తవానికి అందర్లాగే నేను కూడా వ్యవహరించిన. నాకు అనుకూలమైన సాకునే వెతుక్కున్న. పైపెచ్చు సమాజంలో పాదుకున్న వర్గభేదాలను, ఆర్థిక అసమానతల్ని తిట్టుకున్నాను, నీలమ్మ లాంటి నిరుపేద, బడుగువాళ్లకు మేలు చెయ్యనందుకు ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నానే తప్ప నావంతు బాధ్యతగా భావించి ఆమెకు నేనుగా ఏమీ చెయ్యలేదు. పదేళ్ల పసిపిల్ల.. నాకు జీవితంలో అంత విలువైన పాఠం చెబితే, దాని ప్రాముఖ్యత తెలుసుకోలేక ఆమె నిజాయితీకి నేను కట్టిన విలువ పది రూపాయలు. కానీ చివరికి ఆ పది రూపాయలు కూడా నాకు తిరిగిచ్చేసి ఆ పిల్ల తన విలువను మరింత ఉన్నతం చేసుకున్నది. సిగ్గుగా అనిపించింది. నన్ను నేనే ఒక అపరిచితుని మాదిరి చూసుకున్న. నా తలలో సుత్తిదెబ్బలు కొడుతూ ఎవరో పెద్దగా తిడుతూ అరుస్తున్నారు. అదెవరో కాదు..నేనే. అయితేనేం.. అది నేనే అయినందువల్ల కూడా ఏదీ మారబోదు.. ఎవరికీ ప్రయోజనమూ ఉండబోదు.
ఎంఏ, పిహెచ్.డి
కథా,అనువాద రచయిత, సీనియర్ జర్నలిస్ట్.
రోడ్ నం.4, గ్రీన్ హిల్స్ కాలనీ,
కొత్తపేట, హైదరాబాద్- 500035, తెలంగాణ
సెల్: +91-9399962117
మెయిల్: ayodhya.agu@gmail.com